జయశంకర ప్రసాద్ -7

జయశంకర ప్రసాద్ -7
కామాయిని కావ్య సంశ్లేషణం -1
‘’జడ చేతనాలు సమరసంగా ఉన్నాయి –సుందర సాకార రూపం ఏర్పడింది –చైతన్యపు విలసనం –అఖండంగా చిక్కగా ఆనందం వెల్లి విరిసింది ‘’అని కామా యిని మహాకావ్యం లో జయశంకర ప్రసాద్ చివరి వాక్యాలు రాశాడు .ఆ ఆనందం జీవితాంతం వ్యాపించి ఉన్న సాధన యొక్క పరమ ఉత్కర్ష .దీనిప్రారంభం ప్రళయ తాండవం తో కమ్ముకున్న ప్రకృతి రంగస్థలం పై జరిగింది .ఇలాంటి కథ అనేక దేశాలలో వ్యాపించి ఉన్నదే .కానీ ప్రసాద్ ఇందులో విశ్వ మానవుడి ఆత్మ కథను వినిపించాలనీ, వినాలనీ అనుకొన్న కళాకారుడికి సహజ స్వభావం కూడా .ఈ కావ్యం లో మనస్తత్వ శాస్త్రం ,,చరిత్ర ,ఆదిమతత్వం ,ఆధునికత ,మత సంబంధ సంవేదన ,మత ప్రమేయం లేని దృష్టి ,నాటకం ,కవిత్వం అన్నీ ఒక బిందువులో ఏకాగ్రమై దర్శన మిస్తాయి ..ఇది కావ్య నాటక కథ ఉన్న మహా కావ్యం .
‘’హిమగిరి ఉత్తుంగ శిఖరం పై-శిలల శీతల ఛాయలో కూర్చుని-తడి ఆరని కన్నులతో ఒక పురుషుడు –ప్రళయ ప్రవాహాన్ని చూస్తున్నాడు.-కింద నీరు ,పైన మంచు –ఒకటి తరళం మరొకటి సఘనం –ప్రథానతత్వం రెండిట్లో ఒకటే –దాన్ని జడం అనండి చేతనం అనండి –తరల తపస్విలా ఆతను కూర్చున్నాడు –సుర స్మశానం లో సాధన చేస్తున్నాడు –దిగువనున్న ప్రళయ సింధు అలలు –కరుణా జనకం గా నశిస్తున్నాయి ‘’ ఆతరుణ తపస్వి మనువు . మనుష్యత్వం ఉన్న మహాకావ్య నాయకుడు .వేద,పురాణ ఇతిహాసాలలో మను చరిత్ర ఉంది .అతడు మానవతా నవ యుగ ప్రవర్తకుడు .మనువు, శ్రద్ధల దంపతులకు మానవుడు ఉద్భవించి ,మానవ వికాసానికి తోడ్పడ్డాడు .ఇదొక ‘’అల్లిగరి’’ మాత్రమె .ఇందులో సార్ధకత ,సంగీతం ఇమిడి ఉన్నాయి .ప్రసాద్ వేదాంతం సహజ అంతర్ దృష్టి .మైధిలీశరణ్ గుప్త కవి తో ఏమాత్రం తీసిపోని మహాకవి జయశంకర్ .ఇరవై వ శతాబ్దపు మనిషి ,మానవాళికి ద్రోహం చేసే జాతీయతావాదం సారం లేని అంతర్జాతీయతా వాదాల మధ్య ఇరుక్కున్న మనిషిని ఉద్ధరించే మార్గం చూపాడు .శ్రద్ధ విషయం లో కవి సహజ వివేకంతో ఉంటాడు .ఆమే కవితకు ఆరవ ప్రాణం .మొదటి దేవుడు కాముడు కుమార్తె గా కామాయిని ని భావిస్తారు .ఋగ్వేదం లో శ్రద్ధ ,మనువు ఋషులు .ఈ అస్తిత్వం లో స్త్రీ ,పురుష తత్వాలు మిశ్రితాలై ఉంటాయి .ఈ శ్రద్ధనే కవి తన సృజనాత్మక కల్పనా ,సంపూర్ణ స్వాదీనతా ,స్పూర్తి లతో సృష్టించాడు .
సూక్షం గా కథ
జలప్రళయం కామాయినీ కావ్యానికి నేపధ్యం .శతపద బ్రాహ్మణం 8వ అధ్యాయం లో జలప్రళయ వర్ణన ఉంది .ప్రసాద్ ఇది మన దేశ గాథ గా నే చెప్పాడు .ఈ జలప్రళయం ద్వారా విలక్షణ మానవులకు ,ఒక విభిన్న సంస్కృతిని సృష్టించటానికి దేవతలు మనువుకు ఒకావకాశం ఇస్తారు .దేవతల విచ్చలవిడి వలన వారి సంస్కృతీ నాశనమౌతుంది .అప్పుడు వచ్చిన ప్రళయం లో ఒక్క మనువు మాత్రమె బతికి బయట పడ్డాడు .అతడే మానవ దృష్టికీ సంస్కృతికి శ్రీకారం చుట్టాడు .ఒకరకం గా శాపం వరంగా మారుతుంది .ఈ విపత్తు వలన మనువు తానూ లోపలా బయటా కూడా శిధిలమై పోయినట్లు భావిస్తాడు .ఆత్మ చేతనం అనే కొత్త విధిని చేబడతాడు .దీనిద్వారా మానవీయ ప్రవృత్తులను ,భావాలు బుద్ధి సంపదను పొందుతాడు .
జలప్రళయ తీవ్రత తగ్గి భూమి క్రమగా బయట పడుతుంది .ఈ నేపధ్యం లో మనువు మనసులో చింత రేగుతుంది .గతమంతా ముందు సుళ్ళు తిరుగుతుంది .అమరత్వ౦ లేని జీవితతం తో గర్వంగా ఉండే రూపాన్ని దర్శిస్తాడు .మృత్యువు యదార్ధం అనే భావన కలుగుతుంది .ఈ జీవితం మృత్యువు యొక్క ఆశ అని తెలుస్తుంది .మానవ బుద్ధి మనువులో జాగృతమై ,మనం మారే కీలు బొమ్మలమని ,దేవతలం కాము అనే భావన స్థిర పడుతుంది .మార్పు లక్షణమే చింత ,అది తప్పని సరి అని తెలుస్తుంది .ఈ చింత మొదటిరేఖ విశ్వ వనం లో సంచరించే వ్యాలం తో పోలుస్తాడు .పుణ్య సృష్టిలో సుందర పాపమే చింత అని పోలుస్తాడు .ఇది అగ్ని పర్వతం ప్రేలేటప్పుడు వచ్చే భయంకర శబ్దం లాంటిది .అభావపు చపల బాలిక వంటిది .ఇది హృదయాకాశ ధూమకేతువు .అది కనిపించటం అమంగళం అనిష్టం అని అందరి నమ్మకం .ఇదంతా మొదటి సర్గలోని విషయాలు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-5-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.