మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-287

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-287
287-చతుర్భాషా నటి ,డబ్బింగ్ ఆర్టిస్ట్ ‘’మెడిమిక్స్ షొప్ ‘’ఫేం ,బుల్లితెర ఫేం ,సాహిత్య అకాడెమి అవార్డీ,-రోహిణి
రోహిణి దక్షిణ భారత సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. మలయాళంలో ప్రారంభించి తెలుగు తమిళ భాషల్లో కూడా కథానాయికగా నటించింది. నటన కొనసాగిస్తూనే డబ్బింగ్ లో కూడా ప్రవేశించింది. నవమోహిని లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించినా, అంతగా విజయవంతము కాలేదు[1] రోహిణి సినీ నటుడు రఘువరన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది. వీరి వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు 2003లో విడాకులు తీసుకొని విడిపోయారు.
జీవిత౦
రోహిణి స్వస్థలం అనకాపల్లి. ఇంటిపేరు మొల్లేటివారు. తండ్రి రావునాయుడు పంచాయితీ అధికారి. లారీల వ్యాపారం కూడా చేసేవాడు. ఆయనకు స్వతహాగా నటన మీద ఆసక్తి ఉండేది. ఈమెకు ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు. తెలుగు టీవీ నటుడు బాలాజీ కూడా ఈమె సోదరుడే. రోహిణికి నాలుగేళ్ళ వయసులో తల్లి సరస్వతి చనిపోవడంతో చెన్నైకి మకాం మార్చి, సినిమాల మీద ఆసక్తితో తండ్రి స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే రోహిణిని కూడా తీసుకువెళ్ళేవాడు. అలా స్టూడియోలో ఆమెను చూసి యశోద కృష్ణ అనే సినిమాలో బాలనటిగా అవకాశమిచ్చారు. తండ్రికి సినిమాలంటే ఇష్టమే కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండానే సినీరంగంలో ప్రవేశించింది.

సినిమాల్లో అవకాశాలు వస్తూండటంతో ఆమెకు చదువుకునే వీలు కలగలేదు. పన్నెండేళ్ళు వచ్చేసరికి అటు బాలనటిగానూ, ఇటు పెద్దమ్మాయిగానూ పాత్రలు సరిగా రాలేదు. దాంతో ఆమె చదువుకోవడం కోసం నేరుగా ఐదోతరగతిలో చేరింది. మూడేళ్ళు గడిచాక కక్క అనే మలయాళ సినిమాలో కథానాయికగా అవకాశం వచ్చింది. ఆమె రఘువరన్ ని తొలిసారిగా చూసింది అక్కడే. ఆ సినిమా విజయవంతం కావడంతో మలయాళంలో వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా పనిచేసింది.[2] నటన, డబ్బింగ్ లో కొనసాగుతూనే ప్రైవేటుగా ఆంగ్లంలో ఎం. ఎ పూర్తి చేసింది.

డబ్బింగు ఆర్టిస్ట్
డబ్బింగు ఆర్టిస్ట్ గా చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ లకు స్వర సహాయం చేసింది. “లేచి పోదామా” అని కవ్వించే గీతాంజలి నాయిక గొంతు, “చాయ్ పిలాతే” అనే “శివ” నాయిక గొంతు రోహిణిదే. నాలుగు స్తంభాలాట సినిమాకి సహాయ దర్శకులుగా పనిచేసిన పాణి షూటింగ్లో రోహిణిని గమనించి, గీతాంజలిలో గిరిజ డబ్బింగ్ కోసం ఆర్టిస్టును వెతుకుతుంటే రోహిణిని అడగమని సలహా ఇచ్చాడట. సినిమా ఆర్టిస్టుగా బదులు డబ్బింగ్ ఆర్టిస్టుగా ముద్రపడిపోతుందేమోనని భయంతో చేయకూడదని అనుకున్నది, మణిరత్నం సినిమాలో అవకాశం కాదనలేక ఈ సినిమాకు డబ్బింగు చేసింది. గీతాంజలి తర్వాత “శివ”లో అమల పాత్రకు డబ్బింగ్ చేయమని రాంగోపాల్ వర్మ అడిగితే రోహిణి ఒప్పుకోలేదు. ఒక మూడు రీళ్ళు చూసి నచ్చితే చేయమన్నారు. అది చూసి నచ్చాక అమలకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమా పెద్ద హిట్టై పోవడంతో ఇక అలాగే డబ్బింగు రంగంలో కొనసాగింది. ఒక్క విజయశాంతికి తప్ప దాదాపు తెలుగులో అందరు హీరోయిన్లకు డబ్బింగు చెప్పింది రోహిణి.[3]

నటిగా గుర్తింపు
1995లో పాలగుమ్మి పద్మరాజు “పడవప్రయాణం” కథ ఆధారంగా మలయాళ దర్శకుడు కె.ఎస్.సేతుమాధవన్ నిర్మించిన స్త్రీ సినిమాలో ముఖ్యపాత్రను పోషించిన రోహిణి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది. రోహిణి తెలుగులో హీరోయిన్‌గా నటించిన చిత్రం “స్త్రీ”లో ఈమె ప్రదర్శించిన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఉత్తమ మహిళా నటి నంది బహుమతితో సత్కరించింది. ఈ చిత్రం విడుదలకు నోచుకోక పోయినా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే నేషనల్ అవార్డు కూడా ఈమెను వరించింది. వీటితో పాటు “వీరుమండి”, “తామరైభరణి”, “ఒంబదు రూబాయ్ నోట్టు” అనే తమిళ చిత్రాలలో రోహిణి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.

ప్రతిభావంతమైన వ్యక్తి అయిన రోహిణి ఆ తర్వాత సామాజిక సేవ కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలలో నిమగ్నమైనది. చాలా వ్యవధి తర్వాత కమల్ హాసన్ సినిమా పోతురాజు (తమిళంలో విరుమాండి)లో, అయ్యన్ (తమిళం)లో నటించింది. పోతురాజు సినిమాలో ఒక పరిశోధకురాలి పాత్రలో కనిపించింది. అలా మొదలైంది సినిమాలో నానికి తల్లిగా నటించింది.

సినీరంగంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే బుల్లితెరలో ప్రవేశించింది. వివిధ సీరియల్ కథలకు స్క్రిప్టులు రాశారు. “వీరుక్కు నీర్” అనే టెలీ ఫిల్మ్‌ కోసం అమెకు 2005లో సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వరించింది.[4]

రోహిణి ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించడానికి అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నది.[5][6] తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డాక్టర్ ఎంజిఆర్ విశ్వవిద్యాలయం తరపున నిర్మించిన ఎయిడ్స్ అవగాహన షార్ట్‌ ఫిల్మ్స్‌కు ఆమె దర్శకత్వం వహించింది. అంతేకాకుండా సామాజిక అంశాలను ప్రతిబింభించే అంశాలపై చర్చా వేదికలు నిర్వహించింది.

స్వయంగా బాల్యనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రోహిణి బాల్యనటుల అంతరంగంపై “సైలెంట్ హ్యూస్” అనే 52 నిమిషాల నిడివి కల డాక్యుమెంటరీని నిర్మించి దర్శకత్వం వహించింది.[7][8]

నటించిన చిత్రాలు
· కొలంబస్[9]

· ఆశ ఆశ ఆశ (1996)

· జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ (2018)

· తిప్పరా మీసం (2019)

· రంగ్ దే (2021)

· మీట్ క్యూట్ (2022)

· సెబాస్టియన్ పి.సి.524 (2022)

ఈమధ్య వచ్చిన కళ్యాన్ రాం నటించిన సినిమాలో రావు రమేష్ కు భార్యగా నటించింది
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.