వింత ఆలయాలు విచిత్ర విశేషాలు
1-లక్ష్మణ రేఖ ను చూపేఆలయం –నాచ్న దేవాలయం
మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో గుప్తులకాలం నాటి నాచ్నకుఠార దేవాలయ సముదాయం లో రామాయణ గాథలున్న రాతి నిర్మాణ దేవాలయం లో రావణుడు సీతాపహరణం కోసం మాయా యోగి రూపం లో రావటం ,సీతాదేవి లక్ష్మణుడు గీసిన రక్షణ రేఖ అయిన లక్ష్మణ రేఖను దాటి వచ్చి అతడికి భిక్ష వేయటం శిల్పీకరించి ఉంది .నాచ్నా కు 15కిలోమీటర్ల పరిధిలోపిపారియా ,కొహ్ భూమార మొదలైన చోట్ల అనేక చిన్న చిన్న ఆర్కిటెక్చర్ సైట్స్ దర్శనమిస్తాయి .ఈ ప్రదేశాలలో ఇటుకనిర్మాణ దేవాలయాలన్నీ శిధిలం కాగా ,రాతి నిర్మాణ గుడులు కాలానికి తట్టుకొని నిలబడ్డాయి .శిధిల శిల్పాలలో వరాహావతారం కూడాఉంది .
2-సజీవంగా ఉన్న భిటర్గాంవ్ ఇటుక దేవాలయం –
ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో 5వ శతాబ్ది గుప్తులకాలం నాటి ఇటుక దేవాలయం ఇప్పటికీ ఆకర్షణీయమే .శిదిలభాగాలను ఎప్పటికప్పుడు పునర్నిర్మిస్తూ ఈ ఆలయాన్ని కాపాడుతున్నారు .ఈ ఆలయం భారత్ లోని అత్యంత పెద్ద ఇటుక నిర్మాణ దేవాలయంగా రికార్డ్ సాధించింది .గర్భ గృహం పై పిరమిడ్ ఆకారపు శిఖరం ఉండటం ప్రత్యేకత .శివ ,విష్ణు మూర్తులున్నారు .అలేక్జాండర్ కన్నింగ్ హాం దీన్ని మొదటి సారిగా చూశాడు .
3-బెహ్తా బుజుర్గ్ జగన్నాథ వాన దేవాలయం –
భిటర్ గాంవ్ దేవాలయం కు 5కిలో మీటర్లలో జగన్నాథ దేవాలయం బెహ్తా బుజుర్గ్ లో ఉంది .ఇది ఎత్తైన బౌద్ధ స్తూపంగా కనిపించి ఆశ్చర్య పరుస్తుంది .దగ్గరకెళ్ళి చూస్తె హిందూ నగర వర్తులాకార శిల్ప నిర్మాణం కల దేవాలయం అని తెలుస్తుంది .శివ విష్ణు శిల్పాలు ముచ్చట గొల్పుతాయి .విష్ణువు శేష శయనుడుగా కన్పిస్తాడు .ఇవి నల్లరాతి విగ్రహాలు .’’వాన దేవాలయం ‘’గా దీన్ని భావిస్తారు. ఈ ఆలయపు సీలింగ్ నుంచి నీటి బొట్లు పడటం చూసి త్వరలో వర్షం రాబోతుంది అని స్థానికులు గ్రహిస్తారు కనుక దీనికి వాన దేవాలయం –రెయిన్ టెంపుల్ అని పేరొచ్చింది .
4-రాజు దేవుడిగా పూజింపబడే దేవాలయం –పో క్లాంగ్ యాగ్రై
పో క్లాంగ్ యాగ్రై 1151-1205 వరకు పాండురంగ లోని చంపా ప్రాంతాన్ని పాలించిన రాజు .ఆపేరు ఆయన పేరుకాదు బిరుదునామం .స్థానిక తెగలలో నుంచి జతోయ్ పేరుతొ వచ్చాడు .ఆ బిరుదుకు చంపా భాషలో అర్ధం ‘’డ్రాగన్ రాజు ‘’.లేక డ్రాగన్ల రాజు లేక జటాయ్ ప్రజల రాజు .పో అంటే రాజు .క్లాంగ్ అంటే డ్రాగన్ .యాగ్రై అంటే డ్రాగన్ ప్రజలు అని అర్ధం .ఇతడిపాలనాకాలం లో అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కట్టాడు .బహుశా ఇతడే నాలుగవ చంపా వంశ జయఇంద్ర వర్మ రాజు కావచ్చు .చంపారాజు మూడవ జయ సింహ వర్మ ఈదేవాలయాన్ని నిర్మించాడు .పో క్లాంగ్ యాగ్రై పశువులకాపరి .క్రమంగా రాజయ్యాడు .చక్కగా ప్రజారంజకంగా ప్రజలను పాలించాడు . కంబోడియా రాజు ఖ్మేర్ దండెత్తి వచ్చినప్పుడు యుద్ధం లేకుండా శాంతిచేసుకోవాలనుకొని అతడితో ఎత్తైన గోపుర నిర్మాణం పోటీ లో ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం అని పందెం కాసి .తానె అతి ఎత్తైన గోపురనిర్మాణ విజేత గా నిలిచి రాజ్యాన్ని శత్రువులపాలుకాకుండా కాపాడుకొన్నాడు .చనిపోయే దాకా రాజ్యపాలన చేశాడు .ఆతని ధైర్య సాహసాలకు తెలివి తేటలకు ప్రజలు జేజేలు పలికి అతడే తమకు దేవుడు గా భావించారు.అందుకే ఆయన విగ్రహం స్థాపించి దేవాలయం కట్టి నిత్యం పూజించటం మొదలుపెట్టారు .అతడు నిర్మించిన శిఖరం ఇప్పటికీ అతడిపేరుమీదుగానే పిలువబడుతోంది .
5-గుడిసె ఆకారపు లక్షణ పేరుతొ దుర్గాలయం –భార్మౌర్
హిమాచల ప్రదేశ్ భార్మౌర్ లో గుప్తులకాలాన౦తర 7-12శతాబ్దాల మధ్య కాలం లోకట్టిన దుర్గాలయం ఉంది దీనికే లక్షణ దేవి ఆలయం అని పేరు .ఆలయం గుడిసె ఆకారం గా ఉండటం ఇక్కడి ప్రత్యేకత .చెక్క సింహద్వారం ఉంది .అమ్మవారు గర్భగుడిలో లోహమూర్తిగా దర్శనమిస్తుంది .సిమ్లాకు 400కిలో మీటర్ల దూరం లో ఉన్న ఆలయం ఇది .నిరాధార ప్లాన్ తో ప్రారంభించి సంధార ప్లాన్ తో పూర్తి చేయబడింది .మహిషాసుర మర్దని గా దుర్గామాత అనే లక్షణా దేవి దర్శనమిస్తుంది .

