ఒకేఒక చెట్టుకు 24లక్షల రూపాయల నిరంతర సెక్యూరిటీ   

ఒకేఒక చెట్టుకు 24లక్షల రూపాయల నిరంతర సెక్యూరిటీ

–అవునండీ బాబూ  నిజ్జం గా నిజం .ఈ చెట్టు సంరక్షణ బాధ్యత మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చేబట్టింది.వి ఐ పి,  వి. వి ఐ పి లకంటే ఘాట్టి భద్రతే అని పిస్తుందికదా .యస్సూఅనుమానమే లేదు సారూ .ఇంతకీ ఈ చెట్టు ఎక్కడుంది ?అంత సెక్యూరిటీ దానికెందుకు ? తెలుసుకొందాం

  మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ కు సమీపం లో sanchi  దగ్గర ఈ వృక్షం ఉంది . ఈ చెట్టు దగ్గరకు కొమ్ములు తిరిగినా ఎంతటి వారినైనా అనుమతించనే  అనుమతించరు  .ఈ సెక్యూరిటీ ఎప్పటి నుంచి అమల్లో ఉంది అంటే 2012 డిసెంబర్ లో  శ్రీలంక అధ్యక్షుడు రాజభక్షే  ఇక్కడికొచ్చి ఒక బోధి వృక్షాన్ని నాటినప్పటి నుంచి .ఈ బోధి వృక్ష  రక్షణ  కోసం నాలుగు హోమ్ గార్డ్ లను నియమించి పగలూ రేయీ తేడాలేకుండా కాపలా కాయిస్తూ రక్షిస్తున్నారు  .షిఫ్ట్ లావారీగా పని చేస్తూ దానికి నీళ్లు పెడుతూ పోషించటం కూడా వారి విధే
  15 ఎకరాల విస్తీర్ణం లో భారీ ఫెన్సింగ్ తో ఈ బొధి  వృక్షం రక్షింపబడుతోంది .సరే అన్నీ బాగానే ఉన్నాయికానీ ఈ చెట్టుకు ఇంతటి ప్రాముఖ్యం ఎందుకు అనే అనుమానం కలగటం సహజం .గౌతమబుద్ధుడు గయలోని బోధి వృక్షం కింద దీర్ఘ తపస్సు చేసి ,జ్ఞానోదయం పొంది బుద్ధుడు అయ్యాడని మనకు తెలుసుకదా..  అంతటి జ్ఞానోదయాన్ని కలిగించిన ప్రభావం బోధి వృక్షానికి ఉన్నదనే నమ్మకం బౌద్ధులకున్నది .ఈ విశ్వాసాన్ని హిందువులుకూడా అంగీకరిస్తారు .కనుక బౌద్ధ హిందువులకు ఈ బోధి జ్ఞానబోధిగా దర్శనమిస్తుంది .
  ఈ బోధి వృక్షానికి నీరు అందించటానికి ప్రత్యేకంగా వేరే వాటర్ టా0క్ నిర్మించారు .దీని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చూడటానికి వారానికొక డాక్టర్ వచ్చి పరీక్షించి సూచనలిస్తాడు.మొత్తం మీద మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ పవిత్ర బోధివృక్షం పోషణ ,పెంపకం రక్షణ కోసం ఏటా 24లక్షల రూపాయలు అంటే నెలకు సుమారులక్షన్నర రూపాయలు ఖర్చు చేస్తోందన్నమాట .
  అసలిది అసలైన బోధి వృక్షమా ?అనే సందేహమొచ్చింది .ఎందుకంటె 3 వశతాబ్దం లోనే గయ లోని అసలైన బోధి వృక్షాన్ని  శ్రీ లంక తీసుకు వెళ్లి ”అనుభవా పురం ”లో నాటుకున్నారని మహా బోధి సొసైటీ వారు తెలియ జేశారు . అట్లా0టప్పుడు  ఒక నకిలీ బోధి చెట్టుకు ఇన్ని లక్షలు ఖర్చు చేయటం సమంజసమా  అని ప్రశ్నించేవారూ ఉన్నారు .పొలాలకు నీరు అందక పంటలు పండక మధ్య ప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేవలం  ఒక చెట్టు కోసం ఇంత  ఆర్భాటం ఇంతటి వి ఐ పి  ట్రీట్ మెంట్ అవసరమా అని ప్రభుత్వాన్ని రైతు సంఘాలు నిల దీస్తున్నాయి .మనుషులప్రాణాలకంటే  ఈ చెట్టు  రక్షణే  ముఖ్యమని భావించే ప్రభుత్వ విధానాన్ని మానవ హక్కుల సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి .కానీ అధికార యంత్రా0గాయానికి  కళ్ళూ చెవులు ఉండవవుకదా .ప్రజల మానసిక బాధలు వారికి” కేరే ఝాట్ ”. .ఇప్పటికి ఈ చెట్టుపై సుమారు  కోటి న్నర రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం . మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రం ఈ బోధి వృక్షం ఏ జ్ఞాన బోథ చేయలేదేమో ?

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-18 -ఉయ్యూరు

 
image.png
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -19

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -19

ఇప్పటి వరకు సీతారామ పుర ,కామేశ్వరీ అగ్రహారాలోని ఆహితాగ్నుల గురించి తెలుసుకొన్నాం .ఇప్పుడు వ్యాఘ్రేశ్వర అగ్రహారం లోని వారి గురించి తెలుసుకొందాం .

1-బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి

శ్రీరామపురం లోశ్రీ  బులుసు  చయనులు గారి గూర్చి ముందే ముచ్చటించుకొన్నాం .ఇప్పుడు ఈ ఆగ్రహారానికి కూతవేటు దూరం లో అరటి కొబ్బరి తోటల ప్రకృతిలో ఉన్న వ్యాఘ్రేశ్వర అగ్రహారం లో ఉన్న బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి  గారి గురించి తెలుసుకొందాం .అమలాపురం లాక్ ఐన ముక్కామల మెయిన్ రోడ్డు దగ్గర చిన్న గ్రామం  వ్యాఘ్రేశ్వరం ఉంది .ఇక్కడి శివుని పేరు వ్యాఘ్రేశ్వరుడు కనుక గ్రామానికి ఆపేరోచ్చింది .మట్టి రోడ్డుమీదనే నడక, బండీ ప్రయాణం .సీతారామపురం నుంచి సైకిల్ మీదవస్తే పది నిమిషాలు పడుతుంది .చాలా ప్రశాంతమైన పల్లెటూరు .మోటారు కార్ల రణగొణ ధ్వనులు వినిపించవు .చాలాకాలం క్రితం ఒక బ్రాహ్మణుడికి ఇక్కడ ఒక పులి చెట్టుకింద  కనిపిస్తే, ప్రక్కనే ఉన్న బిల్వ వృక్షం ఎక్కి ప్రాణాలు కాపాడుకొన్నాడు మారేడు చెట్టుమీదే ‘’వ్యాఘ్రేశ్వర మహా పూజ ‘’చేశాడు .పూజ పూర్తయ్యే టప్పటికి కింద ఉన్న’’ పులి శివ లింగం’’ గా  మారి ఆశ్చర్యం కలిగించింది .అప్పటినుంచి ఈ ప్రదేశాన్ని వ్యాఘ్రేశ్వర పురం అన్నారు .తర్వాత వ్యాఘ్రేశ్వరం అయింది .

  ఇక్కడున్న బులుసు కుటుంబం లో  ఇద్దరు అన్నదమ్ములున్నారు .పెద్దాయన పేరు గ్రామనామమే వ్యాఘేశ్వరుడు .రెండవ ఆయనపేరు కామేశ్వర .పుల్లెల వారి కుటుంబానికి దగ్గరే వీరిల్లు .బులుసు సోదరులు ,పుల్లెల ఆయన వ్యాఘ్రేశ్వరం లో ఆహితాగ్నులు .బులుసు సోదరుల తండ్రిగారు ముంగండ లో స్కూల్ మాస్టర్ .ఆయన ఆహితాగ్నికాడు ఆయన తండ్రీ ,తండ్రి గారి సోదరులు మాత్రం ఆహితాగ్నులే .పెద్దాయన  అనంత గారు చయనం చేయటానికి  వెడితే ,సోదరులిద్దరు శ్రౌతాన్ని తాతగారు ,మేనమామల వద్ద నేర్చారు .దీనికి తోడు వీరి ఆసక్తిని రెట్టిపు చేశారు శ్రీ రెండు చింతల యాజులుగారు  అనే వ్యాఘ్రేశ్వర పూర్వ విద్యార్ధి ,మరొకరు కోనసీమ లో పుట్టిన శ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్ని హోత్రుడు.

   1967 ఏప్రిల్ లో బులుసు సోదరులు ఇద్దరు అగ్ని హోత్రం ఏర్పాటు చేసుకొని రోజు విడిచి రోజు యజ్ఞాన్ని రుత్విక్కుతో కలిసి ముందుగా వ్యాఘ్రేశ్వర  ఆధానం చేస్తే , తర్వాత కామేశ్వర గారు ఆధానం చేశారు .వెంటనే వ్యాఘ్రేశ్వరుడుగారు అగ్నిస్టోమం చేసి  ‘’బులుసు వ్యాఘ్రేశ్వర సోమయాజి ‘’అయితే కామేశ్వర కూడా అగ్ని స్టోమంచేసి బులుసు కామేశ్వర సోమయాజి అయ్యారు .ఇద్దరి భార్యలు సోమి దేవమ్మ అని పించుకొన్నారు .

 పెద్దవారిన వ్యాఘ్రేశ్వరులకుఆహితాగ్ని అయిన  తాత గారి ఆస్తి ఇల్లు  సంక్రమించాయి .దీనిప్రక్కనే కామేశ్వర కూడా స్వగృహం  ఏర్పాటు చేసుకొన్నారు  .కామేశ్వరగారు అన్నగారిని  మేనమామ చేసి నట్లు  చయనం చేసి చయనులు అనిపించుకోమని ప్రోత్సహించారు .ఆయన మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పి తమ్ముడినే చేయమని ప్రోత్సహించాడు .సరే అన్నాడు తమ్ముడు .తమ్ముడు కామేశ్వర చేసే ‘’అగ్ని  చయనా’’నికి కావలసిన ఏర్పాట్లన్నీ అన్న వ్యాఘ్రేశ్వరుడు గారే చేశారు.దురదృష్ట వశాత్తు అకస్మాత్తుగా వ్యాఘ్రేశ్వారు సోమయాజి గారు మరణించారు .విరక్తి పొందిన కామేశ్వర ఇక అదనపు క్రతువుల జోలికి పోకుండా  కామేశ్వర  సత్యవతి దంపతులు నిత్యాగ్ని హోత్రం తో సరిపెట్టుకున్నారు .

  కామేశ్వర సోమయాజి గారు 1926లో జన్మించి ,7వ ఏట ఉపనయం చేసుకొని,ఆరు మైళ్ళ దూరం లో ఉన్న ఇందుపల్లి లో శ్రీ రాణి హయగ్రీవ అవధాని  గారి వద్ద  ,13ఏళ్ళువేదం నేర్చారు .ఈ అవధాని గారే సామవేదం వారికికూడా మూడవ వేదగురువు  .కామేశ్వరగారు ఆపస్తంభ సూత్రాలను అన్నగారు వ్యాఘ్రేశ్వరుని వద్దనే అభ్యసించారు .వేద విద్య పూర్తి కాకమునుపే 20వ ఏట సావిత్రి గారిని పరిణయమాడారు.ఈ దంపతులకు 10 మంది సంతానం –ఆరుగురు కుమారులు నలుగురు కుమార్తెలు .బులుసు సోదరులు తమ కుమారులకు వేద౦ నేర్పలేకపోయారు.కాని కుమార్తె ను మాత్రంకామేశ్వరి అగ్రహార  వేదపండితుడు శ్రీపాద మాణిక్య అవధాని ఘనాపాటీ కు ఇచ్చి వివాహం చేసి తృప్తి చెందారు .ఆసక్తి ఉంటె ఈయన ఆహితాగ్ని కాగలడు .

  సశేషం

రేపు 17-10-18 బుధవారం  దుర్గాష్టమి  శుభా కాంక్షలతో

మీ- గబ్బిటదుర్గా ప్రసాద్ -16-10-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”అణు శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో

Posted in అమెరికా లో, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అణు  శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో రెండు చోట్ల ఆవిష్కరణ 

అణు  శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో రెండు చోట్ల ఆవిష్కరణ
సరస భారతి  సాహితీ బంధువులకు దసరా శుభా కాంక్షలు –
నేను రాసి, శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల ప్రాయోజకత్వం లో ,,సరస భారతి చేత  శ్రీ కర్రీ శివ ప్రసాద్, డా  ద్రోణవల్లి రామమోహన రావు గార్ల  నేతృత్వం లో ప్రచురింపబడిన
”అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో టెన్నెస్సీ రాష్ట్రం ” నాష్ విల్ ”లో డా రామయ్యగారి స్వగృహం లో 15-10-18 సోమవారం సాయంత్రం
ఆంద్ర ప్రదేశ్ శాసనమండలి  సభ్యులు శ్రీ వై వి బి రాలేంద్ర ప్రసాద్ గారిచే శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీ కాకాని బాబూరావు  శ్రీమతి యలమంచిలి భ్రమరాంబ మొదలైన ఆత్మీయ అతిధులు ,బంధుమిత్రుల సమక్షం లో ఆవిష్కరింపబడుతుంది .
  16-10-18 మంగళవారం ఉదయం అలబామా  రాష్ట్రం లోని శ్రీ మైనేని గారుండే ” హంట్స్ విల్” దగ్గరున్న” మాడిసన్ కౌంటి” ”లో కూడా ”మీట్ అండ్ గ్రీట్ ”సమావేశం లో డా రామయ్య గారి పుస్తకాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తారు . .
ఇలా సరసభారతి పుస్తకం అమెరికాలో ఒక రోజు తేడాతో రెండు చోట్ల ఒకే గౌరవ వ్యక్తిచేత ఆవిష్కరింపబడటం విశేషం . సరసభారతి దక్కిన అరుదైన గౌరవం .
ఈ రెండు కార్యక్రమాలు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సంపూర్ణ  సౌజన్య ,సహాయ, సహకారాలతో జరగటం విశేషం . శ్రీమైనేని గారి సహృదయత కు నిదర్శనం సరసభారతికి శ్రీమైనేని గారు అందిస్తున్న సంపూర్ణ సహకారానికి కృతజ్ఞతలతో నమోవాకములు .
డా రామయ్య గారి కీ ,సతీమణి శ్రీమతి కృష్ణమయి  కుటుంబ సభ్యుల సహకారానికీ  నమస్సులు .
 డా రామయ్య గారి పుస్తకం ఈ డిసెంబర్ చివరి వారం లో ఉయ్యూరులో డా రామయ్య గారి కుటుంబ సభ్యుల సమక్షం లో కూడా ఆవిష్కరింపబడుతుంది అని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది
   శ్రీ విళంబి  ఉగాదికి ఒక వారం ముందు ఉయ్యూరు లోను ,ఉగాది నాడు అమెరికాలోని షార్లెట్ లోను నేను రాసిన ,సరసభారతి ప్రచురించిన ‘షార్లెట్ సాహితీ మైత్రీ బంధం”పుస్తకం రెండు చోట్లా  ఆవిష్కరింపబడిందన్న సంగతి  గుర్తు ఉండే ఉంటుంది  -దుర్గా ప్రసాద్ -13-10-18 -ఉయ్యూరు 

            మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-18 -ఉయ్యూరు
image.png
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు -2

 శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు -2

76-‘’క్షేత్ర స్వరూపా ,క్షేత్రేశీ.క్షేత్ర క్షేత్రజ్న పాలినీ –క్షయ వృద్ధి  వినిర్ముక్తా క్షేత్ర పాల సమర్చితా ‘’‘’

  సమయానుకూలంగా  క్షీణించటం శరీర ధర్మం .కాని ఉన్నంతవరకు తను నశిస్తూ ,తనలోని ఆత్మకు అక్షయమైన రక్షణ కల్పి౦చటమే శరీరం పని ..అందుకే దాన్ని’’ క్షేత్రం ‘’అంటారు .నిజానికి ఈ క్షేత్రం పరమేశ్వరి రూపమే .విశ్వం లో ఆణువణువు లోను సర్వేశ్వరి అస్థిత్వం వ్యాపించి ఉన్నట్లే ,శరీరం లోని అంగాగం లోను శ్రీ దేవి అనంత లావణ్యం వ్యాపించి  విరాజిల్లుతుంది .మానవ శరీరం లోనిసౌ౦దర్యం ,సామర్ధ్యం,శోభ లలో పరమేశ్వరి  అంశ ఉంటుంది .క్షేత్రం మనకు శరీర రూపం లో మన కర్మాను సారం దేవి తేజం లభిస్తుంది .కనుక ఈ పరమేశ్వరీవరాన్ని యధధోచితంగా ,యధేస్టం గా ఉపయోగించటం ప్రతి వివేకవంతుని కర్తవ్యంగా భావించాలి .

క్షేత్ర రూపం లో విరాజిల్లే ‘’క్షేత్ర స్వరూప ‘’శ్రీ దేవియే క్షేత్ర ‘’అధిష్టాత్రి’’ .అందుకే ఆమె ‘’క్షేత్రేశి ‘’అయింది .శరీరం క్షేత్రం అయితే ,శరీరరహస్యం తెలుసుకొన్నవాడు’’ క్షేత్రజ్ఞుడు’’ అంటారు .క్షేత్రానికీ ,క్షేత్రజ్నుడికీ తమతమ బాధ్యతలు నిర్వ హించే శక్తి క్షేత్రేశ్వరి వలన లభిస్తుంది.అందుకే ఆమెను ‘’క్షేత్ర క్షేత్రజ్న పాలిని ‘’అన్నారు .

  కేవలం క్షేత్రమే క్షీణి౦చి నశిస్తుంది  కాని క్షేత్రజ్ఞుడు ,క్షేత్ర పాలినీ నశించరు .కనుక వృద్ధి పొందేది క్షేత్రమే .పోషణలో వృద్ధి పొంది కాలక్రమం లో వాడి వడలి నశించటం క్షేత్ర ధర్మం .శరీరం లోని జీవాత్మకాని ,జీవాత్మను పెంచి పోషించి శాసించే పరమాత్మకాని  ఈ బాహ్య వృద్ధి  క్షయలను  అనుభవించరు  .అంటే పెరగరు తరగరు .శరీరం మాత్రమే ఈ రెండూ అనుభవి౦చి నశిస్తుంది .ఇలా నశించే శరీరాన్నే తాత్కాలిక ఆవాసం గా చేసుకొనేఆత్మ మాత్రం ముక్తమౌతుంది .ఈ ఆత్మ రూపం లో పరమేశ్వరి శరీరం లో ఉంటుంది .కనుకనే ఆమె ‘’క్షయ వృద్ధి వినిర్ముక్త ‘’అంటారు .

  శరీరం స్థూల వస్తువు .అందులోని మనసు ,బుద్ధి ,అహంకారం సూక్షం వస్తువులు .వీటన్నిటి సమ్మిశ్రిత రూపమే జీవాత్మ .జీవాత్మ కూడా సూక్ష్మ పరమాత్మయే .పరమాత్మ మాయా వినీలీలామయ శక్తి పరమేశ్వరి . అందుకేక్షేత్ర క్షేత్రజ్న ,క్షేత్రపాలురు  ఈ క్షేత్రేశ్వరిని ఆరాధిస్తారు .ఈ శ్లోకం లోని చివరినామం ‘’క్షేత్ర పాల సమర్చిత ‘’కు ఇదే అర్ధం అని గ్రహించాలి .నశించే శరీరం లో అనశ్వర ఆత్మ తత్వ రూపం లో ప్రతిస్టితమైన పరమేశ్వరి సాక్షాత్కారం ఎలా లభిస్తుంది ?తరువాత శ్లోకం దీనినే వివరిస్తుంది  .

77-‘’విజయా విమలా వంద్యా వందారు జన వత్సలా –వాగ్వాదినీ ,వామ కేశీ ,వహ్ని మండల వాసినీ ‘’

ఇందులో మొదటి పేరు ‘’విజయ ‘’.ఎప్పుడూ ఎవరికి విజయం లభిస్తుందో ఆమె విజయ .ఆమెను సాక్షాత్కారించుకోవటం కోసం శరీర ధారులు విజయ సాధన చేయాలి .లోపల, బయటి శత్రువులలతో పోరాడి విజయం పొందాలి .గెలిచినవారి జీవితమే సార్ధకం. ఆధ్యాత్మిక జీవితం లో లోపలి శత్రువులను అణచటం   ముఖ్యమైన విషయం .కామ క్రోధాది   వికారాలను జయించే దాకా మనశ్శాంతి ఉండదు. అంతరంగం ‘’ప్రశాంతి నిలయం ‘’అయితేనే ఆధ్యాత్మిక సిద్ధి ఆత్మ సాక్షాత్కారం లభిస్తాయి .కనుక తనపై తాను విజయం సాధించి ,తనను తాను తెలుసు కోవట౦ ఒక్కటే మార్గం .అందుకే ‘’మనోజయం జగజ్జయం ‘’అన్నారు’

   శరీరం, మనసు స్వాధీనమైనప్పుడు మనసు నిర్మలమౌతుంది .నిర్మలమైన మనస్సులో ఆత్మ లోకం  నిశ్చలమైన నీటిలో సూర్య చంద్రులు స్పష్టంగా కనిపించినట్లు కనిపిస్తుంది .ఇంద్రియాలు మనసుపై విజయం సాధించాక అంతః కరణాన్ని నిర్మలం గా ఉంచుకోగలిగితే ఆత్మానంద ప్రాప్తి సిద్ధిస్తుంది .కనుక శ్లోకం లోని రెండు నామాలైన విజయ ,నిర్మల ఈ సాధనా మార్గాలను సూచించింది .విజయం అంటే ఆత్మ విజయం .విమలం అంటే సమ్యక్ జ్ఞాన స్వచ్చ ప్రకాశం. అజ్ఞానం ఆశరీరిని ,శరీర మాయా మోహం లో పడేసే మాలిన్యం .అది తొలగి పొతే  అంతః  కరణం  విమలం ,నిర్మలం అవుతుంది.  చీకటి పోయి వెలుగు రావాలంటే భాను ప్రభ కావాలి .అలాగే జీవుడి అజ్ఞాన రూప అంధకారం జ్ఞాన ప్రకాశంగా మారటానికి పరమేశ్వరి కృపా ప్రభ కావాలి .

   మనో నిర్మలతకు ఒక బాహ్య లక్షణం వినమ్రత .నిర్మల మనస్కునికి వినమ్రత అలంకారం .శ్రద్ధకు అనుకూలంగానూ ఉంటుంది .కనుక విజయ విమలత్వాలకు మూలం వినమ్రత అని గ్రహించాలి .నమస్కారం లో గొప్ప చమత్కారం ఉంది .వందనం చేస్తే దేవీ దేవతలు ఫ్లాటై పోయి సంతృప్తి పడతారు .ఈ భావాన్నే ‘’వంద్య , వందారు జనవత్సల’’నామాలు సూచిస్తాయి  .ఇందులో వందన మహిమ కనిపిస్తుంది .వాల్మీకి మహర్షి రామాయణం లో సీతామాతను ‘’ప్రణిపాత ప్రసన్న’’అని శ్లాఘించాడు .అంటే ఒకసారి శ్రద్ధాభక్తులతో నమస్కారం చేస్తే చాలు ప్రసన్ను రాలై పోతు౦దని అర్ధం   .శరీరం చేసే నమస్కారం ,మనసు చేసే ‘’మననం’’ కు బీజమవుతుంది .విశ్వ వంద్య ఐన దేవికి నమకరిస్తే ఆమె కృప,  వాత్సల్యం పుష్కలంగా  లభి౦చి అనుగ్రహం కలుగుతుందని  భావం .

   ఆత్మ సంయమనం ,నిర్మల మనసు ,వినమ్ర ఆచరణ ఉన్న వారికి మంజుల వాక్కు మధుర సంయోగం తో తోడైతే ఆత్మ అదికంగా ఆలోకితం అవుతుంది .ఈ వాక్కు అమ్మవారు ప్రసాది౦ చేదే .వాణి అంటే సరస్వతీ దేవికే వాణి ని అంటే వాక్కు ను ప్రసాదిస్తుంది లలితా పరాభాట్టారిక .అందుకే ఆమెను ‘’వాగ్వాదిని ‘’అన్నారు. వాక్కు నుంచి వాణి ని వెలువరించే సామర్ధ్యం శ్రీ దేవికే ఉన్నది .వాగ్దేవి దయవలన లభించిన వాణి ద్వారా మనం ఆమెను స్తుతించి నమస్కరిస్తాం .సదాచరణ, నిర్మల మనస్సు ,శుద్ధ వాణి కలిసి సాధకుని ముఖం పై దివ్య తేజస్సును తొణికిసలాడిస్తాయి   .ఈ వర్చస్సుకు మూలాధారం  ‘’వామ కేశి’’ అయిన శ్రీ దేవి  .వామ అంటే ఎడమ వైపు  అనీ వెదజల్లు అనీ రెండు అర్ధాలున్నాయి .ఎడమవైపుకు ముడేసిన జుట్టు ,వికిరణమై శోభాయమానంగా ఉంటుంది .స్త్రీల కేశరాశి మృదులంగా కోమలంగా వికిరణ శీలంగా ఉంటే సౌందర్యం,దివ్యత్వం  వెయ్యి రెట్లు పెరుగుతుంది .ఇవన్నీ దేవిని  ‘’వామ కేశి ‘’అనే నామం తో తెలియ జేస్తున్నాయి .అంటే శ్రీదేవి వాణి,ఓజస్సును ,కేశరాశి తేజస్సునూ ఒకే సారి ప్రకాశింప జేస్తున్నాయని అర్ధం .ఈ ఓజస్సు తేజస్సులు ఆమె ద్యుతి ద్యోతకాలు .ఈ జ్యోతిస్సునే ‘’వహ్ని మండల వాసిని ‘’తెలియ జేసింది .శ్రీదేవి నిరంతరం అగ్ని కుండ౦లో ఉంటుంది .ఆమె వెలువడే స్థానమే చిదగ్ని .ఒకటి బయటి అగ్ని రెండోది అంతరాగ్ని.ఇక్కడ బాహ్య అగ్నిని సూచించారు .ఈ రెండు అగ్నులు శక్తికి ప్రతీకలు .ఓజస్సు తేజస్సు, ద్యుతులకు మూల స్రోతస్సు అదే. అగ్ని తాపమూ కలిగిస్తుంది ,కాంతీ ఇస్తుంది . అమంగళం వినాశానికి తాపం ,మంగళ వర్ధనానికి ప్రకాశం కావాలి .రెండూ శ్రీ దేవి ప్రసాదాలే .అయితే ఈరెండు కార్య భారాలను దేవి ఎలా చేస్తుందో తెలిపేదే తర్వాతి శ్లోకం .

  సశేషం

ఆధారం –డా శ్రీ ఇలపావులూరి పాండురంగారావు గారి ‘’శ్రీ సహస్రిక ‘’

శరన్నవరాత్రి శుభాకాంక్షలతో

మే-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-18-ఉయ్యూరు

Posted in సమీక్ష, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4

329-పవన దూత కావ్య  కర్త –పవన దోయి –(12వ శతాబ్దం )

12 వ శతాబ్ద బెంగాల్ సంస్కృత  కవి పవన దోయి .సేనవంశ రాజు లక్ష్మణ సేన  ఆస్థానకవి .ఈనాడు పిలువబడుతున్న బెంగాల్ కు ఆనాడు గౌడ దేశం అనిపేరు కనుక అతడు గౌడరాజు  లక్ష్మణసేనుని ఆస్థానకవి. పవన దోయి శక్తి గోత్రానికి చెందిన సేనవైద్య బ్రాహ్మణుడు .తండ్రి పుండరీక సేనుడు. తాత శ్రీవత్స సేనుడు .బెంగాల్ కు చెందిన శక్తి గోత్ర వైద్యులందరూ ధోయి వారసులని మహామహోపాధ్యాయ పు౦డరీక మాలిక్  తన కులగ్రంధం ‘’చంద్ర ప్రవ ‘’లో రాశాడు .పశ్చిమ బెంగాల్ కు చెందిన వారంతా అతడికొడుకు కాశీ సేనుడి వారసులు .తూర్పు బెంగాల్ వారంతా ఇతని కొడుకు కుశాలి సేన్ వారసులు అన్నాడు .

  దోయి సేన్ కు ‘’కవి క్ష్మా పతి ‘’ కవి చక్రవర్తి అనే గొప్ప బిరుదు లున్నాయి  ఇతడు రాసిన ముఖ్యకావ్యం ’’పవన దూత ‘’.దీనిలో కువలయతి అనే దక్షిణ దేశ గాంధర్వ కన్య  చరిత్ర ఉంది .లక్ష్మణసేనుడి దిగ్వియాయ యాత్రలో అతడిని చూసి మోహించింది .తన ప్రియుడికి సందేశం తెలియ జేయటానికి దక్షిణానిలం ను ప్రాధేయపడి పంపటమే కథ.కనుక ఇది దూతకావ్యంగా ప్రసిద్ధి చెందింది .కాళిదాసు మేఘ దూతం లా ఉంటుంది  .104శ్లోకాలకావ్యం లో 48శ్లోకాలు  దక్షిణ వాయువు తూర్పున ఉన్న గంధమాదన పర్వతాన్నుంచి దక్షిణాన బెంగాల్ లోను ఉదయపుర౦ లో ఉన్న రాజు లక్ష్మణ సేనుడికి సందేశం చేరవేసే ప్రయాణమే వర్ణించాడు  .38శ్లోకాలలో ఆమె సందేశం ఉంటుంది .వీటిలో కువలయవతి విరహం ,రాజు గుణగణ వర్ణ ఉన్నాయి .రసానికి అతీతంగా సందేశమే ప్రాధాన్యంగా కవి రాశాడు .

  సర్ జేమ్స్ మాల్లిసాన్ దీన్ని ఆంగ్లం లోకి అనువదిస్తే క్లే సాంస్క్రిట్  లైబ్రరి దూతకావ్యాల శ్రేణిలో ప్రచురించింది

330-ధృత కవి ,కథాకలి,సంతాన గోపాలం కర్త  –కిలిమనూర్ రాజరాజ వర్మ కోయి తంపురన్-( 1812-1845)

తిరువాన్కూర్ రాజా స్వాతి తిరుణాల్ రామవర్మ ఆస్థాన సంస్కృత విద్వాంసుడు .కరీంద్ర లేక చేరున్ని అనికూడా అంటారు 1812-1845 కాలం వాడు .కిల్లనూర్ పాలెస్ లో అన్మించాడు .ధృత కవిత్వం లో సాటి లేని మేటి .కనుక ‘’ధృతకవి మణి’’ సార్ధక బిరుదు పొందాడు .దిగ్గజం లాగా భారీగా బలిస్టం గా బాగా ఎత్తుగా ఉండేవాడు కనుక ‘’కరీంద్ర ‘’అనే వారు .ఆశువుగా ఏవిషయం పై నైనా క్షణాలమీద కవిత్వం చెప్పి మెప్పించే నేర్పున్నవాడు .అందుకే మహారాజు స్వాతి తిరుణాల్ ఇతనికి ‘’విద్వాన్ ‘’బిరుదు ప్రదానం చేసి గౌరవించి సత్కరించాడు .కథాకలిఅనే సంస్కృత నాటకం (అత్తకం ),సంతాన గోపాలం రాశాడు

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యాలు -1

లలితా పరాభట్టారిక సచ్చిదాన౦ద స్వరూపం లో విశ్వమంతా ఉండే పరమేశ్వరి .విశ్వం లో విశ్వం బయటా ఉంటుంది .సర్వత్రా ఉన్నా అందరికీ కనిపించదు .మనం మనకళ్ళతో ప్రపంచమంతా చూడగలం కాని అమ్మవారి కళ్ళను చూడలేము .మనవిధాత్రి ,నేత్రి ,సంధాత్రి పాదాల చప్పుడు వింటాం.కాని ఆనవాళ్ళను గుర్తించలేం .చూడాలన్న తపన, దీక్ష  ఉంటే ఆ అడుగుల చప్పుడే మనల్ని ఆమె వద్దకు చేరుస్తుంది .’’శ్రుతి ద్వారా సాధకులు ‘’దృష్టి’’ఆధారాన్ని చూడగలుగుతారు .ఒక సారి ఈ దృష్టి లభిస్తే ఇక ద్రష్ట ,దృష్టి,దర్శన భేదం ఉండదు .దీనినేలలితా సహస్రనామ స్తోత్రం 75వ శ్లోకం లో తెలుసుకోగలం

‘’విశ్వాధీకా ,వేద వేద్యా ,వింధ్యాచల నివాసినీ –విధాత్రీ వేద జననీ విష్ణు మాయా విలాసినీ ‘’

భూమి , నీరు కాంతి ,వాయువు ,ఆకాశం రూపం లో మన కంటికి కనిపించేదంతా విశ్వమే .స్పర్శ రూపం రసం గంధం దీని లక్షణాలు .పరమేశ్వరి విశ్వం లోనే ఉంది .భిన్నంగా ఉంది .పాంచ భౌతిక ప్రాణులు,తమ చర్మ చక్షువులద్వారా ముందూ వెనకా పైనా కిందా బయట లోపల సర్వత్రా  వ్యాపించి ఉన్నఆ దివ్య స్వరూపాన్నిచూదలేవు .అందుకే ఆమె ‘’విశ్వాధికా ‘’.విశ్ అనే ధాతువు నుంచి విశ్వం అనే శబ్దమేర్పడింది .దీని అర్ధం ‘’ప్రవేశించటం ‘’.అంటే దేనిలో కనిపించే వస్తువులన్నీ ప్రవేశిస్తాయో అదే విశ్వం .కాని శ్రీదేవి దివ్య రూపానికి ఏ వస్తువూ ఆధారంగా ఉండదు .అన్నిటినీ దరి౦చే ధాత్రి అంటే భూమికి ఒక పాత్ర కాని సందాని౦చేదికాని అవసరం లేదు  .అలాంటి ఏ వస్తువులోనూ ఆమె ఇమడదు .ఆమె సర్వత్ర ,సర్వస్వ ,,సర్వోపరి ,.అందుకే ఆమెను ‘’విశ్వాధిక ‘’అన్నారు .

బాగానే ఉంది వేదాంతం .మరి ఆమెను తెలుసుకొనే ఉపాయం లేదా ?అంటే ఉంది .అదే ‘’తెలుసుకో ‘’,’’అర్ధం చేసుకో ‘’,’’చూడు ‘’,’’పరీక్షించు ‘’.ఇదొక్కటే ఉపాయం .ఈజిజ్ఞాస వేదాలలో వేల రుక్కులలో ఛందస్సుల,స్పందనల రూపం లో ఉన్నది .ఎవరు యెంత ప్రయత్నిస్తే వారికి ఆ పరతత్వం అంతగా హృదయ గతం అవుతుంది .తెలుసుకొనే ,గుర్తుపట్టే ఈ దీర్ఘ మార్గం తప్పలక్ష్యం చేరటానికి  మరొక షార్ట్ కట్ దగ్గర దారి లేదు .తెలుసుకోవటం ద్వారానే ఆమె తెలియబడుతుంది అంటే వెల్లడవుతుంది .వేదం ద్వారానే ఆమె వేద్య అంటే తెలియ బడుతుంది .కనుకనే’’ వేద వేద్య’’ అయింది .ఈ సుదీర్ఘ యాత్ర తనకు ఏమీ తెలియదన్న అనుభవం తోనే మొదలౌతుంది .నాకేమీ తెలియదు .తెలిసింది అంతా అసత్యమే అనేది ముందు తెలుసుకోవాలి  .నిజమైన జ్ఞానం ఏమిటి అనే ప్రశ్న రావాలి .దేన్నీ తెలుసుకొంటే సర్వమూ తెలుస్తుంది అనేది ముందు తెలుసుకోవాలి .అప్పుడే జ్ఞానాన్వేషణ నిజంగా ప్రారంభమైనట్లు లెక్క .

ఈ జ్ఞాన లాలస కు ముందు జ్ఞాన మీమాంస దశ ఒకటి ఉంది .ఈ దశ మీదనే ‘’వింధ్యాచలం ‘’మీద నివసించే ‘’విశ్వాధిక ‘’అయిన దేవి శాసనం ఉంటుంది .’’వింధ్యాచల నివాసినీ’’అనే దేవి నామం .ఈ సాధనాన్నే స్పష్టం చేస్తుంది .ఇక్కడ వింధ్యా చలం అంటే మనం అనుకొనే వింధ్య పర్వతం కాదు .ఇది సాంకేతిక పదం .వి౦దతి ,ధ్యాయతి అనే రెండు క్రియల అందమైన కలయిక ఇది  వి౦దతి  అనే క్రియకు పొందుతాడు అని ,లక్ష్య సిద్ధి కలుగుతుంది అనే గొప్ప నమ్మకం కలిగిస్తుంది .ధ్యాయతి క్రియకు శ్రద్ధ పెడితే ,ధ్యానం ఏకాగ్రత పెడితే అని అర్ధం .కనుక ఈ జ్ఞానప్రాప్తి కి ఈ రెండూ సాధనాలను సూచిస్తుంది .భౌగోళికంగా వింధ్యాచలం హిమాలయాలకు ,మలయపర్వతానికి  మధ్య ఉంటుంది .హిమాచలం  మంచుకు ,ఉన్నతికి,ఉదాత్తతకు , సాత్వికతకు ప్రతి రూపం .ఇక్కడికి ఎంతో కష్టపడితే కాని చేరటం సాధ్యం కాదు .కాని దాని మాదకత ,మధురిమలను  మలయాచల మంద పవనాలు తెలుపుతాయి .మలయాచల మంజులత్వం హిమాచల మహిమ వైపుకు ప్రేరేపిస్తుంది .మధ్యలో ఉన్న వింధ్యాచలం ఈ ప్రేరణకు శ్రద్ధను జోడిస్తుంది .కనుక వింధ్యాచలం ప్రాప్తికీ ,ధారణకు కేంద్రం ,పరమార్ధ సాధనకు ఉపకరించే ధ్యాన పీఠం.ఇదే పరమేశ్వరి నివాసం .వింధ్యాచలం బయట భూమిపై ఉన్న పర్వతమే కాదు మనిషి లోపలకూడా ఉంటుంది బాహ్య ధ్యానం లోపలి వైపు కేంద్రీకృతమైతే ధ్యాన పీఠంజ్ఞాన పీఠంఅవుతుంది .కనుక ధ్యానం వల్లనే జ్ఞానం లభిస్తుంది అనిఅర్ధం  .ఈ జ్ఞానమే పరమేశ్వరిని గుర్తింప జేస్తుంది అని భావం .

పరమేశ్వరి ధ్యాన జ్ఞాన కర్మ ధర్మ పుణ్య పాప సత్ అసత్ అన్నిటినీ విధించే ‘’విధాత్రి ‘’ఆమె వేదమాత ,వేదజనని విధానాన్ని ఏర్పరచటం ,జ్ఞానమార్గాన్ని సుగమనం చేయటం ఆమె పనే .సృష్టి రహస్యమంతా తెలిసిన సృష్టి కర్త్రి ఆమె .ఆమె కృప ఉంటే తెలుసుకోవాలనుకొనేవారికి సహాయం లభిస్తుంది .వేదాలలో జ్ఞాన విజ్ఞానాల భాండారం  అనంతం గా ఉంది .అదంతా  అక్షర మయం .వేదమాత దయ ఉంటేనే సాధారణ అక్షరం  అక్షర నిధి అవుతుంది .గాయత్రీ మంత్రాన్ని కూడా వేదమాత అంటారు .తన గుణాలను గానంచేసే సాధకుల రక్షణ గాయత్రీ మంత్రం లక్షణం .సాధన యెంత గాఢంగా ఉంటే సిద్ధి అంత  సులభం. వేదమాత శ్రీమాత సహాయం సాధనలో స్థైర్యాన్ని పెంచుతుంది .

తరువాత నామం ‘’విష్ణు మాయ ‘’.ప్రపంచం, పరమాత్మ  అంతా మాయ అంటాం  .మాయ అంటే హద్దు . మన జ్ఞాన క్షేత్రం పరిమితమైతే మాయే పని చేస్తుంది .ఈ హద్దు దాటి మనం పోలేము  .ఇదే మాయామాత లీల .పరమాత్మ కూడా ఈ మాయామయి బారిన పడుతూ ఉంటాడు .పరమేశ్వరి మాయలో పడిన పరమాత్మ మానవ రూపం ధరించి మనలాగే సుఖాలు దుఖాలు ,రాగ ద్వేషాలు మొదలైన ద్వంద్వాలు అనుభవిస్తాడు  .అలౌకిక శక్తి సంపన్నులైన అవతార పురుషుల విషయమే ఇలా ఉంటే ,సాధారణ పురుషులు ఆడవారు చెప్పినట్టల్లా ఆడటం లో వింత ఏముంది ?పరమేశ్వరి మహా మాయ అంశం .లోకం లో స్త్రీల౦దరిలో కొద్దో గొప్పో ఉంటుంది .మాయవల్ల లోక కల్యాణం కూడా జరుగవచ్చు .మాయా మమతల ప్రభావం వలన ప్రపంచం నడుస్తుంది .దీన్ని కూడా శ్రీ దేవి ప్రసాదం గా భావి౦చి,స్వేకరిస్తే ,ఈ మాయా తరంగం మన శరీరాన్ని ,మనసును రంజింప జేస్తూ ,పైపై ను౦ డేదాటి పోతుంది .అందుకే ఇది విష్ణుమాయ .విష్ణువు విశ్వ వ్యాపి అయితే ,మాయ కూడా విశ్వ వ్యాప్తమే కదా .నిజానికి శ్రీమాతయే మాయ .మాయ మమతామయ రూపం .

అయితే మాయ ఎందుకు ?ఎందుకంటె అది లీల .ఈ ప్రపంచం అంతా ప్రేమ శ్రద్ధ ,విశ్వాసం ,మాయ ,మమత మొదలైన దైవీ భావనల లీలయే .జగజ్జననికి కూడా ఈ మాయలో ఒక అనిర్వచనీయ ఆనందం లభిస్తుంది .ఈ సమస్త జగత్త౦తాఎవరి లీలా స్థలమో ,ఆమె లీలావిలాసమే అక్కడ అణువణువులో విలసిల్లుతుంది .సంసార జీవితం లోని ప్రతి ఘటనలో ఈ లీలామయ లాలన వలన లాలిత్య పూర్ణ విలాసమే గోచరిస్తుంది .శ్లోకం లోని చివరి నామం ‘’విలాసిని ‘’లలితా పరమేశ్వరి యొక్క ఈ విలాసమయ స్వరూపాన్నే సూచిస్తుంది .

అయితే తెలుసుకోవాల్సిన అసలు రహస్యం ఒకటి ఉన్నది .విశ్వ కళా విలాసిని అయిన శ్రీదేవి లీలాదామం మన శరీరమే .మానవ శరీరం అశాశ్వతమే అయినా శాశ్వత సత్య సాత్విక కాంతిని తనలో ఇముడ్చుకొని ఉంటుంది .శరీరాన్ని క్షేత్రమనీ ,శరీరం లో నివశించే శరీర ధారిని క్షేత్రజ్ఞుడు అనీ అంటారు .ఈ శరీరాన్ని అందులో ఉండే వాడినీ కూడా సృష్టించిన మూల శక్తియే క్షేత్ర క్షేత్రజ్ఞుల పాలనా పోషణా చేస్తుంది .ఈ క్షేత్రేశ్వరి వర్ణన తరువాత శ్లోకం లో వస్తుంది .   సశేషం

ఆధారం –డా .శ్రీ ఇలపావులూరి పాండురంగారావు గారి ‘’శ్రీ సహస్రిక ‘’.

శరన్నవ రాత్రి శుభాకాక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-18-ఉయ్యూరు

 

 

 

 

 

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 326-ప్రేమ ముక్తక కవయిత్రి –భావకా దేవి (12 వ శతాబ్దం )

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4

326-ప్రేమ ముక్తక కవయిత్రి –భావకా దేవి (12 వ శతాబ్దం )

భావకాదేవి లేక  భావా దేవి అని పిలువబడిన ఈ సంస్కృత కవయిత్రి 12వ శతాబ్దం లేక అంతకు పూర్వం ఉండేదని భావిస్తారు .మధ్యకాలపు సంస్కృత కవులు తమ గ్రంథాలలో ఈమెను ఉదాహరించారు .విద్యాకారుని సుభాషిత రత్న కోశం లోనూ సూక్తి కర్ణామృతం ,కవీంద్ర వచన సముచ్చయం లోను ఈమె కవతలు ఉదాహరింపబడినాయి .స్త్రీ వక్షో సౌందర్యాన్ని వర్ణించిన కవిత –

1-‘’ఆమె పాలిండ్లు ఇద్దరు రాజులలాగా సమానంగా ఉన్నతంగా ఉన్నాయి –పైనుంచి అన్ని వైపులకు చూస్తున్నట్లు కనిపిస్తాయి .విశాల జఘన సామ్రాజ్యాన్ని జయించిన ధీమా ఆ చూపుల్లో ఉంది .సరిహద్దు యుద్ధాలలో ని కఠోర ధిక్కార ధోరణి ఉంది ‘’

2-వలచి వలపించి పెళ్లి చేసుకొన్నప్రియుడు ఆశాభంగం కలిగించిన భార్య మనోవేదన –

‘’మొదట్లో మా ఇద్దరి శరీరాలు పూర్టి గా  ఏకత్వం పొందాయి –తర్వాత రెండుగా పెరిగాయి –ఇప్పుడు అతడూ నేనూ సంతోషానికి దూరమయ్యాం ‘’

3-ఇప్పుడు నువ్వు భర్తవు ,నేను భార్యను –ఇక ఈ జీవితం లో నాకు ఇంకేమి వస్తుంది ?చెట్టు ఏపుగా పెరిగి విరవటానికి వీలుకానిదైనది .చేదుపళ్ళు కాస్తున్నాయి –తినలేను భరించలేను ‘’.

327-విరహ వేదన ఒలికించిన –మరుల (13వ శాతాబ్దం )

13వ శతాబ్ది కి చెందిన మరుల సంస్కృత కవయిత్రిగా ప్రసిద్ధి పొందింది. సాహిత్య చరిత్రలో స్థానం సాధించింది .సారంగ ధరు ని  ‘’పధ్ధతి ‘’లో ,జల్హణుని’’సూక్తి ముక్తావళి ‘’లో ఆమె కవితలు చోటు చేసుకొన్నాయి .కనుక 13శతాబ్దం లో ఉండి ఉంటుందని భావన .ఆకాలం లో ఆమె బహుళ ప్రసిద్ధి చెందినకవి గా గుర్తి౦ప బడినట్లు దండదేవుడు సారంగధర పద్ధతిలో తెలిపాడు –‘’శీలాభట్టారిక ,విజ్జ మరుల మోరిక అనే నలుగురు స్త్రీ కవులు అసమాన ప్రతిభా సామర్ద్యం తో కవిత్వం రాశారు .దిగ్దంతులైన పండితుల్ని వాదాలలో జయించారు .సకల శాస్త్ర పారంగత్వం వారి సహజ ఆభరణం ‘’

మరుల కవిత్వం దొరకలేదు .కొన్ని శ్లోకాలే కనిపించాయి .అందులో ప్రియుడికి దూరమైన ప్రేయసి గురించినదాన్ని తెలుసుకొందాం –

‘’గోపయంతి విరహ జనితం దుఃఖ మగ్రే గురునం –కిం త్వం ముగ్ధే నయన విశ్రితం వాస్ప పూర్ణం రుణస్థి

నక్తం నక్తం నయన సలిలైర్ యేస అద్రీ కృతస్తే-శయ్యో పాతః కథయతి దశం అతాపే శోష్యమానః ‘’

భావం –నీ ప్రేయసికి దూరమై నీ దుఖాన్ని దాచుకొంటూ –ఎందుకున్నావ్ ప్రియతమా –కన్నీళ్లు వరదలా కళ్ళలోంచి ప్రవహిస్తుంటే ఆనకట్ట కడుతూ ఎలా ఉండ గలుగుతున్నావ్?  కన్నీటి ప్రవాహం తో నీ పక్కఎన్నో రాత్రులు  తడిసి ముద్ద అయిపోతుంటే ,మర్నాడు ఉదయం ఎండిపోవటం నీ దురవస్థకు  సాక్ష్యం కాదా ‘’

328-మానవ సంబంధాలపై కవిత్వం రాసిన –శాలి భట్టారిక (9వ శతాబ్దం )

9వ శతాబ్దానికి చెందిన సంస్కృత కవయిత్రి శాలిభాట్టారిక పేరు సాహిత్యకారులందరూ పేర్కొన్నారు.ఆమె రాసిన శ్లోకాలలో నర్మాదానదిని ,వింధ్య పర్వతాలను వర్ణించినవి ఉన్నాయి .కనుక ఆప్రాంతానికి చెందినది గా ఊహిస్తున్నారు .7వ శతాబ్ది రాష్ట్ర కూట రాజు  ధృవ యొక్క దేవేరి శీలా మహాదేవి ఈమెయే కావచ్చు అని మైసూర్ యూని వర్సిటి రిసెర్చ్ స్కాలర్ ఏం .బి .పద్మ అభిప్రాయపడింది .భట్టారిక అనేది ఉన్నత గౌరవ వాచకం అన్నదామె.రాణిగా ఎన్నో భూరి దానాలు చేసి ఉంటుందని అంటోంది .రాజశేఖరుడు కూడా శీలాభట్టారిక పా౦చాలీ శైలి లో గొప్పకవి అని మెచ్చాడు .15శతాబ్దపు వల్లభ దేవుడు ‘’సుభాషితావలి’’లో రాజశేఖరుని శ్లోకం ఉదాహరిస్తూ పాంచాలీ శైలి అంటే ‘’పదానికి ,అర్ధానికి సమతుల్యం ఉన్న శైలి ‘’అని చెప్పాడు అంటాడు .ఈ శైలి 7వ శాతాబ్దికవి’’బాణుడి ‘’లో కనిపిస్తుంది  .

చాలామంది సంస్కృత సాహిత్య విమర్శకులు శీలాభట్టారిక కవిత్వాన్ని ఉదాహరించటం ,కవుల చరిత్రలో ఆమె పేరు ప్రసిద్ధంగా ఉండటం వలన ఆమె  శ్రేష్టత్వాన్ని తెలియ జేస్తోంది .ఆమె 46ముక్తక శ్లోకాలను ప్రేమ ,నీతి రాజకీయం,ప్రకృతి ,సౌందర్యం ,ఋతువులు ,కీటకాలు ,కోపం ,నైచ్యం ,ప్రవర్తన నియమావళి ,నాయికల స్వభావాలపై రాసింది .రాసిన వాటిలో ప్రస్తుతం లభ్యమైనవి 6శ్లోకాలే . సార౦గధరుని ‘’పధ్ధతి ‘’లో ఉదాహరించిన ప్రముఖ నలుగురు కవయిత్రులలో మొదటి పేరు ఈమెదే .

సంస్కృత సంప్రదాయం లో అంతవరకూ ఎవరూ రాయని గొప్ప శ్లోకం శీలాభట్టారిక రాసినట్లు విమర్శకులు ఆమె ప్రతిభను మెచ్చుకొన్నారు –అదే ఇది –

1-‘’ఎవరు నా కన్యత్వాన్ని దోచుకొన్నది ?నా  పెళ్లికొడుకే కదా.ఆ చైత్రమాస  వెన్నెల రాత్రులలో ,కదంబ  వృక్షాల కింద,మాలతి పుష్ప సుగంధాలలో నేనెవరో నాకు తెలిసింది .అయినా నా హృదయం నర్మదానదీ తీరం లో మళ్ళీ ప్రేమ కేళి కోరుతోంది ‘’

ఈశ్లోకం ఆమె  మళ్ళీ ప్రియుడి పొందుకోస౦ ఆత్రపడుతోందని ,కనుక కవయిత్రి మధ్య వయసు స్త్రీ అయి ఉంటుందని ,వివాహానంతర సుఖం కంటే ప్రియా  ప్రియురాలుగా వారిద్దరి పెళ్ళికాక ముందు ప్రేమ వ్యవహారం మధురాతి మధురంగా ఉండి ఉంటుందని విమర్శకులు ఊహించారు  .ఇదంతాకాదు వారిద్దరిమధ్య ఉన్నది జీవేశ్వర పరమేశ్వర సంబంధం అన్నాడు 16వ శతాబ్ది వేదాంతి ‘’చైతన్యుడు’’

2-భార్య కోసం తపించే భర్త వేదన

‘’తన ప్రియతమ దూరమై నందుకు  అతని  గుండెలో కోర్కె రగిలింది .దీనితో నిద్ర అతన్ని వదిలేసింది .కృతజ్ఞుడిని ఎవరు ఆరాధిస్తారు ?’’

3-ఒక నిరుపేద తనభార్యకు తగినంత ఆహరం నగలు పెట్టలేకపోతున్నాననే వేదన

‘’నగలు గాజులు లేని నాభార్యను చూస్తేగుండె తరుక్కుపోతోది .అన్నం వండే మట్టి కుండ, అందులో ఉడికించటానికి ఏదీ లేకపోవటం చూసి నా హృదయం దహించుకుపోతోంది ‘’

4-శీలా భట్టారిక బహుముఖ ప్రజ్ఞను , విద్వాంసులతో వాదిస్తే ,బహు గ్రంథపఠనం చేస్తే ,మేధావులతో భావాలు పంచుకొంటే జ్ఞాన విజ్ఞానాలు ఎలా వికసిస్తాయో విశదీకరించే శ్లోకం  .దీన్ని అందరూ ఉదాహరించారు –

‘’గ్రంథాలన్నీఔపోసన పట్టి ,రచనలో సేద్యం చేస్తూ ,,  ప్రజ్ఞాపాటవాలతో విద్వాంసులతో  చేసే చర్చలూ గోస్టులు ,తనకంటే పై స్థాయి మేదావులతో భావాలు పంచుకోవటం తో, మనిషిలోని జ్ఞానం సహస్ర దళపద్మం సూర్య  రశ్మి కి విచ్చుకున్నట్లుగా వికసిస్తుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-18-ఉయ్యూరు

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 324-శుభాషిత రత్నకోశకర్త –విద్యాకరుడు (1050-1130)

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4

324-శుభాషిత రత్నకోశకర్త –విద్యాకరుడు (1050-1130)

ప్రసిద్ధ బౌద్ధ వేదాంతి .సంస్కృతపండితుడు ,కవి  ,సాహిత్య చరిత్రకారుడు   విద్యాకరుడు 1050-1130కాలం వాడు .’’శుభాషిత రత్న కోశ’’కర్తగా బహు ప్రసిద్ధుడు .ఇది గొప్ప ఆంథాలజి గా ప్రసిద్ధి చెందింది .ఉత్తర బెంగాల్ లోని జగద్దాల విహార బౌద్ధ సన్యాసి అని కోశాంబి తెలిపాడు .రచన అంతా తాటి ఆకులపైనే కనిపిస్తోంది .అది ఇస్లాం కాలానిది అనికొందరు అంటారు .కాని టిబెట్ లోని నగొర్ బౌద్దారామం లోని తాటాకులగ్రంథం మొదటిదని , 1090లో రచించినట్లు ఉన్నదని అంటారు .రెండవది కాగితాలమీద ఉన్నది నేపాల్ రాజగురు పండిట్ హేమరాజ్ వద్ద ఉన్నది .ఇది 1130లో కూర్చిన తాజా గ్రంథం గా భావిస్తారు .2377శోకాల గ్రంథం ఇది .

మొదటి దాన్ని 19 12లో ఎఫ్. డబ్ల్యు. ధామస్ ‘’కవీంద్ర వచన సముచ్చయం ‘’పేరిట ప్రచురించాడు .ఇందులోనికోన్నిశ్లోకాలు వేరొకరు రాసిఉంటారని కోశాంబి అభిప్రాయపడ్డాడు .రెండవ గ్ర౦థంలో 1,732 శ్లోకాలున్నాయి .విద్యాకారుడు ఇంతటి బృహత్ గ్రంథం కూర్చటానికి చాలా ఏళ్ళు శ్రమించినట్లు అర్ధమౌతుంది .కాని శుభాషిత రత్న కోశం లో పేర్కొనబడిన చాలామంది కవులను గుర్తించ లేకపొతున్నారు .గుర్తింపబడిన 275మంది కవులలో 7గురు మాత్రం 7వ శాతాబ్దికి పూర్వకవులు .రాజ శేఖర ,మురారి ,భావభూతులు సుప్రసిద్ధకవులు .కాని వల్లన,యోగీశ్వర ,వాసుకల్ప ,మనో వినోద ,అభినంద కవులు మాత్రం బెంగాలికవులు కాని ,బెంగాల్ -బీహార్ లు కలిసి ఉన్నప్పటి తూర్పు పాలరాజ్య కవులు కాని అయి ఉండవచ్చునని ఊహిస్తున్నారు .వీరు విద్యాకరుని సమకాలికులుకాని లేక కొద్ది కాలం ము౦దు వారుకాని అయి ఉండవచ్చు. విద్యాకరుని చేత అతి తక్కువగా ఉదాహరింపబడిన రచయితలలో ఎక్కువమంది పాలరాజ్య యువరాజులు .వీరి రచనలు రాజశేఖరుడు లేక భవభూతి ఎక్కడా ఉదాహరించిన దాఖలాలు లేవు .వీరిలో ధర్మపాల ,రాజ్యపాల ,బుద్దాకరగుప్త ,క్షిపాల ,జ్ఞానశ్రీ లున్నారు .మహాకవులైన కాళిదాస ,రాజశేఖర ,భవభూతి కవుల శ్లోకాలను విద్యాకర ఉదాహరించినా ,ఎక్కువభాగం తూర్పు బెంగాల్ కవుల కవిత్వానికే ప్రాముఖ్యమిచ్చాడు’’ బ్లడ్ ఈజ్ ధిక్కర్ దాన్ వాటర్ ‘’అనే సామెత ఉండనే ఉందిగా .జగద్దాల విహారానికి చెందినా ,విద్యాకరుడికి ఉత్తర భారతం లోని మిగిలిన అయిదు బౌద్ధ విహార గ్రంథాలయాలతోబాగా పరిచయమున్నట్లు అర్ధమౌతుంది.ఈ విహారాలలోని వారు తరచుగా కలుసుకోనేవారు.

బౌద్ధ సన్యాసి అయినా విద్యాకరుడు ఈ బృహత్ సంకలనం లో ప్రేమ కవిత్వానికే ప్రాధాన్యమిచ్చాడు  .అందులోనూ శృంగారం  దట్టించిన కవితలనే బాగా ఉదాహరించాడు .’’తలలు బోడులైన తలపులు బోడులా ‘’అన్నాడు కదా వేమన్న .మంచి ప్రణాళికతోనే  దీన్ని కూర్చాడు .మొదటి శ్లోకాలన్నీ ‘’బోధి సత్వుని ‘’పై రాసినవే. వీటిని విహారాలలోని ఆచార్యులు (ప్రొఫెసర్లు),విద్యాకరుని సమకాల కవులు రాసినవే .తర్వాత శివుడు, విష్ణువు లపై శ్లోకాలున్నాయి .వీటిని తొందరగా తెమిల్చేసి అయ్యవారు ఒక్కసారి శృంగార కవిత్వం లోకి లాంగ్ జంప్ చేశాడు .ఋతువులు ,దూత రాతలు ,రోజులోని వివిధ దశల వర్ణనలు ఉంటాయి .

సుభాషిత రత్న కోశం తర్వాత 1205లో శ్రీధర దాసు సంకలించిన ’’సుదూక్తి సుధ’’అనేమరో సంకలనం బెంగాల్ నుంచే వచ్చింది .ఇది623శోకాల  ‘’పిల్ల కోశం ‘’అని పేరుపడింది .కాని రాశి వాసి లలో విద్యాకరుని సంకలనానికే పేరు వచ్చింది .ప్రసిద్ధ చరిత్రకారుడు ,ఆంగ్లకవి ‘’ఇంగాల్లిస్’’ఇంగ్లిష్ లోకి సుభాషిత రత్నకోశాన్నిమొత్తాన్ని అనువదించాడు .ఇందులో కవిత్వ స్థాయి చాలా ఉదాత్తంగా ,ఉన్నతంగా ఉందని అంటారు .తర్వాత చాలామంది చేత అనువాదమైంది.

325-కౌముదీ మహోత్సవ కర్త –విజ్జ?(8-9శతాబ్దం )

కేరళకు చెందిన విజ్జ లేక విద్య ,లేక విజ్జక  8లేక 9శాతాబ్ది సంస్కృత కవ యిత్రి.ఆమె కవితలు మధ్యకాలపు కవుల చరిత్ర లో ఉదాహరింపబడినాయి .ఈమెనే విద్యాకరుడు ‘’విద్యా ‘’అని ,శారంగధర ‘’పద్ధతి’’లో ప్రాకృతం నామం ‘’విజ్జకా’’ అనీ ,వల్లభ దేవుని కవుల చరిత్రలో కూడా’’ విజ్జకా ‘’అనీ ‘’విజ్జాక’’ అనీ పేర్లున్నాయి .విజ్జకా లేక విజయా౦క ను జల్హణుని’’సూక్తి ముక్తావళి’’లో రాజ శేఖరుడు చెప్పినట్లు ఉదాహరించిన శ్లోకం  లో –కర్నాటకకు చెందిన ఆ ‘’విజయా౦క ‘’సరస్వతీదేవిలాగా విజయం సాధిస్తుంది .కాళిదాసు లాగా ఆమె వైదర్భీ రీతి కవిత్వం లో మేటి ‘’.

విజయాంక అంటే విజయం అ౦కమునందు కలది అని అర్ధం .విద్య లేక విజ్జా అంటే జ్ఞానం ,విజ్ఞానం అని భావం .చాళుక్య రాజు కొడుకు పులకేశి (610-642)కొడుకు, యువరాజు చంద్రా దిత్యుడు దక్షిణభారతాన్ని తండ్రితర్వాత పాలించాడు .ఈతని భార్య ‘’విజయభట్టారిక ‘’నే ‘’విజ్జక ‘’అంటారు .విజ్జక విజ్ఞానం సరస్వతీ దేవితో సమానం కాని రంగులో నల్లగా ఉండేదట .దీనిపై ఒక శ్లోకంలో  దండి కవి సరస్వతీదేవిని పూర్తి శుద్ధ స్పటిక సంకాశం గా ఉన్నది అని ‘’తన కావ్య లక్షణ సారం ‘’లో ప్రారంభం లో అనటం తప్పు   అని తెలియ జెప్పే శ్లోకం ఒకటి’’ సారంగధర పధ్ధతి ‘’  లో ఉంది –

‘’నన్ను నల్లకలువ రెక్కలున్న విజ్జక అని తెలుసు కోకుండా దండి  సరస్వతీ దేవిని అతి తెల్లగా ఉంటుందని రాశాడు ‘’.జల్హణుడు ‘’సూక్తి ముక్తావళి ‘’లో కొంచెం తేడాలో .’’నన్ను నల్లకలువ రెక్కలున్న ‘’అన్న శ్లోకం రాసింది ఒక అజ్ఞాత కవిఅన్నాడు .ఏది యెమైనప్పటికీ ఈమె దక్షిణ భారత దేశ సంస్కృత కవయిత్రి అని రుజువైంది .కాని పులకేశి కోడలు విజయాదిత్యుని భార్య విజయ అని చెప్పటానికి సాక్ష్యాధారాలు లేవు .8వశతాబ్దపు దండి  7వ శతాబ్ది విజయను రాజ కుమారి అనటం చెల్లదు .అదే నిజమైతే ఆమె 7 శతాబ్దం చివర దాకా జీవించి ఉండాలి .

ధనదేవుడు విజ్జ ను మాంచి తెలివి తేటలున్న కవయిత్రిగా మెచ్చాడు .అంతేకాక విజయాంకఅనే కవయిత్రి వైదర్భీ రీతిలో దిట్ట అని చెప్పాడు .అయితే  ఈ ఇద్ద్దరూ ఒకరేనా కాదాఅని ధనదేవుడు తేల్చలేదు .

‘’కౌముదీ మహోత్సవం ‘’ సంస్కృత నాటకం  ఒకేవొక రాత ప్రతి కేరళ లో లభ్యమైంది .ఇందులో కొంతభాగం చెదపురుగులు తినేశాయి .ఉపోద్ఘాతం లో  రచయిత పేరున్న చోటమొదట్లో  ఒక పెద్ద చిల్లి కనిపించింది .చదవటానికి వీలున్న చోట చివరగా ‘’కయా’’అని ఉంది .కనుక రచయిత స్త్రీ అయి ఉండాలి .మాననీయులు మానవల్లి రామకృష్ణయ్యగారు  అది కయాకాదు జా అని తేల్చి చివరకు పేరు ‘’జకయా ‘’అన్నారు  .కాని ఏ.కే. వార్డర్ ఇది సందేహమే అన్నాడు .కొంత దారిలో పడింది .మిగిలిన పరిశోధకులు ‘విజ్జకయా ‘’అన్నారు .ఈమెయే విజ్జ అనీ చెప్పారు .వార్డర్ మళ్ళీ ఒప్పుకోక ఇంకోపేరు’’మోరికయా’’కావచ్చు అన్నాడు .  అసలు ఇది రచయిత పేరేకాదు  నాటకం లో ఉపా౦క౦ పేరు ‘’పతకాయా ‘’అన్నాడు .నాటక ఇతి వృత్తం ,శైలీ విజ్జ రాసినట్లు లేదంటారు .కనుక అంతకు ముందుకాలం వాడైన భాసమహాకవి వంటికవి రాసిన నాటకం అన్నారు.బహుశా 6వ శతాబ్దం తర్వాత రచింపబడి నట్లు ఉందన్నారు .

10వ శతాబ్ది రాజశేఖరుడు ,11శతాబ్ది భోజుడు  విజ్జ పేరు ఉదాహరించారు .7-8 శతాబ్ది దండి ఆమె శ్లోకం తెలిపాడు . వీటన్నిటి బట్టి విజ్జ 8 లేక 9 శతాబ్ది సంస్కృత కవి అని తేల్చారు .విజ్జ ప్రేమ ఋతువులు ,ప్రకృతి పై శ్లోకాలు రాసింది .గోప్పభావుకత శైలి లయ తో ఆమె కవిత్వం శోభిల్లింది .ఇవన్నీ ముఖ్య సంస్కృత కవుల చరిత్రలో కనిపిస్తాయి .దండ దేవుడు రాసినట్లు చెప్పబడిన ఒకశ్లోకం ,సారంగధరుని ‘’పధ్ధతి ‘’లో ‘’నలుగురు ప్రసిద్ధ సంస్కృత కవయిత్రులలో విజ్జ ఒకరు –వారు –శీల భట్టారిక ,విజ్జ ,మరుల ,మోరిక .ఈ నలుగురు కవిత్వం రాయటం లో ,విద్యావేత్తలతో సంభాషించటం లో అన్ని శాస్త్రాలలో మేటి అనిపించుకోన్నవారు .వాదాలలో మహామహులను ఓడించి గెలుపొందినవారు .వీరుమాత్రమే  ఆ కాలం లో లబ్ధ ప్రతిస్టులైన కవయిత్రులు .’’అన్నాడు .

విద్య రాసింది అని విద్యాకరుడు ,విజ్జిక రాసిందని శ్రీధర దాసు విజ్జకా రాసింది అని జల్హణుడు ,అజ్ఞాత కవయిత్రి రాసిందని వల్లభ దేవుడు పేర్కొన్న ఒక శ్లోకం –‘ప్రేమించటం లో ,ప్రేమ వ్యవహారాలలో శృంగారం లో నిన్ను అనేక అలంకారాలతో  వర్ణించబడే  నువ్వు అదృష్టవంతురాలవు .కాని నా ప్రేమికుడు నా రవికముడి పై చెయ్యి వేసినప్పుడు నాకు ప్రపంచమే కనిపించదు అంతా మర్చేపోతాను ‘’.(విజ్జక (విజ్జ )

మరొక శ్లోకం ‘’పక్కి౦ టాయనా !నా ఇంటి పై ఓ కన్నేసి ఉంచు .నా ప్రియుడి తండ్రి నూతిలోని ఉప్పు నీరు తాగలేడు.నేను ఒంటరిగా చెరువు నీళ్ళు తీసుకు రావటానికి వెడుతున్నాను .నా శరీరం పై ఖాళీ లేకుండా నఖాలతో గుచ్చేయ్యగాలవా ‘’(విజ్జక (విజ్జ )

మరో శ్లోకం తన బీదరికాన్ని గురించి ‘’చావులో రోగం రోస్టుఅన్నీ హరి౦చుకు పోతాయి .నడవలేనితనం ,మాటరాని తనం కంపించే శరీరం దరిద్రుడిని బగా గుర్తుపడతాయి ‘’(విజ్జ )

ప్రేమించటం పై మరో శ్లోకం – ఆనందమైనఆ రాత్రి లో  దీపం తోడుగా మనిద్దరం ఆ రాత్రంతా  గాఢం గా ప్రేమించుకోన్నాం .మంచం కిర్రుకిర్రులాడింది .అతడు శ్వాసపీల్చటానికి స్వల్ప విరామం తీసుకొంటున్నాడు –రాత్రంతా మంచం పళ్ళు కొరుకుతూనే ఉంది ‘’(విజ్జ )

ఇంకా విజ్జ పేరు మిస్టరీగానే మిగిలి ఉంది

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-18-ఉయ్యూరు

 

 

 

 

 


 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గాంధీజీ 150 వ జయంతి  

గాంధీజీ 150 వ జయంతి

1-గాంధీజీ  –సత్యవాక్కు

సత్యం వద ,సత్యమేవ జయతే ,సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని ఋషి ప్రోక్తం .అన్నిటిలో సత్యమే శ్రేష్టమైన ధర్మం .దాన్ని అనుసరించినవారికీ ఈ లోకం లోనేకాదు పరలోకం లోనూ ఎదురులేదు .హరిశ్చంద్రుడు సత్య వాక్కు కోసం సర్వస్వాన్నీ తాత్కాలికంగా కోల్పోయినా అదే ఆయనకు అండగా నిలిచి సర్వం తిరిగి పొందటానికి తోడ్పడింది .సత్య హరిశ్చంద్ర నాటకం చిన్నతనం లో చూసిన గాంధీజీ సత్యానికి ఆకర్షితుడై ,సత్యానికి అంకితమై జీవించాడు .సత్య నిస్ట ఉన్నందునే హరిశ్చంద్రుడు చరిత్ర ప్రసిద్ధుడయ్యాడని గ్రహించాడు .ఎన్నికస్టాలెదురైనా సత్యమార్గం విడవను అని తీర్మానించుకొన్నాడు .శ్రావణుని పితృ భక్తికూడా  ఆయనపై గొప్పప్రభావం చూపింది . స్కూల్ లో ఉపాధ్యాయుడు కాపీ చేయమని ప్రోత్సహించినా తన అంతరాత్మకు విరుద్ధం కనుక చేయని ఆదర్శ జీవి .తండ్రి జేబులో డబ్బు కొట్టేసి తండ్రికి నిజం చెప్పి ఆయన మనసు గెలుచుకున్నాడు  .చేసినతప్పులు తెలుసుకొని ,తనపై తాను ప్రయోగాలు చేసుకొని సత్యమార్గాన్ని అనుసరించాడు .ఇలా చిన్నతన౦ లోనే సత్య విజయం సాధించాడు .ఆయన జీవితమే సత్య శోధన –యాన్ ఎక్స్ పెరిమేంట్ విత్ ట్రూత్  .సత్య వాక్కు మహత్తరమైనది .గోవు సత్యవాక్కును నిలబెట్టుకొన్నందుకు వ్యాఘ్రం మనసు మారి దాన్ని చంపకుండా వదిలేసిందన్నకథ మనకు తెలుసు .20 వ శతాబ్దం లో కూడా ఇలాంటి సత్యవాక్ పరిపాలకుడైనందుననే గాంధీజీ ప్రపంచ దృష్టి నాకర్షించాడు .సత్యం ,అహింస ఆయనకు రెండుకళ్ళు .అందుకే అతి సామాన్యుడు మాన్యుడై మహాత్ముడనిపించుకొన్నాడు  .’’గౌతమబుద్ధుడు ,జీసస్ ల తర్వాత అంతటి మహావ్యక్తి గాంధీ’’ అన్నాడు డా హూమ్స్ అనే అమెరికన్ మిషనరీ . ‘మహాత్మా గాంధి వంటి వ్యక్తి ఈ భూ ప్రపంచం మీద రక్తమాంసాల శరీరం తో మనుగడ సాగించాడంటే ము౦దుతరాలవారు నమ్మలేక పోవచ్చు ‘’అని కీర్తించాడు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ . సిద్ధాంతాలు అందరూ చెప్పవచ్చు కాని నిజ జీవితం లో వాటిని ఆచరి౦చి మార్గ దర్శనం చేసినవాడు మహాత్మా గాంధీ .   ఉదాత్త జీవిత లక్ష్య సాధనకు సాధనాలుకూడా పవిత్రంగా ఉండాలని బోధించాడు .వ్యక్తిత్వానికి విశ్వ ఖ్యాతి తెచ్చాడు .

లండన్ వెళ్లేముందు తల్లి కిచ్చిన వాగ్దానాలను  ఎట్టి పరిస్థితి లోనూ మరచిపోకుండా అమలు చేసి సత్య సంధుడనిపించాడు .లండన్ లో తాను పేయింగ్ గెస్ట్ గా ఒక స్త్రే ఇంట్లో ఉండగా ,ఆమె కూతురు  తనపై ప్రేమలో పడగా ఇంటి యజమానురాలికి తనకు పెళ్లి అయిందని తనకిచ్చిన ఆతిధ్యానికి ధన్యవాదాలని నిజం తెలియజేస్తూ ఉత్తరం రాశాడు . గాంధీ సత్యసంధతకు  ఆమె ఎంతో అభినందించి౦ది . ఆయన  అసత్యం చెప్పిఉంటె జీవితమంతా బాధపడాల్సి వచ్చేదని ,సత్యం తెలియజేయటం వలన అత్యంత గౌరవనీయుడు అయ్యాడని మెచ్చుకొన్నది . బారిస్టర్ పాసై వకీలుగా ఉన్నా సత్యాన్ని విడవలేదు .ఏ వృత్తిలో ఉన్నా సత్య ధర్మాలు ఆచరిస్తే సాఫల్యత అధికం అని నిరూపించిన మహానుభావుడు బాపు .‘’  సత్య శోధన తప్ప నాకు దేనిపైనా ఆసక్తిలేదు .ప్రపంచం లో సత్యం తప్ప వేరేదీ లేదనే నమ్మకం నాకు రోజు రోజుకూ పెరుగుతోంది .సత్య సాధన పరికరాలు యెంత కఠినమైనవో,అంత సరళమైనవికూడా .సత్య శోధకుడు అందరూ తేలికగా తీసుకొనే ధూళి కణాన్నికూడా సూక్ష్మంగా చూస్తాడు ‘’అన్నాడు గాంధి .సహజంగా అబద్ధం,  అతిశయోక్తులు సత్యాన్ని మరుగు పరుస్తాయి .మితభాషణం ఈ లోపాన్ని తీరుస్తుంది .సత్యాన్ని ఆచరిస్తే న్యాయం దానంతట అదే మనల్ని అనుసరిస్తుందని  గాంధీ నమ్మకం.సత్యం వజ్రం కాగా కఠోరం .కుసుమం లాగా బహు కోమలం కూడా  అన్నాడు .సత్యం, ఉదారత ,సహిష్ణత ఉన్న చోట భేదాలు కూడా లాభాదాయకాలే అవుతాయన్నాడు ,సత్యాన్ని పాటిస్తే క్రోధం ,స్వార్ధం ద్వేషం సహజంగా తగ్గిపోతాయి .  ఇవి తగ్గకపోతే సత్యం గోచరించదు .సత్య నిస్ట ఉన్నవాడు తన భావాలలో లోపముందేమో అని ఆత్మపరిశీలన చేసుకోవాలి ,దానిఫలితాలు అనుభవించాలి .ప్రాయశ్చిత్తానికి సిద్ధపడాలి అన్నాడు .వ్యతిరేకించేవారి అభిప్రాయం తెలుసుకొని ,వారిని అనుకూలంగా మార్చుకోవటం సత్య నిస్టి ధర్మం

. సత్యం అనేమాట సత్ అనేదాతువు నుంచి వచ్చింది .అంటే ఉండటం అని అర్ధం .అంటే  జగత్తులో సత్యం తప్ప ఇంకేదీ లేదు అని భావం .అందుకే భగవంతుడు సత్య స్వరూపుడు .సత్యమే దైవం అని చెప్పాడు గాంధీ .కనుక ఆయన ఫిలాసఫీ సత్యం .సత్యం ఉన్న చోట జ్ఞానం ఉంటుంది .దానినే చిత్ అంటారు జ్ఞానం ఉన్న చోట ఆనందం ఉంటుంది  .సత్యం అనంతమైతే ఆనందమూ అనంతమే .కనుక భగవంతుడు సత్, చిత్ ,ఆనంద మూర్తి . సత్యారాధానమే మన జీవిత ధ్యేయం .కనుక సత్యమే మన ఊపిరి కావాలి .సత్యమార్గం లో నడిస్తే ,ఉదాత్త జీవితం దానంతటికదే అలవడుతుంది .సత్యం లేని ఏ నియమమూ పని చేయదు .సత్యం మనసా వాచా కర్మణా ఉండాలి .ఇది తెలిసినవాడికి అన్నీ తెలుస్తాయి .సత్య శోదనే భక్తీ .అదే పరమాత్మను చేరేసాధనం .సత్యం లో పిరికితనం ఓటమి ఉండనే ఉండవు .ఇలా సత్యమార్గాన్ని అనుసరించి మార్గదర్శు లైనవారు సత్య హరిశ్చంద్రుడు ,ప్రహ్లాదుడు ,శ్రీరాముడు,ఇమాం హుస్సేన్ ,క్రిస్టియన్ మతప్రవక్తలు మొదలైనవారు అన్నాడు మహాత్ముడు .చేసే ప్రతిపనిలో సత్యనిబద్ధత ఉండాలి .అప్పుడు భగవత్ స్వరూపమైన సత్యమే మనం అవుతాం అని గాంధీ పరిపూర్ణ విశ్వాసం . సత్యం సర్వ స్వతంత్రమైనది, సనాతనమైనది అదే పరబ్రహ్మం .అందుకే కరుణశ్రీ ‘’జగత్రితయమ్మునకు సత్య సందేశ మంది౦చు శాంతి దూత ‘’’’సత్యకవచము వొడల  సంతరించి దండు నడిపినట్టి వాడు ‘’’’ఆతడజాతశత్రుడు మహాత్ముడు ,శాంత తపస్వి విశ్వ విఖ్యాతుడు ‘’ అన్నారు ..’’ సత్యానికి ఏ శక్తీ సంకెళ్ళు వేయలేవని నిరూపించిన ఘనతపస్వి’’అన్నాడు మల్లెమాల .  గాంధీజీ 150 వ జయంతికి మనమందరం సత్యవాక్కు పాటించటమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి .

గబ్బిట దుర్గా ప్రసాద్ -24- 9-18 –ఉయ్యూరు -9989066375

2–గాంధీజీ –అహింస

‘’అహింసా పరమో ధర్మః ‘’అని ఆర్యోక్తి .హింస చేయకపోవటం అహింస .ఎదుటి ప్రాణికి ఏరకమైన హాని కలగజేయకపోవటమే అహింస .సాటిమనిషిని మాటలతో, ప్రవర్తనతో, భావాలతో గాయ పరచకుండా ఉండటం .సకల జీవులపైనా ప్రేమ కలిగి ఉండటం .అహింస గొప్ప గుణం .బుద్ధుడు అహింసామూర్తి .ఆధునికకాలం లో గాంధీ మహాత్ముడు కూడా అహింసా మూర్తిగా ప్రసిద్ధి చెందాడు .రాజకీయక్షేత్రం లో  అహింసా సిద్ధాంతాన్ని ప్రయోగించి  విజయం సాధించిన మొట్టమొదటి వ్యక్తి మహాత్ముడు .నియంతలు ఘాతకులు చరిత్రలో తాత్కాలిక విజయంసాది౦చినా చివరకు సత్యం,ప్రేమ మాత్రమే శాశ్వత విజయం పొందుతాయి అని గాంధీజీ అభిప్రాయం .కత్తికి కత్తి,కన్నుకు కన్ను సిద్దా౦త౦  ప్రపంచాన్నే అంధకారం లోకి నెట్టేస్తుంది .యుద్ధం నియంతృత్వానికి దగ్గర దారి .అహింస మాత్రమే స్వచ్చమైన ప్రజాస్వామ్యాన్ని అందిస్తుంది .ప్రేమ తో లభించే అధికారం, శిక్ష, భయాలతో వచ్చే అధికారం కంటే వెయ్యి రెట్లు ప్రభావితమై ,శాశ్వతమౌతుందని గాంధీ విశ్వ సి౦చాడు  .అహింస వ్యక్తి నిష్టమేకాని దేశ నిష్టం కాలేదు అనే అపోహతప్పు .అశోక చక్రవర్తి రాజ్యమంతా అహింసా సిద్ధాంతాన్ని పాటిం చేట్లుచేశాడు .ఆహి౦స తో నడిపే స్వచ్చమైన ప్రజాస్వామ్య౦ ప్రజలకు మేలు చేస్తుంది .

హిట్లర్ ముసోలిని లు నియంతలుగా మారి ప్రజలను హింసించారు .హిట్లర్ 5 మిలియన్ల యూదుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు .అహింస పిరికితనంకాదు.అదొక మహత్తర శక్తి .అది విస్ఫోటనమై అనుకున్నది సాధిస్తుంది అంటాడు గాంధి .ఆహి౦స కు ఆత్మ స్థైర్యం కావాలి అన్నాడుబాపు . ‘’మానవ స్వభావం పై .మహాత్ముడికి ఉన్న అచంచల విశ్వాసమే ఆయన ఆత్మ శక్తి ‘’అన్నాడు డా పట్టాభి . పిరికితనం ,దౌర్జన్యాలలో దౌర్జన్యమే మేలు అన్నాడు .అవతలవాడు ఆపదలో ఉన్నప్పుడు పిరికితనం తో పారిపోకుండా దౌర్జన్యం తో ఎదిరించికాపాడాలి .రక్షణకోసం చేసే దౌర్జన్యం హింస కాదు పైగా గౌరవం,కర్తవ్య౦ కూడా  అని తనకొడుకు అడిగిన ప్రశ్నకు గాంధీ సమాధానం చెప్పాడు .సౌజన్యం చాలా ఉత్కృష్టమైంది .శిక్షించటంకంటే క్షమించటం పురుష ధర్మం అన్నాడు .శూరుడికి క్షమ అలంకారం .శిక్షించే శక్తి ఉన్నా,వదిలేయటం  క్షమా గుణం .శారీరక బలం మాత్రమే బలం కాదు .జయి౦పరాని సంకల్పమే బలం అన్నాడు మహాత్ముడు .కేవలం లక్షమంది బ్రిటిష్ వాళ్ళను చూసి 30 కోట్ల భారతీయులు భయపడాల్సిన పని లేదు. అహింస మన ఆయుధం .క్షమ మన బలం అని ఉద్బోధించాడు .అహింస వలననే మనం స్వాతంత్ర్యాన్ని సాధించి ప్రపంచానికి మార్గ దర్శనం చేయాలి అన్నది బాపూ ఉన్నతాశయం .హింస మృగ ధర్మమైతే అహింస ,సౌజన్యం మానవ ధర్మం .

మనపూర్వ  మహర్షులు ప్రజ్ఞావంతులు ,మహా యుద్దవీరులు ,అస్త్ర,శస్త్ర  విద్యా కోవిదులు .ఇవి నిరుపయోగం అని గ్రహించి దుఃఖ పీడిత ప్రపంచానికి మోక్షం సౌజన్యం వలన సిద్ధిస్తుందని బోధించారని గుర్తుచేశాడు బాపూజీ .బ్రిటిష్ దుస్ట పాలన అంతం చేయటానికి అహింసకు మించిన శక్తిలేదు అని నొక్కి చెప్పాడు .సర్వ శక్తివంతుడైన దశ కంఠ రావణుని ,కేవలమానవ మాత్రుడైన శ్రీ రాముడు జయించటం లో శారీరక బలాన్ని, మనో బలం తో  జయించటం అని అంతరార్ధం అని ప్రవచించాడు .

భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ ఆధ్వర్యం లో ఎన్నో నిరసనలు  మరెన్నో పోరాటాలు ,ఇంకెన్నో ఉద్యమాలు ,సత్యాగ్రహాలు జరిగాయి .హింసకు తావు లేకుండా గాంధీ గారి అహింస మంత్ర ప్రభావంతో అన్నీ విజయమైనాయి .ఎప్పుడైనాఎక్కడైనా ఆందోళనకారులు హద్దుమీరి  హింసకు దిగితే మహాత్ముని గుండె చివుక్కుమనేది .వెంటనే నిస్సంకోచంగా ఉద్యమాన్ని ఆపేయించాడు .అది వెనక్కి తగ్గటం కాదు .ఒక విధమైన యుద్ధనీతి . .తాను సత్యం, అహింస అనే పురాతన మార్గాన్నే ఎన్నుకున్నానని ,తాను మహాత్ముడిని కానని ,మానవమాత్రుడిని కనుక పొరపాట్లు చేయటం సహజం .ఎక్కడైనా ,ఎప్పుడైనా తాను రాజీ పడితే అది దేశానికి నష్టదాయకం గా ఉండదని విశ్వ సించ మని కోరిన  మహోన్నత మానవీయ అహింసామూర్తి .అందుకే ‘’నీ ఆహి౦సా మకుట మణికాంతులు –ఈ మహా ప్రపంచ సుఖ శాంతులు .నీ సర్వమానవ సమాన దృష్టి –సత్యా హింసల సమస్టి ‘’అని కీర్తించి ‘’జెండా జాతికి జీవ గర్ర ,సమతా చిహ్నమ్ము ,సర్వస్వము ‘’అనీ ‘’అమ్మ పరాయి పంచ బడి ,అశ్రువు లోడ్చుచు నుండ బిడ్డ చిత్తమ్మదిచూచి యోర్వగలదా’’అనీ ‘’యజ్ఞఫలము స్వరాజ్య సంప్రాప్తి పార్ధ ‘’అని విజయశ్రీలో అన్యాపదేశంగాను కరుణశ్రీ కర్తవ్య౦  బోధించారు.’’అహింసా లతామతల్లిని మహాత్ముడు  అంచి తమ్ముగ పూలు పూయించినాడు’’అన్నది యదార్ధం .

గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-18 –ఉయ్యూరు -9989066375

3-గాంధీజీ –సత్యాగ్రహం

సత్యాగ్రహం అంటే సత్యం కోసం చేసే పోరాటం .సహాయ నిరాకరణ ,ఉపవాసదీక్ష ఆయుధాలు గా చేసే ధర్మ పోరాటం .మహాత్మాగాంధీ 1906 సెప్టెంబర్ 11 న మొదటిసారిగా దీన్ని దక్షిణాఫ్రికా లో ప్రారంభించాడు .భారత స్వాతంత్ర్య ఉద్యమం లో సత్యాగ్రహం ప్రముఖ పాత్ర పోషించింది .గుజరాత్ లో తాము దీనిని’’పాసివ్ రెసిస్టన్స్ ‘’అంటే నిష్క్రియాత్మక నిరోధకత ‘’గా పిలిచేవారమని ,అది పిరికి తనానికి చిహ్నంగా భావించగా   దీనికి మదన్ లాల్ గాంధి ‘’సదాగ్రహం ‘’అని పేరు పెట్టి బహుమతి పొందాడని. గాంధీ దాన్ని కొంచెం మార్చి ‘’సత్యాగ్రహం ‘’అన్నాడని, ఇదే దేశం లో పోరాటానికి పేరుగా నిలిచిపోయిందని గాంధి చెప్పాడు . అమెరికాలో నల్లజాతి వారి  పౌరహక్కుల పోరాటం లో మార్టిన్ లూధర్ కింగ్ గాంధీజీ సత్యాగ్రహాన్నే  ఆయుధంగా ప్రయోగించి విజయం సాధించాడు .సత్య సాధన కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం .తప్పు చేసిన వారిని బలవంతంగా ఆపకుండా ,వారిలో గణనీయమైన మార్పు తీసుకురావటమే దీని ముఖ్య ఉద్దేశ్యం . .ఆగ్రహమంటే కోపం .కాని ఇందులో కోపతాపాలకు తావులేదు .శాంతియుతంగా నిరసన తెలియ జేయటమే జరుగుతుంది .నిరసన ద్వారా కోర్కెల సాధన ముఖ్య సిద్ధాంతం .దీనిలో నిరాహార దీక్ష ,ఆమరణ నిరాహార దీక్ష ఉంటాయి .ఈరెండు పేర్లు చెప్పగానే మనకు గుర్తువచ్చేది గాంధీ మహాత్ముడే .అప్పుడు స్వతంత్రం కోసం సాగించిన మహాత్ముని  సత్యాగ్రహం నేడు అన్ని రంగాలలోనూ తమహక్కులు, కోర్కెలు సాధించటానికి సాధనంగా మారింది .

హత్యాగ్రహం లో భాగమైన నిరాహార దీక్షను రాజకీయ అస్త్రం గా మొదట ప్రయోగించింది  గాంధీయే. ఆమరణ నిరాహార దీక్ష సాధనంగా చేసుకొని శ్రీ పొట్టిశ్రీరాములు  అమరులై ,మనకు ఆంద్ర రాష్ట్ర౦ సాధించి పెట్టారు .ప్రపంచం లో చాలా దేశాలలో సాత్యాగ్రహం విస్తృతంగా ప్రచారం లో ఉంది .కనకనే దీన్ని గుర్తించి ఐక్యరాజ్య సమితి మహాత్ముని జన్మదినం అక్టోబర్ 2 ను ‘’అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం’’గా ప్రకటించింది .గాంధీజీ 72 వ జన్మదినోత్సవం లోకానందంగా జరిగినా ప్రపంచమంతా మహా సంక్షోభం లో మునిగి భారత దేశం ఒక్కటిమాత్రం శాంతి  సుహ్రుద్భావాలను బోధిస్తూ సభ్యతా లోకానికి దూరంగా ఉంది .’’లోకాః సమస్తాః సుఖినో భవంతు ‘’అనేది భారతీయ సిద్ధాంతం .దేశాలన్నీ స్వయం పోషకాలుగా ,స్వయం సంపూర్ణంగా స్వావలంబనగా ఉండాలని భావన   .గాంధీ ‘’ప్రతి బ్రిటిష్ వానికీ ‘’అనే శీర్షికతో లేఖ రాసి ,తాను సత్యాగ్రహాన్ని అసహాయోద్యమగా నిర్వహిస్తున్నానని  ,రెండవ ప్రపంచయుద్ధ౦లొ   బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరిస్తానని తెలిపాడు .

1916 లో  అహ్మదాబాద్ దగ్గర సబర్మతీ నదీ తీరం లో సత్యాగ్రహ ఆశ్రమం నిర్మించబడింది .ఆశ్రమవాసులు బ్రహ్మచర్యం పాటిస్తూ నిదాడంబర జీవితం సాగించారు .ఎవరిపని వారే చేసుకొనేవారు .సత్యాహింసలు  ,అస్పృశ్యతా నివారణ పాటించారు .సామాన్య ప్రజలు వాడే ఉప్పు పై ప్రభుత్వం పన్ను విధించటానికి నిరసనగా 1930 మర్చి 12 న గాంధి ఇక్కడి నుండి  దండి కి కాలినడకన అందరితో కలిసి వెళ్లి ఉప్పు సత్యాగ్రహం చేసి ఉప్పు తయారు చేశారు  .ఇదే బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్ణ స్వరాజ్య ఉద్యమం తర్వాత అతిపెద్ద వ్యతిరేక ఉద్యమం  .ప్రపంచమంతా స్వాగతించింది .తర్వాత దేశమంతా ఉప్పుసత్యాగ్రహాలుఒక ఏడాది పాటు  పెద్ద ఎత్తున జరిగాయి .సరిహద్దు గాంధి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పెషావర్ లో సత్యాగ్రహం చేసి అరెస్టయ్యాడు ..ఆయనఅనుచరులపై  బ్రిటిష్ ప్రభుత్వం కాల్పులు జరపమని ఆదేశించినా’’ రాయల్ గర్వాల్ రైఫిల్స్’’ దళం కాల్పులు జరపటానికి తిరస్కరించింది .ఉప్పు సత్యాగ్రహం తర్వాత విదేశీ వస్త్ర బహిష్కరణ జరిగింది .అప్రజాస్వామిక అరణ్య నియమోల్లంఘన కూడా జరిగింది

అక్టోబర్ 17 బ్రిటన్ తో ఇండియా సమరం మొదలైంది  గాంధీ ఆదేశంతో వినోబాభావే మొదటి సత్యాగ్రహి నెహ్రు రెండవవాడు .ఇద్దరు యుద్ధ వ్యతిరేక ఉపన్యాసం చేసి సత్యాగ్రహం ప్రారంభించి అరెస్ట్ అయ్యారు .పటేల్ ను కారణం లేకుండానే అరెస్ట్  చేశారు  .దేశమంతా సత్యాగ్రహానికి సమాయత్తమైంది .ఉత్సాహం ఉరకలేసింది..శాంతిభద్రతలను కాంగ్రెస్ వాలంటీర్లు బాగా కాపాడారు .సత్యాగ్రహులను నిర్బంధించటం వాక్ స్వాతంత్రం వంటి హక్కులను కాలరాయటమే అన్నాడు గాంధి . .వ్యష్టి సత్యాగ్రహం తర్వాత సమస్టి సత్యాగ్రహం వచ్చి దౌర్జన్యానికి దారి తీస్తుందననుకుని  ఉపావాస దీక్ష అన్నాడు .తర్వాత వ్యక్తి సత్యాగ్రహానికి మొగ్గు చూపాడు .సత్యాగ్రహులను జాగ్రత్త గా ఎంపిక చేయాలని హితవు చెప్పాడు .ప్రభుత్వం అణచి వేసే ప్రయత్నం చేసి దౌర్జన్యం చేసినా ,లోబడకూడదని ఆయన సిద్ధాంతం .సుభాస్ చంద్ర బోస్ కూడా 1941 లో అరెస్ట్ అయ్యాడు .  గాంధీ గారి సత్యాగ్రహం ఇంతమందిని ఇన్ని విధాల ప్రభావితం చేసి జాతీయోద్యమాన్ని తీవ్రతరం చేసింది .’’నీ సత్యాగ్రహ సాధన –శాంతి దేవతా సమారాధన’’ అన్నారు కరుణశ్రీ  .’’గుప్పెడు ఉప్పును పోగేసి ,నిప్పుల ఉప్పెనగా చేసి –దండి యాత్రనే దండ యాత్ర చేసిన అధినేత,జగజ్జేత ‘’అన్నాడు సిరివెన్నెల .’’He was un dying inspiration –being the father of our nation –let us preserve what he gave –be wise and be brave ‘’.సత్యాగ్రహమ్మునే సాధనమ్ముగ జేసి –సామ్రాజ్యవాదుల ‘’ను సాగనంపాడు గాంధీ మహాత్ముడు .

గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-18 –ఉయ్యూరు -9989066375

4- గాంధీజీ –సహాయ నిరాకరణ ఉద్యమం

భారత దేశం లో బ్రిటిష్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే సహాయ నిరాకరణ ఉద్యమం .జలియన్ వాలాబాగ్ సామూహిక హత్యల తర్వాత మహాత్మా  గాంధీజీ దీన్ని ఆహి౦సాత్మకంగా చేబట్టాడు .దీని ముఖ్యోద్దేశం భారత్ లో ఇక బ్రిటిష్ పాలన ఏమాత్రమూ కొనసాగరాదని  .ముందుగా బ్రిటష్ వారి వస్తువులు కొనరాదని, స్థానిక చేతి వృత్తుల వారి వస్తువులుకొని ప్రోత్సహించాలని  ఉద్యమ౦ ప్రారంభమైంది.కల్లు దుకాణాల వద్ద పికెటింగ్ కూడా దీనికి తోడైంది .1920 వేసవి లో దేశ వ్యాప్తంగా లక్షలాది పురుషులు,మొదటిసారిగా స్త్రీలు   స్వచ్చందంగా  ఆహి౦సాత్మకం గా  మహాత్ముని నాయకత్వం లో నడిచారు . ఈ ఉద్యమం ఆయన వ్యూహ రచనకు ,  ప్రభావానికి , నేర్పు, క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచి భారత దేశ దాస్య విముక్తికి,  స్వతంత్రేచ్ఛ కు,  మొత్తం దేశం లోని చైతన్యానికి అద్దం పట్టింది .అమెరికా మేధావి హెన్రి డేవిడ్ థోరో 1846 లో చేబట్టిన సహాయ నిరాకరణ విధానం  ఆయన నిరాడంబర జీవితం గాంధీ ,టాల్ స్టాయ్ ,లపై గొప్ప ప్రభావం ,ప్రేరణ కలిగించాయి .

సహాయ నిరాకరణ ఉద్యమానికి బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత విధానం ,తోడైంది .  ,గాంధీకి తెల్ల ప్రభుత్వం పై ఉన్న నమ్మకం నశించి , పరాయి  శని  విరగడ కావాల్సిందే నని ఇక వారికి సహాయపడటం ఘోర తప్పిదం, పాపం అవుతుందని ప్రకటించాడు .ఖిలాఫత్ ఉద్యమంలో ఉన్న భారతీయ ముస్లిం లుకూడా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సమర్ధించి పాల్గొన్నారు .అందరిదీ ఒకే ఆకాంక్ష .ఏడాది లోపు స్వరాజ్యం సాధించాలని .దీనికి తోడుబ్రిటిష్ వారి రాజ్యాంగ పౌరపాలన విధానంపై గాంధీకి నమ్మకం పోయి ,బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని తీర్మానించాడు .భారత దేశ ఆర్ధిక పరిస్థితి మరీ క్షీణించి పోవటం ,మన డబ్బు అంతా బ్రిటన్ కు  ప్రవహించటం  ,స్వదేశీ వస్తువుల అమ్మకం తగ్గి బ్రిటన్ ఫాక్టరీ వస్తువుల అమ్మకం విపరీతంగా పెరగటం ,బ్రిటిష్ సైన్యంతో కలిసి యుద్ధం చేసి చనిపోయిన  భారతీయ సైన్యం పై ప్రబుత్వనిర్లక్ష్యం కూడా కారణాలయ్యాయి. .

గాంధీజీ గురువు  గోపాలకృష్ణ గోఖలే   స్వాతంత్య్రం కోసం  ఉద్యమించి ,అరెస్ట్ అయి , మాండలే జైలులో ఉన్నాడు   . కాలనీ ఆర్ధిక శక్తిని, బ్రిటిష్ పాలననుఎదిరించి స్వతంత్ర భారత దేశ ఆవిర్భాగానికి ఒత్తిడి ఎక్కువైంది .ఉద్యమ బాధ్యత గాంధీ తీసుకున్నాడు .రౌలట్ చట్ట వ్యతిరేక ఉద్యమం దేశ వ్యాప్తం గా చేయమని బాపూ పిలుపునిచ్చాడు .అన్ని ప్రభుత్వ ఆఫీసులు ,ఫాక్టరీలు మూసెయ్యాలని ,బ్రిటిష్ స్కూళ్ళు కాలేజీలు  నుంచి భారతీయ విద్యార్ధులు,ఉపాధ్యాయులు పోలీస్, మిలిటరీ,  సివిల్  వ్యవస్థలను బహిష్కరించి బయటికి రావాలని లాయర్లు కోర్టులను బహిష్కరించాలని  బ్రిటిష్ వారిచ్చిన బిరుదులు  త్యజించాలని  పిలుపు నిచ్చాడు   .తిలక్ ,బిపిన్ చంద్రపాల్ జిన్నా ,అనిబిసెంట్ మొదలైన ముసలి నాయకులు  దీన్ని వ్యతిరేకించారు .కాని గాంధీపై అపారనమ్మకమున్న యువత అంతా గాంధీకి వెన్ను దన్నుగా నిలిచి ఆయన చెప్పినట్లే చేశారు .కాంగ్రెస్ బాపూను పూర్తిగా సమర్ధించింది .మౌలానా ఆజాద్ షౌకతాలి సోదరులు  అండగా నిలిచారు . గుజరాత్ లోని ఖేడియా లో ప్రజలు పూర్తి  అవగాహన లేరని తెలుసుకోకుండా  సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొనమని  పిలుపునిచ్చినందుకు తన తప్పు తెలుసుకొని దాన్ని ‘’హిమాలయన్ మిస్టేక్ ‘’అని ఒప్పుకున్న గొప్పమనసు బాపూజీ ది.

ఇంతటి మహోద్యమం అపూర్వ ఐక్యత చూసి బ్రిటిష్ ప్రభుత్వం బిత్తర పోయింది .  .1922  ఫిబ్రవరి 5 న ఉత్తరప్రదేశ్ లోని’’ చౌరీ చౌరా’’గ్రామం లో ప్రజలు కల్లు దుకాణం వద్ద పికెటింగ్ చేస్తుండగా,  పోలీసులు వాల౦టీర్ల పై దురుసుగా ప్రవర్తిస్తే ,ప్రజలురెచ్చిపోయి  పోలీస్ స్టేషన్ పై దాడి చేసి 22 మంది పోలీసులు లోపలుండగా స్టేషన్ కు నిప్పుపెట్టారు .విషయం తెలిసిన బాపు, అంతవరకు  అత్యంత క్రమశిక్షణతో,  అహింసాయుతంగా దేశమంతా సాగిన ఉద్యమం ఇలా హింసాత్మకంగా మారటం తో తీవ్రం గా కలత చెంది ,హింస వద్దని ప్రజలకు హితవు పలికి ,మూడు వారాల ఉపవాస దీక్ష చేబట్టి ,సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించాడు .ఉద్యమాన్ని అణచటానికి 1922 మార్చి 18 న గాంధీని అరెస్ట్ చేసి ఆరేళ్ళు జైలు శిక్ష విధించారు ,మిగిలిన నాయకులనూ అరెస్ట్ చేశారు . , ,మోతీలాల్ చిత్తరంజన్ దాస్ మొదలైనవారు స్వరాజ్య పార్టీ పెట్టి గాంధీనాయకత్వాన్ని  పూర్తిగా వ్యతిరేకించారు   .ఎక్కడో చిన్నగ్రామంలో జరిగిన సంఘటనకి గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమం ఆపెయ్యటం మంచిదికాదని జాతీయవాదులు అభిప్రాయ పడ్డారు .

అమరవీరుడు భగత్ సింగ్ ఈ ఉద్యమం లో పాల్గొన్నాడు  దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు చీరాల-పేరాలఉద్యమం దీని ఫలితమే  ‘’సత్య౦బు ,శాంత్య హింసలకు స్వాగత మిచ్చే ఆయన బ్రతుకు మహాప్రయాగ-అతడొక ధర్మ దేవాలయంబు –విచిత్ర విశ్వ విద్యాలయంబు ,హిమాలయంబు ‘’అన్నకరుణశ్రీ మాటలు అక్షర సత్యాలు   . ‘’గాంధి యుగమున బుట్టితి ,గాంధి నడుపు నుద్యమంబుల –నలగితి నోపినంత ‘’అని పొంగిపోయారు తెనుగు లెంక  తుమ్మల .Truth and non- violence   is what he taught –Same were the principles he fought ‘’.మహాత్ముని 150 జయంతికి ఆయన మార్గాన్ని అనుసరించటమే సరైన నివాళి .

గబ్బిట దుర్గా ప్రసాద్-24-9-18 –ఉయ్యూరు -9989066375


Posted in రేడియో లో | Tagged | Leave a comment

  వే”మురి”కి   చెత్త పలుకు 

  వే”మురి”కి   చెత్త పలుకు
ఆంద్ర జ్యోతి ఎడిటర్ ‘ఈ ఆదివారం 7-10-18 తన పేపర్ జ్యోతిలో వే”మురికి”  రాధా కృష్ణ రాసిన ”చెత్త పలుకు”లలో ఆంద్ర ప్రదేశ్ పైనా ముఖ్యమంత్రి చంద్ర బాబు పైనా రాసింది ప్రజల మనోభావాలకు  ముఖ్యమంత్రి గౌరవానికి చాలా అభ్య0తరం గా  ,తెలంగాణా సి ఏం కేసీర్ కు ఆయన గులాబీ పార్టీకి ”మహా కంపు పంపుకొట్టుడు ”గా ఉన్నాయి .ఇప్పటిదాకా జ్యోతి పత్రిక  అంటే గొప్ప గౌరవమున్న నాకు ఇది జుగుప్స కలిగించింది ..ఏహ్యభావం కలిగింది రోత  పుట్టించింది  .ఇది రెండో సారి ఇలా దిగజారి ఆయన రాయటం .మళ్ళీ రిపీట్ చేయరని  . ఇకనుంచైనా జాగ్రత్త గా ఉండమని మనవి . ”చెప్పేవి శ్రీరంగనీతులు — గుడిసెలు ”సామెత రుజువు చేసుకోరని భావిస్తున్నాను -దుర్గాప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

  కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -18

  కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -18

‘’సారీ ‘’తో ఆధార౦ వివరాలు –

‘’ కోన సీమ ఆహితాగ్నులు ‘’ గురించి 17 ఎపిసోడ్ లు రాశాక ,ఇప్పటిదాకా సస్పెన్స్ లో ఉంచి , దీనికి ఆధారం విషయం ఇక భరించలేక ‘’అతి రహస్యం బట్ట బయలు చందం ‘’ గా’’ సారీ’’ తో ఇప్పుడు బయట పెడుతున్నాను .  ,హైదరాబాద్ లో ఉంటున్న మా రెండో అబ్బాయి శర్మ నా కోసం ‘’గీర్వాణ౦  -4 ‘’సంస్కృత కవుల ఆచూకీ కోసం చాలా శ్రమపడి ఎన్నో రిఫరెన్స్ గ్రంథాలను షేక రించి మెయిల్ లో పెట్టి పంపిస్తూ ,నా బాధ్యత తానే ఎక్కువగా తీసుకొంటూ ,నిజంగా ఐ బి ఏం  పని ఒత్తిడి లో క్షణంన్నర తీరిక కూడా లేకుండా ఉన్నా, నేను అడిగింది ,వెతికి, కొత్త కవులను,నేను అడిగిన విషయాలనూ  పంపుతూ ఉంటాడు .అలాంటిది ఆర్నెల్ల క్రితం ఒక రోజు ‘’నాన్నా !గూగుల్ లో ‘’వేదిక్ వాయిసెస్ ‘’అనే పుస్తకం గురించి చదివాను .అందులో కోనసీమ వేద విద్వాంసుల గురించి ఉన్నట్లు’’ సినాప్సిస్ ‘’ చెబుతోంది. మైనేని గారి ద్వారా ట్రై చేస్తే బాగుంటుందేమో ‘’అని మెయిల్ రాశాడు .’’ఉచిత సలహా’’ బాగానే ఉంది .నేను ఆగుతానా ,వెంటనే గోపాలకృష్ణ గారికి మా వాడిచ్చిన వివరాలతో మెయిల్ రాశాను .ఆయన నా దగ్గర్నుంచి మెయిల్ వస్తే ,అసలు ఆగరు కదా !వెంటనే గూగుల్ లో వెతికి అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసి నాకు పంపించే ఏర్పాటు నిమిషాలమీద చేసేశారు .’’ఈ నాటి ఈ బంధ మేనాటిదో ‘’అని పించారు .పుస్తకం నాకు 12-2-18 బహు జాగ్రత్తగా అందింది .అదే 24 సెంటిమీటర్ల పొడవు ,15 సెంటి మీటర్ల వెడల్పు ,3 సెంటి మీటర్ల మందం ఉన్న సుమారు 3 వేల రూపాయల 260పేజీల అరుదైన బృహత్ గ్రంథం ‘’Vedic Voices ‘’.-Intimate Narratives of a living ‘’ANDHRA TRADITION ‘’ దీన్ని రాసినవారు  అమెరికన్ రచయిత’’DAAVID .M. KNIPE .’’డేవిడ్ ఏం ,నైప్-ప్రోఫెసర్ ఎమిరిటస్ సౌత్ ఏషియన్ స్టడీస్ ఎట్ ది యూనివర్సిటి ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ యు .ఎస్.ఏ .ఈయన మరో రచన ‘’హిందూ ఇజం –ఎక్ష్పెరిమెన్ట్స్ ఇన్ ది సేక్రేడ్ ‘’

   పుస్తకం చేతిలోకి వచ్చిన క్షణాన్నే మైనేనిగారికి కృతజ్ఞతలు, మా శర్మకు అభినందనలు  తెలియ జేసి ,పుస్తకం లో దూరి పోయాను .ఒక సరికొత్త పాత లోకం లో అడుగు పెట్టిన గొప్ప  అనుభూతి కలిగింది .ఆపు లేకుండా 10 రోజుల్లో చదివేశాను .చాలా ప్రణాళికా బద్ధంగా .అత్యంత నిర్దుష్టంగా కోనసీమ ఆహితాగ్నుల గురించి రచించినపుస్తకం ఇది .రచయిత కున్న అవగాహన ,చెప్పాలన్న తపన ,వారందరి ఇళ్ళకు వెళ్లి వివరాలు సేకరించిన విధానం వారి అనుమతి తో తీసిన ఫోటోలు ,వారి  కుటుంబ వంశాల నేపధ్యాల వివరణ ,వారి తరువాత తరం వారి విశేషాలు అతనిభాషలో Extended Famiies ‘’అన్నీ సవివరంగా అతి తేలిక ఇంగ్లీష్ పదజాలం తో హృదయానికి హత్తుకొనేట్లు రాశాడు .ఇంతటి ఆంకిత భావానికి ఏమిచ్చి తెలుగు జాతి రచయిత ఋణం తీర్చుకో గలదు ?

  వీరి గురించి మనవాళ్ళెవరూ ఇంత అధ్యయనం చేసి రాసిన దాఖ లాలు లేవు అనిపించింది నా చిన్నబుర్రకు .శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తమ ‘’అనుభవాలు జ్ఞాపకాలు ‘’లో కొందరి వేద విద్వత్తు, వారి అమోఘ సామర్ధ్యాల గురించి కొంత అక్కడక్కడ తెలియ జేసి ఉండవచ్చు .వీరేశలింగం గారు వాళ్ల ఛాందసాన్ని హాస్య అపహాస్య వ్యంగ్యాలకెక్కడైనా పేర్లు లేకుండా ప్రస్తావించి ఉండచ్చు .కాని ఇంత సమగ్రంగా ఏరచయితా రాసినట్లు  లేదనే నేను అనుకొంటున్నాను .ఎవరైనా వారి కుటుంబసభ్యులు ఒకరిద్దరి గురించి రాసి ఉండవచ్చు .కాని ఇంతటి సమగ్ర రచన లేదనే నా విశ్వాసం .

  అన్నీ వేద వ్యవహార  ,కర్మ కాండల పదజాలమే .పడికట్టు పదాలే .వాటిని ఆంగ్లం లో అతి తేలికభాషలో రాయటం ‘’అంత వీజీ కాదు ‘ . ’అసాధ్యాన్ని సుసాధ్యం చేసిచూపాడు రచయిత’’ ’నైప్’’ నిజంగా కత్తి’’నైఫ్ ‘’అని పించాడు హాట్సాఫ్ .1980 అక్టోబర్ 3 న అతడు కోనసీమ వేదపండితులతో అతని భాష లో ‘’ఎన్ కౌంటర్ ‘’ప్రారంభించాడు .కొందరు వేదపండితులు అతన్ని సంశయించారు ,కొందరు విషయాలు చెప్పటానికి స౦దేహించారు ,అతన్ని వారు ‘’దొర ‘’అని దూరం పెట్టారు ఈ రచయిత తన యువ కొలీగ్ ప్రొఫెసర్ ,ఆంద్ర విశ్వ విద్యాలయఫిలాసఫీ ఎమిరిటస్ చైర్  శ్రీ ఏం వి .కృష్ణయ్య తో కలిసి ఎక్కే ,గుమ్మం దిగే గుమ్మం గా శ్రమించాడు  అగ్రహారాలు వాటి నేపధ్యంతెలుసుకొని   ,రాజమండ్రి ,అన్నవరం ,సింహాచలం ,విజయవాడ లు తిరిగాడు  .’’రామ ,కృష్ణ ‘’వచ్చారని పించుకున్నారుఇద్దరూ  .3 ,700 ఏళ్ళ భారతీయ  సంప్రదాయాన్ని అర్ధం చేసుకొన్నారు .కైమోడ్పు ఘటించాడు .ప్రముఖ ఆంగ్ల కవి టిఎస్ ఇలియట్ కవితాపంక్తి ‘’Ido not know much about gods,but I think that the river is a  strong brown god ‘’రచయితకు ప్రేరరణ .

  డెల్టా ,ఏర్పాటు ,రాజవంశాలు ,స్థానిక రాజులు ,కాకతీయ సామ్రాజ్యం ,ఇస్లాం మతం దక్కన్ లో కాలుపెట్టటం, విజయనగర సామ్రాజ్యం,యూరోపియన్ లరాక, డెల్టాలోఆదిపత్యం ,ఆంద్ర రాష్ట్రం ఏర్పాటు ,అగ్రహారాలు ,వేదపండితులపరిభాష ,నాలుగు ఆశ్రమాలు , ధర్మాలు  ,జీవన భ్రుతి అవకాశాలు ,ఆహితగ్ని నిర్వచనం వారి పరిభాష ,ఆగ్ని హోత్రం తో అనుబంధం,ఆహితాగ్నుల , వేదపండితుల’’ స్వర హేల ‘’మొదలైన  శీర్షికలతో రచయిత ఈ  గ్రంథాన్ని’’సుసంపన్నం ‘’చేశాడు .

  ఇది చదివి మీకు ఆవిషయాలు అందించాలని మధనపడి ,శీర్షికకోసం కొన్ని రోజులు ఆలోచించి ఇప్పుడున్న శీర్షికతో 25-7-18  రాయటం  ప్రారంభించాను  .అయ్యా ఇదీ నేపధ్యం అని విన్నవిస్తున్నాను .రచయితా నైప్ కు ,పుస్తకం కొనిపంపిన మైనేని గారికి  వ్యాసాలు  చదివి ఆదరించిన మీకు ధన్యవాదాలు

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-7-10-18 –ఉయ్యూరు

1-

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -17

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -17

1—పద్మ భూషణ్ శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు -3( చివరి భాగం )

బాబళ్ళ శాస్త్రి గారి లాగానే, లంకా శాస్త్రి గారు కూడా వేద విక్రయాన్ని సమర్ధించలేదు .భర్త మరణానతరం అనసూయ గారిని తమ దంపతులు అగ్ని స్టోమం చేసిన తర్వాత ఇంకా ఏవైనా శ్రౌతకార్యక్రమాలు చేశారా అని అడిగితే ‘’మా స్వంతిల్లు, వనరులూ ఉన్నా, సరైన ఋత్విజులు లేరు .అన్నీ తెలిసి చేయి౦చగా లిగినవారు నేదునూరు, శ్రీరామ పురాగ్రహారాలలో మా  చిన్న తమ్ముడి తో సహా మాత్రమే కొద్ది మంది మాత్రమే  ఉండేవారు .దువ్వూరి యాజులు మొదలైన పరిణతి చెందినవారు మా వారి దగ్గరే నేర్చుకోవటానికి వచ్చేవారు .దేనికైనా డబ్బు కావాలి కదా . మాకు  తగినంతగా డబ్బు  ఉండేదికాదు .అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది ప్రపంచం .డబ్బు సంపాదించటం ,కూడ బెట్టటమే యావ అయిపొయింది అందరికీ .భారత దేశం లో  డబ్బు  సంస్కృతి పెరిగిపోయింది ..మేము నిత్యం అగ్ని హోత్రం  చేస్తూ దానితోనే  సరిపుచ్చుకొంటూ సంతృప్తిగా గడిపాము ‘’అని చెప్పారు .వేదపండితుడైన శాస్త్రిగారు శ్రౌతంలో ఘనులని పించుకున్నా, వేదపర్య వేక్షకులుగా ,వేద విజ్ఞానాన్నిఅందించే వారుగానే ఉన్నారుకాని ఇంకా క్రతువులు చేసి అదనపు బిరుదులు  అందుకోవాలనే తాపత్రయం అత్యాశ  లేని వారు .నాటక సినీ నటులకు వచ్చినన్ని అవార్డ్ లు రివార్డ్ లు అందుకున్న మహా వేదపండితులు వేదార్ధ సారమతులు శాస్త్రిగారు .

  19 94 మే నెల 7 వ తేదీ న వారికి భారత ప్రభుత్వం ‘’పద్మ భూషణ ‘’  పురస్కారం అందజేసి సత్కరించినదుకు ఆయన భుజాలు ఎగరేసి ‘’ఇదంతా ఒట్టి ఆర్భాటం (ప్రాపగాండా) మాత్రమే ‘’అన్న నిగర్వి శాస్త్రి గారు .

   లంకా శాస్త్రిగారిది  ‘’ తృప్తి చెందని జిజ్ఞాస ‘’ఉన్న వ్యక్తిత్వం ‘’.సోమాన్ని గూర్చి సవివరంగా తెలియ జేస్తూనే ,మధ్యలో అకస్మాత్తుగా కర్మ , దేవుడు ,పుణ్యం ,పాపం ,మనుషుల కర్మలో మానవత్వం లపై సుదీర్ఘంగా చర్చించేవారు .దళితులలో సద్గురువులగురించి,క్రైస్తవం గురించి  అడిగి తెలుసుకొనే వారు  .ఒక్కోసారి ఎదుటితివార్ని ఆశ్చర్యపరుస్తూ ‘’జార్జి రాజు ,విక్టోరియామహా రాణి లు ఎలా ఉన్నారు ‘’? అది అడిగేవారు .అంటే వారి ఉద్దేశ్యం లో 20 వ శతాబ్దం లో ప్రాముఖ్యమైన సంఘటనలు ఏవీ జరగలేదని .విక్టోరియా మహారాణి 19 01 లో,6 వ  జార్జి చక్రవర్తి 19 4 7 వరకు ఇండియాకు కూడా రాజే .1952 లో చనిపోయాడు .

  1991 లో శాస్త్రిగారి కాళ్ళకు నీరు పట్టి అగ్నిహోత్రం లో మంత్రాలు మాత్రమే చదివి ,సరి పుచ్చుకోనేవారు .లేచి నిలబడి క్రియ చేయగలిగే వారు కాదు .దీనిపై జోకులు వేస్తూ ‘’మేము ముగ్గురం ఆహితాగ్నులం .బాబళ్ళ వారికి చెవిలేదు అంటే చెవుడు .యాజులు గారికి కళ్ళు లేవు .అంటే చూడలేరు .నాకు కాళ్ళు లేవు ‘’.కొడుకును  వెంట తీసుకొని విమానం ఎక్కి రాష్ట్రపతి పురస్కారం స్వీకరించటానికి ఢిల్లీ వెళ్ళిన’’ ఏకైక కోన సీమ ఆహితాగ్ని’’పద్మభూషణ్ శ్రీ లంకా వెంకట రామ శాస్త్రి గారు ఒక్కరే .

  తన 72 వ ఏట తనకు మరణం సంభ విస్తుందని శాస్త్రిగారికి రెండు దృష్టాంతాలు కనిపించాయి .ఒకటి ఆయన జాతక చక్రంలో రాహు వీక్షణం తో  మృత్యుచక్ర సూచన .రెండు తమ తండ్రిగారు కూడా 72 వ ఏట రాహు ప్రభావం తో  1947 లో మరణించటం  .అయితే శాస్త్రిగారు తీవ్రంగా రాహు జపం చేసి మరణం నుంచి తప్పించుకొన్నారు .

    కాని ఆరోగ్యం ఇదివరకు లాగా బాగా  లేదు .రెండేళ్ళ తరవాత 36 ఏళ్ళ సుదీర్ఘ అగ్ని హోత్రానికి స్వస్తి పలికారు .దీనిని ‘’జిర్నాదు ‘’అంటారని శాస్త్రి గారే చెప్పారు .వృద్ధాప్య కాలం లో ఇతర వేద పండితులలాగా శాస్త్రిగారికి కూడా అన్నం అరిగేదికాదు  తైత్తిరీయ ఉపనిషత్ లోని ‘’ఆహమన్నమహమన్నం ‘’మంత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకోనేవారు .అయినా తగినంత జీర్ణం ఉండేదికాదు .ఆహితాగ్ని దంపతులు తగినంత శారీరక బలం లేనప్పుడు ఏమి చేయాలో ఇతర ఉపాయాలను ఆయన వెతికి  ఆయా మంత్రాలను మననం చేసేవారు .1988 లో మళ్ళీ మృత్యు చక్రం వేయించారు .దీనిప్రకారం ఆయనకు 80 గారంటీ .అంటే అప్పటిదాకా మృత్యువు ఆయన సమీపానికి రాదనీ అర్ధం..కాని ఈ చక్రం లోపభూయిస్ట మై  మృత్యువును మరొక్క  7 ఏళ్ళు వాయిదా వేసింది .శాస్త్రిగారి 80 వ జన్మ దినోత్సవం నాడు’’ సహస్ర చంద్రదర్శనం ‘’ఘనంగా జరుపుకొన్నారు. బొటన వ్రేలి సర్జరీ తో  బాధ పడుతున్నా ముఖం లో చిరునవ్వు తగ్గలేదు , 83 ఏళ్ళ వయసులోకూడా కొత్త స్నాతక విద్యార్ధికి ‘’వ్యాకరణం’’ బోధిస్తూనే ఉన్నారు . ‘’మృత్యువు అనివార్యం .తప్పి౦పరానిది .కాని జీవితేచ్ఛ బలీయమైనది ‘’అన్నారు వేదాంత ధోరణిలో ..చయనులు గారిలాగా అకస్మాత్తుగా కి౦ద పడి చనిపోలేదు.బాబళ్ళ శాస్త్రి,దువ్వూరి యాజులు గార్లలా  అర్ధరాత్రి మరణి౦చ నూలేదు..బాధతో ,జ్ఞాపక శక్తి లేమితో చివరి సంవత్సరాలు గడపాల్సి వచ్చింది .ఆయన సెంటిమెంట్ 72 దాటి ,మరో 15 ఏళ్ళు జీవించి  చివరి రోజుల్లో జ్ఞాపక శక్తి కోల్పోయి, మృత్యువుతో పోరాడి ,   ఆహితాగ్ని , పద్మభూషణ్ , వేదపండితులు బ్రహ్మశ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు 87 వ ఏట 20-6-1999  తెల్లవారుజామున 3 గంటలకు మృత్యుంజయ సన్నిధానం  చేరారు .

  1995లో  తుఫానుకు కామేశ్వరి అగ్రహారం దెబ్బతినే నాటికి  శాస్త్రి అనసూయ దంపతులకు  ఎనిమిది మంది  సంతానం  .వెంటనే ఎదురుగా ఉన్న ఇంటిని నాలుగవ కుమారుడు  వ్యవసాయ సహకార పరపతి సంఘం మాజీ అధ్యక్షుడు ఆక్రమించాడు .తుఫాను శాంతి౦చాక అ ఇంటినికాంక్రీట్ స్లాబ్ వేసి  పునర్నిర్మించాడు .ఇందులోనే శాస్త్రిగారిభార్య అనసూయ గారు చివరి రోజులు గడిపారు .72 ఏళ్ళ వైవాహిక జీవితం గడిపిన పాత ఇంట్లో మళ్ళీ 1999 లో చేరారు ఇందులో శాస్త్రిగారి మాసికాలు మాత్రమె పెట్టేవారు .సంవత్సరీకాలు జరిగాక మళ్ళీ ఆవాస యోగ్యం చేశారు .భర్త శాస్త్రి గారి గూర్చి చాలామదుర జ్ఞాపకాలున్నట్లు ఆమె చెప్పారు

  భర్త గారి లాగానే అనసూయ గారి అంత్య దశకూడా కష్టాలలో గడిచింది .2005 నాటికి  నేలమీద దుప్పటిపై నిద్రించే ఆమె  అతిదులెవరైనా  వస్తే , పలకరిచటానికి  లేవ లేక పోయేవారు  గుర్తించగలిగే వారు కూడా కాదు .బయటి వారి సంగతి సరేసరి ఇంట్లో తనను అతి జాగ్రత్తగా సంరక్షిస్తున్న కొడుకును, కోడల్ని కూడా గుర్తు పట్టగలిగే వారు కాదు .అప్పటి ఆమె పరిస్థితి ‘’లేడీ మేక్ బెత్’ లాగా ఉండేది . ఎప్పుడూ ఏదో ఆలోచనలో ,ఏదో గొణుగు కొంటూ  ,తికమక గా మాట్లాడుతూ ,ఏదేదో ఊహించుకొంటూ ,చేతి ఉంగరాన్నింని తనకు తెలీకుండానే మరో చేతి అన్ని వేళ్ళకు మారుస్తూ గడిపారు .ఒక్కో సారి అకస్మాత్తుగా ‘’అగ్ని హోత్రా అగ్ని హోత్రా ‘’అని పలవరించేవారు  ఇంత నరక యాతన తెలిసీ తెలియని స్థితిలో అనుభవిస్తూ ఆహితాగ్ని శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి సహ ధర్మచారిణి శ్రీమతి అనసూయ గారు  20 05 డిసెంబర్ 31 మధ్యాహ్నం 2-30 గంటలకు 90 వ ఏట తుది శ్వాస విడిచారు  ..ఆమె సహచరులలో అంతకాలం జీవించిన వారు లేరు .ఇవీ కామేశ్వర పురాగ్రహార ఆహితాగ్ని లంకావారి కుటుంబ విశేషాలు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-10-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -16

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -16

1–శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు -2

శ్రీ వెంకట రామ శాస్త్రి శాస్త్రి గారి భార్య అనసూయగారు ‘’మా అమ్మాయిని ఆదర్శంగా అగ్రహారం లో ఆహి తాగ్ని భార్యగా పెంచాను ‘’.అది బాగా పని చేసింది .మావారు మా ఇద్దరబ్బాయిలకు వేదం నేర్పాలని ప్రయత్నించారు .అది ఫలించలేదు ‘’అన్నారామె .బాబళ్ళ శాస్త్రిగారు చాలా అంకిత భావం తో సోమయాగం చేశారు .ఆయన కుటుంబం లో,ఆయన తరం లోనే  ఆరుగురు ఆహితాగ్నులు ఉండటం అరుదైన విశేషం.అయితే అనారోగ్యపు కొడుకు ,పిల్లలు లేని మనవడు  ఆయనను బాధించాయి .ఇది ఇలా ఉంటే లంకా వారి కుటుంబం లో వేదాధ్యయనం బాగానే కొనసాగి ,ఎనిమిది మంది సంతానం లో ఏడుగురు పుత్రులు ఆయన మధ్య వయస్సులోనే లౌకిక వృత్తిలో రాణించారు .

    ‘’నేను కన్న అద్భుత కల నెరవేర్చుకున్నాను .నా నలుగురు కొడుకులు నాలుగు వేదాలలో దిట్టలు .ముగ్గురు శాస్త్రాల లోతులు తరచారు  కాని దీనివల్ల లభించింది పూజ్యమే ‘’.అని నిర్వేదంగా అన్నారు లంకావారు .’’మా పెద్దబ్బాయిలిద్దరికీ ముందు వేదం నేర్పాను .కాని వాళ్ళు గొణుగుతూ సణుగుతూనే ఉన్నారు .రూపాయలు రాలటం లేదని నెల జీతాలు లేవనీ .అప్పుడు వాళ్ళతో వేదం ,వ్యవసాయం జమిలిగా చేసుకోండి అన్నాను .దీనికి తోడూ బంధువుల ఒత్తిడీ పెరిగింది .వేదం నేర్పి వాళ్ళను ఇంట్లో బందీలుగా ఎందుకు ఉంచుతున్నావని ప్రశ్నించారు .వాళ్ల మానాన వాళ్ళను స్వేచ్చగా వదిలెయ్యి  ఏది కావాలంటే అదే నేర్చుకొంటారు .వాళ్ళు బుద్ధిమంతులేకదా.అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు .దీనిపై నిర్ణయం తీసుకోవటం నాకు కష్ట మైన విషయం .బాగా ఆలోచించి నిశ్చయానికి వచ్చాను .పెద్దాడిని సంప్రదాయ పధ్ధతి ఉన్న బ్రాహ్మణ కుటుంబం వారింట్లో ఉండటానికి కాకినాడ కు పంపాను .మా అమ్మగారు వాడికి   వంట చేసిపెట్టేది . వాడు అక్కడ హైస్కూల్ చదువు పూర్తీ చేసి ,హైదరాబాద్ వెళ్లి డిగ్రీ అందుకొన్నాడు .  కొడుకులకంటే మనవళ్ళు సంప్రదాయానికి ఇంకా దూరమయ్యారు.అయితే కొడుకులు ,మనవళ్ళు ఇక్కడికే వచ్చి ఉపనయనాలు చేసుకొని సంధ్యావందనం నేర్చుకొన్నారు .సంప్రదాయం వదిలినా వారి వారి వృత్తులలో వాళ్ళు బాగా రాణించారు అదే మాకు సంతోషం సంతృప్తి .స్వయంగా ఎదిగి స్వంతకాళ్ళపై నిలిచి వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారు’’  ’’అని తమ కుటుంబ విషయాలన్నీ తెలిపారు..శాస్త్రిగారి  చివరి అబ్బాయి శ్రీ లంకా భద్రాద్రి శ్రీరాం అదేనండీ -ఎల్. బి .శ్రీరాం మంచి రచయిత,నాటకనటుడు సినిమాలో ప్రముఖ హాస్యనటుడు.

  శ్రీ నేదునూరి శ్రీరామమూర్తిగారు ఉదార హృదయంతో కొత్త అగ్రహారం లో ఇంటినీ ,అర ఎకరం పొలాన్నీ 1960 మార్చి 4 న ఏర్పాటు చేశారు .అదే కామేశ్వరీ అగ్రహారం శ్రీరామమూర్తిగారి మాతృమూర్తి పేరిట ఏర్పాటు చేశారు ..నేదునూరుకు చాలాదగ్గరలోనే ఉంది.ఈ ప్రశాంత నూతన అగ్రహారం లోవీరుకాక మరో నాలుగు బ్రాహ్మణ కుటుంబాలున్నాయి .కొబ్బరి ,మామిడి తోటలమధ్య, పచ్చటి పంటపొలాలమధ్య ఈ అగ్రహారం ఉంటుంది .’’ఆ నలుగురు ‘’  వేద పండితులుకారు కాని బాబళ్ళ శాస్త్రిగారి ప్రియ శిష్యుడు రమణ చిర్రావూరి కుటుంబీకుడు .తర్వాత శ్రీపాద వారి కుటుంబం ఇక్కడికి చేరింది .వీరికుమారుడు మాణిక్యం వేదం నేర్చాడు ,కనుక లంకా శాస్త్రిగారికి ఈ అగ్రహారం చాలా అనువైనదిగా వేదాధ్యనానికి వీలుగా ఉందని సంతృప్తిపడ్డారు .పిత్రార్జితం తోపాటు తనకున్న 7 ఎకరాలపోలం వ్యవసాయం పర్య వేక్షిస్తూ  వేదం నేర్పించారు   .తాము రచించిన గ్రంధాలను ,వేదం ,శ్రౌతాలపై రాసిన విషయాలను ముద్రించారు .వీలైనప్పుడురాజమండ్రి  వేద సభలకు హాజరౌతూ ,ఈస్ట్ కోస్ట్ రైలు ఎక్కి కంచికి,శృంగేరి లకు  వెళ్లి వేదార్ధ ప్రవచనాలలో పాల్గొనేవారు .

   లంకావారు కామేశ్వరీ అగ్రహారం చేరాక ,నేదునూరు లో బ్రాహ్మణ కుటుంబాలు క్రమగా తగ్గిపోయి రెండు మూడు శాతానికి వచ్చింది .షెడ్యూల్డ్ కాస్ట్ ,బాక్ వర్డ్ క్లాస్ ,సెట్టిబలిజ ,కంసాలి ,దేవాంగ ,కుమ్మరి ,మంగలి ,చాకలి కుటుంబాల సంఖ్య పెరిగి వారి మెజార్టీ గణనీయంగా వృద్ధి చెందింది .వ్యవసాయ పనులకు వీరి ఆసరా తప్పదు .వీరందరికీ శాస్త్రిగారంటే తమ నేదునూరు వాసి అనే గొప్ప అభిమానమే  నేదునూరులో ఏడాదికి రెండు సార్లు వేద సభలు జరుగుతాయి .ఒకటి లంకా శాస్త్రిగారిపేరుమీద ,రెండవది గ్రామం లోని శివాలయం లోని శివుని పేరిట .

  ఆరోగ్యం మరీక్షీణి౦చి  పోయేదాకా శాస్త్రిగారు తాము నిర్వహించిన శ్రౌతకార్యాల గురించి ఎంతో ఆసక్తిగా చెప్పేవారు .తమ నిత్య కర్మకాండల గురించి మాత్రం తక్కువగానే మాట్లాడేవారు .నేదునూరు లో ఒక వడ్రంగి ని కుదుర్చుకొని1957 లో నిర్వర్తించిన  శ్రౌత కార్యాలకు కావలసిన పనిముట్లను స్వయం పర్యవేక్షణలో తనకు కావాల్సిన విధంగా తయారు చేయి౦చు కొన్నారు .అక్కడ ‘’ఆధానం ‘’మాత్రమే చేయాలనుకొన్నారు .అగ్ని స్టోమం చేస్తే ‘’దుర్బ్రా హ్మణుడు’’అనే మచ్చ మాసిపోతు౦దని  అందరికీ చెప్పేవారు .సతీమణి అనసూయగారే ప్రోత్సహించి నిర్వహించేట్లు చేశారు  .’’ఆమె కావాలనికోరింది. జరిగింది ‘’అని తాను నిమిత్తమాత్రుడిని అన్నట్లు చెప్పారు .అల్లుడు మిత్రనారాయణ ‘’సోమ యాగం లేని ఆధానం అర్ధ రహితం ,అసంపూర్ణం  ‘’అని మామగారికి నచ్చ చెప్పాడు . మూడేళ్ళ విరామం తర్వాత శాస్త్రిగారు మళ్ళీ వడ్రంగిని పట్టుకొని, అగ్ని స్టోమానికి కావలసిన పరికరాలన్నీ దగ్గరుండి తయారు చేయి౦చుకొని సర్వ సమర్ధమై 1960 లో అగ్ని స్టోమం కామేశ్వరీ అగ్రహారం లో పోలాలమధ్య ఘనంగా నిర్వహించి అందరికి ఆనందం సంతృప్తి కలిగించారు .ఈ సమయం లో శాస్త్రిగారి అల్లుడు  మిత్రనారాయణ’’సర్వతో ముఖం ‘’చేయటానికి దూరం వెళ్ళాడు .

   ఒకసారి ఆ ప్రాంతం లో గంటకు 160మైళ్ళ అంటే 257 కిలోమీటర్లవేగం తో  గాలులతో భీకరతుఫాను చుట్టుముట్టి శాస్త్రిగారి ఇల్లు కొడుకు ఇల్లు .చేతికి అంది  వచ్చిన పంట అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి  .ఆయన్ను ఓదార్చటానికి వచ్చినవారితో ‘’ఇలా జరగాల్సి ఉంది .జరిగిపోయింది .ఇబ్బందేమీ లేదు ‘’అన్నస్థిత ప్రజ్ఞులు శాస్త్రి గారు.’’ఆయనకు దేనితోనూ అ౦టీముట్టని అనుబంధమే ‘’అన్నారు దువ్వూరు యాజులుగారు .చివరి రోజుల్లో షుగర్ బాగాపెరిగి ఒక బొటన వ్రేలు తీసెయ్యాల్సి వచ్చి ఆపరేషన్ చేసి తీసేస్తే పలకరించటానికి వచ్చినవారితో ‘’బొటన వ్రేలు తీసేశారా ?నిజ౦గానా? నాకే తెలీలేదు మీకెలా తెలిసింది ?’’అని ప్రశ్నించారు .ఆంద్ర లో  శ్రీ కంచి పరమాచార్యులవారు మహా వైభవంగా చక్రవర్తి భోగంతో పార్టన చేసున్నారు .ఒక రోజు  ఈచిన్న కామేశ్వరీ ఆగ్రహారానికి  కనీసం సంప్రదాయానికి బద్ధంగా పల్లకీలోనైనా  కాకుండా  సామాన్యుని లాగా కారులో  లంకా శాస్త్రి గారింటికి వచ్చి   పరామర్శించారు .ఈ విషయం అక్కడా, అన్ని చోట్ల ఎంతో గోప్పవిషయంగా ప్రచారమై పోయింది .దీనిపై శాస్త్రిగారిని స్పందించమని దువ్వూరు యాజులుగారు ,ఒకరిద్దరు ప్రశ్నించారు

 –దువ్వూరుయాజులు గారు –పరమాచార్యుల వారుఏమన్నారు ?

లంకావారు-ఏ మంటారు ?

యాజులు –స్వాములుఇక్కడికే  ఈ ఇంటికే వచ్చారా ?

లంకా-అవును

ఇంకొకరు –ఏమన్నారాయన  ?

లంకా-ఏమంటారు ?

మూడో ఆయన –పరమాచార్యులవారు మీ ఆరోగ్యం గురించి అడిగారా ?

లంకా-ఆ. .

మూడో ఆయన –సంస్కృతం లో మాట్లాడారా ?

లంకా –లేదు తెలుగు లోనే .

దువ్వూరి –వస్తున్నట్లు వారినుంచి ముందుగానే సందేశం ఏదైనా వచ్చిందా ?

లంకా-లేదు .

 బహుశా కొడుకు ఎల్బి శ్రీరాం కు కూడా తండ్రి వారసత్వమే సంక్రమించి ,ఇలాంటి పొడి మాటలే ఇష్టంగా రాస్తాడు .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-18- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ0దే కాశ్మీర భారతం

డా.ధూళిపాళ రామకృష్ణగారుసంస్కృతం లో  రాసిన ”వ0దే  కాశ్మీర భారతం ”పైనా, వారి గురించి గీర్వాణం -2 లో నేను రాసిన వ్యాసాన్ని అక్టోబర్ ”శ్రీ కళా గౌతమి ”లో ప్రచురించారు -దుర్గాప్రసాద్ 

Posted in రచనలు | Tagged | Leave a comment

విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనేస్సా ఆర్మాండ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్ 

విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనేస్సా ఆర్మాండ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్

పారిస్ లో 8-5-1874 జన్మించిన ఇనేస్సా ఆర్మాండ్ ఫ్రెంచ్ –రష్యన్ కమ్యూనిస్ట్ మహిళ.స్త్రీవాది .బోల్షెవిక్ పార్టీ సభ్యురాలు .ఎక్కువకాలం రష్యాలోనే గడిపింది .తల్లి నతాల్లె వైల్డ్ కమెడియన్ .తండ్రి ధియోడర్ పీచ్ డీ హీర్బాన్ విల్ ఫ్రెంచ్ ఒపేరా గాయకుడు .ఇనేస్సా అయిదేళ్ళ వయసులో త౦డ్రి చనిపోతే మాస్కోలోటీచర్ అయిన అమ్మమ్మ వద్ద పెరిగింది .19 వ ఏట సంపన్నుడైన అలెక్జాండ్రా ఆర్మాండ్ తో వివాహం జరిగింది .నలుగురు సంతానం కలిగారు .భార్యాభర్తలు మాస్కో కు బయట రైతు పిల్లలకోసం ఒక స్కూల్ పెట్టి నడిపారు .నగరం లోని విధి వంచితులకోసం ఏర్పాటైన చారిటబుల్ ట్రస్ట్ లో కూడా చేరి సేవలందించింది.

1902 లో భర్తకు దూరమై ,తన వామభావాలకు దగ్గరగాఉన్న వ్లాడిమిర్ ని పెళ్ళాడింది .వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు .1903 లో చట్ట వ్యతిరేకమైన ‘’రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ’’లో చేరింది.ప్రాపగా౦డా పేపర్లు పంచుతూ1907 జూన్ లో అరెస్ట్ అయి రెండేళ్ళు ఉత్తర రష్యాలోని మేజెం లో ప్రవాస జీవితం అనుభవించింది. 1908 లో అందరికళ్ళు కప్పి తప్పించుకొని రష్యావదిలి పారిస్ చేరింది .అక్కడ వ్లాడిమిర్ లెనిన్ మొదలైన బోల్షెవిక్ లతో పరిచయం ఏర్పడింది .1911 లో కమిటీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ లో సెక్రెటరి అయి ,పశ్చిమ యూరప్ లోని బోల్షెవిక్ లందరి మధ్య సయోధ్య కూర్చే పనిలో నిమగ్నమైంది .నాలుగేళ్ల తర్వాత 1912 జులై లో మళ్ళీ రష్యా చేరింది .చాలా సంక్లిష్ట పరిస్థితులలో ఆమె ప్రేగ్ సమావేశ తీర్మానాన్ని ఆమోదించే బాధ్యత తీసుకున్నది .బోల్షెవిక్ పార్టీ నిర్మాణం ,ప్రచారం ,ప్రావ్డాలో జరిగే పరిణామాలు గమనిస్తూ’’ డ్యూమా’’ కు సభ్యుల ఎన్నిక బాధ్యత చేబట్టింది .రష్యాకు ఆమె రాక వలన ఆమెకు ఇబ్బంది కలుగుతుందని ,అరెస్ట్ కావటం తధ్యమనీ లెనిన్ భావించి ,ఆమె పనిని ఆమె చేయటానికి అడ్డు చెప్పలేదు .అనుకున్నట్లే ఆమెను రెండు నెలల తర్వాత అరెస్ట్ చేసి 1913 మార్చి లో బెయిల్ మీద విడుదల చేశారు .మళ్ళీ చట్ట వ్యతిరేకంగా రష్యావదిలి లెనిన్ తో, నేడేజా కృపావిస్కి తో ఉండటానికి గెలీషియాకు వెళ్ళింది .వెళ్ళిన వెంటనే పార్టీ కార్యక్రమాలలో పూర్తిగా మునిగిపోయింది. లెనిన్ కు ఆమెపై అపారమైన నమ్మకం ఉండేది .ఆమె సామర్ధ్యంపై విశ్వాసముండేది.పార్టీ వింగ్ ఒఖానా కు అర్మడా లెనిన్ కు సరైన ఆసరా ,కుడి భుజంగా ఉంటె బాగుండుననిపించింది .బోల్షెవిక్ లందర్నీ సరైన దారిలోపెట్టటానికి ఆమెకు మించిన సమర్ధులు లేరని అందరూ అంగీకరించారు.లెనిన్ కూడా సాహసం చేయని అత్యంత క్లిష్ట సాహసోపేత మైన కార్యక్రమాలు చేసి తన సమర్ధత చాటుకొన్నది .

యూరప్ లోని సోషలిస్ట్ లు మొదటి ప్రపంచ యుద్ధం లో పాల్గొనటానికి వెనకాడుతున్న విషయం ఆర్మాండ్ కు తెలిసి కలత చెందింది .లెనిన్ తో కలిసి ప్రచార కరపత్రాలపంపిణీ చేస్తూ,మిత్రరాజ్య సైన్యాలను తమ ఆఫీసర్లపై తుపాకులు గురిపెట్టమని, సోషలిస్ట్ విప్లవానికి సహాయ పడమని ప్రోత్సహించింది , 1914 జులై లో బ్రస్సెల్స్ లో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ బ్యూరో సమావేశానికి లెనిన్ ఆర్మాండ్ ను బోల్షెవిక్ ప్రతినిధిగా పంపాడు .అక్కడ ఆమె మహామహులైన కాట్స్కి,వాన్డర్ వీల్డ్ ,హూస్మన్ ,లక్సం బర్గ్ ,ట్రాస్కి,ప్లెఖనోవ్ ,మార్టోవ్ వంటి దిగ్గజాల తో సంప్రదించటానికి ఆయాభాషలలో అసమాన ప్రతిభ ఉన్న ఆమె సమర్ధవంతంగా తన పని ముగించింది . లెనిన్ భావజాలాన్ని అకు౦ఠిత దీక్షను ,పోరాట పటిమను, సాహసాన్ని వాళ్లకు కళ్ళకు కట్టించింది .ఆమె నిర్వహించిన పాత్రను లెనిన్ బహుధా ప్రశంసిస్తూ ఆమెపై తనకున్న నమ్మకాన్ని లేఖలో తెలియ జేశాడు .

1915 మార్చి లో స్విట్జర్ లాండ్ వెళ్లి ,యుద్ధ వ్యతిరేక అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళా సమావేశాన్ని నిర్వహించింది .1917 మార్చి 2 న జార్ చక్రవర్తి రెండవ నిఖలాస్ సింహాసనాన్ని పరిత్యజించి ,ప్రా౦తీయ ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగిస్తే, అది రష్యన్ రిపబ్లిక్ ను ప్రకటించింది .ప్రవాసం లో ఉన్న బోల్షెవిక్ లు రష్యా చేరి పునర్నిర్మిద్దామనుకొంటే తీవ్ర నిరాశ ఎదురైంది .జర్మన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం బోల్షెవిక్ లు రష్యా వస్తే తూర్పుభాగపు యుద్ధం అంతమౌతుందని ఆశించారు .అందుకోసం ఆర్మెండా , లెనిన్ మరో 26 మంది విప్లవ వీరుల కోసం ప్రత్త్యేక రైలును ఏర్పాటు చేసి పెట్రోగ్రాడ్ కు ఆహ్వానించారు .అక్టోబర్ విప్లవం పూర్తి అయి రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ లెనిన్ నాయకత్వం లో అధికారం లోకి వచ్చింది .

అక్టోబర్ విప్లవానంతరం ఆర్మండ్ మాస్కో ఎకనమిక్ కౌన్సిల్ అధ్యక్షురాలైనది .మాస్కో సోవియెట్ కు ఎక్సిక్యూటివ్ మెంబర్ అయింది .అయినా ఆమె సోవియట్ ప్రభుత్వ ధోరణిని విమర్శించి ,ట్రీటీ ఆఫ్ బ్రెస్ట్ –లిటోవ్ స్క్ పై ప్రభుత్వం సంతకం చేయటాన్ని నిరసించింది .పెట్రోగ్రాడ్ కు రాగానే కమ్యూనిస్ట్ పార్టీలో ,ట్రేడ్ యూనియన్ లలో మహిళా సమానత్వ హక్కులకోసం కృషి చేస్తున్న ‘’జేనోడేల్’’సంస్థకు డైరెక్టర్ అయింది.ఈ సంస్థకు శాసన చట్టాలు చేసే హక్కు కూడా ఉండేది .అనేక సంస్కరణలు అమలు చేసి ఆర్మాండ్ ఆడవారికి విడాకులు పొందేహక్కు ,గర్భస్రావ హక్కు , ప్రభుత్వ వ్యవహారలలో భాగం ,మాస్ కాంటీన్ లు, మదర్ సెంటర్ లు ఏర్పరచటానికి విశేష కృషి చేసింది .1918 లో స్వెర్ డ్లోవ్ సహాయం తో ‘’నేషనల్ కాంగ్రెస్ ఫర్ వర్కింగ్ ఉమెన్ ‘’సభ ఏర్పాటు చేసి లెనిన్ తో ముఖ్య ప్రసంగం చేయించింది.’’రెడ్ ఆర్మీ’’ లో స్త్రీలు చేరటానికి గొప్ప అవకాశాలు కల్పించింది . 1920 లో జరిగిన’’ మొదటి అంతర్జాతీయ కమ్యూనిస్ట్ మహిళా సమావేశం ‘’కు ఆర్మాండ్ అధ్యక్షత వహించి మహిళా విచక్షత ఇకపై చెల్లదని ,పురుషులతో సమాన హక్కు బాధ్యతా,పదవులు మహిళలకు దక్కాలని అద్భుత ప్రసంగం చేసింది .లెనిన్, ఇనేస్సా అర్మాండ్ ల మధ్య ప్రణయం, ఒకరిపై మరొకరికి గొప్ప ఆరాధనాభావం ఉండేవి .

ఇప్పటికే అనేక బాధ్యతలు కర్తవ్యాలతో అలసిపోయిందని భావించి లెనిన్ ఆమెను కొద్దికాలం విశ్రాంతికోసం ‘’కకాకస్ ‘’వెళ్ళమని హితవు చెప్పాడు .అక్కడ అంటు వ్యాధులు ప్రబలంగా ఉన్న సంగతి లెనిన్ కు తెలియదు .అక్కడకు చేరిన ఆమెకు, అనుచరులకు అంటు వ్యాధి కలరా సోకటం చేత వారికి సెప్టెంబర్ ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు .ఆమె సెప్టెంబర్ 21 న ‘’నాల్చిక్ ఎక్సి క్యూటివ్ కమిటీ ‘’నికలిసి తమకు ఆశ్రయం కలిగించమని కోరటానికి సాహసించింది .కాని దురదృష్ట వశాత్తు అర్మాండ్ సెప్టెంబర్ 24 ఉదయమే 46 ఏళ్ళ వయసులోనే మరణించింది .ఆమెను మాస్కో లోని క్రెమ్లిన్ వాల్ నేక్రోపోలిస్ లో ప్రభుత్వ లాంచనాలతో ,అంతకు పూర్వం ఏ మహిళకూ జరగని అరుదైన ఘనమైన గౌరవంతో ఖననం చేశారు .వేలాది మంది అంతర్జాతీయ గీతాలాపన చేస్తూండగా ఈ కార్యక్రమం నిర్వహించారు . రెడ్ స్క్వేర్ లోనూ ఖననం చేసి గౌరవించారు .రెడ్ స్క్వేర్ లో ఖననం చేయబడిన మొట్టమొదటి మహిళ ఆర్మాండ్ .

ఇన్ని విశిష్ట సేవలు రష్యన్ జాతికీ మహిళలకూ చేసిన ఆర్మ౦డ్ ను రష్యా ప్రజలు 1930 కే మర్చిపోయారు .1930 లోనే ఆమె అధ్యక్షత వహించిన ‘’జేనోటేడిల్’’ సంస్థను రద్దు చేశారు .లెనిన్ ఇన్ పారిస్(1981 ) సినిమాలో ఆమె పాత్రను క్లాడ్ జేడ్ పోషించింది .లెనిన్ ది ట్రెయిన్ ,ఆల్ మై లెనిన్స్ సినిమాలలో కూడా ఆమె మనకు కనిపిస్తుంది .లెనిన్స్ రష్యన్ రిటర్న్స్, సెవెన్ డేస్ టు పెట్రోగ్రాడ్ అనే ఫిక్షన్ ల లో ఆర్మాండ్ హీరోయిన్ .

ఇలా రష్యా విప్లవ వీరవనిత ఇనేస్సా ఆర్మాండ్ రష్యాలోనే విస్మృత నాయకురాలవటానికి అక్కడి అనేక రాజకీయ మార్పులే ముఖ్య కారణం అనిపిస్తుంది .

image.png

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 314-గురు వంశ కావ్య నిధి కర్త –శిరిశినగల్ కృష్ణమాచార్యులు (1905-1992)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

314-గురు వంశ కావ్య నిధి కర్త –శిరిశినగల్ కృష్ణమాచార్యులు (1905-1992)

శిరశినగల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లాకుచెందిన కవి. వీరికి అభినవ కాళిదాసు అని బిరుదు కలదు.నైజాం రాష్ట్ర ఆద్య శతావధాని గా ప్రసిద్ధిని పొందారు[1]. కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు[2]. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు.

1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు.

రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని:

1. కళాశాల అభ్యుదయం

2. రామానుజ చరితం

3. చిత్ర ప్రబంధం

4. రత్నమాల (ఖండ కావ్యం)

5. మనస్సందేశ కావ్యము

6. సంపత్కుమార సంభవ కావ్యము

7. గాంధీతాత నీతిశతకము

8. గీతాచార్య మతప్రభావ శతకము

9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము

10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము

11. వేణుగోపాల స్వామి సుప్రభాతము

12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము

13. పద్మావతీ పరిణయము (హరికథ)

14. రుక్మిణీ కళ్యాణము (హరికథ)

15. ముకుందమాల

16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు

17. విశిష్టాద్వైతమత సంగ్రహము

18. వేదార్థ సంగ్రహము (అనువాదం)

19. గురువంశ కావ్యనిధి

వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు.

సశేషం

గబ్బిట దుర్గాప్రసాద్-4-10-18 –ఉయ్యూరు

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

315 –స్నేహ బంధం సంస్కృత నాటిక కర్త – ఓగేటి అచ్యుతరామశాస్త్రి(19 32

జననం 1932 జనవరి 2

వృత్తి రచయిత, కవి, వక్త, పరిశోధకుడు

ఓగేటి అచ్యుతరామశాస్త్రి పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు మరియు గ్రంథకర్త. ఇతడు 1932, జనవరి 2న జన్మించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలోను, హైదరాబాదు విమోచన ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం చేశాడు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, హిందీ భాషలలో ఇతడికి విస్తృతమైన పరిచయం ఉంది. 1970లో సంస్కృత థియేటర్ అనే సంస్కృత నాటక ప్రయోగ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇతడు నాటక ప్రయోక్త, నటుడు, దర్శకుడు, గాయకుడు కూడా. రంగస్థలం మీద, ఆకాశవాణిలో ప్రసారమైన అనేక నాటకాలలో ఇతడు నాయక, ఉపనాయక పాత్రలను పోషించాడు. 1974లో ఇతడు సంస్కృత భారతీ అనే సంస్కృత పత్రికను స్థాపించి సంపాదకునిగా వ్యవహరించాడు. ఇది హైదరాబాదు నుండి వెలువడిన తొలి సంస్కృత పత్రిక. 1978లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రప్రభుత్వ పురస్కారం స్వీకరించాడు.

రచనలు

శంకరాచార్య (1958) – పద్యకృతి

బంధాబైరాగి (1959) – చారిత్రక నాటకం

సంస్కృత నాటక ప్రయోగరంగము (1975) – పరిశోధన గ్రంథము

స్నేహబంధనమ్‌ (1978) – సంస్కృతంలో వ్రాయబడిన సాంఘిక నాటకం

హిమకిరీటిని (1981) – కవితాసంకలనం

స్వామి వివేకానంద కవితా వైభవం (1983) – సాహిత్య విమర్శ

భారతీయ చరిత్ర సత్యాన్వేషణ (1983)

హైదరాబాదు నగర తెలుగు భాషా సాహిత్య వికాసచరిత్ర[1] (1985)

ఓగేటి వ్యాసపీఠి[2] (1986)

హైదరాబాదు నగర బిర్లామందిర వేంకటేశ్వర శతకము[3] (1987)

ఎఱ్ఱన అరణ్యపర్వశేషము[4] – పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథము

అచ్యుతగీత – సంస్కృత గేయ సంపుటి

Lady of the Lake – ఆంగ్ల భాషలో తెలుగు జానపద కథల సంపుటి

హరిహరనాథ ద్విశతి

హిందూ మతం (1990) – సంస్కృత గద్యగ్రంథం

శ్రీ బాసర సరస్వతీక్షేత్రము – పద్యప్రబంధము

మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహాదూర్ “శాద్” జీవితచరిత్ర (1994) – హిందీ భాషలో

ఆంధ్రకేసరి – పద్యప్రబంధము

వేకువ వెలుగులు (ఆంధ్రప్రదేశ్‌లో ఆర్.ఎస్.ఎస్) [5] (1997) –

బిరుదులు

సంస్కృత నాటకప్రయోగోద్ధారక

నటరాజరాజ

ఆశ్చర్య కుశలవక్త

మహోపాధ్యాయ

రాష్ట్రకవి

భాగ్యనగర భారతి మొదలైనవి.

31 6- అష్టకాల నరసింహరామశర్మ(20 వ శతాబ్దం )

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.[1] జ్యోతిష శాస్త్రంలో నిష్ణాతుడు. అవధాని, సంస్కృతాంధ్ర పండితుడు, కవి, రచయిత. ఇతనికి అవధాన కళాప్రపూర్ణ, సారస్వత శిరోమణి, బ్రాహ్మీ విభూషణ, కవితా సుధాకర, కవికేసరి మొదలైన బిరుదులు ఉన్నాయి. ఇతడు తెలుగు, సంస్కృత భాషలలో అనేక గ్రంథాలను రచించాడు. ఉపాధ్యాయుడిగా ఇతని సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేసింది. ఇతని షష్టిపూర్తి సందర్భంగా 2010లో కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఇతడిని స్వర్ణకంకణంతో సత్కరించాడు. ఇతని అనుయాయులచే కనకాభిషేక, తులాభార సత్కారాలను కూడా పొందాడు.

ఇతడు తన 16వ యేట 1960లో బాసర క్షేత్రాన్ని దర్శించాడు. అప్పుడు 56రోజులపాటు ధ్యానంలో నిమగ్నం కాగా సరస్వతీదేవి కటాక్షించి తన దేవాలయాన్ని నిర్మించవలసినదిగా కోరింది. దేవి ఆదేశానుసారం ఇతడు మెదక్ జిల్లాలో అనంతసాగర్ ప్రాంతంలో తన జీవితమంతా వెచ్చించి సరస్వతీదేవాలయాన్ని నిర్మించాడు[2][3].

ఇతడు తన మొదటి అష్టావధానాన్ని నారాయణఖేడ్‌లో అనుకోకుండా పూర్తి చేశాడు. అప్పటి నుండి కొన్ని వందల అవధానాలను నిర్వహించాడు.

31 7- అలంకార సుధా సింధు కర్త -ఆణివిళ్ళ వేంకట శాస్త్రి(18 వ శతాబ్ద )

ఆణివిళ్ళ వేంకట శాస్త్రి గారు శాస్త్ర పారంగతులు మరియు బాలకాళిదాసు బిరుదాంకితులు.

జీవిత విశేషాలు

ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్తికి (కాకరపర్రు) చెందిన ఆణివిళ్ళ నారాయణ కవి కుమారుడు. ఈయన 18 వ శతాబ్దానికి చెందినవాడు. బాల కాళిదాస బిరుదాంకితుడైన శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి గారు సర్వ శాస్త్ర పారంగతుడు సకల శాస్త్ర వైదుష్యం ఉండటం చేత పెద్దాపురం సంస్థానం మహా ప్రభువులు, దార్లపూడి, విజయనగర మహా రాజుల చేత గొప్ప సన్మానాలు పొందాడు .[

రచనలు

మహేశ్వర మహా కావ్యం

సతీ స్తోత్రం

భాస్కర ప్రశస్తి

రుక్మిణీ పరిణయం కావ్యం రాశాడు.

వేంకట శాస్త్రి గారు గొప్ప అలంకారికులు. అలంకార సుధా సింధు రస ప్రపంచం ఆతని శేముషికి నిదర్శనాలు . చిత్ర చమత్కార మంజరిని పెద్దాపురం రాజు వత్సవాయి తిమ్మ జగపతికి అంకితమిచ్చాడు. చిత్ర కవిత్వముగా సూర్య శతకం రాసాడు. శ్రీ ఆణివిళ్ళ వేంకటశాస్త్రి గారికి వార్ధక్య దశలో పెద్దాపురం సంస్థానం వారు అగ్రహారం ప్రసాదించాలని సంకల్పించగా అప్పటి మంత్రి పాణంగిపల్లి రామచంద్రుడు గారి కుతంత్రము వల్ల నెరవేరలేదట. పాణంగిపల్లి రామచంద్రుడు తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం మండలానికి చెందిన పాణంగిపల్లి, గ్రామమును అగ్రహారంగా పొందే నిమిత్తం అలా చేసాడని లోకోక్తి. నూజివీడు జమీందారులు మేక వెంకట నరసింగ అప్పారావుపై అప్పారాయ యశశ్చంద్రో దయ కావ్యాలు రాసాడు. మెచ్చిన రాజు వల్లూరుమల్లి అగ్రహారాన్ని ప్రదానం చేసాడు. అక్కడ సోమయాగం చేసాడు. “శ్రౌత సూత్రాలు” పై భాష్యం రాసాడు.

31 8– సంస్క్రుతాన్ధ్రకవి – కుంటిమద్ది శేషశర్మ(19 13 )

1913, ఫిబ్రవరి 2 అనంతపురం లో జన్మించి తెలుగు ఉపాధ్యాయ అధ్యాపకులై సంస్కృతాంధ్ర రచనలతో ప్రసిద్ధుడయ్యాడు .తండ్రి కుంటిమద్ది వెంకట రంఘా చార్యులు .తల్లి శేషమ్మ .భార్య జయ లక్ష్మి

శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన కుంటిమద్ది శేషశర్మ అనంతపురం జిల్లా కవులలో ఎన్నదగినవాడువిద్యాభ్యాసం

కుంటిమద్ది శేషశర్మ కుంటిమద్ది ప్రాథమిక పాఠశాలలో ఎలిమెంటరీ విద్యపూర్తి చేశాడు. బళ్ళారిలో ఉన్నత పాఠశాల విద్య చదివాడు. తన తాతగారైన కుంటిమద్ది శ్రీనివాసాచార్యుల వద్ద ఎనిమిదేండ్లు సంస్కృత కావ్యాలంకార వ్యాకరణాలను అధ్యయనం చేశాడు. తరువాత మరో 8 సంవత్సరాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్యశిరోమణి పట్టాను సంపాదించుకున్నాడు. 1938లో తెలుగు విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఇతని కోడలు మృణాలిని అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన సుప్రసిద్ధ కూచిపూడి కళాకారిణి. అమెరికాలో కూచిపూడి నృత్యాన్నినేర్పించే కళామండపం అనే సంస్థను నడుపుతున్నది.

ఉద్యోగం

1943నుండి అనంతపురం జిల్లాలోని హైస్కూళ్లలో ఆంధ్ర ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. 1959 నుండి 1971 వరకు జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశాడు.

31 9-బాష్ప బిందవః-కర్త గరికపాటి మల్లావధాని(18 99 -1985 )

గరికపాటి మల్లావధాని (సెప్టెంబరు 18, 1899 – జనవరి 5, 1985) స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. ఆయన కాంగ్రెస్ నేతగా జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ స్ఫూర్తితో పాల్గొన్నాడు. ఆయన కవిగా పదుల సంఖ్యలో పుస్తకాలను రచించగా, అంతకుమించి పండితునిగా పరిష్కరించిన గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయి.

బాల్యం, విద్యాభ్యాసం

ఈయన కొవ్వూరు లో 1899లో వికారి నామ సంవత్సర భాద్రపద పూర్ణిమ నాడు సీతారామయ్య, వెంకటసుబ్బమ్మలకు మొదటి కుమారునిగా జన్మించాడు[1]. కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో, విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలోనూ, సంస్కృతాంధ్రాలను అభ్యసించాడు. ప్రఖ్య సీతారామశాస్త్రి, పురిఘళ్ళ సుబ్రహ్మణ్యశాస్త్రి, తాతా సుబ్బరాయశాస్త్రుల శుష్రూషలో సంస్కృత భాష సాహిత్యపు మెరుగులు దిద్దుకున్నాడు. కల్లూరి వెంకట్రామశాస్త్రి, వజ్ఝల సీతారామ శాస్త్రుల దగ్గిర తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించాడు. వేలూరి శివరామశాస్త్రి గారి అష్టావధానాల ఆకర్షణలో పడి అవధానాలు చేయడం ప్రారంభించాడు.

ఉద్యోగ ప్రస్థానం

ఈయన కొంతకాలం ఎర్నగూడెం తాలూకాలో తెలికిచెర్ల జమీందారు రాజా కాకర్లపూడి వేంకటరమణయ్య ఆశ్రయములో వున్నాడు. ఆ జమీందారుగారి వినోదార్థము కవితాగోష్ఠులను, అష్టావధానములను కావించి, 8 ఎకరముల భూవసతిని సన్మానముగా గ్రహించినాడు. నర్సాపురములో జరిగిన సభలో “కవిశేఖర” బిరుదమును పొందాడు. 1922 లో ఏలూరులోని గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయములో సంస్కృతాంధ్ర పండితుడిగా చేరినాడు. 1930వ దశకంలో “ఢంకా” అనే పత్రికను నడిపినాడు. 1935 లో మంజువాణీప్రెస్ , రామా అండ్ కో, వెంకటరమణ పవరుప్రెస్ మొదలైన ముద్రణాలయములలో గ్రంథపరిశోధనము గావించాడు. 1947 లో సర్ సి.ఆర్.రెడ్డి కాలేజీలో తెలుగుపండితులుగా చేరి పెక్కుమంది శిష్య ప్రశిష్యులను సంపాదించి విశిష్ట భాషాసేవ ఒనర్చినాడు.

స్వాతంత్ర్య పోరాటం

1921 లో ఆయన చదువు మానుకొని సహాయ నిరాకరణోద్యమంలో చేరి గ్రామ గ్రామానికీ పోయి జాతీయగీతాలు రాసి, పాడి, బ్రిటీషువాడికి వ్యతిరేకంగా ఉపన్యాసాలిచ్చి, జనాన్ని మేలుకొలిపాడు! 1930 లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించాడు.

కోర్టువారు ఆయన్ని, ఏలూరులో బ్రిటీషు జిల్లాజడ్జి గారి ముందు విచారణకి బోనెక్కించారు. అప్పుడు, ఆయన ఆశువుగా చెప్పిన పద్యం.

 

లేదుగదయ్య! మా నుడుల లేశమసత్యము సత్య బద్ధమౌ

వాదమె దోసమయ్యెడు నభాగ్యమిదే మనకబ్బె నింక నౌ

కాదననేల? మీ విహిత కార్యకలాపము దీర్పబూనుడా

మీదట దేవుడే గలడు మిమ్మును మమ్ము పరీక్షసేయగన్‌.

 

“మేము చెప్పేది కాస్త కూడా అబద్ధం కాదు. నిజం చెప్పడం అపరాధం అయ్యింది. ఇది మన దురదృష్టం. ఇక అవును, కాదు అనడం ఎందుకు? మీరు చెయ్యవలసిన పని, (అంటే నన్ను జైలులో పెట్టడం) మీరు చెయ్యండి. ఆపైన మిమ్మలినీ, మమ్మలిని పరీక్షచేసేందుకు దేవుడే ఉన్నాడు,” అని ఆయన చెప్పాడు. జైలు కెళ్ళాడు.

 

రచనలు

గరికపాటి కలంలో దేశభక్తి గళం

భారతాంబికా శతకము

విద్యార్థి శతకము

ఋతుషట్కము

శివనివేదనము

శంకర జననము

పుష్పవివేకము

పండిత రాయలు

ఆదర్శజ్యోతి (శ్రీరాముని గుణగణ ప్రశంస)

అమరుక కావ్యం (ఆంధ్రీకరణము)

దిగంబరి (తత్త్వనాటికలు)[2]

అవధానాలు

ఇతడు సుమారు 20వరకు అష్టావధానాలు చేశాడు. ఇతని అష్టావధానాలలో సమస్య, దత్తాక్షరి, వర్ణన, కావ్యపాఠము, వ్యస్తాక్షరి, పురాణపఠనము, చదరంగం, అప్రస్తుత ప్రసంగం అనే ఎనిమిది అంశాలు ఉండేవి

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 313 –భైరవ తంత్ర కవి –మ౦థాన భైరవుడు (10 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4

313 –భైరవ తంత్ర కవి –మ౦థాన భైరవుడు (10 వ శతాబ్దం )

తెలంగాణాలోని మహబూబ్ నగరం జిల్లా అలంపురం కు చెందినకవి మ౦థాన భైరవుడు10 వ శతాబ్దం వాడు .పాలమూరు జిల్లా సాహిత్య చరిత్ర ఈయనను ‘’తొలి సంస్కృత కవి’’గా పేర్కొన్నది .జైనకవి .తంత్ర గ్రంథాలు ఎక్కువగా రాశాడు .ఈతడు రాసిన’’ భైరవ తంత్ర గ్రంథం’’ సంస్కృత రచన విమర్శకుల,పరిశోధకుల  మెప్పు పొందింది . 22 పత్రాల తాళపత్ర గ్రంథం ఇది .సురవరం ప్రతాప రెడ్డిగారు కూడా గోలకొండ పత్రికలో ఈకవి ప్రస్తావన చేశారు .ప్రముఖ కవి పండితులు పరిశోధకులు మానవల్లి రామకృష్ణయ్యగారు తమ కుమార సంభవ పీఠిక లో ఈ గ్రంథాన్ని ప్రశంసించారు. ఈకవి ‘’ఆనంద కందకం ‘’అనే మరొక సంస్కృత రచనకూడా చేసినట్లు శేషాద్రి రమణకవులు  తెలిపారు .పరిశోధక చతురానన శ్రీ ఆది రాజు వీరభద్రరావు గారు కూడా ఈకవి గురించి తమ రచనలో ప్రస్తావించారు .ఇందరు ప్రాసిద్ధ కవి విమర్శక పరిశోధకుల ప్రశంస పొందిన మంథన కవి ధన్యుడు .ఇప్పుడు ఈ కవి రచనా సౌభాగ్యం చూద్దాం .

  భైరవ తంత్రం లో ప్రారంభ శ్లోకం –‘’శ్రీ హర మహా శాంతం భైరవం భీమ విగ్రహం –నమస్కృత్వా ప్రవక్ష్యామి భూతంత్రం సుపాసనం ‘’.

 చివరి శ్లోకం –‘’ఏతత్తంత్రం  మయా ప్రోక్తం గపనీయం ప్రయత్నతః –ప్రియ శిష్యాయ దాతవ్యం పుత్రాయచ విశేషితః –ఇతి భైరవాగమే భూత తంత్రే సప్త వింశతి పటలః’’

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ప్రతీకార పౌరుష పరాక్రమాలతో భగభగ మండే –భగదత్తుడు

ప్రతీకార పౌరుష పరాక్రమాలతో భగభగ మండే –భగదత్తుడు

ఎవరీ భగదత్తుడు? ఎవరిమీద అతని ప్రతీకారం ?

నరకాసురుని కొడుకు భగదత్తుడు. గొప్ప పరాక్రమ శాలి అర్జునునితో సరి జోడైన యుద్ధ వీరుడు .తండ్రి నరకాసురుడు శ్రీ కృష్ణ సత్యభామ లతో చేసిన యుద్ధం లో చనిపోయాడు. తల్లి భూదేవి రూపమైన సత్యభామ కొడుకు నరకుడు .నరకంటకుడయ్యాడని కొడుకనే దయా దాక్షిణ్యాలు లేకుండా చంపేసింది .నరకుడు చనిపోయిన రోజే మనకు నరక చతుర్దశి. మర్నాడు ఆ స౦బరం చేసుకొనే దీపావళి .ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి .మర్నాడువచ్చే అమావాస్య దీపావళి అమావాస్య .తనతండ్రిని చంపినా దగ్గరుంచి దగ్గరుండి , భగదత్తుడికి కృష్ణుడిపై పీకల్లోతు ద్వేషం ప్రతీకారం ఏర్పడ్డాయి  .

ఏ దేశానికి రాజు ?అతడి బలం బలహీనత

తండ్రి మరణం తర్వాత భగదత్తుడు ప్రాగ్జ్యోతిష పురానికి రాజయ్యాడు .ఇది అస్సాం లోని గౌహతి ప్రాంతం లో ఉండేది .పాండు రాజుకు అత్యంత ఆత్మీయుడు .కాని జరాసంధుడికి భయపడి అతని కనుసన్నలలో మెలిగే వాడు .అర్జునుడు దిగ్విజయ యాత్ర చేసినపుడు భగదత్తుడు పార్దునితో ఎనిమిది రోజులు భీకర యుద్ధం చేసిన పరాక్రమ శాలి .క్రీడిని గెలవలేక ‘’నేను ఇంద్ర సఖుడిని .నువ్వు ఇంద్ర కుమారుడివి .మనలో మనకు పోరాటం ఎందుకు ?’’అని సంధి చేసుకొని ,కోరినంత ధనం ఇచ్చి పంపించేశాడు .దీని వివరాలు తర్వాత తెలుసుకొందాం .

నరక , భగదత్తుల శక్తి సామర్ధ్యాలకు నేపధ్యం ఏమిటి ?

కురు క్షేత్ర యుద్ధం లో భగదత్తుడు దుర్యోధనుడి పక్షాన నిలబడి యుద్ధం చేశాడు . తండ్రి నరకుడు తాను సంపాదించిన వైష్ణవాస్త్రం ను కొడుకు భగదత్తుడికి ఇచ్చి చనిపోయాడు భారత యుద్ధం లో ఈ వైష్ణవాస్త్రాన్ని భగదత్తుడు అర్జునునిపై ప్రయోగించాడు .వైష్ణవాస్త్రాన్ని అడ్డు కొనే శక్తి ఎవరికీ లేదు .ఇక తప్పక శ్రీ కృష్ణుడు దానికి అడ్డు నిలిచాడు .భగదత్తుడు తన అత్యంత వేగం, శక్తివంతమైన ‘’సుప్రతీకం ‘’అనే ఏనుగు నుతండ్రినుండి పొంది దాని   నెక్కి పాండవ  సైన్యాన్ని చీల్చి చెండాడాడు.దేవేంద్రుని ఏనుగు ఐరావతం వంశానికి చెందినదే ఈ సుప్రతీకం .ఏనుగుపై కూర్చుని యుద్ధం చేయటం దిట్ట భగదత్తుడు .అర్జునుడు చివరికి సుప్ర తీకం తో సహా భగదత్తుని తీవ్ర బాణాలతో సంహరించాడు . కృష్ణుడే అడ్డపడక పొతే పార్ధుడి పని అయిపోయినట్లే అని తెలుస్తోంది .ఈవివరాలూ తర్వాత చూద్దాం .

నరక జననం  శక్తి సంపాదన

ఒక సారి చరిత్ర పుటల్ని తిరగేస్తే –హిరణ్యాక్ష, హిరణ్య కసిపులు అన్నదమ్ములు .హిరణ్యాక్షుడు భూమిని చుట్టి సముద్ర గర్భం లో దాచిపెట్టాడు .భూ దేవి మొరవిని శ్రీ మహా విష్ణువు ఆది వరాహ రూపం దాల్చి సముద్ర గర్బం చొచ్చి తన కోరపై భూమిని లేపి పైకి తెచ్చాడు .అప్పుడు వీరిద్దరికీ ఒక కుమారుడు జన్మిస్తాడు .అతడే నరకాసురుడు .అసుర సంధ్యా సమయం లో తామిద్దరూ కలిసినందువలన పుట్టిన వీడికి అసుర అంటే రాక్షస లక్షణాలు వస్తాయని భూదేవికి శ్రీ హరి చెప్పాడు .తన బిడ్డ నరకాసురుడిని ఎప్పటికైనా విష్ణు మూర్తి సంహరించటం ఖాయం అని అర్ధమైంది భూదేవికి .కనుక అనునయంగా హరిని తన బిడ్డకు రక్షణ కల్పించమని వేడు కొంటుంది .సరే అని అభయమిచ్చి ఏనాటికైనా నరకునికి తల్లి చేతిలోనే మరణం సంభవిస్తుందని హెచ్చరించి ,భూదేవికి అతి భయంకరమైన’’ వైష్ణవాస్త్రం ‘’ప్రసాదించి  వెళ్ళిపోయాడు .తన ప్రియ పుత్రుడిపై ప్రేమతో, ఆ అస్త్రాన్ని నరకాసురుడికి ఆమె ఇచ్చేసింది  .

భగదత్తుని చేరిన వైష్ణవాస్త్రం –దాని ప్రభావం

కాలక్రమంలో వైష్ణవాస్త్రాన్ని నరకాసురుడు తనకుమారుడు భగదత్తుడికి ఇచ్చి వేశాడు .ఇది అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రం .దీన్ని ప్రయోగిస్తే దేవేంద్రుడు కూడా తప్పించుకోలేడు.దీన్ని నిర్వీర్యం చేసే సామర్ధ్యం విష్ణువుకు  మాత్రమే ఉంది .సాధారణం గా ఏ అస్త్రాన్ని అయినా శత్రువు వైపుకు గురి చూసి సంధించాలి .కాని వైష్ణవాస్త్రాన్ని మాత్రం శత్రువు వైపు కాకుండా రాకెట్ లాగా పైకి సంధించాలి .అప్పుడది ఆకాశం లోకి అత్యంత వేగం తో చేరి, అక్కడి నుంచి  ఇంకా వేగాన్ని పుంజుకొని రాకెట్ లాగా టార్గెట్ అయిన  శత్రువు వైపుకు దూసుకు వచ్చి సంహరిస్తుంది . .దీన్ని ఆధారం గానే ఇప్పుడు ‘’ఇంటర్ కాంటి నెంటల్ బాలిస్టిక్ మిసైల్ ‘’తయారుచేశారు .రామాయణ ,మహాభారతాలలో ఉపయోగించిన అన్ని అస్త్రాలకంటే  వైష్ణవాస్త్రం సర్వ శక్తి వంతమైంది అని విష్ణుపురాణం పేర్కొన్నది .మహా భారత కాలం లో ఈ అస్త్ర రహస్యం శ్రీ కృష్ణునికి  ,నరకాసురునికి ,భగదత్తునికి,శ్రీకృష్ణ రుక్మిణులకుమారుడు ప్రద్యుమ్నుడు ,పరశురాములకు మాత్రమే తెలుసు .రామాయణకాలం లో శ్రీరాముడికి ,రావణ కుమారుడు ఇంద్ర జిత్తులకు మాత్రమే తెలుసు .

శ్రీ క్రష్ణార్జునులపై   భగదత్తు ని ప్రతీకారేచ్ఛ

కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ధర్మరాజు తమ తండ్రి పాండురాజు నరకం లో ఉన్నాడని తెలిసి దానినుండి విముక్తిచెంది౦చి స్వర్గ లోక ప్రాప్తికోసం నారదమహర్షి సలహాపై  రాజ సూయయాగం చేశాడు .భీమార్జున నకుల సహదేవులు నలు దిక్కులకు వెళ్లి రాజ్యాలను జయించి  దిగ్విజయ యాత్ర పూర్తి  చేస్తారు .అర్జునుడు ప్రాగ్జ్యోతిష పురం పై యుద్ధ యాత్ర చేసి ,దాని ఏలిక భగదత్తుని తో  యుద్ధం చేశాడు .విజయం ఇద్దరి మధ్య దోబూచులాడుతోంది .చివరికి ఇంద్రుడే వచ్చి కలగ జేసుకొని పార్ధ భగదత్తుల మధ్య రాజీ కుదిర్చాడు .భగదత్తుడు కప్పం చెల్లించి సామతరాజుగా ఉండటానికి అంగీకరించాడు .బంధు మిత్రులతో సహా ధర్మ రాజు చేసే రాజసూయ యాగానికి అతిధిగా కూడా వెళ్ళాడు .

భగదత్తుని భగభగ యుద్ధం

ఇంద్రుడికి స్నేహితుడే అయినా భగదత్తుడు తన తండ్రి నరకాసుర వధకు కారణం కృష్ణుడే అని శ్రీ కృష్ణునిపై పగబట్టి ,కురుపాండవ యుద్ధం లో కౌరవ పక్షాన యుద్ధం చేశాడు .మొదట భీష్ముడి నాయకత్వం లో, తర్వాత ద్రోణుని నాయకత్వం లో యుద్ధం చేశాడు .12 వ రోజు యుద్ధం లో భగదత్తుడు భగభగమండే మధ్యాహ్న మార్తాండ పరాక్రమం తో పాండవ సైన్యాన్ని హడలెత్తించాడు .  ఎలాగైనా యుద్ధ ఫలితం తమకు దక్కాల్సిందే , ధర్మ రాజును బంధించి తనకు అప్పగించాల్సిందే నని  ద్రోణుడిపై దుర్యోధనుడు ఒత్తిడి పెంచుతాడు .సరేనని సుశర్మను ఎరగా వేసి, అర్జునుడినిధర్మ రాజు నుంచి దూరంగా తీసుకు వెళ్ళే ఉపాయం చేస్తాడు .ధర్మ రాజు ఒంటరిగా యుద్ధం లో ఉన్నాడు .ఇంతలో పాంచాల వీరుడు సత్ర జిత్తు ధర్మరాజుకు అండగా రధాన్ని మళ్ళించి  ద్రోణుడిని ఎదుర్కొ౦టాడు ,ఒక అర్ధ చంద్రాకార బాణం తో ద్రోణుడు సత్ర జిత్తు తల నరికేస్తాడు .వెంటనే విరాట మహారాజు తమ్ముడు సూర్యదత్తుడు వచ్చి ద్రోణుడిదతో యుద్ధం చేశాడు .ఇతడినికూడా ద్రోణుడు ఖండిస్తాడు .విషయం గ్రహించిన భీముడు కాలయవనుడిలా ద్రోణుడిపై పడ్డాడు .భీముడు ఉంటే, ధర్మరాజును బంధించటం అసాధ్యమని గ్రహించి దుర్యోధనుడు భీముడిపై భగ దత్తుని ఉసిగొల్పుతాడు .అతడు వెయ్యేనుగుల బలమున్న సుప్రతీక ఏనుగుపై వచ్చి భీముడిని ఎదుర్కున్నాడు .దాని ఘీ౦కారానికి భూ, నభో ,అంతరాళాలు గజగజలాడి  ఒణికిపోయాయి.వెయ్యేనుగుల బలపరాక్రమవంతుడైన భీముడు సుప్రతీకంపై విరుచుకు పడ్డాడు .కాని దాని ముందు నిలవ లేక పోయాడు .తొండం తో భీమరధాన్ని పైకెత్తి విసిరేసింది .రధం నుండి కిందపడిన భీముడు చనిపోయాడనిపాండవ సైన్యం భావించి ,హాహాకారాలు చేస్తూ పారిపోసాగారు .

వైష్ణవాస్త్రానికి అడ్డుపడిన శ్రీ కృష్ణుడు

అపాయం అర్ధం చేసుకొన్న శ్రీకృష్ణుడు అర్జునుని తో ధర్మ రాజుకు తాము సాయంగా వెళ్లాలని చెప్పి అటువైపు రధం మళ్ళించాడు .రావటం తోనే అర్జునుడు భగదత్తుని ఏనుగు సుప్రతీకం పై విరుచుకు పడి వాడితో ఘోరసంగ్రామం చేశాడు .ఒకరికొకరు తీసిపోవటం లేదు .భగదత్తుడు కిరీటిపై శక్తి ఆయుధం సంధించాడు .నానా తంటాలుపడి తప్పించుకొన్నాడుకాని కిరీటం నేలపడింది .భగదత్తుడు పార్దునితో శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తూనే ,నిరాయుధుడైన శ్రీ  కృష్ణుని శర సంధానం చేసి తీవ్రంగా గాయపరుస్తూ తన పగతీర్చుకొంటున్నాడు .తన ప్రాణ సఖుడు, బావ సాక్షాత్తు పరమేశ్వరస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మను బాణాలతో వాడు గాయ పరుస్తుంటే కట్టలు తెంచుకున్న కోపం తో భగదత్తుని శర్వ శక్తులను పణంగా  పెట్టి బాణాలతో చీల్చి చెండాడాడు.ఇక లాభం లేదని భగదత్తుడు చావో రేవో తేల్చుకోవాలని  కిరీటిపై  తన తండ్రి ఇచ్చిన వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు .దిక్కులు దద్దరిల్లి ముల్లోకాలు కంపించాయి .ఇరుపక్షాల సైన్యం  ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తున్నారు .అది అర్జునుని వైపు మరణ వేగంతో దూసుకోస్తోంది .అర్జునుడు బె౦బేలెత్తి అసహాయుడై దిక్కు తోచక నిలబడిపోయాడు . అర్జునుని  చావు ఖాయం అని అందరూ అనుకొంటున్నారు .దుర్యోధనుడు ఆనందం తో ఉబ్బి తబ్బబ్బవు తున్నాడు. పాండవ సైన్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ పారిపోతున్నారు .ఒకటి రెండు సెకన్లలో అర్జునుని తాకి చంపేస్తుంది  అనే సమయం లో శ్రీకృష్ణుడు చటుక్కున లేచి వైష్ణవాస్త్రాన్ని తనపైకి తీసుకున్నాడు .వైష్ణవ స్వరూపుడైన శ్రీ కృష్ణుని శరీరం తాకగానే వైష్ణవాస్త్రం పూలమాలగా మారి ఆయన మెడలోపడి అల౦కార మైంది.ఈ అనూహ్య సుందర దృశ్యాన్ని తిలకించిన దేవతలు పులకితులై శ్రీ కృష్ణునిపై పుష్ప వర్షం కురిపించి తమ హర్షం  వ్యక్తం చేసుకొన్నారు .ఇలా విష్ణువు తాను ఇచ్చిన అస్త్రాన్ని తనలోనే కలుపుకొని చరిత్ర సృష్టించాడు .

భగ దత్తుని మరణ రహస్యం

తాను ఊహించని ఈ పరిణామానికి భగదత్తుడు పౌరుషాసూయ ద్వేషాలు ముప్పిరిగొనగా అర్జునునిపై తీవ్రబాణాలు వేశాడు .అర్జునుడు రెట్టించిన పౌరుష పరాక్రమాలతో  భగదత్తుని ఎదుర్కొని, ఒక బాణం తో అతని ఏనుగు సుప్రతీకం శిరస్సుపై ప్రయోగించగా, అది దాని శిరస్సును రెండు ముక్కలు చేసేసింది .సగం బలం క్షీణి౦చిందివాడికి .అయినా శక్తికొద్దీ పోరాడుతూనే ఉన్నాదు .శ్రీ కృష్ణుడు అర్జునుడితో ‘’అర్జునా !వాడిని ఓడించటం ఆషామాషీ కాదు .ముసలివాడైన భగదత్తుని కనుబొమల పై ఉన్న వెంట్రుకలు గడ్డం కనుబొమలపై మెరిసిందా అన్నట్లు చాలా పెద్దాగా ఉంటాయి .నుదుటిపై వాటిని ఒక గుడ్డతో కట్టి జాగ్రత్త పడతాడు .నువ్వు బాణం తో ఆ గుడ్డను చీల్చేస్తే  క్షణకాలం లో ఆ వెంట్రుకలు వాడి కళ్ళను కప్పేస్తాయి .ఆ కొద్ది సమయం లో నువ్వు ఎలాగైనా భగదత్తుని చంపి తీరాలి.లేకపోతే ఇక ఇంతే సంగతులు ‘’అని కిటుకు చెప్పాడు .కిటుకు తెలిసిన క్రీడి  వాడిబాణం తో వాడి నుదుటిమీద గుడ్డను చీల్చేస్తాడు .వెంటనే అతని పొడవైన కను వెంట్రుకలు కళ్ళను కప్పేసి అతినికి ఏమీ కనపడకుండా చేశాయి .ఇదే చాన్స్ అనుకోని  శక్తివంతమైన బాణాలతో పార్ధుడు భగదత్తుని సంహరించి వాడి శకానికి సమాప్తి పలుకుతాడు .శ్రీ కృష్ణుని దయ, ఉపాయాల వలన భగదత్తుని బారినుండి ప్రాణాలతో బయటపడి వాడినే చంపేశాడు  బావను నొప్పించినదానికి ప్రతీకారం తీర్చుకున్నాడు  .ఇంతటి మహాభారత పోరాట యోధుడి గురించి మనకు అతి తక్కువగా మాత్రమే తెలుసు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-10-18 –ఉయ్యూరు

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రెండు కొత్త అస్థిర కణాల ఆవిష్కరణ

రెండు కొత్త అస్థిర కణాల ఆవిష్కరణ

ప్రపంచం లోనే అతిపెద్ద ఆటం స్మాషర్ లార్జ్ హాడ్రాన్ కొల్లైడర్(ఎల్ హెచ్ సి )తాజాగా కనీసం రెండు కొత్త కణాలను కనిపెట్టింది .జెనీవా సమీపం లో 27 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ రింగ్  ఇటీవలే రెండు బేర్యాన్స్  కనుగొని ,మరోకటి కూడా ఉండవచ్చు నని తెలిపింది . ఎల్ హెచ్ సి ని నడిపే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ రిసెర్చ్ అందజేసిన స్టేట్ మెంట్ ప్రకారం బేర్యాన్స్ అనేవి సబ్ అటామిక్ పార్టికల్స్ .ఇవి ఒక్కొక్కటి మూడేసి క్వార్క్ లతో చేయబడి ఉంటాయి .నిజానికి క్వార్క్ లు కూడా అతి సూక్ష్మకణాలే  .అవి వివిధ’’ ఫ్లేవర్స్’’ (రుచులు )తో ఉంటాయి .అప్ ,డౌన్ ,టాప్ .బాటం ,స్ట్రే౦జ్ ,చార్మ్ లతో దర్శనమిస్తాయి .

ఒక్కో రకం బేర్యాన్ అనేక క్వార్క్ ల మిశ్రమం. ఉదాహరణకు ప్రోటాన్ లు కూడా ఒక అప్ క్వార్క్ ఒక డౌన్ క్వార్క్ ఉన్నఉన్న చిన్నముక్కలే అని  ఆ స్టేట్ మెంట్ సారాంశం. ఇప్పుడు కొత్తగా కనుగొనబడిన రెండు బేర్యాన్ లను బాటం బేర్యాన్ లు అన్నారు  .

మొదట  Σb(6097)+,గా పేరు పెట్టబడినది ఒక బాటం క్వార్క్ ,రెండు అప్ క్వార్క్ లతో కూడి ఉంటుంది . Σb(6097)-,  గా పేరుపెట్టబడిన రెండవది ఒక బాటం క్వార్క్ ,రెండు డౌన్ క్వార్క్ లతో చేయబడింది .

LHCb (b ) ఇక్కడ బి అంటే బ్యూటీ ప్రయోగం ,ఈ రెండు కణాలను ప్రోటాన్ లను స్మాష్ చేసి తయారు చేసి ,కణాల క్షయ మార్పు (పార్టికల్ డీకే రేట్)సంఘటన నేపధ్యాన్ని పరిశీలించారు .ఈ ప్రయోగం  ఆ రేట్ కు పైన ‘’బంప్స్ ‘’(తాకిడి ) లసహాయం ఆపేక్షించింది .దీనితో ఇదివరకు తెలియని కణాలున్నట్లు సూచన కనపడింది అని స్టేట్ మెంట్ లో ఉంది .

ఇల్లినాయిస్ లోని ఫెర్మీ లాబ్ లో ఇంతకు  ముందే ప్రయోగాలలో ఇలాంటి కణాలనే గుర్తించారు ,కాని ఆ కణాలు ఈ కొత్తకనాలకంటే ద్రవ్య రాశి తక్కువ ఉన్నట్లు ప్రకటన లో తెలియ జేయబడింది .CERN లో  కనిపెట్టబడిన  కణాలు ప్రోటాన్ల కంటే 6 రెట్లు అధిక ద్రవ్య రాశి ఉన్నట్లు స్టేట్ మెంట్ లో ఉంది .వీటికి  ఉన్న 6097 నంబర్ వాటి మాస్ ను మిలియన్ ఎలెక్ట్రాన్ వోల్ట్ లలో లేక MEV లలో తెలియజేస్తుంది .(ప్రోటాన్ మాస్ (ద్రవ్య రాశి )సుమారు 9 38 MEV).

మూడవ సంభావ్య (పొటెన్షి యల్)కణం గురించి చెప్పాలంటే పరిశోధకులు అది ఉన్నట్లు సూచన ప్రాయంగా మాత్రమేతెలుసుకొన్నారు .ఈ కణానికి Z sub c(4100 అని నామకరణం చేశారు .ఇది అసహజ (వీర్డ్ )మీసాన్ అనే అతి వేగంగా కదిలే అస్థిర కణం అని ,అత్యంత శక్తివంతమైన తాడనాల (కొల్లిసన్)  వలన ఏర్పడి ,రెండు క్వార్క్ లు ,రెండు యాంటి క్వార్క్ లను కలిగి ఉంటుందని ఊహించారు .

CERN కొల్లిజన్స్ ఇలాంటి ప్రత్యేక మీసాన్ ల ఉనికి ని  తెలిపాయి .  ఫిజిసిస్ట్ లు  ఈ’’ కొత్త కణాన్ని ‘’కనుక్కోన్నాం అని చెప్పటానికి తగినంత గా సాక్ష్యాధారాలు లేకపోతున్నాయి .

ఇంతకీ క్వార్క్ గొడవేంట్రా బాబూ అంటున్నారా –క్వార్క్ అనేది పదార్ధం లో ఉండే ఒక రకమైన ప్రాధమిక కణం.క్వార్క్ ల కలయిక వలన సంక్లిష్ట  కణాలు హాడ్రాన్ లు ఏర్పడతాయి.వీటిలో పరమాణువు న్యూక్లియస్ లోని సుస్థిరమైన ప్రోటాన్ లు న్యూట్రాన్ లు ఉంటాయి .

ఆధారం –  Live Science.మేగజైన్ లో ప్రచురింపబడిన స్టాఫ్ రైటర్ యాస్మిన్ సఫల్ కోగ్లు  రచించిన  ‘’Atom Smasher Detects Hints of New Unstable Particle’’వ్యాసం .దీన్ని నిన్న శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు నాకు మెయిల్ చేస్తే ఇప్పుడు తెలుగు వ్యాసాకృతి పొందింది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-18 –ఉయ్యూరు

 


Posted in సైన్స్ | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 312- సంస్కృత కీర్తనలు రాసిన -భద్రాచల రామదాసు (1620-1680)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

312- సంస్కృత కీర్తనలు రాసిన -భద్రాచల రామదాసు (1620-1680)

భద్రాచల రామదాసు (Ramadasu) గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న (Kancherla Gopanna). 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోలింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు[1]. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము – ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది)

  ఉద్యోగమునకై మేనమామల సహాయం

గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషాగారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణా తహసిల్దారు పని లభించింది. గోదావరి తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము.

ఆలయ నిర్మాణం

పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా, స్వతహాగా హరి భక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయనిర్మాణానికి ధనం సేకరించాడు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను.

గోపన్నకు జైలు శిక్ష

కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఖైదులో నున్న రామదాసు గోడపై సీతారామలక్ష్మణాంజనేయులను చిత్రంచుకొని, వారిని కీర్తించుచూ, ఆ కరుణా పయోనిధి శ్రీ రాముని కటాక్షమునకు ఆక్రోశించుచూ కాలము గడిపినాడు. రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి. “నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి”, “పలుకే బంగారమాయెనా”, “అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా” వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన “ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా”, కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది- “నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు? నీబాబిచ్చాడా? నీ మామిచ్చాడా?” – అని వాపోయి, మరలా – “ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు. నా బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు” – అని వేడుకొన్నాడు. అతను సీతమ్మ వారికి చేయించిన చింతాకు పతకము, లక్ష్మణునకు చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానములోని నగలలో ఉన్నాయి.

రామ లక్ష్మణుల తిరిగి చెల్లింపు

అతని కర్మశేషము పరిసమాప్తి కాగానే, రామ లక్ష్మణులు తానీషా గారి వద్దకు వెళ్ళి, ఆరు లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసు విడుదల పత్రము తీసుకొన్నారని ప్రతీతి. ఆప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము ముద్ర, మరొకవైపు రామభక్తుడు హనుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై భూమిని ఇచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుడే మొదలయ్యింది. 2014 వరకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది,ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది[2].

వాగ్గేయకారులలో ఆధ్యుడు

శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన – “ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?” – ఇంకా ప్రహ్లాదవిజయములో “కలియుగమున వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్ల వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్” – అన్నాడు .

ఇంతటి మహా రామ భక్తుడు సంస్కృతం లో కీర్తనలు రాశాడని మనకు తెలియదు .ఇవాళ ఉదయం విజయవాడ ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం లో  స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గానం చేసిన  రామ దాసుగారి సంస్కృత కీర్తన మొట్టమొదటి సారిగా విన్నాను .అంతకు ముందు ఒక వేళ విని ఉన్నానేమో జ్ఞాపకం లేదుకాని ,విని ఉంటే ఆయన రాసిన కీర్తన కాదేమో నని ‘’లైట్ ‘’తీసుకొని ఉంటానేమో నని కూడా నా అజ్ఞానం వలన అనుకోని ఉండవచ్చు .వెంటనే మా అబ్బాయి శర్మకు మెయిల్ పెట్టి నెట్ లో రామదాసు సంస్కృత కీర్తనలు ఉంటె వెతికి పంపమన్నాను .వాడు శ్రమించి ,శోది౦చి మూడు  కీర్తనలు ఆడియో తో సహా పంపాడు . ఇంతకు మించి ఎవరివద్దనైనా ఉంటె నాకు పంపితే చేరుస్తాను .ఇప్పటిదాకా గీర్వాణకవుల పై మూడు భాగాలలో  1,090 మందిపై రాసి,ఇంకా ముద్రి౦పని  నాలుగవభాగం లో కూడా 311 మంది పై రాసిన నేను,  రామదాసు గారి సంస్కృత కీర్తనలు గమనించక పోవటం క్షమించరాని నేరంగా నే భావించి వెంటనే రాసి తప్పు దిద్దుకోన్నాను .అవున్లే -మూకకవిని ,కంచి పరమచార్యులవారిని ,అన్నమయ్యనూ కూడా మూడవ సంపుటం లోకి పెట్టిన  ‘’తెలివి నాది ‘’.

పాల్ రాబ్సన్ అని ప్రసిద్ధి చెందిన చిత్తూరు ఉప్పలధడియం నాగయ్యగారు ఎంతో కస్టపడి  శ్రమించి, ఎన్నళ్ళో శ్రమించి ,  భక్త రామదాసు బ్లాక్ అండ్ వైట్ చలన చిత్రం నిర్మించి ,దాసుగారికి ప్రేరణగా నిలిచినా భక్త కబీర్ పాత్రకు కూడా ప్రాముఖ్యత కల్పించి , ,రామదాసు వేషం వేసి  అసలు రామదాసు ఇలానే ఉండేవాడు అనిపించి  కీర్తనలు రస గుళికలుగాపాడి ,రామభక్తితో తాను పులకించి మనల్నికూడా పులకింప జేసి,  సంగీతంకూర్చి దర్శకత్వం వహించి కంచర్ల గోపన్న రామదాసు ఐన విధానాన్ని కళ్ళకు కట్టించి తానుతరించి మనల్నీ తరింప జేశారు  .’’రామదాసు గారూ  రసీదందుకోండి’’అని తానీషా గుర్రం పై పరి గెత్తుకొస్తూ పాడిన పాట ఇంకా’’ హాంట్ ‘’చేస్తూనే ఉంది . మళ్ళీ శ్రీ రాఘవేంద్రరావు దర్శకత్వం లో కలర్ ఫుల్ గా శ్రీ నాగార్జునతో వేషం కట్టించి శ్రీ కీరవాణి సంగీతం లో యువతకు చేరువగా తీర్చిదిద్దారు .ఇందులో ‘’అ౦తా రామమయం –ఈ జగమంతా రామమయం ‘’కీర్తన మలచిన తీరుకు హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే .అదే రామదాసుగారి భక్తివైభవ సామ్రాజ్యం .ఈ రెండూ మరచి పోతే చరిత్ర మనల్ని క్షమించదు . తిరుపతి దేవస్థానం అన్నమయ్య  సంకీర్తనా ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యం రామదాసు కీర్తనలకు ఇవ్వకపోవటం బాధాకరమే .అది సొమ్ములదైవం .ఇది బాధల దైవం అయినందుకా ?శ్రీ బాలమురళి రామదాసు కీర్తనలు ఎన్నో ఏర్చి కూర్చి శ్రావ్యంగా గానం చేసి చిరస్మరణీయం చేశారు .ఆ వాగ్గేయ కారునికి ఈ వాగ్గేయ కారుడు ఋణం తీర్చుకున్నాడు .భక్త సమాజాలవారు రామదాసు కీర్తనలను ఘనంగా గానం చేస్తూ ,ఆయన ను మర్చిపోకుండా చేస్తున్నందుకు అభినందనలు .త్యాగరాజు గారి చేతనే జేజే లందుకొన్న భక్త శిఖామణి  భద్రాచల రామ దాసు గారు .

ఇప్పుడు రామదాసు గారి సంస్కృత కీర్తనల భక్తి  సౌందర్యాన్ని చూద్దాం –

1-మాయామాళవగౌళ – ఏక (మణిరంగు – త్రిపుట

పల్లవి:
నందబాలం భజరే బృందావన వాసుదేవం నం..
చరణము(లు):
జలజసంభవాది వినుత చరణారవిందం
లలిత మోహన రాధావదన నళినమిళిందం నం..
నిటలతట స్ఫుటకుటిల నీలాలక బృందం
ఘటితశోభిత గోపికాధర మకరందం నం..
గోదావరీతీర వాసగోపికా కామం
ఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం నం..

 

2-.

నవరోప – ఆది (నవరోజు – త్రిపుట)
పల్లవి:

భజరే మానసరామం
భజరే జగదభిరామం భీ..కరధృత శరకోదండం
కరితుండాయుత భుజదండం భ..
దాశరథీ సురసింహం
కౌసల్యా బహుభాగ్యం రామం
మైథిల్యాలోచన యోగ్యం భ..అవనత జలజభవేంద రం
అగణితగుణగణసాంద్రం
మాయామానుష దేహం ముని
మానస రుచికరదేహం భ

..రూపమదనశతకోటిం నత భూవదన శతకోటిం భ

..శ్యామసజలధరశ్యామం
సాంబశివానుత రామం
భద్రాద్రిచలనివాసం పరి
పాలిత శ్రీరామదాసం భ..
3-నాదనామక్రియ – ఆది (కేదార – ఆది)

3-పల్లవి
భజరే శ్రీరామం హే మానస
భజరే రఘురామం రామం భ..
చరణము(లు):
భజ రఘురామం భండనభీమం
రజనిచరాఘ విరామం రామం భ..
వనరుహ నయనం కనదహి శయనం
మనసిజ కోటిసమానం మానం భ..
తారకనామం దశరథ రామం
చారు భద్రాద్రీశ చారం ధీరం భ..
సీతారామం చిన్మయధామం
శ్రీ తులసీదళ శ్రీకరధామం భ..
శ్యామలగాత్రం సత్యచరిత్రం
రామదాస హృద్రాజీవ మిత్రం భ..

 

 

ఆలస్యంగా రాసినందుకు రామదాసుగారు నన్ను క్షమిస్తారని భావిస్తాను .ఇప్పటికైనా రాస్తున్నందుకు సంతృప్తి చెందుతున్నాను .

8-3-18 తో కామా పెట్టిన ఈ సీరియల్ ను మళ్ళీ దీనితో కొనసాగిస్తున్నాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-10-18 –ఉయ్యూరు

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సింహ గిరి కృష్ణమాచార్యులు -(సింహ గిరి వచనములు కర్త )

శ్రీకాంత కృష్ణమాచారి

శ్రీకాంత కృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య లేదా సింహగిరి కృష్ణమాచార్యులు 13 వ లేదా 14 వ శతాబ్దానికి చెందిన యోగి. మొదటి తెలుగు వచన వాజ్ఞయాచార్యుడిగా, ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన వాడు. ఈయన జననకాలం, జన్మస్థలం ఖచ్చితంగా తెలియవు.[1] కొంతమంది పండితులు ఈయన రచనలను సింహగిరి వచనములనే పేరుతో 250 దాకా పుస్తకాలు ప్రచురించారు. నిడుదవోలు వేంకటరావుతిమ్మావజ్జల కోదండ రామయ్య భారతి పత్రికలో ప్రచురించిన వ్యాసాల ప్రకారం ఈయన కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుని (1295-1323) కాలానికి చెందినవాడిగా భావించారు.

విషయ సూచిక

క్రిష్ణమయ్య ను గురించి కొన్ని సంగతులు

సింహాచలంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి పరమ భక్తుడు, అన్నమయ్యలాంటి సంకీర్తనాచార్యులకు, పోతన వంటి భాగవతోత్తములకు స్ఫూర్తినిచ్చిన వాగ్గేయకారుడు. వారికంటే ప్రాచీనుడు. కృష్ణమయ్య ఆళ్వారు శ్రేణికి చెందిన తెలుగులో మొదటి పద కవితాచార్యుడు. భగవద్ శ్రీ రామానుజాచార్యుల్ని అధ్యయనం చేసిన వైష్ణవపండితుడు.

పుట్టుక సంగతులు

కృష్ణమయ్య పూర్తి పేరు శ్రీకాంత కృష్ణమాచార్యులు క్రీ.శ. 1295 నుండి క్రి.శ.1323 మధ్య కాలంలో ఓరుగల్లును రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలానికి చెందిన వాడు. ` ప్రతాప చరిత్ర ‘సిద్దేశ్వర చరిత్ర’తిరగవేస్తే ఈయన జీవితం కనిపిస్తుంది.కృష్ణమయ్య తన `జన్మ సంకీర్తన’ లో తాను `తారణ’ నామ సంవత్సరం, భాద్రపద కృష్ణ చతుర్దశి, మంగళ వారం నాడు జ్యేష్టా నక్షత్రములో సంతూరు అనే గ్రామంలోజన్మించాననీ, తాను పుట్టుకతోనే అంధుడననీ, అందువల్ల తనజననీజనకులు తనను ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు తనను కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో తనకి చూపు వచ్చిందనీ, ఆయన ఆదేశం మేరకే తాను నాల్గు లక్షలకీర్తనలతో వాక్పూజ చేసినట్టు రాసుకున్నారు .. కృష్ణమయ్య సంకీర్తనం చేస్తూ ఉంటే నరసింహస్వామి బాలుని రూపంలో వచ్చి నాట్యం చేసేవారని ప్రతీతి. కృష్ణమయ్య వయసు వచ్చాక తన మహిమలతో ప్రజలని దిగ్భ్రాంతుల్ని చేసి`పదకొండవ అవతారుని’గా కొనియాడబడినట్టు చెపుతారు.

కృష్ణమాచార్యునికి మేనమామ కూతురితో వివాహం జరిగింది. వీరి ఏకైక కుమారుడు తన ఏడవ యేటనే మరణించటంతో, ఆ ఆవేదననధిగమించే ప్రయత్నంలో తన సంకీర్తనలో మరింతగా మునిగిపోయాడు. ఇక్కడే ఈ జగత్తు మాయాజాలం ప్రదర్శిత మౌతుంది. అప్పటికి పరిపూర్ణ యవ్వనంలో నున్న ఆచార్యులవారు స్వామి ఎదుట చిరుతాళాలు మోయిస్తూ, దండెం మీటుతూ, సింహాద్రినాథుని కీర్తిస్తున్న దృశ్యం చూసి, జగన్మోహిని అనే దేవదాసి ఆయనపై మరులుగొన్నదట.ఆమె అసమాన సౌందర్యం, హావభావాల చొరవ, కపటం లేని సాహచర్య కాంక్షతో, ఆచార్యుల వారి హృదయాన్ని ఆకట్టుకున్నదా మోహనాంగి. ఇంతటి మహాభక్తునికీ వికారా లేమిటనిపించవచ్చు. ఈ జగత్తనేది ఉన్నదే, ఇది వింత మాయావి! పోనీ ఆ స్వామి అయినా ఒక అడ్డుపుల్ల వేయవచ్చు గదా! ఇలాంటి సమయాల్లో ఆయన కేవలం సాక్షీభూతుడుగా ఉంటాడుట. వేమన వంటి యోగుల విషయంలో జరిగినట్లుగానే కామిగాని వాడు మోక్షగామి కాడనేదిద కృష్ణమయ్య విషయంలోనూ నిజమే నని తేలింది.ఈ మలుపు ముక్తిపరంగా వీరిద్దరూ అనుభవించి తీర వలసిన కర్మశేషంగా భావించవచ్చు.

ఈ మహాభక్తుడు తన 16వ యేటనే సంకీర్తన సేవకు శ్రీకారం చుట్టాడు. సంకీర్తనకు అతడెంచుకున్న మార్గం వచనం. వచన భక్తి వాజ్ఞ్మయంలో ఇతడే ప్రథమా చార్యుడు.

యశస్సు

ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థానంలో వ్రాయసకారుడిగా ఉన్నప్పుడు కృష్ణమయ్య సింహాద్రి నరసింహుని స్తుతిస్తూ గానం చేస్తే కనక వర్షం కురిసిందని చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

కృష్ణమయ్య రచన, సంగీతం, నాట్యం, భక్తి గల బహుముఖ ప్రజ్ఞాశాలి,.ప్రతిభావంతుడు అన్నింటికీ మించి అభ్యుదయవాద.వచన రచన చేయడం, మాల దాసర్లతో సహపంక్తి భోజనం చేయడం, దేవదాసీ కాంతలతో సహవాసం చేస్తూ, భక్తీ గీతాలు పాడుతూ నాట్యం చేయడం, నాటి మూఢ ఆచారాలను అతిక్రమించడం, చాందస ఆచార్యులను ఎదిరించడం కులమత భేదాలను పాటించకపోవడం వంటివి ఎన్నో అభ్యుదయ భావాలు కృష్ణమయ్య రూపు రేఖలు.వారి కృతుల సారాంశం కూడా ఇదే!. పురాణ, ఇతిహాసిక గాథలు సంస్కృత భాషలో వ్రాయబడిన కావ్యాలుగా స్థిరపడిపోయాయి.సంస్కృతంలో వ్రాసిందే కావ్యంగా ప్రసిద్ధికెక్కింది.ఆ రకంగానే సంస్కృతంలో రచించిన కావ్యాలూ, దైవం కూడా సామాన్య జనానికి దూరం అయిపోతూ వచ్చాయేకాని, సన్నిహితం కాలేకపోయాయి.ఆ కావ్యాలు ప్రజలకి అందుబాటులో ఉండాలనీ, భక్తి భావం సామాన్య జనానికి అందించాలనే సత్సంకల్పంతో, సంసార ఖేదాలని రూపుమాపటానికి కంకణం కట్టుకుని కృష్ణమయ్య వేదాలనీ, ఉపనిషత్ సారాన్ని తెలుగులో తేలికైన మాటలతో వచన రచన చేసి సంగీత, నాట్య శాస్త్రాలని మిళితం చేసి సామాన్య జనానికి అర్ధం అయ్యే రీతిలో గానం చేసి ప్రదర్శించేవారు. కృష్ణమయ్య ది జానపద విలక్షణమైన పద్ధతి.పాండిత్య ప్రకర్ష తక్కువగాను, జనాకర్షణ ప్రక్రియ ఎక్కువగాను కనిపిస్తుంది.ఈయన పామర భాషలో భక్తిని అందించి, వారిలో ధర్మ ప్రవర్తనను పెంపొందించడం అసామాన్యమైనది.అయితే భాషా, భావాల్లోని వైప్లవ్యమే ఇతని పాలిటి శాపమైంది.ఇంతటి బహుముఖప్రజ్ఞాశాలిని వైష్ణవ ఛాందసులు ఒక అనాచార్యుడిగాను, భ్రష్టాచారిగాను ముద్ర వేసి వైష్ణవం నుండి వెలివేయడం అన్నది ఒక్క వీరి పాలిట శాపమే కాదు యావత్ వైష్ణవ లోకానికీ శాపమైంది.

దేవా!
విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే హరికీర్తనము జేయునతడే కులజుండు .
శ్వపచుండైననేమి?ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటే నతడే కులజుండు. 

సాహితీ సేవ

ఈయన .వేదపండితుడు.పదాలలో ఛందస్సు శృంఖలాలను విసర్జించి, భావాలకి విశృంఖల సోయగాలను అందించిన భాషా విప్లవ వాది. కృష్ణమయ్య సింహగిరినరహరి ఆదేశంతో, అనుగ్రహంతో స్వామిని స్తుతిస్తూ `సింహగిరి వచనాలు’అనే పేరిట నాలుగు లక్షల కీర్తనలతో వాక్పూజ చేసి వాటిని రాగి రేకులపై నిక్షిప్తం చేసి సింహాచలేశునికి సమర్పించినట్టు చరిత్ర చెబుతోంది.వాటిలో చాలామట్టుకు పారిస్ లోని కింగ్స్ లైబ్రరీ కి తరలించినట్టు చారిత్రిక ఆధారాలున్నాయి.తంజావూరు సరస్వతీమహల్ లో రెండువందల దాకా కీర్తనలు లభ్యం అయ్యాయి,మిగతావి ఏ అంధకార బిలం లోనో అజ్ఞాతవాసం చేస్తున్నాయి.

దేవా!
గంగోద్బవమైన మీ దివ్య శ్రీపాద యుగళమ్ము గంటి..........
ఇంద్రాది దిక్పతులు మిమ్ము సేవింపగా గంటి 
కనకపీతాంబర ప్రభావమ్ము గంటి

మకుటం

కృష్ణమాచార్యుల వచనాలు పరిపూర్ణ భక్తి పరిమళంతో, మన అంతరంగమంతా నిండి పులకింపజేస్తాయి. ఆర్తి, శరణాగతితో నిండి లయ బద్ధంగా, రాగయుక్తంగా ఉండటం వల్ల, వచన గేయాలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రతి వచనమూ ।దేవా* అనే సంబోధనతో మొదలై, ।సింహగిరి వరహరీ! నమో నమో దయానిధీ* అన్న మకుటంతో ముగుస్తుంది. వీటిలో వ్యక్తమయ్యే దృఢభావాలు।సింహగిరి నృసింహుని మించిన దైవం లేదు శ్రీ వైకుంఠం కంటే మరో ప్రయోజనం లేదు* అని.

ప్రతి వచనం ‘దేవా!’ అనే సంబోధనతో మొదలై ‘సింహగిరి నరహరి నమోనమో దయానిధీ’ అనే మకుటంతో ముగుస్తుంది. రాగభావంతో తాళానుగుణంగా తంత్రీ శ్రుతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడ్డాయని తెలుస్తోంది. ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేద తుల్యాలుగా భావించారు. వీటిని ‘తెలుగు వేదాలు’ అనీ అన్నారు. ‘‘వేదంబు తెనుగు గావించి సంసార/ఖేదంబుమాన్చిన కృష్ణమాచార్య’’ అనే ప్రశస్తి పొందాడు. కృష్ణమాచార్యులు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తుడు. ఇతని ప్రభావం బమ్మెర పోతనపై వుందంటారు. తాళ్లపాక వారి కీర్తన వాజ్ఞయానికి ప్రేరణ, స్పూర్తి కృష్ణమాచార్యుల వచనాలే అంటారు. ‘‘దేవాతనువుల మాయ/తలపోసి తలపోసి చెప్పెదనంటినా కఱకఱల మోహమిది! ఆశల పాషాణంబిది/అతుకలు జల్లెడయిది…. ….నాటకములాడెడు బూటకమ్ముల బొమ్మ/అమ్మమ్మా రుూ బొమ్మ’’ అంటూ సాగే వచనాలతో దేశ్య పద్యాలకే ప్రాధాన్యం గమనిస్తాం. ‘‘రణించు-జోడించు-తుండించు’’ వంటి విశిష్ట ఇంచుక్కు రూపాలు చూస్తాం. ‘‘విదురనాటి వాదా’’, ‘‘ద్వార వాకిళ్లు’’ వంటి ప్రయోగాలు 13వ శతాబ్దంలో చెయ్యడం విశేషం. కృష్ణమాచార్య వచనాలను నామసంకీర్తనా వచనాలు, పౌరాణిక వచనాలు, కథా వచనాలు సాంప్రదాయ వచనాలు…అనేవిధంగా విభజించవచ్చు. నేటి అంత్యప్రాసలకి కృష్ణమాచార్యులే ఆద్యుడు అనిపించే విధంగా రాశాడు. తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించిన కృష్ణమాచార్యులు మనకు ఆరాధ్యుడే!

దేవా…! పెద్దతనంబు చేసి మిము మెప్పించెదనంటినా … జాంబవంతుడు మీ సన్నిధినే యున్నాడే ..!
దేవా..! బుద్ధినినే మెప్పించెదనంటినా … విభీషణుండు మీ సన్నిధినే యున్నాడే ..!
దేవా..! బంటుదనంబు సేసి మిము మెప్పించెదనంటినా … యంజనాసుతుండు హనుమంతుండు మీ సన్నిధినే యున్నాడే …!
దేవా..! తీర్థంబులాడి మిము మెప్పించెదనంటినా … గంగా భవాని మీ యంగుష్ఠంబు నందే ఉద్భవించి యున్నదే …! దేవా…! ప్రదక్షిణములుచేసి మిము మెప్పించెదనంటినా … సూర్యచంద్రాదులు మీ సన్నిథినే యున్నారే …!
దేవా…! వేదవేద్యుండనై మిము మెప్పించెదనంటినా … బ్రహ్మ మీ నాభి కమలమం దుద్భవించి యున్నాడే ..!
దేవా…! గీతప్రబన్ధములచేత మిము మెప్పించెదనంటినా … కిన్నర కింపురుష గరుడ గంధర్వ సనక సనందన సనత్కుమార పరమ భాగవతులు.., నారదాదులు మీ సన్నిథినే యున్నారే ..!
దేవా…! సత్యంబులచేత మిము మెప్పించెదనంటినా … సత్యహరిశ్చంద్రుడు మీ సన్నిథినే యున్నాడే ..!
దేవా…! ధనదాన్యంబులచేత మిమ్ము మెప్పించెద నంటినా … శ్రీ మహాలక్ష్మి మీ యుదరమందే యున్నదే …!
దేవా…! శాంత శమదమాది గుణంబులచేత నోర్పు గలిగి యుండెద నంటినా … భూదేవి మీ సన్నిథినే యున్నదే …!
దేవా…! విందులు పెట్టి మిమ్ము మెప్పించెద నంటినా … విదుర భరద్వాజ శబరి మొదలైనవారు మీ సన్నిథినే యున్నారే …!
దేవా…! ఏకాదశీ వ్రతాదుల మిమ్ము మెప్పించెద నంటినా … రుక్మాంగదుండు మీ సన్నిథినే యున్నాడే …!
దేవా…! భక్తివైరాగ్యంబుల జేసి మిమ్ము మెప్పించెద నంటినా … ప్రహ్లాదుడు మీ సన్నిథినే యున్నాడే …!
దేవా…! వాహనరూపుండనై భరింతు నంటినా … గరుత్మంతుండు మీ సన్నిథినే యున్నాడే …!
దేవా…! మీ పాద పద్మంబులు నా కన్నుల జూచుకొని మీ ద్వారంబు కాచుక యుండెద నంటినా … ద్వారపాలకులు మీ సన్నిథినే యున్నారే …!
దేవా…! నేనా మిమ్ము నుతించగలవాడను …!!?? ఎనుబది నాలుగు లక్షల కోట్ల జీవజంతువులలో నేనొక నరజీవుండనే … !
దేవా…! మిమ్ము …, వేయి శిరస్సులు..,రెండువేల జిహ్వలుగల శేషాహి నుతియించి కొనియాడుకొనవలె నంతె గాక ..!!!
యతిరామానుజా …!
అనాథపతీ ..!
స్వామీ …!
సింహగిరి నరహరీ …!
నమో నమో దయానిథీ …!!”

అబ్బురమనిపించే జీవిత కథనం

ఒకనాడు కృష్ణమాచార్యులు స్వామి సన్నిధిలో గానం చేస్తూండగా, స్వామి బాలకుని రూపంలో వచ్చి, వారి తొడ మీద కూర్చుని, ఆ వచనాలను తాళపత్రం మీద గంటంతో రాయసాగాడుట. అంతవరకూ ఆశువుగా, ఎప్పటికప్పుడు భావావేశంతో గానం చేస్తున్న ఆచార్యుల వారికి, ఈ సంఘటన తర్వాత, తన వచన సంకీర్తనలను అక్షర బద్ధం చేయాలన్న ఆదేశంగా తోచిందట. అప్పటినుంచీ అలాగే చేస్తూ వచ్చాడు.

కృష్ణమాచార్యుని వచనాలు నాలుగైదు లక్షల పైమాటేనని విశ్వసిస్తున్నా, ఇప్పటి వరకూ లభించినవి 60 మాత్రమే. వీరి వచనాలిలా అదృశ్యం కావటానికొక రమ్యమైన గాథ బహుళ ప్రచారంలో ఉంది. రామానుజాచార్యులవారు సింహాచలం విచ్చేసి, ఆ క్షేత్రంలో తపస్సు చేసుకుంటు న్నారు. వారిని కృష్ణమాచార్యులు అంతగా లక్ష్య పెట్టలేదు. తన భక్తి తరంగాలతో సాక్షాత్తూ నృసింహునే పరవశింప జేస్తున్నానన్న గర్వరేఖ దీనికి కారణం. ఇది తొలగించకపోతే అతడి పురోగతికి ఆటంకంగా నిలుస్తుంది. పరమాచార్యులైన రామానుజులు, తన సహజ కృపా దృష్టితో ఈ పనికి పూనుకున్నారు. వారు కృష్ణమా చార్యునితో, తాము నృసింహుని సన్నిధికి వచ్చామని, కృష్ణమాచార్యులు భగవంతునికి బహు సన్నిహితులు గనుక, తనకు ముక్తి లభిస్తుందో లేదో స్వామిని విచారించి తనకు తెలియజేయమని కోరారు.

తన స్థాయిని రామానుజులు గుర్తించినందుకు కృష్ణమా చార్యులు పరమానందంతో దీనికంగీక రించాడు. ఆ రోజు తన గాన నృత్య కలాపం ముగిసిన తర్వాత, రామానుజుల వారి ముక్తి గురించి స్వామిని విచారించారు. ఆ పరమాత్ముడాశ్చర్యం నటిస్తూ, తాను రామానుజునికి ముక్తి ప్రసాదించటమేమిటి? ఆయనే అందరికీ ముక్తిని ప్రసాదించగల మహానుభావుడన్నాడు. కృష్ణమాచార్యులకిది గట్టిగా తగిలింది. నిర్విణ్నుడైపోయాడు.

ఇంతకాలంగా ఇంతటి భక్తితో స్వామిని సేవిస్తున్న తనకు లేని ఆధిక్యత, నిన్నగాక మొన్న వచ్చి, ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న ఈ సన్యాసికి దక్కటమా? తానిన్నాళ్లూ ఎవరినైతే లక్ష్య పెట్టలేదో అతడే అందరికీ ముక్తినిచ్చేవాడని ఈ స్వామి చెప్పటమా? ఏమిటీ దేవుని న్యాయరీతి? ఒక పక్క గుండెలు రగులు తూంటే స్వామినడిగాడు॥పోనీ, నా జీవిత మంతా నీ కైంకర్యానికే వినియోగించాను కదా! మరి నాకైనా నీవు ముక్తినిస్తావా?** అని.

॥నీకైనా ముక్తిని ప్రసాదించగలవాడు రామానుజుడే** అని సమాధానం. కృష్ణమాచార్యుడిక నిగ్రహించుకోలేక పోయాడు. ఎవరినైతే తానిన్నాళ్లూ నిరాద రించాడో, తన ముక్తి కొరకు అతడి పాదాలనే ఆశ్రయించాలా? తన జీవితమంతా ఎవరి సేవ కొరకు వినియోగించాడో, ఆ సింహాచల నాథుడనవలసిన మాటేనా ఇది? క్రోధావేశం తన్నుకు వచ్చింది. తిట్లు లంకించుకున్నాడు. స్వామి కూడా మొహమాటమేమీ లేకుండా నిష్కర్షగానే ఉన్నాడు.

॥ముక్తియంతటి స్థితి నీకివ్వటానికి, నేనేమీ నీకు రుణపడిలేను. నీవు సంకీర్తనతో నన్ను పరవశింపజేస్తే, నేను నాట్యంతో నీకు పరమానందం కలిగించాను. బాకీ చెల్లి పోయింది. అయినా అకారణంగా దైవ దూషణ చేశావు గనుక, ఏ పద వాఙ్మయం చూసుకుని నీవింతగా గర్విస్తున్నావో, అది భావితరాలకు అందకుండా పోతుంది** అని శపించాడు.

ఈ అఘాతానికి ఆచార్యుల మతి స్థిమితం కూడా పోయింది. ముక్తి సంగతి అలా ఉంచితే, శాపమా తనకు దక్కేది! ప్రతీకారేచ్ఛ రగులుతూంటే, ॥నీ ఆలయం ఏడు రోజులపాటు అగ్నికి ఆహుతి అవుతుంది** అని ప్రతి శాపమిచ్చాడు. ఈ శాపాల ప్రభావమా అన్నట్లు, 18వ శతాబ్దంలో జరిగిన విదేశీ దండయాత్రల్లో ఈ క్షేత్రం విధ్వంసానికి గురికాగా, ఆచార్యుల సంకీర్తన వాఙ్మయం అంతరించి, నేడు కేవలం 60 సంకీర్తనలు మాత్రమే లభ్యమౌతున్నాయి.

మూలాలు

  1.  బి., రామరాజు (2011). ఆంధ్ర యోగులు సప్తమ భాగం. హైదరాబాదు: మోహన్ పబ్లికేషన్స్. p. 32.

బయటి లింకులు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -3 (చివరిభాగం )

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -3 (చివరిభాగం )

గాంధీ గారి అహింసా సిద్ధాంతం ఇండియాకే కాదు ప్రపంచ దేశాన్నిటికీ వర్తి౦ చేదే . మానవాళికి విపరీత శత్రువులైన అసూయ ,భయాలను జయించిన శాంతి వీరుడు గాంధీ .అసూయ పిరికితనం అన్నాడు .బ్రిటిష్ దౌర్జన్యరాజ్యమంటే,కాలనీ దౌస్ట్య మంటే ఉన్న భయాన్నికూకటి  వ్రేళ్ళతో సహా ప్రజల మనసులనుండి తొలగించాడు .భారత స్వాతంత్ర్యానికి ఆయన ఇచ్చిన మరో మంత్రం ‘’అభయం ‘’అంటే భయరాహిత్యం .ఆహిస ,పిరికి తనం వ్యతిరేక పదాలు .అహింస అత్యంత గొప్ప సుగుణం ,పిరికితనం అత్యంత దుర్గుణం .అహింస ప్రేమనుంచి ఉద్భవిస్తుంది. పిరికితనం ద్వేషం నుంచి జనిస్తుంది  .స్వచ్చమైన అహింస నిరుత్సాహపరచి అవినీతి పనులను చేయించదు . కాని పిరికి తనం అదే చేయిస్తుంది .ఈ రెండిటికీ హస్తి మశాకాంతర భేదం ఉందని స్పష్టంగా చెప్పాడు గాంధి .

గాంధీగారి అహింసా యుత సహాయ నిరాకరణ ఉద్యమం దేశం లో ఉద్ధృతంగా దూసుకొస్తున్న ఉగ్రవాదాన్ని కాండంతో సహా నరికేయటానికే .ఏరూపం లో ఉన్నా టెర్రరిజం దుర్గుణమే భయానకమే ..పరాయి పాలన వ్యతిరేక  విషయం తో సహా .అంత్య ఫలం ఎంత ఉదాత్తమైన అవసరమో ,దాన్ని సాధించే మార్గాలు కూడా అంతే ఉదాత్తంగా ఉండటం అవసరం .ఇవాళ సమకాలీన ప్రపంచం లో టెర్రరిజం   శాపం ,అశాంతి .ప్రజలు భయ  భీభత్సాలమధ్య బతుకుతున్నారు .స్వాతంత్ర్య భారత దేశం లో ప్రముఖ వ్యక్తుల దగ్గరనుంచి సామాన్య రాజకీయ నాయకుడి వరకు ప్రభుత్వ పోలీసు సంరక్షణలో బందీలై బతకటం సిగ్గు చేటు గా ఉంది .ఇందుకేనా మనం స్వేచా స్వాతంత్ర్యం సాధించింది ?గాంధీ చెప్పిన, గురుదేవ్ టాగూర్ రాసిన  ‘’వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ‘’గీతా౦జలి పాఠం ఏమైపోయింది ? భయం మధ్య గడిపే జీవితమా మనం కోరుకున్నది ?’’భయరాహిత్యమున్న స్వర్గం లోకి దేవా! నా దేశాన్నిమేల్కొలుపు ‘’అని ప్రార్ధించింది అంతా శుష్క వేదాంతమై పోయిందా ?కనుక ఈ హింసా ,భీభత్సాల మధ్య గడుపుతున్న వారికి తరుణోపాయం గాంధీ అహింస సిద్ధాంతం మాత్రమే . అదే సర్వశ్రేస్ట మార్గం అందరికీ .

నేడు ప్రపంచ రాజకీయం అంతా ‘’ప్రయోజనకర సిద్ధాంతం ‘’,ఆవశ్యకత లపైనే నడుస్తోంది .ఇది మరీ దిగజారి ‘’మాకివిల్లీ విధానం ‘’అమలై , రాజకీయం లో ఏదైనా రైటే,చెల్లు బాటు అవుతుంది అనే స్థితిలోకి వస్తే డేంజర్ గంటలు మోగినట్లే .ఇది నేర ప్రవృత్తికి రాచబాట వేస్తుంది .మనదేశం లో  రాజకీయం లో చాలాభాగం మతోన్మాదశక్తుల గుప్పిటలో చిక్కుకు పోయింది .అందుకే మహాత్ముడు బహిరంగ విలువలున్న రాజకీయం కావాలని వా౦ఛించాడు .దానికే మద్దతు పలికాడు . .’’సత్యమే దైవం ‘’అన్నాడు   .మానవ క్రియా శూన్యమైన దేది మతంగా ఆయన భావించలేదు .మతం  అంటే  పిడివాదం, అంధ విశ్వాసం కాదు .అది ‘’జీవన విధానం ‘’అన్నాడు .సామాన్య మానవ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వనిది మతమే కాదన్నాడు ‘’నా మతం సత్యాహింసలపై ఆధార పడింది .సత్యమే నా దైవం .అహింస దాన్ని పొందటానికి సాధనామార్గం ‘’అని విస్పష్టంగా వివరించాడు .1927 లో ‘’ప్రపంచం లోమతాలన్నీ అనేక విషయాలలో విభేదించినా, అందరు ఏకగ్రీవం గా సత్యం ఒక్కటే శాశ్వతం అన్నారు.హేతువుకు నిలబడని, నైతికత లేని మత మూఢ విశ్వాసాలను నేను నమ్మను .ప్రజల యదార్ధ జీవన విధానాన్ని పట్టించుకోని ,వారికి సహాయపడనిది మతమే కాదు .అసహనం హింసకు మరో రూపం .అది అసలు ప్రజాస్వామ్య అభి వృద్ధికి, భావనకు అవరోధం ‘’అని చెప్పాడు .

హిందువు కాకపొతే గాంధీ శూన్యమే .హిందువుల నైతిక ప్రపంచాన్ని నిర్వచిస్తూ గాంధీ దాని సౌందర్యం అంతా అన్నిటినీ ఆహ్వానించి కలుపుకోవటం  తనది చేసుకోవటం లోనే ఉంది అన్నాడు .ఇతర మతాలలో ఉన్న విషయం హిందూ మతం లో తప్పక ఉంటుంది   .ఇందులో లేనిదాని కోసం  వెంపర లాడటం వివేక౦ కాదు .భిన్నభావాలు, నమ్మకాలు, మత విశ్వాసాలున్న భారత్ దేశ ప్రజలను ఏక తాటిపై నడిపించి౦ది  ఆయన విశాల భావాలే .అనాదినుంచి ఉన్న ‘’భిన్నత్వం లో ఏకత్వం’’ ఇప్పుడు సాధించి చూపి, దాని శక్తి ఏమిటో బ్రిటిష్ పాలకులకు రుచి చూపించాడు .హిందూ మతంలోని ఉదారతను ఆయన చక్కగా వినియోగించి అందరికి చేరువయ్యాడు లక్ష్యసాధనకు ఇది బాగా తోడ్ప డిందిదికూడా .మత మౌఢ్యం, చాందసవాదం  అనే సంకెళ్ళ నుండి విముక్తి కలిగించి సామరస్యంగా ,పరస్పర సహకారం తో జీవించే జీవన శైలిని ఉద్బోధించాడు.

కార్య శీలి గాంధి ప్రయోజనంలేని ,ఉపకరిచని శుష్కవాగ్దానాలు చేయలేదు .అమలు పరచలేని తీర్మానాలూ చేయలేదు .1929  లో అభివృద్ధికోసం  ఆయన ’ ‘’అమలు చేసే శక్తి సామర్ధ్యాలు లేని తీర్మానాలపై గంటల తరబడి మాట్లాడి  ,వాటిని అనాలోచితంగా  ఆమోదించి ప్రజలను మభ్యపరచి మోసం చేయవద్దు .వాళ్ళనమ్మకమే మన బల౦  ‘’అని చెప్పిన మాట ఏనాటికైనా, ఏ పాలకులకైనా కను విప్పు కలిగించే కఠోర సత్యమే

గాంధీ అంటే అత్యంత క్రమశిక్షణ కల వ్యక్తి .తనపై అపారనమ్మకమున్న దేశ ప్రజలకు అనుచరులకు ‘’ఏదిసాధించాలన్నా క్రమశిక్షణ చాలా అవసరం .క్రమశిక్షణ అనేది విద్య, చర్చ వాదాలతో అలవడేదికాదు.వ్యతిరేక పరిస్థితులలో దాన్ని సాధన చేయాలి ‘’అన్నాడు .ప్రపంచం లో చాలాదేశాలు చాలావేగవంతం గా అభి వృద్ధి సాగిస్తుంటే ఇండియా అభి వృద్ధిలో వెనకబడటానికి కారణం అన్ని రంగాలలో క్రమశిక్షణ లేకపోవటమే.ప్రపంచ దేశాల సరసన ,వాటిక౦టే ఉన్నతంగా భారత దేశం నిలబడాలి  అంటే గాంధీ  బోధించిన, అనుసరించిన క్రమశిక్షణ ను అందరూ  తీవ్రంగా తప్పక అనుసరించాలి ,జాగృతమవాలి.

గాంధీకి పాశ్చాత్య విధానాలను గుడ్డిగా అనుసరించటం ,అనుకరించటం ఇష్టం లేదు .నవీన భారతం తన మూల సిద్దా౦తాలపై ,ఎక్కడ మంచి ఉంటే దాన్ని తీసుకొంటూ, కలుపుకుపోతూ అభివృద్ధి చెందాలని అభిలషించాడు .మహాత్ముడు చెప్పిన ఆర్ధిక ఫిలాసఫీ ని తప్పుగా అర్ధం చేసుకున్నారు . యాంత్రిక  సాంకేతికతకు ఆయన వ్యతిరేకి కాడు . అయితే యంత్రాలు, సాంకేతికత పారిశ్రామిక సమాజాలలో పెత్తనం చేయరాదు అని ఆయన ఉద్దేశ్యం .ప్రజలు కోరికలు తగ్గించుకోవాలి . అజ్ఞాన వినిమయతత్వం  (కన్సూమరిజం  ) పెరగకుండా జాగ్రత్త పడాలని కోరాడు .ఆర్ధిక విషయాలపై ఆయనకు ఖచ్చితమైన, నిర్దుష్టమైన భావాలు ఉన్నప్పటికే ,వాటిని తన అనుచరులపై బలవంతంగా రుద్ద లేదు .కేపిటలిజం ,కమ్యూనిజం లపై ఆయనకు ఆసక్తి లేదు .సమానహక్కులు, బాధ్యతలు ,ప్రేమ, పరస్పర సహకారం తో మనుగడ సాగించే సమాజమే ఆయన ధ్యేయం .సమాజం లో అతి బలహీనుడికి కూడా, అత్య౦త బలవంతునికి ఉన్న అవకాశాలు ఉండాలన్నాడు .ఇది ‘’ఉటోపియా ‘’-ఆదర్శ ధామం గా అనిపిస్తుంది  .అంటే ఆచరణ సాధ్యంకానిది గా అనిపించినా ,ప్రపంచ దేశాలన్నిటి ధ్యేయం ఇదే .దీనినే’’ రామరాజ్యం’’ అన్నాడు రామ భక్త బాపు .

సమాన న్యాయం సమాన అవకాశాలు ఉండే సమాజం ఏర్పడాలి అంటే గాంధీ చెప్పిన 7  పాపాలు చేయకుండా అందరూ చిత్త శుద్ధితో ఉండాలి .అవి –విలువలు లేని రాజకీయాలు 2-నైతికత లేని వ్యాపారం 3-పని లేనిసంపద 4-శీలం లేని విద్య 5-మానవత్వం లేని విజ్ఞానం 6-మనస్సాక్షి లేని ఆనందం 7-త్యాగం లేని ఆరాధన .

19 వ శతాబ్దం లో భారత దేశం లో నూతనశక్తి(రినసెంట్ ) తో పునర్జన్మ నెత్తిన ముగ్గురు మహా పురుషులలో మహాత్మాగాంధీ ఒకరు. మిగిలిన ఇద్దరు రాజా రామ మోహన రాయ్ ,,జస్టిస్ మహాదేవ గోవింద రానడే .ముగ్గురిదీ ఋషి శీలమే ,సత్యాగ్రహ తత్వమే .ముగ్గురి భావనా ఒకటే –‘’మానవత్వం సమానత్వం ,అధ్యాత్మికోన్నతి ‘’.ఈ సందేశాన్నిగాంధీజీ  క్రియా రూపం లో వ్యాపింప  జేయటానికి సత్యాగ్రహం అహింస  ఆయుధాలుగా చేసుకొన్నాడు .ఈనాటి ‘’థర్మో న్యూక్లియర్ యగం ‘’లో సర్వమానవ వినాశనాన్ని, ,తుదముట్టించటాన్ని(ఎన్నిహిలేషన్ )నివారించి, రక్షించటానికి  ఉన్నఎకైక సాధనం సతాగ్రహం అహింసా సిద్ధాంతమే ,ఇదే మహాత్ముడిని ఈ యుగం లో కూడా స్మరించటంలో ఔచిత్యాన్ని తెలియ జేస్తోంది .

సమాప్తం.

ఆధారం –  –డా.ఎస్ యెన్ దాత్యేసంకలించిన ‘’రీ థింకింగ్ మహాత్మా గాంధీ ‘’లోని జే వి నాయక్ రచన –‘’రెలవెన్స్ ఆఫ్ గాంధి ‘’ ,

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-18- ఉయ్యూరు

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఫిజిక్స్ లో నోబెల్ పొందినమూడవ మహిళ- డోన్నాస్ట్రిక్ లాండ్

నోబెల్ బహుమతి కమిటి అక్టోబర్ 2 ఉదయం  ఫిజిక్స్ లో ముగ్గురికి  నోబెల్ బహుమతి నిచ్చింది .అందులో స్ట్రిక్ లాండ్ మహిళా గా ఆ పురస్కారం అందుకొన్ని మూడవ  మహిళ అవటం విశేషం .మిగిలిన ఇద్దరూ జేరార్డ్ మౌరో ,ఆర్ధర్ ఆష్కిన్.లేజర్ ఫిజిక్స్ లో చేసిన కృషికి పొందినావార్డ్ ఇది .స్ట్రిక్ ల్యాండ్ కు జేరార్డ్ కు సగం ,మిగిలిన సగం ఆష్కిన్ కు అందజేశారు .ఫిజిక్స్ లోఇంతవరకు  నోబెల్ పొందిన ఇద్దరు మహిళలు మేరీక్యూరీ(1903 ) ,మేరియా జియోపర్ మేయర్ (1963 ).

తనకు అవార్డ్ దక్కిన సందర్భంగా స్ట్రిక్ లాండ్ ‘’మహిళా ఫిజిసిస్ట్ లకు అవార్డ్ రావటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది .క్యూరీ, మేరియా లతో పాటు నేనూ పొందటం మహిళగా గర్వ పడుతున్నాను ‘’అన్నది ..ఈ ఉదయం ఆమెకు ఫోన్ చేసి అవార్డ్ కమిటీ తెలియజేసినప్పుడు అందరు నోబెల్ లారియాట్ ల లాగే ఆమె కూడా నమ్మ లేదు .అది క్రేజీ అనిపించి నిజం అని తెలియగానే ఆశ్చర్యపడింది .

అమెరికా న్యు జెర్సీ హాల్మ్ డెల్ లాబ రేటరీస్ ఫిజిసిస్ట్ ఆష్కిన్ కు ఆప్టికల్ ట్వీజర్స్ కనిపెట్టినందుకు నోబెల్ ఇచ్చారు .ఇవి టీన్సిలివింగ్ సెల్స్ ను ,కణాలు యాటంస్ ,వైరస్ లనుకూడా పట్టుకొంటాయి.సైన్స్ ఫిక్షన్ లోని పాత కల నిజమైంది .రేడియేషన్ ప్రెజర్ ఆఫ్ లైట్ తో భౌతిక వస్తువులను కదల్చటానికి వీలుకలిగింది .సజీవ బాక్టీరియాను వాటికి హానికలిగించాకుండా ట్వీజర్ లు  ఆకర్షిస్తాయి .

కెనడాలోని వాటర్ లూ యూనివర్సిటికి చెందిన స్ట్రిక్ లాండ్  ,ఫ్రాన్స్ లోని పలాసియాలో ఈకోల్ పాలిటెక్నిక్ కు చెందిన మౌరో ఇద్దరూ కలిసి  ప్రపంచం లో అతి చిన్న ఆకర్షణీయ లేజర్ పల్స్ తయారు చేశారు .దీనికి నోబెల్ పొందారు  .వీరు కనిపెట్టిన దాన్ని చిర్పేడ్ పల్స్ యా౦ప్లి ఫికేషన్   అంటారు .ఇందులో లేజర్ పల్స్ లను సరైన సమయం లో సాగదీసి అణచివేస్తారు(అదుముతారు ).అప్పుడు పల్స్ లు మెత్తబడి ,అతి చిన్నవై కాంతిని అతి తక్కువ ప్రదేశం లో నిలువ చేసుకొనే సామర్ధ్యం పొందుతాయి .అందువల్ల పల్స్ లతీవ్రత రాకెట్ వేగంగా ఉంటుంది .ఈ పరిశోధన గురించి ఈ ఉదయం స్ట్రిక్ లాండ్ ను అడిగినప్పుడు ఆమె ‘’ బాక్స్ కు బయట  ఆలోచించి ,మొదట లాగి తర్వాత యా౦ఫ్లిఫై  చేశాం  ‘’అన్నది .సాధారణంగా చాలామంది యా౦ప్లి ఫై చేసి తర్వాత కంప్రెస్ చేస్తారు . ఈ టెక్నిక్ మిలియన్ల కొద్దీ ఐ సర్జరీలలో ప్రతి సంవత్సరం ఉపయోగిస్తున్నారు .ఆష్కిన్ కు 9 మిలియన్ క్రోనాల    (1.01మిలియన్ డాలర్లు)నోబెల్ నగదు బహుమతిలో సగం లభిస్తుంది .మిగిలిన సగం స్ట్రిక్ లాండ్ ,మౌరో  లకు లభిస్తుంది .

  ఆధారం –శ్రీ మైనేని గోపాలకృష్ణ గారుసాయంత్రం పంపిన ‘’ Nobel Prize in Physics Shared by Woman for 1st Time in 55 Years

By Jeanna Bryner, Live Science Managing Editor | October 2, 2018 07:15am ET

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-18- ఉయ్యూరు

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -2

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -2

చరిత్ర విశ్వ మానవ గురువు .సామాన్యుని విషయాలు ,అతని జయాపజయాలు సాధనాలు అన్నీ రికార్డ్ చేస్తుంది చరిత్ర .పైన చెప్పుకున్నట్లుగా సామాన్య తెలివితేటలున్నప్పటికీ ,గాంధీ మాన్యుడయ్యాడు. మహాత్ముడయ్యాడు .,కారణం ఆయన రాజకీయ,నైతిక ,అహింసా సిద్ధాంతాలే .బాధిత ప్రజలకాయన ‘’ మెస్సయ్యా ‘’అయ్యాడు .కనుకనే దేశ ,విదేశాలలో చరిత్ర ప్రసిద్ధుడయ్యాడు .1948 జనవరి 30 శుక్రవారం సాయంత్రం  గాంధీ హత్య చేయబడితే యావత్ ప్రపంచం కన్నీరుమున్నీరుగా విలపించింది  .ఆయన విశ్వమానవుడు .శాంతి అహింస ప్రేమ ల ప్రవక్త . ఆయన దారుణ హత్యను ప్రపంచ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు .ప్రసిద్ధ అమెరికా నవలా రచయిత్రి పెరల్ ఎస్ బక్ ‘’ఇది మరొక క్రూసిఫిక్సేషన్’’అన్నది .ఆసాయంత్రమే భారత తొలిప్రధాని నెహ్రు ‘’మన జాతిపిత మూర్తీభవించిన సత్య స్వరూపం మాహాత్మా గాంధీ అమరులయ్యారు .అయన సత్యమార్గాన్నిచూపి మన తప్పులను మన్నించి ,ఈ పురాతనభారత దీశానికి  స్వేచ్చా స్వాతంత్ర్యాలు సాధించి ఇచ్చారు ‘’అని కన్నీటితో రుద్ధ కంఠం తో విపపిస్తూ అన్నాడు .అమెరికా సెక్రెటరి ఆఫ్ స్టేట్ జనరల్ సి.మార్షల్ ‘’సర్వ మానవ జాతి అంతరాత్మ ‘’ను కోల్పాయాం అన్నాడు .ఇవన్నీ సత్యాతి సత్యమైనవే .సందేహమే లేదు .  దేశ దేశాల స్త్రీపురుషులందరూ తామేం  కోల్పోయామో తెలుసుకొని దుఖించారు. గాంధీ చరిత్ర రాసిన లూయీ ఫిషర్  చెప్పిన దాన్నిబట్టి మహాత్ముని హత్య వార్త విన్న కొద్ది సేపటికే భారత అధికారులకు విదేశాలనుండి 3,4 41  సందేశాలు  అందాయట . పంపినవారిలో పోప్ పయస్ ,దలైలామా ,కా౦టర్ బరీ  ఆర్చిబిషప్  , బ్రిటన్ రాజు ,,ప్రెసిడెంట్ ట్రూమన్ ,లండన్ చీఫ్ రబీ ,చాంగ్ కై షేక్ ,ఫ్రాన్స్ ప్రెసిడెంట్ , రష్యా నుంచి తప్పఅన్ని దేశాల ముఖ్య రాజకీయనాయకులు  పదవులలో ఉన్నవారు ఉన్నారు.ఫ్రెంచ్ సోషలిస్ట్ లియాన్ బ్లుం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు గాంధీ హత్యపై స్పందించిన తీరును రికార్డ్ చేసి ‘’నేనెప్పుడూ గాంధీని చూడనే లేదు .కాని నా స్వంత బంధువు చనిపోయిన దుఖం  అనుభవించాను .ప్రపంచం దుఃఖ సాగరం లో మునిగి పోయింది .బాపు మహాత్ముడు. అసాధారణ వ్యక్తి .మనీషి ‘’అని రాశాడు .ఇండియా సోషలిస్ట్ నాయకుడు మధూ లిమాయే గాంధీ దుర్మరణానికి  యూరప్ సామాన్య ప్రజలు ఎలా  కృంగిపోయరో ప్రత్యక్ష సాక్షిగాతన ‘’ఎ డ్రీం షాటర్డ్’’లో   వివరించాడు .గాంధీతో మౌలిక భేదాలున్న అంబేద్కర్ గాంధీ హత్యకు షాకయ్యాడు.’’శాంతిదూత ఆహి౦సామూర్తి కి ఇంతటి దారుణ హి౦సామరణమా?’’అని   కాబోయే భార్య డా సబితా కబీర్ కు రాసిన లేఖలో తెలియ జేశాడు .  గాంధీని ‘’స్థిత ప్రజ్ఞ కర్మ యోగి ‘’అని ఐక్యరాజ్య సమితిలో బ్రిటిష్ ప్రతినిధి ఫిలిప్ నోయెల్ బేకర్  అభివర్ణిస్తూ ‘’అత్య౦త బీదలకు  గాంధీ గొప్ప మిత్రుడు .అయినా ఏకాకి .ఇప్పుడు కనుమరుగయ్యాడు .ఆయన ఆశించిన విషయాలు ఇంకా అమలులోకి రావాలి ‘’‘’అన్నాడు .కనుక  గాంధీ స్మరణ ఔచిత్యమైనదే నేడుకూడా .ఎలాగో చూద్దాం.

జీవిత మూల సూత్రాల విషయం లో మహాత్ముడు ఎన్నడూ రాజీ పడలేదు .ఈనాటి ఇండియా కే కాదు యావత్ ప్రపంచానికీ ఆయన చెప్పిన మూలసూత్రాలు శిరో దార్యాలే .ప్రపంచం లో మొట్టమొదటిసారిగా అణచి వేతకు, హక్కుల హరణకు వ్యతిరేకంగా అహింసా యుత విప్లవం  ప్రయోగించాడు  .ఇందులో రాజకీయ సాంఘిక ఆర్ధిక సాంస్కృతిక విషయాలలో సామాన్యులకు జరిగిన అన్యాయాలు ,దౌర్జన్యాలపై తిరుగుబాటు ఉన్నది  .వీటి సాధనకు సత్యాగ్ర హ ఆయుధాన్ని ప్రయోగించాడు .’’అణచేవాడు అణగ ద్రొక్కబడే వాడుఒకరితో ఒకరు సహకారం తో మెలిగితే అణచి వేత ఉండదు ‘’అని ప్రబోధించాడు .అది పూర్తి  సత్యం .ఇదిపాటిస్తే స్థానిక వ్యక్తిగత ,ప్రాంతీయ ,దేశీయ  అంతర్జాతీయ స్థాయిలలో  మానవ సమూహాలకు సుఖ శాంతులు లభిస్తాయి ‘’అన్నాడు .’’సహాయ నిరాకరణ అతి సామాన్య ప్రజలలో గౌరవ ,అధికారాలకోసం మేల్కొలపటమే .దీనికి వారిని సమాయత్తం చేయటానికి వారిలో రాక్షస శక్తి పై భయం పోగొట్టటం ఒక్కటే మార్గం .అది వారి అంతరాత్మను మేల్కొనేట్లు చేసి తమ కర్తవ్యాన్ని నెరవేర్చేట్లు చేస్తాయి  .నేను చేసింది ఈ చిన్నపనిమాత్రమే .వారు జాగృత స్థితి పొందితే సాధించలేనిది ఏదీ ఉండదు .సహకారం ఒక విధి . సహాయ నిరాకరణ కూడా డ్యూటీ తో సమానమే .’’అని వివరించాడు .తప్పు చేసే  ప్రభుత్వాన్నీ ,విద్యాలయాలను ,వాణిజ్య వ్యాపార  మత రాజకీయ సంస్థలను ,ఫాక్టరీలను, చివరికి వ్యక్తులను ,  సంఘాన్నీ కుటుంబాలను , కూడా తప్పు తెలుసుకోనేట్లు చేసి , సరైన మార్గం లో పెట్టి ప్రజోపకారంగా పనులు చేయి౦చటమే సత్యాగ్రహముఖ్య  లక్షణం అంటాడు గాంధీజీ .

ప్రజా స్వామ్యకంటకుల ,దోపీడీ దార్ల , రాజకీయ నేరగాళ్ళ   హక్కులను కాలరాసే వారల కబంధ హస్తాలలో నలిగినప్పుడు  భారతీయ సామాన్య ప్రజానీయం నిర్భయంగా శాంతియుతంగా గాంధీగారి విధానాలనే అమలు చేసి తమ కోరికలు సాధించుకొంటున్న చరిత్ర మనం చూస్తూనే ఉన్నాం.,

ఆధారం –డా.ఎస్ యెన్ దాత్యేసంకలించిన ‘’రీ థింకింగ్ మహాత్మా గాంధీ ‘’లోని జే వి నాయక రచన –‘’రెలవెన్స్ ఆఫ్ గాంధి ‘’ ,

సశేషం

గాంధీ ,లాల్ బహదూర్  జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-18 –ఉయ్యూరు    .

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

సగటు తెలివి తేటలగాంధీ మహాత్ముడయ్యాడు 

సగటు తెలివి తేటలగాంధీ మహాత్ముడయ్యాడు

 మెట్రిక్ పరీక్షలో గాంధీ గారి మార్కు లెన్నో తెలిస్తే నోరెళ్ళ బెడతాం .అయ్యగారికి వచ్చిన మార్కులు 625 కు 247 1/4 .మాత్రమే .అంటే 39.6 శాతమే .అంటే గురూగారు అత్తెసరు మార్కులతోనే 18 87 బాంబే యూని వర్సిటీ పరీక్ష పాసయ్యాడు .ఆయన ఉత్తీర్నత భావనగర్ లోని శ్యామలదాస్ కాలేజి దృష్టిలో’’ తప్పినట్లే ‘’లెక్క .లా చదవటానికి లండన్ వెళ్ళటానికి ఆర్ధిక సాయం కోసం పోర్ బందర్ లోని బ్రిటిష్ అడ్మినిస్ట్రే టర్ మిస్టర్ ఫ్రెడరిక్ లేలీ తో పర్సనల్ ఇంటర్వ్యుకు వెళ్ళాడు .ఆయన అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి  సంతృప్తి పరచలేక తెల్లమొహం వేశాడు .కనుక ప్రభుత్వ సాయం హుళక్కి అయింది .అయితే అన్నగారు లక్ష్మీదాస్ చాలా ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చి స్వాములోరిని లండన్ వోడ ఎక్కించి పంపాడు .బాకీ తీర్చటానికి ఆయన నడ్డి విరిగిందనుకోండి .లండన్ మెట్రిక్ పరీక్ష రెండో ప్రయత్నం లో మాత్రమే పాసయ్యాడు .తన స్వీయ చరిత్రలో తాను లండన్  లింకన్స్ ఇన్ లో  రెగ్యులేషన్ డిన్నర్ లకు  వెళ్లేవాడినని ,చాలా కస్టపడి ఇంగ్లాండ్ కామన్ లామొదలైన నిర్ణయించిన గ్రంధాలను చదివి ,లాపరీక్ష రాసి 18 91 జూన్ 10 న బార్ కు ఆహ్వాని౦పబడ్డానని రాసుకున్నాడు .ఏదో పరీక్ష మిణికి లాయర్ అయ్యాడు అంటే వకీలు వృత్తిలో రాబడి లాకేత్వం దాకు కొమ్ము అయి నిరాశ పరచింది .ఇది కలిసొచ్చేదికాదని వదిలేసి, అసలైన లక్ష్యం భారత దేశ స్వాతంత్ర్యం గా ముందుకు కదిలాడు .కనుక విద్య ,వృత్తిలలో ఆయనవి సగటు తెలివి తేటలే .ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొన్నాడు .’’నేను సగటు తెలివి తేటలమనిషిని సగటు శక్తి సామర్ధ్యాలున్న వాడిని .మేధావిని అసలేకాను .బుద్ధి పెరగటానికి ఒక హద్దు ఉంటుంది .కాని మనసు పెరగటానికి హద్దు ఉండదుకదా ‘’ ‘’అన్నాడు .దక్షిణాఫ్రికా జైలు లో ఇండియా   జైళ్ల లో ఆయన పుస్తకాలను విపరీతంగా అధ్యయనం చేసి జైలు జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు.  ఆయన చదివిన వాటిలో భారతీయ మత ఇతిహాసాలేకాక భగవద్గీత, ఉపనిషత్ లు ,మహాభారతం బైబిల్ కొరాన్ ,లను కూడా చదివాడు .ప్లేటో ,కార్లైల్ ,రస్కిన్,విలియం జేమ్స్ ,గిబ్బన్ ,ఆడం స్మిత్ ,గోథే బకిల్ ,లెక్కి ,జేడ్దేస్ ,షా ,వెల్స్ కిప్లింగ్ ,మార్క్స్ మొదలైన ప్రపంచ ప్రసిద్ధ రచయితల గ్రంథాలన్నీ అవలోడనం చేసుకొని  అర్ధం చేసుకున్నాడు .ఆయనపై గొప్ప ప్రభావం చూపినవారిలో హెన్రి డేవిడ్ థోరో, రస్కిన్, టాల్ స్టాయ్ లు . ‘’బహుళ ప్రజల బహుళ సంతోషం ‘’ఆయన కోరుకున్నాడు . అదేసర్వోదయం. ఆయన ‘’సర్వోదయం ‘’కు పూర్తిగా అంకితమై పని చేశాడు .ఆయనది అసలు సిసలైన స్వంత మనసు .కాని ఆయన రాయని విషయం, వదిలిపెట్టిన సాంఘిక సమస్య లేనే లేవు .అంత విస్తృతంగా రచనలు చేశాడు.గాంధీ రచనాసర్వస్వం 90 సంపుటాలలో ఉంది అంటే ఆయన రచనా సామర్ధ్యమేమిటో అర్ధమవుతుంది .ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్నిభాషల్లోకి అనువాదం చెంది ప్రపంచప్రజలనాకర్షించాయి .మోస్ట్ పాప్యులర్ రైటర్ అయ్యాడు గాంధీజీ .

  ‘’నేను విద్యా సంబంధ రచనలపై పైకి రాలేదు .క్రియా శీలత నా క్షేత్రం ‘’అన్నాడు మహాత్ముడు .మరోమహాత్ముడు బాపూ రావు ఫూలే కూడా ఇదే మాట చెప్పాడని మనకు తెలుసు .ఆయనది విస్తృతమైన కర్మ క్షేత్రం .అందుకే ప్రపంచ ప్రజల నీరాజనాల౦దుకొన్నాడు బాపు .అమెరికా రాయబారి చెస్టర్ బౌల్స్ ‘’ఈభూమిమీద ప్రతిమనిషి గాంధీ ప్రభావానికి లోనైనవారే ‘’అన్నాడు .అందుకే ఐన్ స్టీన్ ‘’ఇలాంటి మనిషి భూమిమీద పుట్టాడంటే భవిషత్ తరాలవారు నమ్మరేమో ‘’అన్నాడు .గాంధీని అజాత శత్రువు అని కొందరంటారు .ఆయనది విజయవంతమైన రహదారి అనీ అంటారు .ఒక్కమాట మాత్రం నిజం .ఈ భూ ప్రపంచం మీద ఏ అధికారం లేకుండా ,ప్రజలచేత అత్యంతం గా ప్రేమి౦పబడినవాడు ,విమర్శలు ఎదుర్కొన్నవాడు ,తన దేశ ప్రజలలో ఒక వర్గం వారి అలక్ష్యం ,ద్వేషాలకు గురైనవాడు గాంధీ మహాత్ముడు తప్ప వేరెవరూ లేనేలేరు అన్నది అక్షర సత్యం .జాత్యహంకారానికి వ్యతిరేకంగా గాంధీ శాంతియుత అహింసా  పోరాట౦ చేసినందుకు  బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను ప్రేమించ లేకపోవచ్చు ద్వేషించింది కూడా  .దక్షిణాఫ్రికాలో గాంధీ విరోధి జనరల్ స్మట్స్ ‘’ఆసియా కాన్సర్’’ తన దేశ రాజకీయ శరీరం లో  నిర్మూలించాలి ‘’అన్నాడు గాంధీని అన్యాపదేశంగా, ఒక్కో సారి సూటిగాకూడా .బ్రిటిష్ ప్రధాని చర్చిల్ మహాత్ముని ‘’ దిగంబర ఫకీర్ ‘’అని ,ఆయన ఆ౦ దోళనకరమైన,భయంకరమైన చీదరపుట్టి౦చేమనిషి’’అని చీదరించాడు అవహేళన చేశాడు .ఇంకోఆకు ఎక్కువ చదివిన లార్డ్ వేవెల్ 19 4 6 లో తన జర్నల్ లో ‘’గాంధీ పైకి కనిపించినంత మంచివాడు కాదు .చాలా చురుకు న్నవాడేకాని  ,మొండిపట్టుదల ,రెండునాలుకల ధోరణి ,సింగిల్ మైండెడ్ రాజకీయనాయకుడు ‘’ ‘’అని రాశాడు .

  విదేశాలలోఏమిటి మనదేశం లోనూ మహాత్ముని వ్యతిరేకించినవారు చాలామందే ఉన్నారు .మహాత్ముని హింద్ స్వరాజ్ అంటే హోమ్ రూల్ ను ఆయన రాజకీయ గురువు గోఖలే తిరస్కరించాడు .అప్పుడు గాంధీకి నమ్మకంగా ఆసరాగా నిలబడింది సర్దార్ పటేల్ జవహర్ లాల్ నెహ్రు .ఆహారపు అలవాట్లు ,సెక్స్ ,ఆధునిక మందులు ,కుటుంబ నియంత్రణ ,బేసిక్ విద్య ,తనభార్యను క్రూరంగా చూడటం వంటి వాటిపై గాంధీపై చాలా విమర్శలున్నాయి .చాందసవాదులు ఆయన హరిజనోద్ధరణను, సెక్యులర్ రాజకీయాలను  పూర్తిగా వ్యతిరేకించారు.జాతీయవాదులు హింస దౌర్జన్యం తోనేస్వరాజ్యం సాధించాలన్నారు .చాలాకాలం ‘’పాకిస్తాన్ ఇస్లాం కు వ్యతిరేకి ‘’అని గాంధీ చెప్పేవాడు .జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని గాంధీ కాదన్నాడు  .ఒక్కో సమయం లో స్వాతంత్ర్య పోరాటం లో గాంధీ పాత్రకు విమర్శలు కూడా వచ్చాయి  .ఇవన్నీ ఆయన్ను కొంచెం చేయటానికి కి౦చపరచటానికి వచ్చినవే అని  చరిత్రకారులన్నారు .

  ఇటీవలికాలం లో కాన్షీ రాం , మాయావతి మొదలైనవాళ్ళు గాంధీని తక్కువ చేసి మాట్లాడారు దళితులను పట్టించుకోలేదన్నారు .ఎవరేమన్నా కోట్లాది సామాన్య భారత ప్రజల తరఫున పోరాడి వారి సాంఘిక ఆర్ధిక ఉన్నతికి ,స్వేచ్చకు కృషి చేసింది గాంధీ మాత్రమే అన్నది తిరుగు లేని సత్యం  . ఆయన ఖచ్చితత్వానికి ప్రాదాన్యమిచ్చాడు .’’నేను మానవమాత్రుడిని మహాత్ముడినికాదు.నేను సత్య శోధకుడిని. వినయమే నాకు ఆభరణం .సత్యాన్వేషికి తన హద్దులు తెలుసు .చేసిన తప్పులు తెలుస్తాయి తప్పు చేశానని చెప్పటానికి నేనేమాత్రం సంకోచించను’’ అన్నాడు .‘’ గాంధీ సెల్ఫ్ మేడ్ మాన్ ‘’. సమస్యా పరిష్కారాలకు ఒకరితో ఒకరు చర్చించుకోవటం తప్పని సరి. తనను విమర్శించేవారితో ఆయన విభే దించలేదు తనవాదన వారికి నచ్చేట్లు చేసేవాడు .ఒకవేళ తాను ఆలోచించింది సరైనదికాదని వారు నిరూపిస్తే తప్పక పధ్ధతి మార్చుకోనేవాడు  అడ్జస్ట్ మెంటాలిటి ఉన్నవాడు .19 42ఆగస్ట్ 8  క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 13 మంది కమ్యూనిస్ట్ సభ్యులను ఆయన తూలనాడలేదు. పైపెచ్చు నిశ్చయం పై వారి కున్న ధైర్యాన్ని దాన్ని ప్రకటించిన తీరును ,అభినందించాడు ఇలాంటివి మహాత్ముని జీవితం లో కోకొల్లలు

ఆధారం –శ్రీ మైనేని వారుపంపిన డా .ఎస్. యెన్ .దాత్యే .సంకలనం చేసిన ‘’రీదిన్కింగ్ మహాత్మా గాంధి ‘’

   సశేషం

గాంధీ ,లాల్ బహదూర్ జయంతి శుభాకాంక్షలతో

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-18 –ఉయ్యూరు  

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-5(చివరిభాగం )

 ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-5(చివరిభాగం )

 ఇంతకీ గాంధీగారి మత౦ ఏమిటి ?మానవ సహజ మూల కార్యక్రమాలలో మతం విడదీయ రానిది .దీనితో ఇతర మానక సంబంధ కార్యాలు మూల స్థానంగా ముడివడి ఉంటాయి .నైతికత ,కళ,సైన్స్ ,సాంకేతికత మొదలైన వాటితో మనిషి ప్రకృతిని నియంత్రణలోకి తెచ్చుకున్నాడు .మానవ జీవితాలలో ప్రకృతి మూలాధార భూతం .మతాన్ని నిర్వచించటం కష్టం .అది పూర్తిగా నమ్మకానికి, సాధనకు సంబంధించిన విషయం .కనుక మతం లో నమ్మకాలు సాధానాలు కలిసి ఉంటాయి .వీటిద్వారా మానవుని ఉనికికి సార్ధకత ,తుది గమ్యమేమిటో తెలుసుకోమని చెబుతుంది మతం  .ఇలా వ్యక్తిగతంగానేకాక సామూహిక౦ గా ఆలోచించి అభ్యాసం చేయటం మతం నేర్పుతుంది .’’పరమం’’ తో అనుసంధానం చేయిస్తుంది .సత్యం ,సుందరం ,మంచితనం అనేవే పరమమైన విషయాలు .బాపుకు ఆయన  కుటుంబ సంప్రదాయాలనుంచి మతం  పై గాఢ విశ్వాసం సంక్రమించింది .మతం ,నైతికతలపై ఆయన విస్తృతంగా మాట్లాడాడు, రాశాడు  .రాజకీయ వేషం లో  ఉన్నా, మతం  అనేది గాంధీకి జీవిత విధానం లో అంతర్భాగమైంది .

   సంఘర్షణ ,వివాదాలలో గాంధీ పరిష్కారాలేమిటి ?అనేది అందరూ అడిగే సూటి ప్రశ్న .సకల మానవ సంక్షేమం ,దాని సాధనలో పండి పోయిన అత్యంత ప్రపంచంప్రసిద్ధ అతి కొద్ది  ముఖ్య నాయకులలో మహాత్ముడు ఒకడు . వీరితో పాటు గాంధీజీ ఒక ఉన్నత పౌరసమాజ నిర్మాణ ధ్యేయం  ఆయన గొప్పకల.అదే ఆయన ప్రవచించిన ‘’రామరాజ్యం ‘’రామరాజ్యం సాధిస్తే అందులో అతి నిమ్న జాతివారు ,అత్యంత బలహీనులు ప్రాధమిక హక్కులు పొంది ,గౌరవంగా సుఖంగా జీవిస్తారని విశ్వసించాడు .దీన్ని సాధించటానికి అనుసరించాల్సిన విధానాలు ,మార్గాలలో గాంధీకి ,మిగిలిన ప్రపంచనాయకులకు భేదాభిప్రాయం ఉన్నది. .మహాత్ముని దృష్టి లో సాధనామార్గాలు ,గమ్యం రెండూ చాలాముఖ్యమైనవే .అనైతిక మార్గాలు మంచి ఫలితాలనెప్పుడూ సాధించలేదు .అందరూ చెప్పే ‘’గమ్యమే సాధనానికి తీర్పరి ‘’(ఎండ్ జస్టి ఫైస్ మీన్స్ ) అనే మాట ఆయన అంగీకరించలేదు .గమ్యంచేరటానికి సత్యం ,నిజాయితీ ,నైతికతతో కూడిన ముఖ్య సాధనాన్ని ఎంచుకోవాలి .అడ్డ దారి చేటు .సత్యం ద్వారా శాంతి స్థాపించాలి .హింస మరింత హింసకు మూలమౌతుంది .కూకటి వ్రేళ్ళతో భారత దేశం లో పాతుకుపోయిన తెల్ల దొరల పాలన నుండి దేశమాత విముక్తి చెంది స్వేచ్చా వాయువులు పీలుస్తూ స్వాతంత్ర్యం పొందటానికి , కష్టతరమైన నైతిక మార్గాన్నే ఎంచుకున్నాడు  .అగౌరవ, అనైతిక మార్గాలు చేటు కలిగిస్తాయన్న పరి పూర్ణ విశ్వాసం ఆ అహింసా మూర్తిది .దౌర్జన్య౦ , హింసావాదుల పద్ధతిని వదలి ,శాంత్యహి౦సలతో ‘’నిష్క్రియాత్మక నిరోధత ‘’అంటే పాసివ్ రెసిస్టన్స్ అనగా సత్యాగ్రహ మార్గాన్నే ఉత్తమ సాధనంగా ఎంచుకున్నాడు .దీనితోనే తెల్లదొరలను దేశం వెలుపలకు తరిమి  కొట్టగలిగాడు శాంతితోనే జగజ్జెట్టి అని పించుకున్నాడు .సత్యాగ్రహం లో పాల్గొన్నవారందరూ లాభపడ్డారు .క్లిష్ట పరిస్థితి లో కూడా సత్యాగ్రహి నిగ్రహాన్ని గౌరవాన్ని కోల్పోలేదు .మహాత్ముని సత్యాగ్రహ విధానం యుద్ధానికి ప్రత్యామ్నాయం .ఆయన చెప్పిన సహాయ నిరాకరణ సంఘర్షణ కు సరైన శాంతియుత పరిష్కారం .హింసతో ప్రజ్వరిల్లుతున్నప్రపంచం లో ప్రజలు శాంతి ,ప్రశా౦తులతో  జీవిస్తూ ,పరస్పర సహకారం సామరస్యం తో ఎలా జీవించాలో ,కలిసిపని చేయాలో బోదించాడు .ఆచరించి ప్రజలు ఆయననమ్మకాన్ని నిలబెట్టారు .’’యధాగా౦ధీ తధా ప్రజా ‘’అని పించుకున్నారు . అత్యవసరంగా ఫలితాలు , తాత్కాలిక ప్రయోజనాలు  రావాలని ఆయన ఆశించలేదు .మానవాళి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే కృషి చేశాడు .నిత్యకలహాలు ,ద్వేషాలతో సంక్లిష్టంగా పెచ్చుపెరిగిన ప్రపంచాన్ని  మానవాళి ఎలా ఎదుర్కోవాలో ఆయన ప్రవచించాడు .దీనికి కూడా ఆయనది ఆహి౦సా వాదమే  ,సత్యాగ్రహమే  సాధనాలు గా చెప్పాడు .కనుక ప్రపంచ వ్యాప్తంగా ఏ సమస్యకైనా పరిష్కారం అహింసాయుత ఆందోళన సత్యాగ్రహాలే అని తిరుగు లేని తీర్పు చెప్పాడు .నెల్సన్ మండేలా ,మార్టిన్  లూధర్ కింగ్ ,ఆన్సాంగ్ సూయీ  లకు ప్రేరణగా నిలిచి వారి దేశాలలో హక్కుల సాధనకు ,స్వేచ్చకు పరోక్షంగా దోహద పడ్డాడు .

   మానవ సంరక్షణ లో మాహాత్ముని దృష్టి కోణం విశిష్టమైంది .నాగరకత అంటే నిజంగా అన్నీ అనేక రకాల పెరగటం మాత్రమే కాదు .జాగ్రత్తగా ఉద్దేశ్యపూర్వకంగా స్వచ్చందంగా కోరికలు తగ్గించుకోవటం .దాని వలననే అసలైన సంతోషం మనశ్శాంతి,  సంతృప్తి లభి౦చి సేవా ధర్మ౦లోశక్తి సామర్ధ్యాలు కలుగుతాయి .మానవ సంరక్షణ ఒక వినూత్న కీలక భావం (కాన్సెప్ట్ ).ఇప్పుడు అది విశ్వ వ్యాప్తంగా వ్యక్తికి ఉన్న  సంక్లిష్ట, పరస్పర సంబంధమున్న భయం ఆందోళనలను వివరి౦చటానికి తోడ్పడుతుంది .మానవ సంరక్షణ సిద్ధాంత కర్తలు సంప్రదాయంగా ఉన్న రక్షణ అనే భావాన్ని సవాలు చేస్తున్నారు .వీరి దృక్పధం లో సరైన సంరక్షణ  రాజ్యానికి కాకుండా వ్యక్తిగతమైంది గా  తప్పక కావాలి .దేశ సంరక్షణ అంటే ప్రజా సంరక్షణమే ..గత వందేళ్ళలో ఆయా దేశ ప్రభుత్వాలు వారి ప్రజలను  విదేశీ సైన్యం కంటే అతిపెద్ద సంఖ్య లో హతమార్చాయి .1994 నాటి యు. యెన్ .డి .పి . అంటే అంతర్జాతీయ అభివృద్ధి ప్రోగ్రాం రిపోర్ట్  మానవ రక్షణకు గొప్ప మైలురాయిగా నిలిచింది .అందులో ‘’కోరిక నుండి ,భయం నుండి ప్రజలందరకు స్వేచ్చకల్పించటమే ప్రపంచ మానవ సంరక్షణ సమస్యకు మేలైన మార్గం’’ అని ధృవీకరించింది .

  21 వ శతాబ్దిలో గాంధీయిజం ఔచిత్యం గురించి కూడా విశ్లేషకులు పలుకోణాలలో అధ్యయనం చేశారు .గాంధి మరణించి ఉండవచ్చు .గా౦ధీయిజానికి మరణం లేదు అది అమర౦, శాశ్వతం అన్నారు .గాంధీయిజం మనదేశం లో మాత్రమేకాదు ప్రపంచంలో  జీవించే ఉంది ..గాంధీజీ ప్రవచించిన అహింస ,సత్యాగ్రహం ,అంతిమ సంబంధం (ఎండ్ మీన్ రిలేషన్ షిప్ ),సర్వోదయం ,విద్య ,సాంఘిక సంస్కరణలు ,జాతీయత ,,అంతర్జాతీయత మొదలైనవన్నీ నేటి అధునాతన ప్రపంచం సమాజం  లోనూ గొప్ప ఔచిత్యవంతంగానే ఉండటం ఆమహాత్మునికి ,ఆమహర్షికి దక్కిన అరుదైన గౌరవం ..మహాత్ముడు ఎన్నడూ తన సిద్ధాంతాలను ఇజం పేరిట చెప్పనే లేదు. వాటిని జీవన మార్గాలుగా అనుస్టించాడు .గా౦ధీ ఇజమ్ఆధునిక యుగం లో  చాలాగొప్ప భావజాలం(ఐడియాలజీ ). గా౦ధీ ఇజమ్  మన ఆధునిక రాజకీయ ,సాంఘిక సమస్యలపరిష్కారాలకు  సంప్రదాయ  సూత్ర ,సంస్కృతీ సాంఘికబద్ధ  జీవిత  సూత్రాలనాధారంగా  మార్గ దర్శకం చేస్తుంది .అది ఆధ్యాత్మిక నైతిక  మూలాలపై వర్ధిల్లింది . ఈ నాటి ప్రతి దిన సమస్యలన్నిటికీ గాంధీయిజం సరైన పరిష్కారం సమాధానం చెప్పగలదు.అసమానత  , అస్పృశ్యత, సంకుచిత జాతీయత ,ఆవేశ కావేషాలకు చక్కని పరిష్కారాలు సూచించి మార్గ దర్శకం చేస్తుంది. అందులో ఆధునిక పౌర సమాజ భావన పొందు పరచబడింది .గాంధీ ఇజం  సాంఘిక సంక్షేమ తత్వాన్నివిస్పష్టంగా, బే షరతుగా సమర్ధిస్తుంది .కనుక  గాంధీ ఇజమ్ సార్వకాలికం  సార్వ జనీనం అని అర్ధమయి౦ది కదా..

   ‘’అహింసాయుత ప్రతిఘటన సామ్రాట్ ‘’గా మహాత్మా గాంధీ సుప్రసిద్ధుడు .ఆధునికకాలం లోఅహి౦సా మూర్తులుగా ప్రపంచ గుర్తింపు పొందిన ఇద్దరిలో మహాత్మా గాంధీ మార్టిన్ లూధర్ కింగ్ మాత్రమే నిలిచారు .వీరిద్దరూ అన్యాయం ,జాతి వివక్షత ,పేదలపై దౌర్జన్యాలు అల్పసంఖ్యాక వర్గాల సాంఘిక  బహిష్కరణ లను రూపు మాపటానికి అహింస ఆయుధంగా  పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు  నిర్వహించారు.నిజానికి గాంధీజీ  దేశ స్వేచ్చ స్వాతంత్ర్యాలకోసం బ్రిటిష్ వారిని తరిమి కొట్టటానికి అహింసా యుతంగా  ఉద్యమించాడు .అమెరికా పౌరహక్కుల నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ నల్లజాతివారి హక్కులకోసం ,న్యాయ సంస్కరణలకోసం గాంధీయిజం ఆధారంగా అహింసా పద్ధతిలో నిరసన ,భారీ ప్రజా సమీకరణ తో ఉద్యమాలు చేసి విజయం సాధించాడు . సాంఘిక మార్పులు రావాలంటే అహింసా మార్గమే సరైనదని ఈ ఇద్దరు నాయకులు విశ్వసించి అమలు చేశారు .మనసు చిత్తశుద్ధి  ఉంటే ,ఎవరైనా ఈమార్గాన అనుకొన్నది సాధించవచ్చునని  రుజువు  చేశారు .వీరిద్దరికీ ఆహి౦స ఒక సాధనమార్గం .దీనివల్లనే బాంధవ్యాలు బలపడి ,శాంతియుతంగా అధికార మార్పిడి ని ఈ ఇద్దరు మహానాయకులు సాధించారు . అహింస విశ్వజనీనమైన, స్థిరమైన,  నమ్మకమైన,గొప్ప  సిద్ధాంతం అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు . కనుక గా౦ధీయిజానికి ఎన్నటికీ మరణం లేదు . గాంధీ ,గాంధీ ఇజం చిరంజీవులే .

  మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా రాసిన ఈ చిరు ధారావాహిక సమాప్తం

ఈ చిరు ధారావాహిక కు నేపధ్యం ,ప్రేరణ ,ఆధారం –

8-8-18 శనివారం మేము ఖమ్మం వెడుతూ దారిలో విజయవాడలో డా జి.వి పూర్ణచంద్ గారిని వారింట్లో పరామర్శించినప్పుడు,మాటల సందర్భం లో  ఆయన ‘’మాస్టారూ! గాంధీజీ 150 వ  జయంతిసందర్భంగా మీరేదైనారాస్తే బాగుంటుంది ‘’అన్నారు ..’’ఏం రాయమంటారు “’అని అడిగాను .’’గాంధీ-21 వ శతాబ్ది ‘’పై రాయండి యాప్ట్ గా, రిలవెంట్ గా ఉంటుంది ‘’అన్నారు .’’సరే ‘’అన్నాను  .రాత్రి ఇంటికి చేరి శ్రీమైనేని గోపాల కృష్ణగారికి ఈ విషయం మెయిల్ రాసి, దానికి సంబంధి౦చిన  పుస్తకం ఉందేమో చూడమనికోరాను .ఆయనలో ‘’హనుమంతుని అంశ ఎక్కువేమో! చూచిరమ్మంటే కాల్చి వచ్చేరకం .ఆ రాత్రికే అమెజాన్ లో పుస్తక౦ ఆర్డర్  చేయటం, వాళ్ళు అక్టోబర్ 3 కు పుస్తకం చేరుతుందని తెలియ జేయటం జరిగిపోయాయి నిమిషాలమీద .ఇలా ఈ సారే కాదు ఎన్నో సార్లు అంటే’’ ఎన్త్ టైం ‘’అన్నమాట . Relevance of Gandhi in 21 st Century ‘’అనే పుస్తకం ,’’Gandhian Ideas On Edcation అనే రెండు పుస్తకాలు 21 సెప్టెంబర్ కు నాకు చేరాయి .మొదటిదాన్ని ఆ రోజే చదవటం మొదలుపెట్టి ఇంట్ర డక్షన్ చాప్టర్ ముందు చదివాను .ఇందులోనే గాంధియన్ ఫిలాసఫీ అంతా విస్పష్టంగా ఉంది .వెంటనే రాయాలనిపించి ఒక పేరా రాశాక నాకే నచ్చక తీసేశాను .ఈ లోగా గాంధీపై రేడియో టాక్ రావటం ,దానిపై రెండు రోజులు కూర్చోవటం, తర్వాత ఆహితాగ్నులు, రావూరు, ధనికొండ లపై రాయటం మైనేనిగారు పంపిన గాంధీపై వ్యాసాన్ని రాయటం  తో సరిపోయిది .అయ్యో గాంధీ  జయంతి దగ్గర పడుతోందే ఆయనపై రాయక పొతే బాగుండదు అనిపించి  శీర్షిక కోసం బుర్ర బద్దలు కొట్టుకొని చివరికి’’ పై శీర్షిక’’ ఖాయం చేసి సెప్టెంబర్ 29 న రాయటం మొదలు పెట్టి ,మూడు రోజులలో ఈ రోజు అక్టోబర్ 1 తో 5 ఎపిసోడ్ లు రాసిపూర్తి  చేసి , ఊపిరి పీల్చుకున్నాను .రేపు గాంధీ జయంతి సందర్భంగా నూలువడికి ఆయనకో నూలు పోగు వేయలేకపోయినా ,శ్రీ ఆశుతోష్ పాండే సంకలించిన పై పుస్తకం లోని విషయాలను పేని ఒక సాహితీ పోగు తయారు చేసి మహాత్మునికి నివాళిగా సమర్పించి కృతార్దుడనయ్యాను .నేను అడగకపోయినా మూడవ పుస్తకం గా ‘’Rethinking Mahatma Gadhi –Relevance of Gandhian Thought and Leadership in 21 st Century ‘’మైనేనిగారు పంపినది ఈరోజే నాకరకమలాలను అలంకరించింది .శ్రీ గోపాలకృష్ణగారు ఇప్పటికే నన్ను చాలా రుణ గ్రస్తుడిని చేశారు .వీటితో మరింత రుణాన్ని పెంచారు .

  నన్ను రాయమని ప్రేరేపించిన శ్రీ పూర్ణ చ౦ద్ గారికి ,,నాచేతికి మట్టి అంటకుండా పుస్తకం కొని పంపిన శ్రీ గోపాలకృష్ణ గారి సౌజన్యానికి ధన్యవాదాలు .ఈ రచనకు ఆధారం ‘’  గాంధీ సిద్ధాంతాలపై నిష్ణాతులైన పలువురు రచయితలతో విషయానికి సంబంధిన నిర్దుష్టమైన వ్యాసాలు  రాయించి,సంపాదకత్వం వహించి  సంకలనం చేసి  శ్రీ ఆశుతోష్ పాండే ప్రచురించిన ‘’  Relevance of Gandhi in 21 st Century ‘’పుస్తకం అని మరొకమారు తెలియ జేస్తున్నాను .

  2-10-18 మంగళవారం గాంధీ జయంతి శుభా కాంక్షలతో

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ .1-10-18 –ఉయ్యూరు     …  . . .  .

Posted in రచనలు | Tagged | Leave a comment

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-4

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-4

మహాత్మా గాంధీ  ‘’స్త్రీవాద వ్యూహం ‘’చెప్పాడు .అదే సత్యాగ్రహం .మహిళలకు వారి మేధకు  సరిగ్గా సరిపోయే స్ట్రాటజి ఇది .పురుషులకంటే స్త్రీలే అహింసా సిద్ధాంతాన్ని అర్ధం చేసుకొని బాగా వివరించి ప్రచారం చేయగల సత్తా ఉన్నవారని  నమ్మాడు..స్త్రీలు బలహీనులవటం వలన వారికి ఈ బాధ్యత అప్పగించలేదు. వారిలో సమర్ధత ,  ధైర్యం ,త్యాగ గుణం ఎక్కువ అని బాధ్యత అప్పగించాడు. అవతలివారిని ఒప్పించే నేర్పు కూడా మగవారికంటే స్త్రీలకే ఎక్కువ అని గ్రహించాడు .తన నమ్మకాన్ని మరొకసారి ప్రకటిస్తూ ‘’మనం అబలలు అని పిలిచే మహిళలు సబలలు ఐనప్పుడు ,నిస్సహాయ స్థితి లో ఉన్న వారందరూ దుర్గా దేవిలాగా మహా శక్తి సంపన్నులౌతారు’’అన్నాడు బాపూజీ .

  పురుషులతో పాటు మహిళలూ సమానమే అన్న గాంధీ సిద్ధాంతాన్ని గురించి ఆలోచిద్దాం .దీనినే  ‘’సమతాదర్శనం ‘’అన్నాడు ,జైనమత ప్రవక్త వర్ధమాన మహావీరుడు .’’అన్నిఆత్మలూ   శక్తి సంపన్నమైనవే .ఆత్మ దర్శనానికి, ఆత్మోన్నతికి అందరూ అర్హులే .నిర్వాణానికి పురుషులతోపాటు  స్త్రీలూ అర్హులే ‘’అని మహావీరుని మహా బోధ .సమానత్వం అనేది మనసా వాచా కర్మణా జరగాలి . మహా వీరుని ఈ భావం గాంధీ మనసుకు బాగా హత్తుకున్నది .మహావీరుని ప్రేరణే, గాంధీ మహిళా సమానత్వం .చిన్ననాటినుండి గాంధీజీ  మహావీర బోధలు విని అర్ధం చేసుకున్నాడు .ఆయనభావాలకు తనదైన భావ పుస్టి  కలిగించి కాలానుగుణ౦ గా తన జీవితాన్ని తీర్చి దిద్దుకొని  నడిచాడు .మహాత్ముని సమానత్వ సిద్ధాంతం- సంరక్షణ ,అస్పృశ్యత నిర్మూలన ,స్త్రీ పురుషుల సమానత్వం .‘’స్త్రీ పురుషునికి తోడు పురుషునితోపాటు సరిసమాన మానసిక, బౌద్ధిక శక్తి కలది ‘’అని అర్ధం చెప్పాడు .పురుషుని అన్ని పనులకు ఆమె తోడూనీడగా వ్యవహరిస్తుంది  .అందుకే అతనితోపాటు ఆమెకు స్వేచ్చ ,స్వాతంత్ర్యం తప్పని సరి .మహా వీరుడు జైన  సంఘం లో స్త్రీలకు ప్రవేశం కల్పించి , ఎలాంటి స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఇచ్చాడో మహాత్ముడు కూడా అలాగే చేశాడు .మహావీరుని దృష్టిలో స్త్రీ పురుషులు ఆధ్యాత్మిక, ఆత్మ భావనలో సరిసమానులు  . ఈ ప్రపంచాన్ని త్యాగం చేసి ,సన్యసించి నిర్వాణం పొందటానికి స్త్రీ పురుషులిద్దరూ అర్హులే అన్నాడు .ప్రతి జీవికి ఆత్మ ఉంటుందని బోధించాడు .

   పర్యావరణ పరిరక్షణలో గాంధీ గారి పరికరాలేమిటి అని ఆలోచిద్దాం .పర్యావరణ క్షీణత జీవుల ఉనికికే మహా ప్రమాదంగా ఉంది .అజ్ఞాన జ్ఞానాభివృద్ధి భూగోళాన్ని ప్రమాదం అంచుకు నెట్టేసింది .మానవ సుఖ,విలాసాలకోసం   ప్రకృతిని పీల్చి పిప్పి చేస్తున్నారు .దీనివలన వినిమయతత్వం (కన్సూమరిజం )విపరీతంగా పెరిగి ,జీవ వైవిధ్యనష్టం ,భూతాపం(గ్లోబల్ వార్మింగ్ ) పెరగటం ,సహజవనరుల క్షీణత, వివిధ విదాల కాలుష్య౦  పెరగటం మొదలైన తీవ్ర సమస్యలు చుట్టు  ముట్టాయి .వీటివలన ప్రపంచ పతనం (గోబల్ కొలాప్స్ )జరిగే ప్రమాదముందని భీతి చెందుతున్నారు .మానవ మేధ పెరిగి, పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక విప్లవం రావటం తో, భౌతికత పై వ్యామోహం పెరిగి, జీవిత విధానం లో పెనుమార్పులు కలిగాయి .దీనికి గాంధీ జీ ఉపయోగించిన విలక్షణమైనవిధానాలు ,పరికరాలే పరిష్కారం .’’పాశ్చాత్య నాగరకత ఏడురోజుల అద్భుతం మాత్రమే .కనుక ప్రకృతి తో  సహజీవనం తో ,,ఆధ్యాత్మిక భావాలతో జీవిత శైలిని నిర్మించుకోవాలి ‘’అని గాంధీ అప్పుడే చెప్పాడు .మన మైండ్ సెట్ మారాలంటే గాంధియన్ స్పిరిట్ మాత్రమే శరణ్యం .లేకపోతె మనం కూర్చున్న కొమ్మను నరుక్కునే బుద్ధిహీనులమై ,కాలుష్యం కోరల్లో చిక్కుకున్న వెర్రి వాళ్ళమై భూమాతకు తీరని ద్రోహం చేసే వాళ్ళుగా చరిత్ర హీనులమైపోతాం .తస్మాత్ జాగ్రత జాగ్రత .

  భారతదేశం ,శాంతి అవినాభావ సంబంధమున్న విషయాలు .మహాత్ముడు  ఇండియాలో బ్రిటిష్ పాలన అంతమొందటానికి చేసిన సత్యాగ్రహ,సహాయనిరాకరణ, క్విట్ ఇండియామొదలైన ఉద్యమాలన్నీ అహింసా యుతంగా జరిగి, విజయం సాధించి భారత దేశ౦  స్వాతంత్ర్య౦ పొందటానికి  దోహద పడినవే.దక్షిణాఫ్రికాలో ప్రారంభించి 1915 జనవరిలో  భారత దేశానికి వచ్చి ,జాత్యహంకార కాలనీ కోరలున్న తెల్లవారి పాలనపై పూరించిన పర్జన్య శంఖా రావాలే .గాంధీ రాకతో ఉద్యమాలకు జవ జీవాలొచ్చాయి .ఉత్సాహం కట్టలు తెంచుకొన్నది .ఐక్యత ఏర్పడింది. కలిసికట్టుగా కాలనీ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టాలనీ , స్వేచ్చాభారతమే అందరి లక్ష్యమని భావన బలీయమైంది .1920 నుండి 1947 వరకు అవిశ్రాంతంగా బాపు నాయకత్వం లో కోట్లాది భారతీయ స్త్రీ, పురుషులు ఆయన వెంటనడిచారు .రాజకీయ స్వాతంత్ర్యం కోసమేకాదు. అణగ ద్రోక్కబడిన  దిక్కు మొక్కూలేని  అసలు తమకు హక్కులు౦ టాయన్న విషయంకూడా  తెలియని  అమాయక అస్పృశ్యుల హక్కు, విధుల కోసం ఆయన పోరాడి విజయం సాధించాడు .వారిని ‘’హరిజనులు ‘’అనే గౌరవనామం తో పిలిచి దేవాలయ ప్రవేశం కల్పించటం తో  వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోయాడు . ఆయన సాధించిన అద్భుత విజయం నిజంగా’’ యైత్  వండర్’’.వీరందరూ స్వాతంత్ర పోరాటం లో ఆయుధాలు లేని పోరాట యోధులై గాంధీకి అండగా నిలిచారు .ఆసేతు హిమాచలపర్యంతం గాంధీ మాట వేదవాక్కు .గాంధీ వాక్కు మంత్రమే అయింది .భారత దేశ చరిత్రలో అత్యంత ప్రజా నాయకుడు –మాస్ లీడర్ అనిపించాడు మహాత్ముడు .ఆయన ఆదర్శ త్యాగమయ జీవితం కోట్లాది మంది భారతీయులకు కదిలించి నడిపించింది .అందరి కోరిక అయిన స్వాతంత్ర్యం సిద్ధించింది .సాంఘిక అసమానతలు ,లైంగిక వివక్ష లకు చరమగీతం పాడటానికి పని చేసింది .

మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా ఈ చిరు ధారావాహిక

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-10-18-ఉయ్యూరు   ,

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-2

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-2

    మహాత్ముని ఆధ్వర్యం లో జరిగిన స్వాతంత్ర్య పోరాట ఫలితంగా మనకు బ్రిటిష్ దాస్యం నుండి విముక్తికలిగి 1947 ఆగస్ట్ 15  స్వాతంత్ర్యం లభించింది .దీనితో భారతదేశం లోని మధ్యతరగతి వారికి పాలనా భాగ్యం కలిగింది .స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపిన కాంగ్రెస్ కేంద్రం లో అధికార పగ్గాలు చేబట్టి౦ది .పరిపాలనలో వచ్చిన మార్పు పై అంతస్తులోనే జరిగింది తప్ప, ,క్రింది తరగతి ప్రజల ఆర్ధిక సాంఘికవ్యవస్థలో గణనీయ మైన మార్పు రాలేదు .చేతిలో ఖడ్గం పట్టిన వారు మారారు కాని ,దిగువ వర్గాల సామాన్యప్రజల జీవన పరిస్థితులలో మార్పు మాత్ర౦, రాలేదు .కాని వారి అదృష్టాన్ని మార్చే అవకాశమున్న జాతీయ ప్రభుత్వం ఏర్పడింది ఇదొక్కటే ఊరట . సామాన్య ప్రజలు కొత్త జాతీయ నాయకత్వాన్ని గట్టిగా నమ్మారు .తమ ,దేశ స్వాతంత్ర్యం కోసం శ్రమించి ,సిద్ధి౦పజేసిన  ఈ నాయకులు ,ఇప్పుడు తమ ఆర్ధిక సామాజికాభివృద్ధికోసం అహరహం కృషి చేస్తారని విశ్వసించారు .దేశ విభజన తర్వాత జరిగిన హింస తప్ప ,భారత దేశం స్వాతంత్ర్యాన్ని బ్రిటిష్ పాలకులనుండి చాలా ప్రశాంతంగా,సులంభంగా సరళంగా నే పొంది  విదేశీ పాలన నుండి స్వదేశీ పాలన సాధించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు . దురదృష్ట వశాత్తు పాలనా పరమైన ఈ మార్పు  సాంఘిక  విప్లవానికి ఉత్రేరణ కాలేక పోయింది .కాలనీ వాసుల కబంధ హస్తాలనుండి విడివడిన స్వతంత్ర భారత దేశం, సర్వ శక్తి యుక్తులు ధారపోసి ఎంతో శ్రమిస్తేనే సంపూర్ణ సామాజిక ఆర్ధిక మార్పులు సాధించటానికి  అర్ధ శతాబ్ది కి పైగా సుదీర్ఘ  కాలం పట్టింది .ఇప్పుడిప్పుడే అట్టడుగున కొద్దిగా మార్పులు చిగురులు వేస్తూ కనిపిస్తున్నాయి  .

  ఇవాల్టి ప్రపంచం లో పర్యావరణ పరిరక్షణ పెద్ద సవాలుగా నిలిచింది .అభి వృద్ధి చెందినా ,చెందుతున్న దేశాలన్నీ ఈసమస్య పైనే దృష్టి పెట్టాయి .ఇప్పుడే కళ్ళు తెరిచిన వారందరికీ ,ఒక విషయం తెలియదు .దాదాపు వందేళ్ళ క్రితమే గాంధీజీ దీనిపై ఎన్నో వ్యాసాలు  రాశాడు .అయినా ఇప్పటికీ అకాడెమిక్ క్షేత్రం లో ‘’గాంధీ ఇంకా అవసరమా ,ఆయన స్మరణ ఔచిత్యమా ?’’ అనే ప్రశ్న వినిపిస్తోంది.మహాత్ముడు రాసిన వ్యాసాలు , ఉత్తరాలు, చేసిన ప్రసంగాలు పరిశీలిస్తే బాపు కు  ఎంతటి దూర దృష్టి ఉందో అర్ధమై ,ఆశ్చర్యపోతాం .అనేక సందర్భాలలో గాంధీజీ జల, వాయు కాలుష్యాలు ,రోగాలు, ఆరోగ్యం ,వృక్ష రక్షణ ,చెత్త రీ సైక్లింగ్  విషయయాలు  ప్రస్తావించాడు .  నదులలోకి వ్యర్ధపదార్ధాలను విడుదల చేయటం పై ఆందోళన చెంది, వాటివలన స్వచ్చమైన నదీ జలం కల్మషమై ,అంటు వ్యాధులు ప్రబలి ప్రజారోగ్యం దెబ్బ తింటుందని పదేపదే చెప్పాడు .ఈ ‘’వ్యర్ధాలు అనర్ధాలకు నిధి’’ అని బాధపడ్డాడు .వీటినన్నిటినీ అధిగమిస్తూ జాతీయ ఆదాయం పెంచుకొంటూ ,ఆర్ధిక సంక్షేమం కోసం రెండు దశాబ్దాల క్రిందటమాత్రమే ముందడుగులు పడ్డాయి  ,  సాధించాల్సింది  చాలాఉంది .కనుక గాంధీ గొప్ప ‘విజనరీ’’ అని అర్ధమౌతోంది .

   ఎన్నో శతాబ్దాల నుండి  భారత దేశం  ప్రపంచ౦ లో ముఖ్య ఆకర్షణ  కేంద్రంగా ఉన్నది .భారతీయ విజ్ఞానం ,ఆధ్యాత్మికత, సంస్కృతీ ,నైతిక విలువలు ,సౌభాగ్యం ,ప్రజాజీవన విధానమైన నాగరకత ప్రపంచ దేశాలపై గొప్ప ప్రభావం కలిగించి చెరగని ముద్ర వేశాయి..మహాత్ముడు అహింసకు కొత్త అర్ధాన్నీ ,పరమార్దాన్నీ చెప్పాడు .అత్యున్నతమైన సాధారణ, శాశ్వత  విలువలను ఆచరించి మార్గ దర్శనం చేశాడు .ఆయన జీవితకాలం లో మహాత్ముడు భారతీయ సంస్కృతికి, ఆత్మకు అసలైన ప్రతీకగా,  కేంద్రంగా నిలిచాడు .పరస్పర సహకారం , అభివృద్ధి లో అందరిసహకారం ,అందరి ఐక్యత, అవతలివారి విశ్వాసాలపట్ల గౌరవం అన్నీ కలిస్తే గాంధీ ఫిలాసఫీ .ఆధునిక కార్పోరేట్ వ్యవస్థ లో ఒంటరి తనానికి చోటు లేదు .సమస్టి విధానమే శ్రేష్టం . ఎవరు ఉత్పత్తి చేసే వస్తువులు వారికే కాదు ,ఉత్పత్తిలో భాగస్వామ్యం లేకపోయినా ప్రపంచ ప్రజల౦ద రివి. ఒక వ్యవస్థ ,సంస్థ విజయం సమాజం  ఆమోదం ,అనుమతి పైనే ఆధారపడి ఉంటుంది .సమాజం ఆమోదించని ఏ వ్యాపారమూ మనుగడ  సాగించలేదు .వ్యాపారానికి ,సమాజానికి ఆరోగ్య పూర్వక అనుబంధం ఉండాలి .సమాజానికి నష్టం కలిగించే ,వారి మనోబావాలను దెబ్బతీసే వ్యాపారం ఏదీ నిలబడదు నిలబడ నివ్వ రాదుకూడా . విలువలు కూడా వ్యాపార, వాణిజ్యాలలో ముఖ్య పాత్ర వహిస్తాయి .బాపు ప్రవచించింది గుణాలైన ఈ విలువలనే . కనుక వీటికి కాల దోషం పట్టదుకదా .

మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా ఈ చిరు ధారావాహిక

సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-1

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-1

‘’అవును ఖచ్చితంగా ఉంది ‘’అంటున్నారు విశ్లేషకులు వివేక శీలురు .గాంధీ బహుపార్శ్వా  లున్న వ్యక్తి ,మనీషి .అంతటి మహోన్నతుని ఇప్పుడే కాదు ఎప్పటికీ విస్మరించలేము .తనజీవితం లో 40 ఏళ్ళు అహింసా  సిద్ధాంతానికి అ౦కిత మైనవాడు .మత ,రాజకీయ, సాంఘిక, నైతిక  ఆర్ధిక క్షేత్రాలపై తనదైన శాశ్వత ముద్ర వేసినవాడు .దేశ ,కాలాతీత సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నవాడు .సత్యం, అహింస, నైతికతలను తనపై ప్రయోగించుకొని నిగ్గు తేల్చిన అంతర్ దృష్టి ఉన్న మహాత్ముడు .అప్పటి ఆయన పరిష్కారాలు ఇప్పటికీ ఆచరణీయాలే  .1915 లో గాంధీ దక్షిణాఫ్రికానుంచి తిరిగి భారత్ చేరగానే ఆయన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే  దేశమంతా తిరిగి వాస్తవ పరిస్థితులు గమనించి ప్రజలనాడి తెలుసుకోమని ఆదేశించాడు .అలాగే చేస్తూ,దేశం లో పల్లెలలో ఉన్న దుర్భర దారిద్ర్యం ,రోగాలు, అనారోగ్యం ,కులవ్యవస్థతతో కునారిల్లిన  ,అణచి వేతకు లోనైన ,స్వేచ్చ అనుభవించని ప్రజలను గమనించాడు .చివరికి దేశం లో  గ్రామాలు ,దారిద్ర్యంపర్యాయపదాలు అని గ్రహించాడు . ఇలాంటి కోట్లాది  ప్రజలకు విముక్తికలిగితేనే అభి వృద్ధి సాధ్యం అనుకొన్నాడు .కనుక దీనికి తగిన ఉపాయం సంప్రదాయబద్ధంగా ,ఆధునికతతో రాకీయ నైతిక ,మతసంస్కరణలు తేవాలి అని నిశ్చయించుకున్నాడు .పాశ్చాత్య నాగరకత లో పెరిగినా ,ఆయనలో తరతరాల భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, సిద్ధాంతాలు  స్థిరంగా వేళ్ళూ నికొనే ఉన్నాయి . ఆనాటి పరిస్థితులు నేడూ మనము౦దున్నాయి .కనుక గాంధీ కి ప్రపంచీకరణతో ఉన్న సంబంధం  ఇంకాబాగా ప్రాముఖ్యతవహిస్తోందని ,ఆయన భావాలు నేటికీ చెల్లుబాటు అవుతాయని మనకు అర్ధమౌతోంది .

  ఆయన చెప్పిన హింద్ స్వరాజ్ భారత దేశానికి అత్యంత అవసరమైన మాగ్నకార్టా .  అందులో సంశ్లేషణ ,సంయోగాలున్నాయి .వీటికి అ౦తస్సూత్రంగా సామరస్యం ఉండటం విశేషం .మానవులు సహజ సిద్ధమైన మానవ విలువలైన సహనం ,వివేకం ,సానుభూతి లను విస్మరించి మేధకే ప్రాధాన్యమిస్తున్నారు .ఇవి ఉంటే శారీరక మాసిక ,ఆధ్యాతిక శక్తి సంపన్నులౌతారు .ఆయన ప్రవచించిన హింద్ స్వరాజ్యం ఈ భావనల ఆధారంగా జాతి పెరిగితే కట్టుబాట్లతో ఉన్న స్వర్గం లో నివసించే వీలు కలిగి  ప్రపంచ దృష్టి మనపై పడుతుందని చెప్పాడు. కనుక మనకు తప్పని సరిగా కావాల్సింది పసిపిల్లవాడి మనస్తత్వం .దీనిపై గాంధీ ‘’నేను చేసింది అంతా ఇప్పుడు ఒక పిల్లవాడు కూడా అనువైన మనస్తత్వం తో సాధించగలడు .జ్ఞానం అన్ని వైపులనుండి ప్రవహిస్తుంది. కనుక శిష్యులమైన మనకు ప్రతిదీ  గురువై  బోధ చేస్తుంది ‘’అన్నాడు .ఇది సార్వకాలీన ,సార్వ దేశీయమైన సత్యం కాదా ?

  గాంధీ ఆచరించి బోధించిన సత్యం, అహింస,ప్రేమ లకు కాలదోషం లేదు .శాంతి సుహ్రుద్భావాలతోనే ఘర్షణలు  వైరుధ్యాలు తొలగిపోతాయి .కత్తికంటే ప్రేమ ,శాంతి సాధించిన విజయాలు చరిత్రలో కోకొల్లలు .వైరుధ్యాలను చూసి నిరుత్సాహపడరాదు .వాటిని అధిగమించే ఆత్మ స్తైర్యం సాధించాలి .కనుక ప్రజాస్వామ్యాన్ని ఆధ్యాత్మిక స్థితికి ఎదగనీయాలి .రాజకీయ కార్యకలాపాలు దైవ విధిగా భావించాలి .రాజకీయ నాయకులు ప్రజా సేవకులుగా ఉండాలేకాని వారిని పీడించే దోపిడీ దారులుగా ఉండరాదు .ఉన్నత ప్రమాణాలున్న సమాజ నిర్మాణం అందరి బాధ్యత.ఆధునిక విజ్ఞానం సా౦కేతికతలలోని బలాలను, బలహీనతలను గ్రహించాలి .అవి పర్యావరణానికి చేసే హాని గుర్తించి జాగ్రత్త పడాలి .బాపు చెప్పిన సత్య౦ , అహింస, ప్రేమ అనే’’ త్రిక సిద్దా౦తమే’’ భూమిపై శాంతికి దోహద పడుతుంది .దీన్ని మనం సాధించాలి అంటే  మన మనోభావాలలో సంపూర్ణ విప్లవం రావాలి .

     తన జీవితం లో ప్రతిదశలోను సమగ్రమైన విలువలను పాటిం చి  మహాత్ముడు ఆదర్శమూర్తి అయ్యాడు .విలువలు మూల చింతనకు ఆధారాలు .ప్రవర్తన తీరును మలచుకొనే ముఖ్యాంశాలు .భిన్న భావాలను ,సమస్యలను అడ్డంకుల్ని అధిగమించటానికి సహకరించే సహజ  సాధనాలు .విలువల వ్యవస్థ వ్యక్తి తీరుకు గీటు రాయి .సమాజం లో అతని ఉన్నతిని  నిర్ణ యించేది కూడా .జీవిత లక్ష్యాలకు అవి నిర్దేశకాలు .వీటినే గుణాలు అంటాం .గుణాలు భావనలకు ,భావోద్వేగాలకు స్థితులు. నిర్ణయాత్మకత లకు స్థితులు .వీటిని మనిషి తన వివేకం ద్వారా సద్వినియోగం చేసుకొని  తన హేతువు ,ఎంచుకున్న ప్రక్రియ లకు న్యాయం చేస్తాడు .గుణాలన్నిటికీ శీలమే ఆధారం .శీలం లేని గుణాలు శోభిల్లవు .ఇవీ సార్వకాలిక  సత్యాలే  కదా.కనుక గాంధీ ని విస్మరించ లేము కదా .

  నేడు ప్రపంచమంతా ఉగ్రవాద భయోత్పాతాలో భీతిల్లు తోంది .ప్రతి వాడికీ హింస ఆయుధమై పోయింది .హింస ఆత్మవినాశన హేతువు అన్నాడు బాపు .అహింస సర్వ కాల క్రియా విధానం దానికి తుది లేదు .కాలాతీతమై౦ది కూడా .హింస చంపుతుంది. అహింస ఎప్పుడూ చంపనే చంపదు.అందుకే అంతర్జాతీయ వనరులు  విశ్వ వ్యాప్తంగా అందరికి  అందుబాటులో ఉంటున్నాయి.శాంతి, సౌమనస్యం, సుహ్రుద్భావాలతో ,దౌత్యనీతి తో  పరస్పర చర్చలతో సమస్యలు ,విభేదాలు  టెన్షన్ లు  పరిష్కరింప బడుతున్నాయి .ఐక్యరాజ్య సమితి  ప్రపంచ దేశాలమధ్య శాంతియుత వాతావరణ కల్పనకు ఇతోధికంగా కృషి చేసి విజయం సాధిస్తోంది .వీటన్నిటికి కావలసింది సహనశీలత, ఔదార్యం ఉన్న రాజకీయ దృక్పధం ,నిర్ణయం ,సహనం ,పట్టుదల లతో కూడిన అహింసా సిద్ధాంతంపై గట్టి నమ్మకం,విశ్వాసం .హింస , దౌర్జన్యాలు ఏనాడు అంతిమ విజయం సాధించలేదన్నది చారిత్రిక సత్యం .మరి గాంధీజీ భావాలు బూజు పట్టినవా ?కానే కాదు .నిత్య నూతనమైనవి .స్పూర్తి  దాయకమైనవి ..

    గ్రామీణాభి వృద్ధి గాంధీజీ ముఖ్య సిద్ధాంతాలలో మరొకటి.  వస్తు అమ్మక లాభాలు  అన్నీ    బడా పారిశ్రామికవేత్తల జేబుల్లోకి అప్పనంగా ప్రవహి౦చకుండా వృత్తి పనివారలకు చేరేట్లు మహాత్ముడు ఆదర్శ వంతమైన ఆర్ధిక సూత్రం చెప్పి అమలు చేయించాడు .అదొక మోడల్ గా ప్రసిద్ధి చెందింది .వినియోగదారుల అవసరాలు  తీర్చటమే కాక అత్యున్నత నాణ్యతతో తక్కువ ధరలకే అందేట్లు  వస్తూత్పత్తి జరగాలని అభిలషించాడు .తమ పెట్టు బడులు సమాజం లో ఏ వర్గాలవారు  వలన లాభ పడుతున్నారో గ్రహించాలి .నేతపని వారు తయారు చేసే స్థానిక ఖాదీ వస్త్రాలకన్నా ,బ్రిటన్ నుంచి దిగుమతి అయిన మిల్లు వస్త్రాలు చాలా చౌక అయినా ,వాటిని వాడితే దేశీయ పరిశ్రమలు దెబ్బతిని వృత్తి పని వారల జీవితం  దుర్భరమౌతుంది.నిరుద్యోగం పెరిగి పోతుంది .అదే విధంగా వ్యవసాయాధార ఉత్పత్తులకూ అదే గతి పడుతుంది .గాంధీజీ అలాంటి విదేశీ వస్తువులవలన  భారత దేశానికి వెన్నెముకగా ఇప్పటి వరకు నిలచిన గ్రామీణ ఆర్ధిక స్థితి మొత్తం దిగజారి పోతుంది అని విశ్వసించాడు ..ఇంతటి దూర దృష్టి ఉన్న మహాత్ముని ఆర్ధిక విధానం ఎన్నటికీ శిరోధార్యం కాదా ?

  అంతమాత్రాన దూసుకు వస్తున్న పెట్టు బడి దారీ విధానం లోని చిక్కులు గాంధీకి తెలియనివి కావు .మానవత్వం తో కూడిన ఆయన ఆర్ధిక విధానాలు  యాంత్రిక పెట్టుబడి దారుల పురోగతిని నిలువరించటానికి సమర్ధమైనవి కావు . కనుక అందరికి పనికి వచ్చే తగిన ఒక ప్రణాళిక సూచించాడు  .మానవ శక్తి తక్కువగా ఉన్న దేశం యంత్ర పరిశ్రమతో వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకో వచ్చు .కాని ఇండియావంటి అధిక జనాభా ఉన్న దేశానికి యంత్ర పరిశ్రమ అనర్ధ దాయకం .దేశం తన అవసరాలకు చాలినత మాత్రమే ఉత్పత్తి చేయాలి .అధికోత్పత్తి వలన అంతర్జాతీయ ఆర్ధిక పరుగు ప్రారంభమై చివరికి దోపిడీకి దారి తీస్తుంది  గాంధీ ఆలోచన ప్రకారం ప్రస్తుత ఇండియా పరిస్థితికి  అంతా ,బ్రిటిష్ కాలనీ వాళ్ల దూకుడు యా౦త్రీకరణమే కారణం .అని పూర్తిగా విశ్వసించాడు .

   ఆర్ధిక విషయాలపై బాపు అభిప్రాయాలు అతి సాధారణ౦గా  సూటిగా ఉండేవి .అయినా వాటిని అన్ని స్థాయిలలో అందరూ విమర్శించారు .పైగా అభి వృద్ధి నిరోదకమైన తిరోగమన పద్ధతులు అన్నారు .కాని ఆయనకు లోతైన రాజకీయ గర్భితార్ధం బాగా తెలుసు .ఆర్ధిక ఉద్దేశ్యాలు ,ఇ౦పీరియలిజం ,కాలనిజం లకు మూల సూత్రాలని ఆయనకు పూర్తిగా అవగతమైన విషయమే .కనుక కాలనీ వాసుల ఆర్ధిక లాభాలపై బతుకుతున్న బ్రిటిష్ ప్రభుత్వం పై విరుచుకుపడి వాటిని బలహీన పరచాలని నిశ్చయించాడు  .దీన్ని ఆధారంగా భారతీయ ఆర్ధిక విధానం బలపడాలని  అనుకున్నాడు .తన జీవితమంతా దీనిపైనే దృష్టి పెట్టాడు .ఆయనది  ఆధ్యాత్మిక అలంకారం తో,ముసుగుతో  ఉన్నరాజకీయ సాధనం అనుకోవటం పొరబాటు .ఆయనకు నిజంగా కోట్లాది పేద ప్రజల  అభి వృద్ధి మాత్రమే ముఖ్యం .హృదయం లేని యాంత్రికత తో  వృద్ధి  చెందే ప్రపంచ ఆర్ధికం, అన్నిటిలోని నైతికత ను అడ్డ గిస్తుంది అని మహాత్ముని భావన .ఆయన కాలం లో గాంధీగారి ఆర్ధిక నమూనా ప్రభావం చాలా ఉధృతంగా  ఉండేది .దాన్ని భారత దేశంమాత్రమేకాక ,  ప్రపంచం లో చాలా దేశాలు  అమలు చేసి అభివృద్ధి సాధించి విజయాలు అనేక రీతులలో, స్థాయిలలో సాధించాయి  .అదొక ఆదర్శ ఆర్ధిక విధానం అని పేరు పొందింది . కనుక బాపు భావనలు దేశాతీతమని పించాయన్నమాట అక్షర సత్యమే కదా .

మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా ఈ చిరు ధారావాహిక

  సశేషం

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

1988 లో నా వార్ధా- సేవాగ్రా౦ సందర్శన యాత్ర -చంద్ర భాల్ త్ర్రిపాఠి

’2018  సెప్టెంబర్ 28 వార్ధా లోని గాంధి పీస్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు శ్రీ కుమార్ ప్రశాంత్ నాతొ చేసిన టెలిఫోన్ సంభాషణలో నా మొదటి ,చివరి  1988 లో వార్ధా సేవాగ్రామసందర్శన యాత్ర   జ్ఞాపకాలు సుళ్ళు తిరిగాయి .మొదట నేను పౌనార్ ఆశ్రమ వెళ్లి శ్రీ వినోబాభావే సోదరుని చూశాను .అక్కడనుంచి వార్ధా వెళ్లి సర్క్యూట్ హౌస్ లో బస చేశాను .అప్పటికి నేను షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ ట్రైబ్స్ డిప్యూటీ  కమిషనర్ గా ఉన్నాను .జులై 1988 లో రిటైరయ్యాను .అక్కడ 1943-46 మధ్యకాలం లో బెనారస్ నుండి ప్రచురితమౌతున్న ‘’ఆజ్ ‘’పత్రిక లో ప్రచురితమైన వ్యాసాలను నా యవ్వనం లో చాలా ఆసక్తిగా చదివేవాడిని .వీటిని నాకు పంపించే శ్రీ ఉమాశ౦కర శుక్లాను ఇప్పుడు కలిసి మాట్లాడాను .ఆయన దేశం లో లబ్ధ ప్రతిస్టు  డైన  జర్నలిస్ట్ .ఆయన రాయిటర్స్ పత్రికలోనూ పనిచేసేవారు  .లూయీ ఫిషర్ సేవాగ్రాం  సందర్శించి బాపు పై పుస్తకం రాసినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు .45 ఏళ్ళ క్రితం నాటి తన రచనలు నేను ఆసక్తిగా చదవటం ఆయన అభినందించారు  .మా తండ్రి పండిట్ చంద్ర బాలి త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని బస్తి లో ఆజ్ పత్రిక ,అమృత బజార్ పత్రికలకు కరేస్పా౦ డెంట్ గా  ఉండేవారు .అమృత బజార్ పత్రిక  కలకత్తా ను౦డి మారి, అలహాబాద్ నుండి అచ్చు అయ్యేది .అప్పుడు ప్రసిద్ధ సంపాదకుడు తుషార్ కాంతి ఘోష్ దాని సంపాదకుడు .శుక్లాగారు నన్ను మగన్ వాడికి తీసుకు వెళ్లి ,ప్రసిద్ధ ఆర్ధికవేత్త ,ప్లానింగ్ కమిషన్ మెంబర్ స్వర్గీయ  శ్రీ నారాయణ అగర్వాల్ గారి అర్ధాంగి శ్రీమతి మదాలసా దేవి గారిని పరిచయం చేశారు. ఈమె గాంధీజీ కి అత్యంత సన్నిహితులు, భారత జాతీయ కాంగ్రెస్ కు చాలాకాలం కోశాధికారి గా ఉన్న శ్రీ  జమ్నాలాల్ బజాజ్ కుమార్తె . నేను వచ్చే  ఏడాదిలో  రిటైరయ్యాక తమ సంస్థలలో ఏదో ఒకదానిలో పనిచేయమని ఆమె కోరారు .

శుక్లాగారు నన్ను సేవాగ్రాం తీసుకు వెళ్ళారు .అక్కడొక రోజంతా గడిపాను .అక్కడ అత్యల్ప వేతనం తో పనిచేసే బాపు సహాయకుని చూశాను .మహాత్ముడు నివశించి ,ప్రపంచప్రసిద్ధ నేతతో సంభాషించిన  ఆశ్రమ౦ , .దాని ప్రక్కనేకాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమయే ప్రదేశం ఇప్పుడు ఖాళీ గా ఉండటం మర్చి పోలేని విషయం .ఈతరం వారు  ఆ  ఆశ్రమ వారసత్వాన్ని ఊహించుకోలేరు .   కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరిని,నీటి ద్వారా మరుగు దొడ్లనుపాయిఖానాలను స్వయంగా కడిగి  శుభ్రం చేయమని ఆదేశించేవారు .వీరిలో సర్దార్ పటేల్ ,రాజేంద్ర ప్రసాద్ ,మౌలానా ఆజాద్ ,పండిట్ జవహర్ లాల్ నెహ్రు మొదలైన హేమాహేమీలైన జాతీయ నాయకులు కూడా ఆపని చేసేవారు .అక్కడ నేను ప్రముఖులైన ఇద్దరిని -స్వర్గీయ రామదాస్ గాంధీ భార్య ను ,నా విద్యార్ధి జీవిత సహచరుడు రవీంద్ర వర్మలను చూశాను .

సేవాశ్రమం దగ్గరనుంచి శుక్లా నన్ను ‘’ఆనందవనం’’ తీసుకు వెళ్ళారు .ఇక్కడ కూడా పూర్తిగా ఒక రోజున్నాను .దీని వ్యవస్థాపకులు శ్రీ బాబా ఆ౦ప్టే.దీన్ని  దర్శించేదాకా ఆయన అద్భుత కృషిని తెలుసుకోలేక పోయాను .సంపన్న ఉన్నత  బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన బాబా ఆం ప్టే, ఇంగ్లాండ్ వెళ్లి ,బార్ యెట్-లా చదువుతూ, రోజూ టెన్నిస్ ఆడేవారు .స్వదేశానికి తిరిగి  వచ్చి భార్యతో సహా కుష్టునివారణ,  కుష్టు రోగుల  సేవలో  నిమగ్నమయ్యారు .అందుకని ఆనాటి బ్ర్రాహ్మణులు ఆయనను సంఘ బహిష్క్రుతుని చేశారు .వెనకడుగు వేయకుండా పట్టణం వెలుపల , కుష్టు రోగులతోకలిసే జీవించారు  .రాళ్ళు రప్పలు పొదలు దట్టంగా ఉన్న ఆప్రాంతాన్ని ఇతరుల , రోగుల సాయంతో ఎంతో శ్రమ  చేసి , పచ్చదనంతో కనువిందు చేసే నివాసభూమిగా మార్చారు . ఆ తర్వాత ఇలాంటిదే మరొక గ్రామీణ సాంకేతిక అద్భుతాన్నిఅన్నాహజారే తన స్వగ్రామం రాలెగావ్ షిండే లో చేసి చూపారు .ఈ రెండిటిలో ఆనందవనం చాలా పెద్దది , విస్త్రుతమైనది .ఆ కాలం లో కుష్టు రోగుల పిల్లలకు బడులలో ప్రవేశం ఉండేదికాదు .బాబా ఆంప్టే  దీనికి పరిష్కారంగా తానే వారికోసం ఒక స్కూల్ స్థాపించి ,క్రమ౦గా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయికి పెంచి ,కుష్టు రోగులకాలనీ వారికేకాక ,ఈ విద్యా సంస్థలలో తమపిల్లలు చదువు కోవచ్చునని  సాధారణ ప్రజలనుకూడా  ఆహ్వానించారు .అందరి సహకారం తో సహకార జీవితం సాధించి ,వర్క్ షాప్ ,చేతి తోతయారు చేసేకాగిత పరిశ్రమ ,కోఆపరేటివ్ సొసైటీ ,బహిరంగ సినిమా దియేటర్ వంటి ఎన్నో సంస్థలను నెలకొల్పి ‘’ఆనందవనం’’గా రూపొందించి తీర్చి దిద్దారు .ప్రఖ్యాత నాటకరచయిత  శ్రీ పి.ఎల్.దేశ పాండే దియేటర్ ను ప్రారంభించి అందరికి అందుబాటులోకి తెచ్చారు .బాబా ఆంప్టే దంపతులు , ,పూర్వపు ,ఇప్పటి కుష్టు రగుల నిరంతర అవిశ్రాంత శ్రమ కృషి ఫలితంగా ఏర్పడినదే ‘’ఆనందవనం ‘’.హాట్స్ ఆఫ్ బాబాజీ .ఇంత గొప్ప ఆశ్రమ౦ సందర్శించే అదృష్టం నాకు కలిగించిన శుక్లా గారికి ధన్యవాదాలు .ఆనందవనం లో బాబా గారి భార్య శ్రీమతి ఆంప్టే ను సందర్శించాను .నేను వెళ్ళిన సమయానికి బాబా దూరంగా  అస్సాం లో’’భారత్ జోడో యాత్ర ‘’లో  ఉన్నారు .కనుక వారిని దర్శించే భాగ్యంకలగలేదునాకు . వెన్నెముక సంబంధమైన ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నా కూడా బాబా, తన వాన్ లో స్పెషల్ స్ట్రెచర్ పై పడుకొని దేశం లో ఎంతదూరమైనా ప్రయాణం చేస్తారు .అలాగే నర్మదానదీ తీరం లో జరిగిన’’ నర్మదా  బచావో ‘’ఆందోళనలో పాల్గొన్నారు .తన ఆరోగ్యం కంటే ప్రజా  సమస్యయే ఆయనకు ముఖ్యం .మళ్ళీ ఆన౦దవనం కు తిరిగి రానేలేదు .ఇంతటి లెజేండరి వ్యక్తులు అరుదు .బాబా గారి  కుమారులిద్దరూ డాక్టర్లు .వారినీ చూడలేక పోయాను .వీరిద్దరూ గ౦ధ్ చిరోలీ  లో పీడిత గిరిజనుల తో కలిసి పని చేస్తున్నారు . వీరిద్దరూ ప్రజలలో బాగా సుప్రసిద్ధులైనారు . ఈ గిరిజనులు రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల దృష్టిలో తీవ్రవాదులు, నేరస్తులు అవటం ఒక విచిత్ర విడ్డూరం -ఐరనీ . ఈ ప్రభుత్వాలు పారా మిలిటరీ దళాల  త్యాగాలతో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఈ గిరిజనులను, వీరిఉద్యమాన్ని  అణచి వేయవచ్చునని భావిస్తోంది .నేనుమాత్రం గిరిజనులు చేసే , ,ప్రభుత్వాలు చేబట్టే  హింసకు మద్దతు తెలిపపేవాడినికాను . ‘’

ఆధారం –శ్రీమైనేనిగోపాలకృష్ణ గారు ఈ ఉదయం పంపిన శ్రీ చంద్రభాల్ త్రిపాఠీ రచన ‘’A Pigrimage to Wardha –Sewagram in 19 88’’.

అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా శ్రీ త్రిపాఠీ జ్ఞాపక శకలం ఇది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-9-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

వినోబాజీ పౌనార్ ఆశ్రమం

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సుప్రీమే  సుప్రీమా ?

సుప్రీమే  సుప్రీమా ?

మఠాధిపతిలు ,పీఠాధిపతులు సుప్రీం తీర్పుపై మౌనం వహిస్తున్నారేమి?ఉపేక్ష దేనికి సంకేతం ?ఇప్పటిదాకా మీరు ఉపదేశిస్తున్న  సాంఘిక నియమాలు ,సనాతన సంప్రదాయం అనుసరిస్తున్న వారి గతేమిటి స్వామీజీలు ?అటకెక్కాల్సిందేనా ? ఇప్పుడు మీ బాధ్యత ఎక్కువైందా తగ్గి హాయిగా ఊపిరి పీలుస్తున్నారా అయ్యలూ -దుర్గాప్రసాద్

Posted in రాజకీయం | Tagged | 1 Comment

28-9-18శుక్రవారం ఉదయం కవులు, రచయితలూ, కళాకారులు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి ,తర్వాత జరిగిన సభలోని దృశ్యాలు

28-9-18శుక్రవారం ఉదయం కవులు, రచయితలూ, కళాకారులు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి ,తర్వాత జరిగిన సభలోని దృశ్యాలు

https://photos.google.com/share/AF1QipPO5reQ3wT1UlqDemWueJhPtJu_8tZ-OuA0TEAQxD_QNbjKFuFg5qQ7zRBn08TXkg?key=VGFxdVFtU0JnM0YzQ0R5a3lxVGxQelFkNDR5VGRR

 

‘’చంద్రుని ‘’కో నూలుపోగు

నిన్న సాయంత్రం శ్రీ పూర్ణ చ౦ద్ ఫోన్ చేసి ‘’రేపు ఉదయం సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ డి .విజయ భాస్కర్ తోకలిసి రచయితలూ కవులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ‘’ను కలవాలను కొన్నాము మీరు రేపు ఉదయం 9 కల్లా బెజవాడ  ఘంటసాలసంగీత కళాశాలకు వచ్చేయండి అక్కడినుంచి ఏర్పాటు చేసిన వెహికల్ లో వెడదా౦’’అన్నారు సరే అన్నాను. ఎందుకు ,ఏమిటి అని నేనూ అడగలేదు ,ఆయనా చెప్పలేదు .

ఇవాళ ఉదయం 5 గంటలకే లేచి స్నాన సంధ్య పూజాదికాలు పూర్తి  చేసి 7 గంటలకల్లా కాఫీ తాగి , బెజవాడ బయల్దేరా .ఈ లోపే మళ్ళీ పూర్ణ చ౦ద్ ఫోన్ చేసి, ప్రోగ్రాం జ్ఞాపకం చేశారు .సత్యనారాయణపురం లో ఘంటసాల మ్యూజిక్ కాలేజికి 8-40 కి చేరా .అప్పటికి ఎవరూ వచ్చిన దాఖలా కనిపించలేదు. దగ్గరే ఉన్న ఫుడ్ జంక్షన్ కు వెళ్ళా ఇడ్లీ తిని కాఫీ తాగుదామని .అది సాయం వేళమాత్రమే తెరుస్తారని ప్రక్కనే ఉన్న బేకరి ఆయన చెబితే వాళ్ళదగ్గరే రెండు కేకులు కొని, తిని, బి.పి. టాబ్లెట్ వేసుకొని టీ తాగి మళ్ళీ కళాశాల చేరా .కొందరు రచయితలు కనిపించారు .పూర్ణ చంద్ 9 కి వచ్చారు .అందరికీ ఎందుకు వెడుతున్నామో తెలీదు .నేను బహుశా బాబు ఐరాస లో వ్యవసాయం గురించి తెలుగులో మాట్లాడినదానికి అభినంది౦చ టానికేమో అన్నా. కావచ్చు అన్నారుఅంతా . సాంస్కృతికశాఖ తలొక చిన్న బిస్కెట్ పాకెట్ ఇచ్చింది .9-15 కు అందరం మాకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక’’ నాన్ ఎ.సి .’’బస్ ఎక్కాం .9-25 కు బస్ బయల్దేరింది .ఆంధ్రప్రదేశ్ నాటక అకాడెమి అధ్యక్షులు, పౌరాణిక నాటక నటులు శ్రీ  గుమ్మడి  గోపాల కృష్ణ ,స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి బహిర్ ప్రాణం  ,రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలమురళి స్మారక అవార్డ్ ను ఈ సంవత్సరం మొట్టమొదటి సాటిగా అందుకున్న ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీ అన్నవరపు రామ స్వామి , కృష్ణా జిల్లా రచయితలసంఘ కార్యదర్శి డా .జి వి పూర్ణచంద్ ,శ్రీ విజయభాస్కర్ గార్లు  కార్లలో బయల్దేరారు .

మా బస్ లో మాతో పాటు వచ్చినవారిలో  అవధాన శిరోమణి డా శ్రీ పాలపర్తి శ్యామలాన౦ద ప్రసాద్  ,రమ్యభారతి సంపాదకులు ఆంధ్రప్రదేశ్ రాచాయితలసంఘ కార్య దర్శి శ్రీ చలపాక ప్రకాష్ ,కవి రచయితా ,లయన్ శ్రీ బందా వెంకటరామారావు ,నేనూ ,శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ,శ్రీ శిఖా ఆకాష్ , శ్రీ ప్రసాదరావు ,శ్రీ వెంకట రామాచార్యులు, డా శ్రీమతి రేజీన ,శ్రీమతి కొకావిమలకుకుమారి శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసు౦దరి ,శ్రీమతి కోనేరు కల్పన,శ్రీమతి సామినేని శైలజ ,శ్రీమతి కొమాండూరి కృష్ణ భర్త గారు ,మాచవరం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ప్రధాన అర్చకులు (రిటైర్డ్ ),మల్లెపందిరి సంపాదకులు ,శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ ,శ్రీ పంతుల  వేంకటేశ్వర రావు దంపతులు ,సంగీతకళాశాల విద్వాంసులు మొదలైన 30 మంది రచయితలూ, కవులు కళాకారులు ఉన్నారు .

10 .25 కు మా బస్ బెజవాడకు రాజధాని అమరావతికి మధ్యలో ఉన్న ముఖ్యమంత్రి నివాస గృహానికి అంటే ‘’ప్రజా వేదిక ‘’కు చేరింది .మెటల్ డిటెక్టర్ తో మమ్మల్ని అందర్నీ’’ తోమి ‘’,ఏ అపాయకర వస్తువులు లేవని నిర్ధారించి ,మరొక చోట మళ్ళీ చెక్ చేసి మా పర్సులు, సెల్ ఫోన్లు , కెమెరాలు తీసేసుకొని లోపలి పంపారు .అప్పటికే అక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్స్తున్న 60 మంది స్త్రీ,పురుష రైతులు లైన్ లో ఉన్నారు .మమ్మల్ని వాళ్ల వెనకాల నిలబడమన్నారు .’’మన్నాము’’.ఇంతలో ఒక సెక్యూరిటీ ఆయన నా దగ్గరకొచ్చి ‘’సార్ మీ ఏజ్ ఎంత ?’’అన్నాడు .’’79 పావు’’ అన్నా’భలే యాక్టివ్ గా ఉన్నారు సార్ ‘’అని కాంప్లిమెంట్ పడేశాడు. నవ్వా .ఇంకో ఆయన ఎవరెవరు సి ఏం గారిని కలుస్తారో పేర్లు  చెప్పండి అన్నాడు నాకు తెలిసిన పేర్లు చెబితే నోట్ చేసుకున్నాడు.కాసేపటికి సెక్యూరిటీ వాళ్ళు మాతో ‘’సిఎం గారు అరకు  వెళ్ళబోతున్నారు .లోపలి వెళ్లి కలిసే అవకాశం లేదు .ఆయనే మీ దగ్గరకు వచ్చి పలకరిస్తారు ‘’ అని ‘’చల్లగా’’ చెప్పాడు .అందర౦  అటేన్షన్ పోజు పెట్టాం .ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ముందుగా రైతుల దగ్గరకు  చాలాదగ్గరగా  నమస్కరిస్తూవచ్చి , ముందుకు సాగారు .ఆ తర్వాత మా దగ్గరకు నమస్కరిస్తూ వచ్చారు. నేను అందర్నీ తోసేసి ముందు వరుసలో నిలబడ్డా .నాదగ్గరకు ఆయన రాగానే , షేక్ హాండ్ కోసం చెయ్యి చాపా .నవ్వుతూ కరచాలనం చేశారు .ఇదే మొట్టమొదటి సారి బాబు గారిని అంత దగ్గరగా చూడటం   షేక్ హాండ్ ఇవ్వటం కూడా .హైదరాబాద్ లో శ్రీ మాడుగులవారి ద్విశతావధానం లోనో సహస్రావధానం లో నో ఒకసారి ,దోమలగూడా రామ కృష్ణ మఠం లో ఒకసారి కొంచెం దగ్గరగానే సభా వేదికపై చూసిన గుర్తు .ఆయనంటే అభిమానమే అయినా సభలకూ ,సమావేశాలకూ ఎప్పుడూ వెళ్ళలేదు నేను .ఇవాళ తెల్లవారు ఝామునే ఆయన అమెరికానుంచి వచ్చినా మొహం లో  ఎక్కడా అలసట కనపడ లేదు చాలా ఫ్రెష్ గా ఉన్నారు .నవ్వులో తేడా లేదు .అదే చిరు దరహాసం .నా దగ్గరకు రాగానే నాతో పాటు అందరితో ‘’మన్యం వెళ్ళాలి  అర్జెంట్ గా .సమయం లేదు .అందుకే ఎక్కువ సేపు మీతో గడపలేక పోతున్నాను’’ అన్నారు  అపాలజెటిక్ గా .అందరం అర్ధం చేసుకున్నాం .ఇంతలో ఒకాయన ‘’అరకు లో మధ్యాహ్నం 1-30 దాటితే మబ్బులు కమ్మి హెలికాప్టర్ ప్రయాణం ఇబ్బంది అవుతుంది ‘’అన్నాడు .నిజమే కదా .అందులోనూ  నక్సలైట్ ల తుపాకి  తూటాలకు బలైన ఏం .ఎల్ .ఏ .శ్రీ కిడారి సర్వేశ్వరరావు ,మాజీ  ఏం. ఎల్ .ఏ. శ్రీ సోము గార్ల కుటు౦బాలను  పరామర్శించటం ప్రదాకర్తవ్యం గా బయల్దేరు తున్నారు .

ముఖ్యమంత్రి కారులో బయల్దేరగానే  రచయితలను, రైతులను అక్కడే ఉన్న ఎసి హాల్ లోకి వెళ్లి కూర్చోమని చెప్పారు .అక్కడ సిద్ధంగా ఉన్న కుర్చీలలో ఒక వైపు రైతులు, వారికి ఎదురుగా  సాంస్కృతిక బృందం ఆసీనులయ్యాం .శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ చంద్రబాబు రైతులకు చేసిన సేవలు ,పట్టిసీమ ఎత్తిపోతల పధకం, పోలవరం ,గాలేరు నగరి ,హంద్రీ నీవా ,కొండగట్టు వాగు వలన అమరావతికి ముంపు రాకుండా ఈమధ్యే ప్రారంభించిన ఎత్తిపోతల పధకం ,అవుకు టన్నెల్ విశిష్టత మొదలైనవన్నీ తానే గొప్పగా రాసి గానం చేసిన పద్యం లో కళ్ళకు కట్టించి రైతులకు మేలు జరగాలంటే మళ్ళీ బాబే రావాలని చప్పట్ల మధ్యఅనిపించారు .   ఇక సాంస్కృతిక బృందం తరఫున సాంస్కృతిక శాఖ సంచాలకులు, ముఖ్యమంత్రికి మిక్కిలి ఆప్తులు, కవి గొ ప్పరచయిత ,పని రాక్షసుడు శ్రీ దీర్ఘాసి విజయభాస్కర్ మాట్లాడుతూ ‘’ఐక్య రాజ్యసమితిలో జీరో బెసేడ్ బడ్జెట్ తో ప్రకృతి సేద్యం పై తెలుగులో ప్రారంభించి మాట్లాడి తెలుగుకు అంతర్జాతీయ వేదికపై గౌరవం కల్గించిన ముఖ్యమంత్రికి మనమందరం కరతాళ ధ్వనులతోఅభినందనలు చెబుదాం .ఇక్కడ కమతం చేసే రైతులు ,కవనం చేసే కవులు ఉండటం చాలా ఆనందంగా ఉంది .పోలంపండించి వాళ్ళు మనకు అన్నం పెట్టి రైతే రాజు అని చాటుతున్నారు .కలం తో కవులు, రచయితలూ మానసిక ఉల్లాసం కలిగించి జాతికి దిశా నిర్దేశం చేస్తున్నారు .ఈ ఇద్దరినీ రెండు కళ్ళు గా భావించి అందరికీ న్యాయం అందరికీ అభివృద్ధికోసం అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు  ముఖ్యమంత్రి ..వారికి ఆంద్ర జాతి యావత్తు మద్దత్తు పలికి ఈ అభివృద్ధి కొనసాగటానికి మళ్ళీ ఆయన అధికారం లోకి వచ్చే ప్రయత్నం చేసే బాధ్యత మనందరి పైనా ఉంది ‘’అని కర్తవ్యమ్ బోధించారు .శ్రీ అన్నవరపు వారు ‘’బాబు గారి లాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి  అవటం మన  రాష్ట్ర౦  అదృష్టం .ఆయన ఎనర్జీ రిచార్జిఅవసరం లేని బాటరీ లాంటిది .కవులకూ కళాకారులకు ,రచయితలకు పించన్లు ఇతోధికంగా పెంచిన గోప్పమనసు ఆయనది .నాకు బాలమురళీ అవార్డ్ కింద 10 లక్షల రూపాయలు అందజేసి పెద్దమనసును చాటుకున్నారు.ప్రతిభఎక్కడ ఉన్నా ఆయన గుర్తించి ప్రోత్సహిస్తారు ‘’అన్నారు .డా .పాలపర్తి వారు ‘’చద్రునికో నూలుపోగు ‘’అనే శీర్షికతో పద్యాలు రాసి చదివి బాబుకు వేదాశీర్వచనంలా చేశారు .ఆశీర్శికనే నేను కాపీకొట్టి, దీనికి హెడ్డింగ్ గా పెట్టా ..శ్రీమతికోకా విమలకుమారి ఏదో మొదలుపెట్టి ఏదేదో మాట్లాడగా  నేను లేచి గుమ్మడిగారికి  నేను మాట్లాడతాను అని సైగ చేస్తే నన్ను రమ్మనగానే వెళ్లి ‘’ఇప్పుడు దేశం ధ్యేయం ‘’చంద్ర యాన్’’.కనుక రాష్ట్రం లో నూ, దేశం లోనూ అది సఫలం కావాలి అని ఆశిద్దాం ‘’అని ఒకే ఒక్కమాట ‘’ శ్లేష ‘’గా మాట్లడా .తర్వాత శ్రీ పంతుల మాట్లాడారు .ఈలోపు అందరికీ రెండుసార్లు కాఫీ ఇచ్చారు .తాగి బయటికి వచ్చి బస్సు ఎక్కి  బెజవాడ చేరి ,ఇంటికి వచ్చేసరికి పావు తక్కువ రెండు అయింది .అన్నం తిని,కాసేపు విశ్రమించి లేచి ,ఇది రాశా .మా కెమెరాలు సెక్యూరిటీ తీసేసుకోవటం వలన ఫోటోలు తీయలేక పోయాం .అయినా  నేను మీటింగ్ హాల్ లో కెమేరాతో ఫోటోలు తీశా . కొందరు ఇవాల్టి కార్యక్రమాన్ని ‘’చంద్ర భజన ‘’అనవచ్చుకాని .ఆయన మన రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరం అనేది చారిత్రాత్మక సత్యం అని అందరూ అనుకొనేమాట .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-18- ఉయ్యూరు

 


Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -15

ఇప్పటి వరకు మనం కోనసీమ లోని రామేశ్వర అగ్రహార ఆహితాగ్నులు వేద పండితుల గురించి తెలుసుకొన్నాం .ఇకనుంచి నేదునూరు దగ్గరున్న కామేశ్వరి అగ్రహారం లోని వారి గురించి తెలియజేస్తాను .

1-శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు

రెండు చెవులకు బంగారు రింగులు ,కనులలో వేద ప్రకాశం ,కుడి చేతి నాలుగు  వేళ్ళకూ బంగారు ఉంగరాలు ,ముంజేతికి బంగారు మురుగు ,మెడలోశుద్ధ  స్పటికమాల ,కాంతులీనే యజ్ఞోపవీతం ,బోసినవ్వులతో 84 ఏళ్ళ వయసులోనూ తగ్గని వేద స్వరం తో కనిపిస్తారు శ్రీలంకా వెంకటరామ శాస్త్రి గారు .వేద పండితులుగా ఆంద్ర దేశం లో సుప్రసిద్ధులు .శ్రౌతం లో ఘటికులు.శ్రీ రెండు చింతల యాజులు ,శ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్ని హోత్రి గారల మరణం తర్వాత శాస్త్రిగారు బాగా ప్రాచుర్యం లోకి వచ్చారు .కొంచెం ఆలస్యంగానే అగ్నిహోత్రం ప్రారంభించి ,అగ్ని స్టోమం వాయిదా వేసి ,యజ్ఞం చేసిన తర్వాత శ్రౌతానికి స్వస్తి పలికి ,మరణానికి 13 ఏళ్ళ ముందువరకు నిత్య అగ్ని హోత్రిగా ఉన్నారు .వేద ,శ్రౌతాలలో అద్వితీయులనిపించుకొని గౌరవం పొందారు .యజ్న యాగాది క్రతు నిర్వహణలో లంక వారిని ‘’అభినవ ఆపస్తంభుడు’’అంటారు  .తైత్తిరీయాన్ని ఆపోసనపట్టి ,ఋగ్వేద పాండిత్యాన్ని సాధించి అధర్వ వేదం లో అవసరమైనంతవరకు పట్టు సాధించి ,సామవేదాన్నీచాలినంత  మధించారు  .వేదం ,శ్రౌత,ధర్మ శాస్త్ర పరీక్షాదికారిగా ఉన్నారు  .జ్యోతిషం పై సలహాదారుకూడా .ఋత్విక్కు నిర్వహించాల్సిన వన్నీ ఆయనకు కరతలామలకం .సంస్కృత ఆంధ్రాలలో గ్రంథాలు  రాసారు  ,తాము స్వయంగా చేసుకొన్నాఆధాన ,అగ్ని స్టోమ లకు యజమానిగా ఉన్నా ,బ్రాహ్మణాలపై అపార విజ్ఞానఖని అయినందున జరిగే మంత్ర తంత్రాలపై చక్కని పర్యవేక్షణ చేసేవారు .ఆయన అగ్ని   స్టోమం చేశాక ,భారత దేశంలోనే బాగా అనుభవమున్న అధ్వర్యులలో ఒకరుగా గుర్తింపు పొందారు .

సునిసిత మేధ లంక వారి సొత్తు .నిష్పాక్షికతకు నిలు వెత్తు దృష్టాంతం .వేదసభలలో  సమదృష్టితో ,బహు మెత్తగా ,మాట్లాడాల్సిన విషయం పై పూర్తి  దృష్టితో జనరంజకం గా ప్రసంగించే నేర్పు శాస్త్రి గారిది .తిరుపతి దేవస్థానం వేతనం తో ఉద్యోగం అందజేస్తామంటే బాబళ్ళ శాస్త్రి గారు ‘’అది ఆహితాగ్నికి కాదు ‘’అని తిరస్కరిస్తే ,వెంకరామ శాస్త్రిగారు వారిని అసలు పట్టించుకోనేలేదు .1995 నవంబర్ 5 న బంగాళాఖాతం లో పెను తుఫాన్ ఏర్పడి ,కోస్తా జిల్లాల జన జీవితాలను అస్తవ్యస్తం చేసినప్పుడు ,ఇళ్ళకప్పులు ఎగిరిపోయి ,కొబ్బరి తోటలు నేలకూలి ,పంటలు దెబ్బతిని వేలాది పశువులు అసువులుబాసి దారుణ నష్టాన్ని కలిగించింది .లంకా వారి పెంకుటిల్లు ,గొడ్లపాక ,ఆవులు ,పంట ,కొబ్బరి చెట్లు తీవ్రంగానష్ట పోయాయి .దాన్ని గురించి ఆయన ‘’దావోయిస్ట్’’ వేదా౦తి లాగా ‘’తుఫాన్లు వస్తాయి ,పోతాయి ‘’అన్నారు .ఈ స్థితప్రజ్నత వల్లనే ఆయన ఆరాధ నీయులయ్యారు .

లంకావారి సంప్రదాయ వేద విద్యాభ్యాసం,బాబళ్ళ శాస్త్రిగారి అభ్యాసంలాగానే సాగింది .శాస్త్రిగారు నేదునూరు గ్రామం లో జన్మించి ,ముక్కామలలో బాబళ్ళశాస్త్రిగారి తండ్రిగారి శిష్యులైనారు .చాలా క్రమశిక్షణతో నియమనిబంధనలతో సాగిన విద్య అది .తెల్లవారు జామున 3గంటలకే లేచి ,రెండుమైళ్ళు చీకటి మట్టి రోడ్డుపై  నడిచి భమిడి పాటి వారింటికి చేరేవారు , ఉదయం అంతా అధ్యయనం జరిగేది .తర్వాత గురుపత్ని శ్రీమతి కామేశ్వరిగారు మధ్యాహ్న భోజనం పెట్టేవారు .ఆతర్వాత ఉదయం జరిగిన అధ్యయనా నికి సుదీర్ఘ సమీక్ష జరిగేది .సాయం సంధ్యావందనం చేసి ,మళ్ళీ చీకటిలో నడిచి స్వగ్రామం చేరుకోనేవారు .తల్లిగారు వండి వడ్డించిన భోజనం చేసి ,రాత్రి 8 గంటలకు నిద్ర పోయేవారు .’’మా తండ్రి గారు రోజూ రాత్రి నిద్రపోయే ముందు రెండు శ్లోకాలు నేర్పేవారు ‘’అని ఆయన జ్ఞాపకంచేసుకొన్నారు ..ఈ దిన చర్య బ్రహ్మ చర్య జీవితకాలం అంతా  కొనసాగింది అని చెబుతూ ముసలితనం లో  ‘’ఇటీవలికాలం లో ఎక్కువగా నిద్రావసరం లేకపోతోంది .అందుకని  2 గంటలకే  నిద్ర లేచి 3 గంటలవరకు పక్కమీదనే మెలకువగా భగవధ్యానం తో  ఉంటాను .అందరు హాయిగా నిద్రపోతుంటారు .అరుణోదయ వేళ కు మంచంనుంచి లేస్తాను ‘’అని చెప్పారు .శాస్త్రిగారి బ్రాహ్మ విద్యాధ్యయనం 6 సంవత్సరాలు  భమిడి పాటి   గురు వరేణ్యులవద్ద సాగింది .రెండవ గురువు తమ అల్లుడి తండ్రిగారివద్ద ముక్కమలలో మూడేళ్ళు ‘’ఘనం ‘’నేర్చారు .అరడజను మంది తోటి విద్యార్ధులతో వారాలు చేసి అక్కడ చదివారు.

లంకా వారి వేదవిద్యతో పాటు , వివాహం కూడా భమిడి పాటి వారి ఆధీనంలోనే జరిగింది.  శాస్త్రిగారు బాబళ్ళ శాస్త్రిగారి సమీప బంధువు శ్రీమతి అనసూయగారితో జరిగింది .అప్పుఆయనకు 10 ఆమెకు 7 వయసు .లంకావారి ధర్మపత్నిగారి తండ్రి తాత ముత్తాతలు అందరూ ఆహితాగ్నులే కనుక ఆమెకు పత్నీ ధర్మాలు సహజంగా అలవడ్డాయి .రజస్వలయ్యాక 14 వ ఏట ఆమె నేదునూరుకు కాపురానికి వచ్చారు .పతివ్రతామతల్లి అనసూయ పేరు పెట్టినందుకు ఆధార్మాలన్నీ ఆమెలో ఉన్నాయి .8 మంది మగపిల్లలకు జన్మనిచ్చారు .చివర ఆడపిల్ల అనసూయ .ఒకరు పసితనం లోనే చనిపోయాడు .

చిన్ననాటినుందడి శాస్త్రిగారు తండ్రికి  వ్యవసాయపనులకు తోడ్పడేవారు . వ్యవసాయ యాజమాన్యం సహజం గా అలవడి,మంచి యజమానులుగా పేరు పొందారు .నారు పోయటం ,దుక్కి దున్నటం,  నాట్లు వేయటం ,కూలీలను మాట్లాడటం,కలుపు తీయటం ,అదునుకు నీరు పెట్టటం, కోతలు ,కట్టివేతలు,నూర్పిడి అన్నీ దగ్గరుండి తండ్రీ కొడుకులు చూసేవారు .పొలాల గట్లమీద కొబ్బరి చెట్ల నీడలో తండ్రి తనయులు శిష్యులకు అధ్యయనమూ కొనసాగించేవారు .గ్రామస్తులు ముహూర్తాలకోసం ,ధర్మ సందేహాలు తీర్చుకోవటం కోసం అక్కడికే వచ్చేవారు .ఒక్కోసారి ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి వచ్చేది .సామవేదం వారు’’ ఇంటి వద్ద వేదాధ్యయన౦, ,పొలాలలో వల్లెవేయటం అంతా ధనార్జనా వ్యామోహమే ‘’అన్న  విమర్శకు శాస్త్రిగారు దీటుగా సమాధానం చెబుతూ  ‘’కృషి వేదానికి అవరోధం .వేదం కృషి కి అడ్డంకి’’ ,అని అర్ధం వచ్చే శ్లోకం చదివే వారు .’’వ్యవసాయం కావాలంటే వేదపండితుడు కాలేడు.కానీ నా విషయం లో నా చదువు ,అధ్యయనం నేను వ్యవసాయ విధులను చేబట్టటానికి ,ముందే జరగటం నా అదృష్టం ‘’అన్నారు .

శాస్త్రిగారి తండ్రి గారు  72 వ ఏట 1947 లో చనిపోయారు . అప్పుడు ఆయన వయసు 35 .శాస్త్రిగారు తల్లి ,అర్ధాంగి,కుటుంబం ఇతరులతో   సహా రైలులో సుదీర్ఘ ప్రయాణం చేసి కాశీ వెళ్లి శ్రార్ధ కర్మ నెరవేర్చారు . .ఉన్న ఆస్తి అన్నదమ్ములు పంచుకోగా ,శాస్త్రిగారికి ఎకరం 20 బస్తాలు పండే పంటభూములు వచ్చాయి .అయినా పిల్లల  చదువులకోసం అప్పులు చేయాల్సి వచ్చింది .’’నా జీవితం అప్పు లేకుండా గడవలేదు ‘’అన్నారు ..చిన్న అనసూయ ను కోరుమిల్లి వాసి భమిడి పాటి మిత్రనారాయణ కిచ్చి వివాహం చేయటానికి చాలాకాలం క్రితం 400 రూపాయలు కట్న మిచ్చారు  ఇ తడు ఆహితాగ్ని కుమారుడు .త్వరలో ఆహితాగ్ని అవుతున్నవాడుకూడా .ఆంద్ర దేశం లోనే కాదు, యావత్ భారత దేశం లోనే అత్యంత చిన్నవయసులో ఆహితాగ్ని అయినవాడు .ఈమె వలన శాస్త్రి గారి కుటుంబం ఆహితాగ్ని కుటుంబం కు మళ్ళీ చేరువయింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-18 –ఉయ్యూరు  .

.

 

 

 

 

 

 

 

 




 

 

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

అణు శాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకట రామయ్య పుస్తకావిష్కరణ

అణు శాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకట రామయ్య

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఇప్పటికి 30 సుప్రసిద్ధ గ్రంథాలను ప్రచురించింది .అందులో నేను రాసినవి 18 ఉన్నాయి .వీటిలో ‘’కేమోటాలజి పిత కొలచల సీతారామయ్య ‘’మన ఆంద్ర శాస్త్రవేత్త గురించి రాసినది .ఇప్పుడు అణుశాస్త్ర వేత్త  డా .ఆకునూరి వెంకట రామయ్య గారి  పై వస్తున్న ఈ పుస్తకం  నా 19 వది ,సరసభారతి ప్రచురిస్తున్న 31 వ పుస్తకం.దీనికి సరసభారతికి అత్యంత ఆప్తులు ,ఉయ్యూరు వాసి ప్రస్తుతం అమెరికా లో నివసిస్తున్న శ్రీ మైనేని గోపాల కృష్ణ ,ఆయన అర్ధాంగి శ్రీమతి సత్యవతి గార్లు . వీరిద్దరి ఆర్ధిక సహకారం తో ఇప్పటికి 8 గ్రంధాలు ప్రచురించాము .ఇది వారి స్పాన్సర్ షిప్ లో వస్తున్న9 వ అమూల్య మైన  బుక్ లెట్ . వారిద్దరి సహకారానికి సరసభారతి సర్వదా కృతజ్ఞతలతో ఉంటుంది .శ్రీ రామయ్య గారు తమపై పుస్తకం మేము ప్రచురించటానికి అంగీకరించటం,  వారు , వారి  అర్ధాంగి శ్రీమతి కృష్ణమయి గారు నాకు ఫోన్ చేసి అభినందించి వారి కుటుంబం గురించిన  విషయాలు ప్రాధమికంగా తెలియ జేశారు . రామయ్యగారి కుటుంబం  విద్య ,ఉద్యోగవివరాలు, గ్రంథ రచన,ఇంటర్వ్యులుమొదలైన విలువైన సమాచారం , విశేషాలతో  పాటు  అరుదైన ఫోటోలు  మాకు అందజేయటం వలన ఈ రచన సాధ్యమైంది .శ్రీ గోపాలకృష్ణగారు నాకూ శ్రీ రామయ్య దంపతులకు మధ్య చక్కని ఆత్మీయ వాతావరణం ఏర్పరచి రచనకు విపులంగా దోహద౦ చేశారు .ఇందరి అమృత మూర్తుల సహకార ఫలితమే ఈ చిరు పొత్తం .నేటి యువతకు ,శాస్త్ర పరిశోధకులకు రామయ్య గారి జీవితం ,పరిశోధనలు కరదీపికగా ఉండాలన్న మా ప్రయత్నం సఫలీకృతమౌతుందని ఆశిస్తున్నాం .

  దీనిని అత్యంత సుందరంగా 16 ఫాంట్ , 1/8  డెమ్మీసైజులో రామయ్యగారి అరుదైన ఫోటోలతో ,పూర్ర్తి  కలర్ పేజీలతో, కవర్ పేజీలతో సహా 36 పేజీల” కరదీపిక ”గా శ్రీ మైనేని గారు హైదరాబాద్ లో శ్రీ కర్రి శివప్రసాద్ ,,డా. ద్రోణవల్లి రామమోహనరావు గార్ల పర్యవేక్షణలో ముద్రింప జేస్తున్నారు ..పుస్తకావిష్కరణ తేదీ సమయం మొదలైన వివరాలను డిసెంబర్ మొదటి వారం లో తెలియజేస్తాం అప్పటిదాకా వేచి చూడమని మనవి .-గబ్బిట దుర్గా ప్రసాద్

                             image.png

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

   ధనికొండ హనుమంతరావు

   ధనికొండ హనుమంతరావు

ఒకప్పుడు’’ రేరాణి ‘’పత్రిక చదవని వారంటూ ఉ౦డేవారుకాదు ..చదవక పొతే గిల్టీగా ఫీలయ్యేవారుకూడా .అంతటి ప్రభంజనం సృష్టించి౦ది  ఆ’’ రాత్రి రాణి ‘’..ఈ పత్రిక సంపాదకుడే ధనికొండ హనుమంతరావు .గుంటూరు జిల్లా తెనాలి దగ్గర అమృతలూరు మండలం లో ఇంటూరు గ్రామం లో హనుమంతరావు 1919 లో జన్మించాడు .బి ఏ .చదువు మధ్యలోనే ఆపేసి, రచనలపై దృష్టి పెట్టాడు .గొప్ప రచయితగా ప్రసిద్ధుడైనాడు .’’ఇంద్ర జిత్ ‘’ అనే మారుపేరుతో కూడా రాసేవాడు .ఆయన ఏదిరాసినా హాట్ కేక్ గా చలామణి అయ్యేది. అంతటి చదివించే శక్తి ఆయన కలానికి ఉండటం అదృష్టం .image.png

    ఆ కాలం లో బాగా పేరున్నవార ,పక్ష మాస ,పత్రికలకు  ధనికొండ రచనలు’’ ధనకొండ ‘’గా నిలిచి సిరి సంపదలిచ్చాయి .అనేక కథలు రాసి 15 సంపుటాలుగా వెలువరించాడు .నవలలు నవలికలు 10 రాశాడు .ఆయన 7  నాటికలు ,నాటకాలు కూడా రాసి తన ప్రతిభ చాటాడు .అంటే ఆ రోజుల్లో అందరూ ఇష్టపడి చదివే ఈ మూడు ప్రక్రియలలో రచనలు చేసి పాఠకులకు అతి సన్నిహితుడయ్యాడు .

  వడ్డాది పాపయ్య ముఖ చిత్రాలతో ,లోపలి రంగుల చిత్రాలతో చూడగానే మనసు దోచే’’యువ ‘’మాసపత్రిక ,వంపు సొంపుల అభిసారిక అందచందాలతో వెలిగే ‘’అభిసారిక ‘’  ధనికొండ మానస పుత్రిక , ,వెన్నెలకంటి వారు సాకి పెంచి పోషించిన న  , బాపు రమణలు తీర్చిదిద్దిన ‘’జ్యోతి ‘’మాసపత్రిక , సాహిత్య పత్రికగా ప్రసిద్ధి చెందిన కాశీనాధుని వారి ‘’భారతి ‘’,అలాగే సుభాషిణి ,వాణి ,మహిళా సంపాదకురాలు నిర్వహించిన ‘’ఆహ్వానం ‘’మాసపత్రిక ,రఫ్ పేపర్ అనిపించే కాగితాలపై ప్రింట్ అయి వచ్చే ‘’చిత్రగుప్త ‘’మాసపత్రిక ,కె.ఎల్.యెన్ .ప్రసాద్ పురుడుపోసిన ఆంద్ర జ్యోతి ,నీలంరాజు వారు సాకిన ఆంధ్రప్రభ పత్రిక ,,ప్రజాబంధునీలిమ ,కథాంజలి ,ఆన౦ద వాణి,పుస్తకం మొదలైన ఎన్నో పత్రికలు ధనికొండవారి  రచనలకు నిలయాలయ్యాయి .

  ధనికొండ స్వయంగా క్రాంతి పబ్లికేషన్స్ ,కాంతి ప్రెస్ లు స్థాపించి తన రచనలేకాక ఇతర రచయితల రచనలనూ ముద్రించేవాడు .రేరాణి పత్రిక తో పాటు జ్యోతి మాసపత్రిక ,అభిసారిక ,చిత్ర సీమ పత్రికలను స్థాపించి ప్రచురించాడు .తీరిక లేని పని ఒత్తిడితో ఆయన ప్రెస్ లు ఉన్నప్పుడు జ్యోతి మాసపత్రికను వెన్నెలకంటి రాఘవయ్యకు ,అభిసారిక పత్రికను సామర్లకోటకు చెందిన’’ రాంషా ‘’కు ,చిత్రసీమ పత్రిక ను కొలను బ్రహ్మానందరావు కు ఇచ్చేశాడు .జ్యోతి ని రాఘవయ్యే నడిపినా సంపాదకుడి గా ధనికొండ హనుమంతరావు పేరే వేసేవాడు .

  ధనికొండ సాహిత్య వివరాలు తెలుసుకొందాం —

1-నవలలు నవలికలు -1-లోక చరిత్ర 2- గుడ్డివాడు ౩-మగువ మనసు 4-ఏకాకి 5-ఇలవేలుపు 6-దూతికా విజయం 7-జ్ఞాని 8-తీర్పు 9-జగదేక సుందరి 10-క్లియోపాత్రా .

2- కథాసపుటాలు -1-పరిశోధన 2-గర్వ భంగం 3-ప్రియురాలు 4-కాముకి 5-  సంజీవి 6-కుక్కతోక 7- బుద్ధి శాలి 8-ప్రణయాన్వేషి.9-అనాథ 10-చక్రి 11-అపనింద 12-గళ్ళరుమాలు13-పన్నాగం 14 –వృత్తి ధర్మ౦ 15-నా కొడుకు (పెద్ద కథ)

3-నాటికలు నాటకాలు –1-ఎర్రబుట్టలు 2- ఉల్టా సీదా 3-ప్రోఫెసర్ బిండ్సన్ 4-చికిత్స 5-జ్ఞాని 6-మధుర కల్యాణం( దృశ్య నాటిక) .7-పవిత్రులు (దృశ్య నాటిక)

  అ నాటి తెనాలి సాహిత్యం లో నందనవనమై సురభిళ సాహితీ సంపదకు నిలయమైంది .రావూరి భరద్వాజ ,ధనికొండ హనుమంతరావు ,ఆలూరి భుజంగరావు ,శారద పేరుతో తెలుగు నవలలు రాసిన  తమిళుడు  నటరాజన్ అత్యంత స్నేహంగా సన్నిహితంగా ఉండేవారు .’’సాహిత్యబాట సారి శారద ‘’అని భుజంగరావు శారదను స్మరించాడు .ధనికొండ అండ తో , శారద ప్రోత్సాహంతో ఆలూరి రచన ప్రారంభించాడు .వీరందరికీసాహిత్య  ప్రేరణగా నిలిచినవాడు రావూరి భరద్వాజ .ఒక్క ధనికొండ తప్ప వీరందరూ బీదరికపు లోతులు తరచినవారే .అందరూ అద్భుత రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారే .ధనికొండ హనుమంతరావు వీరికి అన్నిరకాలుగా వెన్ను దన్నుగా నిలిచిన దాత ,ప్రోత్సా హకుడు.

 బహువిధ  పత్రికాసంపాదకుడు ,కథ, నాటిక, నవలా ప్రక్రియలలో సామాజికాంశాలను ప్రతిబి౦బించేట్లు రచనలు చేసి,పాఠకులకు అతి సన్నిహితమైన  చెయ్యి తిరిగిన రచయిత, వితరణ శీలి ,సాటి రచయితలకు కొండంత అండా, దండా ధనికొండ హనుమంతరావు 71 వ ఏట మద్రాస్ లో 21-12- 1989 లో మరణించాడు .

  రాడికల్ హ్యూమనిస్ట్ ,తెనాలి ప్రాంతం వారూ అయిన డా .నరిశెట్టి ఇన్నయ్య గారు నాకూ ,శ్రీమైనేని గోపాల కృష్ణ గారికి  సాహితీ మిత్రులు . చాలాకాలం నుండి అమెరికాలోనే శ్రీ  ఇన్నయ్య దంపతులు పిల్లలవద్ద ఉంటున్నారు .నేను ఇండియాలో ఉన్నా ,అమెరికాలో ఉన్నా ,కనీసం నెలకొకసారైనా ఫోన్ చేసి మా ఇద్దరితో మాట్లాడే సహృదయులు .ఐదురోజుల క్రితం శ్రీ ఇన్నయ్యగారు అమెరికా నుంచి ఫోన్ చేసి, ఈ ఏడాది  ధనికొండ హనుమంతరావు గారి శతజయంతి సంవత్సరం అనీ ,ఆయన  సాహిత్యం నాదగ్గర ఉందా అనీ అడిగితే లేదని చెప్పాను.తామిప్పుడు  తెనాలి మిత్రుల సహకారం తో ధనికొండ సంపూర్ణసాహిత్యాన్ని పునర్ముద్రణ చేస్తున్నామని చెప్పారు .చాలా సంతోషం అన్నాను .ఈ శతజయంతి సందర్భం గా ధనికొండ ను సాహితీ మిత్రులకు పరిచయం చేయటానికి చేసిన ప్రయత్నమే ఇది .

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-9-18 –ఉయ్యూరు

 

ధనికొండ హనుమంతరావు
సాహితీ బంధువులకు ఒక విజ్ఞప్తి -నిన్న రాత్రి ధనికొండ హనుమంతరావు పై నేను రాసిన ఆర్టికల్ శ్రీ మైనేని గారు తనకు పంపగా శ్రీ ఇన్నయ్య గారు చదివి అందులో నేను మర్చి పోయిన విషయాన్ని తెలియ జేశారు .వారికి ధన్యవాదాలు -వారు సూచిన విషయం —
”రేరాణి సంపాదకులు గా ధనికొండ హనుమంతరావు ను చేసింది శ్రీ ఆలపాటి రవీంద్ర నాథ్.ధనికొండ ను ”అభిసారిక ”పత్రిక స్థాపించమని కూడా శ్రీ ఆలపాటి ప్రోత్సహించారు” .
మీకోసం మరొక్క వివరణ.శ్రీ ఆలపాటి రవీంద్ర నాథ్”మిసిమి ”అనే సాహిత్య సాంస్కృతిక మాస పత్రిక సంస్థాపక సంపాదకులు ..శ్రీ ఆలపాటి బాపన్న గత ఇరవై ఏళ్ళుగా ప్రచురణకర్తగా ఉన్నారు .శ్రీ చెన్నూరి ఆంజనేయ రెడ్డి ప్రధాన సంపాదకులు .శ్రీ అన్నపరెడ్డి వేంకటేశ్వర రెడ్డి సంపాదకులు .శ్రీ లక్ష్మీ రెడ్డి, శ్రీ ఈమని నాగిరెడ్డి ,,,అబ్బూరి గోపాలకృష్ణ, శ్రీ జయధీర్ తిరుమలరావు, శ్రీ కుర్రా శ్రజితేంద్ర బాబు సహాయ సంపాదకులు .
.మిసిమి మాసపత్రిక అరుదైన పత్రిక దాన్ని చదవటం ఒక గొప్ప అనుభూతిగా ఉండేది. మిసిమి తెల్లదనపు కాగితం ,రంగుల చిత్రాలు దేశ విదేశాల చిత్రాలు ఆయిల్ పెయింటింగ్స్ ,అరుదైన వ్యాసపరమపర మిసిమిని అత్యున్నత స్థాయి పత్రికను చేశాయి –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రేడియో టాక్

సాహితీ బంధువులకు శుభకామనలు -మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భం గా విజయవాడ రేడియో కేంద్రం వారు గాంధీజీ -సత్యం ,అహింస ,సత్యాగ్రహం  సహాయ నిరాకరణ అనే 4 అంశాలపై రాసి ప్రసంగించమని కోరగా ,రాసి ఇవాళే రేడియోస్టేషన్ కు వెళ్లి  రికార్డ్ చేసిశాను .ఇవి ఉదయం 6 గంటల” సూక్తి సుధ ”లో అక్టోబర్ 6 ,8 ,,13 ,15 తేదీలలో ప్రసారమౌతాయిని తెలియజేస్తున్నాను -మీ -దుర్గాప్రసాద్

Posted in రేడియో లో | Tagged | Leave a comment

కాలభైరవాలయం  –ఇసన్నపల్లి

కాలభైరవాలయం  –ఇసన్నపల్లి

తెలంగాణా కామారెడ్డి జిల్లా రామన్నపల్లి మండలం ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం ప్రసిద్ధమైంది .కాశీలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు . శివుని ఆత్మస్వరూపం తో  ఇక్కడ కాలభైరవస్వామి కొలువై ఉన్నాడు .ఇదికామారెడ్డికి 10 కిలోమీటర్ల దూరం లో ఉన్న క్షేత్రం .పంటపొలాలమధ్య పింక్ రంగు దేవాలయం దూరం నుంచే ఆకర్షిస్తుంది .దోమకొండ సంస్థానాదధీశులకాలం లో 200 ఏళ్ళక్రితం  పునర్నిర్మింప బడింది .కాశీ తర్వాత కాలభైరవునికి అంతటి విశిష్టమైన దేవాలయమిది .13 శతాబ్దం నాటి ఆలయంగా గుర్తింపు పొందింది .

  చేతబడి చేయబడిన వారి బాధలు పోవటానికి ఈ కాలభైరవుని 21 రోజులు కాని 41 రోజులు కాని దీక్షగా సేవిస్తారు .సంతాన ,ఉద్యోగ మరేఇతర సమస్యలున్నా స్వామికి మొక్కుకుంటే తీర్చే భక్తులపాలిటి కొంగుబంగారం స్వామి .రామారెడ్డి గ్రామాన్ని  రధాల రామారెడ్డి పేట అనేవారు. అక్కడ రంగ రంగ వైభవంగా దేవతా రదోత్సవాలు జరిగేవి .17 వ శతాబ్దం దాకా ఇది దోమకొండ సంస్థానం అధీనంలో ఉండేది .1550- నుండి 1600 వరకు పాలించిన రెండవ కామి రెడ్డి కొడుకు రెండవ మల్లారెడ్డి కొడుకు రామా రెడ్డి పేరుతొ నిర్మించబడిన గ్రామం రామారెడ్డి .మల్లారెడ్డి ఇక్కడే శ్రీ సీతారామస్వామి దేవాలయం శ్రీ రాజరాజేశ్వరి దేవాలయాలు నిర్మించాడు .ఈ రెండు గుడులలో ప్రతి ఏడాది బ్రహ్మాండంగా రదోత్సవాలు జరిగేవి . ఈ దేవాలయాల నిత్యపూజా మహోత్స వాలకు,నిర్వహణకు  సంస్థానాధిపతి  రాసిచ్చిన అగ్రహారమే ఇస్సన్న పల్లి .ఇది రామారెడ్డి కి  ఈశాన్యం లో ఉంటుంది .

  మల్లారెడ్డి అన్న ఎల్లారెడ్డి తనకొడుకు విస్సా రెడ్డి పేరుతొ కట్టించినది విస్సన్నపల్లి ,కాలక్రమం లో ఇసన్న పల్లి అయింది .ఈ ఊరి మొదట్లోనే కాలభైరవాలయం ఉంది .ఇందులో 8 దిక్కులలో 8 మంది  భైరవులుఉండేవారు . ..అందులో ఈశాన్యం లోని ‘’ఈవానుడు’’ అనే  కాలభైరవుడే ముఖ్యం .ఈశాన్య దిక్కులో ఉన్నాడుకనుక ఈశాన్యపల్లి అనే పేరు క్రమంగా ఇసన్నపల్లిగా కూడా మారి ఉంటుందని స్థానిక కధనం .అసితంగ భైరవ,రురు భైరవ ,చండ్ర భైరవ ,క్రోధ భైరవ ,ఉన్మత్త భైరవ ,కాపాలభైరవ ,భీషణ భైరవ ,సంహార భైరవ అని భైరవులు ఎనిమిది మంది . కాని ఈక్షేత్ర కధనం ప్రకారం అతిసాంగ,సంసార ,రురు ,,కాల ,క్రోధ ,తామ్ర చూడ, చంద్ర చూడ  ,మహాభైరవులు .ఇందులో ముఖ్యుడైన కాలభైరవస్వామే ఇక్కడ కొలువై ఉన్నాడు .మిగిలిన 7 భైరవ విగ్రహాల ఆచూకీ ఇప్పుడు లేదని చెపుతున్నారు. ఈ కాలభైరవ విగ్రహం క్రీశ13 వశతాబ్ది కాకతీయులకాలం నాటిదని విశ్వసిస్తారు .స్వామి దిగంబరంగా ఉండటం తో ఈ విగ్రహాన్ని దిగంబర జైన విగ్రహం అని కూడా అపోహ ఉంది .ఇసన్నపల్లి,రామారెడ్డి గ్రామాలు 1550 -60 కాలం లో ఏర్పడ్డాయికనుక ,ఇది జైన విగ్రహం కాదన్నారు .పురాణాలు కాలభైరవుని దిగంబరునిగానే వర్ణించాయి కనుక ఇది సనాతన వైదిక దేవతా విగ్రహమే నని స్పష్టంగా చెప్పవచ్చు.

  కాలభైరవ ఆవిర్భావం గురించి తెలుసుకొందాం .పూర్వం  మహర్షులు మేరు పర్వతం పై చేరి ‘’అఖండ పదార్ధం ఏది?’’అని త్రిమూర్తులను ప్రశ్నించారు బ్రహ్మ తానే అని ,అంటే శివుడు యజ్ఞాధిపతి ఐన తానే అన్నారు .దీన్ని బ్రహ్మ విష్ణువులు ఒప్పుకోలేదు .అప్పుడు అందరు వేదాలను చెప్పమన్నారు .వేదాలు ‘’మేము చెప్పింది నమ్ముతాము అంటే చెపుతాము ‘’అన్నాయి .సరే అని ఒప్పుకోగా ‘’శివుడే అఖండ పదార్ధం ‘’అని విస్పష్టంగా చెప్పాయి .విష్ణువు అంగీకరించగా బ్రహ్మ ఒప్పుకోకపోతే శివుడు కాలభైరవుని సృష్టిస్తే అతడు బ్రహ్మను చంపేశాడు .అంటే బ్రహ్మగర్వభంగం చేశాడన్నమాట .కాలభైరవుడు తనబ్రహ్మ హత్యాపాతకం పోవటానికి ఉపాయం చెప్పమనగా బ్రహ్మ కపాలం పట్టుకొని సకల క్షేత్రాలనదుల్లో స్నానం చేయమని  ఎక్కడ అది జారిపోతుందో అక్కడ పాపం తొలగినట్లే అని చెప్పాడు .కాశీలో గంగానదిలో స్నానం చేయగానే బ్రహ్మ పుర్రె జారిపోగా శివుడు అతని బ్రహ్మ హత్యాదోషం పోయిందని  జన్మ రాహిత్యం కలిగిందని చెప్పి కాశీలో కొలువైఉన్న తనకు క్షేత్ర పాలకుడిగా ఉండమని ఆదేశిస్తాడు .

   స్థానిక కధనాలు కొన్ని చూద్దాం .ఇక్కడకాలభైరవ విగ్రహం ప్రతిస్టించటానికి కాశీలో విగ్రహం చెక్కించి ఎడ్ల బండీ మీద తెస్తుంటే ఇక్కడికి రాగానే బండీ  ఆగిపోయింది  ఎడ్లు బెదిరిపారిపోయి బండీ విరిగి పోయి అప్పటిదాకా పడుకోబెట్టబడిన విగ్రహం అమాంతం లేచినిలబడి అదే తాను ఉండాల్సిన చోటుఅని చెప్పింది . ఆ ప్రకారమే ఊరి మొదట్లో అక్కడవదిలేసి వెళ్ళిపోయారు ..అక్కడే ఎండకూ వానకూ ఆచ్చాదన,లేకుండా ఉంటె  ,గ్రామస్తులు భీకరారకారమైన ఆ విగ్రహానికి పూజ చేయటానికి ఝడిసేవారు .కరువుకాటకాలు వస్తే మాత్రం ఆవు పేడ తెచ్చి విగ్రహానికి పూసేవారు .ఆ పేడ కరిగిపోయేదాకా కుంభ వృష్టి కురిసేది .లోకకల్యాణానికి తనవిగ్రహానికి పేడ రుద్దినా సహించిన కరుణామయుడు ఈ కాలభైరవుడు  .

  భక్తుల మనోభావం లో మార్పు వచ్చిఎన్నో ఏళ్ళ తర్వాత ప్రజలు పూజ చేయటం మొదలు పెట్టారు .తర్వాత విశాలమైనప్రాంగణ౦ లో గొప్ప ఆలయం కట్టి స్వామిని ప్రతిష్టించారు .సి౦ధూరవర్ణం తో స్వామినిలువెత్తు విగ్రహం  తో మెరిసిపోతూ దర్శనమిస్తాడు .ధ్వజస్తంభం  శివలింగం లింగం ముందు కాలభైరవ (శునక )విగ్రహం కనిపిస్తాయి. గర్భ గుడిలో శిలారూప కాలభైరవ స్వామి దర్శనమిస్తాడు  , భీకర రూపం కనబడకుండా ముఖానికి వెండి తొడుగు వేస్తారు .ఆయనకు ముందు నంది విగ్రహం ఉంటుంది .భక్తులుకోరికలుతీరటానికి కొబ్బరికాయముడుపులు ,వస్త్రాలు, తొట్టెలు,కడతారు .దుస్ట శక్తుల నివారణకోసం 10 ,20, 50, 100 రూపాయల  నోట్ల దండలు కడతారు .స్వయంభుగా వెలసిన ఏకైక కాలభైరవ విగ్రహం కనుక మహా మహిమాన్వితం .పూజలు శైవ సంప్రదాయం లో జరుగుతాయి .మహారాష్ట్ర ,కర్నాటక ను౦డి కూడా భక్తులు వస్తారు .శనిప్రభావం తొలగటానికీ ఈస్వామి దర్శనం చేస్తారు .ఆరోగ్య సమస్యలున్నవారు రెండుపూటలా స్నానం చేసి స్వామివారిని దర్శించిపూజిస్తారు .నిత్యపూజలతోపాటు ప్రతిమంగళవారం విశేషపూజలు, అన్నసమారాధనా జరుగుతాయి.కార్తీక వైశాఖ మాసాలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు .కార్తీక బహుళ పంచమినుండి స్వామివారి జన్మ దిన వేడుకలు  నవమి వరకు 5 రోజులు మహోత్సవంగా చేస్తారు .రధోత్సవం ,అగ్నిగుండాల వేడుకకూడా నిర్వహిస్తారు  పూర్ణాహుతితో సమాప్తం ..వైశాఖం లో నాలుగు మంగళవారాలు విశేష పూజలు చేస్తారు .మొదటిమంగళవారం 108 రకాల స్వీట్లు నైవేద్యం  రెండో వారం పుష్పాలంకరణ ,మూడోవారం పండ్లతో   నాలుగోవారం  విశేషమైన అలంకరణ ఉంటాయి శ్రావణమాసం లో లక్ష బిల్వార్చన ,నిత్యాభిషేకం ఉంటాయి ,

   ఆలయంలో కాలభైరవునితోపాటు శివలింగం వినాయక విగ్రహంఉన్నాయి  .కాలభైరవ ఉత్సవవిగ్రహం రుద్రాక్షలతో శోభాయమానంగా ఉంటుంది .ఇక్కడి బావిలో నీరు ఏకాలమైనా పుష్కలంగా ఉండి స్వామి అభిషేకాలకు భక్తులకు విశేషంగా ఉపయోగపడుతుంది .

 శ్రీ కాలభైరవ దర్శనం సకల దోష నివారకం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-18 –ఉయ్యూరు

Posted in దేవాలయం | Tagged | Leave a comment

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -7

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -7

మిథిలానగరానికి దగ్గరలో ఒక ఆశ్రమం లో ‘’కతుడు ‘’అనే ఆయన ఉండేవాడు . .ఆయన కుమార్తె కాత్యాయని .అందం తో పాటు బుద్ధి శాలిని .యుక్తవయసురాగానే  కతుడు భార్యతో కూతురు వివాహ విషయం చర్చించాడు .శుభ లక్షణాలున్న తమ కూతురు  సాక్షాత్తు లక్షీస్వరూపమని భావించారు .గంగాతీరం లో ఒక మహాత్ముడు ఆశ్రమం లో ఉంటూ బ్రహ్మజ్ఞానం బోధిస్తున్నాడని అతడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడని లోకుల ద్వారా  తెలుసుకొని అతనికి తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని తలచారు.కతుడు అతని వివరాలు స్వయంగా తెలుసుకోవటానికి బయల్దేర యజ్నవల్క్యాశ్రమం చేరి ఆతనితో ‘’మాకు లక్ష్మీదేవి వంటి కాత్యాయని అనే కూతురు ఉంది .విష్ణు స్వరూపంగా ఉన్న మీరామెను వివాహం చేసుకోమని విన్నవి౦చటానికి విచ్చేశాను ‘’అన్నాడు . సంతోషం తో అంగీకరించి ,ఋషి బృందంతో కలిసి యాజ్న్యవల్క్యుడు వెళ్లి ,ఒక శుభ ముహూర్తం నాడు కాత్యాయనిని పరిణయమాడాడు . కాత్యాయినీ కళ్యాణ వైభోగాన్ని చూసి అందరూ ఆనందించారు .

యాజ్ఞ్యవల్క్యుడు బాదరాయణునికి దౌహిత్రుడైన బ్రహ్మ దత్తునికి తాను నేర్చిన శుక్ల యజుర్వేదాన్ని క్షుణ్ణంగా అభ్యసింప జేసి ,ప్రయోగం ఎలాచేయాలో యాగాలు  కూడా చేయించాడు .ఆకాలం లో యాగాలు అన్నిటికన్నా శ్రేష్టమైన కర్మలని భావించేవారు .పిలిచినా ,పిలవకపోయినా యాగాలు చూడటానికి రుషి గణం ఉత్సాహంగా వచ్చేది.శాకల్యుడు అనబడే వైశంపాయనుడు ,ఉద్దాలకుడు ,తిత్తిరి ,శ్వేతకేతుడు ,కహోళుడు మున్నగు ఋషులు కూడావచ్చియాజ్ఞవల్క్యుడు చేయించే యజ్న విధానాన్ని చూసి ఆశ్చర్య పోయేవారు .మేనల్లుడిని తన ఇంటి నుంచి తరిమేస్తే ఇంతటి ప్రభావ శీలి అయినందుకు మేనమామ శాకల్యుడికి ఈర్ష్య కలిగింది .తనతో వచ్చినవారితో పూర్వం నుండి వస్తున్నకల్పాలన్నిటినీ మార్చేసి ,కొత్తవి  కల్పించి చేయిస్తున్న తీరు నచ్చలేదని చెప్పాడు .ఉద్దాలకుడు ‘’ఈ వేదం యాజ్ఞవల్క్యుడు కల్పించినట్లుగా ఉన్నది ‘’అన్నాడు . మిగిలిన ఋషులు తొందర పడటం మంచిదికాదని ,ఈ విధులన్నీ ఎవరి వద్ద నేర్చాడో తెలుసుకోవాలని అన్నాడు .క్రోధం ఉంటె అవతలి వారిలో ఉన్న గుణం దోషంగా కనిపిస్తుంది అని వారించారు .

వారు యాజ్ఞావల్క్యుని చేరి ‘’మహాత్మా !ఈవేదం పేరేమిటి ?దానిలో విషయమేమిటి ?ఎవరి దగ్గర నేర్చావు ‘’అని సవినయంగా ప్రశ్నించారు .దానికి ఆయనకూడా అత్యంత వినయం తో ‘’ఋషి పు౦గవులారా !  దీన్ని శుద్ధ యజుర్వేదం ,ఏకాయనం ,యాతయామ అంటారు .ఇది వ్యవస్థితి ప్రకరణం ,సర్వకర్మ నిరూపకం ,పూర్వ ,ఉత్తరాంగ సహితం .స్వయంభు బ్రహ్మనుండి ఏర్పడి సర్వ తేజో రాశి అయిన సూర్యుని వద్ద అధ్యయనం చేశాను ‘’అని విన్నవించాడు .సాకల్యుడికి అంతటి తేజో రాశి అయిన సూర్యుని ఎలా చూశావని అడిగాడు .కావాలంటే దర్శనం కలిగిస్తానని చెప్పి తేజో మయమైన తన రూపాన్ని చూపించగా  వాళ్ళు మూర్ఛ పోయారు .కాసేపటికి తేరుకొని యాజ్ఞావల్క్యుని అవతార పురుషునిగా భావించి ,ఆయన సాక్షాత్తు పరాత్పరుడే అని నిశ్చయం చేసుకొని ఆయనవద్దే అన్నీ నేర్చుకొందామని నిర్ణయానికి వచ్చారు .

మిగిలిన  ఋషుల అభిప్రాయాన్ని మన్నించని శాకల్యుడు  వారికి వెర్రి ముదిరిందని ,అదంతా అతని మాయాజాలమని కొట్టిపారేసి ,తనపై కోపంతో గురుకులం నుంచి వచ్చి ,ఇక్కడ తానేదో వెలగబెడుతున్నాడనిఅన్నాడు ,అప్పుడు ఆ ఋషులు తమలో తాము యాజ్ఞవల్క్యుడు తమ వేదాన్ని అపహాస్యం చేయనే లేదని ,తాముకాని తమ శిష్యులు కానీ అయన చేసే విమర్శలకు  సమాధానం చెప్పలేక తలది౦చుకోవాలని అనుకోని ‘’మంత్రం బ్రాహ్మణం వేర్వేరుగా ఉండాలా ?స్వరం మొదలైన భేదాలు లేకుండా ఒకటిగానే ఉండాలా?ఒకటిగా ఉంటే ,మంత్రం అని  బ్రాహ్మణం  అని రెండు పేర్లెందుకు ?మంత్రం అంటే, బ్రాహ్మణం అంటే ఏమిటి ?శాస్త్రాలలో రెండిటికీ భేదం చూపించారా లేదా ?బ్రాహ్మణం మంత్రానికి వ్యాఖ్యానం అవుతు౦దా కాదా ?కాదు అంటే బ్రాహ్మణం లో ‘’ఇషేత్వా ‘’మొదలైన మంత్ర ప్రతీపకాలకు ఎందుకు వ్యాఖ్యానం చేశారు ?ఇదికాదు అంటే నేరం కాదా ?పోనీ  బ్రాహ్మణం అయినా మనకు సమగ్రంగా ఉందా ?లేదుకదా .అలాఉంది అంటే ‘’పరాయాతం ‘అనే పేరు మన బ్రహ్మణ౦  లో కొంతభాగానికి ఎందుకొచ్చినట్లు?మన బ్రాహ్మణాలలో కొన్నిభాగాలను ‘’కాఠకాలు ‘’అని ఎందుకు పిలుస్తారు ?ఇది కఠశాఖ నుంచి రాలేదని చెప్పగలమా ?మంత్రానికి మంత్రం ,బ్రాహ్మణానికి బ్రాహ్మణం వేర్వేరుగా లేకపోవటం మన వేదానికే కాని రుగ్వేదాదులకు ఉందా ?లేదుకదా .వాటికి బ్రాహ్మణాలు సంహిత లతో కలిసి ఉండకుండా ప్రత్యేకంగా ఉన్నాయికదా ?అన్ని వేదాలకు  మంత్ర బ్రాహ్మణం స్వరం మొదలైన భేదాలతో వేటికవి అలా ప్రత్యేకంగా ఉంటే , వేదానికి మాత్రం అలా లేకపోవటాన్ని ఏమనాలి ? .అది అలాఉండనీ –

‘’క్రియలన్నీ మంత్రాలతోనే చేయాలా ?మంత్ర వ్యాఖ్యానాలైన బ్రాహ్మణాలతో చేయాలా ? దీనిపై స్పష్టత లేదుకదా?అలాయితే శాస్త్ర విరుద్ధమవుతుంది .అన్ని క్రతువులు మంత్రాలలో అంటే సంహితలలో ఉన్నాయా ?ఉన్నాయంటారా ?సౌత్రామణి,పురుషమేధం సంహితలలో ఎక్కుడున్నాయో చెప్పగలమా ?పైగా ,సర్వ మేధం ,పితృ మేధం ,ప్రవర్గ్యలు మనకు బ్రాహ్మణాలలో కనిపించవుకాని ,ప్రత్యేకభాగాలుగా ఉన్న ఆరణ్య కాలలో ఉంటాయికదా . ఆరణ్య కానికి యేమని అర్ధం చెపుతాం ?అరణ్యాలలో అధ్యయనం చేసినందుకే కదా వాటికి ఆరణ్యకాలు అనే పేరొచ్చింది ?దీనికి సార్ధక్యం ఉందా ?మనకు’’శుక్రియ ‘’ భాగం సంహితలో ఉందా ?లేదే .శుక్రియలంటే సూర్యుడు ఉండగా పఠించే మంత్రాలుకదా?’’అని తర్జన భర్జన పడ్డారు .ఇంకా సందేహాలు తీరక ప్రశ్నించుకొన్నారు .వాటిని తర్వాత తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-18 –ఉయ్యూరు


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా ‘’,అన్నమనవడు

మా నైంత్ క్లాస్ మనవడు పరిగెత్తుకొచ్చి ‘’తాతా!రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా’’అన్నాడు .పిల్లకాకి కేం తెలుసు?అనుకోని ,’’ఏరా అదేమైనా ఆషామాషీ వ్యవహారమా ? అది యుద్ధ విమానం రా ‘’అన్నాను .’’అయితే ఏంటిట?’’అన్నాడు .’’కాదురా బుడ్డీ !దాని సంగతి నీకేం తెలుసు ?’’అన్నాను .’’తాతా!చిన్నప్పుడు నేను కాగితం పడవలు చేసి వాననీళ్ళలో పరిగెత్తించా .కాగితాలతో రాకెట్లు తయారు’ చేసి క్లాస్ రూమ్ లో టీచర్లపై వేశా.కాగితం విమానాలు చేసి గాల్లో ఎగరేశా .ఇంతకంటే అనుభవం ఏం కావాలయ్యా తాతయ్యా ?’’అన్నాడు రెచ్చిపోయి . ‘’కూల్ డౌన్ మై డియర్ గ్రాండ్ సన్’’అన్నాను .’’తాతా !నువ్వు టి.వి. చూడవ్  .న్యూస్ వినవ్ .ఎవరైనా చానెళ్ళలో డిస్కస్ చేస్తుంటే కట్టి పారేస్తావు .మోడీ భజన తప్ప నీకేం తెలుసు ?’’అన్నాడు .తలది౦చు కొన్నా మాట్లాడ లేక .’’సరేరా !కాగితం పడవలు , విమానాలు చేస్తావు బాగానే ఉంది .ఇవి డిఫెన్స్ విమానాలు .వాటిబోల్ట్ లు, నట్లూ కూడా తయారు చేయటం కూడా రాని వాడివి .నువ్వు మీసాలు మెలేస్తావా ?’’అన్నాను .తాతా !మిస్టర్ క్లీన్ అనిపించుకున్నవాళ్ళు  పీకల్లోతు అవినీతి బురదలో కూరుకుపోయి ,ఎన్నికలలో ఓడిపోయారు తెలుసా ? ‘’అని దబాయించాడు .’’ఒరే !నువ్వు మిడికేది తొమ్మిదో గలాసు .ఇన్ని విషయాలు ఎలా తెల్సు ?’’అని నేను దబాయించా .అసలు రహస్యం చెప్పాడు . ‘’రోజూ  చదువు కొన్నతర్వాత యు ట్యూబ్ లో దేశం లో ఏం జరుగుతోందో చూడండి .భావి పౌరులు మీరేకదా!అని మా టీచర్లు చెప్పారు .అందుకే చూసి విషయాలు తెలుసుకొన్నా .మాఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తా ‘’అన్నాడు .ఇంకేం మాట్లాడను ? వాడి చేతిలో దొరికి పోయా ఫుల్లు గా .’’ఏంటితాతా ఇందాక నట్లు  బోల్ట్లు అన్నావ్ ?’’అన్నాడు .’’అవున్రా! కనీసం టెక్నాలజీ పై అండర్ స్టాండింగ్ కూడా లేని నువ్వు రాఫెల్ అంటూ ఫూల్ అవుతావేంట్రా ?’’అన్నా .’’చాల్లే తాతా ! మన ప్రదానికి సైన్స్, టెక్నాలజీ నాలెడ్జ్ పూజ్యం అన్నాడు విశ్లేషకుడు సి నాగేశ్వరరావు ‘’అన్నాడు .’’రే!ఆయన౦టే వాళ్లకు ద్వేషం .ఆయన ప్రగతి శీల విధానాలను తప్పు పట్టటమే వాళ్ల ధ్యేయం .మీడియా ఉందికదా అని సొల్లు కబుర్లతో డిస్కషన్ పేరిట గంటలు గంటలు సాగదీస్తారని విన్నాను’’అన్నాడు .’’అబ్బచ్చీ !యెంత నంగనాచి తుంగబుర్ర మీ నాయకుడు తాతాజీ ?‘’   అన్నాడు ‘.’’ఒరే ఊరుకొంటూ ఉంటె మరీ పెట్రేగి పోతున్నావు .అడ్డకట్ట వెయ్యి ‘’అని దబాయించాను .’’అ౦బానీకున్న క్వాలిఫికేషన్ ఏమిటి ? నాకు లేని దేమిటి ?’’అన్నాడు .’’మళ్ళీ మొదటికే వచ్చావా ?అతడికి ఇండియాను కొనేంత డబ్బుంది ‘’అన్నా .’’అంతకు మించి అప్పుకూడా ఉందిట తాతగారూ ‘’’అన్నాడు .అవాక్కయ్యా .లేని ధైర్యం తెచ్చుకొని ‘’ఆయన కావాలంటే కోట్లు పెట్టుబడి పెట్టగలడు . మరినువ్వో ?’’అన్నా .’’నేను నీపాత కోట్లు పెట్టుబడి పెడతాలే తాతా’’అని వేళాకోళమాడాడు .

‘’సరేరా !ఇది అంతర్జాతీయ ఒప్పందం .ఆ విమానాలు తయారు చేసేది ఫ్రాన్స్ దేశం .వాళ్లకు బోలెడు టెక్నాలజీ ఉంది .అంత టెక్నాలజీ అంబానీ రిలయెన్స్ కుందని నమ్మి ఆ డీల్ ఇప్పించాడు మోడీ ‘’అన్నాను .’’ఓహో ఏం సెలవిచ్చావ్ తాతా !అంబాని విమాన తయారీ కంపెనీ పెట్టి అప్పటికి ఆరునెలలు కూడా కాలేదు .విమానం తయారు చేసే అనుభవం ఉన్న కంపెనీకాదు . నువ్వన్నట్లు కనీసం వాటి నట్లూ బోల్ట్ లు కూడా తయారు చేసే టెక్నాలజీ వాళ్లకు లేదు ‘’’’అన్నాడు .’’ఎదురు మాట్లాడే సాహసం చేయలేకపోయా .’’యుద్ధ విమానాల డీల్ చాలా రహస్యం .దాన్ని ఎవరూ బయటపెట్టరు అంత సీక్రెట్ ‘’అన్నా .’’సాకులు చెప్పకు తాతా .అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడి గర్ల్ ఫ్రెండ్ సినిమాకు అంబాని 23 కోట్లు పెట్టుబడి పెట్టాడట .అంబానీ మోడీకి జిగ్నీదోస్త్ .అందుకే డీల్ అప్పగించాడు మీ గురువు ‘’అన్నాడు .నిరుత్తరుడనయ్యా .’’తాతా ! నిష్పక్ష పాతంగా విషయాన్ని విశ్లేషించే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ‘’యుడిఎఫ్ ప్రభుత్వం 136 రాఫెల్ విమానాలు కొందామనుకొంటే ,ఇప్పుడు మోడీ ప్రభుత్వం 36 విమానాలనే వాళ్ళు కొందామనుకొన్న రేటుకంటే 5 రెట్లు ఎక్కువ పెట్టి డీల్ కుదుర్చుకున్నారు . అసలు’’ తేజస్వి’’ లాంటి ప్రసిద్ధ యుద్ధ విమానాలు తయారు చేసి ఎంతో అనుభవమున్న   భారతప్రభుత్వ’’ హిందూస్తాన్ ఐరో నాటికల్ మిటెడ్-  హాల్ ‘’ఉండగా ,ఇంతవరకు ఏ కంపెనీని  సమర్ధవంతంగా నడిపాడు అన్న పేరులేని , భారతీయ బ్యాంకులకు  రెండు లక్షలకోట్ల అప్పుఉన్న అంబానీకి అప్పగించటం ఏమిటి ?“’అని ప్రశ్నించాడు .’’అవునా ’’అన్నాను నేనూ నంగనాచిలా .

‘’ అదికాదు కాని తాతా !యెంత స్నేహితుడైనా భారత దేశం డబ్బు 30 వేలకోట్లు అప్పనంగా ఆయనకు ,మరోపేరుతో నాన్ డిఫెన్స్ ఆర్టికల్స్ తయారు చేయటానికి అంబానీ సోదరుడికి కట్టబెట్టి దేశం పరువు తీశాడు మీ అధినాయకుడు .ప్రభుత్వ రంగ సంస్థ సమర్ధవంతంగా యుద్ధ విమానాలు తయారు చేసే సామర్ధ్యం ఉంటే నట్లూ బోల్ట్ లూ తయారు చేయటానికి ఫ్రాన్స్ తో ఒప్పందం ఆఘమేఘాలమీద కుదుర్చుకోవటం ఏమిటి ?మరోమాట  తాతాజీ !అంబానీ రిలయెన్స్ సంస్థను సూచిందే మోడీ అనీ ,దానినే ఫ్రాన్స్ ఆమోదించిందని మాజీ అధ్యక్షుడు చెప్పాడని , మోడీ అబద్దాలకోరు అని పాక్ కొత్తప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా అన్నాడని ‘’కుండబద్దలు కొట్టాడు ‘’బంగారాన్ని ధర్మకాటా వేసినట్లు ఎటూ మొగ్గులేకుండా కాటా సుబ్బారావు ‘’అనగానే నిజంగా నా మైండ్ బ్లాంక్ అయి ఏదో అనాలని ‘’కుదబద్దలు ఏమిట్రా .కొత్తగా ఉంది ‘’అన్నా .కాటా సుబ్బారావు అనే ఆయన దాన్ని  నడుపుతున్నాడు చాలా  నిర్మోహమాటంగా  నిష్పాక్ష పాతంగా విశ్లేషిస్తాడు సుబ్బారావు .’’అన్నాడు .

‘’సడే లే సంబడం ‘’అన్నా .’’తాతా ! నీ ఫ్రెండ్ కు ఫోన్ చేసి రాఫెల్ నాకిప్పించు .రఫ్ఫాడిస్తా’’ నన్ను గేలి చేస్తూ అని పారిపోయాడు . ..దేశ రక్షణ ఇలాంటి బచ్చా గాళ్ళ లాంటి చిన్నపిల్లాళ్ళ  చేతిలో, మాటలో నవ్వులపాలైందని సిగ్గు తో తలవంచుకున్నా చేసేది లేక .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-18 –ఉయ్యూరు .  ,.

.

 

 

 

 


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -6

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -6

బృహదారణ్యకం లోనే సన్యాస విషయం సమగ్రంగా చెప్పబడింది .శుక్ల యజుర్వేదానికి చెందిన ‘’జాబాలోపనిషత్ ‘’కూడా సన్యాసం గురించి చెప్పింది .శంకర భగవత్పాదుల వంటి వారలకు  బ్రహ్మ చర్యం నుండే  సన్య సించవచ్చు అని దారికూడా చూపింది .యాజ్ఞావల్క్యుడే మొదట సన్యాసం స్వీకరించాడు అన్నమాట యదార్ధం .పరివ్రాజక ధర్మం గురించి విశేషంగా చెప్పింది జాబాలికోపనిషత్ .యజ్న రహస్యాలను ఆలంకారికంగా వర్ణించింది. బృహదారణ్యకంలో  ముఖ్యంగా ఆత్మజ్ఞాన బోధ ఉంది. ఇందులో .యాజ్ఞావల్క్యుడే  ప్రధాన భూమిక వహించాడు యాజ్ఞవల్క్య ,విదేహరాజుల మధ్య సంభాషణలో చెప్పాల్సిన విశేషాలన్నీ చోటు చేసుకొన్నాయి. దీనిలోనే బ్రహ్మవాదినులైన మత్రేయి, గార్గి ల వర్ణన కూడా ఉంది .మైత్రేయీ బ్రాహ్మణమైన దీనిలో ‘’ఆత్మావా అరే ద్రస్టవ్యః ‘’అనే వాక్యం వేదాంత శాస్త్రం అంటే ఉత్తర మీమాంసకు విషయం  అయింది .

శుక్ల యజుర్వేదం అభ్యాసకులైన కాణ్వ, మాధ్య౦ది నులకు కాత్యాయనుడు రచించిన ‘’శ్రౌత సూత్రం ‘’ఉన్నది .దీనిలో 26 అధ్యాయాలు .ఇది ఖచ్చితంగా ‘’శత పథం’’అనుసరించే రాయబడింది .మొదటి 18 అధ్యాయాలు బ్రాహ్మణం లోని మొదటి 11 కా౦డలననుసరించి ఉంటే ‘’సౌత్రామణి’’,19లో, అశ్వమేధం 20 , పురుమేధం , సర్వమేధం ,పితృమేధం 21అధ్యాయాలలొ చెప్పబడ్డాయి తర్వాత ఉన్న  మూడిటిలో ఏకాహం,సత్రం వగైరా ఉన్నాయి .25 లో 14 వ కాండలో చెప్పిన ప్రాయశ్చిత్తం ,చివరిదైన 26 అధ్యాయం లో 16 వ కా౦డ లోని ‘’ప్రవర్గ్య ‘’విశేషాలున్నాయి . స్వర సంస్కార నియమాలకు ‘’ప్రాతిశాఖ్య ‘’,ఋషి ,దేవతాదులు తెలుసుకోవటానికి ‘’కాణ్వ సర్వానుక్రమ సూత్రం’’  గృహ్య కర్మలకు ‘’పారస్కర గృహ్య సూత్రం ‘’ఉన్నాయి .అంటే కాత్యాయనుడు శుక్ల యజుర్వేదం అంతటికీ ప్రయోగ శాస్త్రం రాశాడన్నమాట .

యాజ్ఞవల్క్య మహర్షి కి మధ్య౦దినుడు ,జాబాలి ,బోధి ,శాపేయుడు , గాలవుడు అనే అయిదుగురు ముఖ్య  శిష్యులున్నట్లు, వారు శుక్ల యజుర్వేదాన్ని అధ్యయనం చేసినట్లు విష్ణు పురాణం మొదలైన వాటిలో ఉన్నది  .అయితే ఇప్పుడున్నవి కాణ్వ ,మాధ్యందిన శాఖలురెండే అని ముందే తెలుసుకొన్నాం .రెండిటిలో విషయం ఒక్కటే అయినా ,అధ్యాయ  విభాగం ,వ్యాకరనణా౦శాలలొ భేదం ఉన్నది .ఋషి భేదాన్ని బట్టి వచ్చినవే. ఇవి విషయంలో తేడా ,దేశాలలో తేడా బట్టి భాషా భేదం ఉండచ్చు .ఆంగ్లేయ పరిశోధకులు కూడా ‘’ఎన్ సైక్లోపీడియా బ్రిటాన్నికా’’లో  ‘’ఈ రెండింటిలో విషయభేదం చాలాతక్కువ .శైలిలో చాలాభేదం ఉంది ‘’అన్నారు .కాణ్వ పాఠం ఋగ్వేద సంప్రదాయం లో ఉంటుంది. మాధ్యందిన పాఠం కొన్ని చోట్ల కృష్ణ యజుర్వేదాన్ని పోలి ఉంటుంది .మాధ్య౦దినం కంటే కాణ్వం సర్వవిధాలాల శ్రేస్టం అని కూడా ముందే చెప్పుకున్నాం .మాధ్యందిన శాఖా సంహితలో 40 అధ్యాయాలు ,303 అనువాకాలు ,1975  ఖండికలు ఉన్నాయి .బ్రాహ్మణం లో 14 కాండాలు ,100 అధ్యాయాలు ,438 బ్రాహ్మణాలు ,7,624 ఖండికలు ఉన్నాయి .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-18 –ఉయ్యూరు     ,,,

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనసు దోచే మారేడు మిల్లి అంద చందాలు

మనసు దోచే మారేడు మిల్లి అంద చందాలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి భద్రాచల వెళ్ళేదారిలో రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరం లో మారేడు మిల్లి ఉంది .’’దీన్ని వాల్మీకి వ్యాలీ  వనవిహార స్థలి ‘’అంటారు .పచ్చని పంట చేలు ,ప్రకృతి సోయగం చూస్తే భగవంతుడే మానవులకు నయనానందం  కోసం సృష్టించిన  భూలోక స్వర్గమా ?దేవేంద్రుని అపర నందన వనమా?కుబేరుని ఉద్యానవనం  చైత్ర రధమా?అని పిస్తుంది.ఇదంతా దేవతల ప్రత్యేక జిల్లానా?అనే సందేహమూ కలుగుతుంది .సందర్శకులకు కనులను విందు చేసే   ప్రకృతి కాంత దివ్య క్షేత్రమిది .ఇక్కడి అరణ్యాలు వన్యప్రాణులు , వృక్షాలు   వాటికి అండగా ఉండే కొండల ఎత్తునుంచి దూకే మనోహర జలపాత కన్యల సోయగాలు ,  పరిమళభరిత వనౌషద మొక్కలు , ,పైన్ ,బంగారు గుబురు వెదురు వృక్షాలు , కు ఇది   ఆనంద నిలయం .ప్రకృతి సోయగాలను తనివి తీరా తిలకించి పులకి౦చటానికి అత్యంత అనుకూలమైన తావు మారేడుమిల్లి .ప్రకృతిమాత పవిత్రమైన ఒడిలో  సేద తీర్చుకొనే అరుదైన అదృష్టం లభిస్తుంది .పలురకాల ఫెరన్,అరటి ,అనేకరకాల ఆర్కిడ్ లు ,వివిధ రకాల మామిడి తోటలు పరమ ఆకర్షణగా నిలుస్తాయి .యువకులకు అత్యంత ఇష్టమైన ట్రెక్కింగ్ కు అనుకూలమైన స్థలం .ఇక్కడ చూడతగిన అతి ముఖ్య ప్రదేశాలు కొన్ని తెలుసుకొందాం .

1-నందనవనం – అంటే  వైద్యానికి ఉపయోగపడే అనేక ఔషధ జాతుల కేంద్రం . దీనినే ‘’ఎథ్నో మెడికల్ అవేర్ నెస్ సెంటర్ ‘’అంటారు .ఔషధ మొక్కల ప్రయోజనం సామాన్యప్రజలకు అవగాహన కలిగించే ప్రదేశం .ఇందులోని మొక్కలను పశ్చిమ కనుమలనుంచి ,ఒరిస్సా నుంచి తెప్పించి ,నాటి, పెంచి, పోషిస్తున్నారు.

2- బాంబూ చికెన్ -ఇటీవల అన్నిమాధ్యమాలలో బాగా ప్రచారమైన ,ఇక్కడి ప్రత్యేకమైన వెదురు చికెన్ –బాంబూ చికెన్ కు ఇది కేంద్రం  .సంప్రదాయ బద్ధమైన ఈ చికెన్ కోసం అనేక ప్రాంతాలనుండి జనం విరగబడి వచ్చి ఆస్వాదిస్తారు .

౩-కాఫీ ,మిరియాల తోటలు –ఇక్కడ పె౦చుతున్న కాఫీ, మిరియపు తోటలను చూసి  సందర్శకులు ముగ్ధు లౌతారు.ఈ నందన వనం ఈ రెండేకాక పలురకాల ఆర్కిడ్ జాతి పుష్పాలు ,చెట్లకు పాకే ఫెరన్ లు,అడవి అరటి ,వివిధ రకాల మామిడి తోపులు ప్రత్యేకంగా చూసి ఆన౦దించాలి.

4- వాలి-సుగ్రీవ మెడికల్ ప్లాంట్స్ కన్వర్సేషన్  ఏరియా –ఎత్తు పల్లాల ఈ ప్రాంతం లో 203 జాతుల వైద్య వనమూలికలు ,అరుదైన చెట్లను 260 హెక్టార్లలో పెంచుతున్నారు .అన్నీ ప్రజోపకారమైనవే .

5-కార్తీక వనం –కార్తీకవనం లో మత పరమైన పవిత్ర వృక్షాలను అంటే ఉసిరి, మారేడు, నేరేడు ,నిమ్మ ,రావి ,మర్రి ,అరటి ,మామిడి  చెట్లు పెంచుతున్నారు . కార్తీకమాసం లో పవిత్ర కార్తీక వనభోజనానికి చాలాబాగా అనుకూల మైన ప్రదేశం .

6-మదన కుంజ్ –విహార స్థలం –పులి ,చిరుతపులి ,అడవి దున్న ,మచ్చలజింక ,మౌస్ డీర్ వంటి ఆడని జంతువులకు ఇది ఆవాసభూమి .అడవిఎలుగుబంటి,అడవినక్క,అడవికోడి ,పురి విప్పిన నెమళ్ళు  ,పలురకాల అందమైన  పక్షులు ఇక్కడ సర్వ సాదారణం .హిల్ హైనా ,హరన్ బిల్ ,కింగ్ ఫిషర్  గోల్డెన్ డ్రయోల్ వంటి అరుదైన జంతువులను వీక్షించవచ్చు పలురకాల రంగురంగుల సీతాకోకచిలుకలు ముగ్ధ మనోహరంగా  తమ రెక్కల అందాలతో సందర్శకుల చూపులను   కట్టిపడేస్తాయి ,

7-జంగిల్ స్టార్ కాంప్ సైట్ –తూర్పు కనుమలలో దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్న ఈ ప్రదేశం రాత్రి విశ్రాంతి స్థలం .హాయిగా అరణ్య శోభ తిలకించి పులకి౦చిన వారికి మధుర స్వప్నాలకు ,చిరస్మరణీయమైన స్థానం  .  ఈ కాంప్ సైట్  వాలమూరు నదికి ప్రక్కనే మూడువైపుల ప్రవాహం తో వాలి –సుగ్రీవ కొండ అంచునే ఉంది .ఇక్కడే త్రేతాయుగం లో వానర వీరులు అన్నదమ్ములు అయిన వాలి సుగ్రీవుల మధ్య తీవ్ర పోరాటం జరిగింది . ఈ యుద్ధ క్షేత్రం ,పచ్చిక బీడులు ,శోభకూర్చే అరణ్యాలతో అవతలి కొండ గుట్టలపై దర్శనమిచ్చి ప్రాచీనకధను గుర్తు చేసి మన సంస్కృతికి ప్రతిబి౦బ౦గా నిలుస్తుంది  ,మధురోహలతో మనసు పరవశం చెందుతుంది .

ఎక్కడో విశాఖ దగ్గరున్న అరకు అందాలు గురించి చెప్పుకోవటమే  కాని ఇంతదగ్గరలో ఉన్న మారేడుమిల్లి వనసౌ౦దర్య సీమ గురించి  నాకు ఇప్పుడే తెలిసింది .అందరూ తప్పక సందర్శించి మధురానుభూతులకు లోనవ్వాల్సిన మధురస క్షేత్రం మారేడుమిల్లి .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-18 –ఉయ్యూరు ,

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి  పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా

ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి  పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా

1902 లో ఎస్. ఎస్. ఒలింపియా నౌకను ఒకటిన్నర లక్షల రూపాయలతో కొని, జైపూర్ మహారాజు సవాయ్ రెండవ మాధవ్ సింగ్ అందులో రెండు అతి పెద్ద వెండి బిందెలలో 8 వేలలీటర్ల పవిత్ర గంగాజలం నింపి ,పురోహిత బృందం ,132 మంది సేవకులు ,600 లగేజి సామాన్లతో  ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి పట్టాభిషేకానికి హాజరవటానికి జైపూర్ నుండి   బొంబాయి మీదుగా లండన్ వెళ్ళాడు  .ఈ మహావైభవ ,అట్టహాస ప్రయాణాన్ని 1902 జూన్ లో  ‘’ది గ్లోబ్ ‘’పత్రిక ‘’ఎ రిమార్కబుల్ సైట్ ‘’అని వర్ణించింది .

ఇందులో అతి గమనార్హమైన విషయం 5 వేల మైళ్ళ దూరం ఉన్న లండన్ కు పవిత్ర గంగాజలం తీసుకు వెళ్ళటం .ఆనాడు జైపూర్ మహారాజా భారత దేశం లో అత్యంత విశేషమైన రాజులలో ఒకరు .ఏడవ ఎడ్వర్డ్ పట్టాభిషేకానికి గౌరవంగా ఆహ్వాని౦పబడ్డాడు. విక్టోరియా మహారాణి నిర్యాణం తర్వాత చక్రవర్తి అయ్యాడు ఎడ్వర్డ్ .గ్వాలియర్ ,బికనీర్ మహారాజులతోపాటు జైపూర్ మహారాజు మాధవసింగ్ కూడా చక్రవర్తి పట్ల విశ్వాసం ప్రకటించటానికి వెళ్ళాడు  .చక్రవర్తికూడా భారత మహారాజుల సమక్షం లో పట్టాభిషేకం జరగటం తన పాలనకు ,తమ సార్వభౌమాధికారానికి గౌరవమని భావించాడు .

మహారాజా సవాయ్ రెండవ మాధవ సింగ్ రెండవ రాం సింగ్ మహారాజుకు దత్త పుత్రుడు .ఆల్బర్ట్ ఎడ్వర్డ్ యువరాజు కొన్ని దశాబ్దాల పూర్వం జైపూర్ సందర్శించినపుడు రాజా  రాం సింగ్ తండ్రి జైపూర్ సిటీ ని ‘’పింక్ సిటీ ‘’గా తీర్చి దిద్దాడు .రాం సింగ్ తన ప్రగతి శీల విదాలతో , సంప్రదాయ నడవడి తో  స్కూళ్ళు కాలేజీలు వైద్యాలయాలు  దేవాలయాలు నిర్మించి ప్రజాభిమానం పొందాడు .తండ్రి అడుగుజాడలలోనేకొడుకు మాధవ సింగ్ కూడా నడిచాడు .

మహారాజా మాధవ సింగ్ లండన్ చక్రవర్తి పట్టాభిషేకాంకి హాజరవటం లో కొన్ని చిక్కులెదురయ్యాయి .వెళ్ళకపోతే మర్యాదకు భంగం తో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది . వెడదాము అంటే ‘’కాలాపానీ ‘’అంటే సముద్రం దాటటం అనే ఘోర తప్పిదం చేయాలి .తాను అనుసరిస్తున్న  సంప్రదాయ హిందుత్వానికి భంగమేర్పడుతుంది .ఈ విచికిత్స లో కొంతకాలం ఊగిసలాడాడు .మంత్రులను ,పురోహితులను ,,సైనికసలహాదారులను సమావేశ పరచి ఈ ’’ ధర్మ సంకటం ‘’పై చర్చించాడు .అందరి సలహా పై, పైన చెప్పినట్లు పవిత్ర గంగా జలం తో వెడితే ఆత్మ సంతోషం ,సంఘ కట్టుబాట్లను గౌరవి౦చినట్లూ హిందూ ధర్మం పాటించినట్లుగా  ఉంటుందని నిర్ణయించాడు  లండన్ కు   బయల్దేరిన దగ్గరనుంచి మళ్ళీ తిరిగి వచ్చేదాకా అన్ని అవసరాలకు వాడ టానికి  సరిపడా గంగాజలం సేకరించాడు .14 వేల వెండి నాణాలు కరగించి పెద్ద వెండిపాత్రలు రెండు చేయించి గంగాజలం తో నింపి కూడా తీసుకు వెళ్ళాడు .పాత్రలను అతిభద్రంగా ఓడ పైకి ఎవరి చేతులూ పడనీయ కుండా కప్పీలు చక్రాల సాయంతో చేర్పించాడు .నౌక ఏడెన్ వద్దకు చేరగానే వాతావరణం అత్యంత భయానకం గా మారితే ,పురోహితులతో సంప్రదించి వారితో ఒక గంగాజల వెండిపాత్రను గాలిలోకి ఎగరేయించి  కొంతజలాన్ని సముద్రం లో కలిపించి వరుణ దేవుడికి శాంతి కలిగించాడు .

జైపూర్ మహారాజు మహారాజ వైభవంగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో లండన్ ప్రవేశించాడు ‘’మహారాజుగారి సామాన్లు చాలాటన్నుల బరువున్నాయి .అందులో ఆయన నిత్యపూజ చేసే దేవతావిగ్రహాలు ,పవిత్ర గంగాజలం ఉన్నాయి ‘’అని ‘’అబెర్డీన్ జర్నల్ ‘’,దిడైలీ న్యూస్ ‘’పత్రికలు  ఆర్భాటంగా రాశాయి. ‘మన పాశ్చాత్య విధానాలకు అతి భిన్నంగా ప్రాచ్య సందర్శకుడు రావటం మహా విశేషం ,వింతగా ఉంది ‘’అనీ రాశాయి .’’పింక్ సిటీ జైపూర్ మహారాజు రాజా మాధవ సింగ్ గాలన్లకొద్దీ పవిత్ర గంగాజలం తన నిత్య కృత్యాలకు వెంట తీసుకు రావటం విశేషం  ఇప్పుడాయన తన పింక్ సిటీ  నుంచి అత్యంత విశిష్టమైన రంగు ను ప్రపంచానికి అద్దాడు ‘’అనీ రాశాయి .

జూన్ లో జరగాల్సిన పట్టాభిషేక మహోత్సవం ఎడ్వర్డ్ కు అత్యవసరంగాజరిగిన అపెండి సైటిస్  ఆపరేషన్ వలన ఆగస్ట్ కు వాయిదా పడింది .ఆగస్ట్ లో అనుకున్న తేదీకి అట్టహాసంగా పట్టాభిషేకంప్రారంభమైంది. బ్రటిష్ సామ్రాజ్య మిలిటరీ దళాల విన్యాసాలు ,అధికార దర్పం ,సామంతరాజులు మిలిటరీ అధికారులు,లార్డ్ లు ,రాజులు  అధికారులు సామాన్య ప్రజలు ,కెనడా ,ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్ ,బెర్మూడా ,బోర్నియో ,ఫిజి ,గోల్డ్ కోస్ట్ నుంచి వచ్చిన సైన్యం రోడీ షియా ,కేప్ కాలని  నటాల్ ,సియర్రా లియోన్ ,గాంబియా ,నైజీరియా ఉగాండా  సిలన్, సైప్రస్ ,హాంగ్ కాంగ్  జమైకా ,వీహాయ్ వీ ,లాగోస్ ,మాల్టా  సెయింట్ లూసియా  సింగపూర్ ,ట్రినిడాడ్లనుంచి వచ్చిన సైన్యం  సమక్షం లో  కనువిందుగా జరిగింది .

జైపూర్ మహారాజు కొత్త చక్రవర్తి ఎడ్వర్డ్ కు అత్యంత విలువైన కానుకలు సంర్పించితన ప్రభు భక్తి ,విధేయత  చాటుకున్నాడు .తాను చక్కని హిందూ సంప్రదాయంతో చక్రవర్తి పట్టాభిషేకానికి వచ్చినందుకు  మహారాజుగా తన విధి తాను తృప్తిగా నిర్వహించినందుకు మనసునిండా సంతృప్తి పొంది స్వదేశానికి తిరిగి బయల్దేరాడు ‘.’నా ప్రవర్తన ఇప్పుడూ ఆతర్వాత కూడా నాప్రజలకు నచ్చుతుందని ,రాజపుత్రవీరుడు సముద్రాన్ని దాటినప్పటికీ ,హిందువుగానే ఉన్నాడని ,సామంతరాజు చేయాల్సిన విధిని సంతృప్తిగా నేరవేర్చానని  భావిస్తున్నాను ‘’అని  వార్తాత్రికలకు తెలియ జేశాడు .

పట్టాభిషేకం అయిన ఎనిమిదేళ్ళకు   ఎడ్వర్డ్  చక్రవర్తి చనిపోయాడు .మహారాజా మాధవ్ సింగ్ జైపూర్ లో యధాప్రకారం విద్యా, వైద్య,  సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే  1922 లో మరణించాడు . గంగాజలం తో లండన్ తీసుకు వెళ్ళిన రజత పాత్రలు ప్రపంచం లోనే అతి పెద్ద పాత్రలుగా రికార్డ్ సృష్టించాయి .అవి జైపూర్ లో సిటీ పాలేస్ లో ‘’దివాన్ –ఇ –ఖాస్ ‘’   లో ప్రదర్శనలో ఉన్నాయి .వాటి తమ్ముడు  ఎక్కడో యెర్ర సముద్రం అట్ట అడుగున మునిగి పోయి ఉండిపోయాడు .

ఆధారం -23-9-18 ఆదివారం ‘’ది హిందు ‘’లో ఆదిత్య అయ్యర్ రాసిన ‘’వెన్ గాంజెస్ కేమ్ టు లండన్ ‘’వ్యాసం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-9-18 –ఉయ్యూరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి

కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి

ఉషాకుమారి  దిన చర్య ఉదయం 7 గంటలకే కేరళ తిరువనంతపురానికి దక్షిణాణ ఉన్న.’’ అ౦బూరి ‘’గ్రామం ఇంకా నిద్ర మత్తులో ఉండగానే ప్రారంభమౌతుంది .ఆమె అగస్త్యవనం పరిధిలోని  ‘’కున్న తుమల ‘’అగస్త్య ఏకోపాధ్యాయ పాఠశాల టీచర్ .రోజూ రెండుగంటలు కొండ దారిలో అరణ్యం లో నడుచుకుంటూ  బడికి చేరుకోవాలి. ఇక్కడ’’ కాని జాతి సెటిల్ మెంట్ ‘’వాళ్ళకోసం ఏర్పాటు చేసిన స్కూల్ ఇది .బడి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు పని చేస్తుంది .మళ్ళీ ఆకొండా, కోనా దాటుకుంటూ నడిచి కొంపకు  చేరాలి .ఇలా 16 ఏళ్ళనుంచి ఆమె ఉపాధ్యాయ జీవితం సాగిపోతోంది .

1997 లో జిల్లా ప్రాధమిక విద్యా ప్రోగ్రాం లో ఉషాకుమారి వాలంటీర్ గా ఈ సెటిల్ మెంట్ కు వచ్చింది .కేరళప్రభుత్వం 1990 లో ఇలాంటి విద్యా ఉపక్రమ (ఇనిషియేటివ్ )కార్యక్రమాన్ని ప్రారంభించింది . స్కూల్ మానేసిన విద్యార్ధుల జాబితా సేకరించి,  వాళ్ళను మళ్ళీ బడిలో చేర్పించటం ఆమె బాధ్యత.వాళ్ల మనసులను ఆకర్షించి ఇపుడా టీచర్ వాళ్ళల్లో ఒకరైపోయింది .2000 సంవత్సరం లో ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఏర్పడే దాకా ఇక్కడ చదువంతా రాళ్ళమీద ,చెట్ల నీడలలోనే సాగింది .వర్షం వచ్చినా ,ఆమెకు ఒంట్లో బాగుండకపోయినా బడినుంచి మళ్ళీ నడిచి అంతదూరం వెళ్ళలేక ఆ గిరిజనాలతోనే ఉండిపోతుంది .ఆమె కృషి ఫలించి ప్రస్తుతం 40  కుటుంబాలు తమ పిల్లలను బడికి పంపిస్తున్నారు .ఆడపిల్లలు బడిలో చదువుకొంటూ వ్యవసాయ పనులూ చేసుకొంటున్నారు ..

ప్రస్తుతం కేరళ ప్రభుత్వం ఉషాకుమారిలాంటి ఒంటరి  టీచర్ లను సాధారణ దిగువ ప్రైమరీ స్కూళ్ళకు మార్చే ప్రయత్నం లో ఉంది .ప్రస్తుతం అడవి అంతటినీ మెషిన్ లు చదును చేసి దారిమార్గం ఏర్పాటు చేసేపనులు చురుకుగా సాగుతున్నాయి .ఆమె కస్టాలు కొద్దిరోజుల్లో తీరిపోగలవు  .అయితే ఆమె క్వాలిఫైడ్ టీచర్ కాకపోవటం వలన ఉద్యోగం ఊడే అవకాశం ఉంది .దిగువ ప్రైమరీ టీచర్ గా వేస్తే కొంత ఉపశమనం .’’ఈ మన్య ప్రాంతం లో  ప్రజలు జబ్బులోస్తే సరైన అత్యవసర  వైద్య సౌకర్యం అందకచనిపోతున్నారు .ఇక్కడ రోడ్ల నిర్మాణం తక్షణమే జరగాలి .నా ఉద్యోగం ఉన్నా ఊడినా ఇబ్బంది లేదు ‘’అంటుంది సిన్సియర్ టీచర్ ఉషాకుమారి .ఆమెకు మంచి జరగాలని ఆశిద్దాం .

ఆధారం -23-9-18 ది హిందులో  -తులసికక్కర్ వ్యాసం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -23-9-18 -ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అతి ప్రాచీన శ్రీ ము౦డేశ్వరి దేవాలయం-బీహార్

  బీహార్  రాష్ట్రం కైమూర్ జిల్లా కౌరాలో ఉన్న శ్రీ ముండేశ్వారి దేవాలయం క్రీ .శ.625 నాటి అతి ప్రాచీన దేవాలయంగా వినుతి కెక్కింది .ఆ నాటి శాసనమే సాక్ష్యం .ఇప్పటికీ పూజా పునస్కారాలు అందుకొంటున్న దేవాలయం కూడా అని  పురావస్తు శాఖ ధృవీకరించింది .

   ము౦డేశ్వర కొండపై 608 అడుగుల ఎత్తునున్న దేవాలయం ఇది.కైమూర్ పీఠ భూమి లో సొన్(సువర్ణ ) నదీతీరం లో ఉంది .ముండేశ్వర కొండపై చాలా ప్రాచీన శిలా విగ్రహాలున్నాయి .పాట్నా ,గయా  లేక వారణాసి లనుండి ఇక్కడికి రోడ్డు ద్వారా  చేరుకోవచ్చు .దగ్గర రైల్వే స్టేషన్’’ మోహన –బాబువా జంక్షన్ రైల్వే స్టేషన్ ‘’.ఇక్కడి నుంచి దేవాలయం కేవలం 22 కిలోమీటర్లు.’’లాల్బహదూర్ ఎయిర్ పోర్ట్ వారణాసి’’ దగ్గర విమానాశ్రయం .ఇక్కడి నుండి దేవాలయం 102  కిలోమీటర్లు .

  బీహార్ నాగర శైలిలో ఆలయం నిర్మి౦పబడి౦ది .నాలుగువైపులా ద్వారాలు ,కిటికీలు ఉన్నాయి .ఆలయ శిఖరం ధ్వంసమైంది.కాని కొత్తగా పునర్నిర్మిస్తున్నారు .ఆలయ ముఖ ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలున్నాయి .గంగ ,యమునమొదలైన మూర్తులున్నాయి .గర్భాలయం లో శ్రీ ము౦డేశ్వరిదేవి విగ్రహం ,చతుర్ముఖ శివలింగం ఉన్నాయి .అయ్యవారు ,అమ్మవారు  ఆలయం లో ఉన్నా ,అమ్మవారికే ఇక్కడ విశేష పూజలు జరగటంవిశేషం .ము౦ డేశ్వరి దేవి మహిష వాహనం పై దశభుజాలతో దర్శనమిస్తుంది .అంటే మహిషాసుర మర్దిని గా దర్శనం అనుగ్రహిస్తుంది .వినాయక ,సూర్య ,విష్ణు విగ్రహాలు కూడా ఉన్నాయి .అనేక శిధిల విగ్రహాలు కూడా కనిపిస్తాయి .ఆర్క లాజికల్ డిపార్ట్ మెంట్ ఈ దేవాలయాన్ని సంరక్షిస్తోంది .ఆలయాభి వృద్ధికి ,రహదారి నిర్మాణానికి బీహారు ప్రభుత్వం చాల డబ్బు సాంక్షన్ చేసి ఖర్చు పెడుతోంది .ఇది హర్షించదగిన విషయం .

 భారత దేశం లో అతి ప్రాచీన దేవాలయంగా గుర్తింపు పొందిన శ్రీ ము౦డేశ్వరి దేవాలయం లో మొదటినుంచి ఇప్పటిదాకా అవిచ్చిన్నంగా పూజాదికాలు నిర్వ హింప బడుతూ౦డటం విశేషం .శ్రీరామనవమి ,శివరాత్రి మహా పర్వదినాలలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి సందర్శిస్తారు .నవరాత్రులలో గొప్ప ఉత్సవం, జాతర చేస్తారు .శక్తి దేవాలయం గా ప్రసిద్ధి చెందటం వలన తాంత్రిక పూజలు కూడా జరుగుతాయి .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-9-18 –ఉయ్యూరు


Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment