కిరాతార్జునీయం-.30
చతుర్దశ సర్గ -4(చివరి భాగం )
‘’అర్జున తపస్వి శాంతం మొదలైన గుణాలతో వశీకృతమైన దేవతలుఅతడికి భయపడి , మనకు కనిపించకుండా మనపై బాణాలు వేస్తున్నారా ?లేకపోతే సముద్రతరంగాల్లా యెడ తెరిపి లేకుండా బాణాలు వచ్చి ఎలా మన మీద పడుతున్నాయి ?’’అని ఆశ్చర్యపోతోంది శివ సైన్యం –‘’హృతా గుణైరస్య భయేన వా మునే –స్తిరోహితాః స్విత్ప్రహరంతిదేవతాః –కథంన్వమీ సంతతస్య సాయకా –భవత్యనేకే జలధేరివోర్మయః ‘’.ఈయన యుద్ధం లో జయించి విరమిస్తే ,చరాచర లోకాలకు మేలు జరుగుతుంది ‘’అంటూ బాణం దెబ్బలకు భయపడుతున్న సేన నీరుకారి అంటోంది .చివరికి చేతు లేత్తేసి నిస్తేజమై బదులు చెప్పలేక శాంతి మార్గమే మేలు అనే ఆలోచనలోకి వచ్చారు .పురుషార్ధం కూడా బలీయమైన దైవం ముందు వ్యర్ధమౌతుంది –‘’బలీయసా తద్విధి నేవ పౌరుషం –బలం నిరస్తం న రరాజ జిష్ణునా’’.అర్జున బాణ క్షత గాత్రులైన శివ సైనికులు సూర్య కిరణాలతో శోషింప బడిన నీరు మండలాకారం గా తిరిగినట్లు నిశ్చేష్టులై మండలాకారం లో గుమి కూడారు .-‘’రవి కర గ్లపితైరివ వారిభిః-శివ బలైః పరిమ౦డలతా దధే’’.అర్జున బాణాలు బ్రహ్మాండాన్నికప్పేయగా ,మాటిమాటికీ ధనుస్ఫాలనం చేయటం తో భయపడ్డవిజయ లక్ష్మి అతి కష్టంగా శివ సేనపై ఉన్న అనురాగాన్ని వదిలించుకోవటానికి సిద్ధపడింది .అంటే కిరాత సేన పరాజయాన్ని ఒప్పుకొన్నదని భావం – ‘’’ప్రవితత శరజాల చ్ఛన్న విశ్వాంత రాలే-విధువతి ధనురావిర్మండలం పాండు సూనౌ –కథమాపి జయ లక్ష్మీ ర్భీత భీతా విహాతుం –విషమనయన సేనా పక్ష పాతం విషేహే’’.
పంచదశ సర్గ -1
వ్యాకులత చెందిన జీవజాలం ఊపిరి పీల్చుకోగా ,శివ సేన ఆయుధాలు అక్కడే పారేసి తలో దిక్కుకూ పారిపోయారు .ప్రమథ గణం శివుడిని చూడకుండానే పారిపోయింది సంకటసమయం లో మనసు ఏదీ ఆలొచి౦చ లెదు కదా –‘’అపశ్యద్భిరి వేశానం రణన్నివవృతే గణైః-ముహ్యత్యేవ హాయ్ కృచ్ఛ్రేషుసంభ్రమ జ్వలితం మనః ‘’. జయించే ఆశవదిలి పారిపోతున్న కిరాత సేనపై కపిధ్వజ విజయునికి దయ కలిగింది .అనేక ప్రయత్న విధానాల్లో శత్రువును వశం చేసుకొన్న మహాత్ములకు వారి విషయం లో దయకలగటంగొప్ప వారి మాహాత్మ్యాన్ని చాటుతుంది –‘’వ్యక్తిమాయాతి మహతాంమాహాత్మ్య మను కంపయా ‘’ఖడ్గ బాణ ధనుస్సులు కలిగి వాహనం తో, వాహనం లేకుండానూ శత్రు నిర్జనం చేసి స్వర్ణ గజాదులు స్వాధీనం చేసుకొన్నఅందమైన భాగ్యశాలి ,శివ పుత్రుడు, దేవ సేనాని అయిన కుమారస్వామినే యుద్ధం లో పరి గెత్తించ గల ధీశాలి అర్జునుడు యుద్ధ భూమిలో విచిత్ర శోభ పొందాడు .-‘’స సాసిః సాసుసూః సాసోయేయా యేయా యయాయః-లలౌ లీలాం లలో లోలః శశీ శశి శుశీః శశ౦ ‘’ఇది చిత్ర కవిత్వ శ్లోకం .సాసిః అంటే ఖడ్గమున్నవాడు,సాసుసూః అంటే ప్రాణాలు హరించే బాణం ఉన్నవాడు ,సాసః అంటే ధనుస్సున్నవాడు ,యేయ అయేయ అయయ,అయయః అంటే వాహనం తో నూ ,అది లేకున్నా ,శత్రువును చేరేవారి వాహనాలు స్వాధీనం చేసుకొనే వాడు ,లలః అంటే అందమైన వాడు ,అలోలః అంటే చాంచల్యం లేనివాడు ,శశి ఈశ ,శిశు శీః అంటే చంద్ర ధరుని కుమారుడైన దేవసేనానిని పరి గెత్తించిన వాడు ,శశన్ అంటే పిక్కబలం చూపించగలవాడు ,లీలా అంటే శోభను లలౌ అంటే ధరించాడు అని అర్ధం .శబ్దం, ఏకాక్షర నిఘంటువు వ్యాకరణాలపై పూర్తి అధికారం ఉన్న కవి మాత్రమే రాయ గలిగిన శ్లోకాలివి .
భయంతో పరిగెత్తే శివ సైన్యాన్ని నెమ్మదిగా అనుసరించి వెళ్ళాడు .బాధలో ఉన్నవారిని మరీ బాధపెట్ట టానికి మహానుభావులు ఇష్ట పడరు.-‘’నాతిపీడ యితుం భగ్నా నిచ్ఛ౦తి హిమహౌజసః ‘’.పారిపోయి వస్తున్న తమ సైన్యాన్ని చూసి, వాళ్లకు ఎదురుగా ముందుభాగాన ఉండికార్తికేయుడు ఖిన్నులైన కిరాతులతో ఇలా అన్నాడు –‘’అథాగ్రే హసతా సాచి స్థితేన స్థిర కీర్తినా –సేనాన్యేతే జగదిరే కించి దాయస్త చేతసా ‘’ఈ శ్లోకాన్ని నిర్యోష్ఠ్యం’’అంటారు.అంటే పెదవులు కలవకుండా పలికే అక్షరాలతో కూర్చింది .ఇదీచిత్రకవిత్వమే .కుమారస్వామి వాళ్ళతో ‘’యుద్ధం ,ఆట మీకు సమానమే .రాక్షసులని జయించి కీర్తిపొందారు సామాన్యుల్లా పారిపోతే మీ కీర్తికి మచ్చ .మీలాటి మహాశూరులకు ఇది తగని పని .-క్షతంక్షుణ్ణాసుర గణై రగణైరివ కిం యశః’’ఈపాదం యమకం తో రాయబడింది .’’సూర్యకిరణాలు సోకి మీ ఖడ్గాలు మిమ్మల్ని పరిహాసం చేస్తున్నాయా?అంటే పారిపోయేవారికి కత్తులతో పనేమిటి అని భావం .ఆడవి మృగాలు తిరిగే చోట తలదాచుకోవటానికి పరిగెత్తే మీ దుఖం ఎలా శాంతిస్తుందో అని నా విచారం ‘’అన్నాడు –‘’వనే వనే వన సదా౦ ,మార్గం ,మార్గ ముపేయుషా౦-బాణై ర్బాణైఃసమాసక్తం శ౦కేశంకే న శామ్యతి ‘’ఈ శ్లోకం లోనూ యమక శోభ ఉన్నది .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-12-20-ఉయ్యూరు