మైసూరు వెళితే… మేల్కోటే వెళ్ళిరండి
– డా. నాగసూరి వేణుగోపాల్
ఒక కోటి అంటే ఒకటి అంకె పక్కన ఏడు సున్నాలు పెట్టాలి. అదే వేయి కోట్లు అన్నప్పుడు పది సున్నాలు పెట్టాలి. సంఖ్య పెరిగే కొద్దీ సున్నాల సంఖ్య పెరుగుతుంది. ఈ స్థాయిలో ఉన్న సంఖ్యలను సులువుగా పేర్కొనే పద్ధతి ఉంది. వెయ్యి కోట్లను ‘టెన్ టుది పవర్ ఆఫ్ టెన్’ అని గణితాత్మకంగా వ్యక్తీకరించవచ్చు. రామాయణంలో వాల్మీకి టెన్ టుది పవర్ ఆఫ్ సిక్స్‌టిటూ అని ఒకచోట పేర్కొంటారని ఈ మధ్య కవన శర్మ వివరించి చెప్పారు. ఒకటి పక్కన 62 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట.
ఇంత పెద్ద సంఖ్య ఎక్కడ ప్రస్తావనకు వచ్చింది? రావణుని గూఢచారి రాముని సైన్యంలోని సైనికులసంఖ్య చెబుతూ పేర్కొన్నారట. నిజానికి మొత్తం జనాభా అప్పటికి అంత లేకపోవచ్చు. అప్పటికే కాదు ఇప్పటికీ లేకపోవచ్చు. అది కూడా వనవాసంలో ఉన్న కథానాయకుడు శత్రు రాజ్యం మీద దండయాత్ర చేసినపుడు ఈ స్థాయిలో ఎక్కువ చేసి చెప్పడం కవి భావుకతకు పరాకాష్ఠ! వాస్తవానికి పూర్తిగా విరుద్ధం.
ఇం దులో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీఇక్కడ గమనించాల్సింది ఏమంటే ‘టుది పవర్ ఆఫ్’ అన్న భావన వాల్మీకి(లేదా రామాయణం రాసిన రచయిత)కి తెలిసి ఉందని మనం భావించక తప్పదు. రామాయణం కాలంతో సంబంధం లేకుండా ఆ రచయిత పరిజ్ఞానాన్ని మనం గుర్తించక తప్పదు! ఆర్యభటుడు, వరాహమిహిరుడు, భాస్కరుడు, చరకుడు, సుశృతుడు వంటివారి మేధస్సునూ, నైపుణ్యాన్నీ మనం గౌరవించక తప్పదు.
మేల్కోటే చిన్న గుట్టమీద ఉండే రెండు భవనాల ముందు ఆగి, దిగి లోపలకు పోగానే ‘ఏవియేషన్ సైన్స్ ఇన్ ఏన్సియంట్ ఇండియా’ – అనే పోస్టర్ కనబడింది. ఈ ధీమ్ మీద జరిగిన సైన్స్ వర్క్‌షాప్ వివరాలు తెలియజేస్తూ గోడ మీద పలకరిస్తోంది ఆ పోస్టర్. లోపలికి పోగానే ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా త్రూది ఏజస్’ అనే పుస్తకం తాలూకు వివరాలు ఆకర్షిస్తున్నాయి. ఇంతకూ నేను వెళ్ళింది ఎక్కడో మీకు చెప్పలేదు కదా! అకాడమీ ఆఫ్ సాన్స్‌క్రిట్ రీసెర్చి భవనం లోపల ఉన్నాను.
మైసూరుకు యాభై కిలోమీటర్ల దూరంలో ఈ చిన్న గ్రామముంది. ఇంకా చెప్పాలంటే టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం, బృందావన్ గార్డెన్స్ దాటుకుని వెళితే జక్కనహళ్ళి వస్తుంది. అవును అమర శిల్పి జక్కన ఊరే! ఈ ఊరికి ఐదారు కిలోమీటర్ల దూరంలో మేల్కోటే ఉంది. చాలా మందికి మేల్కోటే అంటే 12వ శతాబద్దపు చెలువ రాయుని దేవాలయం. యువ తరానికయితే ‘నరసింహ’ సినిమాలో రెండు పెద్ద స్తంభాల మధ్య రజనీకాంత్ కూర్చొన్న దృశ్యం చిత్రీకరించిన స్థలం. తెలుగు టీవీ, సినిమా ప్రేక్షకులకు అయితే మేల్కోటే ఒక నటుడు. కానీ తెలిసిన వారికి ఇది దక్షిణాది బద్రినాథ్.
ఒక వెయ్యి సంవత్సరాలుగా అక్కడ సంస్కృతం గొప్పగా వెల్లివిరిసిన ఊరు. ఆ ఊరిలో ప్రతి కుటుంబం సంస్కృతం మాట్లాడగలిగిన ఊరుగా గౌరవం ఉంది. ఇటీవలి కాలం పరిస్థితి కొంత మారింది. అంతకు మించి జ్ఞాన మండపంగా పిలువబడే ఆ ఊరిలో ప్రతి కుటుంబం చేసే పని చెలువ రాయుని దేవాలయానికి తోడ్పడే రీతిలో రూపొందించి ఉండటం మరింత ఆసక్తికరం. విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన రామానుజుల వారు తన జీవిత చరమాంకంలో ఒక పదునాలుగేళ్ళు ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడం ఈ ప్రత్యేకతలకు కారణం.
ఆ ఊరిలోకి వెళ్ళి అకాడమీ ఎక్కడ అని అడిగితే మాకు తెలియదని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మూడు రోజుల క్రితం వారి వెబ్‌సైట్ సంప్రదిస్తే విజిటర్ నెంబరు 44 అని కనబడింది. ప్రపంచంలో అంత తక్కువ మందికి తెలిసిన సంస్థ గురించి మనకెలా తెలిసింది! మైసూరు ప్యాలెస్, మైసూరు సిల్క్, చండిహిల్స్ చూడకుండా మేల్కోటే వెళ్ళమని ఎవరు చెప్పారు? మాకెలా తెల్సింది? – అని మీకనిపిస్తూ ఉంటుంది. నిజమే! గీక్ నేషన్… సరిగానే ఉంది గ్రీక్ నేషన్ కాదు గీక్ నేషన్ … అది ఓ పుస్తకం పేరు. అంజల సైని రచయిత్రి.
భారతదేశపు భవిష్యత్తు – ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల సామర్థ్యం పట్ల గొప్పగా వివరించే పుస్తకమిది. బ్రిటన్‌కు చెందిన మహిళా జర్నలిస్టు భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తిరిగి, అధ్యయనం చేసి ఈ పుస్తకం వెలువరించారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు రెండు శాతం జీడీపీ కేటాయింపులున్నాయని ప్రధాని కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించగానే మిగతా ప్రపంచానికి ఆసక్తి కలిగింది. మనకా విషయం తెలిసే లోపు ఆయా దేశాల్లో మన దేశం గురించి ఆసక్తి పెరిగింది.
అంజల సైని రాసిన గీక్ నేషన్ విడుదలవగానే చైనా భాషలోకి అనువాదమైంది. ఎందుకంటే భారతదేశం మీద చైనాకు ఆసక్తి ఆ స్థాయిలో ఉంది కనుక. సరే ఈ పుస్తకం చదవడం, ఈ రచయిత్రి భవదీయ సైన్స్ కాలమిస్ట్ ఒక దినపత్రిక ఇంటర్వ్యూ కోసం హైదరాబాదులో కలవడం కూడా జరిగింది. ఆ పుస్తకంలో రాకెట్ పరిశోధనా స్థానాలు, ఐఐటి, ఐఐఎస్‌సి వంటి సంస్థలను సందర్శించినట్లు రచయిత్రి ట్రావెలోగ్ లాగా వివరించారు. అందులో భాగంగా సైని మైసూర్ దగ్గరుండే అకాడమీ ఆఫ్ సాన్స్‌క్రిట్ రీసెర్చికి వెళ్ళి భారతదేశం గతంలో సాధించిన సైన్స్ విజయాలను గొప్పగా ప్రస్తుతిస్తారు. ఫలితంగా నాకూ మేల్కోటే సంస్కృత పరిశోధనా అకాడమీ చూడలనే కోరిక కలిగింది.
1976 నుంచి నడుస్తున్న ఈ సంస్థ ప్రాచీన తాళపత్ర గ్రంథాలు సేకరించి, పరిష్కరించి, పుస్తకాలు కన్నడ, ఆంగ్ల, సంస్కృత భాషల్లో వెలువరిస్తోంది. అగ్రికల్చరల్ సైన్స్ అంటే టెక్నాలజీ ఇన్ ఏన్సియంట్ ఇండియా అనే పెద్ద ప్రాజెక్టు నడుస్తోంది. హైదరాబాదు యూనివర్సిటీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ (సిమ్లా) వంటి సంస్థలతో కలిసి పరిశోధన చేస్తోంది. గతం గురించి మనం కొంత ఉదారతతో, కించిత్ ఆత్మగౌరవంతో శోధించాలనిపించింది. వర్తమానం ద్వారా గతానికీ, భవిష్యత్తుకూ లంకె వేయాలనే ఈ సంస్థ ఉద్దేశ్యం విభేదించేదిగా కనబడటం లేదు. మీరు మైసూరు వెళితే మేల్కోటే వెళ్ళిరండి.. చాలు!
– డా. నాగసూరి వేణుగోపాల్


మంచి వ్యాసం. మీ వ్యాసం ద్వారా, నేను ‘మన ప్రభుత్వం ఒకప్పటి మన సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై పరిశోధనలు చేస్తున్నదని తెలిసి సంతోషిస్తున్నాను.
LikeLike