కల్లోల’’ కరోనా’’కు అద్దం పట్టిన చలపాక ‘’నానీలు’

కల్లోల’’ కరోనా’’కు అద్దం పట్టిన చలపాక ‘’నానీలు’’
గత రెండేళ్లుగా కరోనా సృష్టించిన కల్లోలం ,మానవ జీవితాలు ఛిద్రమైన విధానం విలువలు మంటగలిసిపోవటం,కరోనాతో చనిపోయిన వారిని పలకరించలేని, కనీసం కడసారి చూసే౦దుకు ,కుటుంబ సభ్యులైనా అంత్యక్రియలలో పాల్గొన వీలులేని దయనీయదుస్థితి , వైద్యానికి లక్షల్లో ఖర్చు తో కుదేలైన ఆర్ధిక పరిస్థితి అన్నిరంగాలలో ఎదురైన మాంద్యం ,తిండికి లేక కటకటలాడిన బడుగు బలహీన వర్గాల దైన్యం ,వలసకార్మికులు వేలాది మైళ్ళు నడిచి స్వగ్రామలు చేరుకొనే హైన్యం ,పార్టీలు వీటిని వేటినీ పట్టించుకోకుండా తమ రాచకీయపాచికలాటలో రాక్షసానందం పొందటం ,ఇంతటి కల్లోలం లోకూడా వైద్య ,పోలీసు, వెట్టి సిబ్బంది చూపిన మానవ కారుణ్యం ,సాయమందించిన ఆపన్న హస్తాలకుచూపిన కృతజ్ఞతా భావం తో ‘’నానో వైరస్’’కరోనా పై నాలుగేపాదాల ‘’నానీలశతకం’’ రాసి ,ప్రచురించి ,అన్నికోణాలలోనూ ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకుడు శ్రీ చలపాక ప్రకాష్ అభినందనీయుడు .కరోనా కాటుకు బలైన తన పెదనాన్న శ్రీ చలపాక సాధు సత్యనారాయణ గారికి అ అంకిత మివ్వటం సముచితంగా ఉంది .అంతే కాదు చివరలో కరోనాకాలం లో మరణించిన సంగీత ,సాహిత్య ,వివిధ రంగాలలో మిత్రుల పేర్లను ,మరణ తేదీలను కూడా ప్రచురించి స్మరించటం ఉదాత్తంగా ఉంది .,కరోనాపై ఇంతకు ముందు వివిధ రచయితలు , కవులు ప్రచురించిన కరోనా సాహిత్యం సూక్ష్మ పరిచయాలు ముఖ చిత్రాలు చేర్చటం కూడా ప్రకాష్ కున్న నిబద్ధతను చాటింది . ఇప్పుడు లోపలి విషయాలు తెలియజేస్తాను .
‘’మిత్రువెవడో శత్రువెవడో కరోనా తెలిపింది ‘’అన్న మొదటి నానీ నుంచి ‘’ఫస్ట్ వేవ్ ఆస్పత్రి వైపు –సెకండ్ చావు లైతే –ఇక థర్డ్ కేం మిగిలింది ?తో కరోనా నానీలు పూర్తయ్యాయి .అనుబంధంగా వివిధ అంశాల నానీలు ,చివరగా చిన్నారి చలపాక లోకేశ్వరి ‘’జలుబొస్తే వస్తుంది ‘’తుమ్ము’’ –కరోనా వస్తే నువ్వు మూస్తావు’’కన్ను ‘’.చివరగా ‘’లాక్ డౌన్ లో బయటికెడితే –పోలీసు’’ కేసు’’ –జరిమానాతో –నీ కౌతుంది ‘’లాసు ‘’అని’’క్లాసు ‘’గా రాసి మంచి భవిష్యత్తు ఉందనిరుజువు చేసిందిచిన్నారికవి .
కరోనా పడవ ముంచేసి కుటు౦బాన్నిచిన్నాభిన్నం చేసింది ,ఆదుకోటానికి వెళ్ళిన అంబులెన్స్ –మహాప్రస్థానమై తిరిగి వచ్చింది ‘’అనగానే దుఖాశ్రువులు జలజల రాలిపోతాయి .శావాలకుప్పల్లో –శత్రుమిత్రులు కలిసిపోయారట .జాషువారాసిన స్మశాన వాటిక పద్యం గుర్తుకు తెస్తుంది.మాస్కుల, శాని టైజర్ల ,ఆక్సిజన్ సిలిండర్ల వ్యాపారాలతో కోటికి పడగలెత్తినవారున్నారు .’’కాదేదీ వ్యాపారానికి అనర్హం ‘’అని రుజువు చేసుకొన్నారు .పెళ్ళికి వెళ్ళిన మితిమీరిన జనం తిరిగి వెళ్ళేది – ఆస్పత్రికో , స్మశానానికో ‘’?ప్రశ్న ఆలోచన రేకెత్తించేదే .కరోనా నంజుడుకు గుడైనానా బడైనా తీర్ధమైనా క్షేత్రమైనా ఒక్కటే అనే వేదాంతం .ఆప్యాయతను ప్రేమను సూచించే కౌగలింత ,ముద్దు లేనప్పుడు ప్రయోజనం ఏమిటని నిర్వేదం .కుగ్రామమైన ప్రపంచమంతా ‘’ఒకే మాస్కులో’’ అనే దరువు ..
‘’ కరోనాలో –ప్రాణాలు పోసే వారికంటే –మోసుకెళ్ళే వాళ్ళ- అవసరమే ఎక్కువ’’ ఆమహమ్మారి విలయతాండవానికి ప్రతీక . సెకండ్ వేవ్ లో’’ కావాల్సింది –ఆక్సిజనో –స్మశానాలలో జాగానో ‘’అని దాని విపరీత పరిణామాన్ని కనులము౦దు౦చాడు కవి .చెట్లు నరికి సహజ ప్రణవాయువు కు నష్టం కలిగించి –దొరకని ఆక్సిజన తో ప్రాణాలపై ఆశ ‘’పెట్టుకొన్న తెలివి తక్కువ ప్రజలకు చెంప వాయింపు .లాక్ డౌన్ నేర్పిన పాఠం’’ఇల్లేరా స్వర్గసీమ ‘’.’’ఆన్ లైన్ పార్సిల్ ఫుడ్ –ఆస్పత్రి లో బెడ్ .కుదారి అనే హెచ్చరిక .అప్పుడు ఆక్సిజన సిలిండర్ తోఅంతరిక్షానికి –ఇప్పుడు అదే సిలిండర్ తో ముందు ఆస్పత్రికి ,తర్వాత కాటికి ‘’అనే కఠోర సత్యావిష్కరణ .ఒకప్పుడు తుమ్ము మంచిదే లోపలి ఛిద్రం బయటికి పోతుందని నమ్మకం –ఇప్పుడు తుమ్మినా దగ్గినా శిక్షార్హమే- ‘’ఐసొలెషన్ కే’’అనే చమత్కారం .కరోనాను జయించిన వాడే నేడు మొగాడు ‘’.మనీ పర్సు తప్ప అన్నీఆన్ లైన్ లోనే అనే వెటకార౦ .ప్రపంచమంతా దాదాపు అన్నికుటుంబాలు కరోనా బాధితులే ఏరూపంలోనైనా—కారణం –క్షణం క్రితం పక్కనున్నవాడు –ఇప్పుడు మాయం .ఆశ్చర్యం ,విషాదం, కన్నీళ్లు, ఉద్వేగం .,నిర్వేదం .
‘’కరోనా –నువ్వు అంటే భయపడంది-ఎవరో తెలుసా ?-సూర్యుడు చంద్రుడు ‘’అంటే వారిద్దర్నీ తప్పించి అందరి పనీ పట్టేసిందింది కరోనా .పుణ్యం చేస్తే స్వర్గం –పాపం చేస్తే నరకం –కరోనాతో పొతే –ఎక్కడికి ??అనే ప్రశ్న .నా సమాధానం ‘’త్రిశంకు స్వర్గం ?వర్క్ ఫ్రం హోం లో మగాళ్ళకు పెరిగింది ఇంటిపనులు .కాటికాపరి పెట్టె కన్నీళ్లు శవాలు కాల్చలేకా ?ఖాళీలు లేకా ?అర్ధం కావటం లేదు .ఇదో దయనీయ పరిస్థితి .’’కాలిపోతున్న కొవ్వొత్తిలా జనాలు –రాలిపోతున్న పిట్టలై –మరణాలు ‘’ యదార్ధానికి అద్దం పట్టిన నానీ ‘’అరిచే నోటికి తాళం –నేటి మాస్కు ‘’కరోనాను అ౦తమొందించే వైద్యం కోసం అందరం కలిసి తపస్సు చేయాలని విన్నపం అంటే అందరం జైన మౌనులవ్వాలన్నమాట .టెర్రరిజ౦ ఆట కట్టించింది –ప్రభుత్వం కాదు –కరోనా అని నిష్టూరం .సోనూ సూద్ లాంటి విలనే నిజమైన ప్రాణ రక్షక హీరో –మనహీరోలు అతని ముందు జీరోలు ‘’అని నిర్భయంగా చాటిన నానీ .అందరికీ లాక్ డౌన్ ఉందికానీ –‘’పంట పం డించేవాడికీ –వంటవండి వడ్డించే వాడికీ లేదు ‘’అన్న సానుభూతి .ఇదివరకు భూతల స్వర్గాలు౦డేవి-ఇప్పుడు భూలోక నరకాలే అన్నీ అనే ఆవేదన .మితిమీరిన జాగ్రత్తతో పక్క ఊరినుంచి వచ్చినా –కరోనా టెస్ట్.లాక్ డౌన్లో మనుషులు –ప౦జర౦ లో పక్షులే .కరోనాకాలం లో శవవాహకులెవరు అంటే –‘’అందరూ ఉన్నా ఏమీ కాని వాళ్ళు ‘’
‘’వెలి వెయ బడిన వాడికన్నా –నీచమైపోయాడు కరోనా పేషెంట్ ‘’ అంటుకొనే ముట్టుకోనే, రాసుకు, పూసుకు తిరిగే వారు లేక. అదీ దౌర్భాగ్యం .అంటరాని వాడైపోయాడు కరోనాపే షేషంట్ అని ఆక్రందన, జాలి ,సానుభూతి, సహవేదన ఆవేదన .కరోనాలో కరువుతో బాటు ఉవ్వెత్తున లేచింది –కరుణ ‘’అన్న వాక్యం కోటబుల్ కోట్ .విదేశీ టూరిష్టు లు –హాస్పిటల్ బెడ్ ల కోసం వెతుకుతున్నారని చమత్కారమే అయినా, నిజమైనకంటి ముందు సత్యమే .కరోనా చేసిన మేలు –నమస్కారం అనే సంస్కారాన్ని గుర్తు చేయటం అంటాడు ప్రకాష్ .మరోమేలు చడదువులేకుండా పైతరగతికి ‘’బ్రహ్మానంద రెడ్డి పాస్ ‘’.దీనమ్మకడుపుకాలా –సినిమాలన్నీ ‘’ఒటిటి’’ లో ,సభలు జూమ్ లలో అయిపోయాయి నిబంధనలతో .కరోనా సమయం లో ఇల్లంతా పిల్లల సందడి –తో ని౦డినందుకు –దానికో నమస్కారం పెట్టి సంస్కారం చూపింఛి కరోనా నానీలను చాలించాడు చలపాక .
ప్రకాష్ లోక పరిశీలను ,నిశిత దృష్టికీ,సానుభూతి సహవేదనలకు ,దయాంతర హృదయానికి ,కారుణ్య సంవేదనలకు ఈ కరోనా నానీలు అద్దం పట్టాయి .ప్రతి నానీకి పైన ఒక వార్తా చిత్రమో ,ఒక దృశ్యమో జత చేసి గొప్ప ఎఫెక్ట్ కలిపించారు .అందమైన అర్ధవంతమైన ముఖ చిత్రాలతో పుస్తకం, కరోనా తరుమబడ్డ లోకం లా ప్రశాంతంగా ఉంది .
గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-21-ఉయ్యూరు
.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.