ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -3
తన ప్రతిభకు తగిన పురస్కార గౌరవాలు అందుకొన్నాడు వలత్తోళ్ నారాయణ మీనన్ .1919లో కొచ్చిన్ మహారాజు ‘’కవి తిలక ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .1948లో మద్రాస్ ప్రభుత్వం నలుగురు ఆస్థానకవులలో ఒకరుగా చేసి గౌరవిన్చింది.కేంద్ర సాహిత్య ఎకాడమి సభ్యుడిగా ,కేరళ సాహిత్య అకాడెమి ఉపాధ్యక్షుడుగా పని చేశాడు .1955లో భారత ప్రభుత్వం ‘’పద్మ భూషణ్ ‘’పురస్కారమిచ్చి గౌరవించింది .పాఠక అభిమానులు ఆయనను ‘’మహాకవి ‘’బిరుదునిచ్చి హృదయం లో ప్రతిష్టించుకొన్నారు
1950లో 72వ ఏట వార్సా లోని శాంతి సమావేశానికి హాజరయ్యాడు .ఇంగ్లీష్ కాని మరే ఇతర పాశ్చాత్య భాష కానీ రాని ఆయన వార్సాలో తనపద్యం వినిపించాడు .పారిస్ యూని వర్సిటిలో కథాకళి గురించి మహోపన్యాసం చేశాడు .చైనా ,మలయా సింగపూర్ లో కథా కళీ ప్రదర్శనలిప్పించాడు .తను చాలాకాలం సభ్యుడుగా ఉన్న కేరళ సాహిత్య పరిషత్ కు 1946లో అధ్యక్షుడై,పదేళ్ళు నిరాటంకంగా దాన్ని మహారాజులా ఏలాడు .సంస్థ వార్షిక సమావేశాలో అతని ప్రసంగాలన్నీ పుస్తక రూపం పొందాయి .13-3-1957 న 79వ ఏట కేరళ సాహిత్య సరస్వతి పద్మభూషణ్ వలత్తోళ్ నారాయణ మీనన్ నారాయణ సాన్నిధ్యం చేరుకున్నాడు . .
సాహితీ నారాయణీయం
12వ శతాబ్దినుంచి మలయాళకవిత్వం ‘’మణిప్రవాళ’’శైలిలో -అంటే సంస్కృత మణులు. మళయాళ పగడాలతో శోభగా ఉండేది .ఎన్నెన్నో సంస్కృతపదాలను మలయాళం జీర్ణించు కొన్నది.దీన్ని బాగా వంట పట్టించుకొన్న మీనన్ గేయకవిత్వంలోనూ పరుగులు తీసే సంస్కృతపదాలు వాడి కొత్తదనం తెచ్చాడు .ఎంటే గురునాథన్ –నాగురువు గాంధి అనే కవితలో –‘’గీత జన్మించిన భూమి మాత్రమె –కర్మవీరునికి జన్మభూమి –హిమగిరి వి౦ధ్యలమధ్య దేశమే నిగ్రహమెరిగిన కేసరి అవుతుంది –తల్లి గంగచే తడుపబడిన భూమే –కల్పతరువుకు కన్నతల్లి అవుతుంది ‘’.గాంధీలో ఆయనకు విశ్వామిత్రుని వైరాగ్యం ,జనకుడి కర్మయోగం ,భీష్ముడి ధర్మ యుద్ధ పరాక్రమంకనిపించాయి .మేరీ మేగ్దలీన్ లో ఏసు క్రీస్తు కృష్ణుడుగా కనిపించాడు –సాటి ఎరుగని శ్రావ్యమా మురళి –క్రీస్తుయే కృష్ణుడైసవరించే మురళి ‘’అంటాడు .సూర్యుడిని మూర్తీభవించిన జ్ఞానం అన్నాడు –‘’పూజారి పూలపళ్ళేమైనా ,జాలారి వంటకుండ అయినా –సమంగా ముద్దిస్తాయి నీ కిరణాలు –సహజంగా అవి అతి పవిత్ర కిరణాలు ‘’అన్నాడు .
పాలుపితుకుతున్న తల్లి యశోదను ఆనుకొన్న చిన్ని కృష్ణుడు –అడపా దడపా భూమిని పుడుతూ –చెడు ఖండించి మంచి పెంచుతాడు –‘’త్రిలోకాలకూ సరిపడు పదాల –త్రిస్థాయిలో నృత్యం చేస్తాడు .-‘’పసి బాలుడిగా పైకి కనిపించినా –ఏలే దొరవని తెలుసులే –రక్షణ నిచ్చే రాజ విరాజా –నల్లని సామీ నమస్సులివిగో ‘’అంటాడు నారయణమీనన్ .అక్రూరుడికి కనిపించిన కృష్ణుడు –నందుని నట్టింట హరి వెలిగించిన ఆశల అందాల దివ్వె –యశోద గుండెనిండా నీలాల రవ్వ –గోపికలతో గెంతే చిన్నారి నెమలి –వెర్రిగొల్లల బతుకు వెన్నెల చేసినవాడు ,వేదాలు నేర్చిన విద్వాంసులు ఎరిగిన విశ్వ రహస్యం ఆతడు ‘’
గాంధీ అవతరణలో –కొత్త బుద్ధుని చూడ కోర్కె కలిగింది –కనులని౦డుగా కాంతి నింపింది –రూపు దాల్చిన వెలుగు ఎదుట నిల్చింది –గురుపాద దర్శన భాగ్యమమరింది -కాశీ ప్రయాణం కుదిరింది కానీ –గంగలో మునిగే భాగ్యమబ్బలేదు ‘’అని నిట్టూర్చాడు .కవిత అతనికి –‘’అలసి ఉన్న పసిబాలుని చిరుబుగ్గల చిత్తడిలో –కవితా ! నీ కమనీయాకృతి-కన్నుల కనుపట్టు సుమీ ‘’
లంకలో ‘’మండోదరి ఉండే దరి –లంకాపురి కేదీ సరి ?అన్నాడు
జాతీయ కవిత్వం
మాతృవందనం లో –అమ్మకు హారతులు –మాఅమ్మకు నతులు-జీవనమిడి,దీవేనలిడు-సత్రాజితుకు అ మిత్రుడు శమంతకం ఇచ్చినట్లు-కడలి పరశురాముడికిడిన రత్నమిదే ‘-అమ్మమాట వేదము ,అమ్మసేవ పరమార్ధము –అమ్మకొరకు నైవేద్యమైన –బ్రతుకు కడు ధన్యము –పుణ్య మాతృభూమి మ్రోల –పుడమి వేరు దైవమేల ?”’అని తన ప్రగాఢ దేశభక్తి చాటుకోన్నకవి మీనన్.’’శాంతి మా ఐశ్వర్యం ‘’అని చాటాడు .’’సంగ్రామ సంరంభం లో వైరాగ్యపు పిలుపు ,వేటగాడి గుడిసెలో పడుపుకత్తె నివాసం లో నైనా –పవిత్రత గుబాళింపు –ఇదే హిందూ దేశం దాని ఔన్నత్యం హిమాలయ శృంగం ‘’అన్నాడు .కర్ణుడు మన తాతలనాటి నేత –తాతల తలదన్ను దాత ‘’-ఓ పాముబతుకు పాలుపోద్దామని –ఒక పక్షికాలేదా కుక్షికి కూడు ?’’అని త్యాగపురుషులను కీర్తించాడు .తనగురువు గాంధీకి –‘’తారకలే మాలికలై వెలుతురూ వెదజిమ్మాయి ‘’ఆయనకు క్రీస్తుత్యాగం కృష్ణుని ధర్మగుణం ,బుద్ధుని అహింస ,రంతిదేవుని కారుణ్యం ,హరిశ్చంద్రుని సత్యవ్రతం .మహమ్మదు స్థిరత్వం ఆవేశించాయి .
ఇంగ్లీషు వారి ఆటలిక సాగవు అని అన్యాపదేశంగా –‘’పెనుచీకటి ఆటవికులు ఇక చెల్లా చెదరు –అడవిలో చిక్కుకున్న వెలుతురుకు విడుపు –తూర్పు దిశతనదారిద్ర్యపు ఉడుపు –సాగరాన పారవేసి సరిగా చీర దాల్చు –నా వెనుక యువకులనాజూకు పాదాలు –నలగకుండా ఉంటె అదే పది వేలు ‘’అన్నాడు
లఘు కృతులు
లలో సమస్తజగమూ కవితాగానం చేస్తుంది .ద్రావిడ ఛందస్సు మంజరి లో ‘’కిలిక్కొంచల్ ‘’రాసి తన కళాభిజ్ఞత నంతటినీ ప్రదర్శించాడు –బాల సీత –మణులతో పసిడితో మెరసేటి మెడపైన-పషి కూనల నదిమి పరవశించింది –చిన్ని ఎర్రని నోరు –చెవిప్రక్క తాకించ – కెంపు అతికినయట్లు ‘’కన్పించి౦ది-పక్షి దేహము సొగసు ‘’ .’’నరేంద్రుని ప్రార్ధన లో స్వామి వివేకానందకళ్ళల్లో ఒకరోజు రామకృష్ణ పరమహంస కు నీళ్ళు కన్పించాయి .స్వామి గానం అమృత లహరి ఆయనకు .శిష్యుడి దుఖానికి చలించిపోయిన గురువు –‘’లోకం శోకం తుడుస్తావని –శపథం చేసిన నరేంద్రబాబూ – నీ కంట్లోనా కడివెడు దుఖం ??’’అని అడిగితె తన తల్లి చాలారోజులనుంచి పస్తులు ఉంటోందని చెప్పాడు .తండ్రి ఉన్నప్పుడు ఆయిల్లు మానవ సేవకు కేంద్రం ఇప్పుడు దారిద్ర తాండవం .గురువు తరుణోపాయం చెప్పాడు –‘’కరిగి దొరలే వెండిఏ గంగ చలువ ?-విరిసి మురిసే పైడి ఇనుడు ఎవ్వరివాడు –ఇరులు చీల్చే మణుల తారల తావేది ?కాళికాజననికి-కేళకావని ఇది –ఆమాతనే అడుగు –లేమి తొలగు ‘’అని హితవు చెప్పాడు .అల్లాగే కాళికాలయానికి వెళ్లి, కాసేపట్లో మళ్ళీ గురువు దగ్గరకు కన్నీళ్ళతో రాగా కారణం అడిగితె –సంపదకాదు నేను అడిగింది గురువరా –సంపద అనే సంకెల లనుంచి విడుదల ‘’అన్నాడు .’’నువ్వే ఈమాయను విడదీయగలవు ‘’అన్నాడు గురువు .
రైతు జీవితాన్ని అక్షరబద్ధం చేసి చివరికి ‘’సర్వే జనా సుఖినో భవంతు ‘’తో పూర్తి చేశాడు కవి .తనకు మళయాళ భాషపై ఉన్న అభిమానాన్ని చాటుతూ ‘’ఎంతేభాష ‘’-నా భాష ను మక౦ద మంజరి ఛందస్సులో రాశాడు –‘’పెరియార్ మధుప్రవాహాలు –చందనవన పరిమళాలు –సంస్కృత సహజ రుచులు –మధుర తమిళ నుడి సొగసులు –కలుపుకున్న కలభాషిణి –నామళయాళ౦ మందాకిని ‘’అని ఉప్పొంగిపోతాడు .’’కన్నతల్లీ నుడులు గంపెడు మల్లెలు –తల్లిపాలు తాగి పెరిగిన పిల్లలే –ఆరోగ్యభాగ్యాన అలరారు ధన్యులు –సురలోకము నుండి సుధను తెచ్చిచ్చినా –అమ్మ వడ్డిస్తేనే అమృతము మాకు ‘’అని తల్లిభాషలోనే అన్నీ నేర్చుకోవాలని ఆనాడే హితబోధ చేశాడు నారాయణ మీనన్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-21-ఉయ్యూరు

