ఆధునిక శాస్త్ర రత్నాలు – 41-ఆంద్ర చరిత్ర చతురానన –శ్రీ చిలుకూరి వీరభద్రరావు

ఆధునిక శాస్త్ర రత్నాలు –

41-ఆంద్ర చరిత్ర చతురానన –శ్రీ చిలుకూరి వీరభద్రరావు

17-10-1872న పశ్చిమ గోదావరిజిల్లా రేలంగిలో ఒక పేద  బ్రాహ్మణ కుటుంబం లో చిలుకూరి వీరరాజు దంపతులకు  శ్రీ చిలుకూరి వీరభద్రరావు జన్మించారు .సంస్కృత ఆంధ్రాలలో సాధికారత సాధించారు .దేశోపకారి ,విబుధ రంజని ,సత్యవాదిని ,ఆంద్ర కేసరి మొదలైన పత్రికలకు సారధ్యం వహించారు .

  1909లో మద్రాస్ వెళ్లి ,’’విజ్ఞాన చంద్రికా మండలి ‘’వారి గ్రంథ మాలలో ‘’ఆంధ్రుల చరిత్ర ‘’ను రెండుభాగాలుగా రచించి 1912లో వెలువరించారు .అప్పుడే రూపుదాలుస్తున్న ఆంధ్రోద్యమానికి ఊపిరులూదారు.’’ఇతిహాస తరంగిణి గ్రంథ మాల ‘’ను రాజమండ్రి లో స్థాపించి మొదటి ప్రచురణగా ‘’ఆంధ్రుల చరిత్ర -3 మూడవ భాగాన్ని’’1916లో  వెలువరించారు.కాకతీయ ఆంద్ర రాజుల చరిత్ర ,ఆంద్ర రాజుల చరిత్ర రాసి 1936లో ప్రచురించారు .నిశిత పరిశోధన నిక్కచ్చితనం ,అపరిమిత పరిజ్ఞానం నిష్కర్ష విశ్లేషణ  రావు గారి సొత్తు .అవే భావి తరాలకు మార్గ దర్శకాలయ్యాయి .

‘’పెరిస్తా ‘’అనే విదేశీ యాత్రికుడు ,చరిత్రకారుడు ‘’అళియ రామరాయలు ఒకప్పుడు  గోల్కొండ నవాబు కుతుబ్ షా వద్ద పని చేశాడని ,మరొక సుల్తాన్ ఆయన కోటపై దాడి చేస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోగా ,కుతుబ్ షా తరిమేశాడని ,అప్పుడు శ్రీ కృష్ణ దేవరాయలవద్ద ఉద్యోగం సంపాదించాడని,  ఈ విషయం తనకు ఒక అనామ కుడైన చరిత్రకారుడు చెబితే నమ్మి రాశాను ‘’అని రాశాడు .ఇది యదార్ధం కాదని వీరభద్రరావు గారు భావించారు .అళియరామరాయల వ్యక్తిత్వం ,ప్రవర్తన ,తల్లి కోట యుద్ధం లో ఆయన చూపిన ధైర్య సాహసాలు చూస్తె ఇదంతా కట్టుకధ గా భావించి ,లోతైన పరిశోధన చేసి అసలు సిసలైన చరిత్ర రాసి మహోపకారం చేశారు .

  •   చిలుకూరిరచనలు – రాజమహేంద్రపుర చరిత్రముఆంధ్రుల చరిత్రము ,జీర్ణకర్ణాట రాజ్యచరిత్రము,తిక్కన సోమయాజి,తిమ్మరుసు మంత్రి, శ్రీనాథ కవి, శివాజీ చరిత్ర, కర్ణ సామ్రాజ్యము, నవరసిక మనోల్లాసిని ,స్వయం సహాయము ,వరలక్ష్మీ విలాసము, హిందూ సంసారము, హిందూ గృహము, హస్య తరంగిణి ,సుమిత్ర,ఆళియరామరాయలు[5] ,నాయకురాలి దర్పము ,అశ్వత్థామ అచ్చి[6] ,అశోక చక్రవర్తి ధర్మశాసనములు.

రాజమండ్రిలో ‘’ఆంద్ర పరిశోధన సభ ‘’స్థాపనలో కీలకపాత్ర  పాత్ర చిలుకూరివారిదే .1928లో నంద్యాలపట్టణం లో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆధ్వర్యం లో జరిగిన ‘’ఆంద్ర మహాసభ ‘’లో శ్రీ చిలుకూరి వీరభద్ర రావు గారికి ‘’ఆంద్ర చరిత్ర చతురానన’’బిరుదు ప్రదానం చేసి సత్కరించారు .చిలుకూరివారు కొవ్వూరులో 17-5-1939న67 వ ఏట మరణించారు .

   సత్య ప్రకటనమే సత్పరిశోధనకు లక్షణం అని నమ్మిన నిర్బీకులు రావుగారు .తెలుగు వారిలోని కొన్ని జాతులు, వర్ణాలు గురించి ఆయన వెల్లడించిన నిర్ణయాలు కొందరు సంస్థానాదీశులకు కోపం తెప్పించాయి .దీన్ని గమనించిన వేదం వెంకట రాయ శాస్త్రి గారు ‘’  వీరభద్రరావుగారు ! ప్రమాదము సుమండీ ‘ యని మందలించారట కాని తను నమ్మిన మార్గం లోనే నడిచారు .మొగమాటం అనేది పూజ్యం .సత్య శోధనానికి ఆస్తి ,ఆరోగ్యం ఖర్చు చేసిన మహానుభావులు .ఆయన మిడికింది ‘’ఇస్కూలు ఫైనల్ ‘’మాత్రమె కాని’’చరిత్ర చతురాననులయ్యారు’’ ఒక సభలో కట్టమంచి రామలింగారెడ్డి ‘ వీరభద్రరావుగారి విమర్శనశక్తి చాల గొప్పది. దానిని వర్ణింప నా కర్హతలే ‘ దని చెప్పారు .

ఆంధ్రచరిత్రకారులలో వీరభద్రరావుగారు, లక్ష్మణరావుగారు, రామయ్యపంతులుగారు, వీరేశలింగముపంతులుగారు ఒకే శ్రేణికి చెందినవారని విజ్ఞుల భావన .చిలుకూరి వారి ‘’ఆంధ్రుల చరిత్ర ‘’ఆంధ్రులలో జాతీయోద్యమానికి దారి చూపింది .చిలుకూరి వారి చరిత్ర పరిశోధనా రంగం వలన ప్రాచీన ఆంద్ర సౌభాగ్యం ,ప్రాచీన సామ్రాజ్య వైభవం తెరలు తెంచుకొని వచ్చి మధుర నాట్యం చేసింది ‘’అని అన్నాడొక విశ్లేషణ శిఖామణి .ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ కుందూరి ఈశ్వర దత్ చిలుకూరివారి మేనల్లుడు .వీరేశలింగం గారి తర్వాత చరిత్రకారులకు చిలుకూరివారే మార్గ దర్శకులు అంటారు .

ఆధారం –తెలుగు వీకీపీడియా మరియు శ్రీ వాసవ్య రచన’’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’

  సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-7-19-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.