22-శివరామ లింగరాజు (చివరిభాగం )
మూడు ఆశ్వాసాల ‘’శైవాచార సంగ్రహం ‘’రాసిన శివరామలింగరాజు భారద్వాజ గోత్రీకుడైన క్షత్రియకవి .తండ్ర్రి హరిరాజు తల్లిసీతమ్మ .గురువు గోకర్ణ మటాధిపతి సోమశేఖరుడు ..కాకతి ,చాళుక్య సీమలలో క్షత్రియ వీర శైవులులేరని,తెలంగాణా లేక రాయలసీమవాడు అయి ఉంటాడని రాజుగారన్నారు .వంశక్రమంలో బర్బర దేశాదీశ్వరుడు శంఖాన్వయుడు మూలపురుషుడు అతడికి అయిదవతర౦ వాడు మనకవి .ఇతనికావ్యం స్కాందపురాణం లోని’’ శంకర సంహిత’’కు ఆంధ్రానువాదం .ధారాశుద్ధిఉన్నకవిత్వ౦ రాశాడు .ఇది చదివితే 18వ శతాబ్దికి కావ్యభాష ఎలా రూపు దాల్చిందో తెలుస్తుందన్నారు బిరుడురాజువారు .కల్హారపుష్పం -కలుహార పుష్పం , -అరహము –అర్హము ,సుదర్శన -సుదరిసేన – ,పిత్రుతోషణము –పితరు తోషణము,శ్రీ రుద్రీయము –శ్రీ రుద్రియము గా మారాయి ‘
మొదటి ఆశ్వాసం లో శివుడు కుమారస్వామికి చెప్పినదాన్ని సూతుడు మునులకు చెప్పాడు .ఒక సారి శివలోకం లో కుమారస్వామి అందరి సమక్షం లో సంశయాలు తీర్చమని అడిగితె శివుడు చెప్పినవిషయాలివి .మొదటి ఆశ్వాసం లో లింగార్చన ,లింగాదారణ వగైరాలున్నాయి. రెండవ ఆశ్వాసం లో షట్ స్థలాల నిర్ణయం ,స్థలధర్మాలు ,త్ర్రివిధ ఉపాసనలు భక్తిమార్గాలు ,మహేశ్వరుల ప్రవర్తన మొదలైనవి ఉన్నాయి .మూడులో శివయోగులకు చేసే దానాలు ,గోప్యార్పణం ,తండ్రీకోడుకులైన శ్వేత ,పింగళ కథ,శ్రీశైలమహాత్య్మం,స్వధర్మ నిష్ట వగైరాలున్నాయి .ప్రారంభ కందపద్యం-
‘’శ్రీ పార్వతీ వదూధవ –తాపస హృదయాబ్జ భ్రుంగ భగ ధనదార్చిత వి
ద్యోపాయనిలయ నిర్మల –శ్రీపతి చి౦తా౦గ తరంగ శ్రీ గురులింగా ‘’
తర్వాత గ్రంధ ప్రాముఖ్యాన్ని చెప్పాడు .వీరశైవులకు కుల వివక్ష ఉండదుకనుక వంశ చరిత్ర చెప్పుకోలేదు’’అంగ త్రివిధ విలక్షణ –లింగా౦గికి నొక్క కులము లేదని మదిలో
నంగాభిమాని కేర్పడ-పొ౦గుచు నెరిగింతు తనువు పుట్టిన కులమున్ ‘’
గ్రంథంచివరలో కూడా దాని ప్రాశస్త్యాన్ని మళ్ళీ చెప్పాడు .రచనాకాలం గురించిపద్యం –
‘’చనినట్టి శాలివాహన శాతాబ్దంబులు పాటింప వేయు నూర్నూటిమీద –నిరవదగా నేబదేను ప్రమాదీచ విమల వత్సరము నాశ్వీజమందు
బహుళ తృతీయలో భానువాసరమున రచియి౦చి నట్టి నిర్ణయ చరిత్ర ‘’అన్నాడు .ఇది 14-10-1733కు సరిపోయిందని రాజుగారువాచ .
కృతి సమర్పణపద్యం –
‘’కరణములు మూటి సాక్షగా-గని విలక్ష భావమున నిష్ట లింగ ౦బు, ప్రాణ లింగ,
భావలింగ౦బులై యున్న బ్రహ్మమునకు –భక్తి తోడుత కృతి సమర్పణము చేతు ‘’.
మూడవ ఆశ్వాసం చివరి గద్య రాశాడు .దీని ప్రతి రాసిన విధానం –‘’పరీధావి సంవత్సర ఆశ్వీజ బహుళ దశమి శెనివారం మూడు ఝాములవరకు వీరశైవాచార సంగ్రహం ప్రెతి లో ఉన్న ప్రకారం సున్నపు సోమయ్యకు పాటోజు బైరాగి వ్రాశి ఇచ్చెను .’’ఇది 6-11-1852కు సరిపోతుందని ,వ్రాయసకాని వాక్యాలు గతశతాబ్దం తెలుగు వ్యావహారిక భాషకూ ,లేఖన సంప్రదాయానికి ఉదాహరణ గా ఉన్నాయని ఆచార్య బిరుదురాజు రామరాజు గారు చెప్పారు .
సమాప్తం
ఆధారం-ఆచార్య బిరుదురాజు రామరాజుగారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు ‘’.
మనవి –‘’చరిత్రకెక్కని చరితార్దు’’లైన 22మంది తెలుగు కవులను ,వారి రచనలను, విశేషాలను రాసే అదృష్టం దక్కిందని ,ఈ వ్యాసాలు రాజుగారు’’ గోలకొండ ‘’మొదలైన పత్రికలలో 1960-నుంచి 1971వరకు రాసిన పరిశోధనా వ్యాసాలని ,వీటిని పై శీర్షికతో 1985లో ముద్రించారని ,ఇందులో రెండవవిభాగం లో 12మంది చరిత్రకెక్కని ‘’సంస్కృత కవులు ‘’ఉన్నారని ,వారి గురించి నేను రాసిన’’ గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ ‘’మూడుభాగాలలో చోటు పొందకపోతే వారి గురించికూడా ‘’గీర్వాణకవులు’’లో త్వరలో రాస్తానని మనవి చేస్తున్నాను .ఈ పుస్తకం వచ్చాక అనేకమంది పైకవులపై పరిశోధన చేసి ఉంటారని, వారు మరిన్ని నూతన విషయాలు ఆవిష్కరించి ఉంటారని భావిస్తున్నాను . సరసభారతి బ్లాగ్ అభిమానులైన సాహితీ బంధువులకు ఈ కవులను పరిచయం చేయటమే నా ముఖ్యోద్దేశం .
ఈ ధారావాహికను చక్కగా చదువుతూ , తెలియని విషయాలు తెలియజేస్తూ నన్ను ప్రోత్సహించిన డా .శ్రీ టి.శ్రీరంగ స్వామి (వరంగల్ ),డా శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర (చెన్నై )గార్లకు ,అభిమానించిన సాహితీ బంధువులకు ధన్యవాదాలు .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-19-ఉయ్యూరు

