‘’అర్జున టాంక్ ‘’రూప శిల్పి –దొనకొండ హనుమన్న
అనంతపురం జిల్లా తిమ్మనచర్ల గ్రామం లో జన్మించిన దొనకొండ హనుమన్న అనంతపురం లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ,వరంగల్ రిజినల్ ఇంజనీరింగ్ కాలేజి లో మెషీన్ టూల్ డిజైనింగ్ లో ఎం .టెక్ .అయ్యారు .మొదట పూనాలోని ఒక విదేశీ కంపెనీలో ఇంజనీర్ గా ఉద్యోగం ప్రారంభించి ,అనేక పరీక్షలు రాసి పూనా దగ్గర అహ్మద్ నగర్ లోని కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ‘’కంట్రోలరేట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ వెహికల్స్ ‘’విభాగం లో గ్రేడ్ టు సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గా నియమితులై పని చేశారు .వెహికల్ ఇంజనీరింగ్ లో గొప్ప పరిశోధన అధ్యయనం చేసి ప్రవీణులయ్యారు .
సైనికులు కొనుగోలు చేసే వాహనాలు ,వాటిపని తీరు ,నైపుణ్యం లను క్షుణ్ణంగా పరీక్షించారు .నాలుగేళ్ల ఈ పరీక్షానుభవం పరిశోధనలకు దారి చూపింది .ఈ అనుభవంతో మద్రాస్ లోని సీనియర్ సైంటిఫిక్ గ్రేడ్ వన్ ఆఫీసర్ గా పదవీ బాధ్యతలు చేబట్టారు .అప్పుడు తయారౌతున్న ‘’వైజయంతి టాంక్ ‘’ ను పర్య వేక్షించి కొన్ని మార్పులు చేశారు.1980 డిసెంబర్ లో ‘’కాంటాక్ట్ వెహికల్ రీ సెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ ‘’లో ‘’గ్రేడ్ సి’’శాస్త్రవేత్తగా చేరారు .ఇదొక సువర్ణ అవకాశంగా మారింది .తన సునిసిత మేధవలన చకచకా గ్రేడ్ లను అధిగమించి హనుమన్న తన అవక్ర విక్రమాన్ని ప్రదర్శించి ‘’స్పెషల్ గ్రేడ్ శాస్త్ర వేత్త ‘’గా గుర్తింపు పొందారు .ఇది అత్యంత కష్టతరమైన ప్రాసెస్ ఆయినా అవలీలగా సాధించారు. అంకితభావం తో ఆయన చేసిన అవిరళ కృషికి తగిన గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘’విశిష్ట శాస్త్ర వేత్త ‘’పురస్కారం అందించి గౌరవించి సత్కరించింది .ఆ సంస్థలో ఉన్న 51ఉపశాఖలలో మొత్తం 6వేల మంది శాస్త్ర వేత్తలు ఉండగా ,కేవలం 20మందికి మాత్రమే ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ లభించటం విశేషం .అందులో ఆంధ్రులైన హనుమన్నగా రికి రావటం మరింత విశేషం .
అప్పడే భారత ప్రభుత్వం శత్రు విచ్చేదక మల్టి పర్పస్ స్పెషల్ యుద్ధ టాంక్ ‘’అర్జున ‘’నిర్మించే ప్రయత్నం లో రూప కల్పన చేస్తూ ఆ ప్రాజెక్ట్ ముఖ్య బాధ్యతను హనుమన్నగారికి అప్పగించింది .దీనినిర్మాణ౦ లో అనితరసాధ్య ప్రతిభను ,అంకిత భావాన్ని ప్రదర్శించి దిగ్విజయంగా పూర్తి చేసి తన సమర్ధతను, టాంక్ సమర్ధతను చాటి ,అపూర్వ సత్కారం అందుకొన్న శాస్త్ర సాంకేతిక శాస్త్ర వేత్త హనుమన్నగారు .అత్యుత్తమ టాంక్ గా అర్జున టాంక్ గుర్తి౦పబడి భారత ప్రభుత్వ యుద్ధ టాంక్ లలో మణి రత్నమే అయి ,అపూర్వ విజయాలు సాధించిపెట్టింది .ఈ విజయవంత మైన ప్రాజెక్ట్ తర్వాత మరొక 124 టాంక్ ల నిర్మాణానికి అనుమతి పొందటం మరో విశేషం .
35ఏళ్ళు సుదీర్ఘ పర్యవేక్షణ నిరంతర పరిశోధన అనంతరం హనుమన్నగారు చాలా ఆలస్యంగా 52వ ఏట పిహెచ్ డి అందుకొన్నారు .వీరి కృషికి లెక్కలేనన్ని అవార్డ్ లు రివార్డ్ లు లభించాయి .కేవలం స్వదేశీ పరిజ్ఞానం తో అపూర్వమైన అర్జున ట్యాంక్ రూపకల్పన చేసి నిర్మించి భారత దేశ యుద్ధ పరికరాలలో విశిష్టమైన అర్జున టాంక్ ను చేర్చారు .ఆనాటి క్రీడి అయిన అర్జున పరాక్రమంతో, ఈ నాటి అర్జున టాంక్ వీర విహారం చేస్తూ రూపశిల్పి దొనకొండ హనుమన్నఅకు౦ఠిత దీక్షకు సేవతత్పరతకు శోభాయమానమై నిలిచింది.
ఆధారం –శ్రీవాసవ్య రాసిన ‘’ఆంద్ర శాస్త్రవేత్తలు ‘’
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-6-19-ఉయ్యూరు

