జ్ఞానదుడు మహర్షి నారదుడు -4
గాన విద్యా పరీక్షకుడు నారదుడు
మార్కండేయ పురాణం లో ఒక అద్భుత మైన కధ ఉంది .ఒక నాడు ఇంద్ర సభ లో రంభాదులు నృత్యం చేస్తున్నారు .నారదుడు ఆ సమయం లో అక్కడికి వెళ్ళాడు .వీరిలో ఎవరి గానం ఇంపు గ ఉందోపరీక్షించి తేల్చమని ఇంద్రుడు నారదుడిని అడిగాడు .ఎవరు హావభావాలతో విర్రవీగుతారో వారి గానం గొప్పది అంటాడు మహర్షి .ఎవరికి వారు తామే ఎక్కువ అని వాదు లాడుకొంటారు .అప్పుడు నారదుడు ‘’ఎవరు దుర్వాస మహర్షి ని చలింప జేస్తారో వాళ్ళే గొప్ప ‘’అంటాడు .అప్పుడు ‘’వపువు ‘’అనే అప్సరస తాను ఆ పని చేయగలనని బయల్దేరి వెళ్ళింది .దుర్వాసుడు ఆమె ప్రయత్నానికి కోపం చెంది ‘’పక్షి ‘’గా మారి పొమ్మని శపిస్తాడు .పిల్లల్ని కనీ ,ఖడ్గం చేత నరక బడి మళ్ళీ దేవలోకం చేరుతావని ఆమె ప్రాధేయ పడితే చెప్పాడు .ఆమెయే ‘’తార్క్షి ‘’అనే పేరు తో భూలోకం లో జన్మించి ,ద్రణాచార్యులను వివాహ మాడుతుంది .గర్భవతి యై ,భారత యుద్ధం లో భూమి పై ఎగురుతు ఉండేది .భగాదత్తుని పై అర్జునుడు వేసే బాణాలు ఈమె కు తగిలి గర్భం చీలి గ్రుడ్లు కిందపడి పోగా శాప విమోచనమై మళ్ళీ దేవలోకం చేరుతుంది .శమీకుడు ఈ గ్రుడ్లను పెంచుతాడు .ఈ శమీక మహర్షి యే పరీక్షిత్తు మహా రాజుకు శాపం ఇచ్చిన వాడు .
గాన విద్యా విశారదుడు నారదుడు
అద్భుత రామాయణం కధనం ప్రకారం కౌశికుడు అనే వాడు స్వర్గ లోకం లో గానం చేస్తున్నాడు .లక్ష్మి నారదాదులు అక్కడికి వచ్చారు .లక్ష్మీ దేవి తుమ్బురుని పిలిచి కౌశికుని తో కలిసి గానం చేయమని కోరింది .నారదుడు దీన్ని తనకు జరిగిన అవమానం గా భావించాడు .నారదుడు కోపం తో లక్ష్మీ దేవిని ‘’దనుజ గర్భం లో పుడతావని ‘’శపించాడు .పాపం విష్ణు మూర్తి నారదుడిని ఊరడించాడు .భక్తిజ్ఞానం తో తుంబురుడు పాడుతాడు కనుక అతనికి అంతటి ప్రభావం వచ్చిందని తెలియ జేస్తాడు .నారదునికి అంతటి ప్రభావం రావాలంటే ‘’మానసోత్తర పర్వతం ‘’పై ఉన్న ‘’గాన బంధుడు ‘’అనే గుడ్ల గూబ ఉందని ,దాని దగ్గర గాన విద్య నేర్చుకోమని సలహా ఇస్తాడు .నారదుడు అలానే నేర్చి సుశిక్షితుడైనా, తుమ్బురునితో సమానం కాలేక పోతాడు .అసూయ తో మళ్ళీ విష్ణు మూర్తిని చేరి సంగీతం నేర్ప మంటాడు .శ్రీకృష్ణావతారం లో తాను నారదునికి సంగీతం నేర్పగలనని శ్రీహరి చెప్పి ఊరట కల్గించాడు .
శ్రీ కృష్ణావతారం లో నారదుడు స్వామిని చేరి సంగీతం నేర్పమంటాడు .జాంబవతి మొదలైన అష్ట భార్యల వద్దా ఒక్కొక్క సంవత్సరం గానం నేర్చుకోమంటాడు .అంత చేసినా గాన విద్య అబ్బలేదు .చివరికి శ్రీ కృష్ణుడే స్వయం గా నారదునికి సంగీత విద్య నేర్పి గాన విశారడుడిని చేశాడు .అప్పటి నుంచే ఈర్ష్య పూర్తిగా పోయింది నారదునికి .
త్రిలోక సంచారి
తండ్రి ఆజ్ఞవల్ల దక్షులు సృష్టి చేయటం ప్రారంభించారు .’’ముక్తి సాధన ‘’చూసుకో కుండా ఈ సంసార లంపటంమయేమిటని వారిచేత నారదుడు ఆ పని మాన్పించాడు .దక్షునికి తెలిసి బ్రహ్మ తో మొరపెట్టుకొన్నాడు .దక్షుని పుత్రికకు నారదుడు మళ్ళీ జన్మిస్తాడని బ్రహ్మ శపిస్తాడు .ఒక్క చోట కూడా కాలు నిలువ కుండా తిరుగుతూనే ఉంటావని ,సంతానం కూడా లేకుండా పోతుందని దక్షుడు శపిస్తాడు .బ్రహ్మ వైవర్త పురాణం లో ఈ కధ ఉంది . .
కలహా భోజనుడు నారదుడు
తాను విన్న ,తెలుసుకొన్న విషయాలను ఇంకొకరికి చెప్పక పోతే నారదుడి కి నిద్ర పట్టదు, .తోచదు కూడా .అదే కలహా కారణం అయింది .దానివల్ల అపోహలు ముసురుకొన్నాయి .చివరికి ఆనందం ,శాంతి సంతృప్తి .అయితే నారదునికి మాత్రం తిట్లు ,అక్షింతలూను .విష్ణువు రామావతారం దాలుస్తాడని వాల్మీకికి చెప్పిన వాడు నారదుడే .జలన్ధరాసురుని వధకు నారదుని నేర్పే కారణం .అలాగే గరుత్మంతునికి పాముల పై కోపం నారదుని వల్లనే కలిగింది .కాలయవనుని వధ కూడా నారద నిర్వాకమే .ఇలా తంపుల మారిగా మారాడు ఇదంతా లోక హితం కోసమే. ఇందులో ఆయన స్వార్ధం ఇసుమంత కూడా లేదు .
వరాహ పురాణం లో నారదుడు రావణుని దగ్గరకు వెళ్లి ‘’నరులను జయించానని గర్వ పడుతున్నావు .దేవతలు ,యముడు మదించి ఉన్నారు .వాళ్ళను ఓడించు ‘’అని ఎక్కేశాడు .యముడి దగ్గరకు వెల్లి ‘’రావణ గర్వం పెరిగి పోయింది .నీ పైకే వస్తున్నాడు చూసుకో కాసుకో ‘’అని ఉసి గోల్పాడు
మహిషాసురుని వల్ల లోకం బాధ పడుతోందని ‘’నారాయణి ‘’కి తెలిపి, మళ్ళీ వాడిని చేరి ‘’మలయసానువుఅలలో అందమైన నారాయణి ఉంది .చే బట్టమని ‘’ప్రోత్సహించాడు .చివరికి మహిషాసుర మర్దని ఆమె అయినా ప్రోత్సాహం అంతా నారదునిదే .ఈ విధం గా అసుర సంహారానికి తగిన ప్రాతి పదిక లేర్పరచి ,మానవ లోకానికి మహత్తర సౌభాగ్యాన్ని కల్పించాడు .కలహభోజనుడైన నారదుడు .లోక హితమే నారదుని మతం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-3-13-ఉయ్యూరు

