గౌతమీ మాహాత్మ్యం -31
43-మాతృ తీర్ధం
నారదునికి బ్రహ్మ మాతృ తీర్ధ విశేషాలు తెలియజేస్తూ మనోవ్యధలను తీర్చే గొప్ప తీర్ధం అన్నాడు .అనేక దేవదానవ యుద్ధాలలో దేవతలు దాయాదులైన అసురులను జయి౦చ లేకపోయారు . దేవతలను వెంటబెట్టుకొని బ్రహ్మ కైలాసం వెళ్లి శివ దర్శనం చేసి ‘’విమధ్యవారీ శమన౦గ శత్రో యదుత్తమం తత్తు దివౌక సేభ్యః –తతశ్చ తుస్టోదాత్వా విషం సంహార నీలకంఠః!కోవా ధర్తుం త్వామృతే వై సమర్దః –తతశ్చ తుస్టోభగవానాది కర్తా త్రిలోచనః ‘’మొదలైన స్తోత్రాలతో స్తుతించగా ,సంతోషించి వచ్చినపనేమిటి అని అడిగితె దేవతలు ముక్త క౦ఠం తో’’దానవులవల్ల మా భయం పెరుగుతో౦దేకాని తగ్గటం లేదు దుఖార్తులను కాపాడే బాధ్యత తీసుకొని దైత్య సంహారం చేయి ‘’అని విన్నవించారు .అదే తన తక్షణ కర్తవ్యమని భావించి వెంటనే రాక్షసులున్న చోటికి వెళ్లి యుద్ధం చేశాడు .కానీ జయించటం అసాధ్యమయి అలసిపోయాడు .నొసటి నుండి స్వేదబిందువులు కారుతుండగా ,తామసమూర్తి అవతారమెత్తి దైత్య సంహారం చేయటం ప్రారంభించాడు .ఈ రుద్రావతారానికి భయపడ్డ దేవతలు పారి పోయి మేరు పర్వతం వెనక నుండి వెళ్లి భూదేవి ని ఆశ్రయించారు .
భూమికి దిగి దానవ సంహారం ఆపకుండా చేశాడు రుద్రుడు .రుద్రుని నుంచి చెమట కారి బిందువులుగా భూమి పై పడ్డాయి .ఆ బిందువులు పడిన చోట్లలో శివాకారపు మాతలు’’ ఉద్భవించారు .వాళ్ళంతా రాక్షసులని మింగేస్తామని బయల్దేరారు .రాక్షసులు రసాతాలం లో దాక్కోన్నారని అక్కడికి వెళ్లి చంపమని శివుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు.మాతలు భూమిని చీల్చుకొని ,పాతాళం చేరి దానవులను సంపూర్ణంగా సంహరించారు .మాతల రాక కోసం దేవతలు గౌతమీ తీరం లో నిరీక్షిస్తున్నారు .దేవతలు ఎక్కడి నుండి బయల్దేరి మళ్ళీ ఎక్కడికి చేరారో ఈ ప్రదేశం దేవతల స్పర్శతో పునీతమై ప్రతిస్థాపన క్షేత్రమైంది .మాతలుఎక్కడెక్కడ పుట్టారో ,అక్కడ వారి పేరు మీద మాతృ తీర్ధం గా ప్రసిద్ధమైంది .శివుని పూజించినట్లే మాతృ కలనూ పూజించాలని చెప్పి దేవతలు అంతర్ధానమయ్యారు . మాతృ కలు అక్కడే ఉండి పోయారు .ఈ ఆఖ్యానం విన్నవారికీ ,చదివిన వారికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని బ్రహ్మ నారదమునికి చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-2-19-ఉయ్యూరు
—

