కిరాతార్జునీయం-.12
నవమ సర్గ -1
జలక్రీడల తర్వాత ప్రియుల పొందుకోసం అప్సరసలు ఆరాట పడగా ,మనం అడ్డం ఎందుకని సూర్యుడు పడమట వాలాడు .ఒక వైపు వంగిన సూరీడు ఆకాశం ముత్యాలహారం ధరించిందా అని పించింది .అంటే సూర్య నాయక్ తనవైపు వంగగా ,ఆకాశ నాయిక మరో వైపు పొరలగ ముత్యాలహారం కదలికగా కాంతి ఆకర్షింప బడిందని భావన .సూర్యుడు దాహంతో కిరణాలనే చేతులతో పద్మం లోని మధువును అతిగా తాగగా యెర్రని దేహం తో నేల వాలాడు .అతిగా మద్యం తాగినవాడు మత్తులో ఎరుపెక్కి నేలకూలినట్లు సూర్యుడున్నాడని భావం –‘’అంశు పాణి భి రతీవ పిపాసుహ్ –పద్మజం మధ భ్రుశం రస౦ యిత్వా –క్షీబతా మివ గతః క్షితి మేష్య౦ –ల్లోహితం వపురువాహ పతంగః ‘’.ఎర్రబడి అస్తమిస్తున్న సూర్యుడు అందరికీ ఆనందం పంచాడు .భూమి వేడి తగ్గింది . ఆవేడి చక్రవాకాల హృదయాలలో ప్రవేశించి౦ది .చక్రవాకాలు రాత్రి వేళ చూడలేవు. అందుకని తమ సహచరులను చూడ లేక పోతామేమో అనే విరహ బాధ వాటి మనస్సులో చోటు చేసుకొన్నది అని భావం .సగం అస్తమించిన సూర్యుడి కిరణ తేజస్సు తూర్పు వెళ్ళలేక ,పడమటి సూర్యునీ ఆశ్రయించలేక తేజో విహీనమైంది .సేవించిన యజమాని మధ్యలో వదిలేస్తే సేవకుని పని రెండిటికీ చెడిన రేవడి లాగా అవుతుంది కదా –‘’ముక్తమాల లఘు రుజ్ఘితపూర్వహ్-పశ్చిమే నభసి సంభ్రుత సాంద్రహ్ –సామి మజ్జతి రవౌ న విరేజే –భిన్న జిహ్మ ఇవ రశ్మి సమూహః ‘’.సూర్యకాంతి కుంకుమ లాఎర్రనై మేడలోని కిటికీల గుండా ప్రసరించగా ,అప్సరసలు ప్రియుడు పంపిన దూతికలు సాయం అలంకారాలకు తొందర పెడుతున్నాయా అన్నట్లు ఆదరంగా చూశారు .సూర్యుడు పై శిఖరాలలోని చెట్లను యెర్రని కిరణాలతో ఆధారంగా పట్టుకొని ,పడమటి కొండలోని దట్టమైన అడవిలోకో ,సముద్రం లోకో ,భూమి లోకో వెళ్ళాడు .తర్వాత గమన వేగం పెరగటం తో ఎక్కడికి వెళ్లిందీ గుర్తించలేక పోయారు .-‘’’’అగ్ర సానుషు నితాంత పిశంగై –ర్భూరుహా న్మ్రుదుకరైవ లంబ్య-అస్తశైల గహనం ను వివస్వా –నావివేశ జలదిం ను మహీం ను ‘’.ఇళ్ళకు చేరుతూ పక్షులు కిలకిలారావం చేస్తున్నాయి. సంధ్యా సమయం దాటటం తో ఎరుపు దనం తగ్గింది .సంధ్య సూర్యోదయాత్పూర్వ పరిస్థితి పొందింది .అంటే చీకట్లు క్రమంగా ఆవరిస్తున్నాయని భావం .పైన మేఘాల వరుస ,కింద సంధ్యారాగం తో పడమటి ఆకాశం తరంగాలతో అలంకరించబడిన పగడ కాంతులతో అందంగా ఉన్న సముద్ర శోభ పొందింది –‘’ఆస్థితః స్థగిత వారిద పంక్త్యా-సంధ్యయా గగన పశ్చిమ భాగః –సోర్మి విద్రుమ వితాన విభాసా –రంజితస్య జలధేహ్ శ్రియ మూహే ‘’
దోసిలి వొగ్గి ,తలవంచి ఏకాగ్రత తో ఉపాసించే జనాన్ని వదిలి ,వారి ప్రేమను కాదని ,సంధ్య మరో దారిలో పోవటం చాంచల్యం తో దుర్జన మైత్రిని అనుకరించింది .సంధ్యా వందనాది క్రియలతో ప్రేమించే జనాన్ని వదిలి ,సంధ్యాసమయం దాటి పోయిందని భావన –‘’ప్రాంజలా వపి జనే నతమూర్ధ్ని –సంధ్యయాను విదధే విరమంత్యా –చాపలేన సుజనేతర మైత్రీ ‘’.ఉదయపు ఎండకు ఎక్కడో దాక్కున్న చీకటి ఎండ లేకపోవటం తో పల్లాల నుండి క్రమంగా సమతలం చేరి ఆక్రమించింది .-‘’ఔషతాప భయాదప లీనం –వాసరచ్ఛవివిరామ పటీయః –స౦ నిపత్య శనకైరివ నిమ్నా –దంధకార ముద వాప సామాని ‘’.చీకటి బాగా వ్యాపించటం తో అన్నీ ఒక చోటనే చేరినట్లుంది .అంటే తారతమ్యాలు తెలీటం లేదు .చీకటి అన్నీ తనలో దాచేసుకొంది అని భావం –‘’ఏకతామివ గతస్య వివేకః –కస్య చిన్న మహతో ప్యుపలేభే –భాస్వతా నిదధిరే భువనానా –మాత్మనీవ పతికేన విశేషాహ్’’.చక్రవాకాలలో వియోగం పెరిగింది దైవ నిర్ణయానికి అడ్డు లేదుకదా .రాత్రిళ్ళు కళ్ళు కనిపించవు కనుక దైవాజ్ఞగా విరహం అనుభవిస్తున్నాయి .తన ప్రియు రాలితో మాట్లాడ గలుగుతోందే కాని చూడలేక,తాక లేక పోతోంది ఈ దుర్దశను చూసి పద్మ నాళంముడుచుకున్న ముఖ పద్మాన్ని కిందికి వాల్చింది .ఇతరుల దుఃఖ వియోగ బాధ చూసి స్త్రీలు ఉదాసీను లౌతారు కదా –‘’యచ్ఛతిప్రతి ముఖం దయితాయై-వాచమంతిక గతేపి శకుంతౌ-నీయతే స్మ సతి ముజ్గ్హిత హర్షం –పంకజం ముఖ మివా౦బురు హిణ్యా ‘’
చీకటి దట్టంగా వ్యాపించి పర్వతాలకు నలుపు రంగు పూసిందా,ఆకాశం భూమిపైకి వంగిందా,నల్లటి దుప్పటి కప్పిందా,ఎత్తు ,పల్లాల భూమి చదునైనదా,దిక్కులే లేకుండా పోయాయా అన్నట్లు చీకటి ముసిరి గుర్తించకుండా చేసింది –‘’రంజితాను వివిధా స్తరు శైలా –నామితం ను గగనం స్థగితం ను-పూరితా ను విష మేఘ ధరిత్రీ –సంహతా ను కకుభ స్తిమి రేణ’’.కాంతి పద్మాలను వదిలి నక్షత్రాలతో ప్రకాశించే ఆకాశం చేరింది .ఆపద లేకుండా ఉండటానికే ప్రతి వాడూ ప్రయత్నిస్తాడు కదా –‘’రాత్రి రాగ మలినాని వికాసం –పంకజాని రహయంతి విహాయః –స్పష్ట తార మియాయ నభఃశ్రీహ్-ర్వస్తు మిచ్ఛతినిరాపది సర్వః ‘’.
తూర్పున చంద్రోయమై దాని కాంతి మొగలి పూ కేసరకాంతి లా ఉంది .కర్పూరపు పొడి పిడికిటితో చల్లినట్లు అంతటా వ్యాపించింది –‘’వ్యానశే శశ ధరేణ విముక్తః –కేతకీ కుసుమ కేసర పాండుహ్-చూర్ణ ముష్టి రివ లంభిత కాంతి –ర్వాసవస్య దిశా మంశు సమూహః ‘’.తూర్పు అనే నాయిక చంద్ర నాయకుడు సమీపించటం తో చీకటి ముఖం దుఖం వదిలేసి నవ్వులాంటి కిరణాలతో ఉజ్వలంగా ప్రకాశించింది .అంటే చీకటిని దూరం చేస్తూ చంద్రోదయం అయిందని అర్ధం .ఉదయగిరి నుంచి చంద్ర కిరణ సమూహం నల్లకలువ కాంతి గల ఆకాశం లోకి వ్యాపించింది .ఆకాంతి ఆకాశం లో,సముద్రం లో చేరి తెల్లని గంగానది నీరు మరింత స్వచ్చంగా ప్రకాశించింది .-‘’నీల నీరజ నిభే హిమ గౌరం –శైల రుద్ధ వపుషః సిత రశ్మేహ్-ఖే రరాజ నిపతత్కరజాలం –వారి ధేహ్ పయసి గా౦గమివామ్భః ‘’.ఆకాశ అంధకారాన్ని చంద్రుడు ఉదయ కిరణాలతో ముందుకు తోస్తూ ,శివుడు నల్లని గజ చర్మాన్ని తీసి ముందుకు తోసినట్లుగా భాసి౦చాడు.చీకటి గజ చర్మం,చంద్రుడు సాక్షాత్తు శివుడు అనిపించారని భావం –‘’ద్యా౦ నిరుంద దతి నీలఘ నాభం –ధ్వాంత ముద్యత కరేణ పురస్తాత్ –క్షిప్య మాణ మసితేతర భాసా –శంభు నేవ కరి చర్మ చ కాసే ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-11-20-ఉయ్యూరు