మహా భక్త శిఖామణులు
21-తూము లక్ష్మీ నృసింహ దాసు-2
అపర కైలాసంగా కనిపించే రామేశ్వరం లో శ్రీరామ ప్రతిష్టిత సైకత రామ లింగేశ్వర దర్శనం చేసి ‘’కాశీ పురమునుండి గంగ దెచ్చితిని ఈశ –దీని గ్రహియిపవయ్య’’అనిప్రార్ధించి ఆ గంగతో నమక చమకాలతో అభిషేకించి బిల్వపుష్పాదులు సమర్పించి ,కోరిన కోరిక తీరి పెన్నిధి లభించి భావించి –‘’అన్యమేరుగాను దేవ అహర్నిశములు- దైన్యమున నీ పసుజన –దంబుల దలచిసుజన –మాన్యమౌ పరమార్ధ సంపద లభించి –ధన్యమతి నైతి నీదగు దర్శనమున ‘’—అంగములో సగమంగన-కు౦గడ మసగంబు భక్తకోటి కోసగితె ,-బ్భంగి నిను గానవచ్చు భు –జంగ చయ విభూష దోష సంగ విదూషా’’మొదలైన పద్యాలతో స్తుతించాడు నరసింహ దాసు అక్కడి 24తీర్ధాలలో స్నానించి,,గంధమాదన పర్వతం అధిరోహించి ,సేతుమాధవ దర్శనం చేసి,ఉభయ సాగర సంగమం లో తీర్ధ విధులు యధోక్తంగా నిర్వహించి ,మూడు రోజులుగాడిపి ఏకాంత రాముని సేవించి ,అక్కడి చింతలపాటి లక్ష్మీ నారాయణ గారి అభ్యర్ధనపై వారింట్లో కొన్ని రోజులుండి,రామాయణ పురాణం చెప్పి సన్మానితుడై ,మళ్ళీ సేతుమాధవ దర్శనభాగ్యం పొంది -‘’తగ ప్రయాగ పూరి మాధవుడు నీ క్షేమంబు –నడిగినాడని దెల్పు మనియె బ్రీతి —‘’’కోరిక దీరె నీ చరణకోమల యుగ్మమునాశ్రయి౦చుటన్ ‘’అని పద్య స్తుతి చేసి ,కోటి తీర్ధాన్ని తీసుకొని,సముద్రుడు ఎంతసేపటికీరాకపోతే దర్భలపై పడుకొని నిరశన తెలియ జేసిన ,దర్భశయనం లో శ్రీ రామ దర్శనం చేసి ,శ్రీరంగం చేరి రంగనికి తన అనుభవాన్ని –‘’ప్రాకార సప్తక ప్రకరంబు కనుగొంటి –యదియెవైకుంఠమంచలరు చుంటి ‘’అంటూ పద్య నివేదనం చేశాడు .అక్కడినుండి జంబుకేశ్వరం వెళ్లి జలలింగదర్శనం చేసి ,కంచి చేరి –‘’ఆకలి గొన్న యట్టి జను –డన్నము గైకొను మాడ్కి ‘’అని స్తుతించి డబ్బులివ్వనిదే దర్శనం లేదంటే సొమ్మసిలిపొతేఒక వైష్ణవ భక్తుడు అంతరాలయ దర్శనం చేయించాడు .వరద రాజ స్వామిని దర్శించి పరవశంతో సాష్టాంగం చేసి ఆనంద బాష్పాలు రాల్చాడు .తిరుపతి వెళ్లి శ్రీనివాస దర్శనం చేయాలని కొండ ఎక్కుతుంటే ‘’నీ తాత తండ్రుల మొక్కు బడులన్నీ తీర్చగలిగితేనే కొండ ఎక్కు ‘’అనే మాటలు వినిపిస్తే ఎవరా అని వెతికితే ఎవరూ లేకపోవటం తో అది వైష్ణవ మాయ అని గ్రహించి ‘’ఈయనే కంచిలో దర్శనం చేయించిన వైష్ణవరూప వెంకటేశ్వరస్వామి ‘’అని మనసులో భావించి ,అడుగడుగుకూ ఆపద మొక్కులవాడిని స్మరిస్తూ –‘’తాతనాటి ఋణము దలచి లెక్కలు తీసి –ప్రీతిమాని బిరుదు ఖ్యతిమాని –కఠిన వృత్తి దాల్చి కదలరా వలదంటి –విట్టు లాడ నీక దెట్టులొప్పె’’అని ఎడా పెడా పద్యాలతో వాయించి ,చేతిలో చిల్లిగవ్వ లేని తాను ఎలా మొక్కులు తీర్చుకోగలను అని నిర్వేదం చెండి మెట్లమీదనే ఉత్తరీయం పరచి నిద్రపోయాడు .స్వప్నంలో ‘’రజతాద్రి కాంతి నిరాకరించెడుమేని –చంద౦బు గల్గు నశ్వంబు నెక్కి ‘’శ్రీవారు కనిపించి అక్కడి విశేషాలన్నీ దగ్గరుండి చూపించగా –‘’మేలు కొంటి నంత జాల వేడ్క ‘’అని అనుభవం వివరించాడు .వేంకటేశ్వరుని పాద చిహ్నాలు అక్కడ ఆనవాలుగా కనపడితే ఆశ్చర్యపోయి భక్తులందరికీ చూపి పరవశించాడు నరసింహ దాసు .కొండ ఎక్కి శ్రీవారి దర్శనం చేసి ఆనందంతో నృత్యం చేసి అలుమేలు మంగను గోవిందరాజస్వామిని దర్శించి –శ్రీపాద రేణువు చిన్నం వరా యంచుబల్కు –వైష్ణవ పరి భాష వింటి ‘’అని వేడికోలు చెప్పుకొని,శ్రీకాళ హస్తిచేరి శ్రీ కాల హస్తీశ్వర దర్శనం తో చరితార్దుడై ,మళ్ళీ పొన్నూరునుంచి గుంటూరుకు చేరాడు .కోటితీర్ధజలాలతో తల్లికి అభిషేకం చేసి అందరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని తన యాత్రా విశేషాలను సవివరంగా అందరికీ తెలియ జెప్పి వారు కూడా యాత్రాఫలితం పొందేట్లుచేశాడు నరసింహదాసు ..వృషభ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పాద్యమికి దక్షిణ దేశ యాత్ర పూర్తయింది .మళ్ళీ భద్రాచలం వెళ్లి శ్రీరామ దర్శనం చేసి ఇంటికి వచ్చాడు .నిరంతర ప్రయాణాలతో ఆరోగ్యం దెబ్బతిని ,వ్యాధి పీడితుడయ్యాడు .
ఉత్తర దేశ యాత్ర
1827-28వ్యయనామ సంవత్సర పుష్య శుద్ధ విదియనాడు ఉత్తర దేశ యాత్రకు బయల్దేరాడు తూము నరసింహ దాసు .నడిచి ముందుగా అయోధ్య చేరి శ్రీరాముడు పుట్టిన చోటు ,పెరిగిన చోటు ,ఆడిపాడిన చోట్లు ,వల్కలాలు కట్టిన చోటు ,దశరధుడు చనిపోయిన చోటు ,భరతుడు రామపాదుకలు పూజించిన చోటు ,అక్కడి స్థానికులు వివరంగా చెప్పి చూపిస్తే చూసి ధన్యమయ్యానని భావించాడు .సరయు నదీ స్నానం చేసి పితృ తర్పణాలిచ్చి ,వంశాన్ని పవిత్రం చేసే ఒక్కడు చాలడా అంటూ’’జాలడా ఏడు తరములకు నొక్క మహాత్ముడు ‘’అని శ్రీరామ స్తుతి చేసి అక్కడే కొన్ని రోజులు గడిపి ,అక్కడి నుంచి హరిద్వారం బదరికా వనం చేరి నరనారాయణ సందర్శనం భాగ్యం పొంది సర్వజిత్ సంవత్సర శ్రావణ శుద్ధ ఏకాదశి కి గుంటూరు చేరాడు .ఎక్కడి గుంటూరు ?ఎక్కడి బదరి?ఇంతదూరం కాలినడకన తిరిగి రావటం అంటే మాటలుకాదు .సంకల్పబలం రామానుగ్రహం ,కుటుంబ జన ప్రోత్సాహం ఉంటేనే జరుగుతుంది .మళ్ళీ భద్రాద్రి వెళ్లి దర్శనం చేసి వచ్చాడు .ఎన్నియాత్రాలు చేసినా అలుపూ సోలుపూలేదు రోగం రోష్టూ లేదు .కాలికి ముళ్ళు కూడా ఎక్కడా గుచ్చుకొని బాధ పెట్టలేదు దొంగలభయం పాము వంటి జంతు భయం కూడా ఆయనకు ఎదురు కాలేదు .
కంచి గరుడ సేవ
కంచిలో డోల సేవ చూడాలని ఎన్నాళ్ళనుంచో దాసు మనసులో ఉంది అది నెరవేర్చుకోవటానికి విరోధి సంవత్సర వైశాఖ మాసం లోకోద్దిమంది భక్తులతో కాంచీ పురానికి వెళ్లి గరుడ సేవ ఉయ్యాలసేవ తనివి తీరా చూసి తరించాడు
మద్రాస్ అనుభవం కొత్త శిష్యుడు
మద్రాస్ వెళ్లగా అక్కడ భక్తుడు సంపన్నుడు వైదిక బ్రాహ్మణుడు మురికి నాడు శాఖీయుడు నాగండ్ల వరద రాజస్వామి ఆహ్వానించి ,తగిన రీతిగా సేవలు చేసి ,దాసు గారివలన తారక మంత్రోప దేశం పొందాడు ,మూడు నెలలు వారిట్లో,రామాయణ ప్రవచనం తో అందరినీ సంతృప్తి పరచగా సంతుష్టాంతరంగు డైన వరద రాజస్వామి, దాసు గారికి పాద పూజ చేసి 4వేల రూపాయలు కానుకగా సమర్పించి ‘’స్వామీ !మళ్ళీ ఒక సారి వచ్చి నన్ను భద్రాద్రి రామ దర్శనం చేయించి పుణ్యం కట్టు కొండి ‘’అని ప్రార్ధించాడు .అతని వినయం భక్తీ లకు సంతోషించి దాసుగారు అదంతా శ్రీరామానుగ్రహం అని చెప్పి మళ్ళీ గుంటూరు చేరి ,మూడు తరాలనుండి పెరిగిన అప్పు అంతా ఆ నాలుగు వేల రూపాయలతో తీర్చేశాడు-‘’అప్పు దీరుపనైన హరియింప నైనను దలచు మానిసికి బత్రంబు వలదు ‘’అని అడిదం సూరకవి చెప్పినట్లు నోటూ పత్రం లేకుండా తన కుటుంబానికి అప్పులిచ్చిన వారి గుణ శ్రేష్టతకు కృతజ్ఞత చెప్పుకొన్నాడు ‘
మళ్ళీ మద్రాస్ వెళ్లి వరద రాజు తో కలిసి వికృతి సంవత్సర చైత్రమాసం ప్రారంభం లో భద్రాద్రి చేరి శ్రీరామనవమి కల్యాణం చూసి ఆయనకు చూపించి మాట నిలబెట్టుకొని గుంటూరు చేరాడు .నరసింహదాసు బుద్ధి గరిమ భక్తీ ప్రపత్తులు శీల విశిష్టత లను గుర్తించి గౌరవించి వరదరాజు ఈ దంపతులను మద్రాస్ తీసుకొని వెళ్లి ఆరు నెలలు తన ఇంట్లో ఉ౦చి సకల సౌకర్యాలు కలిపించి ధన్యుడయ్యాడు .
భద్రాద్రి వాసం
భక్తీ జ్ఞాన సంపత్తి దాసుగారి వలన కలిగి వైరాగ్యభావం అంకురించి ,తనకున్న సకల సంపాదనను గుర్రబ్బళ్ళపై ఎక్కించి దాసు దంపతులతో తమ దంపతులుకూడా కలిసి వికృతి కార్తీకం లో భద్రాద్రి చేరి అక్కడే కాపురం పెట్టాడు వరదరాజు .రోజూ దాసు దంపతులతో సత్కాల క్షేపం .భద్రాద్రి రామ దర్శనం తో ఆన౦దంగా రోజులు గడిచి పోతున్నాయి .రామాలయ పూజారులలో స్వార్ధం పెరిగి స్వామి కై౦కర్యాలు సరిగ్గా చేయక తమ కైంకర్యం కోసమే డబ్బు వాడుతూ అప్రతిష్ట తెచ్చారు .తన డబ్బే పోయినట్లుగా దాసుగారు బాధపడ్డారు –రామా !నీ సేవలు సరిగ్గా జరగటం లేదు .నేను ఎలా సహి౦చ గలను ?మొన్న కలలో ఒక వైష్ణవుడు కనిపించి విచారించకు చందూలాల్ ను కలిస్తే అంతా చక్కబడుతుంది ‘’అని చెప్పాడు .మెలకువరాగానే ఈవిషయం శిష్యుడు వరద రాజుకు చెప్పాడు .రామాజ్ఞగా భావించి ఒక్కడే హైదరాబాద్ వెళ్ళాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-1-21-ఉయ్యూరు