సంగీత నందనం విరబూయాలి – వి.ఎ.కె.రంగారావు

సంగీత నందనం విరబూయాలి
– వి.ఎ.కె.రంగారావు

ఈ డిసెంబరు 27, 28, 29 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరుగనున్నవన్న విషయం కొన్ని వారాల క్రిందట తెలిసింది ‘మీరు సభలలో సాహిత్య నాటకాల గురించి మాట్లాడాలి’ అన్న ఆదేశంతో శ్రీమతి అలేఖ్య ఫోన్ చేయగా. నవంబరు 27వ తేదీన మద్రాసు ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ భవనంలో దీని గురించి చర్చలు ఉంటాయన్న సంగతి హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీ మునిరత్నం ఆ ఉదయం ఫోన్‌లో చెప్పారు. మూడు గంటలకు రమ్మన్నారు. నాలుగున్నరకు గాని ప్రారంభం కాలేదు. తెలుగువారి సమావేశం కదా, పెద్ద విచిత్రమేమీ లేదు.

అప్పుడు జరిగిన సభలో పెద్దలుండగా (తమిళనాడు గవర్నరు శ్రీ రోశయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ శ్రీ మండలి బుద్ధప్రసాద్ ప్రభృతులు) యిక్కడి సంస్థల పెద్దలు తమిళనాడులో తెలుగు వారికి, భాషకు జరిగిపోతున్న అన్యాయాలు పేర్కొన్నారు. సంఖ్యలుదహరించారు. ఆ పెద్దలు వారిని ఓదార్చుతూ హామీలిచ్చారు. అంతేగానీ ఆ సమావేశంలో ప్రపంచ తెలుగు మహాసభల గురించి అప్పుడు మాట్లాడిన వారొక్కరు లేరు. ఇక ఆ ప్రసక్తి వచ్చినప్పుడు పైన పేర్కొన్న పెద్దలు లేరు.

డిసెంబరు 27న ప్రారంభమయ్యే యీ పెద్ద ప్రయత్నం గురించి అభిప్రాయాల సేకరణ నెల ముందా జరిపేది! ఒక నెలలో ఏ ఘనకార్యం చేపట్టి విజయవంతంగా ముగించగలరు! అయితే యీ ఒక్క నెలలో చేయగలిగేవి లేకపోలేదు.

తిరుపతిలో జరుగుతున్నవి కనుక, పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య అన్నది నిర్వివాదాంశం కనుక, పాల్గొన వచ్చిన వారందరూ తెలుగెరిగిన వారే అయివుంటారు కనుక డబ్బు కట్టిన ప్రతినిధులందరికీ యీ మూడు పుస్తకాలు ఉచితంగా యివ్వాలి.

1. అన్నమయ్య సంకీర్తనామృతం. 150 ఆధ్యాత్మిక సంకీర్తనలు, సముద్రాల లక్ష్మణయ్య వ్యాఖ్యతో, వెల రూ.75లు, 2. తాళ్లపాక చిన్నన్న విరచిత అన్నమాచార్య చరిత్ర. వ్యాఖ్యానం గల్లా చలపతి రూ.95, 3. అన్నమయ్య సంకీర్తన త్రిశతి సంకలనం అందరెరిగిన మూడు వందల సంకీర్తనలు. జి.బాలకృష్ణ ప్రసాద్, రూ.35.

ఈ మూడు తి.తి.దే ప్రచురణలే. ప్రభుత్వం కోరితే ఉచితంగా కాకపోయినా అతి తక్కువ ధరకు యివ్వకపోరు. 205 రూపాయలు చేసే యీ మూడు పుస్తకాలు నూరుకో, నూట పాతికకో తక్కిన వారికీ యివ్వజూపితే మరీ మంచిది. అన్నమయ్య గురించి యీ రచనలే ఎందుకివ్వాలి? జరిగే చోటు తిరుపతి కనుక; తిరుపతికి మరో రూపమైన వేంకటేశ్వరునికీ అన్నమయ్యకూ ఉన్న సంబంధం విడదీయరానిది కనుక; తెలుగంటే అభిమానమున్న వారి చేతిలో యీ పుస్తకాలు పడితే అటు వారి జ్ఞాన సంపదా, యిటు తెలుగు భాషా వర్థిల్లుతాయి కనుక; వాటి డబ్బు తి.తి.దేకే చెందుతుంది కనుక. తి.తి.దే వారు కొన్ని నెలల క్రిందట ప్రచురించ నిశ్చయించిన పుస్తకం, రవ్వా శ్రీహరి భగీరథయత్నం, సాహిత్యాసక్తులకు వియద్గంగ, తాళ్లపాక సంకీర్తనలలోని పదాలకు అర్థాలు నిర్ధారణగా తెలియక కొట్టుమిట్టాడుతున్న అజ్ఞానాంధులకు కరదీపం, ‘తాళ్లపాక పద నిఘంటువు’ అంతా సిద్ధమే; అచ్చు వేయటమే తరవాయి అన్న దశలో వున్నది.

ప్రభుత్వమొకమారు అన్నమాచార్య ప్రాజెక్టు అధికారి శ్రీ మేడసాని మోహన్, తితిదే ప్రచురణల ప్రధాన సంపాదకులు శ్రీ రవ్వా శ్రీహరిని కుదిపితే, కదిపితే, మూడు వారాల్లో తయారవ్వకపోదు. ఇది ఆ సమయానికి సిద్ధమైతే జిజ్ఞాసువులకు ఎన్నటికీ తరగని తిరుమల లడ్డు అవుతుంది, సందేహం లేదు.

మొదటి రోజు మూడవ రోజు నాలుగేసి గంటలు, మధ్యరోజు ఎనిమిది గంటలూ సమావేశాలు అయిదు వేర్వేరు ప్రాంగణాల్లో మొత్తం ఎనభై గంటలు– వుంటాయని మునిరత్నం తెలిపారు. ఏవి ఎక్కడ, ఎప్పుడు అని తెలిపే వివరణ పత్రం వుంటేనే అది శంఖంలో పోసిన తీర్థమవుతుంది. లేకపోతే పరదా వెనుక పన్నీరు.

మునిరత్నంగారు చేసిన ప్రకటనలో సాయం సంధ్య వినోదాల కార్యక్రమంలో సినిమాలు, పద్య నాటకాలు, పాటకచ్చేరీలు (నా అభిప్రాయంలో బహుశా హరికథలూ, బుఱ్ఱకథలు) ఉంటాయన్నారు.

సినిమాల సంగతి తీసుకొంటే “మల్లీశ్వరి”, “యోగి వేమన”, “అన్నమయ్య”, “శంకరాభరణం”, “మూగమనసులు” లాంటివి వేయడం అనవసరం. అవన్నీ విసిడి/డివిడి రూపాలలో అందరికీ అందుబాటులో వున్నవే. అయితే ఏ సినిమాలు చూపాలి? గత అరవైయేళ్లలో ఎవరూ చూడని చిత్రాలు పూణే నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్‌లో వున్నవి. ఆంధ్రప్రభుత్వం అడిగితే వారు కాదనరు. అవీ చూపించాలి. అవి పైన పేర్కొన్న చిత్రాలంతటివి కాకపోవచ్చు. కానీ అవి మూడు తరాల వారు చూడని, వారంతట వారు చూడలేని చిత్రాలు. దూరదర్శన్ కాలువల్లో వేయని చిత్రాలు. సాధారణ ప్రేక్షకులకు, సినిమా చరిత్రకారులకూ, విమర్శకులకు కనువిప్పు, చెవివిందు కల్గించే చిత్రాలు. నేనెరిగిన వాటి జాబితా యిదీ.

1. లవకుశ – 1934 – సి.పుల్లయ్య 2. సక్కుబాయి – 1935-బి.వి.రామానందం 3. హరిశ్చంద్ర – 1935 – రాజోపాధ్యాయ, పి.పుల్లయ్య 4. సంపూర్ణ రామాయణం – 1936-ఇ.నాగభూషణం, ఎస్.బి.నారాయణ 5. మాలపిల్ల – 1938 – గూడవల్లి 6. రైతుబిడ్డ – 1939 – గూడవల్లి 7. భూకైలాస్ – 1940-సుందర్రావ్ నడకర్ణి 8. సుమతి – 1942 – కడారు నాగభూషణం 9. గొల్లభామ – 1947 – సి.పుల్లయ్య.

వీటన్నిటికీ చక్కని ప్రింట్లు ఆర్కైవ్స్‌లో వున్నవి. ఇవన్నీ చూస్తే ఎందరో నటీనటుల, సాంకేతిక నిపుణుల తొలినాటి ప్రజ్ఞాపాటవాలు పటిష్టంగా కట్టెదుర కాణాచి అవుతాయి. అమ్మమ్మ తాతయ్య పొగమంచు జ్ఞాపకాలు మనకు ఘనీభవిస్తాయి.

ఇక నాట్యాలూ, పద్య నాటకాలూ, హరికథలూ కొంత వరకు బుఱ్ఱకథలూ దూరదర్శన్ కాలువల్లో నిత్యం చూస్తున్నవే. వాటి బదులు ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల నుంచి జానపద నృత్య బృందాలను తెప్పించి ఆడిస్తే, ఏకత్వంలోని వైవిధ్యం, వైవిధ్యంలోని ఏకసూత్రం – ఆటలో, పాటలో వస్త్రధారణలో, విన్యాసంలో అందరికీ చెప్పకనే తెలుస్తాయి. అప్పటికప్పుడు యీ జానపద బృందాల వివరాలెక్కడి నుంచి వస్తాయీ అంటే విశ్వవిద్యాలయాల్లో శ్రీయుతులు చిగిచెర్ల కృష్ణారెడ్డి, గడ్డం వెంకన్న వున్నారు. తి.తి.దే అప్పుడప్పుడు జిల్లా కేంద్రాలలో యిలాంటి బృందాలకు పోటీ జరిపి, ఉత్తమమైన దాన్ని శ్రీనివాసుని బ్రహ్మోత్సవానికీ, రెండవదాన్ని పద్మావతి బ్రహ్మోత్సవానికీ పిలిపిస్తారు. వారి వద్ద విలాసాలూ, ఫోన్ నెంబర్లూ వుండకపోవు.

ఇక అలనాటి సంగీత సంపద, సినిమాలలోనిదీ, ప్రైవేటు పాటలదీ, శాస్త్రీయ సంగీతానిదీ వెలికి రావటం. 1950 ముందు తెలుగువారి శాస్త్రీయ సంగీతం గత అర్ధశతాబ్దంలో విడుదల చేయలేదు గ్రామకో కంపెనీ. అయితే కొన్ని గొప్ప చిత్రాల పాటల, మాటల కూర్పులు వున్నవి. “షావుకారు”, “మల్లీశ్వరి”, “విప్రనారాయణ”, ‘శ్రీకృష్ణ పాండవీయం” యిత్యాది. ఇవి కాక కేవలం పాటలుగా సూర్యకుమారి, భానుమతి, కన్నాంబ-నాగయ్య, ఆర్.బాలసరస్వతీ, తెలుగు ఫిలిం మిలెనియమ్ మూడు గంటల పాత (1937-1951) సినిమా పాటలు ముందే విడుదలైనవి వున్నవి.

వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధికారికంగా కోరితే — అంతా, ఆర్ట్ వర్క్‌తో సహా — సిద్ధంగా ఉన్నవి కాబట్టి మూడు వారాల్లో తయారు చేయడం గ్రామకోకు సాధ్యమే. నా సొంత ఖజానాలో వున్న 600 గంటల తెలుగు వారి సంగీతంలో, విడుదలకు సిద్ధంగా ఒక ఆరు గంటలున్నవి. అడగడమే ఆలస్యం. ఇవ్వడానికి సిద్ధంగా– పాటకొక రూపాయి రాయల్టీ పుచ్చుకొని– నేనున్నాను. అంతటి నిధులు లేవు అంటారా, ఉచితంగా యివ్వగలను, జోగీజోగీ రాసుకొంటే బూడిద కాదు చందనం రాలాలి, సంగీత నందనం విరబూయాలి.

ఆ వసంతం రావాలంటే ప్రభుత్వ పదవులలో వున్న వారి మనసు కరగాలి. వింటున్నారా బుద్ధప్రసాద్‌గారూ, కవితా ప్రసాద్‌గారూ, ఆర్.వి.రమణమూర్తిగారూ? ఇదొక సంగీత నాట్య విధేయుని ప్రార్థన.

– వి.ఎ.కె.రంగారావు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

9 Responses to సంగీత నందనం విరబూయాలి – వి.ఎ.కె.రంగారావు

  1. “మూడు గంటలకు రమ్మన్నారు. నాలుగున్నరకు గాని ప్రారంభం కాలేదు. తెలుగువారి సమావేశం కదా, పెద్ద విచిత్రమేమీ లేదు….” ఈ అభిప్రాయం చాలండి..రేపు జరగబోయే ప్రపంచ తెలుగు మహాసభలు ఎలా ఉంటాయో చెప్పడానికి !
    ఇంక శ్రీ వి.ఏ. కే. రంగారావుగారు ఇచ్చిన సలహాలు– ఇంతకంటే అద్భుతమైన సలహాలు ఇవ్వగలవారు ఇంకొకరు లేరు. ఎంతవరకూ కార్యనిర్వాహకులు ఆచరణలో పెట్టగలరూ అనేదే చూడాలి.

    Like

    • 1940ల లో తెలుగునాట మొదటి సారి విజయవాడలో ఆకాశవాణి కేంద్రం వచ్చింది. అప్పటి నుండి అనేకానేక అద్భుత కార్యక్రమాలు ఆ కేంద్రం నుండి వచ్చినాయి. ఎందరో కళాకారులు తమ శక్తియుక్తులతో శ్రోతలను అలరించారు, ఆహ్లాదపరిచారు, విజ్ఞానాన్ని పంచారు. ఓలేటి వెంకటేశ్వర్లు, ప్రయాగ నరసింహ శాస్త్రి, బందా కనలింగేశ్వర రావు, సి రామమోహన్ రావు, నండూరి సుబ్బారావు, సత్యం శంకరమంచి, ఉషశ్రీ, ఎ బి ఆనంద్, నాగరత్నమ్మ, సీతారత్నం, వి బి కనదుర్గ ఇత్యాదిగా గల అనేక రేడియో కళాకారులను తెలుగు సభల సందర్భంగా, తలుచుకునే మంచి పనిచేస్తే ఎంతయినా బాగుంటుందని, నా అభిప్రాయం. అలనాటి కార్యక్రమాల టేపులు ఆకాశవాణివారివద్దనే లేవుట! ఆ సభలకు వచ్చిన వారి వద్ద ఉంటే, ఆ టేపుల సేకరణ కూడ చేపడితే, రేడియో సాహిత్య భాండారానికి అంకురార్పణ చేసినట్టు అవుతుంది.

      ఎలాగూ తెలుగు వాడికి ఎదుటి వాడి అభిప్రాయం గడ్డిపోచకంటే హీనం కనుక, జరగబొయేది ఎమీలేదని తెలిసి కూడా, ఉండబట్టలేక వెల్లడించిన అభిప్రాయం.

      Like

      • శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU's avatar శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU says:

        ఆకాశవాణి వారు కొద్దో గొప్పో వారి కార్యక్రమాల్లోని లలిత గీతాలు, భక్తి రంజని, నాటికలు నాటకాలు సిడిలు/టేపులుగా గా వెలువరించారు. ఈ తెలుగు సభల సందర్భంగా, కనీసం ఆకాశవాణి వారి స్టాలు ఆ ప్రాంగణంలో పెట్టించి, ఆ సి డి లు/టేపులు, వచ్చిన వారికి కొనుక్కునే వీలు క.లి.పి.స్తే………… జరుతుందంటారా ఈ పని. అ..ను..మా..న..మే.

        అనుమానమేమిటి, జరగదు కాక జరగదు.

        Like

      • gdurgaprasad's avatar gdurgaprasad says:

        రంగా రావు గారివి గొంతెమ్మ కోరిక లేమీ కావు .ప్రభుత్వానికి పూనిక ఉంటె ముందుకొచ్చి వారనుకొన్న కార్యం నిర్వ హించగల వదాన్య్లు ఉన్నారు .అంత అవసర పడితే రంగా రావు గారి కంటే ఔదార్యం చూపే వారుండరు .దీన్ని వాడుకొనే సమర్ధత ఉండాలి .ఇదేదో ప్రభుత్వ తంతు కోటా సిస్టం గా ఉండ రాదు ఉండ కూడదు . ఎంతో చరిత్ర ను త్రవ్వి తీసిన విజయ వాడ వాసి స్వర్గీయ కోట వెంకట చలం గారి ని వేదిక పై సంస్మరించాలి .వారికి రాష్ట్ర నది బొద్దు అయిన బేజా వాడ లో తగిన స్మారక చిహ్నం నిర్మిస్తామని ప్రభుత్వం తో హామీ నిప్పించి ,వెంటనే అమలు జరిపే ప్రయత్నం చేయాలి .లేక పోతేఆ ”చరిత్ర భాస్కరుని ”పట్ల మన ఉదాసీనతకు చరిత్ర క్షమించదు .” ”మా తెలుగు తల్లికిమల్లె పూ దండ ” పాత రాసిన శంకరం బాడి కార్య క్షేత్రం తిరు పతి కనుక .ఆ పాటను లక్ష లాది కాపీలుఆయన ఫోటో తో సహా ముద్రించి ,దేశ విదేశా లో ఉన్న తెలుగు వారందరికీ ఉచితం గా అండ జేయాలి .ప్రతిభ గల కళా కారులను మాత్రమె ఎంపిక చేసి సత్క రించాలి .మొట్ట లావు వారికే ప్రాధాన్యం ఇవ్వ రాదు .తెలుగు భాషా సంస్కృతి పై మంచి అవగాహన ఉన్న బుద్ధ ప్రసాద్ గారికే అగ్ర తామ్బూలమిచ్చి సభలను నిర్వ హింప జేస్తే తెలుగు జాతి సంతోషిస్తుంది . తెలుగు అకాడెమి అధ్యక్షునికార్య వర్గం తో సహా ఈలోపే ప్రకటించాలి .అప్పుడే ప్రభుత్వ చిట్టా శుద్ధి పై నమ్మకం కలుగు తుంది .ఇవన్నీ బధిర శంఖా రావాలే నని తెలిసినా ఊదా కుండా ఉండలేని వాళ్ళం –దుర్గా ప్రసాద్

        Like

  2. Sudhakar's avatar Sudhakar says:

    భాషా సంస్కృతులు , ప్రతి జాతి జీవ ధారలు. అప్పుడప్పుడూ అట్టహాసాలతో ఆర్భాటాలతో మహాసభలకే పరిమితం కాకుండా ,ఆ జీవధార లు నిరంతరం పారే ప్రయత్నాలు, ప్రణాళికలు , పాలకులూ చేయాలి , వేయాలి. తెలుగు వారందరూ కూడా ఆచరించాలి ! ముందు తరాలకు అందించాలి ! కెనడీ గారి ఉవాచ లాగా ” తెలుగు మనకు ఏమి చేసింది అనుకోకుండా, మనం మన మాత్రు భాషకు ఏమి చేయగలం ? ” అని ప్రశ్నించు కోవాలి , ప్రతి తెలుగు వాడూ !
    ప్రస్తుతానికి ఈ తెలుగు మహా సభలు విజయ వంత మవుతాయని ఆశిద్దాం !

    Like

  3. Sudhakar's avatar Sudhakar says:

    రంగా రావు గారూ , మీ సూచనలు చాలా సమంజసం గా ఉన్నాయండీ !
    మీ గురించిన వివరాలు అంతర్జాలం లో చూశాను. అనేక దశాబ్దాలుగా మీరు తెలుగు సంస్కృతి పరిరక్షణకు , మీ వంతుగా మీరు సేకరిస్తున్న గ్రామ ఫోను రికార్డులు అత్యంత ఉపయోగ కరమైనవీ , అమూల్యమైనవీ కూడానూ !
    మీ దగ్గర ఉన్న రికార్డులు అంతర్జాలం లో నిక్షిప్తం చేయడం గానీ , లేదా మీరే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారా ?

    Like

  4. వి.ఏ.కె.రంగారావు గారి సూచనలు, వాటి మీద అనేకులు తెలుగు కళాప్రియులు రాసిన వ్యాఖ్యలు చాలా సమంజసంగా ఉన్నాయి.రంగారావుగారి కృషి గురించి మనందరికి తెలిసిందే.మన ప్రభుత్వం,యూనివర్సిటీలు ,ఇతర సంస్థలూ ఎంతవరకూ ఆ సూచనలను అమలు చేస్తారో అనుమానమే.కాని మండలివారు ఇంతకుముందు వారి కన్నా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్లున్నది.కాబట్టి కొంత ఆశకలుగుతున్నది.-రమణారావు.ముద్దు.Ara

    Like

  5. వి.ఏ.కె.రంగారావు గారి సూచనలు, వాటి మీద అనేకులు తెలుగు కళాప్రియులు రాసిన వ్యాఖ్యలు చాలా సమంజసంగా ఉన్నాయి.రంగారావుగారి కృషి గురించి మనందరికి తెలిసిందే.మన ప్రభుత్వం,యూనివర్సిటీలు ,ఇతర సంస్థలూ ఎంతవరకూ ఆ సూచనలను అమలు చేస్తారో అనుమానమే.కాని మండలివారు ఇంతకుముందు వారి కన్నా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్లున్నది.కాబట్టి కొంత ఆశకలుగుతున్నది.-రమణారావు.ముద్దు.

    Like

  6. శ్రీకాకుళం జానపదాలు
    1.తప్పెటగుళ్ళు,యస్.యమ్.పురం,ముద్దాడ,అల్లినగరం,బావాజీపేట,సారువకోటమండలాలు
    2.కోలాటము.ఫరీదుపేట,ఎమ్.ఎస్.వల్లి,సానివాడ ప్రాంతాలలో
    3.జముకు.అంపోలు,బెజ్జిపురం,కొత్తూరులలో
    4.చెక్కభజన.కాజీపేట,పొన్నాడ,పొందూరు కంచిలి మండలాల్లో
    5.పండరి భజన.సానివాడ,ఫరీదుపేట,షేర్మహ్మద్పురం, పలాస మండలాల్లో
    6.ఎరుకులపాట.వప్పంగి,భామిని,కొత్తూరు మండలాల్లో
    7.తూర్పు భాగవతం:వప్పంగి,సానివాడ,రాజాం,శ్రీకాకుళం మండలాల్లో
    8.చెంచుభగవతం.: నరసన్నపేట,పాతపట్నం మండలాల్లో
    9.శివభాగవతం: వీరఘట్టం.భామిని మండలాల్లో
    10.రుంజ: అంపోలుగ్రామం అడవరరంలో
    11.సవర నృత్యం: కొత్తూరు,గుమ్మలక్ష్మీపురం గిరిజన ప్రాంతాల్లో
    12.మైమై గుర్రం: వీరఘట్టం,పాతపట్నం మండలాల్లో
    13.డప్పు: ఇప్పిలి,పెద్దపాడు,మకరజ్వాల,దిమిడిజ్వాల,కొత్తూరు,ముద్దాడ,రణస్థలంలలో
    14.పందిరిపాట: వప్పంగి,సానివాడ,పూడివలస,రణత్థలం మండలాల్లో
    15.కోయనృత్యం: పెద్దపాడు,దబ్బపాడు,కిన్నెరవాడ,పూడివలస,ముద్దాడ, భామిని మండలాల్లో
    సోర్సు: పన్నాల నర్శింహమూర్తి,కార్యదర్శి శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య,ఎన్.టి.ఆర్.హైస్కూలు,శ్రీకాకుళం
    మిమిక్రీ శ్రీనివాస్ విజయప్రస్థానం పుస్తకం నుడి ఎత్తి వ్రాయబడినవి.

    Like

Leave a reply to M.V.Ramanarao Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.