మహా భక్త శిఖామణులు34-భక్త శిఖామణిసింగిరి దాసు
ఒంగోలు మండలం వెంకటాపురం లో 1840 శార్వరి జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు కామరాజు కృష్ణయ్య ,రామ లక్ష్మమ్మ దంపతులకు సింగిరి దాసు జన్మించాడు .బాల్యం నుంచి జంతువులపై ప్రేమ ఎక్కువ .తల్లి అన్నానికి పిలిస్తే ,ఆడుకొనే కుక్కపిల్లల్ని కూడా వెంట తెచ్చుకొని వాటితో కలిసి తినేవాడు .వేరే కంచం లో వాటికి పెట్టించి తాను ఇంకో కంచం లో తినేవాడు .లక్కవరపు వెంకట నరసింహం గారి వద్ద బడి చదువు పూర్తి చేసి ,తర్వాత పురాణాలను శ్రావ్యం గా గానం చేసేవాడు .వాటి అంతరార్ధం బోధించే నేర్పు సంపాదించాడు .
తండ్రికి రోజూ రామాయణం చదివి వినిపించేవాడు .చదువుతూ మైమరచేవాడు రామమందిరం లో భజన చేస్తూ నిద్రపోయేవాడు కాదు .తర్వాత భగవంతుడి పై ఆలోచన తనకు ఆయనకూ ఉన్న సంబంధం గురించి తర్కి౦చు కోనేవాడు .12వ ఏట ఉపనయనం జరిగి ,అప్పటి నుంచి సింగిరి గిరి నరసింహ స్వామిని ప్రతి ఏడాది సందర్శించే వాడు .ఒకరోజు అర్ధరాత్రి వరకు నరసింహ భజన చేసి ,ఇంటికి ఒంటరిగా వస్తుంటే ,దారి తప్పితే ముందు మినుకు మినుకు దీపం కాంతి తర్వాత పెట్రోమాక్స్ లైట్ కాంతి కనిపించి భయ౦,ఆశ్చర్యం కలిగి మనశ్శాంతి కలిగింది .స్పృహ తప్పి నేలపై పడి పోయాడు .స్పృహ వచ్చి చూస్తె ,ఆ జ్యోతి కనిపించలేదు .మట్టిలో పడివున్న అతనిని వెతకటానికి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి చేర్చారు .
ఇంకోసారి ఇంటి నుంచి సాయంత్రం అయిదు గంటలకు బయల్దేరి సింగిరి గిరి నరసింహస్వామి కోవెలకు వెళ్లి నిర్మానుష్యంగా ఉండటం చేత ,సంతోషించి లోపలి వెళ్లి ,స్వామి పాదాలపై పడి,ప్రత్యక్ష దర్శనం కోసం ప్రార్ధించాడు .కనిపించకపోయేసరికి ధారాపాతం గా కన్నీరు కారుస్తూ దుఃఖించాడు .కాసేపటికి ఇదివరకులాగానే దివ్య జ్యోతి మళ్ళీ కనిపించగా సంతోషం తో ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండగా సంప్రజ్ఞానం లో నృసింహ స్వామి దర్శన మిచ్చాడు .సమాధి నుంచి బయటికి వచ్చి ఆనంద బాష్పాలు రాలుస్తూ నృత్యం చేసి ఆలయం నుంచి బయటకు రాగానే ఒక యోగిని కనిపించి ‘’నాయనా !నీ కోసమే ఎదురు చూస్తున్నాను ‘’అని చెప్పి ఆత్మీయంగా కౌగిలించుకొని ‘’తారకం ఉపదేశిస్తా .దానితో నీ అభీష్ట సిద్ధి కలుగుతుంది ‘’అని చెప్పి ఆలయం లోకి తీసుకు వెళ్లి ,సర్వ వేదాంత రహస్యాలు బోధించి తారకమంత్రం ఉపదేశించి ,కనిపించకుండా వెళ్ళిపోయింది .ఆమె సీతాంబ అనే శూద్ర యోగిని బ్రహ్మ చారిణి .అంతకంటే వివరాలు తెలీదు .అప్పటినుంచి దాసుగారి జీవితం అంతా రామమయం అయింది . తండ్రి చనిపోగా బాధ్యతా మీద పడి ఆస్తి అంతా అప్పులపాలై ,ఊళ్ళో అప్పిచ్చే వారు లేక ,ఉద్యోగం చేయటం ఇష్టం లేక ,,మేనమామ వెంకట నరసింహం గారి బలవంతం తో ఉద్యోగానికి దరఖాస్తు చేయగా అ ఉద్యోగం ఆర్డర్ చేతి కందేలోపు ,ఒకరోజు రాత్రి యాత్రకు వెడుతున్నట్లు చెప్పి ,ఇంటినుంచి బయల్దేరి 15రోజులలు నడిచి నెల్లూరు చేరాడు .ఈ ప్రయాణం లో ఒక వింత జరిగింది .పెన్నా నది ని దాటటానికి నదిలోకి దిగి భజన చేస్తూ వెడుతుంటే ,ప్రవాహం పెరిగి ,చేతిలోని తంబూర ,పై గుడ్డ కూడా నీటి వేగానికి కొట్టుకుపోయి నా స్పృహ లేకుండా భజన చేస్తూ ,నది మధ్యకు చేరి మైమరచి నిలచిపోయాడు .ఒడ్డుల్ని ఒరుసుకొని నది తీవ్రంగా ప్రవహిస్తోంది. రామనామం విన్న పల్లెకారులు దివిటీలు ,పడవలతో వచ్చి ,మొలబంటి నీటిలో ఇసుకదిబ్బపై స్పృహ లేకు౦డా పడి ఉన్న దాసు గారిని చూసి ,స్మృతిత వచ్చేవరకు ఉండి,పడవ ఎక్కించుకొని ,ఒడ్డుకు చేర్చారు. ఆయనెవరో వాళ్లకు తెలీదు .
నెల్లూరు చేరి శ్రీరంగనాయక దర్శనం చేసి,ఆరాత్రి గుడిలోనే పడుకొని రామనామ సంకీర్తన చేస్తూ తెల్లవార్లూ గడిపారు .ఉద్యోగం పోస్టింగ్ ఇచ్చి ఆయన చేరకపోవటం తో రద్దు చేయగా దాసు గారు చాలా సంతోషించారు . మేనమామ మళ్ళీ ప్రయత్నించి ఉద్యోగం వచ్చేట్లు చేశాడు .రామకూరు ఫిర్కా రెవిన్యు ఇన్స్పెక్టర్ ఉద్యోగం లో బలవంతం మీద చేరి ,విధి నిర్వహిస్తూ ,జపతపాలలో మునిగి ఆఫీసుకు వేళకు వెళ్లకపోతే ,పై అధికారి మందలించి భయపెట్టేవాడు .ప్రయోజనం లేక ఉద్యోగం ఊడ పీకేశాడు .బంధన విముక్తి అయిందని సంతోషించి ,భార్య తల్లి తో శ్రీరామ సేవాపరాయణలో గడిపారు .కుటుంబ పోషణ కష్టమైంది .తల్లి అన్నకు బాధ చెప్పుకోనగా ,వెల్లూరు తాలూకా కచేరీలో గుమాస్తాఉద్యొగ౦ వేయించి బలవంతం మీద మేనల్లుడిని చేర్చాడు .ఇదీ మూన్నాళ్ళ ముచ్చటే అయింది .
గర్భవతి అయిన భార్యను అత్తారింటికి పంపగా రోజూ ఉపవాసాలతో బతకలేక తల్లి చిన్న పిల్లాడితో తన పుట్టింటికి చేరింది .బాదర బందీ లేకపోవటం తో రామనామం తో గడుపుతూ ,తిరుపతి యాత్రకు బయల్దేరి మధ్యలో ధేనువకొండ లో రామకృష్ణయ్యగారు కలువగా,ఆయనతో కలిసి యాత్ర చేసిన తర్వాత అప్పుడప్పుడు ఆయన ఇంటికి వస్తానని చెప్పి , యాత్ర అవగానే బావమరిది ఇంటికి చేరాడు .బావను బతిమాలి బామాలి ,చిత్తూరు మండలం పూతలపట్టులో ఒక బడి పెట్టించాడు .అక్కడ పాఠాలు చెబుతూ పురాణ కాలక్షేపాలు చేస్తూ అందరినీ సంతోషింప జేస్తున్నాడు దాసు .భార్య రుక్మిణమ్మ పసి పిల్లతో ఇక్కడికి వచ్చి ఒక ఏడాది గడిపింది భర్తతో .
దాసుగారికి రక్తవిరోచన వ్యాధి వచ్చి ,బడికట్టేసి ,1864లో వెంకటాపురం చేరి ,వ్యాధి తగ్గాక భార్యాపిల్లల్ని అత్తారింటికి పంపి ,శేషాచలం చేరి గోగర్భ ప్రాంతగుహలో , 6 నెలలు తపస్సు చేయగా,కౌపీనం మాత్రమే ధరించిన ఒకముని వచ్చి ‘’నీ తపస్సు ఫలించింది ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడు కోరుకొంటే అప్పుడు శ్రీరామ సాక్షాత్కారం లభిస్తుంది .తపస్సు వదిలేసి వెంకటాపురం చేరి ఆదర్శ గృహస్థ జీవితం కొనసాగించు ‘’అని బోధించగా ఆప్రకారమే ఇంటికి వెళ్లి ,నిష్కామకర్మగా జీవించి ‘’శ్రీ భద్రాద్రి రామ దాసు చరిత్ర ‘’రచించి ,శ్రీరామా౦కితం చేశారు దాసుగారు .1869లో మామగారు అప్పయ్య అల్లుడిని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు .ఒక ఏడాది మామిళ్ళపల్లి లో ఉండి ,తర్వాత రేపల్లె చేరి ,తమ్ముడి నుంచి వేరై ,పిత్రార్జితం తో నాలుగు ఎకరాలమాగాణికొని ,ఇల్లు కట్టుకొని భార్యాపిల్లలతో సుఖంగా ఉన్నారు .ఇద్దరు చెల్లెళ్ళు ఒకే రోజు చనిపోయినా ,ఐదారుమంది కూతుళ్ళు చనిపోయినా నిర్లిప్తత కోల్పోలేదు .
రేపల్లె పాఠశాల ఇంకా నడుస్తూనే ఉంది .ప్రొద్దున లేచినదగ్గర్నుంచి విద్యార్ధులకు పాఠాలు ,భజనలు పురాణ ప్రవచనాలు జపతపాలు అనుష్టానం లతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు .కొంతకాలానికి భార్య రుక్మిణమ్మ మరణించింది .రేపల్లె వదిలి పెద్దకొడుకు పని చేసే నూజివీడు చేరి ,తత్వార్ధ ప్రధాని యై ఆతర్వాత పొన్నూరు చేరి చవలి పున్నయ్య శాస్త్రిని శిష్యునిగా చేసుకొని,పాతూరి కోటయ్యగారి స్నేహం చేసి,ఆతర్వాత శిష్యుల్తో రామేశ్వరం వెళ్లి స్వామి సేవలో ధన్యం పొంది , ధ్వజస్తంభం దగ్గర భావ సమాధి పొంది మైమరచి పొతే ,భక్తులు హారతులు పట్టి ఆదరించారు .తర్వాత జంబుకేశ్వరం వెళ్లి ,శ్రీరంగం లో రంగని దర్శించి ,దక్షిణ దేశ యాత్ర పూర్తి చేసుకొని ,ఇంటికి చేరి ,బాపట్లలో ఉన్న రెండవ కొడుకు చెన్న కేశవ ఇంటికి చేరి,అద్దంకి వెంకటరాయుడు స్నేహం పొంది ,74వ ఏట ఆతుర సన్యాసం తీసుకొని నలసంవత్సర జ్యేష్ట శుద్ధ పంచమి నాడు మహా సమాధి చెందారు భక్త శిఖామణి సింగిరి దాసు గారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-2-21-ఉయ్యూరు

