గోదారి కుర్రాడు మేజిక్‌లో మొనగాడు

గోదారి కుర్రాడు మేజిక్‌లో మొనగాడు


పేదరికం అతని కళాతృష్ణను అణగారనివ్వలేదు. కళ్ల జోడు షాపులో పనిచేస్తూనే కనికట్టు విద్యలో నిష్ణాతునిగా మారాడాయన. ఆయనే ప్రముఖ మెజిషియన్ అలీ. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక కుగ్రామంలో జన్మించిన ఆయన అంతర్జాతీయ స్థాయి మెజిషియన్‌గా ఎదిగారు. పేకముక్కలు, పావురాలు వంటివి ఖాళీ చేతులలో సృష్టించడం ఆయన ప్రత్యేకత. తన మేజిక్ ప్రదర్శనలతో ప్రేక్షకులలో మానసికోల్లాసాన్ని నింపుతున్న అలీ అంతరంగం ఆయన మాటల్లోనే…

“మాది తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు తాలూకాకు చెందిన మామిడికుదురు. పక్కనే నగరంలో పదవ తరగతి దాకా చదువుకున్నాను. మా తాత(అమ్మగారి తండ్రి) హుస్సేన్‌గారు అప్పట్లో చాలా పెద్ద మెజిషియన్. పెద్ద పెద్ద ఐటమ్స్ చేసేవారాయన. వాటిని చూసి ఏమిటీ మాయలు మంత్రాలు అని చిన్నప్పుడు అనుకునేవాణ్ణి. ఆయన దగ్గర చిన్న చిన్న ఐటమ్స్ నేర్చుకున్నాను. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న చిన్న వ్యాపారం చేసేవారు. మేము మొత్తం ఐదుగురం. నేను రెండవవాణ్ణి. నాకో అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక చెల్లి, ఆఖరున మరో తమ్ముడు.

చదువును కొనసాగించే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో 25 ఏళ్ల కిత్రం హైదరాబాద్ వచ్చి ఆబిడ్స్‌లో ఒక కళ్ల జోళ్ల షాపులో పనిచేశాను. వచ్చే రెండువేల జీతంలోనే కొంత మొత్తం ఇంటికి పంపాల్సిన పరిస్థితి. 13 గంటలు నిలబడి ఉద్యోగం చేసేవాణ్ణి. కూర్చోడానికి కూడా సమయం ఉండేది కాదు. ఆ సమయంలోనే అమెరికన్ మెజిషియన్ చానిగ్ పొలాక్ మేజిక్ వీడియో క్యాసెట్ చూశాను. పేక ముక్కలతో మేజిక్ చేయడంలో ఆయన నిష్ణాతుడు. అది చూసి నాక్కూడా ఆ విద్యను నేర్చుకోవాలనిపించింది. షాపు యజమాని పేక ముక్కలను చూస్తే తిడతాడని పనిచేస్తూనే అట్టముక్కలతో ప్రాక్టీస్ చేసేవాడిని. రూముకు వచ్చిన తర్వాత గంటల తరబడి ప్రాక్టీస్ కొనసాగేది.

చూసేందుకు వెళితే అవార్డు!
1988లో హైదరాబాద్‌లో ఒక మేజిక్ ఫెస్టివల్ జరిగితే చూసేందుకు వెళ్లాను. మేజిక్ పోటీలు జరుగుతుంటే నాపేరు కూడా పోటీకి ఇచ్చాను. ఆ పోటీల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలలకు చెందిన పెద్ద పెద్ద మేజిషియన్లు వచ్చారు. వాళ్లంతా మేకప్‌లు వేసుకుని, భారీ కోట్లు వేసుకుని ఉన్నారు. నా దగ్గర కోటు కాదు కదా వేసుకున్న చొక్కా కూడా దమ్ముకొట్టుకుపోయి, దయనీయంగా ఉంది. అలాగే భయపడుతూ నా ప్రదర్శన పూర్తి చేశాను. పోటీ విజేతల పేర్లు ప్రకటిస్తున్నారు. మొదటి బహుమతి విజేత ‘అలీ’ అని ప్రకటించగానే నేను కాదు వేరే ఎవరో ఉన్నారులే అనుకున్నాను. కాని, విచిత్రంగా మొదటిసారి నేను ఇచ్చిన ప్రదర్శనలోనే నాకు మొదటి బహుమతి లభించింది. బహుమతి తీసుకుంటుంటే నా కళ్లలోంచి నీరు… ఎంత ఆపుకుందామన్నా ఆగలేదు.

కేరళలో అపురూప సత్కారం
కేరళలో గోపీనాథ్ ముత్తుక్కడ్ అనే ప్రఖ్యాత మెజిషియన్ ఒక మేజిక్ అకాడమి నిర్వహిస్తున్నారు. పిసి సర్కార్, కె.లాల్ లాంటి ప్రముఖుల స్థాయిలో ఆయన నిలుస్తారు. ప్లేయింగ్ కార్డ్స్ మేనిప్యులేషన్ (పేకముక్కలతో ఇంద్రజాలం)లో ఈ అకాడమి శిక్షణ ఇస్తుంటుంది. ఒకరోజు గోపీనాథ్‌గారు మా షాపునకు ఫోన్ చేసి “అలీగారూ! మీకు కేరళ ప్రభుత్వం తరఫున ఆలిండియా బెస్ట్ కార్డునేషన్ అవార్డు ఇద్దామనుకుంటున్నాము” అని చెప్పారు.

1989లో త్రివేండ్రం వెళ్లాను. 35 గంటలు రైలు ప్రయాణం చేయడంతో నా బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి. స్టేషన్‌లో నేను కాలు పెట్టగానే నన్ను రెండవ నంబర్ గేట్ దగ్గర వచ్చి గోపీనాథ్‌గారిని కలవాలని అనౌన్స్‌మెంట్ వస్తోంది. చొక్కా మార్చుకోవడానికి కూడా టైము లేకపోవడంతో నేను అలాగే అక్కడకు వెళ్లాను. పూలమాలలు పట్టుకుని మెజిషియన్లు, విద్యార్థినీ విద్యార్థులు అక్కడ గుమికూడి నా రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆ అవార్డు ప్రదానోత్సవం నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతిగా మిగిలిపోయింది. షాపులో పనిచేస్తూనే సొంతంగా నేర్చుకోవడం కొనసాగించాను.

ఎన్నెన్నో అద్భుతాలు…
మేజిక్‌లు మూడు రకాలు. ఒకటి ఇల్యూజన్(భ్రమ). అమ్మాయిని గాలిలో లేపడం, మధ్యలో సగానికి కోయడం, పెట్టెలో ఉంచి తాళం వేసి బయటకు రప్పించడంలాంటివి ఈ కోవలోకి వస్తాయి. ఖాళీ చేతులలో నుంచి వస్తువులను సృష్టించడాన్ని కంజ్యూరింగ్ అంటారు. ఉదాహరణకు ఖాళీ చేతులలో పావురాలు, పేకముక్కలను సృష్టించడం. మూడవది క్లోజప్. అంటే చిన్న చిన్న నాణేలను సృష్టించడం, ఒక కాగితం ముక్కను ఇచ్చి దాన్ని వెయ్యిరూపాయల నోటుగా మార్చడం లాంటివి. నేను ప్రధానంగా కంజ్యూరింగ్, క్లోజప్ మేజిక్‌ను చేయడానికే ప్రాధాన్యమిస్తాను.

52 పేకముక్కలు రెండు ఖాళీ చేతులలో రావడం, వాటితో విన్యాసాలు చేయడం, పేకముక్కలు రంగులు మారిపోవడం, గాలిలోనుంచి పావురాలు ఎగురుకుంటూ రావడం, చేతిలో పట్టుకోగానే పావురం చిలుకగా మారిపోవడం, ఒక గుడ్డు పగలగొట్టగానే అందులోనుంచి పావురం రావడం ఇలా దాదాపు 150కి పైగా ఐటమ్స్ చేస్తాను. గంటన్నరపాటు ఒక్కో ప్రదర్శన ఉంటుంది. నాకు ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు. ఇప్పటిదాకా 6 వేలకు పైగా ప్రదర్శనలు దేశవ్యాప్తంగా ఇచ్చాను. 13 సార్లు జాతీయస్థాయి పోటీలలో ప్రథమ బహుమతి సంపాదించాను. ముంబాయిలో జరిగిన సార్క్ దేశాల మేజిక్ పోటీలలో కూడా ప్రథమ బహుమతి లభించింది.

జాదూరత్న
2000 సంవత్సరంలో దేశంలోని మెజిషియన్లంతా కలసి నాకు జాదూ రత్న అవార్డు ఇచ్చారు. 2002లో జాదూ శిరోమణి అవార్డు లభించింది. త్యాగరాయగానసభలో కళ్లకు గంతలు కట్టుకుని గంటలో వంద ఐటమ్స్ చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కింది. అలాగే కళ్లకు గంతలు కట్టుకుని ట్యాంక్‌బండ్ నెక్లెస్‌రోడ్‌లో బండి నడిపాను. ఇప్పటిదాకా సింగపూర్, మలేషియా, దుబాయ్, కువైట్, బహెరిన్ దేశాలలో ప్రదర్శనలు ఇచ్చాను.

ఎక్కువగా కార్పొరేట్ ఆఫీసులు, ఐటి కంపెనీలు, హోటల్స్‌లో జరిగే పుట్టిన రోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో నా ప్రదర్శనలు ఉంటాయి. ఒరిస్సాలోని పూరీలో ఏప్రిల్ 13, 14, 15 తేదీలలో మూడు రోజులపాటు జాతీయ స్థాయి మేజిక్ కన్వెన్షన్ జరుగుతోంది. అందులో నా ప్రత్యేక ప్రదర్శన(గాలా షో) ఉంటుంది. అలాగే జూన్‌లో బెంగళూరులో జరిగే అంతర్జాతీయ మేజిక్ ఫెస్టివల్‌లో కూడా పాల్గొంటున్నాను.

జనచైతన్యం కోసం…
రాష్ట్రంలోని చాలా గ్రామాలలో ఇంకా మూఢనమ్మకాలు పోలేదు. వీటి మీద ప్రజలను చైతన్యపరుస్తూ నేను, మరికొందరం మెజిషియన్లు కలసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. కొంతమంది బాబాలు గాలిలో సృష్టించి ఇచ్చే వస్తువులు ఎలా వస్తాయో నా ప్రదర్శనల్లో రెండు మూడు ఐటమ్స్‌ని తప్పనిసరిగా చూపిస్తాను. ఇలా చేయడం వల్ల ప్రజలలో మూఢ విశ్వాసాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది.

మాయలు మంత్రాలు ఏవీ లేవని చెప్పడమే మా ఉద్దేశం. అనాథాశ్రమాలలోని పిల్లల కోసం కూడా ఉచితంగా మేజిక్ ప్రదర్శనలు ఇస్తుంటాను. మేజిక్‌లో నాకంటూ గురువు ఎవరూ లేరు. సొంతంగా నేర్చుకున్నదే ఈ విద్యంతా. సినిమాలలో హీరోలకు కూడా అప్పుడప్పుడు మేజిక్ ట్రెయినింగ్ ఇస్తుంటాను. మా తమ్ముడికి హైదరాబాద్‌లో కళ్లజోడు షాపు ఉంది. ఇప్పటికీ ఖాళీ దొరికితే ఆ షాపులో కూర్చుని కళ్లజోళ్లు రిపేర్ చేస్తుంటాను. కళ అనేది కేవలం మానసిక ఉల్లాసానికే కాదు సామాజిక ప్రయోజనం కూడా సాధించే విధంగా ఉండాలన్నదే నా ఆశయం” అని ముగించారు అలీ. ఆయన ఫోన్ నంబర్: 9849191212.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.