నాటి మహామహులందరినీ కలిపిన అభినవాంధ్ర కవి పండిత సభ
జీవద్భాషలోనే విద్య సాగాలని తీర్మానం
– డా. తుర్లపాటి రాజేశ్వరి

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న బరంపురం 19వ శతాబ్ది పూర్వార్థానికి గంజాం జిల్లాలో ప్రధాన సాంస్కృతిక కేంద్రంగా వాసికెక్కింది. జాతీయ ఉద్యమం దేశంలో వ్యాపిస్తున్న క్రమంలో మతం, కులం, స్త్రీల స్థితిగతులు, శాస్త్రీయత, హేతువాదం, ప్రధానాంశంగా ఆధునిక సమాజం రూపుదిద్దుకుంటున్న తరుణంలో బరంపురం ఆధునికతకు, అభ్యుదయ భావాలకు చిరునామాగా ఆంధ్రదేశ చరిత్రలో స్థానం సంపాదించుకున్నది. ఎందరో పండిత ప్రకాండులకూ, కవి గాయక వైతాళికులకు, దేశభక్తులకు జన్మస్థానం బరంపురం.
దేవరాజు వేంకటకృష్ణారావు 1910-11 సంవత్సరాల నుంచి వేగుచుక్క ముద్రణాలయం- గ్రంథమాల ద్వారా అనేక గ్రంథాలను ప్రచురించి- తెలుగుదేశంలో ఖ్యాతి నార్జించారు. 1912లో ‘వాడే వీడు’ నవలా రచన ద్వారా ఆంధ్రభాషలో తొలి అపరాధ పరిశోధక నవలాకర్తగా గుర్తింపు పొందారు. అటు పర్లాకిమిడి కార్యస్థానంగా గిడుగు రామమూర్తి పంతులు, గిడుగు సీతాపతి వ్యావహారికాంధ్ర భాషా ఉద్యమంలో, సాహితీ వ్యవసాయంలో తెలుగుతల్లి ముద్దుబిడ్డలుగా కీర్తి పతాకను ఎగురవేశారు.
పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి బరంపురం, కళ్ళికోట కళాశాలలో అధ్యాపక స్థానాన్ని అలంకరించి, రచయితగా సంస్కృతాంధ్ర, ప్రాకృత భాషాపండితుడిగా, అభ్యుదయవాదిగా యశస్సు నార్జించారు. ఈ నేపథ్యంలో నవీన రీతులలో రచనలు చేస్తున్నవారందరూ బరంపురంలో ఒక ఐక్యవేదికగా ఏర్పడి సభలు నిర్వహింపదలచినట్లుగా మనకు ‘నవ్యాంధ్ర సాహిత్య వీధుల’లోని ఈ పంక్తుల ద్వారా తెలుస్తోంది.
‘1933 నాటికి ఆంధ్రదేశంలో నవ్యసాహిత్యాన్ని ఆరాధిస్తున్న సంస్థలలో సాహితీ సమితి, యువకవి మండలి, కవితా సమితి ముఖ్యమైనవి. ఇవన్నీ కలిసి 1933 మార్చి 10, 11, 12 లలో బరంపురంలో అభినవాంధ్ర (అఖిలాంధ్ర) కవి పండిత సభను పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి అధ్యక్షతన నిర్వహించాయి.’ (పుట-515) 1933 మార్చి 10, 11, 12 తేదీలలో బరంపురంలో జరిగిన ఈ సభలకు నాడు లబ్ధప్రతిష్ఠులైన కవి పండితులందరూ బరంపురం తరలివచ్చారు.
సభల నిర్వహణకు పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రికి అప్పటి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీగురు భాగవతుల ధర్మారావు, దేవరాజు వేంకటకృష్ణారావు తదితరులు సహకరించారు. మూడు రోజుల మహాసభలను గిడుగు రామమూర్తి పంతులు ప్రారంభించారు.
మొట్టమొదటిసారిగా జరిగిన ఈ ఆధునిక సాహిత్య సదస్సుకి చిలుకూరి నారాయణరావు అధ్యక్షత వహించారు. సభలలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, తల్లావఝ్జల శివశంకరశాస్త్రి, వేదుల సత్యనారాయణ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, గిడుగు సీతపతి, చింతా దీక్షితులు, కొంపెల్ల జనార్దనరావు, శ్రీశ్రీ, తాపీ ధర్మారావు, గుండిమెడ వెంకట సుబ్బారావు, మండపాక పార్వతీశ్వరశాస్త్రి, జయంతి జగన్నాధరావు ప్రభృతులు పాల్గొన్నారు.
శ్రీశ్రీ లాంటి యువకవులకి ఈ సభలు కొత్త ఉత్సాహాన్ని కల్గించాయి. సభలో తల్లావఝ్జల శివశంకరశాస్త్రి నవ్య కవుల కవిత్వాన్ని వినిపించారు. ముఖ్యంగా శ్లిష్ట్లా ఉమామహేశ్వరరావు కవిత- ‘మారో.. మారో.. మారో మారో/ఒకటి రెండూ — మూడు నాలుగు మారో మారో — మారో మారో” సభికుల్ని ఉత్తేజపరిచింది. బరంపురంలో జరిగిన సభలను శ్రీశ్రీ అనంతం: ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవలలో నమోదు చేశారు. “…దీనిని నేనూ జనర్దనరావూ వెళ్లాము. అప్పుడే నేను కొత్త బాణీలో రాస్తున్న నా గీతాలను చింతా దీక్షితులుగారికి చదివి వినిపించాను. అది విని ఆయన అమితానందభరితుడు కావడమూ, వచ్చేసిందిదిగో కొత్త కవిత్వపు వరద” అని నన్ను మెచ్చుకోవడమూ ఎన్నటికీ నేను మరిచిపోలేను” (పుట-125)
గ్రాంధిక భాష వ్రాయటంలోని నిరర్థకత, వ్యావహారికాన్ని ఆశ్రయించాల్సిన ఆవశ్యకత ఈ మహాసభలలో చర్చకు వచ్చాయి. ఈ సభలో తీసుకున్న నిర్ణయాలు: – గ్రాంథికాంధ్రము ఒకానొకప్పుడు పరిమిత ప్రయోజనము కలదైనా నేడు అది సర్వజనోపయోగకారి కాదు. వ్యావహారికాంధ్రము అపరిమిత ప్రయోజనము కలది. ప్రజలలో జ్ఞానాభివృద్ధి కలగడానికి ఇదే పరమ సాధనము.
– ప్రారంభ విద్య ఉన్నత విద్యలను తెలుగు పిల్లలకు చెప్పేటందుకు సాధ్యముగా గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన గ్రాంథిక భాష అందులకు తగినది కాదు. భాషకున్నూ, బాలురకున్నూ అందువల్ల తీరని నష్టం కలుగుతున్నది. కావున జీవద్భాషలోనే విద్యా కార్యక్రమమంతా జరుపవలెనని గవర్నమెంట్‌ను ఈ సభ వారు కోరుతున్నారు. వీటితో పాటు నవ్య సాహిత్య పరిషత్తు పక్షాన ఒక సాహిత్య పత్రిక వెలువరించటానికీ, కొంపెల్ల జనార్దనరావును ఆ పత్రికా సంపాదకుడిగా నియమించడానికీ కూడా తీర్మానాలు జరిగాయి. కవి పండిత గోష్ఠులతో బరంపురం ప్రతిధ్వనించింది.
నాటి బరంపురం రోజులని జ్ఞాపకం చేసుకుంటూ శ్రీశ్రీ “నాలో పాతరాతి యుగం పోయి కొత్తయుగం ప్రవేశిస్తున్న రోజులు. జనార్దనరావూ నేను కలిసి సాయంకాలం కాగానే ట్రంకురోడ్డు షికారు తిరిగి వచ్చేవాళ్ళం” అంటూ తాము మాట్లాడుకున్న విశేషాలు రాశారు. శ్రీశ్రీ ఈ మూడు రోజులలో ఒకనాడు పంచాగ్నుల వారింటికి వెళ్లారు. నండూరి వారి ఎంకి పాటలపై గాలిదుమారం చెలరేగుతున్నప్పుడు నండూరిని సమర్ధిస్తూ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి ఒక వ్యాసం రాశారు. అందుచేత శ్రీశ్రీకి పంచాగ్నుల వారంటే ఎనలేని గౌరవం. ఆ రోజు శ్రీశ్రీ ఆయనతో చాలాసేపు గడిపారు.
మాటలలో “నా పుస్తకం ఒకటి మీకు అంకితం చెయ్యాలని ఉందని” వారితో చెప్పటమూ దానికి వారు అంగీకరించటమూ జరిగింది. అయితే ఈ సంభాషణ జరిగిన ఏభై ఏళ్ల తర్వాత శ్రీశ్రీ ఆకాంక్ష కార్యరూపం దాల్చింది. శ్రీశ్రీ సిప్రాలిని 9.6.1981న పంచాగ్నుల వారికి అంకితమిచ్చారు. ఆ విధంగా శ్రీశ్రీ తన కవిత్వాన్ని పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రికి అంకితమివ్వటానికి అంకురార్పణ ఈ మహాసభలలో జరిగింది. అభినవాంధ్ర కవి పండిత సభ తర్వాత కాలంలో నవ్య సాహిత్య పరిషత్తుగా పేరు మార్చుకొని అనేక చిరస్మరణీయమైన కార్యక్రమాలను నిర్వహించింది.
– డా. తుర్లపాటి రాజేశ్వరి
080935 20819
(అభినవాంధ్ర కవి పండిత సభకి 80 ఏళ్ళు)

