కిరాతార్జునీయం-.31
15వ సర్గ – 2
కుమార స్వామి శివ సేన పారిపోవటాన్ని చూసి మందలిస్తూ’’ఎంతోకీర్తి గడించిన మీరు ఏ ఆపద వచ్చి మీద పడిందని పారిపోయి వచ్చారు ?మీపలాయనం పాపం తప్ప మరేమీ కాదు .ఆ తాపసి దానవుడో ,నాగరాజో ,రాక్షసుడో కాదు .జయించ వీలుఉన్న ఉత్సాహ పురుషుడు .రజోగుణమున్న కేవల మానవ మాత్రుడు.-‘’‘నా సురో యమ న వా నాగో- ధర సంస్థోన రాక్షసః –నా సుఖో యం నవాభాగో –ధరణిస్థోహి రాజసః ‘’.ఈ శ్లోకం ‘’గోమూత్రికా బంధం ‘’తో ఉంది .16అరలు ఉండే రేఖలకు పై భాగం లో ముందుభాగం ,కిందిభాగం చివరి భాగం కలిపితే శ్లోకం పూర్తవుతుంది .’’ఈ ముని దయతో నెమ్మదిగా బాణ వదులుతూ ,మిమ్మల్ని దారితప్పిన పశువుల్ని రైతు కర్రతో అదిలించినట్లు అదిలిస్తున్నాడు .అంతే.-‘’ప్రణుదత్యాగ తావజ్ఞం జఘనేషు పశూనివ ‘’.నీచులచే పరాజితుడైనవాడు మనిషే కాదు నీచుల్ని ఓడించినవాడూ మనిషి కాడు.మీరు నీచునిచే ఓడి భయంతో పరిగెత్తుతున్నారు .మిమ్మల్ని ఏమనాలో మరి ?స్వామి పరాజితుడు కాకపొతే ఆ సైన్యం పరాజితం కాదు .బాధ పడే వారిని ఇంకా బాధ పెట్టె వాడు నిర్దోషీ కాడు,నీచుడుకూడా –‘’న నోన నున్నో నున్నోనో నానా నా నాననా నను –నన్నో నున్నో ననున్నేనో నానేనా నున్న నున్ననుత్ ‘’.ఒకే ఒక నకారంతో రాసిన ఏకాక్షర శ్లోకం .అర్ధం తెలుసుకొందాం-నానాననా =అనేక ముఖాలున్న సైనికులారా ,ఊన నున్నః =నీచునితో ఓడిన ,నానా=మనిషికాదు,నున్నోనః నా అనా = నీచుడిని ఓడించినవాడు మనిషికాదు ,న నున్నేనః =న నున్న ఇనః –ఎవరి రాజు పరాజితుడు కాడో,నున్నః =పరాజితుడు ,అనున్నః =పరాజితుడు కాని వాడు ,నున్న నున్న నుత్ =బాధితుడిని పీడించేవాడు ,నా అనేనాః న =మనిషి నిర్దోషికాడు.
‘’ మొదట్లో మంచి గుణాలుకలిగి తర్వాత గుణ హీనుడైతే వాడి కంటే గుణం లేని వాడు గొప్పవాడు .మణి లేని అలంకారం సహజంగా మంచిదే మణిజారిపోయిన నగ మంచిదికాదు విలువలేనిదే .అంటే పారిపోవట కంటే,అసలు యుద్ధానికి వెళ్లకపోవటమే మంచిది అని భావం –‘’ప్రకృత్యా హ్యామణిః శ్రేయాన్నలంకార శ్చ్యుతోపలః’’.అతడి వద్ద వేగంగా వెళ్ళే రథాలు ,మంచి గుర్రాలు దేవ గజాలు , భయపడని పదాతి దళాలు లేవు కనుక భయపడాల్సిన పని లేదు .ఇప్పుడు మన శత్రువు పౌరుషం లేక ,సూర్యుడిచే ఎండించబడిన మడుగులా ఉన్నాడు .అందులో దాటగల బురద ఉండగా ,మీకు రాకూడని అపకీర్తి వచ్చింది –‘’హ్రదైరివార్క నిష్పీతైః ప్రాప్తః పంకోదురుత్తరః ‘’.వెదురు తుమ్మలు ముళ్ళచెట్లతో భీకరంగా ఉండే వనాన్ని వదిలేసి,ఏ దిక్కులు విదిక్కులు జయించటానికి మీరు వెడుతున్నారు ?-‘’వేత్ర శాకకుజే శైలే లేశైజేకుక శాత్రవే –యాత కిం విదితోజేతుం తు౦జేశో దివి కి౦తయా’’ఈ శ్లోకం లో రెండు పాదాలు అనులోమ ,ప్రతిలోమ పద్దతిగా రాయబడింది .ముందునుంచి చివరిదాకా ,చివరుంచి ము౦దాకా ఒకటే రకంగా ఉంటుంది .చదివి చూస్తే తెలుస్తుంది .మనస్వామి శివుడు నపుంసకత్వం పొంది ,శత్రువుకు వీపు చూపి పారి వచ్చిన మిమ్మల్ని పతివ్రతా ధర్మాన్ని వదిలేసిన భార్య లనులాగా ,తన మహిమతో మీ తప్పుల్ని కప్పిపుచ్చుతాడు భయం అక్కర్లేదు –‘’అయం వః క్లైబ్య మాపన్నాన్ దృస్ట పృష్టానరాతినా –ఇచ్ఛతీశశ్చుతాచారాన్ దారానివ నిగోపితుం’’.భయంకర శత్రువును భయపెట్టే మీరు సమర్ధులు శత్రువు విషయం లో మీరు క్రూరులు .ప్రభుభక్తి ఉన్న భక్తులు రక్షకులు .సదాచారులు .వక్తలూ శరణాగత రక్షకులు మీ పరి శుద్ధి అందరికీ తెలుసు –‘’నను హో మథనా రాఘో,ఘోరా నాథ మహో నున –తయదాత వదా హీమా ,మా భీదా బత దాయత’’.ఈ శ్లోకమూప్రతిలోమం లోనే ఉంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-20-ఉయ్యూరు