‘ఆయనే.. శంకరంబాడి!’
తెలుగుతల్లికి ‘మల్లెపూదండ’ వేసి సత్కరించిన మహనీయుడు శంకరంబాడి సుందరాచార్యులు. ప్రతి తెలుగు వాచకం మొదటిపేజీలో కనిపించే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయం పాడని తెలుగు విద్యార్థి ఉండడు. తెలుగుతల్లి గొప్పదనాన్ని ఒక్క గేయంతో ప్రపంచమంతటా చాటిన శంకరంబాడి గురించి సి. పూర్ణచంద్ అనే లెక్చరర్ తన జ్ఞాపకాన్ని నవ్యతో పంచుకున్నారు.
మేం తిరుపతిలో డిగ్రీ చదువుకొనే రోజులవి. సినిమాలు బాగా చూసేవాళ్ళం. వారంలో రెండు, మూడు చూసినా మళ్లీ ఆదివారం కూడా కచ్చితంగా సినిమా హాల్లో ఉండేవాళ్లం. నేను తిరుపతి కర్రాలవీధిలో ఉండేవాడిని. మా వెనకింట్లో ఉన్న మిత్రుడూ, మా వెనకవీధిలో (కస్తూరిబాయి సందు) ఉన్న మరో మిత్రుడూ కలిసి ఆదివారం సాయంత్రం మొదటిఆట సినిమాకు బయలుదేరాం. కర్నాలవీధి చివర్లో రైల్వేస్టేషన్‌కు అతి దగ్గరలో ఈస్ట్‌పోలీస్‌స్టేషన్ ఉండేది. మేము ముగ్గురం నడుచుకుంటూ పోలీస్‌స్టేషన్ దగ్గరికి చేరుకున్నాం. ఇంతలో ఒకతను పొట్టిగా, పెద్ద పొట్ట, బట్టతల, చిరిగి..బాగా మాసిన తెల్ల జుబ్బా, పటాపటి డ్రాయరు ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చాడు.
మమ్మల్ని అడ్డుకుని ‘ట్వంటీ ఫైవ్ పైస్ ప్లీజ్’ అని రెండు చేతులు చాపి అడిగాడు. మేం స్పందించకపోయే సరికి మళ్లీ అడిగాడు. అతని దగ్గర గుప్పుమంటూ సారా వాసన వస్తోంది. గురుడు అప్పటికే బాగా తాగి ఉన్నాడు. ‘దేనికి నీకు ట్వంటీ ఫైవ్ పైస్’ అని అడిగాం మేం. ‘టీ తాగాలి’ అన్నాడు. అంతలోనే స్టేషన్‌ముందున్న కానిస్టేబుల్ వచ్చి అతనికి డబ్బులివ్వకండి అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఎందుకని అడిగితే…’ఆ డబ్బుతో ఎదురుగా ఉన్న సారాకొట్టుకెళ్ళి సారా తాగేస్తాడు. ఇప్పటికే ఎక్కువై ఒంటిమీద గుడ్డలు నిలవడం లేదు’ అని దూరంగా పడిఉన్న ఆ పెద్దాయన పంచెను చూపించాడు. అప్పుడు మా మిత్రుల్లో ఒకడు ‘మన తెలుగువాచకం మొదటిపేజీలో మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గేయం రాసిందాయనే’ అని చెప్పాడు. మిగతా ఇద్దరం నోరెళ్లబెట్టాం.
ఆశ్చర్యం, ఆనందం, ఆవేదన, బాధ…అవన్నీ ఒకేసారి తన్నుకొచ్చాయి. శంకరంబాడి కొంతకాలం మా మిత్రుడుండే వీధి చివరలో నివాసం ఉండడం వలన అతనికి ఆయన గురించి తెలుసునట. ఆ షాక్ నుంచి మేం తేరుకోక ముందే శంకరంబాడి ‘అదలా ఉండనీగానీ..ట్వంటీఫైవ్ పైస్ ఇవ్వండి’ అని మరోసారి అన్నాడు. వెంటనే చొక్కా, ప్యాంటు జేబులు వెతికాం. కస్తూరిబాయి సందు మిత్రుని దగ్గర ఒక్కపైసా కూడా లేదు. నా దగ్గర ఇద్దరికి సినిమా టిక్కెట్లకు సరిపడా డబ్బులు మాత్రమే ఉన్నాయి. మరో మిత్రుని దగ్గర సినిమాఖర్చులకు పోను ఐదురూపాయల నోటు ఉంది. మా మిత్రుడు ఆ ఐదు రూపాయలనోటుని ఆ పెద్దాయన చేతిలో పెట్టగానే ఆయన ముఖం వెలిగిపోయింది. ఆయన ముఖంలో కనిపించిన ఆనందాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. నేను హిస్టరీ లెక్చరర్ అయ్యాక ఆ సంఘటన గుర్తొచ్చినప్పుల్లా మరింత బాధ కలిగేది. అది మర్చిపోలేకనే ఆ జ్ఞాపకాన్ని అందరితో ఇలా పంచుకొంటున్నాను.
తెలుగుతల్లి గేయాన్ని మొదటగా కొప్పరపు సుబ్బారావు తీసిన ‘రైతుబిడ్డ'(పాతది) సినిమాలో టంగుటూరి సూర్యకుమారి చేత పాడించారు. అదే పాటను కొంచెం రీమిక్స్‌చేసి ‘లీడర్’ సినిమాలో శేఖర్ కమ్ముల వాడారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘బుల్లెట్’ సినిమా కోసం ఎస్.పి బాలసుబ్రమణ్యం కూడా పాడారు. ఈ గేయాన్ని పల్లె పల్లెలో ప్రాచుర్యం తెచ్చింది మాత్రం తెలుగుకు వెలుగుతెచ్చిన నందమూరి తారకరామారావుగారే. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టాక సుశీలతో పాడించి.. గేయాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా మార్మోగింపజేశాడు.
శంకరంబాడిని తాగుబోతుగా చూపించడం కోసం నేనిది రాయలేదు. ఆ వయసులో ఆ మహనీయున్ని చూసిన నా హృదయానందాన్ని మీతో పంచుకోవడం కోసమే నేనీ వ్యాసాన్ని రాశాను. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అందరితోపాటు శంకరంబాడికి కూడా ఓ జ్ఞాపికనిచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత తిరుపతి తెలుగు భాషోద్యమ నాయకుల కృషి ఫలితంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి శంకరంబాడి సర్కిల్ అని పేరు పెట్టడం చాలా ఆనందాన్నిచ్చింది. అయితే ఇప్పటికీ శంకరంబాడి ఎవరని అడిగేవాళ్లు ఉండడం బాధనిపిస్తుంది.
– డాక్టర్. సి. పూర్ణచంద్
బి. టి కాలేజి, మదన్‌పల్లి


మీ ఈ వ్యాసం చదివాక ఎలా స్పందించాలో తెలియటం లేదు
కాని మాతో మీ గత అనుభవాన్ని పంచుకోన్నందులకు కృతజ్ఞతలు
ఆ సరస్వతి మాత అనుగ్రహం పుష్కలంగా ఉండబట్టే
ఆ మహనీయుడు ఆ గేయ రచన శాశ్వతంగా నిలిచే రీతిన రచన కావించాడు.
LikeLike