కిరాతార్జునీయం-.35
16 వ సర్గ -2
అర్జునుడు ఆలోచించి, ఆలోచించి చివరకు తెగించి కిరాత శివునిపై గణాధిపతి పౌరుషం పోగొట్టే ‘’ప్రస్వాపనాస్త్రం ‘’అంటే గాఢ నిద్ర నిచ్చే అస్త్రం ప్రయోగించగా అర్ధ రాత్రి చీకటి దట్టంగా అంతటా వ్యాపించింది .-‘’స సంప్రధార్యైవ మహార్య సారః –సారం వినేష్యన్ సగణస్యశత్రోః-‘’.ప్రస్వాపనాస్త్రం ద్రుతమాజహార –ధ్వాంతం ఘనానద్ధ ఇవార్ధ రాత్రః’’ .దావానలం పొగలాగా ,ధూసర వర్ణం సూర్యకాంతిని కప్పేసినట్లు శివ గణాలను ఆవరించింది .అది దట్టమైన చీకటి అడవుల్ని ఆవరించి నట్లుగా ఉంది .దీనికి ప్రమథ గణాలకు నిద్ర ఆవహించింది .సభలో ప్రగల్భాలు పలికేవాడు ,పండితుడు ప్రవేశించగానే కిక్కురు మనకుండా ఉన్నట్లు అయింది –‘’సభేవ భీమా విదధే గణానాం-నిద్రా నిరాసం ప్రతిభా గుణస్య’’.బలాఢ్యులైన కొందరు ధనువులసాయం తో నిలబడిపోయారు .ఆపదలో మంచి మిత్రుల సాయం పొందినట్లుంది వారిపని –‘’కేచిత్సమాశ్రిత్య గుణాన్వితాని –సుహృత్కులా నీవ ధనూ౦షి తస్థుః’’.అర్జున ప్రస్వాపనాస్త్రం ముందు దైవ ప్రతికూలంగా శత్రు అస్త్రాలు నేలపడి పోయాయి .దైవానుకూల్యంలేకపోతే వ్యవసాయ ఫలం నస్టమైనట్లుగా ఉంది –‘’అతర్కితం పాణి తలాన్నిపేతుః-క్రియా ఫలానీవ తదాయుధాని ‘’.ఈ విషమ సమయం లోనూ కొందరు ధైర్యం తో చెట్ల మొదళ్లను ఆనుకొని మదం తో కళ్ళు మూతపడుతున్న ఏనుగులు తొండాలను జార విడిచి నేలపై కూర్చున్నట్లు కూర్చున్నారు –‘’మాదేన మీలన్నయనాః సలీలం –నాగా ఇవ స్రస్తకరా నిషేదుః’’.
కిరాత శంకరుని నుదుటి నుంచి పిశంగవర్ణ-ఎరుపు ,తెలుపు ,పసుపు రంగు మిశ్రమ రంగు . ప్రకాశం చంద్రాస్తమయం తర్వాతసుమేరు పర్వత శిఖరం నుంచి ఋషులు ప్రణామ౦ చేసే సూర్య బి౦బంలా ఉదయించింది – ‘’తిరోహితేందో శంభు మూర్ధ్నః-ప్రణమ్యమానం తపసాం నివాసైః-సుమేరు శృంగాదివ బి౦బమార్కం-పిశంగ మచ్చైరుదియాయ తేజః ‘’ .శివుని నుదుటి ఆ కాంతి ,గణాల నిద్ర పోగొట్టి చూపునిచ్చి౦ది.తత్వజ్ఞానం అజ్ఞానాన్ని తొలగించి నట్లుగా శివ తేజస్సు గణాలను తెప్పరిల్లేట్లు చేసిందని భావం .-‘’యయౌ వికాసం ద్యుతి రిందు మౌలే –రాలోక మభ్యాది శతీ గణేభ్యః ‘’ఆ ప్రకాశం నాలుగు వైపులా విస్తరించి మేఘమండలాన్ని ఎర్రగా మారుస్తూ ఉదయ సంధ్యలాగా వ్యాపించి ప్రమథ గణముఖపద్మాలను వికసింప జేసింది –‘’నినాయ తేషాం ద్రుతముల్లసంతీ-వినిద్రతాం లోచన పంకజాని ‘’.ప్రస్వాపనాస్త్ర ప్రభావం తగ్గాక తెలివిలోకి వచ్చిన శివ సేన ,మేఘాలుపోయి ,దిక్కులు నక్షత్రాలతో ప్రకాశించినట్లు వివిధ శస్త్రాలు ధరించారు .-‘’ముక్తా వితానేవ బలాహకానాం –జ్యోతీ౦షి రమ్యాఇవ దిగ్విభాగాః’’.
రాత్రి పోయి ,అంతరిక్షం పైకి లేచినట్లుగా ఉంది .దిక్కులు ప్రసన్నాలై ,సూర్య కిరణాలు స్పష్టత పొంది విస్తరించగా ,పగటి శోభ రోజును ఆశ్రయించింది .మహాదుర్గం లాంటి ప్రస్వాపనాస్త్రాన్ని శత్రువైన శివుడు వ్యర్ధం చేయగా ,వెంటనే సైనికులను బంధించే సర్పరూప పాశాలు వదిలాడు పార్ధుడు –‘’భుజంగ పాశాన్ భుజ వీర్య శాలీ –ప్రబంధ నాయ ప్రజిఘాయ జిష్ణుః’’.మెరుపులతో సమానమైన విషాగ్ని కల వందలాది నాలుకలను ఎప్పుడూ ఆడించే సర్పరాజుల సేన తమ భయంతో ఆకాశంలో తిరిగే సిద్ధ చారణాది దేవమార్గాన్ని ఆవరించి అడ్డుకొన్నాయి –‘’జిహ్వా శతా న్యుల్లస యంత్య జస్ర౦ –లసత్తడి ల్లోల విషానలాని –త్రాసాన్నిరస్తా భుజగేంద్ర సేనా –నభశ్చ రైస్తత్పదవీం వివవ్రే ‘’.దిగ్గజాల తొండాలవంటి ,ఇంద్ర నీల మణుల లాంటి శరీరాలతో ఆపాముల వరుస ఆకాశం అనే సముద్రం లోని తరంగమాలిక లాగా ప్రకాశించింది –‘’దిజ్నాగ హస్తాకృతిమూడవ హద్భిః-భోగైః ప్రశాస్తా సితరత్న నీలైః-రారాజ సర్పావలి రుల్లసంతీ-తరంగ మాలేవ నభోర్ణవస్య ‘’.పడగెత్తిన సర్పాల ఫూత్కారాల్లోని పొగ, సూర్య కిరణాలను కప్పి వేయగా, చూసే వాళ్లకు యోగ్యమైన శరీరాన్ని సూర్యుడు ధరించాడు –‘’నిఃశ్వాస ధూమైః స్థగితాంశుజాలం-ఫణావతాముత్ఫణ మండలానాం –గచ్ఛన్నివాస్తం వపురభ్యువాహ-విలోచనానాం సుఖ ముష్ణ రశ్మిః’’.విష దృష్టి ఉన్న సర్పాల కళ్ళల్లోనుంచి కాసిన బంగారు ప్రకాశం తో ,దిక్కుల్ని పసుపురంగుగామారుస్తున్నమంటలు పెద్ద తోక చుక్కల్లాగా బయటికి వచ్చాయి .-‘’ప్రతప్త చామీకర భాసు రేణ-దిశః ప్రకాశేన పిశంగ యంత్యః –నిశ్చక్రముః ప్రాణ హరేక్షణానాం-జ్వాలామహోల్క ఇవ లోచనేభ్యః ‘’
సశేషం
రేపు ముక్కోటి పర్వ దిన శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-20-ఉయ్యూరు

