కార్మిక మాత జోన్స్ (మదర్ జోన్స్ )
మనిషి పేర మేగజైన్
ఆమె అసమాన సాహస మహిళ .మడమ తిప్పని కార్మికోద్యమ నాయకురాలు .ఎక్కడ కార్మిక ,శ్రామిక సమస్య వచ్చినా అక్కడ వాలి ,పరిష్కారానికి మార్గం సులభం చేసిన దీరోదాత్తురాలు వివేచనా సంపన్నురాలు .బాలకార్మిక విమోచానానికి కంకణం కట్టుకొని ఆహరహం శ్రమించిన నాయకురాలు .మహిళాభ్యున్నతికి ,సరైన విలువలతో కూడిన రాజకీయ ,పరిస్తితుల కల్పనకు పార్టీని స్థాపించిన రాజకీయ దురంధురాలు కార్మికులందరికీ ఆమె సేవలు ఒక తల్లి తన పిల్లలకు చేసే సేవలుగా అని పించాయి ఆమె లో తమ మాతృమూర్తిని దర్శించుకొన్నారు .అందుకే ఆప్యాయం గా ,దరంగా , ప్రేమగా,,గౌరవం గా ఆమెను ‘’మదర్ జోన్స్ ‘’అని పిలుచుకొని సంతృప్తి చెందారు అందుకే ఆమె ‘’కార్మిక మాత ‘’అయింది .అలాంటి విశిష్ట వ్యక్తిత్వం ఉన్న ఆ విదుషీమణి పేరనే ఒక ద్వై మాసిక పత్రిక ను పెట్టి ఆమె పేరును చిరస్మరణీయం చేసి ఆ మహిళామణికి నీరాజనలా లందించారు అమెరికన్ పత్రికాధి పతులు ఆమె లాగా నే ఈ పత్రిక కూడా నిర్భాయత్వానికి నిజాయితీకి పెద్ద పట వేసింది .ఆమెయే‘’’’ మదర్ జోన్స్’’అనబడే మేరి హారిస్ జోన్స్ . .ఆపత్రిక పేరే ‘’మదర్ జోన్స్ ‘’లేక ‘’మో జో’’.ఆమె జీవితం అందరికి ఆదర్శప్రాయం
మదర్ జోన్స్ పత్రిక ఆమె యే ఆదర్శాలకు ,విలువలకు ప్రాతినిధ్యం వహించిందో వాటిని కాపాడటానికి తీవ్రం గా కృషి చేస్తోంది .వామ పక్ష భావ వ్యాప్తికి అంకితమైన పత్రిక ..పరిశోధనాత్మక మైన బ్రేకింగ్ న్యూస్ కు అశేష గౌరవాన్ని పొందింది ఆ పత్రిక .రాజకీయ ,పర్యావరణ ,మానవ హక్కుల ,,సంస్కృతీ పరి రక్షణ కోసం అంకిత భావం తో పని చేస్తున్న పత్రిక .23 సార్లు ‘’నేషనల్ మేగజైన్ అవార్డ్ ‘’కు నామినేట్ అయిన పత్రిక .ఆరు సార్లు ఆ అవార్డు ను దక్కించుకొన్న పత్రిక .2011 లో జనరల్ ఎక్సేలేన్సి అవార్డ్ తో బాటు 2010 లో ఆన్ లైన్ టాపికల్ రిపోర్టింగ్ కు ‘’ఆన్ లైన్ న్యూస్ అసోసియేషన్ ‘’అవార్డు ను పొండిది .’’ఉట్నే రీడర్ ఇండిపెండెంట్ ప్రెస్ అవార్డ్’’ ను జెనెరల్ ఎక్సేలేన్సి లో సాధించిన అగ్రగామి పత్రిక . ఇలాంటి పత్రిక కు ప్రేరణ గా నిలచిన మదర్ జోన్స్ గురించి తెలుసుకొందాం .
Mother Jones (abbreviated MoJo) is a politically left-wing[2] American magazine, featuring investigative and breaking news reporting on politics, the environment, human rights, and culture. Mother Jones has been nominated for 23 National Magazine Awards and has won six times, including for General Excellence in 2001,[3] 2008,[4] and 2010.[5] In addition, Mother Jones also won the Online News Association Award for Online Topical Reporting in 2010[6] and the Utne Reader Independent Press Award for General Excellence in 2011.[7]
జోన్స్ జీవితం
మేరీ హారిస్ జోన్స్ ఐర్లాండ్ దేశం లో ‘’కౌంటి కార్క్’’అనే చోట 1830 (1837 ?)లో జన్మించింది .ఆమె చిన్నతనం లోనే ఐర్లాండ్ లో తీవ్ర మైన కరువేర్పడింది కరువు బారి నుండి తప్పించుకోవటానికి ఆమె తలిదండ్రులు కుటుంబాన్ని ఉత్తర అమెరికా కు తరలించారు దురదృష్టం ఆమె ను వెంటాడింది అప్పుడే తీవ్రం గా విజ్రుమ్భించిన ‘’పచ్చజ్వరం ‘’తో తల్లిని ,తండ్రిని కోల్పోయిన అభాగ్యురాలైంది ఉపాధ్యాయురాలు గా జీవితాన్ని ప్రారంభించింది ..మెంఫిస్ చేరి రాబర్ట్ జోన్స్ ను 1861 లో వివాహ మాడింది .ఆయన ఐరన్ వర్కర్ .కార్మిక యూనియన్ కు మంచి సపోర్టర్ కూడా .నలుగురు పిల్లలు కలిగారు .అయినా విధి ఆమె పై పగ బట్టింది .మళ్ళీ ఎల్లో ఫీవర్ విజ్రుమ్భించి1867 లో భర్తను ,పిల్లలను కోల్పోయింది .’’skilled iron worker ‘అయింది .’చికాగో చేరి డ్రెస్ మేకర్ అయింది .గోరు చుట్టుపై రోకటి పోటు అన్నట్లుచికాగోలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం లో ఆమె ఇల్లు పరశురామ ప్రీతీ అయింది . .అంటే నిలువ నీడ కూడా లేని నిర్భాగ్యురాలైంది .ఇలినాయిస్ ,మిచిగాన్ రాష్ట్రాలలో కొంత కాలం ఉంది
కార్మిక సంక్షేమం కోసం కృషి
లేబర్ ఆక్టివిస్ట్ గా KNIGHTS OF LABOUR ‘’తో కలిసి పని చేసింది .కార్మికులు సమ్మె చేస్తుంటే వెన్నంటి ఉండేది .ఉత్తేజకర మైన ప్రసంగాలు చేసి వారిని కార్యోన్ముఖులను చేసేది .పెన్సిల్వేనియా గని కార్మికులు1873 లో చే బట్టిన అనేక సమ్మెలకు హాజరై వారిని ఉత్సాహపరచింది అలాగే రైల్ రోడ్డు కార్మికులు 1877 లో చే బట్టిన సమ్మెకు వెన్నెముక గ నిలబడింది శ్రామికులను కార్మికులను ఒక తల్లి లాగా ఆదరించటం వల్ల ఆమె లో వారందరూ తమ మాత్రుదేవతనే చూశారు అందుకే ప్రేమ గా ఆమె ను ‘’మదర్ జోన్స్ ‘(జోన్స్ మాత ) అని ఆప్యాయం గా పిలుచుకొన్నారు అదే చివరికి ఆమె పేరు అయింది .’’గనుల దేవత ‘’అనే పేరు నూ పొందింది జోన్స్ .అమెరికా లో ‘’ఐక్య గని కార్మికుల సంఘం‘’ఏర్పడటానికి కృషి చేసింది ఆమె అవగాహన ,వ్యూహరచన ,చొరవ అందరికి ఆశ్చర్యం కలిగించేవి .విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమె దేశ ప్రగతికి తోడ్పడుతాయని భావించి 1898 లో ‘’సోషల్ డెమోక్రాటిక్ పార్టి ‘’అనే రాజకీయ పార్టీని నిర్మించింది 1905 .లో ‘’ప్రపంచ కర్మాగార కార్మికుల యూనియన్ ‘’ఏర్పడటానికి కృషి చేసి విజయంసాధించింది ..’’సోషలిస్ట్ పార్టీ ‘’స్థాపకురాలు గా కూడా పేరుపొందింది . జోన్స్ చేస్తున్న సాంఘిక సంస్కరణలు ,కార్మికుల సేవా కార్యాలను చూసి అమెరిక ప్రభుత్వపు డిస్ట్రిక్ట్ అటార్నీ ఆమెను ‘’dangerous woman ‘’అన్నాడు .ప్రభుత్వంగుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది .ఆమె అంటే ఎంతో జాగ్రత్త పడింది అమెరికా ప్రభుత్వం
జోన్స్ మూర్తిమత్వం
ఇన్ని విషయాలు తెలుసుకొన్న తర్వాత జోన్స్ రూప,స్వభావాలేమిటోతెలుసుకోవాలని పిస్తుంది కదా .ఇంత పెద్ద భారీ కార్యక్రమాలు నిర్వహించిన ఆమె ఎంతో ఎత్తుగా ఉంటుంది అనుకొంటే పొరబాటే .ఆమె అయిదడుగుల ఎత్తు మాత్రమె ఉన్న మహిళ .నల్లని డ్రెస్ ,దానికి లేసున్న కాలర్ ,నల్లటోపీ తో ఎప్పుడూ కనిపించేది .పిరికి తనం లేని మహా చలాకీ స్త్రీ .ఆమె ప్రసంగాలు ఉద్వేగ పూరితం గా ఉండి ‘’స్వరం భాస్వరాన్ని’’ కుమ్మరించేది .ఆమె ధీశక్తి ,శక్తి, ఉత్సాహం, ధైర్య సాహసాలు అందరికి ఆదర్శాలైనాయి .ఇరవై వ శతాబ్దపు తొలి కాలం లో ఆమె ను మించిన నాయకురాలు లేదని పించుకోన్నది ..పిరికి తనం అంటే ఆమెకు ఏవగింపు .ఆమె మగాళ్ళకు సవాలు గా నిలిచింది .వారిలో ధైర్యం పురిగోల్పేది‘’I have been in jail more than once and I expect to go again .If you are too cowardly to fight –I will fight ‘’అని ఒకసారి కాదు అనేక సార్లు మగవారి పై చాలెంజి చేసిన మహిళా నాయకురాలు .
ఉద్యమజ్వాల
ఆఫ్రికన్ అమెరికన్ వర్కర్ల ను ఆహ్వానించి యూనియన్ లలో చేరేట్లు చేసింది జోన్స్ .అంతే కాదు మైనర్ ల భార్యల తో చీపురు ,తుడుపు గుడ్డ పట్టించి గనులలో చర్మ వ్యాధుల వల్ల కలిగే ప్రమాదాలనుంచి రక్షణ కల్పించింది . చిన్న పిల్లలతో ‘’we want to go to school and not to the Mines ‘’అనే ప్లేకార్డుల నుచేత బట్టించి ప్రదర్శనలు నిర్వహించింది .పారిశ్రామిక విప్లవం తో ఆమెరికా ముందుకు వెళ్తుంటే ,అమెరికా స్వరూపమే పూర్తిగా మారి అభివృద్ధి పధం లో దూసుకు పోతుంటే ,జోన్స్ కార్మికుల స్తితి గతులను మెరుగు పరచాలని భావించి అంకిత భావం తో కృషి చేసింది . నిరుద్యోగులతో ఉద్యోగాల కల్పన కోసం కాన్సాస్ సిటి నుంచి వాషింగ్ టన్ డి.సి.నగరం వరకు భారీ ప్రదర్శనకు నాయకత్వం వహించింది .
కార్మిక ప్రయోజనాలే కాదు గనుల యజమానుల రక్షణ కూ ఆమె తీవ్రం గానే కృషి సల్పింది .అలబామా రాష్ట్రం లోని బర్మింగ్ హాం పట్నం లోని తెల్లజాతి నల్లజాతి మైనర్లకు ‘’దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల సమ్మె ‘’కాలం లో సహాయ పడిన వివేక వంతురాలు జోన్స్ ‘’.యూజీన్ డేబ్స్’’ అనే అమెరికన్ రైల్వే యూనియన్ నాయకుని కి మద్దతు కోసం భారీ ర్యాలీ ని నిర్వహించింది .అతనికి కోర్టు దిక్కారానికి ఆరు నెలలు శిక్ష పడింది 1897 వేసవి లో 9000 మంది కార్మికులు దేశవ్యాప్తం గా ‘’బిటూమినస్ కోల్ సమ్మె ‘’లో పాల్గొన్నారు .యజమానులు చేతులెత్తేశారు జోన్స్ అక్కడ హుటాహుటిన వాలి సాయం చేసి పరిష్కారం సాధించింది .నూలు కార్మికులు ,స్టీల్ వర్కర్లు చేసిన సమ్మె లన్నిటికీ ఆమె మద్దతు ఉంది .ఆమె అంటే భయ పడిన ఆమెరికా లోని చాలా టౌన్లు.ఆమె రాక ను నిషేధించాయి .ఎన్నో సార్లు జైలుకకెళ్ళింది అయినా ఆమెది చెక్కు చెదరని ఉక్కు గుండె .మొక్క వోని ధైర్యం .అన్ని సార్లు కారాగార శిక్ష అనుభవించిన లేబర్ నాయకులెవ్వరూ లేరు అదీ ఆమె ప్రత్యేకత .
1912 లో వెస్ట్ వర్జీనియా లో హౌస్ అరెస్ట్ కు గురైంది .కొలరాడో లో ‘లాడ్లో’’’machine gun massacre ‘’ను విని ఆమె చలించి పోయింది .అక్కడ ఒక టెంట్ కాలని లో ఉన్న గనుల యజమానుల కుటుంబాలపై nationals guards men ‘’విరుచుకు పడి భీభత్సం సృష్టించారు .ఈ దాడిలో 20 మంది దారుణం గా చని పోయారు అందులో ఎక్కువ భాగం పిల్లలు మహిళలు ఈ సంఘటన ఆమె ను తీవ్రం గా కలచి వేసింది ఇలాంటివి పునరావృత్తం కారాదనే ఆశయం తో ఆమె దేశమంతా పర్య టించి ఈ విషయాన్ని ప్రచారం చేసి అందరికి కనువిప్పు కలిగించింది అంతటి మానవతా వాది మదర్ జోన్స్ .ఆమె మాత్రు హృదయం సంక్షోభించింది .ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ సభలో వినిపించింది .
బాల కార్మిక విమోచన కృషి
బాల కార్మికులతో పని చేయించి వారి ఆరోగ్యాన్ని చడగోడుతున్నారని, విద్యతో బంగారు బాటలో నడవాల్సిన వాళ్ళ జీవితాలు ఛిద్రమవుతున్నాయని జోన్స్ గ్రహించి వారి విముక్తికి కంకణం కట్టుకొంది ఫిలడెల్ఫియా లో ఒక లక్ష మంది సిల్క్ కార్మికులు పని గంటలు వారానికి 60 గంటల నుంచి 55గంటలకు తగ్గించమని సమ్మె చేశారు అందులో 16 వేల మంది బాల కార్మికులే ఉండటం ఆశ్చర్య కరం .బాల కార్మికుల చేత పని చేయించ వద్దని పిల్లల చేత ఫిలడెల్ఫియా టెక్స్ టైల్ మిల్స్ నుంచి న్యూయార్క్ సిటి కి ప్రదర్శన నిర్వహించి నాయకత్వం వహించింది .ఆమె ఉద్దేశ్యం ‘’to show New York millionaires our grievances ‘’.ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ఉన్న లాంగ్ ఐలాండ్ ఇంటి వరకు ప్రదర్శన గా వారిని తీసుకొని వెళ్లి పరిస్తితి తీవ్రతను తెలియ జేసింది .
జీవిత చరమాంకం
80 ఏళ్ళ ముదివయసు లో వాషింగ్ టన్-డి.సి.లో స్తిర పడింది .అయినా అవసరమైనప్పుడు దేశ మంతా తిరిగి, కార్మికుల ఐక్యత కోసం, వారి సంక్షేమం కోసం ప్రచారం చేస్తూనే ఉంది 82 వ ఏట వెస్ట్ వర్జీనియా సమ్మె లో పాల్గొని కార్మికులను రెచ్చగొట్టింది అనే అభియోగం తో 20 ఏళ్ళు జైలు శిక్ష విధించారు .ఆమె అభిమానులు, మద్దతు దారులు భారీ ప్రదర్శనలు నిర్వహించి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఆమెకుప్రభుత్వం క్షమా భిక్ష పెట్టేట్టు ఒప్పించారు .అదీ జోన్స్ అంటే వారికున్న వీరాభిమానం తమ తల్లి జైలు పాలైతే ఆ కార్మిక సంతానం తట్టుకో లేక పోయింది .తమ కోసం ఆమె చేసిన త్యాగమే వారిని కార్యోన్ముఖులను చేసింది .అలుపెరుగని పోరాట యోద్దురాలని పించు కొంది.అధైర్య పడకుండా మళ్ళీ ఉద్యమాల లోకి ఉరికింది .1924 లో చేతి వ్రేళ్ళ మధ్య పెన్ను నిలుపు కొనే సత్తా లేకపోయినా చికాగో డ్రెస్ మేకర్స్ సమ్మెలో ప్రత్యక్షం గా కనీ పించి వారిని చైతన్య వంతుల్ని చేసింది .వారిలో వందలాది మంది అరెస్ట్అయి జైలు శిక్ష అనుభవించారు పాపం . సమ్మె నాలుగు నెలలు సాగింది ..అంతేకాక ‘’బ్లాక్ లిస్టు ‘’లో చేరి పోయారు .
ఆమె 100 వ జన్మ దినాన్ని దేశ మంతా అత్యుత్సాహం గా,వేడుకగా, ఘనం గా జరుపుకొన్నారు .ఆమె మాడిసన్ లోని సిల్వర్ స్ప్రింగ్స్ అనే చోట 1930 నవంబర్ 30 న తన 100 వ ఏట ‘’శతమానం భవతి’’ అని పించుకొని ధన్య జీవి గా మరణించింది .ఆమె కోరిక ప్రకారం ఆమె శరీరాన్ని ఇలినాయిస్ లో ఆలివ్ లో ఉన్న ‘’కార్మికుల సేమిటరి‘’లో ఖననం చేశారు .’’folk hero ‘’అని పించుకొన్న మేరి హారిస్ జోన్స్ అంటే మదర్ జోన్స్ అమెరికా కార్మికులకే మాత కాదు ‘’విశ్వ కార్మిక మాత ‘’.
కృతజ్ఞతలు —మదర్ జోన్స్ గురించి రాయమని నన్ను ప్రోత్సహించి,నాతో రాయించిన ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారికి సర్వదా కృతజ్ఞుడను .వారు చెప్పి ఉండక పోతే మదర్ జోన్స్ గురించి నేను చదివి ఉండే వాడిని కాదేమో ?
మీ– గబ్బిటదుర్గా ప్రసాద్ -9-3-13- ఉయ్యూరు




