గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
421-చమత్కార తరంగిణి వ్యాఖ్యాన కర్తలు -సుందరి ,కమల (1705)
ఉత్తర రామ చరిత వ్యాఖ్యానకర్త ఘనశ్యామ క్రీ.శ. 1700 లలో జన్మించి, తంజావూర్ పాలకుడు మొదటి తుక్కోజి వద్ద మంత్రిగా ఉన్నాడు .నీలకంఠ చంపు సంజీవనికూడా రాశాడు .18వ ఏటనుంచే రచనావ్యాసంగం సాగించాడు .మహారాష్ట్రకు చెందినవడైనా తంజావూర్ లోనే ఉండిపోయాడు .తండ్రి మహాదేవ .తల్లి కాశీ .పెద్దన్న ఈశా ‘’చిదంబర బ్రహ్మచారి ‘’గా గుర్తింపు పొందాడు .ఘనశ్యామా మొదటి భార్య సుందరి .కమలను రెండవ భార్యగా చేసుకోనేదాకా ,.తనరచనలలో ఆమెను సుందరిగానే పేర్కొన్నాడు .ఈ ఇద్దరితో ఆనుకూల్య దాంపత్యమే నెరిపాడు .ఈ ఇద్దరి పేర్లను తన రచనలలో తరచుగా పేర్కొని , తన అభిమానాన్ని చాటుకొన్నాడు .తన అభిజ్ఞాన శాకుంతల సంజీవనిలో వారిద్దరి మేధో విలసనాన్ని తెలిపాడు .ఘనశ్యామ ఇద్దరుకోడుకులు చంద్ర శేఖర ,గోవర్ధన .చంద్ర శేఖర తన తండ్రిరాసిన ‘’డమరుక ‘’కావ్యానికి వ్యాఖ్యానం రాశాడు .గుడ్డివాడైన గోవర్ధన తండ్రి రచన ‘’ఘట కర్పక ‘’కు వ్యాఖ్య రాశాడు .ఘనశ్యామ ‘’పంచాయతన దేవత’’కు పరమభక్తుడు .
ఘనశ్యామ సంస్కృత ,ప్రాకృతాలలో అనేక రచనలు చేశాడు .తను 64రచనలు చేసినట్లు నీలకంఠ చంపులో చెప్పుకొన్నాడు .రచనలో తనవాటినే ఎక్కువగా ఉదాహరణలిచ్చేవాడు .సుందరీ కమలలు కూడా అలాగే చేశారు .రాజశేఖరుని విద్ధ సాలభంజికపై ‘’చమత్కార తరంగిణి వ్యాఖ్య’’ రాశారు ఇద్దరూ .ఘనశ్యామ రచనలలో చాలాభాగం శిధిలమయ్యాయి .ఘనశ్యామ ‘’ధాతు కోశం ‘’రాశాడు .అందులో అమరా సి౦హు ని రచనపై తీవ్రంగా విమర్శలు చేసిన ధీమంతుడు .18వ ఏటనే రామాయణ చంపు ,20వ ఏట మదన సంజీవన ,కుమార విజయ నాటకం రాసిన ప్రతిభావంతుడు ఘన శ్యామ .22వ ఏట డమరుక ను 8వ రచనగా రాశాడు .ఏడాదికి కనీసం మూడు లేక నాలుగు పుస్తకాలు రాసినఘనుడు ఘనశ్యామ .మొదట్లో సృజనాత్మక రచనలు చేసి ,తర్వాత ఇతరకావ్యాలపై వ్యాఖ్యానాలు చేశాడు .క్లిస్టభాషలో రాసినా రచనలో ఆకర్షణ ఉంటుంది .మేధావే కాని ఇతరకవులను మెచ్చుకొనే సహృదయతదయలేని వాడుగా గుర్తి౦పు పొందాడు .అనేక’’ కోశాలు’’ నిర్మించాడు కనుక ‘’కోశావలీ వల్లభ ‘’బిరుదు సార్ధకమే .
ఘనశ్యామ సుందరిని పిన్నవయసులోనే పెళ్ళాడాడు .పెళ్ళికి ఇద్దరివయసు 16లోపే .సుందరి 1705లో పుట్టింది .అతనికి 30 కమలకు 13వయసులో కమలా ఘనశ్యామా వివాహం జరిగింది అప్పుడు అతడు తుక్కోజి రాజ్యం లో మంత్రి .అప్పటికే చాలా రచనలు చేశాడు .ఈ ఇద్దరి పెళ్ళాల ముద్దులమొగుడు తనరచనలలో వారిపై ప్రేమను వారి ఆరాధనాభావనను వీలైనప్పుడల్లా వర్ణించి సంబరపడ్డాడు .ఇద్దరు భర్తను పుంభావ సరస్వతి అని భావించి సేవించారు .చమత్కార మంజరిలో తమభర్త ఘనశ్యామ రచనలద్వారా అమరత్వం పొందాడని ఆనందించారు .రాజశేఖరుడు మూడు రచనలు మాత్రమే చేస్తే తమనాధుడు చాలారచనలను అనేకభాషలలోచేశాడని చెప్పుకొన్నారు .రాజశేఖరుడు ఉదయం మాత్రమే రచన చేస్తే, తమ భర్త రోజులో ఇరవైనాలుగు గంటలు అదే దీక్షతో రచన చేసే సామర్ధ్య మున్నవాడని చెప్పారు .ఘనశ్యాముని’’ ప్రచండ రాహూదయ’’ వంటి కావ్యం కాని ఆయన ఇతర రచనలతో సరిసమానమైన రచనకాని వేరెవ్వరూ చేయలేదని సవాలు విసిరారు .భర్త శేముషీ వైభవాన్ని చాటే అనేక శ్లోకాలను డమరుక, జాతి గుణోల్లాస ,భారత చంపు ,హరిశ్చంద్ర చంపు ,భోజచంపు ఉత్తరరామ చరిత వ్యాఖ్యానం,అభిజ్ఞాన శాకుంతలం ,యుద్ధకాండ చంపు ప్రబోధ చంద్రోదయ ,ఆనంద సుందరి మొదలైన వివిధ రచనలనుండి ఉదహరించారు.
దీనిని బట్టి సుందరి కమలలు తమ భర్త ఘనశ్యామారచనలన్నిటిపై లోతైన పరిశీలన సాధికారమైన అవగాహన ఉందని అర్ధమౌతోంది .తమ మేధకు తామే అబ్బురపడే వారిద్దరూ .ప్రతి శబ్దానికి వంద అర్ధాలను చెప్పగల సామర్ధ్యం తమకు ఉందని నిర్భయంగా ప్రకటించిన ధీ శక్తి వారిది .తమ బావగారు అంటే ఘనశ్యాముని అన్నగారైన ‘’కల్పతరు ‘’కర్త చిదంబర స్వామి అంటే ఈ ఇద్దరికీ విపరీతమైన గౌరవం భక్తీ,ఆరాధనా. చమత్కార తరంగిణిలో ఈయన గురించి రెండుసార్లు చెప్పారు .కాని కల్పతరు కనిపించటంలేదు .
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-6-19-ఉయ్యూరు

