’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -4
జాతీయ భాషా పరిరక్షణ
బెంగాల్ నుంచి వచ్చిన ఒక బెంగాలీ పండితుడు బాలాససోర్ ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో చేరి తాను తెచ్చిన గ్రంథం ద్వారా ఒరియా స్వతంత్ర భాషకాదని ,బెంగాలీ భాష రూపాంతరమే నని వాదించి ఒరిస్సాలో ఒరియాను తొలగించి బెంగాలీ ని ప్రవేశ పెట్టాలని వాదించాడు .అప్పటి పాఠశాల ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్ మార్టిన్ బాలాసోర్ లోని ప్రభుత్వ బడులలో బెంగాలీ ,సంస్కృతాలే తప్ప ,ఒరియా ఉండరాదని ఉత్తర్వు జారీ చేశాడు .ఇది విన్న ఫకీర్ మోహన్ వ్యధ చెందాడు .మిత్రులతో కలిసి ఆలోచించాడు .ఎలాగైనా తన మాతృభాషను కాపాడు కోవాలనుకొన్నాడు .ముందుగా చిన్నతరగతులకు సంబంధించిన ఒరియాఅధికారుల దృష్టికి తీసుకు వెళ్ళారు. వాళ్ళు అది ప్రభుత్వ వ్యవహారం తమకేమీ బాధ్యత లేదని చేతులెత్తేశారు .ఆశాభంగం పొందినా వదలక ,ఒరియా ఉద్యోగులనందర్నీ సమావేశ పరచి ,తెలివిగా లౌక్యంగా ఘాటుగా ‘’ఒరియానుకాదని బెంగాలీని ప్రవేశపెట్టటం ప్రభుత్వ నిర్ణయం కాదు. బెంగాలీల కుట్ర .బ్రిటిష్ ఇన్స్పెక్టర్ ను బుట్టలో వేసుకొని వాళ్ళు దాన్ని సాధించారు .ఇంగ్లిష్ వచ్చిన బెంగాలీఅధికారులకోసం పర్షియన్ భాష తొలగింఛి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలన్నీ అనుభవించారు .మీరు చక్కగా నేర్చుకొన్న పర్షియన్ ఇప్పుడు పనికి రాకుండా పోయింది .తర్వాత ఒరియాను తీసేసి బెన్గాలీ పెడితే ఉద్యొగాలన్నీ బెంగాలీలకే దక్కుతాయి .కలకత్తానుంచి వచ్చే బెంగాలీ బాబులకోసం మీ ఉద్యోగాలన్నీ సామూహికంగా తీసేస్తారు ‘’అని హెచ్చరించాడు .ఈమాటలు వారిపై బాగా పని చేశాయి .వెంటనే ఏక క౦ఠం తో ‘’అలాజరగటానికి వీల్లేదు .మనపిల్లలు బడిలో ఒరియాచదవాల్సిందే .ఏం చేయాలో చెప్పండి. మేమంతా ఐక్యంగా నిలబడి అలాచేస్తాం ‘’అన్నారు .దానికి అందరు కలిసి ప్రభుత్వానికి అర్జీపెడితే అంతా చక్కబడుతుందని చెప్ప’’గా ‘’మీరే తయారు చేయండి మేము సంతకాలు పెడతాం ‘’అనగా జాగ్రత్తగా అర్జీ తయారు చేసి అందరి సంతకాలు పెట్టించి జిల్లా కలెక్టర్ కు సమర్పించారు .అప్పటి బ్రిటిష్ ,మిషనరీఅధీకారులు వీరికి అనుకూలంగా ఉండటం తో వీరి అర్జీని బలపరచి ,జిల్లామేజిష్ట్రేట్ జాన్ బీమ్స్ కు పంపగా ,ఆయన గట్టిగా సమర్ధించి ఒరిస్సా విభాగ కమీషనర్ టి.ఇ.రావెంషా కు పంపాడు .ఈలోగా బీమ్స్ ఒరియా స్వతంత్రతను ,ప్రాచీనతను రుజువు చేస్తూ ఒక కరపత్రం రాసి విడుదల చేశాడు .అందులో ఒరియా భాష అభి వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలన్నీ ప్రతిపాదించాడు .ఒక కాపీబెంగాల్ ప్రభుత్వానికీ పంపాడు .కమీషనర్ రావెంషా కూడా ఒరియాకు అనుకూలంగా ప్రభుత్వానికి లేఖ పంపగా ,వెంటనే ప్రభుత్వం స్పందించి ఒరిస్సా బడులన్నిటిలో బెంగాలీని రద్దు చేసి ,ఒరియానే ఉంచాలనీ ,ఒరియా భాష అభి వృద్ధికోసం కొత్త బడులుస్థాపించాలని ఆదేశాలు జారీ చేసింది ఫకీర్ మోహన్ మాతృభాష పరిరక్షణ ఇలా విజయవంతమైంది .
నిర్వాహక చాతుర్యం
పదేళ్ళు బాలాసోర్ లో ఉపాధ్యాయ వృత్తి చేసిన ఫకీర్ మోహన్ కు అనుకోకుండా కటక్ లోని టీచర్స్ ట్రెయినింగ్ స్కూల్ లో ద్వితీయ శ్రేణి పండితుని పోస్ట్ ఖాళీ అయితే ,పాఠశాల ఇన్స్పెక్టర్ మార్టిన్ ఫకీర్ మోహన్ ను మూడు రెట్ల ఎక్కువ జీతంతో ఆపదవికి ఆహ్వానించగా .వెళ్ళటానికి ఇష్టపడి రెవరెండ్ ఇసిబి హాలం తో ప్రస్తావించగా ,ఆయన అంత జీతం ఆయనకు ఇస్తామని ఇక్కడనే ఉండి పొమ్మని కోరగా అక్కడే ఉండిపోయాడు .ఇలా ఉన్నతపదవి దక్కకపోయినా ,జీతం గౌరవం పెరిగాయి .
దివాన్ ఫకీర్ మోహన్ సేనాపతి
బాలాసోర్ దగ్గరున్న నీలగిరి ఒక సంస్థానం .దానికి దివాన్ పోస్ట్ కు బీమ్స్ ను రికమెండ్ చేశాడు .వెంటనే అంగీకరించి చేరి ఉన్నత స్థానం పొందాడు .1871లో 28వ ఏట ఫకీర్మోహన్ సేనాపతి నీలగిరి సంస్థాన దివాన్ అయ్యాడు .అప్పటి ను౦చి ,దివాన్ గానో ,అసిస్టెంట్ దివాన్ గానో ,మేనేజర్ ,అసిస్టెంట్ మేనేజర్ గానో దొమ్ పాడా ,ధెన్ కనల్ , దాస్ పల్లా ,పాల్ –లహడా ,కియోమ్జోహార్ ,కేంద్రపారా మొదలైన అనేక రాష్ట్రాలలో ,జమీన్ లలో పని చేశాడు .పరిపాలనా రంగం లో పాతికేళ్ళ అనుభవం పొందాక ,1892లో పదవీ విరమణ చేశాడు .ఈ అనుభవాలన్నీ తన రచనలలో పొందు పరచాడు .అతడు ఒక్క జిల్లాకే పరిమితం అయి ఉంటె ఇంతటి అనుభవం దక్కేదికాదు .ఒరియా భాష అతని అనుభవాలతో సుసంపన్నం అయ్యేది కాదు .ఒకరకంగా ఒరియాకు దక్కిన గొప్ప అదృష్టం అతని దివాన్ గిరి .
దివాన్ గా కానీ, మేనేజర్ గా కానీ ఏ స్థాయిలో ఉన్నా అక్కడ కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టాడు మోహన్ .ఒక శతాబ్దం వెనకనే నీలగిరి సంస్థానం లో’’ తేయాకు’’ ను వ్యాపార సరళిలో పండించాలని ఆలోచించి అమలు పరచి ఆదర్శనీయుడయ్యాడు .ఈ మాట చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు .ఒక బడి పంతులు దివాన్ అవ్వటం ,ఎంతటి ఆశ్చర్యమో తేయాకు ఉత్పత్తికి దారి చూపటం అంతే ఆశ్చర్యం.అక్కడ మొదటిసారిగా సరైన బజారు ఏర్పాటు చేశాడు .సంస్కృత పాఠశాల స్థాపించాడు .నీలగిరిని బయటి ప్రపంచంతోకలుపుతూ రోడ్లు వేయించాడు .విరివిగా కొబ్బరి తోటలు పెంచాడు .తాను ఎక్కడ పని చేసినా అక్కడ ఒక మంచి తోట పెంచాడు .విదేశాలలో పెరిగే పూలను ,కాయగూరలను ,పండ్లను అక్కడ పండించి ప్రజలకు చూపించి పరిచయం చేసి వారికీ ఆసక్తి కలిగించేవాడు .గులాబీ లంటే అమితమైన ప్రేమ .వాటిని ప్రత్యేకంగా పెంచాడు .జపాన్ నుంచి ‘’హుస్న హేనా ‘’అనే పుష్ప జాతిని తెప్పించి శ్రద్ధతో పెంచి దాని సౌకుమార్యానికి పరిమళానికి ముగ్ధుడయ్యేవాడు .సముద్రాలు దాటి వచ్చిన ఈఅద్భుత సౌందర్య రాశిని కవితలో కీర్తించాడు కూడా .దాస్ పల్లాలో ఉన్నప్పుడు కాబేజీలు పెంచి గ్రామపెద్దలకు ఇచ్ఛి కనిపించినపుడు ఎలా ఉన్నాయని అడిగే వాడు .వారంతా ముక్త కంఠం తో ‘’హుజూర్!మా ఆడాళ్ళు ఆకాబేజిని పుల్లటి’’ కన్జి’’లో వేసి ఎంత ఉడకబెట్టినా దాని ఆకారం కంపూ పోలేదు ‘’అని నవ్వుతూ చెప్పేవారు .
ఒరిస్సా విభాగ కమీషనర్ ,బెంగాల్ ప్రభుత్వ కార్యదర్శి రావెంషా 1873లో తన వార్షిక నివేదికలో ‘’బాలాసోర్ మిషన్ స్కూల్ ఓరియన్ లకల్లా గొప్పవాడైన బాబూ ఫకీర్మోహన్ సేనాపతి చేత నిర్వ హి౦పబడింది .నీలగిరి రాజువద్ద అంతకంటే పెద్ద ఉద్యోగం దివాన్ గిరి రావటం చేత ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు .దివాన్గా పని చేస్తూ నీతి నిజాయితీలు వ్యాపింపజేస్తూ ,ఎన్నోఅభి వృద్ధికార్యక్రమాలు ప్రవేశపెట్టి విజయవంతం చేశాడు .ఆ మహానుభావుడు పరోక్షంగా చేసిన ఎన్నో మంచిపనులకు ఇది ఒక ఉదాహరణ మాత్రమె.అతని ఎడబాటు తీరని వెలితి ‘’అని మెచ్చుకొన్నాడు .
మాకియ విల్లీ ఏకలవ్య శిష్యరికం
మాకియ విల్లీ తన ‘’ప్రిన్స్ ‘’ లో పాలకులకు ఏమేమి బోధించాడో ఫకీర్ మోహన్ కూడా ,అవేమీ తెలియకుండానే ఆచరణలో పెట్టి అభి వృద్ధి సాధించాడు .ఇటాలియన్ అయిన మాకియ విల్లీ కర్కోటకుడు క్రూరుడు ,మేధావి ,మహా రాజకీయ వేత్త .తన వ్యక్తిత్వంలో ‘’మాకియ వేలియన్ ‘’అనే అంశాన్ని దాచుకోలేదు కూడా .గాంధీ సహాయ నిరాకరణకు ముందే ఒరిస్సా లో సాంఘిక రాజకీయ చైతన్యం బాగా ఉండేది .అనాగరక మారుమూల పల్లె టూళ్ళ లోనూ ఈ ,సహాయ నిరాకరణ చైతన్యం కనిపించేది .బ్రిటిష్ వారు గాంధీ ఉద్యమాలను అణచి వేసినట్లు ఫకీర్ ఒరిస్సా రైతుల సహాయ నిరాకరణ ఉద్యమమాన్ని ,మౌన తిరస్కారాన్ని బల౦ తో తెలివి తేటలతో అణచి వేయగలిగి మాకియవిల్లీ లేక ‘’మాకియ విలన్’’ అయ్యాడు .
ప్రజలచే వెలివేయబడిన రాజరికం
ఇప్పుడు కటక్ లో ఉన్న దోమపాడా ఒకప్పుడు చిన్న జమి .ఈయన దివాన్గా వెళ్ళినప్పుడు అక్కడి రాజు కలకత్తాలో చదువుకొన్న విద్యావంతుడు .రాజుకు ఆన౦ద౦ ఉత్సాహం లేని తన జమీ కంటే అడవి జీవితం సుఖం అనిపించింది .అందువలన రాణీని రాజభవనాలను వదిలి ఎప్పుడూ కలకత్తా ,కటక్ వంటి పట్టణాలలో గడిపేవాడు .తన పట్నవాస విలాస జీవితం కోసం ,అంతులేని ఖర్చులకోసం డబ్బు కావాలని ఆరాట పడేవాడు .తన జమీలో రైతులకు భూములపంపకం మళ్ళీ చేయ్యాలనుకొన్నాడు .అంటే భూమి శిస్తు పెంచటమే ఏకైక ఎజెండా .పన్నులు ఎవరు కడతారు ?రైతులు కొత్త పద్ధతిని మొండిగా ఎదిరించారు .చాలామంది రైతులు అనధికారంగా పొలాలు ఆక్రమించి పైసా కూడా శిస్తు కట్టలేదు .బ్రాహ్మణ్యం ,గ్రామపెద్దలూ ఇలా లాభ పడిన వాళ్ళే .తమ అనధికార సంపత్తిని కాపాడుకోవటం కోసం వాళ్ళు అమాయక రైతుల్ని పురిగొల్పి విప్లవానికి ప్రేరేపించారు .రాజు రాజీ పడలేదు .ప్రజలు శిస్తులు కట్టకుండా రాజును అధికార్లనూ సాంఘికం గా వెలి వేశారు .
లౌక్యం చాకచక్యం
తన 33వ ఏట ఫకీర్ మోహన్ ఇక్కడికి వచ్చేటప్పటికి రాజభవనం పాడుబడి ,అన్నివైపుల అడవిగా తయారైంది .రాజు అప్పులమీద బతుకుతూ ఇక్కడికి వచ్చేవాడు కాదు .రాణి మనోవర్తికోసం కటక్ కోర్టు లో దరఖాస్తు చేసింది .అప్పటి కటక్ జిల్లా మేజి స్ట్రేట్ బీమ్స్ ఫకీర్ మోహన్ ను ఈ ప్రాంతానికి పంపాడు .రైతులకు జమీన్దార్కు రాజీ కుదురుస్తాడని ఆశించాడు .రాజీకి ప్రయత్నించాడు ఫకీర్ .కాని ప్రజల్లో నివురుకప్పిన నిప్పులాఉన్న సహాయనిరాకరణ ఒక్కసారి ఉవ్వెత్తున బయట పడి మాజీ దివానూ, భూస్వామి అయిన ఒకాయన అండతో ప్రజలు పోటీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొన్నారు .రాజభవానంతో అన్నిరకాల సాంఘిక సంబంధాలను వేలివేయాలని ప్రతి గ్రామానికి తెలియజేశారు .రాజభవనం లోని సేవకులను కూడా భయపెట్టారు . చాకల్లు బట్టలు ఉతకటం లేదు కటక్ కు పంపి ఉతికి౦చుకోవాల్సి వచ్చింది .బెస్తలు ,గొల్లలు ,నీరుమోసేవారు అందరూ కట్టడిగా పనులు మానేశారు .
రాజీ కుదర్చటానికి వచ్చిన ఫకీర్ కు ఎవ్వరూ తోడ్పడటం లేదు. రాజు ఆయన్ను మేజిష్ట్రేట్ మనిషి అనుకొంటే ,రైతులు రాజుగారి మనిషి అని భ్రమపడ్డారు .1876లో బీమ్స్ అకస్మాత్తుగా తనిఖీకి దొమ్ పాడా వచ్చాడు .ఫకీర్ మోహన్ అభ్యర్ధన మేరకు బీమ్స్ శిస్తులు పెంచకూడదని అంగీకరించాడు .రాజు విముఖంగా ఉన్నాడు. అప్పటికే అతడు తలతిక్కరాజు అని ప్రజల్లో, ప్రభుత్వం లో పేరు పొందాడు .సమస్య వెంటనే పరిష్కారం కాక పోవటంతో రాజు జమీ మొత్తాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది .తను దివాన్ గా ఉన్నంతకాలం జమీన్ నాశనం కాకూడదని ఫకీర్ భావించాడు .బీమ్స్ కు అతని పరివారానికి ఆహారం నీరు మొదలైన సకల సౌకర్యాలు చూడాల్సిన బాధ్యత దివాన్ ఫకీర్ పైనే ఉంది .యాభై మైళ్ళ దూరంలో ఉన్న కటక్ నుంచి అన్నీ తెప్పించుకోవాల్సి వచ్చింది .చలి ముదిరి ఆతర్వాత వర్షాలు ప్రారంభమై నానా ఇబ్బందీ గా ఉంది .దివాన్ అన్నీ తానె చూసుకోవాల్సివచ్చింది ఆ వ్యతిరేక వాతావరణం లో .
రాజకీయ ఎత్తుగడలు తెలిసిన దివాన్ ఫకీర్ కొంతమంది రైతుల్ని రాజువైపు తిరిగే ప్రయత్నం చేశాడు .ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలకు పేరు మోసిన రైతులన్దర్నీ మేజిష్ట్రేట్ ను కలుసుకోమని హుకుం జారీ అయింది .రాజు వైపు తిరిగారు అనుకున్నవారికి దివాన్ మేజిష్ట్రేట్ అడిగే ప్రశ్నలకు జవాబులు ఎలా ఇవ్వాలో ఉదయమే ట్రెయినింగ్ ఇచ్చాడు అంటే బ్రెయిన్ వాష్ చేశాడు .సరిగ్గా నాలుగంటలకు వడగళ్ళవాన జోరున కురిసింది .న్యాయ౦గా ఈసమయంలో సాహిత్యం కాలక్షేపం చేయాల్సిన వాడు ఇక్కడ ఈ మారుమూల ఇలా వర్షంలో ఉండి పోవాల్సి వచ్చింది .శాలువా కప్పుకొని వచ్చాడు .మేజిష్ట్రేట్ బస చేసిన గుడారం ముందు ఉన్న గ్రామపెద్దల్ని చూస్తె తానూ పొద్దున్న ట్రెయి నింగ్ ఇచ్చిన వాడు ఒక్కడూ కనబడక అవాక్కై పోయాడు .హాయిగా వెళ్లి గుడారంలో వెచ్చగా సాహిత్యం చదూకు౦దామని లేచి వెళ్లబోతుంటే మేజిష్ట్రేట్ బీమ్స్ హిందీలో ‘’కౌలుదారు లారా !రాజాగారితో మీకు వచ్చిన గొడవల్ని ఫకీర్ మోహన్ బాబు సర్దు బాటు చేయటం మీకు ఇష్టమేనా ??’’అని అడిగాడు .కొందరు రైతులు ‘’ఆయనే సర్దు బాటు చేయగలిగితే ,మీరుఇలాంటి వాతావరణం లో కటక్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది ?”’అని ప్రశ్నించారు .తనకు ఆభాష అర్ధంకాక వాళ్ళు ఏమన్నారో చెప్పమని ఫకీర్ ను అడిగితె సమయస్పూర్తిగా ‘’మా సమస్యల్ని దివాన్ బాబు పరిష్కరించగల సమర్దుడే .ఇంక మీరు శ్రమపడక్కర లేదు ‘’అన్నారని చెప్పాడు లౌక్యం మిళాయించి .బీమ్స్ ‘’అయితే మంచిది కొత్తదివాన్ అన్నీ చూస్తాడు సమర్ధుడు నాకు నమ్మకం ఉంది .సెలవు ‘’అన్నాడు ఈమాటలు రైతుల్లో అలజడి కలిగించాయి .పండితుడు మేధావి అయిన ఫకీర్ తన చాకచక్యాన్ని సమయానికి తగినట్లు ఉపయోగించాడు .
బీమ్స్ ,పరివారం నెమ్మదిగా బయల్దేరి వెళ్ళిపోయారు .రేపటినుంచి పాలుపెరుగు ఆహారపదార్ధాలు నీరు ఎలా?ఇంతలో ఒక గొల్లవాడు కనిపిస్తే అడిగితె పాలు నెయ్యి తెచ్చాడు .ఒకరైతు వరండాలో కూచుని ఇది చూస్తూ ఆవేశం తో ఊగిపోతున్నాడు .అ౦తాబురద అక్కడ ఒక దుంగ ఉంది .దివాన్ ఆజ్ఞ ఇవ్వ గానే ఇద్దరు సిపాయిలు ఆ గొల్లవాడిని దు౦గకు కట్టేశారు .ఒకడు పాలూ నెయ్యీవాడి తలపై కుమ్మరిస్తు,కర్రతోచావ బాదుతుంటే ఇంకోడు’’ ఆగు ఆగు ‘’అంటున్నాడు నాటకీయంగా .ఇంతలో గొల్లవారంతా పరుగుపరుగున వచ్చి దివాన్ కాళ్ళమీద పడి .ఇకనుంచి పాలూ పెరుగు నెయ్యి సప్లై చేస్తాం మా వాడిని వదిలి పెట్టమని పొర్లు దండాలు పెట్టారు .నయాన కావాల్సిన కార్యం దండంతో సరైంది .అరగంటలో అన్ని రకాల పదార్ధాలు కుప్పలు తెప్పలుగా తెచ్చి కుమ్మరించారు దివాన్ ముందు .ఒక్క దెబ్బతోపన్నుల ఎగవేత, సహాయ నిరాకరణ గాలిలో కలిసిపోయాయి .
పరిస్థితులు అనుకూలంగా మారటంతో ఫకీర్ -నాయకులైన కొందరు గ్రామస్తులపై క్రిమినల్ కేసులు బనాయించి బీమ్స్ కు పంపాడు .ఇక్కడి అల్లర్లకు కారకుడైన మాజీదివాన్ దయానిధి పట్నాయక్ బంధువు పైకూడా కేసుపెట్టాడు .చుట్టుప్రక్కల గ్రామస్తులు దివాన్ ను కలవటానికి వస్తున్నట్లు వర్తమానం రాగా ,కేసులుపెట్టిన వారందర్నీ అరెస్ట్ చేసే పనికి పోలీసుల్ని పురమాయించి అరెస్ట్ చేయించాడు .గ్రామస్తులకుశరాఘాత౦ అనిపించింది .మిగిలిన వారు ప్రాణాలు అర చేత పట్టుకొని పరుగోపరుగు .దొమ్ పాడాలో శాంతి నెలకొని పరిపాలన మొదలైంది .రాజు సంతోషపడి ఆయన్ను జీవితాంతం తన దివాన్ గా ఉంచుకోవాలనుకొన్నాడు .కానీ పైఅధికారులు ఫకీర్ అవసరం ఇంక ఇక్కడ లేదని అతని అవసరం ‘’దెన్ కణాల్ ‘’లో ఉందని నచ్చ చెప్పారు రాజుకు.
ఇలాసమస్యల్ని దర్జాగా,హు౦దాగా తెలివి తేటలతో సమయస్పూర్తితో పరిష్కరించి దోమ్ పాడా వదిలి వెళ్ళాడు .తానూ కొంత కఠినంగా ప్రవర్తి౦చా నేమో అని అనుకోని దయానిధి పట్నాయక్ ,ఇతరులకు కొంత నష్ట పరిహారం చెల్లించిన దయామూర్తి ఫకీర్ దివాన్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-1-23-ఉయ్యూరు–