జన వేమన –19 వేమన పై ప్రసరించిన వెలుగు చీకట్లు

   జన వేమన –19
వేమన పై ప్రసరించిన వెలుగు చీకట్లు  

వేమన కవిత్వానికి ముగ్ధులై ప్రశంశల జల్లు కురి పించిన పాస్చాత్యాలలో మొదటి వాడుఫ్రెంచి దేశానికి చెందినమత గురువు జె.యే.దుబాయ్ ,”ఉదార వేదాంత విషయాలను రాసిన హిందూ రచయిత లలో ,అందులో హిందూ మాతా చారాలను విమర్శించిన వారిలో ఒక్క బ్రాహ్మణుడు కూడా లేడు .ఇలాంటి విమర్శ గ్రంధాలు రాసిన వారిలో బ్రాహ్మణేతర కవులే ఉన్నారు .అలాంటి వారిలో తిరువళ్ళువర్ ,అగస్త్యుడు ,తమిళులు .సర్వజ్ఞా విజ్ఞాన మూర్తి కన్నగిడు .తెలుగు లో ప్రఖ్యాత కవి -వేమన .ఆయన రాసినవి ఇతర భాషల్లోకి ప్రవేశించాయి .ఆయన రచనలు చిత్తా కర్శణం గా ,సూక్ష్మ బుద్ధి తో చేసిన విచారముగా ,స్వతంత్ర భావో పేతం గా ,ఒక ప్రత్యేకత లో ఉన్నాయి .”అని కీర్తించాడు .హెన్రీ బ్యూ చాంప్ అనే ఆయన దుబాయి రాసిన దాన్ని అనువాదం చేసి ప్రచురించాడు .విలయం బెంటిక్ ప్రభువు ఆ ప్రతిని మెచ్చి ,”సమైక్యత కు బాగా తోడ్పడు తుంది ”అని కితాబిచ్చాడు .ప్రభుత్వం చేత ఆ పుస్తకాన్ని కొని పించి ,ప్రచురించే కార్యక్రమానికి నాంది పలికాడు .దుబాయి గారికి 8000రూపాయలు బహుమతి గా ఇప్పించాడు లార్డ్ బెంటి క్ .
సి.పి.బ్రౌన్ మద్రాస్ లో   సివిల్ సర్వీసు ఉద్యోగం చేశాడు .భాష మీద ఆయనకు శ్రద్ధ కలిగింది .తాటాకుల మీద ఉన్న వేమన పద్యాలను సంగ్రహించి ,సవరించి ,ముద్రణ చేసి తెలుగు జాతికి వేమన ను ప్రసాదించిన మహా మహుడు .693పద్యాలను ఆంగ్లం లోకి అనువాదం చేసి ,తాత్పర్యం రాసి ,ముద్రించిన మొదటి వ్యక్తీ బ్రౌన్ .ప్రతి ఫలా పేక్ష లేకుండా ,తెలుగు జాతికి బ్రౌన్ చేసిన సేవ చిరస్మరణీయం .వీటిని లాటిన్ భాషలోకీ అనువాదం చేశాడు ”.the verses of Vemana -moral .religious and statistical ”అనే పేరు తో అనువాదం చేశాడు బ్రౌన్ .వేమనకు సరి తూగా గలిగే వాడు గ్రీకు దేశానికి చెందినా ”లూశియాస్ ”ఒక్కడే అన్నాడు .లూసియాస్ లాగా వేమన తెలుగు భాషా సాహిత్య ప్రారంభకులకు ఉపకారి అన్నాడు .బ్రౌన్ దొర వల్లే మన పండితుల కాళ్ళ కు వేమన ఆనాడు ,గుర్తించారు .నీతి ,వ్యంగ్యం ,తాత్వికం ,ప్రకీర్ణం అనే వర్గా లుగా వేమన పద్యాలను బ్రౌన్ విభజించాడు .
అబే దుబాయి రాసిన ”hindu manners customs and ceremonies ”అనే పుస్తకానికి సంపాదకీయం రాసిన పోప్అనే దొర వేమన పద్య మాధుర్యాన్ని ,అనుప్రాస,యమకాలన్కారాలను మించిన మరో కవిత లేదు అన్నాడు .మెక్డో నాల్డ్”వేమన రచనలు దేశీయులను ఆకర్షించి నంత గా ,మరోకవి రచనలు లేవు ”అని పొగిడాడు .చార్లెస్ యి.గోవర్అనే అనువాదకుడు ”వేమన -తిరువల్లువార్ కంటే తక్కువ ”అని చీకట్లు కుమ్మరించాడు .అయినా” the folk songs of southern india ”అనే పుస్తకం లో వేమన పద్యాలను నాలుగింటిని ఎంపిక చేసి చేర్చాడు .
వేమన పై గొప్ప వెలుగు ను ప్రసరింప జేసిన  వాడు ”క్యాంబెల్ ”.”వేమన ప్రజల కవి .ఆయన రాసింది నిరక్షరు  లైన గ్రామీణుల కోసం .ఆయన శైలి శక్తి వంతం .వేమన పండితుల ప్రశంశలను కోర లేదు .సాంప్రదాయ కవితా నియమాలను ఉల్లంఘించాడు .వ్యంగ్య సూక్తి వైచిత్రి వల్లనే ప్రజాదరణ పొందాడు .తోటి ప్రజలకు సేవ చేయాలన్న తీవ్ర కాంక్ష ఉన్న సంస్కర్త .అతనిది ఆస్తిక వాదం .మానవ శక్తికి ఒక స్తానాన్ని సంపాదించాడు .లూధర్ ,విల్క్లిఫ్ ల వంటి మత సంస్కర్తలు వేమనకు సాటి రారు .”అని మనస్పూర్తిగా వేమన కవినీ ,ఆయన కవిత్వాన్ని అంచనా వేసి ఆయన స్తానం ఏమిటో నిర్ణయించాడు క్యాంబెల్ కవిగా వేమన్న ను గుర్తించని వారి కళ్ళు తెరిపించాడు దొర .
డాక్టర్ ఈశ్వర తోపా ”saint vemana and his philosophy ”అనే గ్రంధం లో ”మానవతా సిద్ధాంతాలను పునాదులుగా చేసి ,వేమన తన ఆదర్శ సంస్కరణల భవనాన్ని నిర్మించాడు .ఆత్మ శుద్ధికి మానవుడు తానే స్వయం గా పాటు పడాలి .మానవుని లో అంతర్గత మైన ఆంతరంగిక శక్తుల్ని వెలికి తీయడం లో యే మానవాతీత శక్తి కూడా తోడ్పడదు .అయితే ,సర్వ మానవ సంక్షేమం కోసం మానవ శక్తుల్ని ఉదాత్తం గా సంస్క రించటం చాలా ముఖ్యం అన్న గ్రహింపు అవసరం ”అని వేమన సంకల్ప బలానికి జేజేలు పలికాడు. డాక్టర్ ఎల్.డి.బార్నేట్ ”the heart of india -”అన్న పుస్తకం లో ”మానవులకు సంబంధించి నంత వరకు వేమన దేనినీ నిర్లక్ష్యం చేయలేదు ”అని శ్లాఘించాడు .భారత దేశ చరిత్రను మొట్ట మొదటి సారి రాసిన ”విన్సెంట్ స్మిత్ వేమన గురించి చెబుతూ వర్ణ వ్యవస్థ లోని దోషాలను గురించి రాసే సందర్భం లో వేమన పద్యాలను నాలుగింటిని ఉదాహరించాడు .
మద్రాస్ ప్రభుత్వం పాఠ్య గ్రంధాలను సవరించి ,పరిశీలించటానికి మాక్దో నాల్డ్ ను అధ్యక్షుని గా ఒక కమిటీ ని వేసింది .”హెన్రీ బావర్సు” అనే ఆయన్ను తెలుగు పాఠ్య పుస్తకాలపై ఒక నివేదిక నిమ్మని కోరింది .ఆయన వేమన పద్యాలను పూర్తిగా తీసేయాలని సిఫార్సు చేశాడు .ఆయన రిపోర్టు లో ”ఒక యూరోపియన్ కు వేమన తన కాలం కంటే ఎంతో ముందుకు అభిగమించిన వ్యక్తీ గా కన్పిస్తాడు .కాని ,ప్రభుత్వం హిందూ విద్యార్ధులను క్రైస్తవ మతం లోకి కలుపు కొనే ప్రయత్నం చేస్తోంది అనే అపోహకు తావు ఇవ్వ రాదు .”అని చెప్పాడు .డాక్టర్ జె.ముదారాక్ కూడా నిషేధించాల్సిందే నని చెప్పాడు .”ప్రభుత్వం ప్రచురించిన పాఠ్య గ్రంధాలలో బైబిల్ దూషణ ఎలా ఉండ కూడదో ,అలానే వేద నిండా కూడా ఉండ రాదు .స్వజాతి దూషణ గల పద్యాలను ఆ బ్రాహ్మణులనే చెప్పమనటం ఉచితం కాదు ”అని రిపోర్టు ఇచ్చాడు .
ఒక చోట మెచ్చిన బార్నేట్ మరో చోట ”వేమన వెర్రి సన్యాసి అని ,పూర్ రిచర్డ్ అని ,కల్పిత గ్రామీణ యోగి ”అని మరింత చీకటి రుద్దాడు .ఈనాటి ఐన్ స్టీన్  శాస్త్ర వేత్త మహాత్మా గాంధీజీ ని గురించి ”ఇలాంటి మానవుడు భూమి మీద జన్మించి ఉన్నాడంటే ,భవిష్యత్తు తరాలు ఆశ్చర్య పోతాయి ”అని అమితాశ్చర్యపోయాడన్న సంగతి మనకు తెలుసు .అలాగే లూర్నేట్ కూడా ”రక్త మాంసాలతో మానవ శరీరం ధరించి ,వేమన అనే పేరుతో ,ఈ భూమి మీద పుట్టి ,నిజం గా దాన్ని పవిత్రం చేశాడా ”?అని ఆశ్చర్య చకితుడైనా డట .చివరగా ”మానవ హృదయాంత రాల పరీక్షకుడు ,ఒకడు లోక ప్రవక్తల ఉపదేశాల విలువను కట్టటానికి తూస్తే ఎందరో ఉన్నతులు ఎన్నో మహిమలు గల ఆత్మలు ఈ తెలంగాణా (వేమన తెలంగాణా లో పుట్టి నట్లు బార్నేట్ భావించాడు )వినీత ,వినమ్ర కృషికుని (రైతు )కంటే ,ఎంతో తక్కువ గా తూగి నట్లు తెలుసుకో గలడు ”అని మనస్పూర్తిగా మెచ్చుకొన్నాడు .ఇలా పాశ్చాత్య  వేత్తలు వేమన పై గొప్ప వెలుగు చీకట్ల ను కుమ్మరించారు .ఆ వెలుగుల ముందు ,చీకటి తన అస్తిత్వాన్నే కోల్పోయింది .చివరగా అంతటా తేజస్సే నిండి పోయింది .అదీ వేమన వ్యక్తిత్వ ప్రభావం .వీటి నన్నిటిని శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారు చక్కని తులనాత్మక పరిశీలన చేసి వేమన నిండు పున్నమి కాంతిని తెలుగు దేశానికి అందించారు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –5-8-12-కాంప్–అమెరికా .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.