సాంకేతికశాస్త్ర వేత్త- చంద్రు పట్ల తిరుపతి రెడ్డి
శ్రీ చంద్రు పట్ల తిరుపతి రెడ్డి ఉస్మానియా యూని వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పొంది ,బొంబాయి లో ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యు ఫాక్చరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించి ,మొదటగా హిందూస్థాన్ మెషిన్ టూల్స్ లో ఉద్యోగం లో చేరి ,ఐఐటి ఫాకల్టిలో పని చేశారు .
అమెరికా వెళ్లి ఆస్టిన్ లో ఉన్న టెక్సాస్ యూని వర్సిటీ నుండి పిహెచ్ డిఅందుకొన్నారు తర్వాత తనకు అభిమానమైన మెకానికల్ ఇంజనీరింగ్ లో పరిశోధనలు నిర్వహించారు .ఇంజనీరింగ్ కోర్సు కు మూడు పాఠ్య గ్రంథాలు రాశారు .ఇవి పరమ ప్రామాణికంగా ఉండటం వలన అనేక విదేశీ భాషలలోకి అనువాదం పొంది ప్రాచుర్యం పొందాయి .ఇంజనీరింగ్ లో రెడ్డిగారు ఆవిష్కరించిన రెండు కొత్త పరికరాలకు పేటెంట్ లు పొందారు .ఆయన ప్రతిభను గుర్తించి అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్,అమెరికన్ సొసైటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ , సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్స్ మొదలైన ప్రామాణిక సంస్థలు ఆయనకు గౌరవ సభ్యత్వమిచ్చిఘనంగా సత్కరించాయి .
తిరుపతి రెడ్డిగారు న్యు జెర్సీ లోని రోవాన్ యూని వర్సిటి లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా చాలాకాలం పని చేశారు .ఈ యూనివర్సిటిలో మెకానికల్ ఇంజనీరింగ్ వి భాగానికి దిశా, దశ కల్పించిన ఘనత రెడ్డి గారిదే .ఈ యూని వర్సిటీ లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రొఫెసర్స్ ఎందరో ఉన్నారు .కాని 2006సెప్టెంబర్ లో మహా ప్రతిష్టాత్మకమైన ‘’లిండ్ బ్యాంక్ ఎక్స్ లెన్సి’’ ’’అవార్డ్ ను తిరుపతి రెడ్డిగారికి అందించి అరుదైన గౌరవం కల్పించారు .శాస్త్ర బోధనలో అత్యంత నిపుణులకు మాత్రమే ఈ అవార్డ్ ను’’క్రిస్టియన్ ఆర్. మేరి ఆఫ్ లిండ్ బ్యాంక్ ఫౌండేషన్ ‘’వారు అందించే ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఇది ,సుమారు 40సంవత్సరాలు రోవాన్ యూని వర్సిటీ సుదీర్ఘ సేవలు అందించి, బహుముఖ వ్యాప్తికి తోడ్పడి తనకు, తన ఇంజనీరింగ్ విభాగానికి కీర్తి ప్రతిష్టలు సాధించిపెట్టిన ఆంద్ర సాంకేతిక దిగ్గజం రెడ్డి గారు .
రెడ్డి గారు రాసిన ‘’యాన్ ఇంట్ర డక్షన్ టు ఫైనిట్ ఎలిమెంట్స్ ‘’గ్రంథం 2006నాటికే మూడు సార్లు పునర్ముద్రణ భాగ్యం పొందింది అంటే దాని విలువ ఏమిటో అర్ధమౌతుంది .ఇదిస్పానిష్ ,కొరియా భాషలలోకీ మరికొన్ని విదేశీ భాషలలోకి అనువాదం పొందింది . రెడ్డి గారిమరో దొడ్డ రచన ‘’క్వాలిటి అండ్ రిలియబిలిటి’’గ్రంథం 2007లో లో ప్రచురితమైంది.
సాంకేతికంగా గానే కాక సాహిత్య రంగం లోనూ ఆయన ప్రతిభ విశేషమైనదే .తన అనుభవాలకు కవితా రూపమిచ్చి ‘’మనోగతం ‘’కవితా సంపుటి వెలువ రించారు .వీరి సాహితీ సేవకు గుర్తింపుగా ‘’డెట్రాయిట్ తెలుగు అసోసి ఏషన్’’సాహితీ పురస్కారం అందించి సత్కరించింది .వంశీ ఇంటర్నేషనల్ దాశరధి కృష్ణమాచార్యుల అవార్డ్ లను 2004లో ,తానా ఇంజనీరింగ్ అవార్డ్ 2005లోనూ అందుకొన్న ప్రతిభామూర్తి .సిలికాన్ లోయ లోతులు తరచి ,కంప్యూటర్ యవనికనూ శోధించి ,శాస్త సా౦కేతిక శాఖల కు మెరుగులు దిద్ది ,సాహితీ జగత్తులోనూ విహరించిన బహుముఖ ప్రతిభాశాలి శ్రీ చంద్రు పట్ల తిరుపతి రెడ్డి గారు .
ఆధారం –శ్రీ వాసవ్య రాసిన ‘’ఆంద్ర శాస్త్రవేత్తలు ‘’
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-6-19-ఉయ్యూరు


ఎందరో మహానుభావులు. మీ వ్యాసం చదివేదాకా శ్రీ చంద్రు పట్ల తిరుపతి రెడ్డి గారి గురించి తెలియదు. శ్రీ తిరుపతి రెడ్డి గారు మరిన్ని సేవలనందించి భారతావనికి తెలుగు రాష్ట్రాలకు ఖ్యాతి చేకూర్చగలరని విశ్వసిస్తూ వారికి అభినందనలు 💐
చక్కని వ్యాసం రాసి అందించి నందుకు మీకూ ధన్యవాదములు 🤝👏
LikeLike