త్ర్యంబకేశ్వర శతకం
శ్రీ కేసనపల్లి లక్ష్మణ కవి త్ర్యంబ కేశ్వర శతకాన్ని రచించి ,1936లో నరసరావు పేట కోటీశ్వర ముద్రాక్షర శాలలో ముద్రించారు ,వెల-బేడ అంటే రెండు అణాలు .’’కవిగారు గుంటూరుజిల్లా నరసరావు పేట కేసనపల్లి వాస్తవ్యుడు .ఆర్వేలనియోగి బ్రాహ్మణుడు .శ్రీవత్స గోత్రీకుడు .శ్రీ ఆంజనేయ వర ప్రసాది .సుబోధక యమక ,అనుప్రాసలతో దీన్ని రాశాడు ‘’అని నరసరావు పేటకు చెందిన పౌరాణిక శిరోమణి శ్రీ నందిగల సుబ్బా రెడ్డి ఈశతకానికి ముందుమాటలలో తెలియజేశారు .ఇది పెసరవాయి పురస్థిత త్ర్యంబ కేశ్వర స్వామిపై చెప్పిన శతకం. ‘’పెసరవాయి పురస్థిత త్ర్యంబ కేశ్వరా’’అనేది శతక మకుటం .
‘’శ్రీకర భక్తమానస వశీకర ,సద్గుణ రత్నపుంజ ,నీ-రాకర దుర్మదాసుర నిరాకర భీకర పాపవాయు ద
ర్వీకర వారిజోదర ,విరించి ,ముఖామర వందిత ప్రభావా –కరుణాకరా ’పెసరవాయి పురస్థిత త్ర్యంబ కేశ్వరా’’.అని ఎత్తుకోటం లోనేస్వామి మహిమను కీర్తి౦చాడుకవి .పాక మృదుత్వం తో లలితభావ సమగ్రత తో కూర్చే నేర్పున్న వాడి నని చెప్పుకొన్నాడు .శాస్త్రాలు చదివి రంగుహ౦ గు లతో రాస్తే అందులో ‘’వే భంగుల నీదు వర్ణనలు ‘’లేకపోతె దానిలో ‘’దాన భిష్వంగము భంగమౌతుంది ‘’అన్నాడు .’’నుతిపాత్రమైన నీ సుచరిత్ర మొయ్యనన్ వాకొనకుంటే’’కీర్తి హెచ్చదు అన్నాడు .’’రుద్ర, దయాసముద్ర బహురూప వికార విదూర సార నిర్నిద్ర నిరంతరస్మరణ రీత్యనుమోదితరామభద్ర ,యచ్చిద్ర యశోదిముద్ర ‘’అంటూ రుద్రముద్రలు వేశాడు .
‘’సార విచార ఘోర తర సంగర శూర యుదార నిర్మలాకారుడని స్తుతించాడు .’’శైల సుతా కళత్ర రవిచంద్ర హుతాశన నేత్ర పాప జంబాల సరోజమిత్ర ‘’అని త్రకార ధ్వని మోగించాడు .’’ఈ రసమూని నిన్ను ,జగదీశ్వరు సర్వ ఫలప్రదాయకున్ –నీరసుడు ‘’ అనే వాళ్ళు కు బుద్ధి చెప్పటానికి దక్షయజ్ఞ ధ్వంసం జ్ఞాపకం చేశాడు ..’’పంకజ నాభు డీవగును,బంకజ నాభుడ వౌదు నీవిటన్’’అని శివ కేశవాద్వైతం చెప్పాడు.’’నీసగమేన పార్వతిని దాల్చి ‘’లోకానికి అద్వైతమిథునం ఎలా ఉండాలో మార్గ దర్శివయ్యావు .
తనకు ఎడతెగని శివ భక్తి ప్రసాదించమని –‘’నీరము గ్రోలు నప్పుడును ,నిల్చిన యప్డు ,,భుజించు నప్డు స౦ –చారము సేయునప్పుడు ,ప్రస౦గ మునన౦ దిగినప్డు ,శయ్యకుం జేరినప్డు ‘’నీమీదే చిత్తం ఉండేట్లు అనుగ్రహించమని వేడుకొన్నాడు .’’మారహరా హరా త్రిపుర మర్దన శూరధరా ,గిరీశ గౌ-రీ రమణా యటంచు ‘’ అంటూనే బూతుల బు౦గను అయ్యానని ,అన్నీ పోయి నువ్వే శరణు అంటున్నానని , ఆర్తిగా వేడాడు ..నీకెన నీవ యౌట ఎరిగిననన్ను వదిలిపెట్టకు అని ప్రాధేయపడ్డాడు .’’నీ నిస్తుల విశ్వ విభుత్వ లక్షణాన్ని నంది అపార్ధం చేసుకొని కొంతకాలం దూరమయ్యాడు.కానీ బహుకాల తపస్సుతో వ్యాసుడు ‘’నీ మూల మెరింగి దాసుడయ్యాడు’’అని పూర్వగాథాలహరి వివరించాడు .
‘’ఏ నరుడెద్ది యిమ్మనిన నిచ్చుట ‘’అనేది వాడిలో నీకు నచ్చినదేదో ఉండటం వలననే కదా .అందుకే భోళా శంకరుదడివయ్యావు అంటాడు .’’శంకర శంకరా నను ,వశంకరు నేలుట ‘’కు ఇంత ఆలస్యమా ?’’వంకర వంకరాశ్రితుని వ్రాలుట ,బాణ దైత్య రాట్కింకర కి౦కరా’’ఒకటికి పది అడుగుతాడు వీడు అని నాపై అలుసా అన్నాడు .
107వ పద్యం లో తనగురించి చెప్పుకొన్నాడు కవి –‘’కేసనపల్లి వాసుడను .గేసనపల్లి కులు౦డ లక్ష్మణా-ఖ్యా సహితుండ ,దావక పదార్చన తత్పర మానసుండ నే
జేసిన దోసముల్ వొలియ జేసి కరమ్ము వరమ్ము లీయరా –వాసవ వందితా పెసరవాయి పురస్థిత త్ర్యంబ కేశ్వరా’’
‘’మంగళ మద్రిజా రమణ మంగళ మండజ రాడ్విభూషణా-మంగళ మ౦బుజాక్ష సఖ,మంగళ మంగజ గర్వ భంజకా
మంగళ మాది తేయనుత ,మంగళ మెప్పుడు గాత నీకు స-ర్వం గత సంగతా పెసరవాయి పురస్థిత త్ర్యంబ కేశ్వరా’’అని శతకం పూర్తిచేశాడుకవి .
దీనికింద గద్యం లో ‘’ఇది శ్రీ మదాన్జనేయానుగ్రహోప లబ్ధ ,సరస కవితా సామ్రాజ్యాధి వైభవ రమానాథాభిధేయ ద్వితీయ తనూభవ ,’’వికటవాద పరాయణ ‘’ ఇతి భీకర వినయ ,నమిత సుకర ,వశీకర లాక్షిణిక ,జనవిధేయ ,లక్ష్మణ నామ ధేయ ప్రణీత౦బైన ‘’పెసరవాయి పురస్థిత త్ర్యంబ కేశ్వర శతకము సంపూర్ణము ‘’ అని రాసుకొన్నాడు .మన వికటకవి రామలింగని వంటివాడే ఈ లక్ష్మణ కవి అనిపిస్తోంది .అతనిది సరస కవితాసామ్రాజ్య వైభవం .తండ్రిపేరు రమానాథుడు .కవి రెండవ కుమారుడు .తన వినయం భీకర వినయం ట.లక్షణ శాస్త్రాలన్నీ కరతలామలాకాలే కవికి .మీదు మిక్కిలి హనుమ ఉపాసకుడు .ఆయన బలవంతుడైతే,ఈ కవి కవితా బలసంపన్నుడు .అంతే తేడా .అందుకే ఏ పద్యాన్ని ఎత్తుకొన్నా ,ఎక్కడా కుంటుపడక యమక అనుప్రాసలతో సర్వాంగ సుందరం చేశారు .108 ఉత్పలాలతో శతక మాలిక అల్లి ,తన హృదయేశ్వరుడైన త్ర్యంబ కేశ్వరుని అలంకరించి ధన్యుడయ్యాడు .చక్కని ధారా శుద్ధి ఉంది. సులభమైన పదాలతో నిజభక్తితో రాసి , కవి ధన్యుడైనాడు .
ఈ శతకం గురించీ ఈకవి కేసనపల్లి లక్ష్మణ కవి గురించి కూడా మనవాళ్ళు ఎవరూ ,ఎక్కడా ప్రస్తావించినట్లు లేదనిపిస్తోంది .కవినీ శతకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .కవి చెప్పుకొన్న మాటలుకాక ,ఆయన గురించి వివరాలేవీ లేవు .త్ర్యంబ కేశ్వర స్వామి చరిత్ర కూడా కవి రాయ లేదు .భక్తిలో ఊగి పోయి రాసినకవిత్వమిది.
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-21-ఉయ్యూరు

