అగ్నికి ఆహుతి కాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరిశాస్త్రిగారి శ్రీ ఆనందేశ్వర శతకం -2(చివరిభాగం )
బేతవోలు శ్రీ ఆనందేశ్వర దేవాలయం కాలక్రమం లో శిదిలమైతే గురజ జమీందారు శ్రీ శోభనాద్రీశ్వరుడు పునః ప్రతిష్టించాడని ,కోట వంశానికి చెందిన సీతారామశాస్త్రిగారు వంశపారంపర్య ధర్మకర్తగా చక్కగా ఆలయాన్ని కాపాడుతున్నారని పేరి శాస్త్రిగారు పద్యాలలో చెప్పారు .-‘’తానేగ్రామనివాసి దేవళమనిద్రా భద్ర దివ్యాత్ముడై –ఏ నాటన్ విలసిల్ల జేసెనననేమీ !శోభనాద్రీశ్వరుం –డేనాడోగురజాదిపుం డిచట ప్రతిస్టించెన్ నినున్ ,మాపురిన్ ‘’అని కృతజ్ఞత చెప్పారు .అలాగే –
‘’తానొక్క౦డు,కృత వ్రతు౦డగుచు,సీతారామ శాస్త్రాఖ్యుడున్ –పౌనః పున్యవిలు౦ఠ భక్తిరసభావాల౦ కృతు౦డొప్పువం -శా ను ప్రాపిత ధర్మకర్త పరమేశా !కోట వంశ్యుం డొగిన్’’అని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కోటసీతారామ శాస్త్రిగారిని మెచ్చుకొన్నారు. ఈ సీతారామశాస్త్రిగారు నాకు తెలిసిన మైలవరం వద్ద తెలుగుపండిట్ గా పనిచేసిన సీతారామ శాస్త్రి గారు, మా కోట గురువుగారి పుత్రులకు సమీపబంధువు బేతవోలు నివాసి కోట సీతారామంజనేయులుగారి ఇంటి ప్రక్క ఉంటున్న సీతారామ శాస్త్రిగారేమో అనిపిస్తోంది .లేకవారి తాతగారైనా అయి ఉండచ్చు.ఇది మా కోట గురుపుత్రులు క్లారిటీ ఇవ్వాల్సిన విషయం .ఎవరైతేనేమి ఆన౦దేశ్వర సేవలో ధన్యులౌతున్నారు.రసగుళికలు లాంటి ఎన్నో పద్యాలు భక్తిభావబందురంగా కవిగారు రచించి జన్మ చరితార్ధం చేసుకొన్నారు .
‘’ఓనీహార ధరా ధరేంద్ర తనయా యుక్తార్ధి దివ్యాంగ ! స్వ-ర్వేణీ వేణి ధరోత్తమాంగ!భుజ౦గా నీకాంగ!చితా విభస్మపరిలిప్తాంగా !దయా సాంగ’’అంటూ అంగ ప్రదక్షిణం చేశారు .శివునికున్న పేర్లన్నీ సార్ధకంగా ప్రయోగించి శివనామస్మరణ చేశారు –‘’ఓ నీల ద్యుతికంధరా !స్మరహరా !యుష్ణీష గంగాధరా -మానాధాశర !దైత్యహరణహరా !మంజీర భోగేశ్వరా !దీనోద్ధార! హరా !పరాత్పర !ఉమాదేవీ వరా !శంకరా ‘’అంటూ ప్రవాహవేగంగా సాంబశివ నామజపం చేశారు ..కవిగారి శివుడు ‘’అఖండోజ్వల జ్ఞానానంద వికాసుడు –మౌని జన హృత్సందీపితా వాసుడు ‘’.ధూర్జటి కవి ఆవహించి రాయి౦ చాడేమో అనిపిస్తుంది ఆ అనన్య భక్తి వైభవం చూస్తే.పొంగిపోతారు పరవశిస్తారు పరవశింపజేస్తారు కవి పేరిశాస్త్రిగారు-
‘’మాణిక్యోజ్వల చంద్ర మశ్శకల రంజన్మౌళిమందాకినీ –వేణీ మౌక్తిక రాజిరాజిత శిరో వేష్టీ!సురక్ష్మారుహా గ్రానూనా౦చిత తామ్ర మూర్ధజ !మహాకాలా !మహేశా !శివా ‘’అని భీమఖండం లో శ్రీనాధుని లాగా పారవశ్యంతో పరమేశ్వరనామోచ్చారణ చేసి తరించారు .ఆ నందం అనుభవైక వేద్యం –అక్కడ ఆయన ‘’ఆనందంబున ,అర్ధరాత్రమున చంద్రా లోకముల్ కాయగా ,నానాసైకత వేదికాస్ధలుల –శంభు కాశీనాధు నుమామహేశు శివున్ ,శ్రీ కంఠు నిన్ బాడెదన్ మేనెల్లన్ పులకా౦కు రంబులెసగ నిండారు మిన్నేటిలో’’ అన్నపద్యం లో ఎలా ఉప్పొంగిరాశాడో , ఈ కవీ అలానే సార్ధక్యంగా రాశారు .పేరిశాస్త్రి గారు ఎలాంటి శివుడిని ధ్యానిస్తారో తెలుసా –
‘’ధ్యాని౦తున్ మది నద్వితీయ మగు బ్రహ్మన్,సత్యసంకల్పువి –ద్యానిద్రాకృతి లోకకారకుని ,లోకాలోక సద్రూపునిన్ –జ్ఞానానంద మయ స్వరూపు నిను గంగా పార్వతీయుక్త శ్రీ ఆనందేశ్వరుని ‘’అంటే ఈ ఆలయం లో దేవేరులు గంగా ,పార్వతులన్నమాట .అలాగే ‘’ఆనీతం బొనరింతు నీకరుణచే నైశ్వర్యముల్ ఈ జగ-చ్చ్రేణి న్నేనిక తోలుపుట్టమును బూదిన్ దాల్తు నెమ్మేననీ-శానా !భోగమభోగమంచను వివక్షా దృష్టిమన్ని౦చవో’’అని అపరాధశతం చెప్పుకొన్నారు .
‘’వీణాక్వాణము ,కామినీజన లసద్విస్రంభ సల్లాపమై –వాణీ కంకణనూపురధ్వనులు సమ్యగ్వేణునాదంబులే -యై నీనర్తన మేల మాకు నటరాజా !వట్టి విన్యాసముల్ ‘’అని భక్తిహీనుల భౌతిక దృష్టిని ప్రశ్నించారు .భ్రూ నేత్రాగ్ని ,చర్మ ధారణా ,పాముల భూషణాలు చూసి భయపడి తొలగిపోము ‘’మందార మాలా నిష్యంద మరందముల్ జిలుకు నీఅంతరంగాన్నిచూసే ఆకర్షితులమౌతామన్నారు .ఈర్ష్య అసూయలు లేని జీవితాన్ని ప్రసాదించమని వేడికోలు చేశారు –
‘’లూనోచ్చిన్నము చేయలేనయితి,నాలోనున్న వాంఛాలతల్ –లీనోద్భేదన సేయలేనయితి ,దుర్మేభాగఘోరాశ్మముల్ -దీనుండ ,శరణార్ధి దాసుడ,కపర్దీ కావవే ఈశ్వరా ‘’అని శరణాగతులయ్యారు .సర్వం ఈశానునికే అర్పించారు .
‘’జ్ఞానాజ్ఞాన ములందు నింద్రియములో ,జ౦ద్రార్ధ చూడామణీ-వ్రీణ౦బౌ బహుధా ననజ్నతకె మాస్దిత ద్యోతముల్ –సూనంబంచు ధరింప గండ శిలల౦దున్ బాయగా జాలమో “అంటూ అజ్ఞానం చేసే వికృత విన్యాసాన్ని వివరించారు .భక్తుని పరీక్షించటం అంటే ‘’శాశ్వత కీర్తి కాయుని గ నీ క్ష్మానిల్పు సంకల్పమే ‘’అని తెలియజేశారు .
‘’నీ నిత్యత్వ మనిత్య తాస్దితు లనిర్నేయంబు ,లజ్నేయముల్-గానేపారు సదాశివా !అగణిత బ్రహ్మాండ సృష్టి స్థితి –క్షీణానేక చిదేక వైభవ ములన్ గ్రీడింతు సర్వాత్మవై ‘’అని శివలీలా రహస్యం ఎరుక పరచారు .శివానందలహరిలో శ౦కరభగవత్పాదులు లాగా చక్కని పద్యం రాశారు –
‘’సాను ప్రాంశు శిలాతలంబున నివసంబుంట నీ కిస్టమే-యైనం ,ఆ రజతాద్రి సానువుల యట్లత్యంత కాఠిన్యమున్ –కానేకాదు ,మదీయ హృత్కుహరభాగంబందు భాసి౦ప వే ‘’అని తన హృదయకుహరం లో శాశ్వతంగా నిలిచిపోమ్మని ఆనందేశ్వర సదాశివుని ఆర్తిగా ప్రార్ధించారు .
చివర్లో అత్యంత చమత్కారంగా తన ఆన౦దేశ్వర శివుని ఇంకా ఎందుకయ్యా పాత చీకిపోయిన శార్దూల చర్మం ధరిస్తావు ?నా శార్దూల విక్రీడిత శతకం స్వీకరించి హాయిగా విహరించు అని ప్రార్ధించారు –
‘’లూనాఘాజగదాది నాటిదగు శార్దూలాజినంబిక నీ-కీనాడే?వినూత్న మద్ఘటిత భక్తిప్రోత శార్దూల వి-శ్రాణార్చా శతి స్వీకరి౦పుము ప్రభూ ,శంభో శంకరా –ఆనందేశ్వర !బేతవోల్పుర విహారా !చంద్ర రేఖాధరా ‘’
ప్రౌఢ కవితా గంగా ఝరీ సదృశ కవిత్వం తో శతకం రాసి నా ,కవిగారు తన వినిర్మల వినయాన్ని ప్రకటించుకొన్నారు ఆది శంకరాచార్యులుగారిలాగా –
‘’సానందా!మది నీసడింపకువె,శబ్దార్ధ ప్రయోగాదిదో-షానేకం బిది యంచు నా వెనుక భాస్వంతోజ్వల స్వాంత వీ-ధీ నిర్దోషతి చూచియే ,నను కృతార్ధీభూతు సేయందగున్ –ఆనందేశ్వర !బేతవోల్పురవిహారా !చంద్ర రేఖాధరా ‘’
ఇంతటి గొప్ప శతకం అగ్నికి ఆహుతి కాకుండా నా చేతికి చిక్కటం ఈశ్వర సంకల్పమే కాని వేరుకాదు .ఆ ఆనందేశ్వరుడు మనకు ఆన౦దానుభూతి సదా అనుగ్రహించాలని కోరుకొందాం .మిస్టరీ వీడింది –ఇప్పుడే బేతవోలు నుంచి శ్రీ కోట సీతారామ శాస్త్రిగారు ఫోన్ చేసి నేను రాసిన మొదటిభాగం చదివానని ,ఈశతక కర్త శ్రీ కోట పేరిశాస్త్రిగారు సాక్షాత్తు తమ తండ్రిగారేనని ,ఆ దేవాలయ ధర్మకర్తలం తామేనని ,తమ పితృపాదులు ఆనందేశ్వరునిలో లీనమై చాలాకాలమైందనీ , 2017సెప్టెంబర్ 5ఉయ్యూరులో లో అమరవాణిహైస్కూల్ లో జరిగిన శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురు పూజోత్సవం నాడు ,తాము, మాగురుపుత్రులు శ్రీ కోటసీతారామాంజనేయులుగారు కలిసి వచ్చి,పాల్గొని మేము అమెరికాలో ఉండటం చేత ఈ శతకాన్ని మా అబ్బాయి రమణకు అందజేసి వెళ్లామని చెప్పారు .సుమారు ఏడాదిన్నరకాలంలో శతకం బయటపడి నాకు దక్కింది .సర్వం ఈశ్వరాదిచ్ఛేత్ అంటే ఇదేనేమో .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-4-19-ఉయ్యూరు

