మన సుకవి ఆత్రేయ -2
శ్రీమతి పద్మావతి గారిని ఆత్రేయ 1940 ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకొన్నాడు .కాని అంతకు ముందే పీకలలోతు ప్రేమలో పడ్డాడు వీణా పాణిని ‘’బాణం ‘’గారితో .కాని పెళ్లి చేసుకోలేకపోయాడు .ఇప్పుడు పెళ్లి అయిందికాని ప్రియురాల్ని మర్చి పోలేక పోతున్నాడు .ఈప్రేమ గాయమే ఆయన ప్రేమ పాటలకు, వీణ పాటలకు ప్రేరణగా నిలిచాయి .పిలిస్తే అలవోకగా పలికి బహుశా ఆయన కళ్ళ ముందు ఆమె ప్రత్యక్షమై బాణం గాయం కలిగిస్తుందేమో .ఆత్రేయ రచన అంతా రాత్రిళ్ళే చేస్తూ ‘’రాత్రేయ ‘’అనీ అనిపించుకొన్నాడు .ఆత్రేయ ముఖ్య శిష్యుడు జేకే భారవి రోజూ ‘’తెల్లారింది ఇక పడు కొందాం గురూ గారూ ‘’అనేవాడట .రాత్రేయ తో పాటు బూత్రేయ అనీ అనిపించుకోన్నాడని ముందే చెప్పుకొన్నాం .’’అబ్బా దెబ్బ తగిలిందా ?’’అనే పాటలో ‘’తగలరాని చోట తగిలింది ‘’అని రాస్తే సెన్సార్ అభ్యంతరం చెబితే ఆత్రేయనే పంపిస్తే ,వాళ్ళని ‘’తగల వలసిన చోటు ఎక్కడో చెప్పండి ?అని ఎదురు ప్రశ్నవేస్తే తెల్ల మొహతో బిత్తర పోయారు ‘’కత్తెర గాళ్ళు ‘’.
చత్వారం వచ్చినా ,కళ్ళజోడు వాడే వాడు కాదు ఆత్రేయ .రాత్రిళ్ళు చదవాల్సి వస్తే చిన్నక్షరాల్ని భూతద్దం లో చూసి చదివే వాడు .ఒకసారి ఒక నిర్మాత వచ్చి ‘’ఏమిటి భూతద్దం లో వెతుకుతున్నారు ?’’అని అడిగితె ‘’నా రచనలో బూతు ఎక్కడుందో వెతుకుతున్నాను ‘’అని జోక్ చేసిన జోడు, సరి జోడు లేని కవి ఆత్రేయ .ఆయన స్వయంగా చేత్తో ఏదీ రాయడు .చెబుతుంటే శిష్యులు రాయటమే .అ౦దుకే ఆత్రేయను సరదాగా ‘’డిక్టేటర్’’అనేవారు .విశ్వనాథ కూడా గొప్ప డిక్టేటర్ .ఆయన చెబుతుంటే తమ్ముడు వెంకటేశ్వర్లు గారు రాసేవారు .మోదుకూరి జాన్సన్ వచ్చి ‘’గురూజీ .నేను మీ దారిలోనే నడుస్తున్నాను. డబ్బిస్తే కాని రాయటం లేదు ‘’అన్నాడు ‘’పిచ్చోడా !నేను డబ్బిచ్చినా రాయను తెలీదా ‘’అన్నాడునవ్వు తూ .
మొదట్లో ఆత్రేయ జీవితం వడ్డించిన విస్తరి కాదు .ఒక రోజు పావలా దొరికితే దానితో ఎక్సర్ సైజ్ పుస్తకం కొని ,వీధి దీపం కింద కూర్చుని ‘’గౌతమబుద్ధ ‘’నాటకం రాశాడు .దానికి పబ్లిషర్ 50 రూపాయలిస్తే ,అదే పది వేలుగా భావించాడు .ఒక జత బట్టలు మాత్రమే ఉండేవి .నాటకాల తెరలు కట్టుకొని దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడు మహానుభావుడు .మద్రాస్ వచ్చిన కొత్తలో ఇంటింటికీ వెళ్లి సబ్బులు అమ్మేఉద్యోగం చేశాడు .హాస్యనటుడు రమణారెడ్డి పావలాయో బేడ నో ఇచ్చి టిఫిన్ చేయమనే వాడు .ఆతర్వాత సినిమా రచనలో లక్షలు సంపాదించాడు .ఐతే చివరి రోజుల్లో మళ్ళీ దరిద్రమే అనుభవించాల్సి వచ్చింది .మాటల రచయిత దివాకర బాబు తో ‘’నా కీర్తి ప్రతిస్టల్ని తాకట్టు పెట్టుకొనే వాడెవడైనా ఉంటే బాగుండు ‘’అని బాధ పడ్డాడు.ఈ విషయం తన ఆత్మకథలో రాసుకొన్నాడు కూడా . దీనిపై ఆయనే ‘’లక్షలార్జించి,ధనము నలక్ష్య పరచి ఖర్చు చేసితి స్వపర సుఖాల కొరకు –ప్రొద్దు గ్రు౦కెడు వయసున బొక్కసాన –లేదు చిల్లి గవ్వైన నన్నాదుకొనగ’’అని శ్రీనాథకవి సార్వ భౌము డిలాగా చేసిన తప్పులు తెలుసుకొని చెంప లేసుకొన్నాడు .అప్పటికే కాలం చాలా మించిపోయింది .
మే7న పుట్టిన రోజు జరుపుకొనే అలవాటున్న ఆత్రేయ ,తిది వార నక్షత్రాదులు చూసి మే21 న జరుపుకొంటున్నట్లు ప్రకటించాడు .సంఖ్యాశాస్త్రం మీద ,నాడీ జ్యోతిష్యం పైనా నమ్మకం ఎక్కువగా ఉండేది .
కే ఎస్ ప్రకాశరావు ఆత్రేయ ను తన దీక్ష సినిమాలో పాటల రచయితగా పరిచయం చేయటమే కాదు ,మాటల రచయితగానూ ఆసినిమాతోనేపరిచయం చేశాడు .ఈ సినిమాకు తాపీ ధర్మారావు గారితో కలిసి సంభాషణలు కూర్చాడు ఆత్రేయ .ఆత్రేయ సంభాషణలు రాసిన చివరి సినిమా ‘’లైలా –1989.డా చక్రవర్తి సినిమాలో ‘’మనసున మనసై బ్రతుకున బ్రతుకై ‘’పాట మనసు పాట కనుక ఆత్రేయ రాసిందని పొరబడుతుంటారు .ఆదిశ్రీ శ్రీ రాసిన పాట . మొత్తం మీద 2వేల సినిమా పాటలు ,200సినిమాలకు మాటలు రాసిన సవ్యసాచి ఆత్రేయ .
1989మే 5న ఆంద్ర సారస్వత విద్యాలయం ఆత్రేయకు ‘’గౌరవ డాక్టరేట్ ‘’ప్రదానం చేసింది .సతీ సావిత్రి సినిమా టైటిల్స్ లో ఆత్రేయను ‘’కవితా సుధానిధి ‘’అని సినీ డైరెక్టర్ పరిచయం చేశాడు .ఆత్రేయలాంటి రచయిత తమిళ౦ లో ‘’ కణ్ణదాసన్’’.అందుకే ఆత్రేయ ను ‘’ఆంధ్రా కణ్ణ డాసన్’’ అంటారు .ఇద్దరూ నాటకాలకు గొప్ప అవార్డులు పొందిన వాళ్ళే.ఆత్రేయను ‘’ఆంధ్రా ఇబ్సన్ ‘’అని కూడా అంటారు .
తెలుగు సినిమా స్క్రిప్ట్ కు స్వరూప స్వభావాలు అందించిన మొదటి రచయిత ఆత్రేయ .డైలాగ్స్ రాసే ముందు తెల్లకాగితం పై ‘’శ్రీ విఘ్నేశ్వరాయన మః’’అని రాసి, పేపరును నిలువుగా మధ్యలో మడిచి ఎడమవైపు రెడ్ ఇంకు తో యాక్షన్ పార్ట్ ,కుడివైపు బ్లూ ఇంకు తో సంభాషణలు రాసేవాడు .తన స్వంత సినిమా వాగ్దానం కుకూడా అందరూ షూటింగ్ కువచ్చి రెడీ గా ఉంటె ,అప్పుడు డైలాగులు రాయటం మొదలు పెట్టాడు .అక్కినేని మేమంతా ఎదురు చూస్తుంటే మీరు ఇప్పుడు మొదలు పెట్టారెంటి ?’’అని అడిగితె ‘’నా సినిమాకు నేను ముందే రాస్తే , నాకు పక్షపాతం ఉందనుకుంటారు నిర్మాతలు ‘’అన్నాడట ఇద్దరూ పగలబడి నవ్వేశారు .’ఎలెవెంత్ అవర్ లో నే ఎందుకు రాస్తారు””? అని ఎవరో అడిగితే ,ముందే రాస్తే ,ప్రతివాడూ కరెక్షన్ అంటూ షంటుతాడు అందుకు అన్నాడు..నిత్య జీవితం లో పుష్కలం గా హాస్యం పండించిన ఆత్రేయ ఏ సినిమాలోనూ హాస్య సన్నివేశాలలో హాస్య సంభాషణ లు రాయలేదు .ఆయన బదులు అప్పలాచార్య ,కొర్రపాటి గంగాధరరావు లాంటి వారితో నిర్మాతలు రాయించేవారు..’’కామెడీ మేకింగ్ లో కింగే కాని, డైలాగ్ లో డల్ ‘’అంటారు .జీవన తరంగాలు సినిమాలో బాగ్రౌండ్ సాంగ్ పెట్టాలని నిర్మాత ,డైరెక్టర్ అనుకోలేదు .అప్పుడు అక్కడికొచ్చిన ఆత్రేయ పెడితే బాగా పండుతుంది అని చెప్పి రాసి ,ఏ సన్నివేశం ఎక్కడ పెట్టాలో వివరంగా బోధించాడు .ఆసాంగ్ సూపర్ డూపర్ హిట్ సినిమాతోపాటు..’మనిషే మనిషికి బందిఖానా –భయపడి తెంచుకు పారిపొయినా-తెలియని పాశం వెంటబడీ ఋణం తీర్చుకోమంటుంది –నీ బుజం మార్చుకో మంటుంది ‘’దృశ్యాన్నీ ,సాహిత్యాన్ని గొప్పగా సమన్వయ౦ చేశాడు .దటీజ్ ఆత్రేయ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-20-ఉయ్యూరు