26- కరుణా భాస హాస్యం
తాత్కాలిక ఎడబాటును భయంకర వియోగంగా వర్ణించి వికృతి సాధించి హాస్యం పిండవచ్చు.ఉదాహరణ –ఒకడు మిత్రుడిని వదిలి పనిమీద వేరే ఊరు వెళ్ళాడు .దీన్ని భరించలేక మిత్రుడు ‘’మిత్రమా వెడుతున్నావా /మమ్మల్ని వదిలి వెడుతున్నావా ?దుఃఖ సాగరం లో ముంచి వెడుతున్నావా ?రెండు రోజులదాకా నీ ప్రసన్న మందహాసం చూడ లెం కదా .నీ వియోగం ఎలా భరించం ?మిత్ర వియోగం కంటే దుఖం ఇంకా ఏమి ఉంటుంది? నిప్పులోనైనా నీటిలోనైనా దూకుతా విషం పుచ్చుకొంటా.. తాడు దొరికితే ఉరేసుకొంటా .నేనే నీకు నిజమైన స్నేహితుడిని అయితే నేను తాగుతున్న కాఫీ విషమై నాప్రాణాలు హరించి నేను హరీ అగుదునుగాక ‘’అని ఏడుస్తుంటే మనం పిచ్చపిచ్చగా నవ్వుకొంటాం .
శృంగారాభాసం –దంపతులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొన్నారు .ఒకర్నొకరు తరచుగా మెచ్చుకొంటారు .కొంతసేపటికి అది పోట్లాటగా మార్తుంది .ఇదే శృంగారాభాసం అన్నారు మునిమాణిక్యం సార్.
భీభత్సాభాసం –‘’మా ఇంట్లో ఆ మూల చూడండి భీభత్సం .అదొక మహారణ్యం సింహాలు పెద్దపులులు ఏనుగులు ఉన్నాయి .ఒకరోజు అవి పోట్లాడుకొంటున్నాయి .భయంకర యుద్ధం చేశాయి .తొండాలు తెగాయి తలలు కాళ్ళూ చేతులు తెగిపోయాయి. మా అబ్బాయి అమ్మాయి చికిత్స చేశారు .గుడ్డపేలికలతో తలలను అతికించారు. సింహాలు గాండ్రు మంటున్నా లెక్క చేయకుండా కట్లు కట్టారు. అవి ఏడుస్తున్నాయి ‘’ఇదే భీభత్సాభాసం అంటారు మాష్టారు .
భక్తి రసాభాసం –స్వంత అనుభవమే చెప్పారు మునిమాణిక్యం –‘’మా ఆవిడ హరినాధ భజనలు చేసేది .అమ్మలక్కల అంతా చేరి భజన చేస్తారు .భజన మాంచి పట్టులో ఉన్నప్పుడు తన్మయత్వం లో కళ్ళు మూసుకొని పాడుతారు. దేవతా నైవేద్యాలకు తెచ్చిన ఫలహారప్పళ్ళాలు ఖాళీ లయి పోయేవి .బాబా గారికోసం వెండి గిన్నెలో పరమాన్నం లడ్డూ లు పెట్టేవారు .బాబా ఎప్పుడో అప్పుడు వచ్చి ఆరగించి పోయేవారు .కానీ ఆస్వామి రావటం ,పోవటం ఎవరికీ తెలీదు .భక్తులు కళ్ళు తెరిచి చూసేసరికి పదార్ధాలు హుళక్కి .అంటే బాబా తినేశారని చెప్పుకొనే వాళ్ళు ‘’. మా ఇంట్లో కూడా భజనలు ఏర్పాటు చేసింది మా ఆవిడ .కొన్ని రోజులు బాబా ఆరగింపు జరక్కపోయేసరికి ఆవిడకు చాలా విచారం కలిగి ,ఇంకా తీవ్రంగా భజనలు సాగించింది .ఒక రోజు బాబాకు మా అవిడపైనా అనుగ్రహం కలిగింది .అందరిళ్ళలో పదార్ధాలు మాయమవుతుంటే ,మా ఇంట్లో పదార్ధాలతో పాటు వెండి గిన్నె కూడా మాయమయింది .అంటే స్వామి పదార్దాలతోపాటు వెండి గిన్నె కూడా ఆరగింపు చేశాడన్నమాట .దీనికి ఎవరేం చేస్తారు ?నేనుమాత్రం ‘’బాబా !నేను నీ భక్తుడిని మా ఇంట్లోనూ ఆరగిస్తున్నందుకు ధన్యులమయ్యాం .అందరీళ్లల్లోలాగా నీకిష్టమైనవి ఆరగించు. కానీ మహా ప్రభో వెండి గిన్నెల్ని ,గుండు చెంబుల్నిమాత్రం మాయం చేసి నీ మహాత్యం ప్రదర్శించద్దు.భక్తీ ముదిరి మా ఆవిడ మెడలోని బంగారపు గొలుసు మాయం చేయబోకు .భజన సమయం లో పటికబెల్లమో కొబ్బరిముక్కలో వర్షిస్తున్నావట.మా ఇంట్లో మాత్రం బంగారు కడ్డీలు వర్షించి ధన్యులను చెయ్యి ‘’ ‘’అని వేడుకోన్నాను ‘’అని చెబితే విన్నవాళ్ళు పగలబడి నవ్వకేం చేస్తారు?
శ్రీ మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-22-ఉయ్యూరు
.
.
—

