దువ్వూరి వారి ‘’రమణీయం‘’పై రమణీయ భావనలు

 దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు అంటే చిన్నయ సూరి బాలవ్యాకరణం ,ఆతర్వాత ‘’రమణీయం ‘’గుర్తుకొస్తాయి .దువ్వూరివారు సంస్కృత వ్యాకరణాన్ని మూడేళ్ళపాటు ఆసాంతం చదివి హస్త, మేధోగతం చేసుకొన్నారు .1914విజయనగరం మహారాజాకాలేజిలో విద్వాన్ కోర్సు చదవటానికి చేరారు .అప్పుడు చిన్నయ సూరి బాలవ్యాకరణ౦ లో సంజ్ఞాపరిచ్చేదం,చదివి’’ సంధి ‘’ప్రారంభించే సరికి ‘’ఇదేదో బింకంగా ఉందే.తెలుగు వ్యాకరణాలు చప్పచప్పగా ఉంటాయని అంటారే ,కాని సూరి వ్యాకరణం లో సూత్రాలు, వృత్తులు  ఉదాహరణలు ‘’పాణినీయం ‘’లోమాదిరి పట్టుగా ముద్దుగా బాగున్నాయే ‘’అనిపించింది .ఈ భావన కలిగిన 60ఏళ్ళ తర్వాత  1974 లో కూడా ఆ అభిప్రాయం  సుస్థిరమైఁదే కాని వీసమెత్తు తగ్గలేదు .పైగా రోజురోజుకూ బలపడుతూనే ఉంది .

  విద్వాన్ పాసై అదేకాలేజి లో ఉపాధ్యాడుగాచేరి బాల వ్యాకరణం బోధించే అవసరం కలిగింది శాస్త్రి గారికి .ఆ వరుసలో 45 ఏళ్ళు బాలవ్యాకరణ౦ భాషా ప్రవీణ క్లాసుల్లో ఎం .ఏ .క్లాసుల్లో  అవిచ్చిన్నంగా బోధించారు .మొదటి పదేళ్ళ తర్వాత సూరి రచనలో పాండిత్యం ,పటుత్వం మాత్రమె కాక మరేదో చమత్కారం ,సౌకుమార్యం ఉన్నట్లు కనబడింది .’’వ్యాకరణం లో ఇదేమిటి చెప్నా !’’అనుకొన్నారు .ఆలోచిస్తుండగా క్రమంగా ప్రతిమాటలో ఏదో సారస్యం ,ముద్దుముద్దుగా ముచ్చటగా ఉన్నట్లు అనిపించేది .పాఠం చెబుతున్న శాస్త్రి గారికే కాక వినే విద్యార్దులకూ ఉత్సాహంగా ,ఉల్లాసంగా అనిపించేది .అన్ని పాఠాలకన్నాబాల వ్యాకరణ పాఠంఎంతో వినోదంగా కనిపించేది .శాస్త్రిగారికే ప్రీతికాదు నేర్చుకొంటున్న శిష్యులకు కూడా అదే రకమైన ప్రీతి జనించటం అత్యాశ్చర్యకరం  .గ్రామర్ అంటే తలకాయ నెప్పి అనుకొనే విద్యార్ధులు ,సూరి వ్యాకరణం అంటే కావ్యం చదువుతున్నంత మహదానందం పొందేవారు. అది దువ్వూరివారి బోధనా విశేషం .

  గురువుకూ శిష్యులకు అత్యంత ప్రీతికరమైన బాలవ్యాకరణం పాఠం నిత్యం జరిగిపోతూ ఏదో లోకం లో విహరిస్తున్న అనుభూతి కలిగించేది .మిగిలిన తెలుగు వ్యాకరణా లెలా ఉన్నాయో అని అన్నిటినీ ఒకపట్టు పట్టి చూశారు శాస్త్రీజీ .చూచినకొద్దీ చిన్నయ సూరి’’ మహా పెద్దయ్య సూరి’’అనే భావమే ఎక్కువైంది .దానిముందు సూర్యునిముంది దివిటీలు అనిపించాయి .సూరి ప్రత్యేకత మరింత స్పష్టంగా దర్శనమిచ్చింది .సూరి మాటలమధ్య చమత్కారం ఆనందం ,ఆహ్లాదం పె౦చాయి  .

  ఇలా మరో పదేళ్ళు గడిచిపోయాయి .ఒక రోజు బాలవ్యాకరణ పీఠిక లో శాస్త్రిగారికి ‘’అనయము లలితోక్తులతో నొనరు పడం గూర్చి లక్ష్య యోజన మొప్పంగను బాలవ్యాకరణం బనగా లక్షణ మొనర్తు నాన్ద్రంబునకున్ ‘’అన్న పద్యం కనబడింది .రోజూ చూసే పద్యమే .’’అయితేనేం అంతవరకూ అందులోని అక్షరాలు కనిపించాయే కాని ,అంతరార్ధం స్పురించలేదు .’’లలితోక్తులతో వొనరు పడం గూర్చి లక్ష్య యోజనమొప్పన్’’అంటాడేమిటి అంటే  చెప్పే మాటా ,ఇచ్చే ఉదాహరణ లలితంగా ఉండేట్లు కూర్పు కూరుస్తున్నాను అంటాడేమిటి .ఇంకా మనం అతని లాలిత్యం వైపు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే .ఈ దృష్టి తనలో ఉన్నట్లు స్పష్టంగా చెప్పాడే ‘’అనుకోని ‘’యురేకా ‘’అని యెగిరి గంతేసినంత పని చేశారు న్యూటన్ యాపిల్ కిందపడటం ఎన్నో సార్లు చూసినా మొదటిసారి అందులో ఏదో వింత ఉన్నట్లు తెలుసుకొని సూత్రం కనిపెట్టినట్లు దువ్వూరి వారికి బాలవ్యాకరణం లో లలిత రమణీయ భావనలు స్పష్టంగా కనులముందు గోచరించాయి .ఈ దృష్టిని చెదిరి పోనివ్వకుండా జాగ్రత్త పడ్డారు .సూరి అక్షరాల వైపు చూస్తుంటే ఏదో కొత్త విషయం దృగ్గోచరమై మనసుకు ఉల్లాసం కలిగేది. ఆనందం తాండవించేది .ఈ భావనలు ఇప్పుడు విద్యార్ధులకు బోధనలో కూడా చోటు చేసుకోవటం తో వారిలోనూ రామనణీయభావనలు బలపడి మరింత స్పష్టయ్యాయి గురు శిష్యులకు .సూరి పాండిత్య ,లాలిత్య ,నైపుణ్యాలు స్పస్టమై గట్టిపడ్డాక శిష్యులకు ఉత్సాహంగా చెప్పి వారినీ’’ఎలివేట్’’ చేసేవారు .1940కి పూర్వమే ఈ భావనలు బలీయమై మనసులో ఉంటె కాదు వాటికి అక్షర రూప మివ్వాలి చిన్న పుస్తకంగా తేవాలి అనేది చిట్టిగూడూరు కాలేజిలో ఉండగానే నిశ్చయమైంది .ఐతే ఇంకెందుకు ఆలస్యం అని లేడికి చేచిందే పరుగుగా తొందరపడి రాత ప్రారంభించలేదు .ఇంకొన్నాళ్ళు ఆగితే ఇంకేమేమి విశేషాలు బయటపడుతాయో అని అనిపించింది .

   చిన్నయ సూరి 18ఏళ్ళు అహోరాత్రాలు శ్రమించి ఆప్యాయనంగా సంతరించిన బాలవ్యాకరణం ‘’కొందరి వంచనా దృష్టితో శిస్టు కృష్ణ మూర్తికవి సంస్కృతీకరించి ‘’హరి కారికావళి’’అని పేరు పెట్టగా ,కల్లూరి వెంకటరామ శాస్త్రిగారు ‘’హరికారికా వళి’’యే మొదటి గ్రంథమని ,సూరి దాన్ని తెనిగించి బాలవ్యాకరణం ‘’అనే పేరు పెట్టాడని ,సూరికి అంత’’ దృశ్యం’’ లేదనీ ‘’అంటూ  చాలా అభూతకల్పనలు చేశారు .ఇక ఊరుకొంటే లాభం లేదని దువ్వూరివారు ‘’బాలవ్యాకరణమే మూలం హరికారికావళి దీనికి అనువాదమే అని సిద్దాన్తరీకరించి 40పేజీల వ్యాసం రాస్తే 1933లో ‘’ఆంద్ర సారస్వత పరిషత్ పత్రిక ‘’ప్రచురించింది .శాస్త్రిగారి సిద్ధాంతాన్ని పండితులందరూ సమర్ధించి గొప్ప’’ బూస్ట్’’ ఇచ్చారు .తరువాత మరో వ్యాసం ‘’సూరి లలితోక్తి చాతురి ‘’అని 25పేజీల వ్యాసం రాస్తే అదే పత్రిక1960లో ప్రచురించింది .ఇలా రమణీయం  రచనకు ఈ రెండు వ్యాసాలూ గొప్ప భూమికలయ్యాయి .

  మరో రెండేళ్లకు రిటైరౌతారనగా దువ్వూరివారు రచనకు ఉపక్రమించారు .’’నాపేరు రమణ కనుక ‘’వా నామ దేయస్య అనే వార్తికం వలన రమణ శబ్దం వృద్ధ ప్రాతిపదిక కాకపోయినా వికల్పంగా ఛ ప్రత్యయం వచ్చి ‘’రమణీయ’’శబ్దం సాధువు కనుక ‘’రమణీయం ‘’పేరు పెడదామనుకొని చివరకు ఉభయతారకంగా ‘’రమణీయం ‘’ పేరు ఖాయమైంది’’అని చెప్పుకొన్నారు శాస్త్రిగారు. బాల వ్యాకరణానికి అప్పటికే రెండుమూడు టీకలు ప్రచురింపబడ్డాయి .ఆతీరులో వ్యాఖ్యానం రాయటానికి ఇష్టపడక ,వ్యాఖ్యాన రూపంగా కాక తనకు తోచిన విశేషాలను మాత్రమె రాస్తూ ,ఒక సమీక్షగా రాయలనుకొని ప్రణాళిక సిద్ధం చేసుకొని రాయటం మొదలు పెట్టారు .అదే సమయం లో ‘’సూరిగారి శతవార్షిక వర్ధంతి’’ దగ్గర పడింది .ఆఉత్సవాన్ని హైదరాబాద్ లో సాహిత్య అకాడెమి వారు వైబవంగా నిర్వహించారు .శాస్త్రిగారు అందులో సూరి పాండిత్య ,లాలిత్యాలపై గంట సేపు ప్రసంగించారు .అధ్యక్షులు కవిసామ్రాట్ విశ్వనాథ  ఎంతో సంతోషించారు .సూరికి వారి వర్గం లో వారైన తాపీ ధర్మారావు కూడా సంతోషించి అభినందించారు .ఆ సందర్భంగా రమణీయం ముద్రణకు సాహిత్య అకాడెమి వెయ్యి రూపాయలు బహుమతి ప్రకటించారు .

   ఆంద్ర విశ్వ విద్యాల ప్రెస్ లో ముద్రిస్తే అందంగా పుస్తకం తయారౌతు౦దని ,తప్పులు దగ్గరుండి సరి చేయవచ్చు నని భావించి సిండికేటు కు లెటర్ పెట్టారు శాస్త్రిగారు. ఉచిత .ముద్రణమాట ఎత్తకుండా ,వెయ్యి రూపాయలు శాంక్షన్ చేసింది .3300రూపాయలు అడ్వాన్స్ ప్రెస్ కు ఇచ్చి  ప్రెస్ డైరెక్టర్ ముత్తుస్వామిగారి పర్యవేక్షణలో మంచి గెటప్ తో ముద్రణ జరిపించారు .99శాతం ముద్రణ తప్పులు లేకుండా జరిగింది .హైదరాబాద్ శ్రీ కృష్ణ దేవరాయ నిలయంలో ఆవిష్కరణ ఉత్సవం జరపమని కార్యదర్శి డా బిరుదురాజు రారాజుగారు శాస్త్రిగారిని కోరారు .విశ్వనాథ అధ్యక్షులుగా ,దివాకర్ల వెంకటావదానిగారు వక్తలుగా డా బెజవాడ గోపాల రెడ్దిగారు ఆవిష్కరణ జరిపారు .వ్యాకరణ పుస్తకానికి ఇంతఅద్భుతమైన ‘’గెటప్పా’’అని అందరూ అవ్వాక్కై ఆశ్చర్యపోయి శాస్త్రిగారిని ప్రత్యేకంగా అభినందించారు .

  దువ్వూరి వారి కృష్ణా –గుంటూరు జిల్లాల శిష్యులు తెనాలిలో ‘’రమణీయ సమ్మేళనం మూడు రోజులు ‘’నిర్వహించి శ్రీ వరదా చార్యులవారినీ ఆహ్వానించి ఘనంగా చేశారు .80 శిష్య బృందం పాల్గొన్న ఆసభలు దివ్యంగా మహా రమణీయంగా జరిగి రమణీయం రామణీయకాన్ని శతవిధాల పెంచాయి .శిష్యులు గురువుగారిని అత్యంత వైభవంగా సత్కరించి గురూణం తీర్చుకొన్నారు .సిండికేటు రూపాయి కూడా ‘’చేపకుండా  ‘’ఆతర్వాత శాస్త్రిగారే ప్రెస్ కు 2800రూపాయలు బాకీ అని నోటీసు పంపింది .చివరికి పెద్దలంతా కూర్చుని జుట్టుపీక్కుని ముద్రణఖర్చు 3200రూపాయలే అయి౦ది కనుక తామే శాస్త్రిగారికి 100రూపాయలు బాకీ  అని తేల్చి చివరికి ‘’మీ బాకీ సిండికేట్’’ ‘’వైవ్’’ చేసింది .మీ రేమీఇవ్వక్కర్లేదు’’ అని రిజిస్ట్రార్ కాగితం పంపటం తో రమణీయం రమణీయ నాటకం గా ముగిసింది .

   ఆధారం –దువ్వూరివారి స్వీయ చరిత్ర

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-67 96-భద్ర తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-67

96-భద్ర తీర్ధం

త్వష్ట ప్రజాపతి కూతురు ఉష సూర్యుని భార్య .ఛాయ రెండవ భార్య.ఈమె కొడుకే శని .ఇతని సోదరి విస్టి భయంకరాకార కురూపి . ఈమెను ఎవరికిచ్ఛి  పెళ్లి చేయాలా అని ఆలోచిస్తున్నాడు తండ్రి .అప్పుడు విస్టి తండ్రితో ‘’కన్యను తగిన వాడికిచ్చి పెళ్లి చేస్తే తండ్రి కృతార్దుడౌతాడు .కన్యకు పదేళ్ళు దాటక పూర్వమే పెళ్లి చేయాలి .సద్గుణుడికి ఇవ్వాలి లేకపోతె నరకం అనుభవిస్తాడు .కన్యాదాన౦ అక్షయ పుణ్య ప్రదం ‘’అన్నది తండ్రి సూర్యునితో .సూర్యుడు ఆమె తో ‘’నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రావటం లేదు .నీ గుణం ఒక్కటే గొప్పది మిగిలినవన్నీ తక్కువే కదా .నువ్వు ఒప్పుకొంటే ఇవాళే ఎవరికో ఒకరికిచ్చి వివాహం చేస్తాను ‘’అన్నాడు .దీనికి విస్టి’’పూర్వ జన్మ కృతం అందరూ అనుభవించాల్సిందే .మన వంశ ఆచారం తగినట్లు చేయి ‘’అని చెప్పింది .

  సూర్యుడు ఆమె మాటలప్రకారం త్వష్ట ప్రజాపతి కొడుకు ,భీషణాకారుడు ,శీలా సంపన్నుడు విశ్వ రూపుడు కు విస్టి నిచ్చి వివాహం చేశాడు .ఇద్దరు అన్యోన్యంగా దాంపత్య జీవితం గడిపారు .వీరికి గండుడు,అతి గండుడు ,రక్తాక్షుడు ,క్రోధనుడు ,వ్యయుడు ,దుర్ముఖుడు ,చివరగా హర్షణుడు అనే కొడుకులు పుట్టారు .చివరికొడుకు సత్ప్రవర్తన తో ,మనోహర రూపంతో శుచిగా ఉండేవాడు .ఇతడోకసారి మేనమామ యమ ధర్మరాజును చూడటానికి వెళ్ళాడు .యమలోకం లో దుఖితులను, సుఖం పొండుతున్నవారినీ చూసి మేనమామ ను సనాతన ధర్మం అంటే ఏమిటో వివరించమని కోరాడు .

  యముడు  తనమేనల్లుడు హర్షణుడితో ‘’ఎప్పుడూ విధ్యుక్త ధర్మం చేసేవారు నరకానికి రారు .శాస్త్రం ఆచారం ,వేదం ,పండితుల ఎడల గౌరవం చూపని వారు ,విధ్యుక్త ధర్మాన్ని అతిక్రమించిన వారు నరకం పొందుతారు ‘’అన్నాడు .అప్పుడు హర్షణుడు ‘’మా తండ్రి  ,తల్లి విస్టి నా సోదరులు అందరూ కురూపులే .వీరంతా శాంత స్వభావం సుందర రూపం నిర్దోషులు ,మంగళ కర్మాచారులు అవటానికి వారికోసం నేనేమి చేయాలో ఉపదేశించు ‘’అని ప్రార్ధించాడు .యముడు సంతోషం తో ‘’నీ పేరుకు తగిన సద్గుణాలున్న వాడివి .నీకు చాలామంది కొడుకులు పుడతారు. కాని వంశ ప్రతిష్ట పెంచలేరు .కనుక మీ అందరికీ మంచి జరగాలంటే గౌతమీ నదికి వెళ్లి స్నానం చేసి ,ఏకాగ్రతతతో శ్రీ మహా విష్ణువును స్తుతించి ప్రసన్నం చేసుకో .ఆయనే నీ కోరికలన్నీ తీర్చగలడు’’అని హితోపదేశం చేశాడు .

  ఆలస్యం చేయకుండా  హర్షణుడు గోదావరికి వెళ్లి నదీ స్నానం తో శుచియై ,శ్రీ హరి ని స్తుతించాడు .స్తోత్రాలకు  హర్షమానసుడైన విష్ణుమూర్తి హర్షణుడితో ‘’నీ సమస్త  అమంగళాలు ఉపశమన పూర్వకంగా మంగళమగుగాక ‘’అన్నాడు .వెంటనే తల్లి విస్టి,తండ్రి  ,సోదరులు అందరూ మంగళాకారులుగా మారారు .పుత్రులుకూడా భద్రులు అనే పేరుతో శోభిల్లారు .అప్పటినుంచి ఈ తీర్ధం ‘’భద్ర తీర్ధం ‘’అయింది .ఇక్కడ జనార్దనుడు కొలువుండి ,సమస్తకోరికలు తీరుస్తున్నాడు అని బ్రహ్మ నారదునికి వివరించాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి కి ప్రధమ జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి కి ప్రధమ జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం  15.11.2019  5:30PM

ప్రత్యక్ష ప్రసారం

https://sarasabharathivuyyuru.blogspot.com/

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 వ్యాఖ్య

గౌతమీ మహాత్మ్యం-6695-చిచ్చిక తీర్ధం

సర్వ శాంతి కలిగించే ‘’చిచ్చిక తీర్ధం ‘’గోదావరి ఉత్తర తీరాన ఉన్నది .చిచ్చుక అనే పక్షిరాజును గండ భేరుండం గా,శ్వేత పర్వతం పై ఉంటూ  ప్రసిద్ధి చెందింది  .అక్కడ మహర్షులు ప్రశాంతంగా తపస్సు చేసుకొంటారు .సర్వవిధ వృక్షాలు అక్కడ ఉంటాయి .రోగాలు రొస్టులు ఉండవు .ధర్మ నిరతుడైనతూర్పు దేశ  క్షత్రియరాజు పవమానుడు మంత్రి సామంత పురోహిత సైన్య సమేతుడై అక్కడ ఉన్నాడు .ఒక రోజు మృగయావినోదం కోసం  స్త్రీలతో సహా అరణ్యాలకు వెళ్ళాడు .అలసి ఒక చెట్టుకింద విశ్రమించాడు .అక్కడ రెండుముఖాలున్న సుందరమైన  విచారంగా ఉన్న ఒక పక్షిని చూసి ఆశ్చర్యపోయి ‘’ఎందుకు విచారం గా ఉన్నావు .ఇక్కడ అందరూ ఆయిగా ఉంటె నీకెందుకు విచారం ?’’అని అడిగాడు .

  చిచ్చికపక్షి రాజుతో ‘’నాకు ఎవరి వలనా ఎవరికీ నావల్లా భయం లేదు .ఈ పర్వతం శూన్యంగా ఉందేమిటని చూస్తున్నాను .నాకు కొంతైనా సుఖం,సంతృప్తి  కలగటం లేదు .నిద్ర ,ఆనందం విశ్రాంతి నాకు లేవు .అందుకే నా చింత ‘’అన్నది .రాజు ‘’అసలు నువ్వెవరవు .ఈపర్వత౦ ఎందుకు శూన్యమైంది .రెండు తలలున్నా సంతృప్తి ఎందుకు లేదు .ఈజన్మలోకాని గత జన్మలోకాని ఏదైనా దుష్కృతం చేశావా ?’’అని అడగగా నిట్టూరుస్తూ ఆ పక్షి ‘’పూర్వజన్మలో నేను వేదవేదాంగ పారంగతుడనైన బ్రాహ్మణుడను .జ్ఞాన విజ్ఞానాలున్నా ఇతరులపనులు చెడగొట్టేవాడిని .కలహ ప్రియు డిని .ఎదురుగా ఒకరకంగా, చాటుగా వేరొకరకంగా మాట్లాడే వాడిని .బాగుపదేవాళ్లను  చూసి ఈర్ష్యపడేవాడిని .కృతఘ్నత ,పరనింద ,గురుద్రోహం డాంబికం ,నా స్వభావం .మనోవాక్కాయలచే అందరినీ హిసించేవాడిని .నేను చేయనిపాపం లేదు .నావంటి ద్రొహిమరొకడు ఉండడు.అందుకే రెండు ముఖాలతో అంటే’’ స్ప్లిట్ పర్సనాలిటి ‘’తోపుట్టాను కనుక ఇక్కడ అంతా దుఖమే కనిపిస్తోంది .కపట వినయం వలన పాపం కలుగుతుంది .డాంబికం తో సదాచారం లో ఉన్నట్లు నటించేవాడిని .అందుకే ఈ పక్షి రూపం .అయినా ఎంతోకొంత మంచి చేశాను .నా పూర్వజన్మ ను తలుచుకొంటూ ఉంటాను ‘’అన్నది .

  రాజు పవమానుడు చిచ్చిక పక్షితో ‘’ఏ కర్మవలన నీకు ముక్తికలుగుతుంది ?’’అని అడుగగా పక్షి ‘’గౌతమికి ఉత్తరాన గదాధరతీర్ధం పవిత్రమైనది .నన్ను అక్కడికి తీసుకు వెళ్ళు .నీ దయవలన ఆక్షేత్ర సందర్శన చేసి నా సకల పాపాలు తొలగించుకొంటాను ‘’అన్నది .దయతో రాజు ఆపక్షికి గదాధర క్షేత్ర సందర్శనభాగ్యం కలిగించి ,గౌతమిలో స్నానం చేయించాడు .చిచ్చిక ‘’అమ్మా గౌతమీ !నిన్ను చూడని వాడు పాపి .ఇప్పుడు నీ దివ్య దర్శనం కలిగింది నాపాపాలన్నీ క్షాళన చేసి పుణ్యం కట్టుకో ‘’అని ప్రార్ధించి స్నానించి గదాధరునిసేవించి అందరూ చూస్తుండగా స్వర్గానికి చేరింది .అప్పటినుంచి ఈ తీర్ధం ‘’చిచ్చిక తీర్ధం’’ , ‘’పవమాన తీర్ధం ‘’అనే పేరుతో విరాజిల్లుతోంది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం

కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం

డా .కామేశ్వరికి ట్రాన్స్ ఫర్ అయి విశాఖనుంచి హైదరాబాద్ వెళ్ళింది .తర్వాత ఆమెను మిలిటరీ సర్వీస్ లోకి తీసుకొన్నారు మద్రాస్ ,కలకత్తా ,జలంధర్ ,ఆర్మీలో పనిచేస్తూ 1970-74లో రూర్కీ లో మేజర్ అయింది .ఎక్కడ ఉద్యోగం లో ఉన్నా ఏడాదికో మాటు విశాఖ, గోదావరి లకు రావటం ‘’దువ్వూరి’నాన్న’’ ఉన్న చోటికి రావటం ,నాన్న దగ్గర నాలుగైదు రోజులు ఉండటం జరుగుతూనే ఉంది .నాన్నను చూడాలనే కోరిక ఆమెకు ఎక్కువో ,తల్లి ని చూడాలనే ఈయన కోర్కె ఎక్కువో తేల్చుకోలేక పోయారిద్దరూ .ఇదో విధమైన  రుణాను బంధం అన్నారు శాస్త్రిగారు .జన్మలుమారినా ప్రేమలు, అభిమానాలు అక్కడక్కడ గోచరిస్తూనే ఉంటాయి ,కామేశ్వరి ఎప్పుడు కలిసినా పెద్దలతో ,పిన్నలతో ‘’ఈయన నాకొడుకు ‘’అనే పరిచయం చేస్తుంది .ఉత్తరాలలో కూడా తల్లి కొడుక్కి రాసినట్లే రాస్తుంది .’’నువ్వు ‘’అంటు౦దే కానీ ఎన్నడూ ‘’మీరు ‘’అననే అనదు.

  దువ్వూరి’’ శాస్త్రి కొడుకు  గారి ‘’వొళ్ళో పడుకొంటుంది .’’ఏ పూర్వ జన్మలోనో నీకు తల్లినై  ఉంటాను నాన్నా !’’అంటుంది శాస్త్రిగారికీ అదే నిశ్చయం .ఆమె భర్తకూడా అంతే చనువుతో ఉండటం మరీ ఆశ్చర్యం .అదొక గొప్ప సంస్కారం .అతడు 1968లో ఎం.ఏ.పాసై ,ఇంగ్లాండ్ వెళ్లి ,ఏదో పరిశోధన చేశాడు .మధ్యమధ్యలో వచ్చి భార్యాపిల్లల్ని చూసి వెడుతూ ఉండేవాడు .ఇద్దరుకొడుకులు పాండిచ్చేరి అరవిందాశ్రమం లో చదివారు .తర్వాత ఒకడు మెడిసిన్, ఇంకోడు ఇంజనీరింగ్ చదివి సెటిలయ్యారు .కామేశ్వరి దంపతులు  నాన్న ను చూడటానికి వచ్చేవారు .భర్త యెదుటనే కామేశ్వరి కొడుకైన శాస్త్రిగారి వొడిలో తలపెట్టుకొని పడుకొని భర్తతో ‘’నాన్న వొళ్ళో తలపెట్టుకొని పడుకుంటే యెంత ప్రశాంతంగా ఉంటోందో !ఆ అనుభవం మీకు లేదుకదా ‘’అని ఆటపట్టించేది .జలంధర్ నుంచో కలకత్తా నుంచో తిరువన్నామలై వెడుతూ ,మధ్యలో దాక్షారామ దగ్గర దువ్వూరి వారి స్వగ్రామం మసకపల్లి వెళ్లి’’ నాన్న’’ ను ఒకటి రెండు సార్లు చూసి వెళ్ళింది’’ తల్లి’’ డా.కామేశ్వరి .  దువ్వూరి వారి కుటుంబం అందరితోనూ అదే చనువుతో ఉండేది .మగపిల్లలను అన్నా, తమ్ముడూ ఆడపిల్లలను అక్కా, చెల్లీ అని ఆప్యాయంగా పిలిచేది .శాస్త్రిగారి దౌహిత్రి నాగమణి అంటే కామేశ్వరికి మహా ప్రీతి .నాగమణి కి కూడా ఆమెపై ‘’కంచి కామాక్షి అమ్మవారిపై ఉన్నంత గౌరవ ఆదరాలు’’ .దీనికి కారణం ఎవరూ చెప్పలేరు ‘’కస్యచిత్ క్వచిత్ ప్రీతిః’’అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరిపై ప్రేమ ఏర్పడుతుంది .ఎందుకో చెప్పలేము .అది చెప్పలేకే జన్మాంతర సంబంధంగా భావిస్తాము .డా .కామేశ్వరిలో ఆధ్యాత్మిక భావమూ చాలా ఎక్కువే .నిత్యపూజ, దేవీధ్యానం ,దేవీ స్తోత్రం అంతా పరమ పవిత్రంగా ఉండి ముచ్చట,ఆశ్చర్యం తన్మయత్వం కలిగిస్తుంది .ప్రతియేడూ తిరువన్నామలై వెళ్లి గురు సాన్నిధ్యంలో కొంత సేపు గడిపిరావటం ఆమె ప్రత్యేకత .దేశం లో ఆమె చూడని క్షేత్రం లేనేలేదు .ఆమె తండ్రిగారు సన్యాసాశ్రమం స్వీకరించి సుమారు 20ఏళ్ళు తపస్సు చేసి సిద్ధి పొందారు .ఆ ఆధ్యాత్మిక సంస్కారం కూతురు కామేశ్వరిలో బాగా సంక్రమించింది .

   రిటైరైన దువ్వూరి వారిదగ్గరకొచ్చి నప్పుడల్లా ‘’నాన్నా !ఒకరి నిర్బంధం లో లేకుండా ఇప్పుడు స్వేచ్చగా ఉన్నావుకదా.వచ్చి నా దగ్గరే ఉండు నాన్నా !ఖాళీగా ఉన్నప్పుడల్లా మనమిద్దరం కలిసి పుణ్యక్షేత్రాలు తిరిగొద్దాం .డాక్టరైన నీ కూతురు నీదగ్గరే ఉంటు౦దికనుక ఆరోగ్యానికి భయం లేదు ‘’అనేది .అలా అంటూనే ఉంది .ఈయనా వెళ్ళాలనే అనుకొంటారు .కాని .అవి ‘’తీరే కోర్కేలా ‘’అంటారు శాస్త్రీజీ .చివరికి ‘’కొన్ని కోర్కెలు తొలగించుకోలేము ‘’అని మనసుకు సమాధానం చెప్పుకొన్నారుకళాప్రపూర్ణ దువ్వూరి  వేంకట రమణ శాస్త్రి గారు .

   ఆధారం –దువ్వూరి వారి స్వీయ చరిత్ర

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గౌతమీ మహాత్మ్యం-65 94-సరస్వతీ తీర్ధం

గౌతమీ మహాత్మ్యం-65

94-సరస్వతీ తీర్ధం

పుష్పోత్మటం తూర్పున ,గౌతమికి దక్షిణాన ‘’శుభ్రం ‘’అనే పర్వతం బాగా ప్రసిద్ధి చెందింది .దానిపై శాకల్యుడు అనే ముని తపస్సు చేస్తు౦డగా,సమస్త ప్రాణికోటి అతనిన్ని స్తుతిస్తూ ,నమస్కరి౦చేది . అక్కడే ‘’పరశువు ‘’అనే రాక్షసుడు కామ రూపియై బ్రాహ్మణ ,పులి ,స్త్రీ ,బాలరూపాలు ధరించి రోజూ శాకల్యముని తపో భంగం చేసి తీసుకు వెళ్ళే ప్రయత్నాలు చేశాడు .కాని విఫలుడయ్యాడు .ఒక రోజు ఆ ముని తపస్సు అయ్యాక భోజనానికి వస్తుండగా ,ఆమాయావి దుర్బల బ్రాహ్మణ వేషం తోఒక కన్యకతో  వచ్చి ‘’మేమిద్దరం భోజనానికి వచ్చాం .ఆతిధ్యమిచ్చినవారు సర్వ శ్రేస్టులు ‘’అన్నాడు .

వాడి కపటం తెలీక  ముని అతడికి మర్యాద చేసి భోజనం పెట్టాడు .ఆపోశన వేశాక ‘’పరశువు ‘’అతిధి కోరిన కోరిక తీర్చటం లోకమర్యాద.నేను కోరింది తీరుస్తానంటే  భోజనం చేస్తాను ‘’అని మెలికపెట్టాడు.’’అడిగింది ఇస్తా .తినండి ‘’అన్నాడు ముని .అప్పుడు వాడు ‘’నేను పరశువు అనే రాక్షసుడను .నీకు శత్రువును కాను ,నావి తెల్లబడిన వెంట్రుకలు కావు .దేహం మాత్రం సుష్కించింది .నిన్ను, నీ అనుచరులను ఎత్తుకుపోయి తిని ఆకలి తీర్చుకొంటాను ‘’అన్నాడు .

శాకల్యముని వాడితో ‘’నాది వజ్ర శరీరం .అయినా ఒకమాట చెప్పాలినీకు .అతిధివికనుక హితం చెప్పటం నా విధి .నన్ను శ్రీహరి సకల దిక్కులలోనూ రక్షిస్తూ ఉంటాడు .నాపాదాలను విష్ణువు శిరస్సు జనార్దనుడు ,పృస్టాన్నికూర్మరాజు ,హృదయాన్ని శ్రీ కృష్ణుడు ,వరాహమూర్తి బాహువులను ,నృసింహస్వామి వ్రేళ్ళను ,పక్షివాహనుడు నేత్రాలను ,వాగీశుడు ముఖాన్ని ,కుబేరుడు చెవులను శివుడు అంతటా రక్షించుగాక .నారాయణుడే నాకు శరణు .ఆకలితో ఉన్నావు కనుక నన్ను తీసుకు వెళ్లి తిని ఆకలి తీర్చుకో ‘’అన్నాడు నిర్భయంగా . పరశు రాక్షసుడు ‘’మహాత్మా !నువ్వు సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు స్వరూపంగా కనిపిస్తున్నావు .వేదస్వరూపునిగా ,జగన్మయుడివిగా దర్శన మిస్తున్నావు .కనుక నువ్వే నాకు శరణు .నా అజ్ఞానం పటాపంచలైంది .ఇనుము సువర్ణం అయినట్లు ఉందినాకు ‘’అన్నాడు .

అప్పుడు శాకల్యమౌని కృపతో  ‘’గౌతమీ తీరం చేరి ,సరస్వతీ దేవి అనుగ్రహం సాధించు .జనార్దనుడిని స్తుతించు .అన్నిటికీ తరుణోపాయం నారాయణ స్తోత్రమే ‘’అని చెప్పాడు .వాడు వెంటనే వెళ్లి పావన గౌతమీ స్నానం చేసి శుచిగా నిష్టగా గంగకు అభిముఖంగా కూర్చుని జగజ్జనని సరస్వతి దేవి దర్శన భాగ్యం పొందాడు .పాపాలన్నీ తొలగిపోయి పరిశుద్ధుడై ,.పరిశుద్ధ అంతరంగుడై ‘’అమ్మా !శాకల్య గురువు శ్రీ హరిని స్తుతించమని ‘చెప్పారు అనుగ్రహించి ఆ శక్తి నాకు కలిగించు ‘’అని వేడాడు .’’తధాస్తు ‘’అన్నది వాణీమాత .గీర్వాణి అనుగ్రహంతో విష్ణుమూర్తిని అనేక స్తోత్రాలతో మెప్పించాడు .మురారి సంతసించి’’నీమనసులో ఉన్న కోర్కె తీరుతుంది ‘’ అన్నాడు .అందరి అనుగ్రహం తో ఆ రాక్షసుడు స్వర్గం చేరాడు .ఈ ప్రదేశమే సరస్వతీ తీర్ధం .ఈశ్వేత పర్వతం నుంచి సారస్వతం ,వైష్ణవం ,శాకల్యం ,పరశు అనే తీర్దాలేర్పడినాయి అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

సశేషం

కార్తీక పౌర్ణమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

జ్ఞాన జ్యోతి పురస్కార ప్రదానం – వార్తా పత్రికలో

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక మాసం 3వ మంగళవారం రాత్రి దీపాలంకర శోభ

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక మాసం 3వ మంగళవారం రాత్రి దీపాలంకర శోభ

https://photos.google.com/share/AF1QipOcfbRFpBr-1xi0Rp62XmadyCBHAMmiPUrBxPC9NQ_uMOhTfgayK4ctH25pp9HCHw?key=Z3hmcXRnVTJyZ3FkNEVfT2ZIWktLMVhvYTF6TTlB

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

9-11-19 శనివారం రాత్రి హైదరాబాద్ మియాపూర్ మా తోడల్లుడిగారబ్బాయి సూర్యం దంపతుల ఇంట్లో మేము

9-11-19 శనివారం రాత్రి హైదరాబాద్ మియాపూర్ మా తోడల్లుడిగారబ్బాయి సూర్యం దంపతుల ఇంట్లో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

9-11-19శనివారం హైదరాబాద్ బాచుపల్లిలో మా అబ్బాయి శర్మ ఇంట్లో ఉదయం 7-30నుంచి 11-15వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం తరువాత 11-30నుంచి 2-30వరకు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం చిత్రమాలిక

9-11-19శనివారం హైదరాబాద్ బాచుపల్లిలో మా అబ్బాయి శర్మ ఇంట్లో ఉదయం 7-30నుంచి 11-15వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం తరువాత 11-30నుంచి 2-30వరకు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం చిత్రమాలిక

https://photos.google.com/share/AF1QipO5Bo4itslgr2B5Ab2o9Ron_UO0E8t3ISWsmz0PWBPQLYcl9qcz1dlp-CjrKHIPjg/photo/AF1QipN8agkq8RWVcu8v4tXWIc_JURr7769mINe8OIsB?key=MG53VVdMUTFRTHpHcFBnR3VGZS1DM2JrdS1xdVJB

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి