ఫిన్ లాండ్ లో బడులు రోజూ ఒంటిపూట బడులే .ఏడేళ్ళ వయసు నుంచి 16ఏళ్ళ వయసు వచ్చేదాకా తొమ్మిదో గ్రేడ్ దాకా అందరూ చదవాల్సిందే .ఇది నిర్బంధ విద్య అనిపించినా ,తరగతిగది పిల్లల పాలిటి స్వర్గ దామమే .డ్రెస్ కోడ్ అంటే యూనిఫాం బెడద లేదు .హాయిగా ఎంచక్కా రంగురంగుల డ్రెస్ వేసుకొని సీతాకోక చిలుకల్లా బడికి వెళ్తారు ,హోం వర్క్ సంస్కృతికి బండెడు పుస్తకాల బరువుకీ చరమగీతం ఎప్పుడో పాడేశారు .ఆరో తరగతిదాకా ఇంటి దగ్గర పుస్తకం తెరవాల్సిన పనేలేదు .ఆపై క్లాసులలో ఇచ్చేదాన్నిబట్టి హోమ్ వర్క్ అరగంటలో పూర్తి చేస్తారు .అందుకే బడి గేట్లు ఉదయం తొమ్మిది తర్వాతే తెరచుకొని మధ్యాహ్నం రెండున్నరకల్లా బంద్ అవుతాయి .అంటే రోజూ ఒంటిపూట బడేనన్నమాట .రోజుకు బోధన నాలుగు పీరియడ్లు మాత్రమే . ప్రతి పీరియడ్ కి మధ్యలో పావుగంట విరామం .ఆ సమయం లో చిరుతిళ్ళు అంటే స్నాక్ ఠంచనుగాఅందుతాయి .రోజుకో గంట ఆట ల విరామమ తప్పని సరి .పిల్లల ఆహారం గురంచి తలిదండ్రులకు బెంగ అక్కర్లేదు .చదువు పూర్తయ్యే దాకా ప్రభుత్వానిదే అన్ని బాధ్యతలూ .మంచి పోషకాహారం ఇష్టమైన రుచులలో అందుతుంది .
‘’అందరూ సమానంగా చదివి అందరూ టాపర్లు కావాలి ‘’అన్నది ఫిన్లాండ్ లక్ష్యం .తరగతికి 15నుంచి 20మంది విద్యార్ధులే ఉంటారు కనీసం నాలుగు తరగతులవరకు ఒకే ఉపాధ్యాయ బృందం పిల్లలకు పాఠాలు చెప్పటం ఇక్కడ ప్రత్యేకం ,ఈ నాలుగేళ్ళలో పిల్లల సామర్ధ్యం ,సబ్జేక్ట్ లపై అవగాహన గురించి టీచర్లకు మంచి అవగాహన కలుగుతుంది .ఎప్పటికప్పుడు వివిధ అంశాలలో ప్రతిభ ఆధారంగా వాళ్ళ సామర్ధ్యాన్ని అంచనా వేస్తారు .ఏడాది చివర్లో లెక్కలు సైన్స్ లలో పరీక్షలు పెట్టినా ,వాటిలో మార్కులను బయట పెట్టరు .తమబోధన ఎలాఉంది పిల్లలు ఎలా రిసీవ్ చేసుకొంటున్నారు అని టీచర్లు అంచనా వేసుకొంటారు .వారి జవాబు పత్రాల ఆధారం గా మరుసటి ఏడు శిక్షణలో అవసరమైన మార్పులు చేసుకొంటారు .ఒక్కో తరగతి మారే కొద్దీ పిల్లలలో విజ్ఞానం తో పాటు వ్యక్తిత్వమూ పెరుగుతుంది .
16 ఏళ్ళ వరకు పరీక్షలే రాయని విద్యార్ధులు తోమ్మిదోతరగతి గ్రేడ్ చివర్లో తమజీవితం లో మొదటి ‘’పెద్ద పరీక్ష ‘’రాస్తారు .పైతరగతులకు వెళ్ళాలంటే ఇది తప్పక పాసవాల్సిందే .పరీక్షలు బుర్రకు పదును పెట్టకుండా ఆయా అంశాలలో వారి ప్రాధమిక జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించేవిగా ఉంటాయి కనుక పరీక్షల్లో తప్పటం అనేది జరగదు .తొమ్మిదో గ్రేడ్ తర్వాత చదువు కొనసాగి౦చాలా వద్దా అన్నది పిల్లల ఇష్టమే .ఉన్నత విద్యకోసం ‘’అప్పర్ సెకండరి ఎడ్యుకేషన్ ‘’కాలేజీల బాట పడతారు .చదువుపై ఆసక్తిలేనివారు వృత్తి విద్యలలో శిక్షణ తీసుకొని స్థిర పడతారు .దేన్ని ఎంచుకున్నా ఫీజుల భారం ఫిన్ లాండ్ ప్రభుత్వానిదే .పిల్లల చదువుఖర్చులు ,పాఠశాల విద్యా ప్రమాణాల గురించి చింత ఎవరికీఅక్కర్లేదు .కనుక ఫిన్ లాండ్ దేశం విద్యార్ధుల, ఉపాధ్యాయుల, తలిదండ్రుల పాలిటి భూలోక స్వర్గం అని పిస్తుంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-12-18-ఉయ్యూరు .
—
