ఫ్రాన్స్‌లో ‘సురభి’ జిలుగులు
తెలుగు నాటక ఖ్యాతిని ఎల్లలు దాటించడంలో సురభి నాటక సమాజం ముందంజలో ఉంది. ఆ కుటుంబాల పెద్దగా సురభి నాటకాలకు కొత్త దశ, దిశ నిర్దేశం చేసిన పద్మశ్రీ రేకందార్ నాగేశ్వరరావు అలియాస్ బాబ్జీ తెలుగు నాటక వైభవాన్ని ఫ్రాన్సు ప్రేక్షకులకు త్వరలో రుచి చూపించబోతున్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కారాన్ని, ముంబాయిలో ఆదిత్య బిర్లా నెలకొల్పిన ‘కళా శిఖర’ అవార్డును సొంతం చేసుకున్న బాబ్జీ చెబుతున్న సురభి నాటక సం’గతులు’ ఆయన మాటల్లోనే…
“తెలుగు నాటకరంగంలో 123 ఏళ్ల క్రితం ఆవిర్భవించి ఈనాటికీ వన్నె చెరగని రీతిలో ప్రేక్షకులను రంజింపచేస్తున్న సురభి నాటక కుటుంబం మాది. చిత్రవిచిత్రమైన తెరలు, సెట్టింగ్‌లు, వైర్ వర్కులు, ట్రిక్కులతో ప్రేక్షకులను మైమరిపించే విధంగా నాటకాలు ప్రదర్శించడం మా ప్రత్యేకత. ఒక దశలో 3500 మంది కళాకారుల కుటుంబంగా, 45 నాటక సమాజాలుగా అన్ని పల్లెలు, పట్టణాలలో గుడారాలు వేసుకుని మరీ నాటకాలను ప్రదర్శించి తెలుగు పద్యనాటకానికి విశేష ఖ్యాతిని సంపాదించిపెట్టింది మా సంస్థ.
ప్రపంచదేశాలలో గర్వంగా చెప్పుకునే నాటకాల స్థాయిలో మన తెలుగు నాటకానికి కొత్త అందాలను తీసుకురావడంలో సురభి నాటక సంస్థ చేసిన కృషి ఎనలేనిది. 1937లో నెలకొల్పిన శ్రీ వేంకటేశ్వర నాట్యమండలిలో నేను పుట్టిపెరిగాను. నాటకాలు తప్ప నాకు మరో ప్రపంచం తెలియదు. అయితే మారిన ప్రేక్షకుల అభిరుచులు, నాటకాలకు ఆదరణ తగ్గిపోవడంతో మా కుటుంబాలకు చెందిన కళాకారులు పొట్టకూటి కోసం తలోదారి పట్టారు. 2000 సంవత్సరం నాటికి క్రమంగా మా కుటుంబ కళాకారుల సంఖ్య 200కు కుంచించుకుపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సురభి నాటకాలు కనుమరుగైపోయే ప్రమాద పరిస్థితి నెలకొంది.
పెద్దల అండతో పునర్వైభవం
ఆ దశలోనే గరిమెళ్ల రామమూర్తి, పూర్వ డిజిపి హెచ్‌జె దొర, కె.వి.రమణ వంటి పెద్దల ప్రోత్సాహంతో మళ్లీ సురభికి పునరుత్తేజం లభించింది. వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న సురభి కళాకారులందరికి భువనగిరి, చందానగర్ ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పర్చుకునేందుకు ప్రభుత్వం అండగా నిలిచింది. కేంద్రప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వనరులతో మాకు గృహవసతి, నెలవారీ వేతన భృతి లభ్యమైంది. ప్రస్తుతం మాలో 60 మందికి నెలవారీ జీతం, చాలామందికి పెన్షనలు వంటివి లభిస్తున్నాయి. బతుకు భరోసా లభించడంతో సురభి కుటుంబాలు నాటక ప్రదర్శనల పట్ల కొత్త ఉత్సాహం చూపించాయి. అన్నీ కూడగట్టుకుని సరికొత్త ప్రదర్శనలతో సమాయత్తం అయ్యాము.
2006 సంక్రాంతి పండుగ మాకొక శాశ్వత వేదికకు శుభారంభం పలికింది. భాగ్యనగరంలోని లలిత కళాతోరణం ప్రాంగణంలో సురభి నాటకశాలను ప్రారంభించాము. ఐదు నాటక సమాజాలుగా మిగిలి ఉన్న కళాకారులందరం కలసి వరుసపెట్టు ప్రదర్శనలతో మళ్లీ సురభికి జవజీవాలు కల్పించాము. పాతతరం అభిమానులతో పాటు కొత్త తరం యువతరానికి మా నాటకాలు చూపించి వారిని కూడా మెప్పించడానికి మేము తీసుకువచ్చిన కొత్త ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఒక్క ఏడాదిలోనే 440కి పైగా ప్రదర్శనలు ఇచ్చాము. రాష్ట్రప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటుతోపాటు ప్రదర్శనలకు అవకాశాలు మెరుగయ్యాయి. ఒక దశాబ్ద కాలం మేము పడిన కష్టానికి సురభి నాటకాలు మళ్లీ జనానికి చేరువయ్యాయి. రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా మా నాటకాలకు ఆదరణ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే నాటకోత్సవాలలో సైతం మా నాటకాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ‘మాయాబజార్’ నాటకం ఇప్పటికి 22,600 ప్రదర్శనలు పూర్తిచేసుకుంది. అలాగే ‘పాతాళభైరవి’కి కూడా అపూర్వ ఆదరణ లభిస్తోంది.
యువతరానికి చేరువగా…
మా కుటుంబాలకు చెందిన పాతతరంలో విద్యావంతులు లేరు. ఇప్పుడు ఎంబిఎతోపాటు యూనివర్సిటీలలో రంగస్థల కళలో ఎంఎ, పిహెచ్‌డి, గోల్డ్ మెడల్ పొందిన యువత మా కుటుంబాల సొంతం. రోజూ 124 కిలోమీటర్ల దూర ప్రయాణం చేస్తూ కాలేజీలలో చదువుకుంటున్న మా పిల్లలు నాటకంవైపే మొగ్గుచూపుతున్నారు. మాయాబజార్‌లో అభిమన్యుడు, శశిరేఖలుగా నటిస్తున్న మా పిల్లల చదువుల గురించి తెలుసుకుని ప్రేక్షకులు కూడా అభినందిస్తూ వారి నటనను ఆస్వాదిస్తున్నారు. ఇటీవల కాలంలో టిక్కెట్టు కొని మా నాటకాలను చూసే వారి సంఖ్య పెరగడం నాకు ఆనందాన్నిస్తోంది. నాటకాల పట్ల తెలుగు ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పు ఆహ్వానించదగిన పరిణామం.
ఫ్రాన్సు నుంచి ఆహ్వానం
తాజాగా మా నాటకాలను ప్రదర్శించవలసిందిగా ఫ్రాన్సు దేశానికి చెందిన ఒక సంస్థ నుంచి ఆహ్వానం అందింది. ఏప్రిల్‌లో ఈ ప్రదర్శనలు ఉంటాయి. హైదరాబాద్‌కు చెందిన అలయెన్స్ ఫ్రాంచేజ్ వారు ఫ్రాన్సులో ప్రదర్శనలకు కావలసిన హంగులు, పద్ధతులపై మాకు సూచనలు, సలహాలు అందచేస్తున్నారు. మాతోపాటు ఇతర సమాజాల్లోని మెరికల్లాంటి కళాకారులను కూడగట్టుకుని మొత్తం 43 మంది కళాకారులతో ఫ్రాన్స్ పర్యటన కోసం సమాయాత్తం అవుతున్నాము. ఈ పర్యటనతో మన నాటకాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మాకు మంచి పేరు తెచ్చిపెట్టిన 60 నాటకాలకు సంబంధించిన సమాచారాన్ని ఆధునిక పద్ధతుల్లో భద్రపరుస్తున్నాము. అన్నీ సీడీల రూపంలో ముందుతరాల వారికి అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తున్నాము.
మా కుటుంబానికి చెందిన రచయిత రామమోహనరావు రచించిన ‘కలియుగ వైకుంఠం’ నాటకాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము. శ్రీవేంకటేశ్వరుడి అవతార విలాసంపై అద్భుతమైన సంగీత దృశ్య కావ్యంగా ఈ నాటకాన్ని మలచడానికి కృషి చేస్తున్నాము. ఫ్రాన్సు పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ నాటకాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. ప్రేక్షకుల ఆదరాభిమానాలే మా సురభి కుటుంబాలకు రక్ష” అంటూ ముగించారు నాగేశ్వరరావు. ఆయన ఫోన్ నంబర్: 9849026386. ం జిఎల్ఎన్ మూర్తి

