కిరాతార్జునీయం-.24
త్రయోదశ సర్గ -1
అర్జునుడు దగ్గరకొస్తున్న సూకరాన్ని చూశాడు .అది చీల్చటానికి వీల్లేని పర్వతంలా ,రెండు కోరలతో భయంకరం గా ఉంది .కోపం తో నిక్క బొడుచుకున్న జడలతో విజయమే ప్రధానంగా మిగతా వ్యవహారాలూ మాని వస్తున్న పందిని అర్జునుడు చూసి ,అనమాని౦చగా, మనసులో అనేక ఊహలు తోచాయి .అది ముట్టెతో బలిసిన చెట్లు కూల్చగలదు .భుజాలతో రుద్దుతూ పర్వతాల రాళ్ళను దొర్లి౦చ గలదు .ఒంటిగా వస్తూ నన్ను యుద్ధానికి పిలుస్తు నావైపుకే వస్తున్నట్లుంది .నా తపో ప్రభావంతో క్రూర జంతువులు కూడా హి౦సమాని సహజీవనం చేస్తున్నాయి .ఇది భిన్నం గా ప్రవర్తిస్తోంది .ఇది మాయేమో?అని సందేహించాడు .పూర్వ జన్మ లో శత్రుత్వం దానిలో పోయినట్లు లేదు .విరోధి మృగాలు దగ్గరగా తిరుగుతున్నా ,వాటిని వదిలేసి ,నావైపే రావటం నా అనుమానాన్ని బలపరుస్తోంది .ఇది వరాహం కాదు .నా ప్రాణాలు హరించే ఎవడో అయి ఉంటాడు .మనిషి ప్రసన్నంగా ఉంటే ,హితైషిగా ,కలుషితమైతే శత్రువుగా సూచిస్తుంది .నా మనసు కలుషితం చేసింది కనుక ఇది నన్ను చంపటానికి వచ్చే శత్రువు అవటం ఖాయం –‘’న మృగః ఖలు కో ప్యయం జిఘాంసుః-స్థలతి హ్యత్ర తథా భ్రుశం మనోమే –విమలం కలుషీ భవచ్చ చేతః –కథ యత్యేవహితైషిణం రిపుం వా ‘’.అయినా నేను మునిని .ఎవరికీ అపకారం చేసే వాడిని కాను .భయమెందుకు ?అని అభిమానం కలిగి ఉండటం మంచిది కాదు ఇతరుల వృద్ధి ని ఓర్వలేని వారు ఏ ధర్మం, నీతి,పాటిస్తారు ?కనుక ఇది శత్రువుల కుట్ర కావచ్చు .-పర వృద్ధి షుబద్ధ మత్సరాణాం-కిమివ హ్యస్తి దురాత్మనా మనులంఘ్యం ‘’.ఆ పంది దానవుడో రాక్షసుడో అయి ఉంటుంది.మామూలు అడవి జంతువులకంటే మహా బలిష్టంగా ఉంది .ఈ ప్రాంతాన్ని ఆక్రమించటానికి మాయతో వేట వాతావరణం కల్పిస్తోంది .దీనికి అడవి మృగాలు భయం తో పారిపోతున్నాయి .దుర్యోధనుడు చేసిన సత్కారాలు పొంది ,వాడికి మేలు చేయాలని ,ఇక్కడి జంతువుల్ని కలవర పరుస్తూ ,ఈ పంది రూపం పొంది ఉండచ్చు –‘’క్షుభితం వన గోచరాభి యోగాత్ –గణమాశిశ్రియ దాకులం తిరశ్చా౦ ‘’.
ఒక వేళ ఖాండవ దహనం లో బంధువులంతా కాలిపోగా తక్షకుని కొడుకు అశ్వ సేనుడనే నాగరాజు నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి వస్తున్నాడా ?లేక అన్నగారు భీమ సేనుని కోపానికి గురైనవాడెవడైనా వస్తున్నాడా ?ఏమైనా ఈ బలిసిన పంది నన్ను చంపటానికి వచ్చేదే అనుమానం లేదు .కనుక దీన్నితప్పక చంపాల్సిందే .జ్ఞానులు శత్రు సంహారం గొప్ప లాభం అంటారు –‘’పరమం లాభ మరాతిభంగమాహుః’’.నేను తపస్సు చేసే ఆశ్రమం లో చిద్రాన్వేషకులైన శత్రువులు ప్రవేశించ కుండా తపస్సు చేయమని ,వ్యాసమహర్షి బోధించారు .కనుక ఈ పందిని మట్టుపెట్టాల్సిందే .దుష్ట శిక్షణ లో హింస దోషం కాదు –‘’కురుతాతతపామ్య మార్గ దాయీ –విజయా యేత్య ల మన్వశాన్ము నిర్మాం-బాలి నశ్చవధా దృతేస్యశక్యం –వ్రత సంరక్షణ మన్యథా న కర్తుం..గాండీవం ధరించి శత్రు చేదనం చేయగల వాడి బాణాన్ని మంత్రి సహాయం లాగా అందుకొన్నాడు ధనుంజయుడు .-‘’సచివః శుద్ధ ఇవా దదే చ బాణః’’.పూజ్యుడు ,సత్పరాయణుడు ,ఔదార్యాది గుణాలున్న మంచి స్నేహితుడు ధనబలం లేని సమయం లో ఎలా అనుకూలంగా నడుచు కొంటాడో ,అట్లా సారవంతం బలం కలిగిన గాండీవం తపస్సుతో క్షీణించిన క్రీడి అల్లె త్రాడు లాగి బాణం సంధించగా నమ్రభావం పొందింది –‘’అనుభావవతా గురు స్థిరత్వా –దవి సంవాదిధనుర్ధనంజయేన-స్వబల వ్యసనే పి పీడ్య మానం –గుణవన్మిత్రమివానతింప్రపేదే’’..అర్జునుడు సంధించిన అల్లెత్రాడుధ్వనికి ఏర్పడిన భీకర ధ్వని పర్వతగుహల్లో వ్యాపించి ,అతడు పాదం మోపటం తో పర్వతం స్థిరత్వం కోల్పోయింది .అదే సమయం లో శివుడు ధనుస్సు యొక్క అల్లెత్రాడు లాగిన ధ్వని త్రిపురాలను ధ్వంసం చేసినప్పటి ధ్వనిలా భయంకరాకారం తో అర్జునుడిని చూశాడు .శత్రు సంహారం కోసం ఒకే సారి సంధించిన శివార్జునుల బాణాల మధ్య వరాహం చేరింది .ఈ ఇద్దరి మధ్యా ఆ పంది చేరటం తో ఈశ్వర పినాక ధనువు నుంచి బాణం మేఘంతో కూడిన మెరుపు ,పిడుగు లాగా వెలువడి ఏనుగులకు భయం కలిగించింది –‘’అథ దీపిత వారి వాహ వర్త్మా-రవ విత్రాసిత వారణాదవార్యః –నిపపాత జవాదిషుః పినాకా –న్మహతోభ్రాదివవైద్యుతః కృశానుః’’.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-20-ఉయ్యూరు