కేరళ గాంధి -కేలప్పన్
కోలపల్లి కేలప్పన్ 24-8-1889 న జన్మించి 7-10-1971న 82వ ఏట మరణించారు .భారత స్వాతంత్ర్య పోరాటం లో చురుకైన పాత్రపోషించిన విద్యావేత్త జర్నలిస్ట్ కేలప్పన్.కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనాయకులు అవటంతో అందరూ ‘’కేరళ గాంధీ ‘’అని గౌరవంగా సంబోధించేవారు .దేశం స్వాతంత్ర్యం పొందాక గాంధీ సేవా సంస్థలలో ముఖ్య పదవులు చేబట్టి సేవలందించారు .నాయర్ సర్విస్ సొసైటి కి సంస్థాపక సభ్యులు ,ప్రెసిడెంట్ కూడా .కేరళ క్షేత్ర సంరక్షణ సమితి అంటే దేవాలయ సంరక్షణ ఉద్యమ సారధి .
కేరళలోని కాలికట్ లోని కోయిలాండి లో ఉన్న ముచుకున్నూరు గ్రామం లో కననార్ నాయర్ ,కుంజమ్మ అమ్మ దంపతులకు జన్మించిన కేలప్పన్ ,కాలికట్ ,మద్రాస్ లలో చదివి ,మద్రాస్ యూనివర్సిటి నుంచి డిగ్రీ పొంది ,చన్నగానేస్వరి లోని సెయింట్ బెర్చ్ మానస్ హై స్కూల్ లో టీచర్ గా పని చేశారు .నాయర్ సర్విస్ సొసైటీ స్థాపించి ,ప్రెసిడెంట్ అయి ,ఆ సొసైటీ నిర్వహించే స్కూల్ ప్రిన్సిపాల్ అయ్యారు .
ఒకవైపు సాంఘిక సంస్కరణలకు పోరాడుతూ మరోప్రక్క బ్రిటీష వారిపై భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించారు .అస్పృశ్యతా నివారణకు ,కులాదార వివక్ష పై పోరాటం చేశారు .తమ పేరు చివర ఉండే కుల సంబంధ మైన పదాన్ని తొలగి౦చు కోవటానికి ప్రయత్నించిన ప్రధములలో కే.కుమార్ తోపాటు కేలప్పన్ కూడా ఉన్నారు .అప్పటినుంచి ప్రజలు ఆయనను ‘’కేరళ గాంధి ‘’అని గౌరవించటం ప్రారంభించారు .
కేరళలోని అన్ని కులాల మధ్య సామరస్యం ,ఐక్యత సాధించటానికి కేలప్పన్ విశేష కృషి చేశారు .1932లో వైకోం సత్యాగ్రహాన్ని,గురువాయూర్ సత్యాగ్రహాన్ని నిర్వహించటం లో కీలక పాత్ర పోషించారు.మహాత్మా గాంధి తిరువాన్కూర్ సందర్శించి దేవాలయ ప్రవేశ ప్రకటన పై సంతకం చేసిన రెండవ వ్యక్తిగా ,సాంఘిక అసమానత రూపు మాపే ఉద్యమ నిర్మాతగా గాంధీని పూర్తిగా నమ్మిన అనుయాయిగా కేలప్పన్ పేరు పొందారు . వైకోం సత్యాగ్రహ అగ్రనాయకులలో ఒకరైన ట్రావెంకూర్ కు చెందిన కే కుమార్ ఆ రిజల్యూషన్ ను అందజేసిన వారుగా ప్రసిద్ధిపొందగా,ఆతర్వాత దాన్ని ప్రజలు ,చరిత్రకారులు మర్చే పోయారు .
ఇండియా స్వాతంత్ర్యం పొందాక కేలప్పన్ కాంగ్రెస్ పార్టి కి రాజీనామా చేసి ‘’కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టి’’ లో చేరి ,పొన్నాని లోక సభా స్థానానికి పోటీ చేసి 1952లో ఎన్నికై లోక సభ సభ్యుడయ్యారు .అయిదేళ్ళతర్వాత రాజకీయాలు వదిలేసి సర్వోదయ ఉద్యమం లో చేరారు .మాతృభూమి పత్రిక స్థాపనలో సహకరించి సంపాదకులుగా కొంతకాలం పని చేశారు .భాషా ప్రాతిపదిక రాష్ట్రం గా కేరళ ఏర్పడటానికి కృషి చేశారు .కేరళ సర్వోదయ సంస్థ ,కేరళ గాంధీ స్మారక నిది ,కాలికట్ గాంధీ పీస్ ఫౌ౦డేషన్ వంటి అనేక సంస్థలలో గౌరవ స్థానం లో పని చేశారు .కేరళలో ముస్లిం మెజారిటి ఉన్న మలం పురం జిల్లా ఏర్పడటాన్ని, అది మరోపాకిస్తాన్ కు దారితీస్తుందనే అభిప్రాయంతో వ్యతిరేకించారు కేలప్పన్ . తాళి టెంపుల్ మువ్ మెంట్ లో ముఖ్య పాత్ర పోషించారు .అది సాకారం ఆయె సమయంలో దాన్ని చూడకుండానే ఆయన 7-10-1971న మరణించారు .ఆయన భావి౦చినట్లే మనప్పురం లో ముస్లిం మసీద్ ప్రక్కనే తాళి దేవాలయం నిర్మించారు .1990లో భారత ప్రభుత్వం ‘’కేరళ గాంధి కేలప్పన్’’గౌరవార్ధం ఆయన పేరిట పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-23-4-23-ఉయ్యూరు