బాలీ దేవాలయాలు
బాలీ లో చాలా దేవాలయాలున్నాయి .అందులో గొప్ప దేవా లయం అని పించుకోన్నది ”మదర్ బెశాఖి దేవాలయం ”.ఇది 3610అడుగుల ఎత్తున మౌంట్ ఆగంగ్ పై ఉంది
.మన మేరు పర్వతం గా వారు దీన్ని భావిస్తారు .నిజం గా ఇది ఇరవై రెండు దేవాలయాల సముదాయం .ఇది పది హేడవశాతాబ్దపు నిర్మిత దేవాలయం .ముందు గా ఇక్కడ”పురా గోవా రాజ గుహ” దేవాలయాన్ని ను చూడాలి
.ఇక్కడ దేవాలయాలకు వెళ్ళాలంటే ప్రత్యెక మైన దుస్తులు ధరించాల్సిందే.సామ్ప్రదాయమైన
సారంగు ,శిరస్త్రానం ధరించి లోపలి వెళ్ళాలి .అన్ని దేవాలయాలు ఆరు బయటే ఉంటాయి .కాని ఇది ప్రత్యేకంగా గుహలో ఉంటుంది .దీనికో కధ ప్రచారం లో ఉంది .ఒకప్పుడు ఒక దుష్ట రాజు ఇక్కడ పాలిస్తూ ప్రజల్ని పీడించే వాడు .దేవతలు, రాజు ను శిక్షిం చ టానికి మూడురకాల సర్పాల రూపం లో వచ్చారు .బ్రహ్మ భూమి నుండి అనంత భోగ నాగు బామునేక్కి వచ్చాడు .విష్ణు నీటి నుండి వాసుకి నాగునేక్కి వచ్చాడు .ఈశ్వరుడు ఆకాశం నుండి తక్షక నాగ రూపం లో వచ్చాడు .అవన్నీ ఇక్కడే పరి వేష్టించి ఉన్నాయి .దీనికి ఒక పర మార్ధం ఉందని బాలీవాసులంటారు .భూమి ,నీరు ,గాలి ఇక్కడ సమ తూకం గా శాంతియుతం గా ఉంటాయని అందు వల్ల ప్రపంచం సమతా స్తితి లో ఉంటుందని వీరి నమ్మకం .ఈ దేవాలయం ఆ మూడింటిని బాలన్సు చేసి ఉంచే స్థానం అని నమ్మకం . .
మళ్ళీ మెట్లు ఎక్కి వెళ్తే లక్ష్మి దేవాలయం వస్తుంది .
చాలా ప్రశాంత మైన వాతా వరణం .ఇక్కడ కూచుంటే చిత్త శాంతి కలుగు తుంది .ప్రకృతి అందాలు పర వశింప జేస్తాయి .భక్తులు తెల్ల వస్త్రాలతో తెలుపు , ,పసుపు రంగు గోడుగులతో దర్శనాలకు వస్తారు .ఇక్కడికి వచ్చిన వారు తమ పూర్వీకులు దేవతలుగా మారాలని కోరు కొంటారు .అక్కడి పూజారి పవిత్ర జలాన్ని అందరి శిరస్సు ల మీదా చల్లు తాడు .నైవేద్యం పెట్టిన బియ్యాన్ని అందరికి ప్రసాదం గా పంచి పెడతాడు .బియ్యమే ఇక్కడి ప్రసాదం .ఇక్కడ దేవాలయాలకు చెప్పులు వేసుకొని లోపలి వేళ్ళ వచ్చు .అయితే పూజ చేయిచు కొనే వారు మాత్రం చెప్పులు వదిలి వెళ్ళాలి .
ఇక్కడి ”దేనా పాసార్ ”అనే చోట ద్విజేంద్ర ఫౌండేషన్ స్కూల్ ఉంది .అందులో 4000 మంది విద్యార్ధులు చదువు కొంటున్నారు .ఇక్కడ వీరికి.”HINDU HUMAN RESOURCES” లో శిక్షణ నిస్తారు .మతం, సంస్కృతి ,సాహిత్యాల పై అభినివేశం కల్గిస్తారు. అవగాహన పెంచటమే వీరి ధ్యేయం .దీన్ని 1953లో శ్రీ దాంగ్ హయాంగ్ ద్విజేంద్ర కట్టించారు .ఆది ఎనిమిదో శతాబ్దపు జావా పూజారి స్మారకార్ధం అదే పేరు మీద నిర్మిత మైంది .ఈయనే బెశాఖి దేవాలయాన్ని నిర్మించాడు .ఆ విద్యా లయం లో ద్వారం దగ్గర భారీ సరస్వతి, గణపతి విగ్రహాలుండి చూపరులకు కను విందు ,భక్తీ కలిగిస్తాయి .వేలాది విద్యార్ధులు మోటారు సైకిళ్ళ మీద అక్కడికి చేరటం ముచ్చట గా ఉంటుంది .ఇక్కడ మతాతీత విద్యనే బోధిస్తారు .బి.యే.వరకు విద్యా బోధన ఉంటుంది .ఇక్కడ చదివే వారిలో 99% హిందూ విద్యార్ధులే .ప్రభుత్వం ఫ్రీ గా పుస్తకాలు అందిస్తుంది .ఏడాదికి250 మంది విద్యార్ధులకు ఉచితం గా విద్య నేర్పిస్తారు .కాని దీనికి హిందూ స్కూల్ అనే పెరుండదు అంతే .12మంది టీచర్లు ,హిందూ ధర్మాన్ని యోగాను బోధిస్తారు .ఫీజులు చాలా తక్కువ .కిండర్ గార్టెన్ విద్యార్ధికి నెలకు యాభై ఆరు అమెరికన్ సెంట్లు మాత్రమె .సెకండరి వారికి ఒక డాలరు ముప్ఫై ఆరు సెంట్ల ఫీజు మాత్రమె .తొమ్మిదో గ్రేడ్ లో అవతారాలను ,నీతి కధలను ,వేదాంతాన్ని ,హిందూమతం యొక్క పుట్టు పూర్వాలను చరిత్రను బోధిస్తారు .కర్మ ఫలాన్ని గురించి చెబుతారు .రామాయణ ,మహా భారత, భగవద్ గీత లను బోధిస్తారు . .భజనలు ,యోగా ,మంత్రాలు ,దేవతారాధన ,నైవేద్య విధానం నేర్పుతారు .విద్యార్ధులు ప్రతి రోజు స్కూల్ కు రాగానే అక్కడ ఉన్న దేవాలయానికి అందరు వెళ్లి దేవతలకు నైవేద్యం సమర్పిస్తారు .ప్రార్ధన చేస్తారు .ప్రతి పౌర్ణమి నాడు నాలుగు వేల మంది విద్యార్ధులుసాంప్రదాయ దుస్తులు ధరించి సామూహికం గా పూజ నిర్వ హించి నైవేద్యం పేడ తారు .చూడటానికి రెండు కళ్ళు చాలవు .ఇక్కడ బోధించే ఉపాధ్యాయులు ”హిందూఇజం మాకు స్తిర చిత్తాన్ని ,ప్రశాంతతను ప్రసాదిస్తుంది ”అని చెబుతారు విద్యార్ధులు తమ మనసును కేంద్రీక రించే శక్తి అద్భుతం గా పెరిగింది అని తెలియ జేస్తారు .హిందూ ధర్మాన్ని తమ జీవితం లో అనుభవం లోకి తెచ్చుకోవటానికి ఆ స్కూల్ పుపయోగ పడుతోందని, విచక్షణ పెరుగు తోందని ,మంచి చెడు తెలుసుకో గలుగుతున్నామని అంటారు .తాము యే వ్రుత్తి లో ఉన్నా మంచి ,మానవత్వం ఉన్న మనిషులుగా సంఘానికి ఉప యోగ పడే వారు గా మారాలని భావిస్తారు .
బాలి లో ”హిందూ యూని వేర్సిటి ” ఉంది .ఇది ప్రైవేట్ సెక్యులర్ విద్యా లయమే అయినా హిందూ ధర్మాన్ని తప్పక బోధిస్తారు .చదువు లో అదొక భాగమే .ఊబాద్ అనే చోట” ఆర్ట్ సెంటర్ ”ఉంది .అక్కడ బాలి సంస్కృతిని ,వేదాంతాన్ని ,కళలను నేర్పుతారు .అవి సకల సమాజానికి ఎలా ఉప యోగా పడాలో బోధిస్తారు .బాలి లో పద హారు సంస్కారాలను పిల్లలకు చేస్తారు .అందులో పై దవడ ముందు ఆరు పండ్లకు మెరుగు పెట్టటం ఒకటి .ఇక్కడి ముఖ్య పూజారి కొన్ని కథిన నియమాలను పాటించాలి ఆయన మోటార్ సైకిల్, కారు లను నడప రాదు .షాపింగు కు వేళ్ళ రాదు .సినిమాలు చూడ రాదు .పేకాట వ్యభిచారాలకు దూరం గా ఉండాలి .పూర్తీ శాకాహారమే భుజించాలి .ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వేళ్ళ రాదు .ఎవరో ఒకరు తోడు ఉండ గానే వెళ్ళాలి .బాలి లో దేవాలయాలను కట్టే వారిని ”అందగీలు ”అంటారు .వీరికి విశ్వ కర్మ ప్రధానం గా ఆరాధనీయుడు .ఇల్లు ,దేవాలయం నిర్మాణం మొదలు పెట్టెటప్పుడు భూమి పూజ చేస్తారు .నిర్మాణం పూర్తి కాగానే ”మలపాస్ ”అనే తంతు జ రుపుతారు .దీని వల్ల నిర్మాణానికి జీవ శక్తి లభిస్తుందని భావన .పంచ ధాతువులను నిక్షేపిస్తారు .అవి బంగారం వెండి ,రాగి ఇనుము రూబీ .ఇవి పంచ మహా భూతాలకు ప్రతీకలు .
బాలి లో సాంప్రదాయ హిందూ ధర్మాన్నే పాటిస్తారు .శంకర ,రామానుజ మొదలైన వారు సంస్కరణల పేరు తో దీన్ని కలుషితంచేశారని భావిస్తారు ఇది నవీన హిందూ ధర్మమని దాన్ని పాటించం అనీ అంటారు .”ఆర్ద డాక్సు హిందూఇజం ”నె ఆచరిస్తామని గర్వం గా చెప్పుకొంటారు .జంతు బలి వారికి నిషేధం లేదు .దేవుడిని మూడు లెవెల్స్ లో పూజిస్తారు .వారిది శైవ సిద్ధాంతం అని మనం ముందే చెప్పుకొన్నాం .పరమ శివుడు అత్యంత ఉన్నతుడు .ఆయన్నే”IDA SANGHYANG WIDI WASS ” అంటారు .ఈయనే వీరికి సర్వోత్కృష్ట దైవం .ఆ తరువాత సదా శివుడిని ఆ తరువాత శివుడిని ఆరాధిస్తారు .పరమ శివుడు నిర్గుణుడు ఆయనకు ఆకారం లేదు .సదా శివుడు ”అర్ధనారీశ్వరుడు ”అంటే సగుణ ,నిర్గుణ మాత్రమె కాక రెండూ ఆయనే .శివుడు ,శక్తీ అన్న మాట.మూడవ రూపం శివుడు .శివుడిని మహా రాజు గా భావించి ఆరాధిస్తారు .ఇదే శైవ సిద్ధాంతం .
దుర్గా దేవిని అంటే పార్వతి దేవిని, శివుడిని కొలుస్తారు .వారిద్దరూ ఒకే నాణానికి బొమ్మా బొరుసు అనుకొంటారు .ఏదైనా వింత జరగాలని మనసులో ఉంటె దుర్గా మాతను సేవిస్తారు .ఆమెను పది హేను రోజుల కొక సారి జంతు బలి తో పూజ చేయటం సంప్రదాయం .అక్కడ పూజా విధానం లో మూడు మార్గాలున్నాయి .వామాచారం బెంగాల్ నుంచి వచ్చిందని చెబుతారు .తాంత్రిక విధానం ఇందులో ఉంటుంది . మనిషి పగలు మానవుని గా ,రాత్రి పశువు గా కనీ పిస్తాడు .ఇదే వామ మార్గం .శక్తి మార్గం .అలాంటి శక్తి కల వాడు ఎవరి చెయ్యి పట్టుకొన్నా వాళ్ళ చెయ్యి పక్షవాతం వచ్చి నట్లు చచ్చు బడి పోతుంది .పర్యాటకులు తమ సామ్ప్రాదాయానికి ఇబ్బంది కలిగించ కూడదని వీరు కోరు కొంటారు .బాలీయులు త్రికరణ శుద్ధి పాటిస్తారు .మంచిగా ఆలోచించటం ,మంచిగా మాట్లాడటం ,మంచి చేయటం వారికి అలవాటైన విషయం .వారికి మూడు ”హిత కరణాలు”చాలా అభిమానమైనవి .అవే -ప్రకృతి పట్ల ఆరాధనీయభావన ,మానవుల యెడ సుహృద్భావం ,భగ వంతుని యెడ అపార విశ్వాసం .వారి జీవితం లో ”పంచ యజ్ఞాలకు ”ప్రాముఖ్యం ఉంది .మానవులకు ,జంతువులకు,దేవతలకు ,తమ పూర్వీకులకు ,ఋషులకు కానుకలు సమర్పించటం .ఇవన్నీ పాటిస్తే తాము” సదా శివులం” అయి పోతామని వీరి దృఢ విశ్వాసం . మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –20-9-12-కాంప్ -అమెరికా

