కిరాతార్జునీయం-.32
15వ సర్గ – 3
కుమాస్వామి సైన్యంతో ఇంకా ఇలా చెబుతున్నాడు –‘’దేవతల్నీ మనుషుల్నీ గడ్డిపరకగా చూసే మీరు ఉత్తమ పరాక్రమ వంతులు .ఆపరాక్రమ శ్రీ ని ఎందుకు వదిలారు ?మనశత్రువు తీవ్ర ఖడ్గంధరించాడు .నిర్భయుడు తేజస్వి ,అందగాడు .యుద్ధభారం వహించగల దిట్ట ఎంతటి శత్రువుకూ జంకే వాడు కాదు .కనుక భయపడాల్సిన పని లేదు –‘’ నిశితా సిరతో భీకో న్యేజతే మరణా రుచా –సారతో న విరోధీ నః స్వభాసో భరవానుత’’. -పరాక్రమం ఉత్తమకవచ ధారీ అయినా అధీరుడు .అతని బాణ శబ్దం విని సమస్తజీవరాశి ప్రాణం వదిలేస్తాయి –‘’ తనువా రభసో భాస్వాన ధీరో వినతోరసా –చారుణా రమతే జన్యే కో భీతో రసితా శిని’’ఈ శ్లోకమూ ప్రతిలోమానులోమంగా రాసిందే .అతడి బాణాలకు చచ్చిన ఏనుగుల నుంచి కారిన రక్తం పర్వతజలపాతం లా ఉంది .మద ధారలున్నఏనుగులున్నవాడు ,శత్రువుల్ని ‘’కాకా ‘’అని కాకుల్ని పిలచినట్లు పిల్చేవాడు ,ఉత్సాహవంతులని నిరుత్సాహ పరిచేవాడు అతడు –‘’దేవకానిని కావాదే వాహికా స్వస్వ కాహివా –కాకారే భభరే కాకా నిస్వభవ్యవ్యభస్వని ‘’ఇది సర్వతో భద్ర కవిత్వంగా రాసింది .’’భయపడిన గుర్రాలు రౌతుల్నే కిందపడేశాయి .ఖడ్గాలు లేని వొరలు గాలి చేరి ఆధ్వని రౌతుల చెవుల్లో దూరి భయంతో చచ్చారు .యుద్ధం లో వీరులలో ఉత్సాహం పెరిగితే ,భయపడే వారి కోపాన్ని నశింపజేస్తుంది .శత్రువులు యుద్ధ కౌశలాన్ని చూసి ఆన౦దిస్తారు .ఈ శ్లోకం లో అర్దభ్రమక బంధం ఉంది..దేవతలతో మీరు భయంకర యుద్ధం చేశారు నిజమే .కాని ఇప్పుడు పౌరుష నష్టం పొందారు ‘’అని సైన్యాన్ని కుమారుడు అనునయిస్తుండగా శివుడు చిరు నవ్వుతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు .
అర్జున బాణాగ్ని బాధ పడిన గణాలతో శివుడు ‘’పరిగెత్తకండి ‘’’అనే చల్లని మాటతోసంతోషం కలిగించాడు .ప్రమద గణ౦ బలహీనమై ’నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శంకరుని సాంత్వన వాక్యం నచ్చి ఆయన అభిప్రాయం తెలుసుకొన్నారు –‘’దూనాస్తే రిబలా దూనా -నిరేభా బహు మేనిరే -–భీతాఃసహిత శరా భీతాః-శంకరం తత్ర శంకం ‘’ శ్లోకం మొదటిపాదం లో మొదటిపాదం అ౦దులొ చివరి పదంగా కూడా ఉండటం ఇక్కడి ప్రత్యేకత .అంటే దూనా –దూనా ,భీతాః- భీతాః,శంకరం –శంకరం .దాటటానికి వీల్లేని శత్రు బాణ సముద్రం లో ఉన్న సేన ఈశ్వర రూపమైన తీరాన్ని చూసి ఊరట చెందింది .ఓడిన సేనను ముందుపెట్టుకొని ,సూర్యుని నుంచి తొలగిన నీడను మహా వృక్షం ధరించినట్లు సేనకు బాసట అయ్యాడు .అంటే శివుడు సేనను వదలలేదు చెట్టు తన నీడను వదలనట్లు ..
శంకరుడు అర్జునునిపై బాణం సంధించగా ఆ ధనుష్టంకారానికి ఇంద్రకీల పర్వతం బద్దలవు తోందా అన్నట్లు దిక్కులు పిక్కటిల్లాయి .-‘’ముంచ తీశే శరాజ్ఞిష్టౌపినాకస్వన పూరితః –దధ్వాన ధ్వనయన్నాశాః స్ఫుట న్నివధరాధరః ‘’.శివార్జున యుద్ధాన్ని నిశ్చేష్టులై చిత్రం లోని బొమ్మల్లాగా కదలకుండా ఆశ్చర్యంగా చూశారు .నైపుణ్యంతో అర్జునుడు వేసే బాణాలను శివుడు అంతే నైపుణ్యంగా నేలకూల్చాడు -.అర్జునుడూ శివుని బాణాలను అలాగే కూల్చేశాడు –‘’అవద్యన్పత్రిణః శంభోః సాయకైరవ సాయకైః-పాణ్డవః పరి చక్రామ శిక్షయా రణ శిక్షయా ‘’.ఈ శ్లోకం లో ఆద్యంత యమకం ఉంది .వల్కల శోభతో అందగాడైన అర్జునుడు మనోహర తీరులతో యుద్ధం చేశాడు –‘’చార చుంచు శ్చిరా రేచీచంచ చ్చీరుచా రుచః –చచార రుచిర శ్చారు చారైరాచార చంచురః ‘’ఈ శ్లోకం లో చ ,ర అనే రెండు అక్షరాలనే ఉపయోగించి మెస్మరిజం చేశాడు కవి భారవి .గా౦డీవానికి అల్లెత్రాడు బిగించి పిడుగుల్లాంటి నిప్పులు సూర్యునిలా వెదజల్లాడు భీభత్సుడు .అర్జునబాణాలు శివబాణాలను మేఘాలు సూర్యుని కప్పినట్లు కప్పేశాయి-‘’పార్థబాణాః పశుపతేరావ వ్రర్విశిఖా వలీం –పయోముచ ఇవా రంధ్రాః సావిత్రీ మంశు సంహతిం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా పసాద్ -21-12-20-ఉయ్యూరు

