జ్ఞానదుడు మహర్షి నారదుడు –8
ద్రువునికి ఉపదేశం
తల్లి మాట మీద ‘’నిజ ధర్మ పరిశోధన ‘’కోసం రాజధాని ని వదిలి వస్తున్న ధ్రువ బాలకునిసంగతి నారదుడు తెలుసుకొన్నాడు .ఆయన్ను ఎవరూ పిలువనక్కరలేదు .స్వయం గా వచ్చి కర్తవ్య బోధ చేస్తాడు .అగణితమైన కీర్తిని సంపాదించ బోయే ద్రువునికి తగిన మార్గం సూచింప గలవాడు నారదుడు కాక వేరొకరు సమర్ధులు కారు .ధ్రువుడిని చూసి ఇలా అనుకొన్నాడు మహర్షి .’’మాన భంగం సహించని క్షత్రియ ప్రభావం అద్భుతం కదా !బాలకుడైనా పిన తల్లి దురోక్తులకు మనసు వికలమై సత్యాన్వేషణ కోసం బయల్దేరాడు .’’అని ఆనందించి ,ఆ బాలకుని శిరాన్ని తాకి ‘’హస్త మస్తక ‘’జ్ఞానం అందించాడు .అతనికి కర్తవ్యమ్ తెలుపుతూ ఇలా అంటాడు నారదుడు ‘’నాయనా !వివేకం గలవాడు సుఖ దుఖాలను దైవ వశం గా భావిస్తాడు .దైవ వశం చేత లభించిన దానితో సంతుష్టి చెందాలి .వాడే విమల జ్ఞాని ‘’అన్నాడు .
ధ్రువుడు ‘’మహానుభావా ! నాకు మనశ్శాంతి లేకుండా పోయింది..త్రిభువనోత్క్రుస్టమైనదీ ,అనన్యాధీష్టిత మైనదీ అయిన పదవి పొందటానికి నాకు మంచి మార్గం సూచించండి .’’అని విన్న విన్చుకొన్నాడు .ధ్రువుడిని ప్రేరేపించింది ‘’ధీర జనోత్తముడు వాసుదేవుడే ‘’కనుక ఆయన్నే ‘’అజగ్ర ధ్యాన ప్రణవ చిత్తం తో ‘’భజించమని ఉపదేశిస్తాడు నారద మహర్షి ..బాలడు కనుక వేదాధ్యయనానికి అనర్హుడని ,స్వస్తిక ఆసనం పై కూర్చుని ప్రాణా యామం చేత స్తిర సంకల్పం తో శ్రీ హరి ని ప్రార్ధించమని చెప్పాడు .అతని లేత మనసులో అద్భుత సుందర శ్రీ మహా విష్ణువు రూపం అచ్చు పడేట్లు వర్ణించి చెబుతాడు .దాని ప్రభావం అత్యధికం .ఆ రూపాన్నే ధ్యానించి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించి ఆర్చించమని బోధ చేశాడు .
‘’ఆశ్రిత సత్ప్రసాదాభి ముఖున్డును ,విద్ధ ప్రసన్నాననేక్ష ణుండు
సురుచిర వాసుండు ,సుభ్రూయుగుండును సుకపోల తలుడును సుందరుండు
హరి నీల సంశోభితాంగుండు ,దరుణుండు,నరుణావలోక నోష్టా ధరుడు
గరుణా సముద్రుండు,బురుషార్ధనిధీయు ,బ్రణతాశ్రయుండు ,శోభన కరుడు
లలిత శ్రీవత్స లక్షణ లక్షితుండు ,సర్వ లోక శరణ్యుండు ,గర్మ సాక్షి
పురుష లక్షణ యుక్తుండు ,బుణ్య శాలి యసిత మేఘ నిభ శ్యాము డవ్య యుండు ‘’
‘’హార కిరీట ,కేయూర కంకణ ఘన భూషనుండాశ్రిత పోషకుండు
లలిత కాంచీ కలాప శోభిత కటి మండలుండంచిత కుండలుండు
మహనీయ కౌస్తుభ మణి ఘ్రుణి,చారు గ్రైవేయ కుందానంద దాయకుండు
సలలిత ఘన శంఖ చక్రగదాపద్మ హస్తుండు భువన ప్రశసస్తు ,డజుడు
గమ్ర సౌరభ వనమాలికా ధరుండు ,హత విమోహుండు ,నవ్య పీతాంబరుండు
లలిత కాంచన నూపురాలన్క్రుతుండు ,నిరతిశయ సద్గుణుడు దర్శనీయ తముడు ‘’
సరస లోచన ముత్కరడును –హ్రుత్పద్మ కర్ణికా నివాసిత వి
స్ఫుర దురు ,నఖ మణిశోభిత చరణ –సరోజాతు దతుల శాంతుడనఘున్ ‘’
అని నఖ శిఖ పర్యంతం ఆ శ్రీహరిని ,పరంధాముడిని నోరారా వర్ణించి ,అతని చిత్తాన్ని సుముఖం చేశాడు .అది అమోఘం గా పని చేసింది .దూర్వారాన్కారాలతో ,నీటితో తులసీ దళాలతో మాలల తో ,పత్రాలతో వన మాలలతో వస్త్రాలతో భక్తిగా పూజించమని ,దృఢ మైన శాంత చిత్తం తో ,మంచి ఆచారం తో మంగళ గుణాలతో ,మిత భోజనం తో మెలగాలని హెచ్చరించాడు .అంతే కాక విష్ణువు మాయావతారాలలో అచింత్యం గా ఏం చేస్తాడో అది అంతా హృదయ గతం చేసుకొని తన పనిని అంతా మనో వాక్కాయ కర్మ లతో భక్తితో ,ఆ సర్వేశ్వరునికి సమర్పించమని వివరం గా చెప్పాడు .భక్తితోనే మోక్షం సాధించాలని బోధించాడు .ఆ విధి విధానాన్ని అంతటిని ధ్రువుడు పాటించి ,హరి సాక్షాత్కారం పొంది ,ద్రవ తార గా మిగిలి, తన మనో భీష్టమైన శాశ్వత పదం పొంది కృత మనోధుడయ్యాడు . .
అందరకు రేపు మహా శివ రాత్రి శుభా కాంక్షలు
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –9-3-13-ఉయ్యూరు

