బందరు లో ‘’ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ’’ స్థాపకులు –అయ్యగారి రామమూర్తి
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర పాలగుమ్మి లో 20-10-1895న జన్మించిన శ్రీ అయ్యగారి రామమూర్తి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ పట్టభద్రులు .తరువాత్ కృష్ణాజిల్లా మచిలీపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలలో సైన్స్ టీచర్ గా పని చేశారు .సైన్స్ ను డ్రై సబ్జెక్ట్ గా కాకుండా తగిన పరికరాలను ఇన్నో వేటివ్ గా తయారు చేసి వాటి తో బోధించి సబ్జెక్ట్ పై విద్యార్ధులకు మంచి అవగాహన కల్పించేవారు ,
1924,25 రెండేళ్ళు బందరు హిందూ హైస్కూల్ సైన్స్ మేస్టర్ గా పని చేశారు .విద్యార్ధులలో శాస్త్ర విజ్ఞానం పై అభిరుచి ,ఆసక్తి అనురక్తి కలిగించారు . ప్రయోగ శాలలో ఉన్న పరికరాలతో ప్రయోగాలు చేసి చూపిస్తూ వారితోనూ చేయిస్తూ గొప్ప స్పూర్తి కలిగించారు .ఆనాడు ఏమాత్రమూ శాస్త్ర ,సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు .కాని ఆసక్తికల అయ్యవారు అయ్యగారి రామమూర్తి అనేక విద్యుత్ పరికరాలను అందుబాటులో ఉన్న పదార్దాలనుపయోగించి తయారు చేసి అందరికీ ఆశ్చర్యం కలిగించారు .అనేక అధ్యయనాలు ,పరి శోధనలు చేసి బందరు లాంటి పట్టణం లో సైన్స్ పరికరాల ఉత్పత్తి చేసే కంపెనీ ఉంటె బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చారు .అప్పటికే పాఠశాలల డిప్యూటీ ఇన్ స్పెక్టర్ గా ఉన్న ఆయన దానికి 1926లో రాజీనామా చేసి బందరులోనే ‘’ఆంధ్రా సైంటిఫిక్ కంపెని ‘’స్థాపించారు .ఆంద్ర రాష్ట్రం లోనే ప్రప్రధమంగా సైంటిఫిక్ ఎక్విప్ మెంట్ కంపెనీ ‘’మచిలీ బందరు ‘’లో ఏర్పడింది అంటే ఆయన ముందు చూపు అర్ధమౌతోంది . కొద్ది స్థలం లో మాత్రమె రూపు దిద్దుకొన్న ఈ కంపెనీ తర్వాత సువిశాలమైన ప్రాంగణం లో అన్ని హంగులతో నిర్మితమై అందరి అవసరాలు తీర్చింది .ఇక్కడ తయారైన విద్యుత్ పరికాలకోసం విదేశాలనుండి కూడా ఆర్డర్స్ వచ్చేవి అంటే అంతటి డిమాండ్ ఉండేదన్నమాట .
క్రమంగా దీన్ని ప్రభుత్వం తీసుకొనగా , యుద్ధ పరికరాలకు కావలసిన యంత్ర సామగ్రిని కూడా సమ కూర్చే సమర్ధమైన సంస్థగా ఎదిగింది .సామాన్య సైన్స్ టీచర్ రామమూర్తిగారి దార్శనికత కు ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ అద్దం పడుతుంది ఫిజికల్ బాలన్స్ లు కెమికల్ బాలెన్స్ లు స్ప్రింగ్ బాలెన్స్ లు లెన్సులు మిర్రర్లు ,ఇంక్లైండ్ ప్లేన్లు బున్సెన్ బర్నర్స్ విద్యుత్ పరికరాలు ,కెమికల్స్ ,బ్యూరేట్స్ పిపెట్స్ క్లానికల్ ఫ్లాస్క్లు , రౌండ్ బాట్టండ్ ఫ్లాస్క్స్ శోధననాలికలు అనబడే అన్ని రకాల టెస్ట్ ట్యూబ్స్ వగైరా సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అంతా అన్ని స్కూల్స్ ,కాలేజీ వాళ్ళు ఇక్కడే కొనేవారు . ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ ని సందర్శించటానికి స్కూల్, కాలేజీ విద్యార్ధులు తండోప తండాలుగా వచ్చేవారు .తరవాత కొంతకాలం మూతపడినట్లు జ్ఞాపకం . అప్పుడే లోబెజవాడలో వివిధ పేర్లతో సైన్స్ ఎక్విప్ మెంట్ కంపెనీలు వచ్చాయి . కాంగ్రెస్ ఆఫీస్ దగ్గరున్న కంపెనీలో ఎక్కువగా కొనేవాళ్ళం .
రామమూర్తిగారు సైంటిఫిక్ కంపెనీతో ఆగలేదు. ఆయన ఆలోచనలను వివిధ విషయాలపై కేంద్రీకరించారు .బందరులోని చిలకలపూడిలో రసాయనాలు అంటే కెమికల్స్ తయారు చేసే ‘’నేషనల్ కెమికల్స్ ‘’ సంస్థ ను కూడా స్థాపించి నడిపారు .దీనితర్వాత బందరులో ‘’ఆంధ్రా గ్లాస్ ప్రాజెక్ట్ ‘’సంస్థను నెలకొల్పటానికి దీర్ఘకాల ప్రణాళిక సిద్ధం చేసి సూత్రప్రాయంగా ప్రారంభించారు . ఈ రెండుకంపెనీలు ప్రారంభ దశలో ఉండగానే దురదృష్ట వశాత్తు అయ్యగారి రామమూర్తిగారు అస్తమించారు .వీరి మృతితో అవి మూతపడ్డాయి .
రామమూర్తిగారి మేధస్సు అద్వితీయం ఎ.ప్పటికప్పుడు నూతన పరికరాలను తయారు చేయటం ఆయనకు హాబీ ,వ్యసనం .సముద్ర వాతావరణమున్న బందరులో ‘’సోడా యాష్ ఫాక్టరీ ‘’నిర్మించాల్సిన అవసరం ఉందని అన్ని వివరాలతో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ,తానొక్కడి వలన అదిసాధ్యంకాదని ,కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఏర్పాటు చేయాలని ఎంతో ఆశతో కేంద్రానికి పంపారు .అది బుట్ట దాఖలై ఆయనకు ,అందరికి నిరాశ మిగిల్చింది .బందరులో ఒకప్పుడు గొప్ప ఓడ రేవు ఉండేదని ఇక్కడినుంచే డక్కామజ్లిస్ మొదలైన సున్నితమైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని కనుక మళ్ళీ ఇక్కడ పోర్ట్ నిర్మించాలని నిర్మాణాత్మక సలహాలు విధి విధానాలు వ్రాత పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తే అదీ ప్రభుత్వానికి బధిర శంఖారావమే అయింది .అనేక మంది ముఖ్యమంత్రులు హడావిడిగా శంఖుస్థాపన చేయటం వారు పదవి నుంచి దిగాక పోర్ట్ ఎవరికీ పట్టని విషయమే అయింది .ఈ మద్య చంద్రబాబు కూడా పోర్ట్ కు శ్రీకారం చుట్టినా ,ఆయన పాలనకు స్వస్తి జరిగింది ,మళ్ళీ బందరు పోర్టు తంతు మామూలే అయింది .
ఆనాటి భారత ఉపరాస్ట్ర పతి డా సర్వేపల్లి రాదా కృష్ణ బందరు ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ కి 1953 జనవరి 4న జరిగిన రజతోత్సవాలకు హాజరై .శ్రీ అయ్యగారి రామమూర్తిగారి అవిరళ కృషిని అవిశ్రాంత పరిశోధన లకు ముగ్ధులై ప్రశంసల వర్షం కరిపి౦చి ఆ మహనీయుని సేవలను ప్రజల ముందు౦చి , ఆహూతులకు ఉత్తేజం కలిగించగా వారి హర్షధ్వానాలతో ప్రాంగణం మారు మ్రోగింది .అయ్యగారి రామమూర్తి అమర్ రహే .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-6-19-ఉయ్యూరు
—

