రక్త బీజుని రక్త సంబంధివా ?
ఒళ్ళంతా ముళ్ళు
ముఖమంతా ఉమ్మెత్త కాయ
పోలికగా పొడవైనవాడిముళ్ళ భీభత్స రూపం
పూర్వం ఎందరెందర్నో
మహామ్మారుల్ని చూశాం
వాటన్నిటికంటే వికృత రూపం నీది
తలచుకొంటేనే ఒళ్ళు జలదరిస్తోంది
పూర్వం రక్త బీజ రాక్షసుడి
అనుంగు సోదరివా, రక్తసంబంధివా?
వాడి రక్తం బిందువు నేలపై పడితే
అనంతంగా వాడి లాంటి వాళ్ళు పుట్టి
భీభత్సం చేసి భయపెట్టేవారట
అవతలి వాడికి జయించటం
అలవికాక ఉసూరు మనేవాడట
నీ పరిస్థితీ ఇలానే ఉంది కరోనా !
ఒక్కసారి శరీరం లోకి నువ్వు ప్రవేశిస్తే
లక్షాలాదిగా పెరిగిపోయి జీవన ప్రక్రియలు
స్థంభి౦ప జేసి ఉసురు
తీస్తావట సునాయాసంగా
ముట్టుకుంటే అంటుకు పోయి పెను ముప్పు
తెస్తున్నావు ప్రపంచ మానవాళికి
ఇప్పటికే విశ్వమంతా వ్యాపించి
నలభై వేలమందిని నీ కరాళ కోరలతో
కబళించేశావ్ ,భీభత్సం సృస్టించావ్.
మహా రాణిని అనుకొన్నావా
కిరీటం( కోరోనా )పెట్టుకోన్నావ్ ?
మహమ్మారికి అంతటి అహం వద్దు
ప్రతి కుక్కకూ ఏదో రోజు చావు తప్పదు
రక్త బీజుడినే వణికించి
అమ్మకాళికాదేవి ఉగ్రరూపం దాల్చి
వాడి ఒక్క రక్తపు బొట్టు నేలమీద పడ కుండా
రక్త బీజ పునరుత్పత్తి జరక్కుండా
అనంతమైన నాలుకను నేలంతా చాచి
నిలువునా వాడిని సంహరించి
లోకోపకారం చేసిందని మర్చిపోకు
ఇప్పుడు ప్రపంచమంతా అత్యంత జాగృతమైంది
మా అశక్తత ,అలసత్వం ,విచ్చలవిడితనం నీకు
ఆసరా అయి మా ప్రాణాలతో చెలగాటమాడావ్
ఇక నీ ఆటలు సాగనివ్వం
నీ సంహారానికి మందే అక్కరలేదు
శుచి ,శుభ్రత ,దూరం పాటించి నిన్ను
తరిమి తరిమి కొట్టి ఉపశమనం పొందుతాం
అందరం’’ మహ౦ కాళీ’’ స్వరూపులమై
మమ్మల్ని మేము సంరక్షి౦చు కొంటాం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-3-20-ఉయ్యూరు