ఆధునిక ఆంద్ర శాస్త్ర రత్నాలు
42- కృష్ణా గోదావరి బేసిన్ లో చమురు ,సహజవాయు నిక్షేపాల ఉనికి తెలిపిన అనుపమ భూగర్భ శాస్త్ర వేత్త –శ్రీ వావిలాల వాసు దేవ శాస్త్రి
భూగర్భ శాస్త్ర లోతులు తరచిన శాస్త్రవేత్త శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి గారు 24-8-1926న కృష్ణాజిల్లా మచిలీపట్నం లో శ్రీ వావిలాల సీతారామ శాస్త్రి దంపతులకు జన్మించారు . బి ఎస్ సి ఆనర్స్ తర్వాత 1946లో ఏం ఎస్ సి చేసి ,కెనడా వెళ్లి ఆల్బెర్టా యూని వర్సిటి లో పోస్ట్ గ్రాడ్యుయేట్ రిసెర్చ్ ఫెలోగా ఉంటూ పరిశోధనలు చేశారు .
అస్సాం లోని దిగ్బోయిలో అస్సాం ఆయిల్ కంపెనీ లో అసిస్టెంట్ జియాలజిస్ట్ గా చేరి ,జియాలజిస్ట్ గా 1949లో పదోన్నతి పొందారు .అప్పర్ అస్సాం కు సుర్మా వాలీకి మధ్య మైక్రో ఫోర్మానిఫెరల్ అధ్యయనానికి నా౦దిపలికారు .అలాగే సిందు –బెలూచిస్తాన్ ప్రాంతాలలో మేసో జాయిక్ ప్లా౦టానిక్ ఫోరామిని ఫెర అధ్యయనం కూడా చేశారు . రాజస్థాన్ లోని జై సల్మేర్ లోనూ అధ్యయనం చేసి ‘’పాలో జిగ్రాఫికల్ మాప్ ‘’తయారు చేశారు .
జియలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లో జియాలజిస్ట్ గా పదవి పొంది ,పదేళ్ళు పని చేశారు .డెహ్రాడూన్ లో ఆయిల్ అండ్ నేచురల్ గాస్ కమిషన్ కు జనరల్ మేనేజర్ గా ఉన్నారు .తర్వాత శాస్త్రిగారు ‘’రిసోర్స్ అండ్ ట్రెయినింగ్ ఇన్ స్టి ట్యూట్ ఫర్ పెట్రోలియం ఎక్స్ ప్లోరేషన్ సంస్థ ‘’ను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు .ఈ సంస్థ తొలి అధిపతిగా ఉండి నాలుగు సంవత్సరాలు సేవలందిస్తూ పరిశోధనలను వేగవంతం చేశారు .O.N.G.C.లో ఉంటూనే సీనియర్ శాసన లిపి శాస్త్రజ్ఞులుగా (పాలయింటా లజిస్ట్ ) 1959-63మధ్యకాలం లో నాలుగేళ్ళు పరిశోధనలు చేశారు .ఇండియాలో ప్రకృతి వనరులు గుర్తించటం లో అద్భుత పరిశోధనా పాటవం ప్రదర్శించారు .బాంబే హై లో సున్నపు రాళ్ళు ఉన్నట్లు అంచనా వేసి ,నిజమని నిరూపించారు .మన రాష్ట్రం లో కృష్ణా -గోదావరీ పరివాహక ప్రాంతాలలో చమురు ,సహజ వాయువుల నిక్షేపాలు ఉన్నట్లు మొట్టమొదటగా గుర్తింఛి అంచనావేసింది వావిలాల వాసుదేవ శాస్త్రి గారే .పాలార్ బేసిన్ లో కూడా సహజవాయువు చమురు నిక్షేపాలకోసం అన్వేషణ జరిపారు .’’ ఆర్బిటో లైన్స్ ఆఫ్ బర్మా టిబెట్ అండ్ ఇండియా’’అనే ఆయన చేసిన అత్యుత్తమ పరిశోధనా ఫలితాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిఫరెన్స్ బుక్ గా 1957లో ముద్రించింది .భౌగోళిక ఆకృతీకరణ లేక అమరిక (జగ్రాఫికల్ కాన్ఫిగరేషన్ ),జియో టెక్నానిక్స్ లపై శాస్త్రిగారు చేసిన అధ్యయన ఫలితమే కృష్ణా –గోదావరి బేసిన్ లో చమురు ,ఖనిజవాయువు ఉనికి బయట పడింది .గోదావరి తీరం లో ఆన్ లైన్ ,ఆఫ్ షోర్లలో చమురు నిక్షాపాలున్నాయని ఆయన చెప్పింది రుజువైంది .ఉష్ణ కుండాల వలన ఆగ్నేయ భారతం లో అత్యధికంగా హైడ్రో దేర్మల్ గ్రేడిఎంట్ ఉందని ఆయన ఊహించి చెప్పినమాట యదార్ధమై౦దికూడా .
ఆసియా లోని ‘’ఆయిల్ అండ్ గాస్ మాప్ ‘’ను 1-5 మిలియన్ నిష్పత్తిలో తయారు చేసే బృందానికి నాయకత్వం వహించి ,తెలియ జేసిన దానిని 1978లో యు. యెన్ .ప్రచురించింది .దీన్ని 1985 ,1989లలో మళ్ళీ సవరించి ప్రచురించారు .ఈ బృందమే ‘’ సెడిమెంటరి బేసిన్ మాప్ ఆఫ్ ఇండియా ‘’కూడా తయారు చేసింది .లక్ష ద్వీపం లో ని పూగా వాలీ జియోధర్మల్ స్టీం రిజర్వాయర్ పై శాస్త్రిగారు డా వి ఎస్ కృష్ణస్వామి తో కలిసి తీవ్ర కృషి చేశారు . ఇండియాలోని ఈస్ట్ కోస్ట్ బేసిన్ లు ఐన మహానది, కృష్ణా, గోదావరి ,పాలార్, కావేరి బేసిన్ ల జియో టెక్నానిక్స్ ,మరియు పరిణామం లపై ధారావాహికం గా విలువైన పరిశోధన పత్రాలు రాసి ప్రచురించారు
తాను పని చేస్తున్న సంస్థలో నే సూపరింటే౦ డింట్ జియాలజిస్ట్ గా (1963-64)రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి జాయంట్ డైరెక్టర్ గా (1964-68)బాధ్యతలు నిర్వహించారు .వీరి తర్వాతనే వో యెన్ జి సి తమిళ గుత్తాధిపత్యం లోకి వెళ్ళింది .తెలుగువారు తెల్లమొహాలు వేసుకొని కూర్చు౦డి పోయారు .
వాసుదేవ శాస్త్రిగారు నేషనల్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ నుంచి ఫెలోషిప్ పొందారు .1968-75కాలం లో తొమ్మిదేళ్ళు ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ ప్లోరేషన్ సంస్థకు ముఖ్య అధిపతిగా ఉండి,విద్యార్ధులను పరిశోధనా రంగం లో నిష్ణాతులుగా తీర్చి దిద్దారు .బ్యాంకాక్ లో ఉన్న స్టాండర్డ్ వాక్యూం ఆయిల్ కంపెని కి ఐక్యరాజ్య సమితివిభాగం లో E.S.C.A.P.ఆధ్వర్యం లో 1975లో ప్రధాన సలహాదారు గా ఉంటూ భారత కీర్తి పతాకను ఘనంగా ఎగురవేశారు E.S.C.A.P.పధకం నిర్వహణకు ప్రత్యెక విధి నిర్వాహకులుగా ,ఆర్ధిక విషయాల అధిపతిగా ఉన్నారు . O.N.G.C.,ఇన్ సతి ట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోరేషన్ సంస్థల రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగాలకు డైరెక్టర్ అయి ,ఆంధ్రుల మేధా సంపత్తిని పరిశోధనా సామర్ధ్యాన్ని నిర్వహణ చాతుర్యాన్ని లోకానికి చాటి చూఫై అంతర్జాతీయ భూగర్భ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు .కేశవదేవ మాలవీయ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ పెట్రోలియం డైరెక్టర్ అయి, పదవీ విరమణ వరకు పని చేశారు .రిటైర్ మెంట్ కుముందు O.N.G.Cకి జనరల్ మేనేజర్
శాస్త్రిగారి శాస్త్ర సామర్ధ్యానికి తగిన పురస్కారాలు ఎన్నో లభించాయి .జియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ,సోసైటీఆఫ్ ఎర్త్ సైన్సెస్,ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ,పాలయింటోలాజికల్ సోసైటీ ఆఫ్ ఇండియా మొదలైన ప్రతిష్టాత్మక సంస్థలు గౌరవ సభ్యత్వం అందించి తమను తాము గౌరవి౦చు కొన్నాయి .1976 జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా స్వర్ణ పతకం ప్రదానం చేసి సన్మానించింది .
1976లో ఐక్యరాజ్య సమితివారి E.S.C.A.P ప్రచురించిన ‘’ఆయిల్ అండ్ నేచురల్ గాస్ ఆఫ్ ఇండియా ‘’పుస్తకం రెండవ , మూడవ ముద్రణలకు కీలక బాధ్యత వహించి మంచి గుర్తింపు పొందారు .ప్రముఖ ‘’Tectonic Map of India’’పత్రికకు 1970నుంచి కొంతకాలం సంపాదకులుగా వ్యవహరించి , పరిశోధకులకు ఉత్సాహ ప్రోత్సాహాలు కలిగించారు .
ఆయన భార్య శ్రీమతి కమల .వీరికి ఒక కొడుకు ఇద్దరు అమ్మాయిలు సంతానం .1997లోశాస్త్రిగారు 71వ ఏట వాసుదేవ లోకానికి చేరారు . సైన్స్ తప్ప వేరే విషయం ఏదీ శాస్త్రిగారు మాట్లాడే వారు కాదని ఆయన సన్నిహితులు చెప్పారు . O.N.G.C.,లో తనదైన సైంటిస్ట్ బృందాన్ని ప్రొఫెషనల్స్ ను ఏర్పాటు చేసుకొన్నారు .యు యెన్ కు పెట్రోలియం అండ్ జియో టెక్నో నిక్స్ ఆఫ్ ఏసియా కు కన్సల్టెంట్ గా ,యు .యెన్ . ఎకనామిక్స్ ఆఫీసర్ గా బాంకాక్ లో ఉన్నారు .మలేషియా లోని పెట్రోనాస్ కు అడ్వైజర్ . పెట్రోలియం దానికి సంబంధించిన మరియు పలు విద్యాలయాల సంస్థల బోర్డ్ లలోగౌరవస్థానం లో ఉన్నారు
ఇంతటి దిగ్దంత భూగర్భ శాస్త్ర వేత్త ‘’మన బందరు ‘’వారవటం మనకు గర్వకారణం .కానీ వారి గురించి ఈ నాటి తరానికి ఏమీ తెలియక పోవటం ఆశ్చర్యకరం .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారుకూడా ఎప్పుడూ శాస్త్రిగారి గురించి చెప్పిన జ్ఞాపకం నాకులేదు .బందరు వారికైనా తెలుసో లేదో ?బందరులో వారికి గుర్తింపుగా ఏదైనా ఉందో లేదో నాకు తెలియదు . తెలుగు వీకీపీడియాలోనూ వారి గురించి సమాచారం లేదు .బందరులో మరొక వావిలాల వాసుదేవ శాస్త్రిగారు ,అద్వైత పరబ్రహ్మ శాస్త్రిగారు గొప్ప ప్లీడర్లు అని విన్నాను .అక్కడి వావిలాల వారు విద్యావంతులు ,ఘన చరిత్ర ఉన్నవారే ..
. ఆధారం శ్రీ బి ఎస్ వేంకటాచల రచన ‘’OBITUARY’’ JOUR.GEOL.SOC.INDIA,YOL.5I. APRIL 1998
మరియు శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-7-19-ఉయ్యూరు

