రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-5(చివరిభాగం )
గోపికలకు యెంత వెతికి’’నా భౌతికంగా శ్రీ కృష్ణుడు కనిపించలేదు కాని మానసికంగా ఆయన్నే స్మరిస్తున్నారు,కీర్తిస్తున్నారు .వారి గీతాలన్నీ ‘’గోపికా గీత’’అనే 18శ్లోకాలో భాగవత దశమ స్కంధం లో ఉంది .మనదేశం లో వివాహం కావలసిన కన్యలచేత తలిదండ్రులు దీన్నిభగవంతుని ఆశీర్వాదం కోసం చదివిస్తారు .గోపికా గీతిక జయ దేవుని గీతగోవింద కావ్యానికి ప్రేరణ .గోపికాగీతిక లో కొన్ని ముఖ్య శ్లోకాలు చూద్దాం –
1-జయతి తేధికం (కృష్ణ )జన్మనా వ్రజః –శ్రయత ఇందిరా కృష్ణ శష్వ దాత్రహి – దయిత ద్రశ్యతమ్ కృష్ణ దిక్షు తత్వ కాః -త్రయి ధ్రతాసవాః-కృష్ణ త్వాం విశిన్వతే ‘’
2-న ఖలు గోపికా కృష్ణ నందనో భవాన్ –అఖిల దేహినాం కృష్ణ అంతరాత్మ దృక్-వృక్ష నాశ ఆర్తితో కృష్ణ విశ్వ గుప్తయే –సఖా యు దేవివాన్ కృష్ణ సాత్వతాం కులే ‘’
3-తవ కథాం రతం కృష్ణ తప్త జీవనం –కవి భిరీదితం కృష్ణ కల్మషాపహం –శ్రవణ మంగళం కృష్ణ శ్రీమదాతత౦-భువి ఘ్రణ౦తి తే కృష్ణ భూరిదా జనాః’’
అని శ్రీ కృష్ణ గుణగానం చేసిన గోపికల గోపికా గీతికి మురిసి ,పరవశించిన కృష్ణుడు మళ్ళీ దర్శనమిచ్చాడు .వాళ్లకు పోయిన ప్రాణాలు తిరిగి వచ్చిన అనుభూతి కలిగింది –‘’తన్వాఃప్రాణా౦ ఆగత౦’’.
యోగుల హృదయ సీమలలో విహరించే పరమాత్మ ,కాళిందీ పుళింద సీమలపై గోపికా పరివేష్టితుడై ,శరత్ పున్నమి వెలుగులలో వాళ్ళతో ఆ శరత్ చంద్ర ప్రభువు అతి సన్నిహితంగా చనువుగా మాట్లాడాడు .ప్రతి గోపిక వొడిలోతన దివ్య మంగళ పాదాలను ఉంచాడు .అక్కడున్న శతానేక గోపికలవొడి లలో పాదాలు౦చాడన్నమాట .ఆ పాదాలు వాళ్ళతో మాట్లాడుతున్న అనుభూతి పొందారు –కాదు కలిగించాడు స్వామి .అంటే ఎన్ని రూపాలుగా బాలకృష్ణుడు అవతరించి వారికి అత్యంత మానసిక సంతృప్తి కలిగించాడో అర్ధం చేసుకోవాలి .ఇదే ఆయన మాయాలీల గోపికాలీల.ఈ మాయ అర్ధం కాక అమాయకంగా ఆయననే దీని మర్మమేమి స్వామీ అని ప్రశ్నించారు .దానికి’’ స్వార్ధం కోసం స్నేహం చేసే వాళ్ళు ఉంటారు .స్నేహం వల్ల లబ్ది చేకూరకపోతే స్నేహం వదిలేస్తారు .కొందరు తలిదంద్రులలాగా ఆప్యాయంగా ఉంటారు .అవతలి వారు అలా ప్రవర్తి౦చక పోయినా వారిలో ఈ వాత్సల్యం తగ్గదు.కొందరు ఆధ్యాత్మిక పరిపుష్టి పొంది బంధాలకు లోనౌతామని ఇతరులను పట్టించుకోరు .కొందరు పగ, ద్వేషం వలన ఇతరుల బాగు ఆలోచించరు ,కాని మీరంతా ఈ ప్రపంచ బంధాలను వదిలి నా శరణు కోరారు, నాపై ప్రేమ కరిపించారు కనుక ఆ సాన్నిహిత్యం పెంచాను .మీకు కనపడకుండా అదృశ్యమైనా, నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను . నాపై కోపం, ద్వేషం, అసూయ వదిలేయండి .నేనెప్పుడూ మీ వాడినే .మీ వెంటే ఉంటా .మీరు నాకు ఇచ్చిన దానికి, మీ నిస్వార్ధ ప్రేమకు, సేవకు ,నేను ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేను .మనమధ్య బాంధవ్యం నిందా రోపణ చేయలేని దివ్యప్రేమ మాత్రమే . గృహబందాలను అత్యంత కష్టం తో వదిలేసి నా చెంత చేరారు .దివ్యమైన అద్భుతమైన మీ కృత్యాలే మీకు నష్ట పరిహారం ‘’అని చెప్పాడు . గోపికలు ఆయనపై యెంత ప్రేమ భక్తీ చూపించారో, ఆయనా అంతకంటే ఎక్కువ ప్రేమ వర్షం వారిపై తనివి తీరా కురిపించి సంతృప్తి పరచాడు .
దీని తర్వాత ‘’రాసలీల ‘’ప్రారంభమౌతుంది .చేయీ చేయీ కలిపి గోపికలు బృందంగా ఏర్పడి బాలకృష్ణుని చుట్టూ తిరిగారు .ఇద్దరు గోపికలకు ఒక కృష్ణుడు ఉన్నాడు ఒక గోపిక కుడి భుజం పై ఆయన ఎడమ చేయి ,వేరొక గోపిక ఎడమ బుజం పై ఆయన కుడి చేయి వేసి లీలా నృత్యం చేస్తుంటే ,ప్రతిగోపికా- కృష్ణుడు తన ఎదుట ఉండి తన రెండుభుజాలపై చేతులు వేసి నృత్యం చేస్తున్నట్లు భావించింది .కాని నిజానికి ఆమెకు ఎడమవైపు ఒక కృష్ణుడు, కుడివైపు మరొక కృష్ణుడు ఉన్నాడు .యోగేశ్వరు డైన శ్రీ కృష్ణ పరమాత్మ రాసలీలలో గోపికలను మాయలో పడేశాడు .అది వారికి తెలియనే తెలియదు కారణం వాళ్ళమనసులు వాళ్ళలో లేనేలేవు .ఆ రాసలీలలో అలౌకిక ఆనందం అనుభవించారు . ఈ రాస లీల నీటిలో జలక్రీడగా ,అడవిలో వనక్రీడ గా ,భూమిపై స్థల క్రీడగా మూడు చోట్ల జరిగింది .అనేకమంది గోపికలతో అనేకమంది కృష్ణులు చేస్తున్న ఈ అద్భుత రాసలీలా విలాసాన్ని అంతరిక్షం నుంచి దేవతలు మహర్షులు దర్శించి పులకించారు .ఇక్కడ మరొక గొప్ప విషయం ఉన్నది .గోపికల ఇళ్ళల్లో వారి భర్తల దగ్గర వారి భార్యలైన గోపికలు వారి ప్రక్కనే ఉన్నారు .ఇళ్ళల్లో భర్తలు తమభార్యాలు తమతోనే ఉన్నట్లు అనుభూతి చెందారు .ఇదీ క్లైమాక్స్ .లోకమంతా రాసలీల మత్తులో తేలిపోయింది .
రాసలీల ను పరీక్షిత్ కు శుకుడు వివరించి చెప్పగా ‘’కృష్ణుడు అన్నీ ఉన్న సంతృప్తి ఉన్నవాడు .కాని ఆయన చేసిన ఈ పని ప్రపంచ దృష్టిలో నీతిబాహ్యం అని పించదా?ఎందుకు అలా చేశాడు ?లోకానికి ఏ దివ్య సందేశం అందించాడు దీనితో ?’’అని ప్రశ్నించాడు .ఈ ప్రశ్న ఆయనదేకాదు అందరికీ వచ్చే సందేహమే కదా .దీనికి సరైన సంతృప్తికరమైన సమాధానం శుక మహర్షి చెప్పాడు .’’పరమేశ్వరుని లీలలు నీతి బాహ్యం కానేకాదు .ఆయన అగ్ని హోత్రం వంటివాడు .అగ్ని లో వేసినది ఏదైనా కలుషితం కాదు .అమానుష స్వరూపుడు చేశాడు కదా అని మనం కూడా అలా ప్రవర్తిస్తే ,ఎవరైనా రుద్రుడననుకొని విషం తాగితే నాశనమైనట్లు సర్వ నాశన మౌతాం .పరమాత్మ వాక్కులను అనుసరించాలేకాని ఆయన చేష్టలను కాదు .పరమాత్మ సర్వాతీతుడు కనుక ఆయన చిద్విలాసాలు అంతుబట్టవు , ఆయనకు ఏ దోషం ,పాపం అంటదు.స్వార్ధరహితుడు కనుక పరోపకారమే ఆయన కర్తవ్యమ్ .లౌకిక పరిధిలో ఆయన చేష్టలు చట్ట విరుద్ధాలనిపించినా, అవి మానవాతీత కృత్యాలు .’’అని సమాధానం చెప్పాడు శుకర్షి .అనీబిసెంట్ రాసలీలకామ శృంగార కేళి (రిబాల్డ్రి)కాదు .అదొక దివ్య మానవాతీత అనుభూతి అని చెప్పింది .అందుకే రాసలీల ఉత్కృస్ట మధుర భక్తికి తార్కాణగా నిలిచింది .
పరమాత్మ సర్వ సాక్షి .ఆయన గోపికలలో, వారి భర్త లలో కూడా సాక్షీ భూతుడు .లోకాలన్నిటి లో పారమార్ధిక కాలక్షేపం అది .భగవంతుడు మానవావ తారం దాల్చినప్పుడు భక్తులపై ,సర్వ మానవాళి పై దయ, ప్రేమలను చూపి౦చ టానికి ,ఇలాంటి లీలలు ప్రదర్శి౦చి విశ్వాసం కలిగించి ,వారిని తనవైపుకు ఆకర్షి౦చి దివ్యమార్గాన్ని చూపిస్తాడు .శుక మహర్షి బోధించిన ఈ రాసలీల విన్న వారు ,చదివినవారు ఆ పరమేశ్వరుని అత్య౦త భక్తులై ,భౌతిక కామవాసనలకు దూరమై పరమ పదం చేరుతారు .
‘’లోకాః సమస్తా స్సుఖినో భవతు ‘’
రాస లీలలు సమాప్తం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-18-ఉయ్యూరు

