రాంగేయ రాఘవ -3చారిత్రిక దృష్టి

రాంగేయ రాఘవ -3
చారిత్రిక దృష్టి
రాఘవసృజనాత్మకంగా ‘’ముర్దోం కా టీలా’’నవలను అద్భుతకల్పనలతో రాశాడు .ఆర్యులు దురాక్రమణ దారులు గా ,ద్రావిడులు సర్వం కోల్పోయిన వారిగా చెప్పాడు .మొత్తం భారతీయ మానవ వికాసం దృష్ట్యా ఆయన పరిశీలించి చెప్పాడు .బానిసబతుకు వ్యతిరేకించాలని ఉద్బోధించాడు .’’ధూళి కణమా హిమాలయంగా మారిపో. నా ధమనుల్లో ద్రావిడ రక్తం కుతకుత ఉడుకుతోంది .సింహ గర్జనలతో వెంటాడి పోరాడు ‘’అంటాడు .మొహంజొదారో నేపధ్యం లో రాసిన నవల ఇది .కన్హైలాల్ హరప్పా నాగరకత నేపధ్యం లో రాశాడు .రెండిటిలోనూ వస్తువు ఒక్కటే ఆర్యుల దండయాత్ర .తనపాత్రలు చరిత్రలో ఏ దశలో ఉంటె ,అలాగే ఆలోచించి విధులు నిర్వహిస్తాయి ‘’అన్నాడు రాఘవ .చింతన ఆధారం గా కొత్త శిఖరాలు అందుకోవాలి ,పరిణామ క్రమం లో ప్రగతి చూపాలని చెప్పాడు .జ్ఞానాన్వేషణలో ఉదారబుద్ధి తిరస్కరిస్తే అంధకారం లో పడిపోతాం .రాగ ద్వేషాలకు అతీతంగా చారిత్రిక సంఘటనలు వ్యక్తులమీద శాస్త్రీయంగా వ్యాఖ్యానించాడు .సంస్కృతీ సంబంధ మైన ‘’అంతర్భుక్తి ‘’సిద్దాన్తానికే ఎక్కువ ప్రాదాన్యమిచ్చాడు .మనమంతా భారతీయులం ,మానవులం అని ఎలుగెత్తి చాటాడు .వేదాలలో యక్ష గాంధర్వ జైన పరంపరలో కూడా ఈ సిద్ధాంతం ఉంది .సంచార జాతులు ఆకలి దప్పులవల్ల నిరంతరం స్థాన చలనం లోఉండేవి .
రామగాధ వివరిస్తూ రామసుగ్రీవ సఖ్యం ఆర్య అనార్య పరస్పర ఆదాన ప్రదానంగా భావించాడు .దీనివల్ల జాతుల సమ్మేళనం జరుగుతుందన్నాడు .క్షత్రియులు బ్రాహ్మణులు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో జీవితం సాగించారు .పౌరాణిక విశ్వాసాలు జాతుల పోరాటం గురిచి చెప్పేటప్పుడు ‘’టాటే౦’’ను ఆధారం చేసుకొన్నాడు .మహాయాత్రా రెండవ భాగం లోస్కంద గుప్తుడు కుభా నది అంటే కాబుల్ నది చేరి ప్రాణార్పణ చేసుకొంటూ మధురభూమికి నమస్కరిస్తాడు కారణం ఇక్కడే అన్యాయ అత్యాచారాలకు వ్యతిరేకంగా శ్రీ కృష్ణుడు కంసుడిని సంహరించాడు .ఇలా అన్యాయ ప్రతిఘటన రాఘవ ధ్యేయం .గుప్త రాజుల నీతి ప్రజాకల్యా ణ౦గా సాగింది అంటాడు .ప్రజల సుఖ దుఖాల దృష్టితో చరిత్ర పరిశోధన చేయాలన్నాడు .
నాగసేన –పతంజలి సంఘర్షణలో బౌద్ధ బ్రాహ్మణ సంఘర్షణ ఉందన్నాడు .బ్రాహ్మణులు స్వదేశీప్రేమికులుగా గెలిస్తే ,బౌద్ధులు విదేశీయులతోచేతులు కలిపి ఓడిపోయారుఅని వ్యాఖ్యానించాడు .స్వాతంత్ర్య కాంక్షతో మౌర్య చంద్రగుప్తుడు ,పుష్యమిత్రుడు స్కంద గుప్తుడు హర్షుడే కాక రాణాప్రతాప్ ,బహదూర్ షా జాఫర్ ,వాజిదలీ షా ప్రజాసంక్షేమం కోసం ఒక గొప్ప దేశనిర్మాణ౦ కోసం బలిదానం చేసిన మహా వీరులు అన్నాడు .భారతచరిత్ర బాహిరరూపాన్నే కాక ఆన్తర్యాన్నికూడా స్ప్రుసించాను.నిజానికి భారత చరిత్ర వాస్తవానికి దుర్లభమైనది .దాన్ని పరిశోదించటం కేవలం చరిత్రను మాత్రమె చెప్పటం కాదు’’ అన్నాడు .కేనోపనిషత్ వాక్యాన్ని ఉదాహరిస్తూ తన చారిత్రిక దృక్పధాన్ని వివరించాడు .బ్రహ్మజ్ఞాన పరిజ్ఞానం చాలా అల్పమైనదని ఉపనిషత్ కారుడు అన్నాడు అంటాడు .కానీ ఆ సత్యాన్ని తెలుసుకొని మననం చేయాలి అని స్పష్టంగా చెప్పాడు .
రాఘవ కావ్యాలలో మానవ కల్యాణం
రాఘవ సాధనా సంపత్తిలో అతడి కావ్య వైశిష్ట్యం ఉజ్వల సాహిత్య సౌందర్యం అన్నాడు ఒక విశ్లేషకుడు .జయశంకర ప్రసాద్ రాసిన ‘’కామాయినీ ‘’కి పోటీగా రాఘవ ‘’మేధావీ ‘’పద్య కావ్యం రాశాడు .ఇది మానవుడి మౌలిక చింతనా వేదన .తర్వాత సామాజిక స్పృహ ,సమకాలీన చైతన్యంతో’’పాంచాలి ‘’ఖండకావ్యం రాశాడు .నాజీ దురాక్రమణ ను తిప్పికొట్టిన రష్యా ప్రజల వీరోచిత పోరాటాన్ని ‘’అజేయ ఖాన్దహార్ ‘’కావ్యంగా రాశాడు .రష్యా సోషలిస్ట్ సమాజం మానవ విముక్తి దీపం లా వెలుగుతుంది .రష్యన్ల విజయాలు భారత దేశానికి ,సమస్త పీడిత మానవాళి కి సంబంధించిందని అంతర్జాతీయ దృష్టితో చెప్పాడు.చైనాలో ప్రజాపోరాటం నిర్ణయాత్మక దశకు ,భారత జాతీయోద్యమమం చివరి మలుపు కు తిరిగింది .రాఘవ దేశాలు సరిహద్దులు దాటి ఆలోచించాడు. సకల జీవన తత్వాలు ఒక్క చోటికితెచ్చి ఆకళింపు చేసుకొన్నాడు .మానవ జీవన శక్తి సత్యాన్ని చాటి చెప్పాడు .తత్వశాస్త్రం ఖగోళం చరిత్ర సాంఘిక రాజకీయాలన్నీ తనకావ్యం లో కలగలిసి పోయాయని చెప్పుకొన్నాడు .
మేధావి కావ్యం ప్రబంధంగా ఉంటుంది .మేధావి పాత్ర మానవ వినాశనానికి చింతిస్తుంది .వర్తమాన ప్రేరణకోసం పురాణ విషయాలు తెలిపాడు .పాంచాలి ఆత్మాభిమానమున్న స్త్రీ .ధర్మరాజు నుకొత్తగా ఆవిష్కరిస్తాడు .ధర్మాన్ని తనపై అమలు చేసుకోనిచూస్తేనే సత్య దర్శనం అవుతుందని యుధిష్ఠిరుడు అంటాడు .నిరంకుశత్వాన్ని వ్యతిరేకించాడు ధర్మరాజు ,మానవతా దార్శనికుడు ,.తన సోదరుల వీర విక్రమ పరాక్రమాలు తనకు పూర్తిగా తెలుసుననీ ,ఈ సంఘర్షణలో తాను చనిపోయినా ,తనధర్మానికి క్షతి ఏర్పడేదికాదు అంటాడు పా౦చాలితొ . ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి ,బాధ్యతాయుత ధర్మనిర్వాహణ కు, యుగ కర్తవ్యానికి ఇవి మచ్చు తునకలు .జయద్రధుడు ద్రౌపది పై మోహ పరవశుడై వస్తే ‘’నేను కురుభూమిలో విజయ పతాకను నేను చక్రవర్తి మహిమా వైభవాన్ని .ఓరీ సేవకుడా నువ్వు నన్ను భరించగలవురా ఓరీ ఉన్మాదీ!నువ్వు మాతృహీనుడవా పాపీ !స్త్రీ గౌరవం తెలీని మూర్ఖుడా !నేను పవిత్రతను ,కులస్త్రీని ,మాతృ మూర్తిని .నువ్వా నాకు ఆశలు చూపేది ?.జీవితమే రణ రంగం .నేనుచేతులుమారే వస్తువును కాను ద్రోహీ ‘’అంటుంది .జయద్రదుడికి తగిన గుణ పాఠం చెప్పాలని పాండవ సోదరులు భావించినప్పుడు ద్రోపది ‘’ఏది చేస్తే ధర్మం గెలుస్తుందో ,అదే చేస్తాను .అపరాధిని వదిలి క్షమా గుణం చూపిస్తాను ‘’అని ధర్మరాజు తనను ఆవహించినట్లు ధర్మబద్ధంగా చెప్పింది పాంచాలి .అదీ రాఘవ కవిత్వ మహోత్రుష్టత .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.