డా.శ్రీ చిదంబర శాస్త్రి గారి ‘’సర్వ ‘’విద్యా పారంగత్వ ప్రతీక ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’
కృష్ణా జిల్లా జగ్గయ్య పేట లో ఆంధ్రోపన్యాసకులుగా చేసి రిటైరైన డా.శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి ,జాతీయ ,అంతర్జాతీయ సదస్సులలో 65దాకా విశ్లేషణాత్మక పత్రాలు రాసి సమర్పించిన విద్వన్మణి.’’రమణాయన కావ్య రమణీయం ‘’పై పరిశోధన చేసి పిహెచ్ డిఅందుకొన్నారు .శ్రీ ఆంజనేయ శతకం ,శ్రీ గాయత్రి మాతృ ద్విశతి ,దేశభాష లందు తెలుగు లెస్స సంకలనం తో సాహితీలోకం లో సుప్రసిద్ధులు .ఇప్పుడు తాజాగా2018 డిసెంబర్ లో ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’వచన రచన చేసి ఆ మాతపై తమకున్న భక్తిప్రపత్తులను చాటుకొని ,.చాలాకాలంగా సాహితీ మిత్రులైన శాస్త్రి గారు నాకు సుమారు 20 రోజులక్రితం దానిని పంపారు .చదవటానికి ఇప్పటికి కుదిరి చదివి ఆనందించాను .వీరి జ్ఞాన సంపత్తికి డా .రామడుకు వేంకటేశ్వర శర్మగారు ‘’జ్ఞానాభి షేకం ‘’చేస్తే ,మహాకవి శేఖరులు శ్రీ భారత శ్రీమన్నారాయణ ‘’చిదంబర ప్రశస్తి ‘’చేసి చిదంబర విజ్ఞాన రహస్యం బయట పెట్టారు .శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల తిరుమలాచార్యులు అభినందన కంఠహారం-గ్రైవేయకం సమర్పించారు .స్మార్త క్రమాంత విశిష్ట స్వాధ్యాయి శ్రీ జగర్ల పూడి వీరభద్ర శర్మ ‘’జ్ఞాన యజ్ఞం ‘’గా శాస్త్రి గారి కృషిని అభివర్ణించారు .శాస్త్రి గారు’’ ఒక్క మాట ‘’లో సూర్యుడున్న చోట చీకటి ఉండనట్లే సనాతన ధర్మమున్న చోట దుఖ౦ ఉండదని ,బ్రహ్మ సమానమైన దేవుడు ,బ్రహ్మ సమానమైన గురువు , బ్రహ్మ సమానమైన తపం లేదని భావిష్యపురాణ౦ చెప్పిందనీ కనుక గాయత్రీ మంత్రం బ్రహ్మ సమానమైనదని చెప్పారు .ఇప్పుడు గ్రంథంలోని కొన్ని ముఖ్య విషయాలు మీ ముందుంచుతున్నాను .
‘’సూర్యుడు ,నక్షత్రాలు లేని ఆహోరాత్రాలమధ్య సందికాలాన్ని సంధ్య అంటారు ఇదికాలవాచకమే అయినా ,ఉపాస్య దేవత గా ఆరాధించాలి .అని చెప్పి గాయత్రి ఆవిర్భావ కథ తెలిపి ,’’యా వసేత్ ప్రాణి జిహ్వాసు సదా వాగుపవర్తనాత్-సరస్వతీతి నామ్నేయం సమాఖ్యాతా మహర్షి భిః’’అంటే జీవరాసులలో వాక్కు ఉన్నవారి నాలుక కొనపై నర్తించేది సరస్వతి అని ఋషులు చెప్పారని తెలియజేశారు .తర్వాత గాయత్రి విశిష్టతను చెబుతూ ముక్తినిచ్చే 6 గయలలో గాయత్రి కూడా ఒకటన్నారు .పరమేశ్వరుని ముఖం నుండి వెలువడిన మొదటి ఛందస్సు గాయత్రి .గానం చేస్తే రక్షించేదీ,గయ అనబడే ప్రాణాల్ని కాపాడేదీ,ఆరాధిస్తే మనస్సుకు ప్రశా౦తినిచ్చేదీ గాయత్రి అన్నారు .ఋగ్వేద ,అధర్వ వేద ,శతపథ బ్రాహ్మణ ,సూత సంహిత ,బృహదారణ్య ఛాందోగ్య నారాయణ ,నృసింహ పూర్వతాపి ,మైత్రాయణి, ఉపనిషత్ లలో నిర్వచి౦ప బడిన గాయత్రిని బహు శ్రమ కోర్చి వెలికి తీసి ముందుంచారు .బృహద్యోగి యాజ్ఞవల్క్యం ,విశ్వామిత్ర స్మృతి ,మను స్మృతి,స౦వర్త ,యాజ్ఞవల్క్య ,హరీత, పరాశర,శంఖ ,స్మృతులలో ఉన్నగాయత్రినీ ,పద్మ ,కూర్మ అగ్ని ,మత్స్య,భవిష్య ,నారద పురాణాలలో చెప్పబడిన గాయత్రిని ,సంధ్యా భాష్యం,మహాభారతం భగవద్గీత ,భాగవత గాయత్రినీ వివారించారు .శ్రీ వాసా సూర్యనారాయణ ,శ్రీ శేషావతారం గార్లు చేసిన గాయత్రీ స్తుతి ,శ్రీనాథుని కాశీఖండ గాయత్రి ని వివరించి ,బ్రాహ్మశ్రీ మల్లంపల్లి శరభయ్యగారు శ్రీనాథుని సీసానికి చెప్పిన వివరణ ఇచ్చారు –‘’గాయత్రీ దేవికి మూడు వేదాలు మూడుపాదాలు,భూమి ఆకాశం నాలుగు దిక్కులు కలిసి ఆరు కుక్షులు ,సమస్త భవనం శరీరం ,స్వర్గమే పొట్ట ,ధర్మశాస్త్రం హృదయకోశం .ఛందస్సమితి స్తనద్వయం .ఈశ్వర నిరీశ్వర సాంఖ్యాలు రెండూ రెండు చెవులు .అగ్ని ముఖం .శిక్షా, వ్యాకరణ, నిరుక్త,జ్యోతిష ,కల్పాలు అయిదూ అయిదు తలలు ,అధర్వణ వేదం చేస్ట,శిఖ శివుడు. బ్రహ్మ శిరస్సు .విష్ణువు ఆత్మ ,.భావ లక్షణం తటస్థ లక్షణం . పూర్వ మీమాంస స్థూల శరీరం ,వేదాంత శాస్త్రం సూక్ష్మ శరీరం .
ఇలామనకు తెలిసినా, తెలీని అనేక విషయాలు తరచి రాసిన పుస్తకం .తర్వాత గాయత్రీ మంత్రాని శబ్దగత అర్ధం మంత్రాధి దేవతలు ,మంత్రాక్షర వర్ణాలు ,ఛందస్సులు బీజాక్షరాలు ,తత్వాలు ,ఋషులు , కళలు ,,దేవీశక్తులు ,మంత్రాక్షర అవతారాలు ,సత్ ప్రవృత్తులు ,సిద్ధులు ,విద్యలు ,మాతృకలు ,కూడా సవివరంగా తెలిపారు .గాయత్రీ మంత్రం లో 24అక్షరాలకు 24 స్త్రీ ,పురుష దైవీ శక్తులున్నాయని వాటినీ వివరించారు .గాయత్రీ మంత్ర జపాన్ని పది సార్లు ,28సార్లు ,108సార్లు ,వెయ్యిన్నూట ఎనిమిది సార్లు శక్తి ననుసరించి చేయాలి .
పిమ్మట గాయత్రి మంత్ర హోమ విధానం ,గాయత్రీ మంత్ర మహిమ తెలిపే వృత్తాంత గాధలు చెప్పి గాయత్రీ మాహాత్మ్యాన్ని గురించి వేదవ్యాసుని దగ్గరనుంచి ,మహర్షులు ,జగద్గురు శంకరాచార్య ,రమణమహర్షి ,స్వామి శివానంద ,రామకృష్ణ పరమహంస ,స్వామి వివేకానంద ,అరవి౦దయోగి, గాంధీజీ , రవీంద్ర, తిలక్ ,మాలవ్యా దయానంద సరస్వతి,సర్ మోనియర్ విలియం దాకా ప్రస్తుతి౦చిన విషయాలు చెప్పి చివరికి ఫలశ్రుతి చెబుతూ గాయత్రీ మంత్ర జపం చేసిన చోట అగ్ని జల,వాయు పిశాచ సర్ప భయం ఉండదని భరోసా తో ముగించారు .
ఒక రకంగా డా సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారి ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’ఆల్ ఇన్ వన్ లేక ‘’గాయత్రీ విజ్ఞాన సర్వస్వం ‘’అని ఢంకాపథంగా చెప్పవచ్చు .దీన్ని వారి గురు పాదులు స్వర్గీయ బ్రహ్మశ్రీ భాగవతుల సంజీవ శాస్త్రి గారికి అ౦కితమివ్వటం శాస్త్రిగారి గురుభక్తికి తార్కాణ.ఇంత విలువైన గ్రంథాన్నికీ.శే.శ్రీమతివేముల రాజ్యలక్ష్మి ,శ్రీ రాఘవరావు దంపతుల స్మృత్యర్ధం వారికుమారులు ,కోడళ్ళు కీ.శే .వేముల సాంబశివరావు శ్రీమతి పద్మావతి దంపతులు ,శ్రీ వేముల నగేష్ ,శ్రీమతి స్వాతి దంపతులు ఆర్దికసాయమందించి ప్రచురించినందుకు అభినందనలు .కీర్తి శేషులను అక్షరాలతో నిజంగా కీర్తి శేషుల్ని చేశారు .శ్రీ గాయత్రి మాత ఆ కుటుంబాలకు సర్వదా రక్షగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను
‘’చిదంబర రహస్యం’’గా ఉన్న గాయత్రీ మాహాత్మ్యాన్ని శ్రీ చిదంబర శాస్త్రి గారు కరతలామలకం చేసినందుకు అభినదిస్తూ మరిన్ని ఆర్ష విద్యా గ్రంథాలు వారి నుండి వెలువడాలని ఆశిస్తున్నాను .
‘’త్వమేవ సంధ్యా గాయత్రీ సావిత్రీచ సరస్వతీ –బ్రాహ్మీచ వైష్ణవీ రౌద్రీ రక్తాశ్వేతా సితే తరా’’
‘’కమలా విష్ణు లోకే చ , గాయత్రీ బ్రహ్మలోక దా-రుద్ర లోక స్థితా గౌరీ హరార్ధాంగ నివాసినీ ‘’
గాయత్రీం చి౦తయేద్యస్తు హృత్పద్మేసముపస్థితం –ధర్మా ధర్మ వినిర్ముక్తః తయాతి పరమా౦ గతిం ‘’
‘’కర కమలంబుల యందున –వర వేద కమండలములు భాసిలు చుండన్ –శిరమున ఖండేందునితో –వరలెడి గాయత్రి !నీకు వందన శతముల్ ‘’
సుందరమైన ముఖ చిత్రాలతో ,పాల నురగవంటి తెల్లకాగితాలపై 207పేజీల అత్యంత విలువైన సమాచారం తో ఉన్న ఈ గ్రంథాన్ని పొందటానికి మూల్యం –కేవలం శ్రీ గాయత్రీ ధ్యానమే .అంటే ఉచితంగా పొందవచ్చు .కావలసినవారు శాస్త్రి గారి ఈ క్రింది చిరునామాకు సంప్రదించండి –
డా.సర్వా సీతారామ చిదంబర శాస్త్రి –అక్షర భారతి కాన్సెప్ట్ స్కూల్ –పాత కోర్టు భవనం –వినాయకుడి గుడి దగ్గర –జగ్గయ్య పేట 521175 –కృష్ణా జిల్లా
సెల్ –9885383741
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-19-ఉయ్యూరు .
—

