నల్లగొండ.. తెలుగు కొండ
జనం భాషలోనే పరిపాలన
ఫలిస్తున్న కలెక్టర్ చొరవ
తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు
ఆంగ్లంలో వస్తే.. తిరుగు టపా!
95 శాతం లేఖలు మాతృ భాషలోనే
సహకరిస్తున్న అధికారులు, సిబ్బంది
అధికార భాషా అమలులో జిల్లాలకు ప్రథమ స్థానం
‘తెలుగా! అదెందుకు?’ అని ప్రశ్నిస్తే… ఈ రాష్ట్రం తెలుగు. ఈ ప్రజలు తెలుగు. వీరి ఆలోచన తెలుగు. మన జీవన విధానం తెలుగు! మరి… తెలుగుకాక మరో భాష మనకెందుకు?… ఇది నల్లగొండ జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర రావు అచ్చ తెలుగులో ఇచ్చే స్వచ్ఛమైన సమాధానం! ‘తప్పనిసరి అవసరమైతేనే ఆంగ్లం!’ అనేదే ఆయన విధానం. కలెక్టర్ చొరవతో జిల్లాలో తెలుగు దివ్యంగా వెలుగుతోంది. జనం భాషలోనే పరిపాలన సాగుతోంది. పల్లె నుంచి జిల్లా స్థాయిదాకా అధికార వ్యవహారాలన్నీ తెలుగులోనే! జిల్లా నుంచి హైదరాబాద్‌లోని వివిధ శాఖలకు వెళ్లే ఉత్తరాలూ తెలుగులోనే! ఇప్పుడు 95 శాతం పరిపాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే సాగుతున్నాయి. ఇది… కేవలం మూడునెలల కాలంలో తెలుగు సాధించిన విజయం!
నల్లగొండ, మార్చి 10 : ‘అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగు భాషలోనే సాగాలి. ఫైళ్లు ఇంగ్లీషులో వస్తే తిప్పి పంపాలని చట్టం చెబుతోంది. దీన్ని అమలు చేద్దాం. మీరేమంటారు?’ గత ఏడాది డిసెంబర్‌లో జిల్లా ఉన్నతాధికారులందరినీ సమావేశపరచి, కలెక్టర్ ముక్తేశ్వరరావు అడిగిన ప్రశ్న ఇది! “ఇంగ్లిష్‌కు సమానమైన తెలుగు పదాలు రాయడం చాలా కష్టం. కంప్యూటర్‌లో ఇంగ్లిష్‌లోనే సౌలభ్యంగా ఉంటుంది! ఎప్పట్లాగా ఇంగ్లిషులోనే పనికానిస్తే బాగుంటుంది” అని చాలామంది అధికారులు బదులిచ్చారు.

“అన్ని ఇంగ్లిషు పదాలకు తెలుగులో సమానార్థాలు రాయాల్సిన అవసరంలేదు. ఫైల్, ఆఫీస్, రోడ్ అని తెలుగులోనే రాసుకోవచ్చు. మార్కెట్‌లో తెలుగు సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది. అసలు అది సమస్యే కాదు! ఇక మనది తెలుగు మాట, తెలుగు బాట!” అని కలెక్టర్ తేల్చి చెప్పారు. కలెక్టరేట్, జిల్లా ప్రధాన కార్యాలయాల నుంచి వెళ్లే ప్రతి కాగితం తెలుగులోనే వెళ్లాలని, కిందిస్థాయిలో అదే విధానం అమ లయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆ తర్వాత… ‘ఇంగ్లిష్‌లో వచ్చే ఉత్తర ప్రత్యుత్తరాలు స్వీకరించబడవు’ అంటూ డీపీఆర్‌వో ప్రధాన కార్యాలయం ఎదుట బోర్డు పెట్టారు. జనవరి నెల వచ్చింది! ‘తెలుగులో పంపండి’ అనే ముద్రకు బాగా పనిపడింది. ఆంగ్లంలో వచ్చిన 300 ఫైళ్లను ‘తెలుగులో పంపండి’ అంటూ తిప్పి పంపారు. అధికారుల వైఖరి మారింది. ధ్యాస తెలుగుపైకి మళ్లింది. గడచిన నెలరోజుల్లో తిప్పి పంపిన ఫైళ్ల సంఖ్య పదికి పడిపోయింది. ఇదీ… తెలుగు మహిమ! ప్రస్తుతం శాంతిభద్రతలు, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన విభాగాల్లో అధికభాగం… కొన్ని మునిసిపాలిటీల్లో 40 శాతం వరకు ఆంగ్ల భాషను వాడుతున్నారు.
ఇది మినహాయిస్తే… మిగిలిన అన్ని విభాగాల్లో 95 శాతానికిపైగా తెలుగు భాషకే పట్టం కడుతున్నారు. అధికారులతో చర్చించాల్సిన అవసరం వస్తే… కలెక్టర్లు గతంలో ‘స్పీక్’ అని రాసేవారు. ఇప్పుడు ‘చర్చించాలి’ అని రాస్తున్నారు. కలెక్టర్ ముక్తేశ్వర రావు సంతకం కూడా తెలుగులోనే చేస్తున్నారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే నడుస్తున్నాయి. ప్రతి సోమవారం బాధితుల నుంచి స్వీకరించే విజ్ఞప్తులకు తెలుగులోనే సమాధానాలు పంపుతున్నారు. క్షేత్ర స్థాయిలో కుల, ఆదాయ, నివాస «ద్రువీకరణ పత్రాలు తెలుగులోనే జారీ చేస్తున్నారు. మునిసిపాలిటీల్లో పేరు మార్పిడి, పన్నులకు సంబంధించిన రశీదులు, డ్వాక్రా సంఘ సభ్యులకు అందే రుణాల వివరాలు తెలుగులోనే జారీ చేస్తున్నారు.
రైతులకు ఏమాత్రం అర్థంకాని రీతిలో ప్యాడీ, సిరియల్స్, రెడ్‌గ్రామ్ అంటూ ఆంగ్ల పద ప్రయోగం చేసే వ్యవసాయ అధికారులు ఇప్పుడు ఎంచక్కా వరి, పప్పుధాన్యాలు, కందులు, ఉలవలు, ఆముదం, నువ్వులు, బొబ్బర్లు అని తెలుగులో రాస్తున్నారు. రైతుకు నేస్తం, వ్యవసాయ పథకాల కరదీపిక పేరిట వివిధ పథకాలపై తెలుగులో ప్రచార సామగ్రి ముద్రించి పంచిపెడుతున్నారు. రైతు బీమా, భారత ప్రభుత్వ గ్రామీణ గిడ్డంగుల పథకం, రైతు బజార్లు అంటూ వాటికి సంబంధించిన వివరాలు తెలుగులోనే ప్రచారం చేస్తున్నారు. పవర్ టిల్లర్, రోటవేటర్, డ్రమ్ సీడర్, మల్టీక్రాప్ డ్రెసర్ వంటి ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల పేర్లు తర్జుమా చేయకున్నా… వాటి పేర్లను తెలుగు లిపిలో రాస్తున్నారు. వ్యవసాయ శాఖలో ఉద్యోగులకు సంబంధించిన సెలవులు, వివిధ పథకాల వివరాలు, సమాచార హక్కు చట్టం కింద సమాధానాలు, వివరణ పత్రాలు అన్నీ తెలుగులోనే సాగుతున్నాయి.
విద్యా, రెవెన్యూ శాఖలలో…
విద్యా శాఖలో బడిపిల్లల హాజరుపట్టీ నుంచి డీఈవో, రాజీవ్ విద్యా మిషన్ మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల వరకూ అన్నీ తెలుగులోనే! మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వివరాలు పంపేందుకు కంప్యూటర్‌లో ఉండే ఫార్మాట్ నమూనా మినహా… అంతా తెలుగే. పాఠశాల నుంచి ఎంఈవోకు, ఎంఈవో నుంచి పాఠశాలలకు మధ్య జరిగే ప్రత్యుత్తరాలు పూర్తిగా తెలుగులోనే సాగుతున్నాయి. ఉపాధ్యాయులు తెలుగులోనే సెలవు చీటీలు రాస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే పర్యవేక్షకుల (ఇన్విలేజటర్) ఆదేశాలను సైతం తెలుగులోనే సిద్ధం చేసినట్లు మిర్యాలగూడ ఎంఈవో మంగ్యానాయక్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ఇక… జిల్లా విద్యాధికారి జగదీశ్ భాషతోపాటు ఆహార్యంలోనూ తెలుగును పాటిస్తున్నారు. ఆయన అనేక సందర్భాల్లో పంచె, పైజామా, భుజాన కండువాతో కనిపిస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ చేపట్టిన తెలుగు ఉద్యమానికి పలువురు రాజకీయ నేతలు కూడా సహకరిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నుంచి కలెక్టరేట్‌కు, అధికారులకు వచ్చే లేఖలు నూటికి నూరు శాతం తెలుగులోనే వస్తున్నాయి. మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సగం వరకు తెలుగులో రాస్తున్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు సేవలు అందించే రెవెన్యూ శాఖలోనూ పూర్తిస్థాయిలో తెలుగు అమలవుతోంది.
గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు ఆ మాటకొస్తే హైదరాబాద్‌కు వెళ్లే లేఖలు కూడా తెలుగులోనే ఉండాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. మూడు నెలల్లోనే గొప్ప మార్పును సాధించింది. అధికార భాషా సంఘం సభ్యులు ఆకస్మిక తనిఖీ చేసి… వివిధ శాఖల కార్యాలయాల్లో తెలుగు అమలు జరుగుతున్న తీరును చూసి ఆశ్చర్యపోయారు. అధికార భాష అమలులో నల్లగొండ జిల్లాకు ప్రథమ స్థానం ఇచ్చారు.
తెలుగు మహా సభలే స్ఫూర్తి
డిసెంబర్‌లో పల్లెపల్లెలో తెలుగు సభలు జరిగాయి. అధికార కార్యకలాపాల్లో మాత్రం తెలుగు భాష అమలు సంతృప్తికరంగా లేదని అనిపించింది. కార్యాలయంలో, బడిలో, కళాశాలలో ఎక్కడ చూసినా ఇంగ్లిషే వినిపిస్తోంది. ఇంటికి వెళ్లి లుంగీ కట్టుకుంటేనే తెలుగు గుర్తుకు వస్తుంది. ఈ సమయంలో తెలుగు మహాసభలు నన్ను ఉత్తేజితుడిని చేశాయి. నేను అధికార భాషను అమలు చేసినప్పుడే తెలుగు సభలకు న్యాయం చేసినట్టవుతుందని భావించాను. అధికారులకు అర్థమయ్యేలా చెప్పడంతో వారూ స్పందించారు.
– కలెక్టర్ ముక్తేశ్వరరావు
అర్థం చేసుకోగలుగుతున్నాం
ఇంగ్లిషులో ఉండే విషయాలు అర్థమయ్యేవి కావు. ఇప్పుడు తెలుగులో ఇవ్వటంతో మాకు వచ్చిన కొంచెం చదువుతోనే వాటిని చదివి విషయం అర్థం చేసుకుంటున్నాం. ఈ పద్ధతి బాగుంది.
– శ్రీనివాస్ రెడ్డి, రైతు, వేములపల్లి
సౌలభ్యంగా ఉంది..
ప్రజల భాషలో పరిపాలన జరగడం ఇటు అధికారులకు, అటు ప్రజలకు సౌలభ్యంగా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే ఫైళ్లు సైతం తెలుగులో ఉంటే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వచ్చే ఫైళ్లను తెలుగులోకి మార్చుకుని కింది స్థాయికి పంపటం అదనపు భారంగా మారింది. కంప్యూటర్ ఆపరేటర్లకు తెలుగు భాష లిపిపై శిక్షణ ఇస్తే మరింత ఉపయోగముంటుంది. ఇతర జిల్లాల అధికారులు సైతం మా జిల్లాలో తెలుగు భాషను అమలు చేస్తున్న తీరు తెన్నులను అడిగి తెలుసుకుంటున్నారు.
– రాజేశ్వర్ రెడ్డి,
డీఆర్‌డీఏ, ప్రాజెక్టు డైరెక్టర్
తెలుగులోనే బోర్డులు
జిల్లాస్థాయిలో కార్యాలయాల బోర్డులన్నీ తెలుగులోనే రాశారు. అదే సమయంలో… ఇంగ్లిష్, ఉర్దూ భాషలనూ వాడారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల బోర్డులు పూర్తిగా తెలుగులోకి మార్చారు. కలెక్టరేట్‌సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నోటీసు బోర్డుల లో తెలుగే కనిపిస్తోంది. యాదగిరిగుట్ట దేవాలయ టెండర్లు, పులిచింతల, ఏఎంఆర్‌పీ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ నోటీసులు తెలుగులోనే ఉన్నాయి.

