‘’రాజస’’ (సు ) లోచన

   ‘’రాజస’’ (సు ) లోచన

     రాజసులోచన అంటే వెడల్పైన అందమైన ముఖం ,పెద్ద బొట్టు తో రాజసం తాండ వించే చూపులతో అభినయానికి ఉదాహరణ గా కని పిస్తుంది .రాజసులోచన అంటే ‘’వెలుగు నీడలు   ‘’సినిమా లో ‘’పాడవోయి భారతీయుడా ‘’పాటే ఎప్పుడూ ముందు గుర్తుకొస్తుంది .అందులో శ్రీ శ్రీ రచన ,పెండ్యాల స్వర లహరి రాజసులోచన నృత్యాభినయం గుర్తుకొచ్చిన తర్వాతే మిగిలినవి జ్ఞాపకం వస్తాయి ఆ చీర కట్టిన విధానం అ నిండుదనం నృత్యం చేసి మెప్పించిన తీరు తెలుగు ప్రేక్షకుడేవ్వడు ఎప్పటికి మరిచి పోలేడు.రాజసులోచన అంటే ‘’మాంగల్య బలం ‘’చిత్రం లో రేలంగితో నటించిన అమాయకురాలు చివరికి రేలంగినే మురిపించిన నటి నాకు ఎప్పుడూ గుర్తుకొస్తుంది ఆ చిలిపితనం ,బేల తనం అందులో వారిద్దరి యుగళ గీతం మరచినా మరుపు రానిది .రాజసులోచన అంటే శాంతి నివాసం ‘’చిత్రం లో నాగేశ్వర రావు తో బృందావన్ గార్డెన్స్ లో ఆడుతూ పాడుతూ ‘’రావే రాదా రాణీ రావే రాధ  నీవే క్రిష్ణుడునేనే –రమ్యమైన శారద రాత్రి–రాసలీలా వేళఇదే ‘’అనే పాటే గురుకొస్తుంది. అ జంట పాటల పంట కోసం ఆ సిని మాను ఎన్ని సార్లు చూశానో జ్ఞాపకం లేదు అంత క్రేజ్ ఉండేది రాజ సులోచన మీద,అక్కినేని మీద   .రాజసులోచన అంటే అందరికీ  రాజకుమారుడైన యెన్ .టి.రామా రావు తలను ఒడిలో పెట్ట్టుకొని అతనికి నిద్రా భంగం చెయ్య వద్దని గాలిని బతిమాలే ‘’సడిసేయకో గాలి సడి సేయ బోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే ‘’అన్న కృష్ణ శాస్త్రి గారి గీతం రాజసులోచన ప్రేమ ,తపనా ,రామా రావు అంద చందాలు ,సులోచన నయనాల భావ ప్రకటనా నాకింకా జ్ఞాపకమే .ఆ సినిమా ఆడక పోయినా ఈ పట మాత్రం అందరి హృదయాల మీద పెద్ద ముద్రే వేసింది బి.యెన్.రెడ్డి గారి చిత్రీకరణ ,స్వరం చేసిన సంగీత దర్శకుడు మాస్టర్ వేణు మనసులో నిలిచి పోతారు నిశ్చలన చిత్రమై ఉండి పోతుంది

r1

 

 

         పెంకి పెళ్ళాం సినిమా లో ‘’పడుచుదనం రైలు బండి పోతున్నది .పడుచు  వారికందులోన చోటున్నది ‘’అని ఆరుద్ర రాసిన పాటకు రాజసులోచన అభినయ వేడుక ఎన్న దగింది . రామా రావు తో ఆమె చూపిన చిలిపి శృంగార చేష్టలన్నీ మరచి పోలేనివే .తోడికోడళ్ళు సినిమాలో వాంప్ పాత్రనూ అత్యంత సమర్ధం గా పోషించింది రేలంగి తో ఆమె సరదా డైలాగులు అదిరి పోతాయి .జయ భేరి చిత్రం  లో రాజ నర్తకి గా ,నాగేశ్వర రావు ను వక్ర మార్గం లోకి నెట్టేసే పాత్రనూ ఆమె చేసి సుభాష్ అని పించు కొందీ..ఇద్దరు మిత్రులు లో నాగేశ్వర రావు జోడీగా బలే చలాకీగా నటించి అభినయానికి సోగసులద్దింది.

rajasulochana

              దాసరి మొదటి సినిమా తాతా మనవళ్ళు లో సత్యనారాయణ జోడీ గా ,విలనీ ని పండించి తన సమర్ధత ను రుజువు చేసుకోంది .కత్తివీరుడు కాంతా రావు సరసన నటించి జానపదనికీ సోయగాలు అద్దింది . .దాదాపు అగ్రనటు లందరితో ఆమె నటించి తన నటనకు మెరుగులు దిద్దు కొన్నది .భాగ్యదేవత చిత్రం లో మహానటిసావిత్రికి చెల్లెలు గా వేసి అమాయకురాలైన అక్క కుటుంబాన్ని  సరిదిద్ది న చెల్లెలుగా తన పాత్ర ను సమర్ధ వంతం గా పోషించింది .కలకాలం గుర్తుండే ఈ పాత్ర లో రాజసులోచన జీవించింది అని చెప్పాలి .’’మంచి మనసుకు మంచి రోజులు ‘’చిత్రం లో ‘’దరణికి గిరి భారమా గిరికి తరువు భారమా ,తరువుకు కాయ భారమా  కని పించే తల్లికి పిల్ల భారమా “’అన్న పాటను  ఆమె చెట్టుకింద కూర్చుని పాడుతుంటే రావు బాల సరస్వతి ఆర్ద్రం గా పాడిన ఆ పాటకు రాజ సులోచన అభినయం కన్నీళ్లు తెప్పిస్తుంది గుండెలు పిండిన్చేస్తుంది ఘంటసాల సంగీతం మాధుర్యం లో అతి విషాదాన్ని ఆవిష్కరిస్తుంది .అలాగే ఈ సినిమా లోనే ‘’కలవారి స్వార్ధం నిరు పేద దుఖం ఏనాటి కైనా మారేనా “”?అంటూ రామా రావు రాజ సులోచన పాడుతున్నా మన దుఖం కట్టలు త్రెంచు కొంటుంది .

 images       తెలుగు  చిత్రసీమ లో జయభేరి మోగించిన ‘’జయభేరి ‘’సినిమా లో ‘’నీ వెంత నెరజాణ వౌరా ‘’అన్న మల్లాది వారు రాసిన జావళీని ఏం.ఎల్.వసంత కుమారి అద్భుతం గా గానం చేస్తే రాజసులోచన దానికి చేసిన నృత్యాభినయం‘’నభూతో ‘’అని పిస్తుంది .సవాలు ,ప్రతి సవాళ్ళ తో అక్కినేని తో పోటీ పడి నటించిన గొప్ప సినిమా .ఇది ఆమె నృత్యాభినయానికి అవధులు లేవని పిస్తుంది .పెండ్యాల మ్యూజిక్ గురించి చెప్పనే అక్కర్లేదు .అదొక రసధుని .

    తమిళ హీరోలు రామచంద్రన్, శివాజీ లతో ,కన్నడం లో రాజకుమార్ తో, మలయాళం లో ప్రేమ నజీర్ తో రాజసులోచన నటించి మెప్పించింది .హిందీలో చోరీ చోరీ నయా ఆద్మీ ,మొదలైన చిత్రాలలో నటించి తన నటనకు అవధులు లేవని నిరూపించింది .సుమారు మూడొందల చిత్రాలలో ఆమె హీరోయిన్ వాంప్ ,కేరక్టర్ యాక్టర్ ,నాత్యాలతో అభినయం తో నిత్య నూతనం గా కని పించేది .ఆమె మాటలు చాలా ముద్దు ముద్దుగా ఉండేవి .నవ్వు తమాషాగా ఉండేది ఆమె వెండి తెరకే వెండి వెలుగు లాడ్డింది .ఆమె ను  చూస్తె మనసు పరవశం చెందేది .ప్రేక్షకాదరణ ను పుష్కలం గా పొందిన నటి’’ రాజ స లోచన’’ అయిన  రాజ సులోచన .విజయవాడ అమ్మాయే అయినా మద్రాస్ లో పెరిగింది .సంగీతం నేర్చుకోమని తలిదండ్రులు ఒత్తిడి చేశారు చిన్నప్పుడు కానీ అది ఆమెకు అలవడలేదు .డాన్సు మీద ద్రుష్టి పడింది .డాన్సులో డిప్లోమో సాధించింది .మద్రాస్ లో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి టి.ఎల్.వెంకట్రామన్ ముఖ్య అతిధి గా పాల్గొన్న సభలో హిందూ హైస్కూల్ లో రాజ సులోచన తొలి నృత్య ప్రదర్శన నిచ్చి ‘’అరంగేట్రం’’చేసింది ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేక పోయింది .

            ఇన్ని సినిమాలో ఇన్ని రకాల వేషాలు వేసి మెప్పించినా ఆమె కు కూచి పూడి ,కధా కళీ ,కదక్ భారత నాట్యాలంటే మిక్కుటమైన మక్కువ .పాశ్చాత్య నాట్య రీతులను దీక్షతో అభ్యసించి తన నృత్యానికి అవధులు లేవని నిరూపించింది .కదక్ నృత్యాన్ని లక్నో శైలిలోను, ,జైపురి శైలి లోను ఒకే సారి నేర్చున్న ఏకైన కళా కారిణిగా అరుదైన గుర్తింపు పొందింది రాజ సులోచన .వీటిని అందరికి నేర్పాలనే సదుద్దేశం తో మద్రాస్ మహా నగరం లో ‘’పుష్పాంజలి నృత్య కళా కేంద్రం ‘’ను ఏర్పరచి ,ఎందరికో నేర్పింది తను నేర్చిన  విద్య కు సార్ధకత తెచ్చింది .

            సావిత్రి దర్శకత్వం వహించి నిర్మించిన ‘’చిన్నారి పాపలు ‘’సినిమాకు నృత్య దర్శ కత్వం చేసి, తొలి మహిళా నృత్య దర్శకురాలైంది రాజ సులోచన .మహా కవి కాళిదాసు చిత్రం లో తాను పాడిన పాటకు వీణ ను కూడా తానే వాయించి తన వీణా గాన విద్వత్తును లోకానికి తెలియ జేసింది  .ఇలా ఎన్నో విధాల రాజ సులోచన తన సర్వ సమర్ధత ను అన్ని రంగాలలో సాధించి నిరూపించుకోన్నది .అయితే ఈ నృత్యాభినయ నేత్రిని  మన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ గౌరవించలేక పోవటం దాని గుడ్డితనానికి మన దురదృష్టానికి దృష్టాంతం గా నిలిచి పోయింది. కానీ తమిళ నాడు ప్రభుత్వం ఆమె ప్రతిభకు పట్టం కట్టింది .ఆమె కు  ‘’కలై మా మణి’’బిరుదు నిచ్చి అపూర్వ గౌరవాన్ని కల్గించింది .ఎన్నో వైవిధ్య భరిత పాత్రలకు జీవం పోసిన సంగీత ,నృత్యాభినయ తార రాజ సులోచన తన 78 వ ఏట ‘’సడి సేయకుండా‘’దివికి చేరి పంచ భూతాలతో  తన ప్రావీణ్యాన్ని పంచుకొని నట చిరంజీవి అయింది

            మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –6-3-13-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

1 Response to ‘’రాజస’’ (సు ) లోచన

  1. sunkaras's avatar sunkaras says:

    ఎంతో చక్కగా, విపులంగా రాసారు రాజ సులోచన గురించి; మీ జ్ఞాపక శక్తికిదో మచ్చు తునక; మీ లానే నేను కూడా ఆరోజుల్లొకి వెళ్ళి, ఆనందించాను.
    అభినందనలు,
    కోటీశ్వర రావు

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.