జ్యోతిష్టోమ యోగి –మల్లాది రామ కృష్ణ చయనులు
మల్లాది రామ కృష్ణ చయనులు గారు 1865లో గుంటూరు జిల్లా సత్తెన పల్లి తాలూకా గోరంట్ల అగ్రహారం లో జన్మించారు .తండ్రి రాఘవయ్య ,తల్లి అచ్చమ్మ గార్లు .వెలనాటి బ్రాహ్మణులు .చిన్న నాటే వీరు హైదరా బాద్ సంస్థానం లో ఒక గ్రామానికి తీసుకొని పో బడి ఒక్కడ ఒకరికి దత్త తపొందారు .కాని అక్కడి పరిస్థితులు అనుకూలించక తిరిగి స్వస్థలం చేరుకొన్నారు .అయితే తెలంగాణా ప్రాంతం లో ఉండటం వల్ల ఉర్దూ అరబ్బీ ,పార్శీ భాషలలో కొద్ది ప్రవేశం లభించింది .గోరంట్లలో సంస్కృతా భ్యాసం చేశారు ‘.సంస్కృత కావ్యాలను నేర్చారు .
అమలా పురం చేరి అక్కడి ఇందుపల్లి గ్రామం లో ఏలేశ్వరపు తమ్మన్న శాస్త్రి గారి దగ్గర కావ్యాలు నాటకాలు పూర్తీ చేశారు .పేరూరు కు చేరుకొని మంధా చెన్నయ్య శాస్త్రి గారి వద్ద తర్కాన్ని ,పేరి నరసింహ శాస్త్రి గారి దగ్గర వ్యాకరణ శాస్త్రాన్ని క్షున్నంగా అభ్య శిం చారు ..వీరి జ్ఞాన తృష్ణ తీర లేదు .శ్రీ పాద రామ శాస్త్రి గారి వద్దా ,విజయనగరంలోని భీమా చార్యుల వారి వద్దా అంతే వాసులుగా ఉండి తర్క శాస్త్రాన్ని మధించారు .ఈ శాస్త్రా లన్నిటిలో నిశిత పాండిత్యాన్ని సంపాదించి తిరుగు లేదని పించుకొన్నారు .
చయనులు గారు ఇరవై రెండో ఏటనే కొండ వీడు లో ఒక సప్తాహం జరుగుతుంటే వెళ్లారు .అక్కడ ఒక ప్రసిద్ధ పండితుని తో వాదించాల్సి వచ్చి తన వాదనా సామర్ధ్యాన్ని నిరూపించి ,ఆ పండితుని ఓడించారు .దీంతో వీరి కీర్తి సర్వత్రా వ్యాపించింది .వెంటనే వారికి అమరా వతి లోని గుడి మెల్ల వెంకట సుబ్బయ్య గారు తమ కుమార్తెకృష్ణ వేణమ్మ నిచ్చి వివాహం జరిపించారు . రామ కృష్ణ గారు మైసూర్ సందర్శించి అక్కడి పజమాని సుందర రామ శాస్త్రి గారి వద్ద బ్రహ్మ సూత్ర శంకర భాష్యాన్ని ,వేదాంత పరి భాష ను అద్వైత సిద్ధి మొదలైన గ్రంధాలను చదివి ఆధ్యాత్మిక విద్య లో అనితర సాధ్య పాండితీ గరిమను సాధించారు .దీని తో ఆగక, బెంగుళూరు సీతా రామ శాస్త్రి గారి వద్ద తర్క శాస్త్రం లోని అరుదైన గ్రంధ రాజాలను సైతం కరతలా మలకం చేసుకొన్నారు .అక్కడి నుండి తమిళ నాడు చేరుకొన్నారు .అక్కడ వేద ,శ్రౌతాల లోను ,షట్ శాస్త్రాలలోను అసమాన ప్రజ్ఞను సాదించుకొన్నారు .అక్కడ వీరి గురువులు ఈ శాస్త్రాలలో దిట్ట అని పించుకొన్న త్యాగ రాజ శాస్త్రి గారు .వాచస్పత్యాన్ని ,కల్పతరువును వ్యుత్పత్తి వాదం మొదలైన ఉద్గ్రందాలను అవలోడనం చేశారు .త్యాగయ్య శాస్త్రి గారు అప్పయ్య దీక్షితుల వారికి తొమ్మిదవ తరం వారు .అంతటి గురు మూర్తి వీరికి లభించటం చయనుల గారి పూర్వ జన్మ సుకృతం .
ఈ విధం గా విద్యా జైత్ర యాత్రను దిగ్విజయం గా పూర్తీ చేసుకొని గుంటూరు దగ్గరున్న అమరావతి క్షేత్రాన్ని చేరి ,స్వగృహాన్ని నిర్మించుకొని స్తిర నివాసం ఉన్నారు .విజయ వాడ లో కూడా గృహ నిర్మాణం గావిన్చుకొన్నారు .36 వ ఏట మళ్ళీ దక్షిణ దేశం వెళ్లి ,త్యాగరాజ స్వామి నిలయ మైన తిరువయ్యూరు లో,స్థల పురాణం బాల కృష్ణ శాస్త్రి గారి వద్ద శిష్యులై ఉపనిషత్ ,షట్ దర్శనాలు ,మరికొన్ని వేదాంత గ్రంధాలను ప ఠనం చేశారు .
ఈ విధం గా అపార పాండిత్యాన్ని సంపాదించిన రామ కృష్ణ గారు విశేషం గా దేశ సంచారం చేసి ధర్మ ,వేదాంత ప్రబోదాలను చేస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక భావన కల్గించారు .చాలా కాలం పుష్ప గిరి పీఠము ,విరూపాక్ష పీఠములకు ఆస్థాన పండితులు గా ఉండి తమ ప్రజ్ఞ ను చాటుకొన్నారు .వీరికి వైదిక కర్మానుష్టానం పై ఆసక్తి ఎక్కువ .1904 లో అమరా వతి లో జ్యోతిష్తోమాన్ని ,1922 లో విజయ వాడ లో చయనాన్ని చేశారు .అప్పటి నుండి వీరు రామ కృష్ణ యాజులని, రామ కృష్ణ చయనులు గారు అని ఆహితాగ్ని నామాల తో పిలువబడ్డారు .
శ్రుతి, స్మృతి లలో చెప్పబడిన సనాతన ధర్మాన్ని ప్రజలలో విశేష ప్రచారం చేసిన వీరి లాగా ఉన్న పండితులు అరుదు గా ఉంటారు .వేదాంత శాస్త్రాన్ని సర్వ జనులకు సమ్మత మైన రీతి లో భాష్య ప్రవచనం రూపం లో నే కాక ,ఉపన్యాస రూపం లో కూడా చెప్పటం లో వీరికి వీరే సాటి అని పించుకొన్నారు .పండితులలో మహా వక్త గా ప్రక్ష్యాతి చెందారు చయనులు గారు .కాశీ పండితులు వీరి వేదాంత ప్రవచనాలను విని ‘’పండిత ప్రవర ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .పంజాబు రాష్ట్రం లోను పర్య టించి తన వాగమ్రుతాన్ని పంచి ‘’వ్యాఖ్యాన వాచస్పతి ‘’బిరుదు నందుకున్నారు .అఖిల భారతం లోను చయనుల గారి కీర్తి చంద్రికలు వ్యాపించి నాయి .’’అఖిల భారత వర్ణాశ్రమ ధర్మసంఘం ‘’లో చయనులు గారు కార్య నిర్వాహక సభ్యులు గా ఉన్నారు .’’బాల బోధిని ,’’,భ్రమ భంజని ‘’అనే వేదాంత గ్రంధాలను రాశారు .’’ప్రాయశ్చిత్త పశు విషయక విమర్శ గ్రంధాలను’’ ,’’మహా భారత కదా తత్వ నిర్ణయాన్ని’’రచించిన తాత్విక రచయితలు .76 ఏళ్ళ జేవితాన్ని క్రతువుల్లో యాగాలలో ,ధర్మ ప్రబోధం లో ,ఆధ్యాత్మిక గ్రంధ రచనలో నిండుగా గడిపినజ్యోతిష్టోమ యోగి రామ కృష్ణ చయనులు గారు 1941 లో పరమ పదించారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-11-12-ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

