గౌతమీ మాహాత్మ్యం -43
57-తపస్తీర్ధం
తపస్సును వృద్ధి చెందించేది తపస్తీర్ధం .ఒకప్పుడు రుషులమధ్య జలం అగ్ని ల విషయం లో సంవాదం జరిగింది .కొందరు అగ్ని గొప్ప అంటే, మరికొందరు నీరు గప్ప అన్నారు.తగాదా తీరక బ్రహ్మ దగ్గరకు వెళ్లి అడిగారు .బ్రహ్మ ‘’అగ్ని, జలం ఇద్దరూ పూజనీయులే .వారివల్లనే జగత్తు ,హవ్యకవ్యాలు అమృతం కలుగుతున్నాయి .ఇద్దరూ సమానమే ‘’అని చెప్పగా సంతృప్తిపడక వాయువును అడగగా అగ్ని యే జ్యేస్టుడు,సర్వం అగ్నిలోనే ఉన్నాయన్నాడు .సంతృప్తి చెందక భూమాతను అడుగగా ‘’సనాతనమైన నీరే నాకూ ఆధారం .అన్నీ నీటిలోనుంచే వస్తాయి కనక నీరే శ్రేష్టం ‘’అన్నది .ఇదీ నచ్చక విష్ణువును అడిగారు .అప్పుడు అశరీర దేవీవాక్కు ‘’తపో భక్తీ నియమాలతో జలాగ్నులను ఆరాధించండి .ఎవరి సిద్ధి మొదట జరిగితే ఆ మహాభూతమే సర్వ శ్రేష్టం అని గ్రహించండి ‘’అన్నది .సరే అని వెళ్ళిపోయారు .
ఋషులంతా గంగా తీరం చేరి జలదేవతాభక్తులు, అగ్ని దేవతాభాక్తులు తమ తమ దేవతా పూజలో యజ్ఞం లో కూర్చున్నారు .అప్పుడు వేదమాత వాగ్దేవి సరస్వతి వారితో ‘’అగ్నికి జలం స్థానం .జలం చేతనే పవిత్రత కలుగుతుంది .నీరు ఉంటేనే కర్మలు చేయగలరు .జలాలు మాతృ భూతాలని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నీరే శ్రేష్టం ‘’అన్నది .వేద మాత వాక్కు వేదవాక్కు గా భావించి అందరూ నీటికే శ్రేస్ట త్వమిచ్చారు .మహర్షులు యజ్ఞం చేసిన ఈ తీర్ధమే తపస్తీర్ధం .తపస్సును పెంచి మోక్షాన్నిస్తుంది అని నారదునికి బ్రహ్మ చెప్పాడు .
58-దేవ తీర్ధం
గంగానదికి ఉత్తరాన దేవతీర్ధమున్నది .గుణ శ్రేష్టుడైన ‘’ఆర్ష్ట షేణుడు’’అనే రాజు భార్య జయ .కొడుకు ‘’భరుడు వేద,ధనుర్వేదాలలో నిష్ణాతుడు .భార్య సుప్రభ .రాజ్యం కొడుక్కు అప్పగించి రాజు ప్రదానపురోహితుని ఆధ్వర్యం లో యజ్ఞానికి పూనుకొన్నాడు .’’మిధువు ‘’అనే రాక్షసుడు యాగ ధ్వంస౦చెసి ,అందరినీ బాధించి రాజును రసాతలానికి ఎత్తుకు పోయాడు .పురోహితుడి కొడుకు ‘’దేవాపి ‘’తండ్రికోసం బెంగ పెట్టుకొని ఏడవటం మొదలు పెట్టి తల్లిని అడిగాడు .రాజుతోపాటు అతని తండ్రినీ రాక్షసుడు పాతాళానికి తీసుకు వెళ్ళాడని చెప్పింది .
అతడు రాజకుమారుడైన భరుడు తో ఆలోచించి తాను యజ్ఞం చేసి ఎలాగైనా రాజునూ తనతండ్రినీ తీసుకొని వస్తానని ,రాజ్యాన్నీ ,తన తల్లినీ జాగ్రత్త గ చూడమని చెప్పి ,అనుజ్ఞ పొంది ,మంచి రుత్విక్కులను ఎన్నుకొని ,వారు చెప్పినట్లు అగ్నిని పూజించి తనకోరిక తెలియజేశాడు .అగ్ని తానూ కూడా దేవతలపరి చారకుడను మాత్రమే నని ,దేవతల హవ్యాన్ని భరించేవాడినే అనీ, హవ్య భోక్తలు దేవతలే అనీ చెప్పాడు .దేవాపి దేవతలదగ్గరకు వెళ్లి జరిగింది అంతా చెప్పాడు .దేవతలు తాము వైదిక మంత్రాల ద్వారా ఆహ్వాని౦పబడి వచ్చే వాళ్ళమే కాని స్వతంత్రులంకామనీ ,వేదాలనే అడగమని చెప్పారు .వేదాలను ప్రసన్నం చేసుకొని అడిగాడు .వేదాలు ‘’మేము ఈశ్వర వశం లో ఉంటామేకానీ స్వతంత్రులం కాదు .మహేశ్వరుడే జగత్కర్త భర్త హర్త ‘’అన్నాయి .
దేవాపి దేవదేవుడైన మహేశ్వరుని మెప్పించి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ‘’నా తండ్రినీ నా రాజునూ యాగం నుండి బలాత్కారంగా ఎత్తుకు పోయి పాతాళం లో దాచిన మిధు దైత్య సంహారం చేయాలని ఉందని చెప్పగా తధాస్తు అని నందిని తన శూలాన్నీఇచ్చి పంపాడు శివుడు.పాతాళం చేరి నంది రాక్షస సంహారం చేసి రాజును దేవాపి తండ్రినీ సురక్షితంగా భూమి పైకి తెచ్చి అప్పగించాడు .రాజు ’ఆర్ష్ట షేణుడు’’ గౌతమీ తీరం లోనే అశ్వమేధ యాగం చేసి ,దేవతల౦దర్నీ మెప్పించాడు .శివుడు ప్రత్యక్షమైన ఈ తీర్ధమే దేవతాతీర్ధం .ఇక్కడ పదిహేను వేల వంద తీర్దాలు వెలశాయి .ఇక్కడ ఏది చేసిన ఉత్కృష్ట ఫలితం కలుగుతుందని బ్రహ్మ నారదుడికి చెప్పాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-2-19-ఉయ్యూరు

