గౌతమీ మాహాత్మ్యం -35
48- ఆత్మతీర్ధం
భుక్తిముక్తిప్రదాయకమైన ఆత్మ తీర్ధ విశేషాలు నారదుడికి బ్రహ్మచెప్పాడు ,అత్రి మహర్షి కొడుకు ,దత్తుడు శివభక్తుడు ,దుర్వాసునికి ప్రియ సోదరుడు .ఒకరోజు తండ్రిని బ్రహ్మ జ్ఞానం పొందటానికి ఎవరివద్దకు వెళ్ళాలో చెప్పమని అడిగాడు .గౌతమీనదికి వెళ్లి పరమేశ్వర ధ్యానం చేయమన్నాడు తండ్రి .గంగానదికి వెళ్లి పవిత్ర స్నానం తో శుచియై తాను సంసారతాపత్రయం లో కూరుకుపోయానని ,కామ కోపాలతో లోపలి శత్రువులను జయి౦చ లేకపోతున్నాననీ దీనినుండి విముక్తిపొంది తనమనసులో ‘’సోమ ‘’అనే పదం శాశ్వతంగా ప్రతిష్ట చేయమని,తనకే పదవులు అక్కరలేదని ‘’శివ ‘’పదం ఉన్న చోట తన ఉనికి ఉండేట్లు చేయమని –‘’గౌరీపతే శంకరసోమనాథ,విశ్వేశ ,కారుణ్య నిధేఖిలాత్మకం –సంస్తూయతే యత్ర నదేతి తత్ర కేషామపి స్యాత్క్రుతి నాం నివాసః ‘’అంటూ ఆర్తిగా వేడుకొన్నాడు .
దత్తుని స్తుతి కి పరవశించిన పరమేశ్వరుడు అలాగే అని చెప్పి వరమిచ్చాడు .అత్రి మహర్షి కోరిక అయిన ఆత్మజ్ఞానం కలిగిన చోటుకనుక ఆత్మ తీర్ధం గా ప్రసిద్ధి చెందింది.
49-ఆశ్వత్దాది తీర్ధం
బ్రహ్మ నారదునికి అశ్వత్ధ ,పిప్పల ,మంద అనే మూడు తీర్దాల విశేషాలు చెప్పాడు .ఒకప్పుడు వింధ్యపర్వతానికి గురువైవైన అగస్త్య ముని దేవకార్య నిమిత్తమ ,భార్య లోపాముద్రతో ,వెయ్యి మంది మునిగణ౦ తో విన్ధ్యను సమీపించాడు .అది అత్యంత ఉన్నతమై ఆకాశాన్ని అంటుతోందా అన్నట్లు పెరిగి పోయి ఉన్నది .శిష్యుడైన విన్ధ్యరాజు గురువు అగస్త్యమౌనిని అర్ధాంగి లోపాముద్రను వెంటవచ్చిన ముని బృందాన్ని సకల సపరి చర్యలతో స్వాగత సత్కారాలతో మెప్పించాడు .అగస్త్యముని శిష్యుడితో ‘’నేను వీరందరితోకలిసి దక్షిణ దేశ యాత్ర చేయటానికి వెడుతున్నాను .కనుక మాకు దారి ఇచ్చి ,మేము తిరిగి వచ్చేదాకా అలాగే ఉండమని,మాటతప్పవద్దని కోరుతున్నాను ‘’అన్నాడు మహాభాగ్యం అంటూ వింధ్యుడు తలవొగ్గి మార్గం కలిపించగా దక్షిణానికి అగస్త్యముని బృందం వెళ్ళింది .అగస్త్యముని గౌతమీ తీరం చేరి ,సత్ర యాగం చేయటానికి దీక్ష పూని ముని బృందం సాయం తో ఏడాదికాలం చేసి నిర్విఘ్నంగా పూర్తి చేశాడు .
కైటభాసురునికి ఆశ్వత్ధుడు ,పిప్పలుడు అనే ఇద్దరు కొడుకులున్నారు .వీరిద్దరూ యజ్ఞ ధ్వంస కార్యక్రమాన్ని చేయాలనుకొని మొదటివాడురావి చెట్టు రూపం లో ,రెండవవాడు బ్రాహ్మణ రూపం లో ముని యాగ శాలకు చేరి ,కామ రూప విద్య లో నిష్ణాతులుకనుక రోజూ సత్ర యాగం వద్ద బ్రాహ్మణులను బాధించేవారు ఆశ్వత్ధుడు రావి చెట్టు వద్దకు వచ్చిన బ్రాహ్మణులను ,చంపేసి తినేసేవాడు .పిప్పలుడు బ్రాహ్మణవేషం లో సామగానం చేస్తూ నేర్చుకోవటానికి వచ్చే వారిని నాకిపారేసేవాడు .అప్పటినుంచి లోకం లో సామగానం చేసే బ్రాహ్మణులు కరుణ లేని వారయ్యారు –‘’తస్మదద్యాపి విప్రేషు సామగో తీవ నిష్క్రుపః ‘’’
రోజు రోజుకీ బ్రాహ్మణులు క్షయం అవటం గమనించి ,మునులు దక్షిణ తీరం లో తీవ్ర తపస్సు చేస్తున్న శనైశ్చరుని చేరి జరిగింది చెప్పగా తన తపస్సు పూర్తికాగానే వాళ్ళను చంపుతానన్నాడు .మునులు అప్పటిదాకా ఆగితే కొంప కొల్లేరు అయిపోతున్దని అతనికి కావాల్సిన తపస్సు అంతా తామే ఇస్తామని చెప్పగా ‘’ఐతేమీ పనైపోతుంది ‘’ అన్నాడు శని .
సూర్యపుత్రుడైన శని బ్రాహ్మణ రూపం లో ఆశ్వత్ధుని చేరి ,రావి చెట్టు రూపం లో ఉన్నవాడి చుట్టూ ప్రదక్షిణ చేయగా మామూలు బాపడే అనుకోని తినేశాడు .వాడి శరీరం లోకి ప్రవేశించిన శని మనవాళ్ళ సినీమా డైలాగ్ లాగా ‘’కంటి చూపుతో ‘’ భస్మం చేశాడు ఆశ్వత్దుడిని .తర్వాత పిప్పలుని చేరగా వాడు వెర్రి బాపడనుకొని మింగేశాడు .పొట్టలో చేరిన శని తన తీవ్ర దృష్టి తో వాడినీ భస్మం చేశాడు .మహర్షులు ప్రీతమానసులై మందుడు అంటే శనికి కోరిన కోర్కెలన్నీ తీర్చారు .పూర్తిగా సంతృప్తి పొంది శని ‘’శనివారం అశ్వత్ధ వృక్షాన్ని కి ప్రదక్షిణ చేసేవారు స్పృశించే వారి పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి .అశ్వత్ధ తీర్ధం లో స్నానం చేస్తే సర్వ కార్య సిద్ధి కలుగుతుంది .గ్రహపీడలు తొలగిపోతాయి ‘’అని ప్రకటించాడు .అప్పటినుండి ఇది అశ్వత్ధ ,పిప్పల ,మంద ,అగస్త్య ,సాత్రిక ,యాజ్ఞిక ,సామగ తీర్ధమని పేరు పొందింది .
సశేషం

